'Kudirindi Pelli' written by Kalamraju Venugopal
రచన : కాళంరాజు వేణుగోపాల్
సంక్రాంతి సెలవులకని ఊరికి వచ్చి నాలుగు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ బెంగుళూరుకు పయనమయ్యాను. మా పిన్ని కూతురు రాధ కూడా వస్తానంటే ఇద్దరికీ కలిపి టికెట్ బుక్ చేయించాను. తీరా నేను వెళ్ళే సమయానికి వాళ్ళ నాయనమ్మ కు ఆరోగ్యం సరిగా లేదని రెండు రోజుల తర్వాత వస్తానంది. నేను తయారయ్యాను కాబట్టి స్టాండుకు వచ్చాను. బస్ స్టాండు అంతా ఒకటే గోల. పండుగ సెలవులు అయిపోవడంతో చాలా మంది బయలు దేరారు.
సాయంత్రం 5.30 కి బస్. ఎదురు చూస్తుంటే వచ్చేసింది. ఎక్కి కూర్చున్నాను. బస్ కదిలింది. అంతా నిండి ఉంది, ఒక్క నా పక్క సీట్ తప్ప. ఈ లోపు బాయ్ వచ్చి టికెట్స్ చెక్ చేసాడు.మా కజిన్ రాకపోవడంతో నా పక్క సీట్ ఖాళీగా ఉంది.
సర్ సీట్ ఖాళీగా ఉంచండి సర్ పాసెంజర్ వస్తారు అని చెప్పాడు. అదెట్లా నేను సీట్ కాన్సిల్ చేయలేదు కదా నేను ఇవ్వను అన్నాను.. ప్లీజ్ సర్ ఒక అమ్మాయి పాపం ఒక్కతే ఉంది... సర్ అనగానే లోపలికి ఒక అమ్మాయి తొంగి చూస్తూ ఉంది.
చక్కటి ముఖంతో, కళ్ళల్లో చంద్ర కాంతులు నింపుకొని, చెక్కిలిపై వెన్నెల వసంతాలు పూయిస్తూ, చిరు చెమటను తుడుచుకుంటూ, బయటకు కనబడని టెన్షన్ పడుతూ చూడడానికి బాపు గీచిన బొమ్మలా, కదులుతూ ఉంటే అజంతా శిల్పంలా ఒక చేత్తో బ్యాగును, ఇంకో చేత్తో సెల్ ఫోను ను పట్టుకొని నా వైపు ,
బాయ్ వైపు దీనంగా చూస్తూ ఆ సీట్ వంక ఆశగా వస్తున్న ఆమెను చూడగానే నా గుండె కొద్దిగా కిందకు చేజారింది.
అబ్బా ఈ అమ్మాయి అయితే బాగుండు అనుకుంటూ వెనుక ఏమైనా ఖాళీలు ఉన్నాయా అని
అనుమానంగా చూడబోతుండగా..... సర్ ఈ అమ్మాయే సర్.. కొంచెం కూర్చోడానికి అవకాశం ఇవ్వండి అని అడిగాడు కొంచెం పద్దతిగా..
మనసులోని ఆలోచనలను బయటకు రానీయకుండా ఏదో దేశసేవ చేస్తున్నట్లు ఫోజు ఇచ్చి సరేలే కూర్చోండి అన్నట్లుగా సీట్ జరిగాను..
అతడు ఆ అమ్మాయికి కూర్చోమని వెనుకకు వెళ్ళాడు. ఏసీ లోంచి గాలి నెమ్మదిగా తగులుతుంది..
ఆ అమ్మాయి థాంక్స్ సర్ అని చెప్పి తన లగేజీని పైన పెట్టాలని ఎత్తి లోపలి నెట్ట బొతుంటే,నేను సహాయం చేద్దామని పైకి లేవడం గతుకుల రోడ్డు మీద బస్ ఇచ్చిన జర్కుకు ఒక్కసారిగా తను నా వైపుకి బలంగా వొంగడం నా ముఖం వేగంగా తన హృదయాన్ని డీకొట్టడం , మదిలో వేల వేల విధ్యుత్ తరంగాలు పుట్టడం, పట్టు తప్పి ఆ అమ్మాయి పడి పోతుంటే అలా కుర్చీలోంచే ఆ అమ్మాయి నడుమును గట్టిగా పట్టుకోవడం ఒక్కసారిగా జరిగిపోయింది.
అంతా సంబ్రమం... అప్పటివరకు చివరి నిమిషంలో చేయిచ్చిన తన పిన్ని కూతురు రాధ హ్యాండ్ ఇవ్వడంతో ప్రయాణం బోర్ అని తిట్టని తిట్టు తిట్టకుండా ఉన్నాడో, ఒక్కసారిగా ఆ అమ్మాయి వచ్చి పక్కన కూర్చోగానే మొత్తం మర్చిపోయాను.
ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది, వెనుకకు పోయిన పిల్లవాడు అందరినీ చెక్ చేసుకొని బయటకు పోతుంటే పిలిచి మరీ రెండు వందలు ఇచ్చింది.వాడు సంతోషంగా ఒక నవ్వు నవ్వేసి డోర్ కర్టెన్ వేసేసి తలుపు వేసేసి వెళ్ళిపోయాడు.
"మీ పేరు..." అని నెమ్మదిగా అడిగింది.
"రా...జే...ష్..." అని ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి మరీ పలికాను.
" మరి మీ పేరు?" అని అడిగాను .
"లావణ్య" అని స్థిరంగా చెప్పింది.
బస్సు నెమ్మదిగా పోతుంది. ఊరు లోంచి హైవే ఎక్కినట్టుంది.. రివ్వున దూసుకెల్తుంది.
కొంచెం కిటికీ డోరు తెరిచాను. చల్లగాలికి ఆ అమ్మాయి కురులు కొద్ది కొద్దిగా ఊగుతూ ముఖం మీద
పడుతున్నాయి. సెల్ తీసి వాట్స్ అప్ ఓపెన్ చేసింది. తన వాళ్లకు సేఫ్టీ మెస్సేజ్ పెట్టేసి వారి ఫ్రెండ్స్ తోటి చాటింగ్ మొదలెట్టింది.
ఛీ...ఛీ... వెదవ సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో కానీ మనుషులకు కనీసం కామన్సెన్స్ లేకుండా ఉంది . పక్కన ఇంత అందగాడు ఉన్నాడే, వాడితోటి కొంచెం టైం స్పెండ్ చేద్దామే అనే స్పృహ కూడా ఈ కాలపు అమ్మాయిలలో కలగడం లేదు అని అనుకుంటూ చుట్టూ చూసాడు. అందరు ఎవరు సెల్ ఫోనులో వారు మునిగి పోయారు. చేసేదేమీ లేక చిన్నగా నిట్టూరుస్తూ కళ్ళు మూసి పడుకున్నాడు.నిద్ర పట్టడం లేదు ఆలోచనల ఉదృతి ముంచుకొస్తుంది. చదువు అయిపోయి రెండేళ్ళు, ఉద్యోగం వచ్చి మూడేళ్ళు, ఐదంకెల గరిష్ట జీతం, పెళ్లి వయసు అయిపోతుంది ఏ వయసు ముచ్చట ఆ వయసులో పూర్తి చేసుకోవాలి అని నాయనమ్మ,
ఎప్పుడురా నీ పెళ్లి... పెళ్లి... అని అందరూ ఒకటే సతాయిస్తున్నారు. కానీ ఇంతవరకు మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితేనే కదా... కళ్ళు మూసుకున్నాను అనే కానీ ఆ అమ్మాయే మదిలో తలపులకొస్తుంది. అక్కడికి తన చెల్లెలు రాధ ఎప్పుడూ చెబుతుంది 'మా ఫ్రెండ్ ఉందిరా చేసుకో భలే బాగుంటుంది' అని. కానీ ప్రమోషన్ వేటలో, ఉద్యోగ బరువుల నేపధ్యంలో ఎప్పుడూ పెళ్లి మాట ఎత్తేవాడు కాదు. తను కూడా పెద్దగా పట్టించు కునేది కాదు.తనని ఎప్పుడైనా చూడాలని అనిపించినా ఎక్కడ తనను తక్కువ చేస్తుందో అని భయపడి అంతటితో ఆపేవాడిని.
**************************************
ఏమండీ కొద్దిగా తీసుకుంటారా అన్న పిలుపుతో కళ్ళు తెరిచి చూసాను..సన్న కారప్పూసా, అరిసెలు ఒక పేపరులో పెట్టి నాకు ఇవ్వబోయింది. ఈ అమ్మాయికి ఎలా తెలుసు అవి నాకిష్టమని... అనుకుంటూ
"లేదండి ,మీరు తినండి.. నేను ఇప్పుడే తినేసాను "అన్నాను.
"పరవాలేదులే తీసుకోండి సార్.." అన్నది చనువుగా కొద్దిగా ముందుకు నెడుతూ ..
బస్ జర్కుకి కారప్పూస కొద్దిగా ఎగిరి నా తల మీద పడింది..
"అయ్యో సారీ అండీ..." అని చెబుతూ ఆ పేపరును బలవంతంగా నా చేతులని లాగి అందులో పెట్టేసి, కొద్దిగా పైకి లేచి నా తల మీద పడ్డ వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటి ఏరుతుంది...
నేను కొద్దిగా అటు వైపు మళ్ళాను... తను బాగా భయపడి నట్టుంది నేను ఏమి అనుకుంటానో నని ... తన ఉచ్వాస నిచ్వాసలు నా ముఖానికి బలంగా తాకుతున్నాయి.
నాలో ఏదో మైకం కమ్మినట్లుగా అలాగే కళ్ళు మూసుకున్నాను.
బస్సు కి ఏదో అడ్డం వచ్చినట్టుంది సడెన్గా బ్రేక్ వేసాడు
అసనాటుగా నిలబడిన తను ఒక్కసారిగా ఆ దెబ్బకు భయపడి నా తలను గట్టిగ పట్టుకొని ముందుకు తూలబోయి సీటుకు అడ్డంగా బలంగా తాకింది. నేను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి తన భుజాలను గట్టిగా పట్టుకొని కింద పడబోయే తనను గట్టిగాఆపి, కింద నుండి నా కాళ్ళను పైకి లేపి తనను ఆపాను. ఇప్పుడు తను దాదాపు నా మీద పడుకున్నట్టుగా ఉంది.
ఎందుకో బరువు అనిపించలేదు..హాయిగా అనిపించింది.. ఎక్కడో శరీరం చిన్నగా కంపించింది.
తనకు పట్టులేక మెల్లిగా జారిపడబోతుంది... అప్పటిదాకా నా ముందు సీటు మీద బలంగా ఆనించి పట్టుకున్న నేను... పట్టుకోసం కింద పడబోతున్న తన వెనుక సీటు మీద చేయి వేసి బలంగా నా మీదకు గుంజుకున్నాను.. నా చేతులు తన శరీరం మీద ఎక్కడెక్కడో.... తనకు అదో రకంగా అనిపించినట్లనిపించింది.. నాకు కూడా ఎదో ఎదో జరిగిపోతుంది మదిలో...హృదిలో...
వెంటనే తనకు లేచే అవకాశం ఇస్తూ నా చేతులను కొద్దిగా బిగి సడలించాను... ఈ లోపు నా చేతులలో ఉన్న కారప్పూస ఎపుడో కింద పడిపోయింది. తను కొద్దిగా సిగ్గుపడుతూ లేచి పక్కకు జరిగిన తన డ్రస్సును సరిచేసుకుంది మెల్లిగా నా వైపుకు ఒంగి... ప్రాణం ఎక్కడో గాలిలో ఊగిసలాడుతున్నట్లు అనిపించింది..
తనకోసం ఉంచిన ప్లేటును నాకియ్యబోయింది..
"మీరు కూడా తినండి" అని నేను కొద్దిగా తీసుకున్నాను.
చిన్నగా ఇద్దరి మధ్య మాటలు కలిసాయి.
కొద్దిసేపు అలా ఇలా మాట్లాడేసరికి రాత్రి తొమ్మిది అయింది.
గుంటూరు దాటి అరగంట ప్రయాణం అయింది.. ఒక పెద్ద ధాబా హోటల్ ముందర బస్సు ఆగింది..
"రండి భోజనం చేద్దాం" అని అంటే "లేదండి నాకు ఆకలిగా లేదు" అని చెప్పింది..
"పరవాలేదులే ఆకలి అయినంత వరకే తినండి" అని చెప్పాను..
"లేదు మీరు తినండి" అని చెప్పింది.. సరే బలవంతం చేయడం బాగుండదు అని చెప్పి వెళ్ళ బోయాను..
తను ఎందుకో ఇబ్బందిగా ఉంది.. "పోనీ కాఫీ ఏమైనా తెమ్మంటారా" అని అడిగాను..
"నాకేమి వద్దండి.." అని చెప్పింది కానీ ఎందుకో నాకు 'కొద్దిగా ఇబ్బంది పడుతుంది' అనిపించింది ..
కిందికి వస్తుంటే కొందరు అటుపక్కగా బాత్ రూమ్ నుండి వస్తున్నారు.. కొంచెం ఆలోచించి పైకి ఎక్కాను.. చెప్పాలా వద్దా అని,
తను సెల్ ఫోనులో మాట్లాడుతుంది.. సరే నాకెందుకు అని నేను పోయి ఒక ప్లేటు ఇడ్లీ తిని వేడివేడిగా కాఫీ తాగి తనకు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని వచ్చేసాను.
నేను వచ్చేసరికి అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.. నెక్స్ట్ స్టాప్ నెల్లూరు అని ఇప్పుడు పడుకుంటే ఒక నాలుగు గంటలు హాయిగా పడుకోవచ్చునని..
నేను బయట ఉన్నాను.. తను లోపల కూర్చుంది..
ఈ మాట వినగానే తన గుండెలో రాయి పడినట్టుంది..
మెల్లిగా లేచి బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది...
నన్ను చూడగానే తనకు ప్రాణం లేచి వచ్చినట్టుంది..
"కొంచెం తోడు వస్తారా" అని అడిగింది..
"పదండి" అని అనుసరించాను..
మెల్లిగా సిగ్గుపడుతూ బాత్ రూమ్ ల వైపు తీసుకెళ్ళింది..
"ఒక్క నిమిషం తోడుండండి అందరూ మగవాళ్ళే ఉన్నారు..." అని అంది..
"ఓహ్ ఇబ్బందేమీ లేదండి... మీ పని నిదానంగా చూసుకొని రండి" అని చెప్పి పంపేసాను.. తను మెల్లిగా నవ్వుతూ ఒకింత సిగ్గుపడుతూ లోపలికి వెళ్లి వచ్చింది..
అక్కడ నుండి వస్తుంటే మసాల దోశ వాసన ముక్కు పుటాలకు అదిరింది..
తనే ఏమండీ దోశ తిందామా ఆకలవుతుంది అని అడిగే సరికి , ఇంతకూ ముందు నాకు తినాలని
ఉన్నా తను తినకుండా తినబుద్ది కాలేక కేవలం రెండు ఇడ్లీ తిని బయట కొచ్చాను..
వెంటనే పరిగెత్తుకెళ్ళి రెండు మసాల దోశలు తీసుకొచ్చి కొంచెం దూరంగా ఇద్దరమే నిలబడి గబగబా లాగించేసి, వేడి వేడి కాఫీ లు రెండు తెచ్చి చెరోకటి ఇచ్చాను... కాఫీ తాగుతూ తనను ఒరకంటగా గమనిస్తుంటే...ఎందుకో అదోలా అనిపించింది.. మంచి ఫిజిక్... అందుకు తగ్గ ఎత్తు.. చక్కటి నవ్వు ముఖం... నవ్వుతుంటే సొట్ట పడే బుగ్గ.... విశాలమైన కళ్ళు.... అప్పుడప్పుడు టపటప లాడిస్తూ... చాల బాగుంది ఎవరో ఆ అదృష్ట వంతుడు అనిపించింది.. ఇన్ని రోజులు ఇటువంటి అమ్మాయి ఎందుకు కనబడలేదా అని బాధ పడ్డాను.
***************************
ఇప్పుడు తన మనసు శరీరం ప్రశాంతంగా ఉనట్టు అనిపించింది..
ఇంతకు ముందు కడుపులో గడబిడగా ఉండే సరికి పాపం చిరాకు అనిపించినట్లుంది.
ఇప్పుడు హాయిగా ఉండబట్టి కడుపు నిండా తిని హాయిగా కాఫీ తాగింది. తను బస్సు ఎక్కుతుంది.. తను అలా ఎక్కుతుంటే వెనుక నుండి తననే గమనిస్తున్నాను.. సడన్గా ఎందుకో వెనకకు మళ్ళింది... నా చూపుల తాకిడికి తట్టుకోలేకనో ఏమో.... నేను అడ్డంగా దొరికిపోయాను.. కానీ నన్ను నేను కవర్ చేసుకున్నాను.. కొంత ఖంగారు పడ్డా...
**************
తను సంతోషంగా బస్సు ఎక్కి కూర్చుంది... మెల్లిగా బస్సు కదిలింది... వాడు ఏదో సినిమా పెట్టినట్టున్నాడు...చూస్తే ..గీతా గోవిందం సినిమా ఆసక్తిగా మొదలయింది... జోరుగా కదులుతుంది... లైట్లనీ తీసేసాడు.. సినిమా చూస్తూ చూస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ హాయిగా గడచి పోతుంది...
ఇంతలో నాకు ఆ సీన్ గుర్తుకు వచ్చింది... వెంటనే ఇబ్బందిగా అనిపించి కళ్ళు మూసుకున్నాను.. ఒక్కో సీన్ గడుస్తుంది..
తను ఆసక్తిగా చూస్తూ నవ్వుతుంది..నాకు అన్నీ వినబడుతున్నాయి...
ఇంతలో హీరోయిన్ హీరోను బాత్ రూమ్ కి తోడు రమ్మని అడుగుతుంది.. నాకు గుండె కిందకు జారుతుంది.. అతడి స్నేహితుడు బాత్ రూమ్ లోంచి నవ్వుతూ వస్తే నిన్ను లవ్వు చేస్తున్నట్టు అని చెబుతాడు.. ఈమె ఆ సీన్ చూసి సిగ్గు పడి ఇబ్బంది పడుతుందా క్యాజువల్ గా ఉంటుందా అనిపించి మెల్లిగా తల అటువైపు తిప్పి , కొద్దిగా కళ్ళు తెరిచి చూసాను.. తను ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా చక్కగా సినిమా ఎంజాయ్ చేస్తూ కనిపించింది...
కొద్దిగా బాదేసింది.. తను నన్ను ఏమని ఫీల్ కావడం లేదు.. ఇంకా నయం ఆ హీరో లాగా ముద్ద పెట్టుకోవాలి అని ట్రై చేయలేదు.. లాగి చెంపకాయ కొట్టేదేమో అని అనుకుంటూ మెల్లిగా నిద్ర లోకి జారుకున్నాను... చాలా సేపటికి కొద్దిగా మెలుకువ వచ్చేసరికి తను నా భుజమ్మీద వాల్చి, ఒక చేతిని నా మీద వేసుకొని హాయిగా పడుకుంది.. ఇంక నాకు నిద్ర పట్టలేదు...
తనకు ఇబ్బంది పడకుండా , తెల్లవార్లు జాగ్రత్తగా కాపలా కాసి తన తల కిందకు జారినప్పుడల్లా
కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ ఎంతో సంతోషంలో మునిగి పోయాను.. అలా ఉండీ ఉండి ఎప్పుడో నాకు తెలీకుండానే కళ్ళు మూతలు పడ్డాయి..
*****************************************
తెల్లవారింది.. బస్సు ఆగింది... నేను నిద్ర లేచి చూస్తే తను బస్సులో లేదు.. కొద్దిసేపు తన కొరకు ఎదురు చూసి,చుట్టూ పక్కలంతా వెదికి తను దిగిపోయిందని నిర్దారణకు వచ్చేసాకా, నిరాశగా ఒకింత దిగాలుగా దిగాను.. మెల్లిగా ఇంటికి చేరి ఆఫీసుకు చేరాను.. ఇలా రెండు రోజులు గడిచాయి.
ఇంతలో మా కజిన్ రాధ రావడం ,తనతో ఆ అమ్మాయి గురించి చెప్పడం సరే జరిగిందేదో జరిగింది... అని సర్ది చెప్పడం అయినా ఎక్కడో బాధ... తను కనబడక పోయేసరికి ఒకటే ఆలోచన... దానికి తోడు నన్ను రాధ వదిలి పెట్టేది కాదు.. "అంత బాగుంటుందా... అంత బాగా మాట్లాడిందా" అని ఎన్నో అర్థం కాని ప్రశ్నలు రాను రాను తనను చూడాలనే ఆలోచనలు ఎక్కువయ్యాయి... తను ఒక్కసారి కనబడితే బాగుండును అనిపించింది..
కానీ ఏమి లాభం.. ఇంత పెద్ద మహానగరంలో అటువంటి చాన్స్ వచ్చే అవకాశం లేదని తెలుసు... కనీసం ఆరోజు తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు... అడిగినా నన్ను దాటేసింది.. చెప్పడం ఇష్టం లేకనో ఏమో.. నిజంగా ఆమె తలపులతో.... రాధ అడిగే పిచ్చి ప్రశ్నలతో తన మీద అభిమానము ఇంకా ఇంకా పెరిగింది... తన ఆలోచనలతో నాకు పిచ్చి పడుతుందేమో అనిపించేది ఒక్కోసారి.. రోజులు భారంగా గడిచిపోతున్నాయి...
***********************
ఒకరోజు నేను, రాధను ఆఫీసు దగ్గర దించేసి వస్తుంటే అంత దూరంలో అవతల రోడ్డులో సడన్గా ఎదురు పడింది... సరిగ్గా ఆరోజు వేసుకున్న డ్రస్సులోనే... సంతోషంగా బండిని ఒక పక్కకు ఆపి తనను వెంబడించాను... తను క్యాంటీన్ లోకి వెళుతున్నట్టుంది... ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ... నన్ను గమనించలేదు అసలు...
బహుశా తన స్నేహితులు ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ అని అనుకున్నాను.. ఎవరినో కలవాలని ఆత్రంగా వెళుతుంది.. నేను గమనిస్తున్నట్టు తెలియదు..
ఈలోపు నేను తనను రాధకు చూపించాలని ఫోను చేస్తుంటే బిజీ అని వస్తుంది...
నేను తనను గమనిస్తూ వెనకే వెళ్లాను... తను క్యాంటీన్ లోపలికి వెళ్ళింది...
వెళ్లి పలకరిద్దామని అలా చూసే లోపు వెళ్లి అక్కడ ఎదురుగా వెళ్లి కూర్చుంది.. ఇద్దరూ చాలా క్లోజుగా మాట్లాడుకుంటున్నారు.. చాలా రోజుల నుంచి పరిచయం అన్నమాట... తను అడ్డంగా ఉండడం వల్ల అవతల వ్యక్తి ఎవరో తెలియలేదు.. కొద్దిగా పక్కకు జరిగి చూస్తే తెలిసింది.. తనతో మాట్లాడేది ఎవరో కాదు నా చెల్లెలు రాధే... బాగా కోపం వచ్చింది.. కోపంగా వెళ్లి ఎదురుగా నిలబడే సరికి ఇద్దరూ తల వంచు కున్నారు.. రాధ ను బాగా తిట్టేసి బయటకు వస్తుంటే..
'కూల్ కూల్' అని నన్ను సర్ది చెప్పింది... అక్కడ లాన్ లోకి వెళ్ళాము..
"అయితే ఇప్పుడు ఏమంటావ్... బాగా నచ్చింది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా..."అని
అడిగింది... నా కోపం అంతా ఒక్కసారిగా తగ్గింది.. తన వైపు చూశా.
తను సిగ్గుతో తల వొంచుకుంది..
"అమ్మ దొంగా" అని రాధ చెవి పట్టు కున్నాను... చిరు కోపంతో...
"మరేమి చేయమంటావు... నీవు పెళ్లి అంటే ఏవో కథలు చెబుతున్నావు..
మరి నీ లాంటి వాడిని ముగ్గు లోకి దించాలంటే ఏదో ఒకటి చేయాలి కదా...
ఇది నా చిన్నప్పటి ఫ్రెండ్.. మా ఊరే... నీకు జోడీగా ఉంటుందని అలా చేసాను...
ఇప్పటికీ నాయనమ్మకు ఏమి డోకా లేదు.... దుక్కలా ఉంది.." అని ఫక్కున నవ్వుతూ..
"ఆ రోజు నా ప్రయాణం క్యాన్సిల్ కావడం దగ్గర నుంచి, ఈ రోజు కలవడం వరకు అంతా ఈ నాటకంలో ఒక భాగమే" అని నవ్వుతూ అన్నది రాధ...
"అయితే అంతా మోసం, నన్ను అమాయకుడిని చేసి ఆడుకున్నారు..." అని రాధ వైపు మళ్ళి "నన్ను అక్కడికి తోడు తీసుకుపోవడం కూడా డ్రామానే అన్నమాట..."అని మెల్లిగా అన్నాను...
"లేదు అక్కడ కొన్ని మాత్రం నిజం..." అని నాకు మాత్రమే వినబడేలా చెప్పింది..
"అమ్మదొంగా! అయితే నీవు కూడా సహజ నటివే నన్నమాట" అని నవ్వుతూ...లావణ్యను దగ్గరగా తీసుకున్నాను..
"అయ్యో సెన్సార్ .... చిన్న పిల్ల ఉంది ఇక్కడ" అని కసుక్కున నవ్వింది రాధ... కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుంటూ...తమాషాగా ...
"సరే పెళ్లి అవని ముందు ,తర్వాత నీ సంగతి చెబుతా" అని తనను బెదిరిస్తూ ....వెంటనే రాధ చేయి పట్టుకున్నాను..పారిపోకుండా...
"ఆడపడుచు లాంచనాలు భారీగా ఇస్తేనే పెళ్లి.... లేదంటే లేదు" అని ఇద్దరినీ ఒక పక్కకు తోసింది తన చేతులతో...
'పెళ్లి ఆలోచనే లేని నేను, తనని ముఖా ముఖి చూస్తే వద్దంటానని, నాలో ప్రేమ ప్రకంపనలు కలుగ జేసేలా బస్సు జర్నీ ప్లాన్ చేసి మొత్తానికి ఒక చక్కని చుక్కతో నన్నో ఇంటివాడిని చేసింది' అని అనుకుంటూ... మనసులోనే కృతఙ్ఞతలు తెలియజేస్తూ....
తన గురించి కూడా ఆలోచిస్తూ..
"కొన్ని రోజులాగి నీకు ముకుతాడు వేసే మొనగాడిని పట్టుకొచ్చి అప్పుడు చేసుకుందాం ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి" అన్నాను.. రాధను దగ్గరగా తీసుకుంటూ...
********************************
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
కధనం లో చిలిపి తనం చాల చక్కగా మేళవించారు. కధా గమనం, భాష, పొందికగా వుంది.