top of page

కొత్త చిగురు


'Kotha Chiguru' written by Parimala Kalyan

రచన : పరిమళ కళ్యాణ్

"నీకింకా ఏం వయసు అయిపోయిందని ఇంకో పెళ్లి చేసుకోమంటే కాదని, ఇంకా ఆ ఇంటినే పట్టుకుని వేలాడుతున్నావు? అయిందేదో అయిపోయింది, మీ అత్తయ్యే నిన్ను వేరే పెళ్లి చేసుకోమంటే వినవేమిటి నువ్వు?" ఆవేశంగా అడిగిన తల్లి సునంద ప్రశ్నకు సమాధానంగా అంతే ఆవేశంగా

"అమ్మా! ఏంటి రవీంద్ర ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోమంటావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా! ఒక తల్లిగా నువ్విచ్చే సలహా ఇదేనా? పెళ్లికి ముందు ఇకనుంచి అత్తగారిల్లే నీ ఇల్లు అత్త గారిని కూడా అమ్మలాగే చూసుకో అని చెప్పిన నువ్వే, ఇప్పుడు వేరే పెళ్లి చేసికొని నా సంతోషం నన్ను చూసుకో మంటున్నావా అమ్మా?" సమాధానం చెప్పబోయి, గొంతు జీర బోయింది పల్లవికి.

“సునంద.. నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ నీ మీద ప్రేమ ఉంది. కూతురు సంతోషంగా ఉంటే చూడాలన్న కోరికా ఉంది. ఆ ప్రేమతోనే నీ సంతోషం కోసమే నిన్ను మరో పెళ్ళి చేసుకోమని చెప్తున్నా!" అంది బాధ నిండిన గొంతుతో.

"ఏంటి నా సంతోషం కోసమా? నా సంతోషం కోరుకునే వారే అయితే నేను చెప్పేది వినండి. ఇక్కడే ఈ ఇంట్లోనే ఈ మనుషులతోనే నా సంతోషం. మంచం పట్టిన అమ్మలాంటి అత్తగారిని వదిలి మీ దగ్గరకు రాలేను. ఇక నా జీవితం ఇక్కడే అమ్మా. ఇదే విషయం మాట్లాడటానికి అయితే ఇకపై ఎప్పుడూ రావద్దు మీరు. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నేను తల్లిని కాబోతున్నాను. రవీంద్ర ప్రతిరూపం నా కడుపులో పెరుగుతోంది. ఆ విషయం తెలుసుకుని హాస్పిటల్ నుంచీ వస్తూ ఉండగానే ఆక్సిడెంట్ అవ్వటం, తను చనిపోవడం జరిగింది. అందుకే ఆ విషయం బయట పెట్టలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పుట్టబోయే బిడ్డ కోసం అయినా నేను ఇక్కడే ఉండాలి. ఉంటాను కూడా!" అని చెప్పేసి విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది పల్లవి.

వాళ్ళ మాటలు అన్నీ పైనున్న అత్తయ్య చెవిలో పడతాయేమో అని భయపడి ఆవిడ దగ్గరకు వెళ్ళింది పల్లవి. కూతురి మొండితనం తెలిసి ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయింది సునంద.

అత్తయ్య సుజాత గదిలోకి వెళ్లిన పల్లవి మంచం మీద నిద్రపోతున్న ఆవిడ దగ్గరకి వెళ్ళి, పక్కనే కూర్చుని ...

"క్షమించండి అత్తయ్యా, మా అమ్మ మాటలు మీరు విని ఉండకూడదు అనే నేను అనుకుంటున్నా. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త, కుతురిలా చూసుకునే అత్తగారు

దొరికినందుకు చాలా సంతోషించాను. కానీ ఆ దేవుడు నా సంతోషాన్ని ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా నా కడుపు పండే సమయానికి తను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో, నా ప్రాణం పోయినంత పని అయ్యింది.

ఆ విషయం తెలిసి మీరిలా మంచం పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్లగలను? నా జీవితం ఈ ఇంటితోనే, ఈ మనుషులతోనే ముడిపడి ఉందని నిశ్చయించుకున్నాక మీకు దూరంగా ఎలా వెళ్లగలను. మీ కూతురిగా మీ బాధ్యత ఇకపై నాది." అంటూ కన్నీళ్లు పెట్టుకుని మళ్ళీ ఎక్కడ ఆవిడ లేస్తుందేమో అని బయటకి వెళ్ళిపోయింది.

పల్లవి బయటకి వెళ్ళాక, కళ్ళు తెరిచిన సుజాత "నేను అన్నీ విన్నాను పల్లవి. మీ అమ్మ చెప్పింది కూడా నిజమే, కానీ నాకోసం, నీ కడుపులో పెరుగుతున్న నా వంశాకురం కోసం నీ జీవితాన్ని త్యాగం చెయ్యాలని అనుకుంటున్నావు. ఇప్పుడే నీ జీవితం మోడువారిపోకూడదు.

*ఆకులన్ని రాలిన చోటే*

*కొత్త చిగురు కనిపిస్తుంది*

అన్నట్టు నీ జీవితంలో కూడా కొత్త చిగురు త్వరలోనే వస్తుంది. అదే అత్తగా నేను కోరుకునేది" అనుకుంది.

*******

కొన్ని రోజుల తర్వాత రవీంద్ర స్నేహితుడు వసంత్ అమెరికా నుంచి వచ్చాడు. రవీంద్ర గురించిన విషయాలు ఏమీ తెలియక పోవటంతో నేరుగా రవీంద్ర ఇంటికి వెళ్ళాడు.

"అమ్మా, ఒరేయ్ రవీ!" అంటూ పిలుస్తూ లోపలకి వెళ్ళాడు. అతన్ని తన భర్తతో పాటు ఫోటోలో చూసిన పల్లవి అతను రవీంద్ర స్నేహితుడు అని గుర్తుపట్టి, లోపలకి పిలిచింది. పల్లవిని చూసిన వసంత్ తనే రవీంద్ర భార్య అని గ్రహించి, పలకరించి, " యూఎస్ లో ప్రాజెక్ట్ వర్క్ లో ఉండిపోయి, మీ పెళ్లికి రాలేక పోయాను. మీ ఫోటోలు కూడా సరిగా చూడలేదు నేను. ఎలా ఉన్నారు? ఇంతకీ రవీంద్ర ఏమయ్యాడు అండి?" అని అడిగాడు.

పల్లవి సమాధానం చెప్పలేక ఏడుస్తోంది. పల్లవి సమాధానం కోసం చూడకుండా వసంత్ సుజాత గదికి వెళ్ళాడు.

"అమ్మా, ఎలా ఉన్నారు?" అంటూ వెళ్లిన అతను బెడ్ మీద ఉన్న సుజాతను చూసి షాక్ అయ్యాడు.

ఒక్క ఉదుటన బెడ్ దగ్గరకి వెళ్లి, అమ్మా ఏమైంది అమ్మా, ఏమిటి ఇదంతా? అసలు రవీంద్ర ఏడీ? మీకిలా జరిగితే కూడా నాకు చెప్పలేదు వాడు అసలు, ఫ్రెండేనా?!" అంటూ ఆందోళన పడ్డాడు.

ఏడుస్తూ నెమ్మదిగా లేస్తూ, "చెప్పటానికి వాడెక్కడ ఉన్నాడు రా?" అంది సుజాత.

"అంటే ఏంటమ్మా మీరు చెప్పేది? వాడు లేకపోవటం ఏంటి? అసలేమయ్యిందో చెప్పండమ్మా?" ఆందోళనగా అడిగాడు.

"ఏం చెప్పను వసంత్, పెళ్ళై ఇంకా ముద్దు మురిపాలు తీరకుండానే, పసుపు పారాణి ఆరకుండానే, అనుకున్నవి ఏమీ జరగకుండానే తన భార్యని, మనల్ని ఒంటరివాళ్ళని చేసి వాడు ఆ పైవాడి దగ్గరకి వెళ్ళిపోయాడు రా!" అంటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యింది సుజాత.

ఈలోగా అక్కడకి వచ్చిన పల్లవి సుజాతను ఓదార్చబోయింది. పల్లవిని చూసి, "అసలెలా జరిగిందండి, అమ్మకి ఏమైంది?" అనడిగాడు కంగారుగా.

"హాస్పిటల్ నుంచీ వస్తూ ఉండగా ఏక్సిడెంట్ అయ్యింది రవీంద్రకి. బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి, బ్రెయిన్ డెడ్ కావటంతో మళ్ళీ కళ్ళు తెరవలేదు. రవీంద్ర గురించి తెలియగానే అత్తయ్య మంచం పట్టారు. డాక్టర్లు టెస్ట్ చేసి అత్తయ్య లేవలేరని, మంచానికే పరిమితం అనీ చెప్పారు. అప్పటినుంచి ఆత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవాల్సిన దాన్ని నేనే అని నిర్ణయించుకున్నాను." అంది.

"ఛా, నేను లేనప్పుడు ఇంత జరిగిందా? అయ్యో ఎవరూ లేని అనాధనైన నన్ను సొంత బిడ్డగా చూసుకున్న అమ్మ, సొంత తమ్ముడిగా భావించిన రవీంద్ర ఇద్దరూ ఇలా అయ్యారు. నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. దేవుడా ఏమిటీ ఘోరం!

నన్ను సొంత కొడుకులా భావించి నాకు నచ్చిన చదువు చదివించి, మంచి ఉద్యోగంలో చేరి నేను జీవితంలో సెటిల్ అయ్యేలా చేసింది వీళ్ళే. అందుకే ఆవిడని ఆంటీ అని కాకుండా అమ్మా అని పిలుస్తాను. నాకోసం అంత చేసిన వాళ్ళకి నేను ఏం చేసినా తక్కువే, ఏమిచ్చినా వాళ్ల ఋణం తీర్చుకోలేనది. పల్లవి గారు మీరు ఏమీ అనుకోకపోతే అమ్మకి సాయంగా నేను ఉంటాను. మీకు ఈ అవసరం వచ్చినా నన్ను పిలవండి. కనీసం ఇలా అయినా మీకు సహాయపడే అవకాశం నాకు ఇవ్వండి. అమ్మకి ఏమైనా మందులు కావాలంటే చెప్పండి నేను తెస్తాను ప్లీజ్!" అన్నాడు.

"అయ్యో మీకెందుకు ఆ శ్రమ, నేను చూసుకుంటాను లెండి" అంది పల్లవి.

"పల్లవి గారూ, నన్ను పరాయి వాడిలా చూడకండి. అమ్మకి ఆ మాత్రం చెయ్యటం నా బాధ్యత" అన్నాడు.

అప్పటినుంచి రోజూ వచ్చి సుజాతను చూసి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టేవాడు. నెమ్మదిగా పల్లవి కూడా వసంత్ తో మాట్లాడుతూ ఉండేది. పల్లవికి నెలలు దగ్గర పడటంతో వసంత్ సాయంతో హాస్పిటల్కి వెళ్ళేది. అలా ఇద్దరూ కలిసి బయటకి వెళ్ళటం, వసంత్ రోజు రావటం చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏదేదో మాట్లాడుకునే వారు. ఆ మాటలన్నీ సుజాత చెవిన పడినా, పల్లవికి తెలియకుండా జాగ్రత్త పడింది. వసంత్ ఇంట్లో మనిషిలాగానే అన్నీ చేస్తూ ఉంటే ఎక్కడో ఎదో ఆశగా అనిపించేది సుజాతకి.

"పల్లవి కూడా వసంత్ తో బాగా మాట్లాడుతోంది. వాళ్ళిద్దరికి పెళ్ళి చేస్తే పల్లవి బిడ్డకు తండ్రి దొరుకుతాడు, పైగా చుట్టూ మాట్లాడేవారి అందరి నోర్లు మూయించవచ్చు. కానీ నాది అత్యాశ అవుతుందేమో? వసంత్ ఏమనుకుంటున్నాడో? అసలు పల్లవి వేరే పెళ్లి చేసుకొనని వాళ్ళ అమ్మకి చెప్పేసి, పెళ్ళి మాట చెప్పినందుకు కన్న తల్లినే దూరం పెట్టింది. ఇప్పుడు నా మాట వింటుందా? కానీ ఎన్నాళ్లిలా ఒంటరిగా ఉంటుంది, నా తర్వాత అయినా తనకీ, తనబిడ్డకి ఒక తోడు కావాలి కదా. భగవంతుడా నువ్వే ఏదొకటి చెయ్యవయ్యా!" అంటూ ఎంతో మదన పడింది మనసులో.

ఓరోజు పల్లవిని మార్కెట్ కి పంపించి, వసంత్ సుజాత దగ్గరకి వచ్చి, తన మనసులో మాట బయట పెట్టాడు వసంత్.

"అమ్మా! మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అన్నాడు.

వసంత్ దేనికో ఆలోచిస్తున్నాడు అని గ్రహించిన సుజాత, "ఏమిటి వసంత్ అది. నా దగ్గర మొహమాటం ఎందుకు నీ మనసులో మాట చెప్పు. ఏమైనా కావాలా?" అంది.

"కాదమ్మా, ఇలా అడగటం తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు అందుకే మీతో చెప్తున్నా. పల్లవి మిమ్మల్ని సొంత తల్లి కన్నా ఎక్కువగా

చూసుకుంటోంది. అన్నీ తానే చేస్తోంది. తను నా స్నేహితుడి కాదు కాదు ప్రాణ మిత్రుడి భార్య. కానీ ఇప్పుడు వాడు లేడు.

మీ ఇంట్లో మనిషిలా ఉంటూ మీ ఇద్దరినీ చూస్తున్నా నేను, పల్లవి మంచితనాన్ని, తన పద్ధతిని గ్రహించాను. కానీ అనుకోకుండానే నా మనసులో పల్లవి మీద ఇష్టం ఏర్పడింది. అది ప్రేమో కాదో తెలీదు. నేను చేస్తున్నది తప్పు అని ఒక్కోసారి అనిపించినా, ఏ తోడు లేని తనకి ఒక తోడుగా ఉండాలి అనుకోవటం తప్పు కాదని ఇంకోసారి అనిపిస్తుంది. నన్ను క్షమించండి అమ్మా, మీతో ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు. నేను మీ కొడుకు స్థానాన్ని కోరుకోవటం లేదు కానీ మీకో కొడుకులా, ఇన్నాళ్ళు నన్ను పెంచి చేరదేసిన మీకు ఇలా నా కృతజ్ఞత తెలుపుకుందామని అనుకుంటున్నాను. మిమ్మల్ని బాగా చూసుకోవటం నా బాధ్యత. మీరు ఒప్పుకుంటే, పల్లవికి ఒక కొత్త జీవితం ఇవ్వాలని ఆశ పడుతున్నాను. తనకి పుట్టబోయే బిడ్డకి తండ్రిగా అండగా ఉండాలనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని నా కన్న తల్లిలాగే భావిస్తాను. మీరు ఏం చెయ్యమంటే అదే చేస్తాను. మీ అభిప్రాయం చెప్పండి అమ్మా?!" అని ప్రాధేయపడ్డాడు.

వసంత్ మాటలకి కొత్త ఉత్సాహం వచ్చింది సుజాతకు. "చాలా మంచి మాట చెప్పావు రా వసంత్. నేనే ఈ విషయం నిన్నెలా అడుగుదామా అని ఆలోచిస్తున్నాను. నీ మనసులో మాట చెప్పి, నా మనసులో భారాన్ని దించేసావు.

నేను కూడా ఎప్పటినుంచో పల్లవికి వేరే పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను, కానీ తను నా మాట దాటవేస్తూవచ్చింది. నువ్వు తనని చేసుకుంటానుఅంటే మొదట సంతోషించింది నేనే. అలాగే చేద్దాం. కానీ పల్లవికి ఈ విషయం ఎలా చెప్పి ఒప్పించాలా అన్నదే నా ఆలోచన" అంది.

"అమ్మా మీరు ఒప్పుకున్నారు, నాకు అదే చాలు. పల్లవిని ఎలాగోలా ఒప్పించాలి, నేనే ఒప్పిస్తాను. మీరు కూడా మీ వంతుగా తనకి చెప్పి చూడండి. నా మాట ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు అమ్మా!" అన్నాడు వసంత్.

"అయితే ఇకనుంచి పల్లవిని ఒప్పించటమే మన పని" అనుకున్నారు ఇద్దరూ.

పల్లవికి డెలివరీ రోజులు దగ్గర పడినా, తల్లి ఎంత పిలిచినా అత్తయ్యను వదిలి రానని, ఇక్కడే ఉంది. నొప్పులు రావటంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు వసంత్. పండంటి మగపిల్లాడు పుట్టాడు. నా కొడుకే మళ్ళీ నీ కడుపున పుట్టాడు అని సంతోషించింది సుజాత.

ఆపరేషన్ కావటంతో 3 నెలలు రెస్ట్ అని చెప్పారు డాక్టర్లు పల్లవికి. ఆ సమయంలో పల్లవి తల్లి సునంద సాయంగా వచ్చింది. పల్లవిని బిడ్డని, సుజాతను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వసంత్. సునంద కూడా వసంత్ నీ గమనించింది. సుజాత తో మాట్లాడి విషయం తెలుసుకుంది. నెమ్మదిగా అందరూ కలిసి పల్లవిని వసంతుతో పెళ్లికి ఒప్పించాలని అనుకున్నారు.

కొన్నాళ్ళ తర్వాత నెమ్మదిగా పల్లవిని పెళ్లి విషయం అడిగింది సుజాత. "పల్లవి కనీసం ఇప్పుడైనా, నీ బిడ్డకోసం అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకే తెలియదు. నా తర్వాత నీకు దిక్కెవరు? నిన్ను ఒంటరి చేసి వెళ్లిపోయిన నా కొడుకు లాగే నేను కూడా ఒంటరిగా వదిలి వెళ్లిపోతే? అందుకే నేను పోయేలోపు నీ పెళ్లి చేయాలన్నదే నా తాపత్రయం. నువ్వు సరే అంటే పెళ్లి కొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు, ఏమంటావు?" అని అడిగింది.

పల్లవి సమాధానం చెప్పలేదు కాని, ఎవరా పెళ్ళికొడుకు అన్నట్టు చూసింది అత్తగారి వైపు.

"పెళ్ళికొడుకు ఎవరో కాదు, మన వసంత్ ఉన్నాడు కదా, వాడే. మనతో పాటు ఉన్న ఇన్నాళ్ళలో, నిన్ను చూసి, తనకి నీ మీద ఇష్టం కలిగిందట. అదే విషయం నాకు చెప్పాడు. ఎలాగో నీకు వేరే పెళ్లి చేసే ఆలోచన ఉంది కాబట్టి, అతనైతే అందరికీ మంచిది అని నా అభిప్రాయం. నిన్ను, నన్నే కాకుండా నీ బిడ్డను కూడా బాగా చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది వసంత్ మీద. ఏమంటావు పల్లవి?" అని అడిగింది.

"అత్తయ్యా, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ నా మనసులో ఇంకా రవీంద్రనే ఉన్నాడు. అయినా నేను ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేను. నాకు కొంచం టైం కావాలి అత్తయ్యా. నన్ను బలవంతం చెయ్యకండి. ప్లీజ్" అంది.

"సరే నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే, నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం" అంది సుజాత.

"అవును పల్లవి, అత్తయ్య చెప్పింది బాగుంది. నీ మంచి కోసమే ఆలోచిస్తుంది ఆవిడ. ఇకపై నీ ఇష్టం. నువ్వే ఆలోచించుకో!" అంది సునంద.

టీవీలో పాట

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనపిస్తుంది

అంటూ వినిపిస్తోంది.

పల్లవి ఆలోచనలో పడింది.

వసంత్ రాకతో పల్లవి జీవితానికి కొత్త చిగురు వస్తుందని ఆశతో, ఆరోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు సుజాత, సునందలు.

***సమాప్తం***


రచయిత్రి పరిచయం :

నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.


110 views0 comments
bottom of page