top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 5


'Kotha Keratam Episode 5' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు.


హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.


రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్. తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్.

తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు సూరజ్.


హాస్పిటల్ కి వచ్చిన తన తలిదండ్రులకు సూరజ్ కొడుకునే తన కొడుకుగా చెబుతాడు రాజేంద్ర.

సమయం చూసుకొని భార్యకు నిజం చెబుతాడు రాజేంద్ర. ముందు బాధపడ్డా సూరజ్ కొడుకుని స్వంత బిడ్డలా చూసుకుంటానంటుంది అతడి భార్య కళ్యాణి.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 5 చదవండి.


తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం భార్గవ సెలవలు మొదలవ్వగానే, తమ ఆఫీసులకీ పది రోజులు సెలవు పెట్టి స్వగ్రామం వచ్చారు రాజేంద్ర దంపతులు.


ఆ సమయంలో తమ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పిల్లలతో మంచి స్నేహం కుదిరింది భార్గవకి. అక్కడున్నన్నాళ్ళూ సాయంత్రం అవగానే ఆటలకి వెళ్ళిపోవడం మళ్ళీ రాత్రి భోజన సమయానికి ఇంటికి తిరిగి రావడం వాడి దినచర్యలో భాగమైంది.


ఆరోజు రాజేంద్ర పాత స్నేహితులని కలవడానికి వెళుతుంటే తానూ వెళ్ళింది కళ్యాణి.

రామయ్య జానకమ్మ భక్తి టి. వి. ఛానెల్ లో పురాణ శ్రవణం ఆలకిస్తుండగా ఆడుకోవడానికని వెళ్ళిన మనవడు వెంటనే తిరిగొచ్చేయడం గమనించారు.


“ఏరా అప్పుడే ఆటలు అయిపోయాయా వచ్చేసావు?”


“ఇది చూడండి” తాత ప్రశ్నకి బదులివ్వకుండా ఒక పుస్తకం ఆయన చేతికిచ్చాడు.


“ఏమిటిరా ఇది?”


“ఈ పుస్తకంలో బొమ్మలూ అవీ వేసి ఏదో వ్రాసుంది. నాకు తెలియటం లేదు చెప్తారా?”


“ఇది ఒకటవ తరగతి తెలుగు పుస్తకం రా”


“ఏముంటుంది అందులో?”


“అ.. ఆ లు”


“అంటే”


“తెలుగు అక్షరాలు”


“తెగులు అ.. క్కక్క్స.. అబ్బా డిఫికల్ట్ గా ఉంది తాతయ్యా” విసుగ్గా ముఖం పెట్టాడు.


“ఓరి నీ ఇల్లు బంగారంగానూ! తెగులు కాదురా.. తె.. లు.. గు.. ఏదీ అను”


“తె.. గు.. లు.. ” తాతయ్యని అనుకరిస్తూ నెమ్మదిగా ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ వల్లించాడు.


“మళ్ళీ అదే మాట! హూ.. అయినా ఇందులో నీ తప్పేముందిలే! ఇంగ్లీష్ చదువులు అలవాటై తెలుగు భాషకి తెగులు పట్టించేస్తున్నారు” దీర్ఘంగా నిట్టూర్చారు.


“తాతగారూ నాకూ తెగులు నేర్పిస్తారా?”


“నేర్పిస్తాగానీ అంతకంటే ముందు నీకు తెలుగు అనే పదం పలకడం నేర్పించాలి”


“మరి అక్క్క్.. చ్.. చ్.. చ.. ర.. లు?”


“నాలిక తిరక్కపోవడం కాదుగానీ భలే తమాషాగా ఉందిరా వినడానికి” పక పకా నవ్వారు.


“చూడు నాన్నమ్మా” బుంగమూతి పెట్టాడు.


“ఊరుకోండీ చిన్న పిల్లవాడితో వేళాకోళం మీరూనూ” భర్తని మందలించింది జానకమ్మ.


“సరే లేరా అలగకు మరీ! ఏదో జోక్ చేసానంతే. ఇంతకీ తెలుగు అక్షరాలు నేర్పించాలి నీకు అంతేగా! అవి చెప్పేముందు మీ స్కూల్లో ఏమేం నేర్పించారో చెప్పు” మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడిగారు.


“ఎ, బి, సి, డి.. 1, 2 3 4.. ”


“ఎ, బి, సి, డి లని ఏమంటారో తెలుసా ఇంగ్లీషులో?”


“ఓ.. తెలుసు.. ఆల్ఫాబెట్స్”


“ఆ.. అలాగే అ.. ఆ.. లు తెలుగు ఆల్ఫాబెట్స్ అన్నమాట”


“సరేగానీ స్కూల్లో ఏం లాంగ్వేజ్ మాట్లాడతావు నీ ఫ్రెండ్స్ తో?”


“ఇంగ్లీష్ లో లేకపోతే టీచర్ కోప్పడతారు”


“ఇంట్లో మనం తెలుగులో మాట్లాడుకుంటాము. అందుకే దానిని మాతృభాష అంటారు”


“మాతూరు బా.. స అంటే.. ?”


“మాతృ భాష అంటే ఇంగ్లీష్ లో మదర్ టంగ్ అని”


“ఓ అలాగా అయితే అందరికీ ఒకే మదర్ టంగ్ ఉంటుందా?”


“ఉండదు. నీ క్లాసులో తెలుగు ఇంగ్లీష్ కాకుండా ఇంకేదైనా భాషలో మాట్లాడేవాళ్ళు ఉన్నారా?”


“ఆ.. ఉన్నాడు శరవణన్ నా ఫ్రెండ్”


“వాడు ఏ భాషలో మాట్లాడతాడు?”


“ఎప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడినా అప్పుడప్పుడూ అర్థం కాని భాషలో మాట్లాడతాడు”


“ఏ ఊరు ఆ అబ్బాయిది?”


“చెన్నై అని చెప్పాడు”


“ఆ.. అదీ.. అంటే వాడి మాతృభాష తమిళ్ అన్నమాట”


“అందరికీ ఒకే భాష ఎందుకుండదూ?”


“వెరీ గుడ్ మనవడా. బాగా అడిగావురా. బాలవాక్కు బ్రహ్మవాక్కనీ ఏమో నువ్వడిగినట్లు అందరికీ ఒకే భాష రావచ్చేమో భవిష్యత్తులో” టి. వి. కట్టేసి, మనవడి బుర్రలోంచి పుట్టుకొస్తున్న ప్రశ్నలూ తాతగారు ఓపికగా ఇస్తున్న సమాధానాలూ ఆసక్తిగా వింటూన్న జానకి నవ్వుతూ లేచి వంటగదివైపు అడుగులు వేసింది.


నాన్నమ్మ వెళ్ళిన వైపే చూస్తూ “నాన్నమ్మ కి ఇంగ్లీష్ వచ్చా?” ఆశ్చర్యంగా అడిగాడు.


“వచ్చురా”


“మరి మీకో?”


“నాకూ వచ్చును”


“మీరు ఇంగ్లీష్ స్కూల్లో చదువుకున్నారా నాలాగా?”


“లేదురా తెలుగులోనే”


“మరి ఇంగ్లీష్ ఎలా వచ్చు?”


“నాకు మీ ముత్తాతగారు నేర్పించారు”


“మరి నాన్నమ్మకో?”


“నేను నేర్పించాను”


“ఓహో! అయితే తాతయ్యా మరీ తెగులు రాకపోతే ఈ బుక్ నేను చదవలేనా?” తాత చేతిలోని పుస్తకం చూపాడు.


“ఊహు! ఇది చదవాలంటే తెలుగు ఆల్ఫాబెట్స్ వ్రాయడం చదవడం తెలియాలి నీకు. ఇంతకీ తమరికెందుకు అంత హఠాత్తుగా తెగులు అదే తెలుగు నేర్చుకోవాలని కోరిక పుట్టిందో చెప్తారా మనవడుగారూ?”


“నా ఫ్రెండ్స్ పుస్తకంలో బొమ్మలు చూపించి చదవమన్నారు. నాకు తెగులు తెలియదు కదా అందుకే చదవలేక పోయాను. అయ్యో అదేంటీ తెగులు రాదా అంటూ నవ్వి ఎక్కిరించారు" ఉక్రోషంగా అన్నాడు.


“అదన్నమాట అసలు సంగతి! పోనీలే కారణమేదైనా తెలుగు నేర్చుకుంటానన్నావు అదే మహధ్భాగ్యం. మనకి మన మాతృభాష అంటే మదర్ టంగ్ వచ్చి ఉండాలి”


“నాకు తెగులు మీరు నేర్పిస్తారా?”


“భలే రా! నీ పలకడం నువ్వూనూ” పెద్దగా నవ్వి “నా దగ్గర నేర్చుకుంటావా?”


“ఓ! ఎప్పుడు స్టార్ట్ చేద్దాము?”


“ఓరి భడవా! లేడికి లేచిందే పరుగుట! అలా ఉంది నీ వ్యవహారం. సర్లే మంచి పని మొదలుపెట్టడానికి ఆలస్యమెందుకు రేపే మొదలు పెడదాము”


“భలే భలే! అప్పుడు నేనూ చక్కగా బొమ్మల పుస్తకం చదవగలను నా ఫ్రెండ్స్ లాగ” సంబరంగా చప్పట్లు కొట్టాడు.


గెంతుకుంటూ నాన్నమ్మ వద్దకు వెళ్ళి ఆ విషయం చెప్పాడు. జానకి ఎంతగానో సంతోషించింది.

తల్లిదండ్రులు రాగానే పరిగెత్తుకుంటూ ఎదురువెళ్ళి “నాకు తాత తెగులు నేర్పిస్తానన్నారు” ఉత్సాహంగా చెప్పాడు.


“తెగులా?” అయోమయంగా తండ్రివైపు చూసాడు రాజేంద్ర.


“తెలుగుకు వచ్చిన తిప్పలురా! సరళ పదమే అయినా పలకడానికి తికమక పడుతున్నాడు”


“ఓ! అదా సంగతీ! తప్పక నేర్చుకోరా. మన భాష మనకి వచ్చి ఉండాలి ఎప్పటికైనా” తాము బయటకి వెళ్ళొచ్చేంతలో ఇదెలా సాధ్యమైంది అన్నట్లు తండ్రి వైపు అబ్బురంగా చూసాడు.

తర్వాత తీరుబడిగా వివరిస్తానన్నట్లు సైగ చేసి నవ్వారు.


“వెరీ గుడ్” కొడుకుని ఎత్తుకుని ముద్దుపెట్టింది కళ్యాణి.


“అమ్మా! వెరీ గుడ్ ఇంగ్లీషు వర్డ్. మన లాంగ్వేజ్ తెగులు కదా” చూసారా నాకెన్ని తెలుసో అన్నట్లు గర్వంగా చూసాడు అందరివైపూ.


“ఓరి పిడుగా! నాకే చెప్పేంత వాడివయ్యావూ అప్పుడే. చూడండి మామయ్యా వీడు” హాయిగా నవ్వేసింది.


ఆమె నవ్వుతో జత కలిపారందరూ.

భార్గవ సెలవలు ముగియగానే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు ముగ్గురూ.&&&

“మామయ్య ఫోన్ చేసి అచ్యుతాపురం రమ్మన్నారు” భర్త ఆఫీసునుంచి రాగానే కబురు అందిచింది కళ్యాణి.


“మొన్ననేగా వెళ్ళొచ్చాము. మళ్ళీ అప్పుడే ఎందుకట?”


“పంచాయితీ ఎన్నికలట మనకి ఓటు అక్కడ ఉంది కదా. ఆ సమయానికి తప్పక వీలు చేసుకుని వచ్చి ఓటు హక్కు వినియోగించుకోమన్నారు”


***

స్థానిక ఎన్నికలను పురస్కరించుకుని నాయకుల ప్రచార సభలతో అచ్యుతాపురం హడావిడిగా ఉంది.


రాజేంద్ర వాళ్ళు వెళ్ళేటప్పటికి ప్రచారం ముగిసింది. ఆ మర్నాడు ఎన్నికలు. అందరూ ఉదయాన్నే వెళ్ళి తమ ఓటు వేసి వచ్చారు. అదే రోజు భార్గవ పుట్టినరోజు కావడాన సన్నిహితులందరికీ విందు చేసారు రామయ్య.


అవకాశం దొరికినప్పుడు ఇటు రామయ్య దంపతులు, సమయం కుదిరినప్పుడు అటు రాజేంద్ర, తెలుగు నేర్పించడంతో చిన్నచిన్న వాక్యాలు చదవడం వ్రాయడం, మాట్లాడడమైతే చాలామటుకూ వచ్చింది ఆరేళ్ళ భార్గవకి.


పిల్లవాడి చేత పలుమార్లు పలికించీ పలికించీ ఎలాగైతేనేం తెగులు వదిల్చి తెలుగు పలికించడంలో సఫలీకృతులయ్యారు నలుగురూ!


ఆ మర్నాడు సాయంత్రం, తానూ తెలుగు చదవగలనని చెప్పి, తాతగారు కొనిచ్చిన కథల పుస్తకాలు స్నేహితులకి చూపించి, ఆ తర్వాత కాసేపు వారితో ఆడుకుని రావడానికని వెళ్లాడు భార్గవ.

అత్తా కోడలూ కొడుకూ కాఫీలు త్రాగుతూ పిచ్చాపాటీలో పడ్డారు.


తోటమాలి పెరట్లో మొక్కలకి పాదులు త్రవ్వుతుంటే చూద్దామని వెళ్ళారు రామయ్య.

ఇంతలో బయటనుంచి “అమ్మా.. అమ్మా” అంటూ బిగ్గరగా భార్గవ కేకలు వినిపించాయి.

పెరట్లోనున్న రామయ్య చెవికి ఆ అరుపులు సోకలేదు కానీ జానకమ్మ ఆ వెనకాలే రాజేంద్ర కళ్యాణి పరిగెత్తి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి ఖంగుతిన్నారు.


సరదాగా ఆడుకుంటున్న పిల్లల్ని, ఎక్కడనుంచి వచ్చిందో ఒక నల్లమచ్చల కుక్క, భీకరంగా అరుస్తూ తరుముతోంది. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో కొందరు పారిపోగలిగితే, కొందరు క్రింద పడిపోయి భయంతో అరుస్తున్నారు.


సరిగ్గా వీళ్ళు వెళ్ళే సమయానికి భార్గవ పైకి వెళుతోంది కుక్క. మనవడిని కాపాడదామని పరిగెత్తబోతూ కాలికి చీర అడ్డుకుని ముందుకు తూలి పడిపోయింది జానకమ్మ. ఆ పడిపోవడంలో ఆమె కణతకి సూదంటు రాయి గుచ్చుకుంది.


అప్పటికే భార్గవ కాలు కొరికిన కుక్క, రాజేంద్ర గట్టిగా కర్రతో కొట్టేటప్పటికి పారిపోయింది.

అరుపులు విని అప్పటికే అక్కడికి చేరిన పెద్దలు తమ తమ పిల్లల్ని ఇళ్ళకి తీసుకుని వెళ్ళిపోయారు.


విషయం తెలిసిన రామయ్య పరుగున వచ్చి, కొడుకు సాయంతో జానకమ్మనీ, మనవడినీ హుటాహుటిన గ్రామంలోని ఆస్పత్రికి తీసుకెళ్ళారు.


గాయంవల్ల అధిక రక్తశ్రావమై ఆస్పత్రికి వెళ్ళే త్రోవలోనే తుది శ్వాశ విడిచింది జానకమ్మ.

ఆకస్మికంగా జరిగిన ఈ ఘటన రామయ్య కుటుంబాన్ని అంతులేని విషాదంలో ముంచివేసింది.

సమయానికి కుక్క కాటుకి వేసే విరుగుడు ఇంజక్షన్, ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో చిన్నవాడైన భార్గవ బొడ్డు చుట్టూరా, రోజుకోకటి చొప్పున 14 ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది.

పిల్లలపై కుక్క దాడి విషయాన్ని గ్రామస్థులు ఫిర్యాదు చేయగా మునిసిపాలిటీ వాళ్ళు తీసికెళ్ళి పోయారనీ, కుక్కకి పిచ్చెక్కిందని నిర్థారణ అవడంతో, వదిలేస్తే గ్రామస్థులకు హానికరమని, అందుకు తగిన చర్యలు తీసుకున్నారనీ తెలిసింది రామయ్యకి.


భార్య హఠాన్మరణం రామయ్యని విపరీతంగా కృంగదీసింది. నాన్నమ్మ తనని కాపాడుతూ చనిపోయిందని గ్రహించగలిగిన భార్గవ పసిమనసు తెలియని కలతకు గురైంది.

వెక్కి వెక్కి ఏడుస్తున్న పసివాడిని ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు.


చివరికి రామయ్యే అతికష్టం మీద తన బాధని దిగమింగి, మనవడిని సముదాయించడంలో నిమగ్నమయ్యారు.


జానకి చనిపోయాక, ఒంటరిగా ఉండొద్దనీ, తమతో వచ్చేయమనీ రామయ్యని ఎంతగానో బ్రతిమిలాడారు కొడుకూ కోడలూ.


ఓపికున్నంతవరకూ స్వతంత్రంగా ఉంటానని, కష్టమైనప్పుడు తప్పక వస్తానని చెప్పి వారి అభ్యర్థనని సున్నితంగా త్రోసిపుచ్చి స్వగ్రామంలోనే కాలక్షేపం చేయసాగారు రామయ్య.

తల్లి కర్మకాండలు పూర్తయ్యాక తిరిగి ఆఫీసుకి వచ్చిన రాజేంద్రకి, సహోద్యోగులూ సన్నిహితులూ తమ సంతాపం తెలియపరిచారు.


అందరికంటే దగ్గర స్నేహితుడైన మహేష్, భార్యతో సహా వచ్చి, స్నేహితుడికీ కళ్యాణికీ, జానకమ్మగారు అకాల మృత్యువాత పడినందుకు, తన ప్రగాఢ సంతాపం తెలిపాడు.

రాజేంద్ర తల్లిదండ్రులను కూడా బాగా ఎరిగున్నవాడు కావడాన ఫోన్ చేసి రామయ్యకి కూడా సంతాపం తెలిపాడు.


భార్య మరణానంతరం కలిగిన ఒంటరితనం మనవడికి దగ్గరయ్యేలా చేసింది రామయ్యని. తదుపరి గడచిన కొన్ని సంవత్సరాలలో తాతామనవల అనుబంధం మరింత పటిష్ఠమైంది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


162 views0 comments

Comments


bottom of page