top of page

క్షమయా ధరిత్రి


Kshamaya Dharitri Written By Telikicherla Vijayalakshmi

రచన : తెలికిచెర్ల విజయలక్ష్మి

అది నూట ముఫై ఇళ్ళు వుండే కమ్యూనిటీ. మొత్తం అయిదు బ్లాక్స్‌ ఉన్నాయి కాంపాండ్‌ లో. అందులో చక్కటి పార్క్‌, చిన్న శివుడి కోవెల తో చూడ ముచ్చటగా పొందికగా వుంటాయా ఇళ్ళు. సాయంత్రం అయ్యే సరికి పిల్లలంతా కిందనే వుంటారు ఆడుకుంటూ... సీతాకోకచిలకల్లా.


కొత్తగా అక్కడకు అద్దెకి వచ్చిన అరుణకి ఆవాతావరణం చాలా నచ్చింది. పిల్లలు ఇద్దరూ... దూరంగా వుండటంతో, ఒక్కర్తే ఇంట్లో ఏంచేస్తాను, బయటకు వస్తే అందరూ పరిచయం అవుతారని, రోజు సాయంత్రం వచ్చి పార్క్‌ లో బెంచ్‌ మీద కూర్చొని పిల్లల ఆటలు చూస్తూ సంతోషంగా గడిపేది.


కొంచం పెద్ద పిల్లలు స్లయిడింగ్‌ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఉయ్యాలలు వూగుతున్నారు. మరికొంతమంది సైకిల్‌ తొక్కుతున్నారు.


కొంచం పొట్టిగావుండే ఒకాయన రోజూ... వచ్చి, చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటుంటే.. చూసి, ఆయన కూడా తనలాగే, ఒంటరితనం భరించలేక పార్క్‌ లో టైమ్‌ పాస్‌ కోసం వస్తున్నారు అనుకుంది అరుణ.


చీకటి పడుతూంది, చిన్నపిల్ల తల్లి ఇంటికి వెళ్ళే తొందరలో వుంది. పాప ఇంటికి వెళ్లనని మారాం చేస్తోంది, అంతలో పొట్టిగా వున్నాయన "లక్ష్మీ , నేను పాపను మరి కాసేపు ఆడించి తెస్తాను, నువ్వెళ్ళి వంట పని చూసుకొమ్మా" అన్నాడు.

"థాంక్స్‌ బాబాయి గారూ, మాఆయన ఇంటికి వచ్చే టైమ్‌ అయింది. అయితే నేను పోయి వంట చేసుకోనా?" అంది.

"నువ్వెళ్ళమ్మా, నేను మరి కాసేపు ఆడించి తెస్తాను కదా" అన్నాడు ఆయన.


"పాప జాగ్రత్త అంకుల్. అయినా మీదగ్గర వుంటే పిల్లలు ఎప్పుడూ... నవ్వుతూనే ఉంటారు లెండి, వస్తాను" అంటూ...లక్ష్మి లిఫ్ట్‌ దగ్గరకు వెళుతుంటే... అరుణ లిఫ్ట్‌ దగ్గర తనను తాను పరిచయం చేసుకుంది.

"మా ఇంటికి రండి ఆంటీ" అని సంతోషంగా వాళ్ళ ఇంటికి పిలిచింది లక్ష్మి.

ఇంటికి వెళ్ళి చేసేపనులు ఏమీ లేవు, ఇతను కూడా ఊర్లో లేరుకదా, కాసేపు కూర్చొని వద్దామని లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అరుణ.

మాటల్లో చెప్పింది లక్ష్మి "పార్క్‌ లో రోజూ వచ్చే ఆయన పేరు గిరీశం, అతనికి ఒక్కర్తే కూతురు. కూతురు, అల్లుడూ ఇద్దరూ టీచర్స్‌. రెండేళ్ల క్రితం ఇతని భార్య వాళ్ళ సొంత ఊర్లో పోయింది. గిరీశం అంకుల్ పట్నం రాను, ఉండలేను అన్నా సరే... కూతురు సమత తండ్రిని తెచ్చి, ఇక్కడే ఉంచుకుంది. ఇక్కడికి వచ్చిన కొ త్తల్లో అంకుల్ చాలా మొహమాటంగా ఉండేవారు. ఇప్పుడు పిల్లల కోడిలా పిల్లల్ని వెంట వేసుకొని తిరుగుతూ వుంటారు" అంటూ నవ్వింది లక్ష్మి.


"మంచి పని చేసింది ఆ అమ్మాయి. తండ్రిని ఒక్కడినే వదలకుండా తనతోపాటు తెచ్చుకుంది" సరే నేను వెళతాను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అంటూ అరుణ వెళ్ళిపోయింది.


ప్రతీ రోజు పార్క్‌ కి వెళ్ళ టం, అక్కడ ఉన్న అందరితోనూ... కాసేపు మాట్లాడుకొని రావటం అరుణకి దినచర్యలో ఒక భాగం అయి పోయింది.


ప్రతీ విషయాన్ని ఎక్స్‌ రే కళ్ళతో పరిశీలించే అరుణకి, గిరీశం ప్రవర్తన ఏదో అనుమానం గా అనిపించింది.


చీకటి పడినదాకా పార్క్‌ లో ఆడించిన పిల్లలలో ఒక చిన్న పిల్లను ఎత్తుకొని, బిల్డింగ్ ముందునుంచీ వెనక్కు, వెనక నుంచీ ముందుకు తిరుగుతూ వుంటాడు. అరగంట పైన పిల్లను దించకుండా చీకట్లోకి బిల్డింగ్ వెనక్కు తీసుకు వెళుతున్న గిరీశం చూస్తూ వుంటే... విచిత్రమైన భయం వేసింది అరుణకి.

లక్ష్మికి తన అనుమానం చెప్పింది "అయ్యో, ఆంటీ అలా అనకండి, ఆయన చాలా మంచివారు. మీరు పొరబడుతున్నారేమో” అంది లక్ష్మి.

"అబ్బే. నేను కూడా అలా కాకూడదనే అనుకుంటున్నాను. అయినా సరే, రేపు మనం ఇద్దరం కలిసి అతన్ని గమనించుదాము" అంది అరుణ.

మరుసటి రోజు కొంచం లేటుగా పార్క్‌ కి వెళ్ళింది అరుణ. పార్క్‌ లో కూర్చోకుండా దూరంగా...లోపల ఏం జరుగుతోందో సంబంధం లేనట్టు గేట్‌ దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంది.

టైమ్‌ ఏడవుతోంది, ఎండాకాలం వలన కామోసు వెలుగురేకలు ఇంకా వున్నాయి. ఒక చిన్నపిల్లని చంకన వేసుకున్నాడు. అందరూ ఇళ్ళకి వెళుతున్నారు. "ఆ పాప తల్లికి చెప్పేడు, నేను తెచ్చి పాపని దించుతాను" అని.

ఆ కాస్త సహాయానికి ఆ తల్లి మురిసిపోయి, పని తొందరలో ఇంటికి వెళ్ళిపోయింది.

గిరీశం పాపని తిప్పుతున్నట్టూ తిప్పుతూ మెల్లిగా బిల్డింగ్ వెనక్కు వెళ్ళటం చూసిన అరుణ, లక్ష్మి కి ఫోన్ చేసి రమ్మంది.

గిరీశంకి వ్యతిరేకదిశగా వెళ్ళమని, నీ వెనుక నేను వస్తానని చెప్పింది.

బిల్డింగ్ వెనుక ఒక పెద్ద బండ మీద గిరీశం కూర్చొని, పాప ప్రైవేట్‌ పార్ట్‌ మీద చెయ్యివేస్తూంటే, కపటం తెలియని చిన్నారి కిలకిలా నవ్వుతో ది. అదే పనిగా గిరీశం చేస్తున్న ఆ జుగుప్స చర్యకు, లక్ష్మి భద్రకాళి అయింది.

'నా అనుమానం నిజం కాకూడదు అనుకున్న' అరుణ, అనుమానం నిజం అయ్యేసరికి, ఒంట్లో శక్తి అంతా తీసేసినట్టు నిస్సత్తువగా అయిపోయింది.

లక్ష్మి గట్టిగా అరిచి వాచ్‌ మాన్‌ ని పిలిచింది. గిరీశంని అందరి మధ్యకు ఈడ్చుకు వచ్చింది. ఎవరో సమతకు ఫోన్‌ చేశారు. సమత పరుగున వచ్చింది. అందరూ తండ్రిని దోషిని చేసి కొడుతుంటే... తట్టుకోలేకపోయింది సమత.


"ఏమైంది! మా నాన్నను ఎందుకు కొడుతున్నారు" అని గట్టిగా అరిచింది.

జరిగిన విషయం లక్ష్మి చెప్తుంటే..."లేదు మానాన్న అలాంటి వాడు కాదు, మీరు పొరబడ్డారు" అని వాదించింది.

"నాకళ్లతో చూసినదాన్ని, అబద్ధం చెప్తానా?” అంటూ అరిచింది లక్ష్మి.


"లేదు, ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది. అతనికి ఒక ఆడపిల్ల వుంది. ఆ పిల్లని ఎంతో చక్కగా పెంచేడు. మా నాన్న అలాంటి పనులు ' ఛీ ' కలలో కూడా ఊహించలేను" అంటూ ఏడుపు గోంతుతో అంటోంది సమత.


"మీనాన్ననే అడుగు, రోజూ పిల్లల్ని ఎందుకు చీకట్లోకి తీసుకు వెళుతున్నావు అని 'అంది లక్ష్మి.

"చెప్పు నాన్నా, వాళ్ళంటున్న మాటలు అబద్దమని చెప్పు" అంటూ సమత తండ్రిని అడిగింది.


ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా... తలదించుకుని నిలబడిన తండ్రిని చూసింది...లక్ష్మి అన్న మాటలు నిజమేనా? అనే సందేహం కలిగింది సమతకు.


తండ్రిని కళ్ళు విప్పి తేరిపార చూసింది సమత. తండ్రి జాగాలో దోషి కనిపిస్తున్నాడు. మగ జాతిమీద అసహ్యం వేసింది సమతకు. "పసి మొగ్గలతో పాడుపని చేస్తావా త్రాష్టుడా" అంటూ అరిచి పిడికిలి బిగించి కొట్టి కొట్టి అలిసి... కర్తవ్యం గుర్తువచ్చి, వెంటనే తన కొలీగ్‌ భర్త ఎస్‌ ఐ కి ఫోన్‌ చేసి, విషయం చెప్పి రమ్మంది.


"సమతా, పోలీస్‌ల దాకా వద్దులేమ్మా. ఇక్కడికి ఈ టాపిక్‌ వదిలేద్దాం తొందరపడకు" అంది అరుణ.

"వద్దు ఆంటీ, నేరస్తుడు శిక్షింపబడాలి. రెండు సంవత్సరాలు పసిపిల్లలతో పాటూ నాన్న సంతోషంగా ఉన్నారనుకున్నాను... అమ్మ లేని లోటు తీరి, నాన్నకి ఒంటరితనం పోయింది అనుకున్నాను. కానీ... నాన్నలో ఇలాంటి రాక్షసుడు ఉన్నాడని తెలుసు కోలేకపోయాను. నా తండ్రి హంతకుడయినా బాధపడే దాన్ని కాదు.

‘ఛీ' నా తండ్రి అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. ఇలాంటి నేరస్థులకు తప్పక శిక్ష పడాలి. నా నిర్ణయం మారదు" అని తండ్రిని పోలీసులకి అప్ప చెప్పి.. ."మీరు ఏ కేస్‌ రాస్తే అది రాయండి. దోషికి శిక్ష పడాలి. అవసరం పడినప్పుడు నేను హాజరు అవుతాను" అని, ఇంటికి వెళ్ళి పోయింది సమత.

గుత్తివంకాయ కూర, సేమ్యా పాయసం ఘుమఘుమలతో నిండి పోయింది ఇల్లు. అప్పుడే నిద్రలేచిన సమత భర్త "ఏంటీ ఈ రోజు స్పెషల్‌ సమతా?" అన్నాడు.

భర్త మాటకు జవాబు ఇయ్యకుండా మౌనంగా పని చేసుకుంటున్న సమతని చూస్తూ... "నిన్నేనోయ్‌ ఏంటి సంగతి?' అన్నాడు

అయినా మౌనంగా ఉన్న భార్యని చూస్తూ...” అర్ధం అయింది, మళ్లీ వెళుతున్నావు కదా, ఆ త్రాష్టుడి దగ్గరకు?" అని బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు సమత భర్త.

గిరీశంకి జైల్‌ శిక్ష పడింది. అతను జైల్లో ఉన్నాడు. తల్లి చని పోయేముందు, సమతకు తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని ఒంటరిగా వదలద్దని కోరింది. తల్లికి ఇచ్చిన మాటకోసం...తండ్రి ఇంత పాడు పని చేసినా సమత ప్రతినెలా తండ్రికి ఇష్టమైన వంట వండి ,భర్తచేత తిట్లు తినయినా సరే, గిరీశంని చూడటానికి ఖచ్చితంగా జైల్‌ కి వెళుతుంది. అందుకే ఆడది “క్షమయా ధరిత్రి” అయింది


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి




81 views0 comments
bottom of page