'Kotha Keratam Episode 10' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 10' తెలుగు ధారావాహిక
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి.
డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.
డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు.
అంగీకరిస్తాడు రాజేంద్ర.
రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. జంతువులను అనవసరంగా బాధించకూడదని చెబుతాడు.
ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 10 చదవండి.
టామీకి రోజూ తిండి పెట్టాలన్న భార్గవ ఆలోచన పిల్లలంతా తు.చ. తప్పకుండా అమలు చేయటంతో మూడు నెలలకల్లా మునుపటిలా చక్కగా ఆరోగ్యంగా బలంగా తయారైంది టామీ.
పిల్లలతో స్నేహం ఏర్పడ్డాక ఇదివరటిలా వాళ్ళని చూసి అరవటం కూడా తగ్గించిన టామీ పార్కులో ఒక ప్రక్కగా కూర్చుని పిల్లల ఆటలు చూస్తోంది.
ఆటల మధ్యలో బిస్కెట్ పెట్టడానికి వచ్చిన భార్గవని చూసి లేచి ఉత్సాహంగా తోకాడించి ‘భౌ..భౌ’ మంటూ సంతోషాన్ని వ్యక్త పరచింది టామీ.
“తాతయ్యా చూసారా టామీకి నాకూ ఫ్రెండ్షిప్ కుదిరింది” తన సంతోషాన్ని తాతగారితో పంచుకున్నాడు భార్గవ.
“అద్సరేగానీ మునుపు కుక్కలంటే ఆమడ దూరం పరిగెత్తేవాడివి అలాంటిది టామీని భలే మచ్చిక చేసుకున్నావే” ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
“మీరే చెప్పారు కదా భయం ధైర్యం మనలోనే ఉంటాయని. అది గుర్తు పెట్టుకున్నాను. కుక్కలంటే భయం పోవడానికి అవసరమైన సమాచారాన్ని తెలుసుకున్నాను”
“ఏమిటో అది?”
“అబ్బో చాలా ఉంది తాతగారు చెప్పాలంటే”
“అంతా వద్దులే మచ్చుకి ఒకటి రెండు చెప్పు చాలు”
“కుక్కలని చూసి మనం భయపడకూడదట, అలాగే మనమూ వాటికి హాని తలపెట్టమని తెలిసేలా ప్రవర్తించాలట” అంటూ చెప్పుకొచ్చాడు.
“పోనీలే ఎలాగైతేనేం నీ భయం పోయింది నాకంతే చాలు” మనవడి భుజం తట్టారు.
మరో నెలరోజులు మనవడితో కాలక్షేపం చేసి పనులున్నాయని అచ్యుతాపురం పయనమయ్యారు.
&&&
ఆరోజు ఆదివారం. ఉదయం సుమారు పదకొండు గంటలైంది. ఆలస్యంగా లేచి కాఫీ ఫలహారాలు ముగించి కళ్యాణి తో కబుర్లు చెప్తుండగా ఫోన్ మ్రోగింది.
“హలో ఎవరండీ?” అన్నాడు రాజేంద్ర.
“నేనే మహేష్”
“ఓహ్ ఏమిటీ ఎప్పుడూ లేనిది ఈ వేళప్పుడు ఫోన్ చేసావు, మా ఇంటి మీదకి గాలిమళ్ళిందా?”
“చాలా రోజులైంది కదా పలకరిద్దామని చేసాను. అయినా మీ నాన్నగారు ఉన్నారు కదా. మరెప్పుడైనా వస్తానులే. పైగా ఇవాళ పని ఎక్కువ ఉందని ఆఫీసుకి పిలిచారు మాలో కొంతమందిని”
“నాన్న ఇక్కడున్నారని నీకెవరు చెప్పారు?”
“నేను ఆఫీసుకి వెళ్ళుతుంటే బస్సు దిగుతున్నారు. ప్రక్కనే ఎవరో ఉన్నారు కూడా. ఇంటికి రాలేదా?”
“ఓ అలాగా! ఏదో పనుండి వచ్చి ఉంటారు. వస్తారేమోలే”
“సరే మరి ఉంటానూ” అవతలినుంచి ఫోన్ కట్ అయింది.
ఫోన్ చేతిలో పట్టుకునే ‘నాన్న వస్తున్నట్లుగా మాట మాత్రమైనా చెప్పలేదే! ఎందుకు వచ్చి ఉంటారో? ప్రక్కన ఉన్నది ఎవరై ఉంటారో’ ఆలోచిస్తూ భార్యకి చెప్దామనుకుని ఎలాగూ వచ్చినపుడు తెలుస్తుందిగా అనుకున్నాడు.
ఫోన్ చేసి అడుగుదామంటే తండ్రికి సెల్ ఫోన్ లేదు. చాలాసార్లు తాను కొనిస్తానన్నా కూడా దానిపై తనకు సదభిప్రాయం లేదని తిరస్కరించారు కూడా.
సుమారు మధ్యాహ్నం మూడు గంటలకు కొడుకు ఇంటికి చేరుకున్నారు రామయ్య.
తండ్రి ఊర్లోనే ఉన్న విషయం తనకి తెలియనట్లే ఆయన్ని చూడగానే ఆశ్చర్యపోయినట్లు ముఖం పెట్టి “భార్గవా కళ్యాణి చూడండి ఎవరొచ్చారో?” సంబరంగా పిలిచాడు.
వాళ్ళూ ఆశ్చర్యానందాలకి లోనయ్యారు పెద్దాయన్ని చూసి.
అందరినీ చూసి పలకరింపుగా నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయారు రామయ్య.
అలసటగా వాడిపోయిన తండ్రి ముఖాన్ని చూసి చెప్పేదేదైనా ఉంటే ఆయనే చెప్తారులే అని ఊరుకున్నాడు.
సాయంత్రం కాఫీలయ్యాక “ముందుగా తెలిస్తే నేను వచ్చి తీసుకుని వచ్చేవాడ్నిగా నాన్నా” అన్నాడు.
“ఒక అత్యవసర పని మీద వస్తూ మునసబుగారు తోడు రమ్మంటే వచ్చాను. ఆ పని అయ్యేటప్పటికి ఇంత సమయం అయింది” సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు.
“ఓహ్ అలాగా”
“తమ్ముడు చనిపోతే ఆయన కొడుకుని మునసబుగారే పెంచి పెద్ద చేసారు. అతడికి అనుమానం జబ్బు. పెళ్ళైన ఎంతో కాలానికి భార్యకి పుట్టిన బిడ్డ తనది కాదని, బిడ్డకి రక్త పరీక్ష ఇంకా అదేదో పరీక్ష చేయాల్సిందేనని, కోర్టులో కేసు వేసాడట. ఆ పిల్లకి ఇప్పుడు పదేళ్ళు. ఇంతకాలం పెంచిన తండ్రి ఇప్పుడు చీదరించుకుంటూంటే భరించలేక ఒకటే ఏడుస్తోందిట పాపం. ఆ కేసు విషయమై తిరుగుతున్నాడు” అడగకుండానే చెప్పుకొచ్చారు.
రాజేంద్రా కళ్యాణీ ముఖాముఖాలు చూసుకున్నారు.
“అయినా వాడి పిచ్చిగానీ ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాడురా? తనదీ, భార్యదీ ముఖ్యంగా ఆ పిల్లదీ భవిష్యత్తు నాశనం అవడం తప్ప. ఇన్నేళ్ళూ కళ్ళల్లో పెట్టుకుని పెంచిన ప్రేమ అలా ఎలా ఒక్క అనుమానంతో తెగిపోతుందిరా? పిల్లలు లేక ఏడుస్తుంటే ఆ దైవం ఒక నలుసుని ఇచ్చాడని సంతోషపడకుండా వెధవ అనుమానమూ వాడూను! తలచుకుంటేనే బాధగా ఉంది”
“కొంతమంది అంతే నాన్నా. అందరూ మీవంటి సహృదయులు ఉండరుగా” కొడుకు మాటలలో ఏదో శ్లేష ధ్వనించి సాలోచనగా చూసారు.
“అంటే నా అర్థం మీలా ఆలోచించే వాళ్ళు ఉండరని”
అయితే రామయ్యగారి ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి... ‘భార్గవకి తమలో ఎవరి పోలికలు లేవనే సందేహం పొడ చూపినా అంతగా పట్టించుకోలేదు. అయితే ఆ మధ్య సూరజ్ ఫోన్ చేసాడని చెప్పినప్పుడు కొడుకూ కోడలూ ఉలిక్కిపడడం తన దృష్టి దాటిపోలేదు. ఇవాళ ఈ విషయంలోనూ రాజు మాటల్లో ఏదో గూఢార్థం! ఏంటో అంతా అర్థంకానట్లుగా ఉంది’ దీర్ఘంగా నిట్టూర్చారు.
&&&
జీవితం సాఫీగా జరుగుతోందని సంతోషిస్తున్న తరుణంలో జరిగిందొక సంఘటన!
ఒకనాడు స్కూల్లో గేమ్స్ ఆడుతుండగా ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయాడు భార్గవ. వెంటనే స్కూలు వాళ్ళు కళ్యాణికి ఫోన్ చేసి విషయం చెప్పారు.
వెంటనే మామగారిని తోడ్కొని హుటాహుటిన స్కూలుకి వెళ్ళి పిల్లవాడిని ఆస్పత్రికి తీసుకెళ్ళింది కళ్యాణి. ఆలోగా ఆఫీసునుంచి రాజేంద్ర కూడా వచ్చాడు.
భార్గవని పరీక్ష చేసి కొన్ని టెస్ట్ లు చేయించమన్నారు డాక్టర్. టెస్ట్ రిపోర్టులు చూసి, పిల్లవాడి చదువు దినచర్య అన్నీ విపులంగా అడిగి తెలుసుకున్నారు.
“అసలు నాకేమైంది డాక్టర్?”
డాక్టర్ చెప్పింది విని బెంబేలెత్తి బిక్క ముఖం వేసిన భార్గవని చూసి కలవరపడ్డారు పెద్దలు మువ్వురూ.
ప్రస్తుత భార్గవ స్థితికి అసలు కారణం...
!+!+!
గత కొద్ది కాలంనుంచీ భార్గవ బయటకి వెళ్ళి ఆడుకోవడం బొత్తిగా మానేసాడు. ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నాడు. స్కూలునుంచి వచ్చీ రాగానే తన గదిలో మంచం పై పడుకుని టాబ్ లో ఏవో వీడియోలు చూస్తూ ఉంటాడు. అందులో మునిగాడంటే తిండీతిప్పలూ కూడా మర్చిపోతాడు. పదిసార్లు పిలిచాక ఏదో కతికాననిపించి మళ్ళీ గదిలోకి దూరి కూర్చోవడం. అలా చేయొద్దు అని కొడుక్కి చెప్పీ చెప్పీ విసిగిపోయారు వాడి అమ్మానాన్నా.
“కాసేపు అలా బయట ఆడుకుని రారా” ఒక రోజు ఉండబట్టలేక ట్యాబ్ పట్టుకుని కూర్చున్న కొడుకుతో అన్నాడు రాజేంద్ర.
“ఆ అవే ఆటలు ఆడీ ఆడీ బోర్ కొట్టింది డాడీ”
“పోనీలే కాసేపు సైకిల్ తొక్కుకో”
“అబ్బా డాడ్ ఇప్పుడే వచ్చాను కదా అలసిపోయాను, నీరసంగా ఉంది” విసుక్కున్నాడు.
టీనేజ్ లోకి అడుగు పెట్టబోతున్న కొడుకుతో ఎలా వేగాలో తెలియక బాధపడుతున్న సమయంలో యాధృచ్ఛికంగా అత్యవసర పనిమీద తండ్రి రావడం కొంత ఉపశమనాన్ని కలిగించింది.
తాతా మనవళ్ళకి ఒకే గదిలో పడక ఏర్పాటు చేసాడు.
ఓనాడు ఉదయాన్నే వాకింగ్ కి వెళుతూ “నాతో వస్తావా?” మనుమడిని అడిగారు రామయ్య.
“వ్వాట్ తాతయ్యా నన్ను పడుకోనివ్వండి ప్లీజ్. నాకు నీరసంగా ఉంది” విసుక్కున్నాడు.
వాకింగ్ నుండి వచ్చి పూజాదికాలు కానిచ్చి రామయ్య కాఫీ త్రాగుతుండగా లేచి వచ్చాడు భార్గవ.
“మీకు ఈ ఏజ్ లోనూ ఇన్ని పనులు చేయడానికి ఇంత ఓపిక ఎలా ఉంటుంది తాతగారూ?” వాడి ముఖంలో పేద్ద ప్రశ్నార్థకం.
రామయ్య ఏదో చెప్పబోయేంతలో “స్కూలుకి టైమవుతోంది త్వరగా రెడీ అవ్వు. మళ్ళీ బస్ వెళిపోతుంది” తల్లి పిలుపుతో అటు వెళ్ళిపోయాడు భార్గవ.
“బై తాతయ్యా”
మనుమడితో బస్సుదాకా వెళ్ళొచ్చిన రామయ్య “భార్గవ ఏమిటిరా అలా బొత్తిగా బలం లేనట్లు నడుస్తున్నాడూ?” అన్నారు కొడుకుతో.
“ఈ మధ్యన నేను కూడా గమనించాను నాన్నా. ఇప్పుడు మీరూ అంటుంటే నా సందేహం బలపడింది. సాయంత్రం కనుక్కుంటాను అసలు విషయం” అని ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నమే కళ్యాణి ఫోన్…..!
!+!+!
“బలానికి కొన్ని మందులు వ్రాస్తున్నాను. క్రమం తప్పకుండా, అశ్రధ్ధ చేయకుండా వాడాలి. నిర్లక్ష్యం చేసావంటే ఫలితం తీవ్రంగా ఉంటుంది” భార్గవని హెచ్చరించారు డాక్టర్.
ఇది జరిగిన కొన్నాళ్ళకి, వాకింగ్, కాలకృత్యాలూ ముగించుకుని తీరుబడిగా కూర్చున్న తాతగారి వద్దకు వచ్చి “రేపటినుంచి నేను కూడా మీతో వాకింగ్ కి వస్తాను” అన్నాడు.
“భేష్. తప్పకుండా వద్దువుగాని. కానీ అంతకంటే ముందు నువ్వు నీకు ఇష్టమైన కార్టూన్ కారెక్టర్ శక్తిమాన్ లాగా అవ్వాలి మరి! అందుకు మంచి పోషకాహార విలువలున్న భోజనం చేయాలి”
“ఆ రోజు డాక్టర్ కూడా అదే చెప్పారు కదా. పోషకాహారం అంటే?”
“ఉదయాన్నే పాలు త్రాగాలి, గ్రుడ్డు తినాలీ, అమ్మ చేసి పెట్టే అన్ని కూరలూ తినాలీ. రకరకాల పళ్ళు కూడా తింటుండాలి. అంతేకానీ అలా ఇరవై నాలుగు గంటలూ నీ గదిలోనే కూర్చుని ఏదో మొక్కుబడికోసం నాలుగు మెతుకులు కతికితే రక్తహీనత ఏర్పడుతుంది”
అందరివైపూ ఒకసారి చూసి “అందువల్లనే ఆరోజు స్కూల్లో పడిపోయానని అన్నారు డాక్టర్ కూడా. ఇవన్నీ నేను సైన్స్ లో చదువుకున్నా నెగ్లెక్ట్ చేసాను అందుకే నాకిలా జరిగింది. మీరు కూడా ఎప్పుడు అడిగినా కేర్ లెస్ గా రిప్లై ఇచ్చాను. అయాం సారీ తాతయ్యా” ఏడుపు లంకించుకున్నాడు.
కళ్యాణి గబుక్కున వాడిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. రామయ్యకీ రాజేంద్రకీ కూడా భార్గవ అలా బేలగా ఏడవడం చూసి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
“అమ్మాయ్ ఒకసారి ఉలవ చారు చెయ్యి. భార్గవ రుచి చూస్తాడు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది” కోడలితో అన్నారు.
“అలాగే మామయ్యా” లేచి వంట గదిలోకి వెళ్ళింది కళ్యాణి.
“ఉలవ చారా ఎప్పుడూ వినలేదే. అసలు ఉలవలంటే?” ఆసక్తిగా అడిగాడు భార్గవ.
“ఉలవలని ఇంగ్లీషులో హార్స్ గ్రామ్ అంటారు. ఇవి పప్పు దినుసులు. ప్రొటీన్స్ ఉంటాయన్న మాట. అవి మనకి కావలసిన శక్తినీ బలాన్ని ఇస్తాయి. ఉలవలతో పాటు కందులు, పెసలు, మొక్కజొన్న అంటే మీరిప్పుడు తింటారే కార్న్ ఫ్లేక్స్ అనీ ఇలా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అన్నిటిలోనూ పోషకహార విలువలు ఉన్నాయి ముఖ్యంగా ప్రొటీన్స్.”
“అబ్బో అన్ని రకాలున్నాయా?”
========================================================================
ఇంకా వుంది..
========================================================================
దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya
పేరు: దినవహి సత్యవతి
విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;
వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.
ప్రవృత్తి : రచనా వ్యాసంగం.
సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.
పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.
గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.
పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.
ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.
6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &
గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);
పంచామృతం!(సత్య! పంచపదులు)
స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in
Comments