'Kulantara Prema' written by Surekha Yanamadala
రచన : సురేఖ యనమదల
అందమైన గోదారి ఒడ్డున వున్న ఒక పల్లెటూరు. రావుగారి ఇంటి ముందు పెళ్లి సన్నాయి మోగుతోంది. ఇల్లంతా సందడిగా వుంది. రావు గారికి ఒక అబ్బాయ్, ఒక అమ్మాయి. అబ్బాయ్ పెళ్లి మంగళస్నానం తంతు జరుగుతుంది.ఇంత ఆనందంలో రావు గారి మొహంలో ఏదో చింత. దానికి కారణం వారి అమ్మాయే.తన పేరు స్వప్న.ఎంతో అందమైన, తెలివైన, చదువుకున్న అమ్మాయి. చిన్నప్పటి నుండి ఊరు వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు. డిగ్రీ పూర్తి చేసింది. తనకు ఇంకా చదువుకోవాలని వుండడంతో, పి.జి సీట్ కోసం అప్లై చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ లో స్వప్నకు సీట్ వచ్చింది. ఇంట్లో ఎంతో కష్టపడి ఒప్పించి వైజాగ్ హాస్టల్ లో జాయిన్ అయ్యింది.
అక్కడే తన జీవితం మలుపు తిరుగుతుందని ఊహించలేదు. తన రూంమేట్ అంజలి. కొద్దికాలంలోనే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అంజలిని చూసేందుకు ఒకరోజు వాళ్ళ అన్నయ్య శివ వచ్చాడు. అప్పుడే మొదటిసారి స్వప్న,శివను చూసింది. మొదటి చూపులోనే ఇద్దరికీ ఏదో తెలియని ఒక ఫీలింగ్. దసరా సెలవులు రావడంతో అంజలి ఇంటికి వెళ్లేందుకు బట్టలు సర్దుకొంది. కానీ స్వప్న ఆలోచిస్తుంది. ఇంట్లో ఎపుడు కొట్టుకుంటూ వుండే తల్లితండ్రులను తలుచుకుని ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఆ విషయం అంజలికి చెప్తుంది. అంజలి తనతోపాటు రమ్మంటోంది. స్వప్న, అంజలి ఇంటికి వెళ్తుంది. అక్కడే శివ మీద ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ ఆ ప్రేమను చెప్పలేక తిరిగి హాస్టల్ కి వచ్చేసింది. తను వెళ్లిన తర్వాతగానీ శివ కి తెలియలేదు. స్వప్న అంటే తనకు కూడాఎంత ఇష్టమో. శివ ఇంజనీరింగ్ చదివి జాబ్ కోసం వెతుకుతున్నాడు. జాబ్ దొరికాక తన ప్రేమ గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు వాళ్ళ ప్రేమను మనసులో నే దాచుకుని రెండు సంవత్సరాలు గడిపేశారు. స్వప్న పి.జి ఆఖరి పరీక్ష వ్రాసి రూం కి వచ్చేసింది.
ఏంచేయాలో అర్ధంకాక చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తన ప్రేమ విషయం శివతో చెప్పాలని. ఆ రోజంతా నిద్రపోకుండా గడిపేసింది. తెల్లారింది. అంజలిని తీసుకెళ్లడానికి, స్వప్న అనుకున్నట్టే శివ వచ్చాడు. అంజలి తన క్లాస్మేట్స్ అందరికీ చెప్పి వస్తానని అన్నతో చెప్పి బయటకు వెళ్ళింది. ఇదే అవకాశం కోసం ఎదురుచూస్తున్న స్వప్న, శివతో మాటలు కలిపింది. చివరకు ధైర్యం, చేసి ఐ లవ్ యు చెప్పింది. శివ ఒక్కసారిగా షాక్ అయి, తేరుకుని తన మనసులో వున్న ప్రేమ విషయం చెప్తాడు. ఇద్దరు ఒకరికొకరు ఫోన్ నంబర్ తీస్కుంటారు. అంతలో అంజలి రావడం తో ఏమి తెలియనట్టు ప్రవర్తిస్తారు. స్వప్న ఇంటికి తిరిగి వచ్చేస్తుంది.అప్పటి నుండి ఫోన్ వారిద్దరి ప్రపంచం. ఒకరికొకరు అర్దం చేసుకున్నారు. కానీ ఈ విషయం పెద్దలకు చెప్పాలంటే భయం. కారణం కులాలు వేరు.తన తల్లితండ్రులు ఒప్పుకోరు . అలాగని స్వప్న లేచిపోయి, పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు. స్వప్న కి తన తండ్రి అంటే ఎంతో ప్రేమ. తను వెళ్లిపోతే తన తండ్రి ఏంచేస్కుంటాడో అన్న భయం వెంటాడుతుంది. ఎలాగైనా ఇంట్లో ఒప్పించి పెళ్ళిచేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుండి ఇద్దరు ఎవరింట్లో వాళ్ళు, తన వాళ్ళను ఒప్పించే ప్రయత్నం లో నిమగ్నమయ్యారు.
శివ ఇంట్లో అంజలికి పెళ్లి చేశారు. శివ బిజినెస్ స్టార్ట్ చేసి కారు కూడా కొన్నాడు. తన ప్రేమ విషయం నెమ్మదిగా ఇంట్లో చెప్పాడు. శివ తండ్రి ఆ వూర్లో పొలిటికల్ లీడర్. తన పరువు పోతుందని, కుదరదని చెప్పారు. కానీ శివ ఒప్పించే చేసుకుంటానని ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ఇక స్వప్న ఇంట్లో కూడా తన ప్రేమ విషయం తెలిసిపోయింది. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఏదో ఒక వంకతో స్వప్న ఒప్పుకోకుండా దాటేయడంతో, ఇంట్లో వాళ్ళు నిలదీయడంతో విషయం చెప్పేసింది.ఇక అప్పటి నుండి తన అసలు పోరాటం మొదలయింది. స్వప్న తల్లితండ్రులను మార్చడానికి చూస్తుంటే,వాళ్ళు స్వప్న ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతకాలు, పూజలు అంటూ తనకు ఇష్టం లేకపోయినా అన్ని తనతో చేయిస్తున్నారు. చివరకు బెదిరించడం మొదలెట్టారు. స్వప్న అన్ని సహిస్తూ వస్తుంది. దానికి కారణం కేవలం తన తండ్రి మీద ప్రేమ.
చివరకు స్వప్న అన్నయ్య కూడా, కులాంతర వివాహం చేసుకుంటే తర్వాత నాకు పెళ్ళి కాదు అంటూ గొడవ చేసేవాడు. ఐతే ఈ సమయంలో అనుకోకుండా రావుగారి అబ్బాయికి పెళ్లి కుదిరింది. వయసుకు వచ్చిన అమ్మాయికి చేయకుండా కొడుకు కి చేస్తున్నారే అని అడిగినవారికి ఏం చెప్పాలో తెలియక, మాట మార్చేస్తున్నారు. అందుకే రావుగారి మనసులో బాధ, మొహంలో కనిపిస్తుంది. స్వప్న మాత్రం అన్నయ్య పెళ్లి కుదిరినందుకు చాలా సంతోషంగా వుంది. దగ్గరుండి అన్ని పనులు తానే స్వయంగా చేసింది. ఇక తన పెళ్ళికి అన్నయ్య సపోర్ట్ చేస్తాడని ఆశ. పెళ్లి పూర్తయ్యింది. మళ్లీ ఇంట్లో మామూలే. తన ఫోన్ కూడా తీసేసుకున్నారు. స్వప్న కు ఏంచేయాలో తెలియలేదు. అన్నయ్యను బ్రతిమాలి ఇంట్లో ఒప్పించమంది. అన్నయ్య నమ్మించి తన మామగారిని తీస్కుని శివ ఇంటికి వెళ్ళాడు.
మా చెల్లి శివను తప్ప ఎవర్ని చేసుకోను అంటుందని, ఇపుడే మా మాట వినట్లేదు, రేపు మీ మాట వింటుందా అంటూ మరింత రెచ్చగొట్టి వచ్చేశాడు. స్వప్న గురించి తెలిసిన వాళ్ళ నాన్న, శివ గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాడు. శివ మంచివాడని. ఆ విషయం డైరెక్టుగా స్వప్న తో చెప్పి ,కానీ మన కులం వేరు ఇదంతా వద్దు అని గట్టిగ చెప్పారు. కేవలం కులం కారణంగా వీళ్ళ ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళటలేదు. శివ ఇంట్లో కూడా అదే కారణం. స్వప్న అంటే అందరికీ ఇష్టమే. కానీ కోడలుగా ఒప్పుకోవటం లేదు. అందరిలా లేచిపోయి పెళ్లి చేసుకోకుండా తల్లితండ్రులు గురించి ఆలోచించే వీరి ప్రేమ నేటి తరానికి ఆదర్శం. పిరికితనం తో ఆత్మహత్య చేసుకునేంత మెచ్యూరిటీ లేని వాళ్ళు కాదు. మరి వీరి ప్రేమను పెద్దలు అంగీకరిస్తారా? అంటూ వీళ్ళ ప్రేమ గురించి తెలిసిన స్నేహితులు అంతా ఎదురుచూస్తున్నారు.
అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. స్వప్న ఇంట్లో రావుగారు, వాళ్ళ అమ్మాయిని మార్చడానికి చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యి, చివరికి రావుగారు స్వప్నను అర్ధంచేసుకుని శివ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అడిగితే, పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు.ఇక శివ ఇంట్లో ప్రతిరోజూ ఈ విషయంగా గొడవలు ,మాటలు జరుగుతూనే వున్నాయి. శివ ఇక ఇంట్లో వాళ్లకు వాళ్ళ నాన్న ఫ్రెండ్ ద్వారా నచ్చచెప్పే ప్రయత్నం చేసి, కొంతవరకు ఒప్పించాడు. ఐతే ముందుకు రావట్లేదు. శివ ఇక 3 రోజుల్లో ఒప్పుకోకపోతే ,స్వప్న ను తీస్కెల్లి పెళ్లి చేసేస్కుంటా అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అపుడు ఇంట్లో అందరికీ కంగారు మొదలయింది. చివరికి అంతా కలిసి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. తర్వాత స్వప్న ఇంటికి వెళ్ళి మాట్లాడి, ముహూర్తం నిర్ణయించారు. స్వప్న,శివ ల ప్రేమ చివరకు సుఖాంతమైంది....
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం :
నా పేరు సురేఖ యనమదల.నాకు కథలు చదవటం ,చెప్పటం చాలా ఇష్టం.మొదటిసారి నేను ఈ కథ వ్రాశాను.అందరూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
బాగుంది sir
నేటి యువతకు చక్కని సందేశం
లేచిపొకండ పెద్దలను ఒప్పించి
పెళ్లి చేసుకోవడం బాగుంది