Kurimi Kalavaranta Kodukulenura Written By Thangirala Mira Subramanyam రచన : డా.తంగిరాల.మీరాసుబహ్మణ్యం.
అమ్మా! పాలు" అంటూ కేక పెట్టాడు సాయన్న. గిన్నె పట్టుకుని బయటకు వచ్చింది కనకమ్మ. డైరీ పాలు వచ్చాక చాలామంది పేకెట్ పాలు కొనుక్కుంటున్నా కనకమ్మ మాత్రం కొన్నేళ్లుగా సాయన్న ఇంటి దగ్గర పిండి తెచ్చిన పాలే పోయించుకుంటుంది.
“ సాయన్నా! సాయంత్రం అర్థ లీటరు పాలు ఎక్కువ తీసుకురా" గిన్నెలో పాలు పోయించుకుని లోపలికి వెడుతూ ఎదో గుర్తు వచ్చినట్టు వెనక్కి తిరిగి సాయన్నకు చెప్పింది కనకమ్మ.
"అట్లాగేనమ్మా" అన్న సాయన్న ఒక నిముషం కనకమ్మ ముఖంలోకి పరీక్షగా చూసాడు.
" రాధమ్మ గానీ, రఘుబాబు గానీ వస్తున్నారామ్మా?" కూరగాయలు ఏమన్నా తేవాల్నా అమ్మా?" పాల క్యాన్ సైకిలుకు తగిలిస్తూ అడిగాడు.
"అవునురా. ఆరు నెలలు అయిందిగా వచ్చి. అమ్మను చూసిపోదామని అనిపించిందేమో. సాయంత్రం బస్ కి దిగుతూంది" అంది ఆవిడ.
“ ఒక్క నిముషం" అంటూ లోపలికి వెళ్ళి చేతిలో నోట్ల కట్టతో వచ్చింది " సాయన్నా! ఇదిగో నీ దగ్గర వుంచు" అంటూ నోట్ల కట్ట అందించింది కనకమ్మ.
" అమ్మా! నాదగ్గర ఇంత డబ్బు !" సాయన్న అర్థం కానట్టు చూసాడు.
" నీ దగ్గరైతే భద్రంగా వుంటుంది.మళ్ళీ నాకు అవసరం అయినప్పుడు తెచ్చి ఇవ్వు." అందామె.
“ అంత డబ్బు తన చేతికిచ్చి దాచమనడం ఎందుకో అర్థంకాలేదు అతనికి. అయ్య బతికున్న రోజుల్లో ఈయమ్మ ముఖం ఎంత కళకళ లాడుతూ వుండేది?" అని నిట్టూరుస్తూ సాగిపోయాడు సాయన్న.
సాయన్న వెళ్ళిపోయాక లోపలికి వచ్చి, పాలు కాగుతుంటే చూస్తూ కూర్చుంది కనకమ్మ.
కూతురు తనను చూడడానికి వస్తోందన్న సంతోషం ఆమె ముఖంలో కనబడడం లేదు.గుండెల్లో గూడుకట్టుకున్న దిగులేదో కళ్ళలో ముసురుకుంది.
కనకమ్మ భర్త రామలింగం విద్యుత్ శాఖలో పనిచెసేవాడు. వాళ్ళకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు రఘుబాబు డిగ్రీ పూర్తి చేసి మడకసిరలో ఒక సహకార బేంక్ లో పనిచేస్తున్నాడు.
కూతురు రాధకు చదువు అబ్బలేదు. పదో తరగతి పూర్తి చేయలేక వదిలేసింది. ఉన్నంతలో మంచి సంబంధమే తెచ్చి పెళ్ళి చేసి పంపారు. అల్లుడు ఆర్ టి సి లో గుమాస్తా.
రామలింగం కనకమ్మకు మిగిల్చి పోయింది ఒక పాత ఇల్లు, తన తదంతరం వచ్చే పింఛను. తండ్రి బ్రతికి వుండగానే రఘుబాబు వేరే కులం పిల్లను ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి దూరమయ్యాడు.
తండ్రి పోయాక రఘుబాబు అమ్మను ఏనాడూ “మా దగ్గర వచ్చి వుండమ్మా “ అని పిలవలేదు.ఎప్పుడైనా వచ్చి చూసిపోతాడు. “నీకేమైనా అవసరం వుందా అమ్మా?” అని ఒక రూపాయి చేతిలో పెట్టడు. పిల్ల చదువులకనీ, పెళ్ళాం మందులకనీ ఆవిడకొచ్చే పెన్షన్ డబ్బులలో వాటా కొస్తాడు.
సాయన్నకు ఆ కుటుంబంతో ఇరవై ఏళ్ళ అనుబంధం వుంది. రామలింగం తన ఆఫీసులో అతనికి తాత్కాలిక వుద్యోగం వేయించాడు. ఇంచుమించు పదిహేను ఏళ్ళు ఆయన దగ్గర పనిచేసాడు సాయన్న.తరువాత రెండు బర్రెలు కొనుక్కుని పాల వ్యాపారం మొదలు పెట్టాడు.
ఆ అయ్య, అమ్మ తనకు పనిచూపి అన్నం పెట్టారన్న విశ్వాసం వుంది అతనిలో. సాయన్న కొడుకు పోతన్న చదువుకు కూడా సాయం చేసాడు రామలింగం. ఆయన సాయం లేకుంటే పోతన్నను ఇంగ్లీష్ మీడియంలో చదివించే స్థొమత లేదు సాయన్నకు. ఆయన పోయాక కనకమ్మ ఆ పిల్లవాడి చదువు ఆగిపోకుండా ఆదుకుంది.
వాడిప్పుడు ఇంటర్మీడియేట్ కి వచ్చాడు. వాడి అమ్మమ్మ కర్నూలులో ఒక జూనియర్ కళాశాల హాస్టల్ లో భోజనం విభాగంలో పనిచేస్తుంది. అందుకని పోతన్నకు హాస్టల్ లో ఉచితంగా వుండేందుకు అనుమతి ఇచ్చారు. కళాశాల జీతం మాత్రం కట్టాలి. పదో తరగతిలో పోతన్నకు మంచి మార్కులు రావడం వలన ఫీజు కూడా తగ్గించారు.
పాలు పోసే సాయన్న కనకమ్మకు బజారు నుండి కావలసిన సరకులు తెచ్చిపెడతాడు. కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ఫోను బిల్లు వంటివి కడతాడు. అవసరం అయితే డాక్టరు దగ్గరకు పిల్చుకు పోతాడు. మందులు కొనుక్కొస్తాడు. అన్నిటికీ ఆమెకు చేతి ఆసరాగా వుంటున్నాడు .
తల్లి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అటు రాధకు, ఇటు రఘుబాబుకు సుతరాము ఇష్టం లేదు.
స్వంత మనవళ్ళు, మనవరాళ్ళకు చెందాల్సింది ఎవరికో దోచి పెడుతోందని వాళ్ళకు తల్లి మీద కోపం.
ఆ ఇల్లు పాతబడిందని, బాగు చేయించడానికి డబ్బు ఖర్చు పెట్టడం దండుగ అనీ, అమ్మేద్దామనీ ఈ మధ్య వచ్చినప్పుడల్లా అంటున్నారు ఇద్దరు పిల్లలు.
అందుకే కనకమ్మకు కూతురు గాని, కొడుకు గానీ వస్తున్నారంటే దిగులుగా వుంటుంది.
తనకు కాలు చెయ్యి బాగున్నంత కాలం స్వతంత్రంగా జీవించాలని ఆమె కోరిక. ఆ ఇంట్లో ఆమెకు తన భర్త జ్ఞాపకాలు తోడుగా వున్నట్టు నిశ్చింతగా వుంటుంది.
" నీ మనవడు, మనవరాలు ఆకలి అంటూ చంపేస్తున్నారు. తినడానికి ఏమైనా చేసి వుంచావా లేదా?" అనడుగుతూ లోపలికి వచ్చింది రాధ.
ఒంటరిగా వుంటున్న ముసలి తల్లిని "ఎలా వున్నావమ్మా? ఒంట్లో బాగుంటొందా?" అని కుశల ప్రశ్నలు అడగలేదు.
"కాళ్ళు చేతులు కడుక్కురండి" అని వాళ్ళకోసం చేసిన చేగోడీలు , రవలడ్డులు అందించింది కనకమ్మ.
" ఈ నడుమ కొత్త చీరలేమైనా కొన్నావా?" తిన్నాక పిల్లలు ఆటలకు పడితే, రాధ అమ్మ బీరువా తెరిచింది.
"ఏవో వాళ్ళు వీళ్ళు పెట్టినవి కట్టుకోవడమే గానీ నేను ఎప్పుడు కొనుక్కున్నానే?" అంది కనకమ్మ.
" ఇదిగో ఈ రెండు వెంకటగిరి జరీ చీరలు కొత్తవే." అంటూ వాటిని బయటకు లాగింది.
"రంగు. నేత బావున్నాయమ్మా. ఎప్పుడు కొన్నావు? నేను కొన్నాళ్ళు కట్టుకుని ఇస్తాన్లే" అంటూ ఆ చీరలు తన భుజం మీద వేసుకుని చూసుకుంది.
"పోయిన నెలలో మా తమ్ముడు వచ్చినప్పుడు తెచ్చాడు" అందామె.
" వెంకటరావు మావయ్య వచ్చివెళ్ళాడా? ఎందుకూ? డబ్బులేమైనా అడిగాడా?" ఆరాగా అడుగుతూ అమ్మ పెన్షన్ పడే బేంక్ పాస్ పుస్తకం తీసి చూసింది.
"వాడికి ఏం తక్కువ అని నన్ను అడుగుతాడే? ఏదో చూసి పోదామని వచ్చి వెళ్ళాడు." అంది కనకమ్మ.
"నీ పెన్షన్ అంతా నీ ఒక్కదానికే ఖర్చయి పోతున్నట్టుందే. మేము అడుగుతామేమో అని వేరేగా దాచావా?" నవ్వుతాలుగా అన్నట్టే అడిగింది.
"నా మందులకు మాకులకు అన్నిటికీ అదేగా ఆధారం. ఏం మిగులుతుంది?" మొహం పక్కకు తిప్పుకుని అంది కనకమ్మ.
ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక తల్లి దగ్గర అసలు విషయం కదిపింది రాధ.
"మీ అల్లుడికి ఆదోనికి బదిలీ అయ్యింది అమ్మా.అక్కడ ఒక అపార్ట్మెంట్ కొనడానికి చూశారు కూడా. డబ్బు తక్కువ పడుతోంది." అంది.
"ఇప్పుడు వుంటున్న ఇల్లు వాళ్ళ అమ్మా నాన్నల స్వంతం కదా. తను వాళ్ళకు ఒక్కడే కొడుకు. ఆదోనిలో ఇల్లు అద్దెకు తీసుకుంటే సరిపాయె."అంది కనకమ్మ.
"అలా కాదులే.ఆయనకు అద్దె ఇంట్లో వుండడం నచ్చదు.మీ అల్లుడికి తెలిసిన కంట్రాక్టర్ మాకు తక్కువలో ఇప్పిస్తానంటునన్నాడు." గారంగా అంది రాధ.
కనకమ్మ మౌనంగా వింటోంది..
" మీ అమ్మ పాపం ఈ పెద్ద వయసులో ఆఖరి రోజులు ఆ పాత ఇంటిలో ఒంటరిగా గడపడ మెందుకు? ఆ ఇల్లు అమ్మేసి మీ అన్న చెల్లెళ్ళిద్దరికీ చెరి సగం ఇచ్చేస్తే ఇక్కడో ఆరు నెలలు, అక్కడో ఆరు నెలలు వుండొచ్చు కదా హాయిగా అంటున్నారు." నచ్చచెబుతున్నట్టుగా అంది రాధ.
ఇటువంటి ప్రస్థావన ఏదో వస్తుందని అనుకుంటూనే వుంది కనకమ్మ.
"ఇది మీ నాన్న మసలిన ఇల్లు. నేను వున్నంతవరకు దీన్ని అమ్మడానికి నా మనసు రాదు. నాకు ఆఖరి రోజులు అంటున్నారు కదా అవేవో ఆయన జ్ఞాపకాలతో గడపనివ్వండి." అనేసి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది కనకమ్మ.
వారం రోజులు అమ్మ వండి పెడితే తిని, విశ్రాంతిగా వుండి బయలుదేరింది రాధ. అన్నాళ్ళూ పిల్లల బాధ్యత కూడా అమ్మ మీదే వదిలేసింది. అమ్మ కొనిచ్చిన కొత్త చీర, మామయ్య అమ్మకోసం తెచ్చిన రెండు వెంకటగిరి చీరలు పెట్టెలో సర్దుకుని, ముఖం ముడుచుకునే బండెక్కింది.
మరో పదిరోజుల్లో రఘుబాబు దిగాడు.ఇల్లు అమ్మడానికి తల్లి సుముఖంగా లేదని చెల్లెలు చెప్పినట్టు వుంది.
రాగానే తల్లితో తగువు పెట్టుకున్నాడు.
" ఏ తల్లి అయినా పిల్లలు పచ్చగా వుండాలని అనుకుంటుంది. నువ్వేమిటో ఎప్పుడూ నీగురించేగానీ మా గురించి ఆలోచించవు. ఆ సాయన్న గాడు గానీ నీకు ఇల్లు అమ్మవద్దని నూరిపోస్తున్నాడా ఏమిటి? ఒంటరిగా వున్నావని వాడు ఈ ఇంటిమీద కన్నేసినట్టున్నాడు. ఏవన్నా కాగితాలు సంతకం పెట్టించుకోలేదు కదా?" అంటూ.
"అటువంటి మాటలు అంటే పాపం వస్తుందిరా. ఏదో చేతనైన సహాయం చేస్తాడు తప్ప ఏమీ ఆశించడు. ఆ పిల్లవాడికి అవసరం పడితే ఎప్పుడైనా కాస్త సర్దుతాను అంతే." నొచ్చుకుంటూ అంది కనకమ్మ.
"మాకు అంటూ ఇంతదాకా స్వంత కొంప లేదు.ఈ ఇల్లు అమ్మి ఆ డబ్బు మా అన్నా చెల్లెళ్ళకి ఇచ్చేస్తే చెరో అపార్ట్ మెంట్ కొనుక్కుంటాము కదా. నువ్వు ఇలా ఒంటరిగా పడి వుండే బదులు మా ఇద్దరి దగ్గరా చెరో ఆరు నెలలు గడపవచ్చు. ముసలి తల్లిని పట్టించుకోకుండా వదిలేసారు అని నలుగురూ మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు." నిష్టూరంగా అన్నాడు.
"ఇప్పుడేమైందిరా? మీరు దగ్గర పెట్టుకుంటాను అంటే నేను రానని అన్నానా? ఇప్పుడే నీ వెంట వస్తాను పద" అంది కనకమ్మ.
"ఈ ఇల్లు అమ్మినాకనే నిన్ను పిల్చుకుపొయ్యేమాట.చెప్తే అర్థం కాదా?" విసుగ్గా అన్నాడు రఘుబాబు.
కనకమ్మకు వాళ్ళ మనసు బాగానే అర్థం అయ్యింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలకు కావలసింది అమ్మను దగ్గర పెట్టుకుని చూసుకోవడం కాదు,ఇల్లు అమ్మిన డబ్బు అని తెలుస్తూనే వుంది.
తాను వాళ్ళ దగ్గర వున్నన్ని రోజులు తనకు వచ్చే పెన్షన్ ఇప్పించుకుని అన్నం పెడతారు. ఏ రోజైనా గొడవ వచ్చి వాళ్ళ ఇంట్లో వుండలేక పోతే తనకు తల దాచుకోను నీడ వుండదు.
" నేను పోయాక ఈ ఇల్లు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేను బ్రతికి వుండగా మీ నాన్న కట్టిన ఇల్లు అమ్మబోను." ఖచ్చితంగా అంది కనకమ్మ.
" నువ్వు పోయేదాకా మాకు నాయన ఆస్థి రాదన్నమాట. లేక పోయేటప్పుడు కూడా ఇంటిని కట్టుకు పోదామనుకుంటున్నావా? " అనేసి విసురుగా బయలుదేరి పోయాడు రఘుబాబు.
పాలు తాగిన రొమ్ము మీద తన్ని పోయిన పిల్లలను తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ గుండెలో మొదలైన సన్నని నొప్పితో కూలబడింది కనకమ్మ .
ఆ రాత్రి నిద్రలోనే గుండె పోటుతో కన్నుమూసింది కనకమ్మ.
సాయన్న కబురు అందుకుని పరుగున వచ్చారు రఘుబాబు, రాధ.
అంత్యక్రియలు ముగిసాయి. పెద్ద కర్మ చేయడానికి నా దగ్గర డబ్బు లేదంటూ చేతులు ఎత్తేసాడు రఘుబాబు.
అమ్మ గాజులు, గొలుసు, చీరలు పెట్టెలో సర్దుకున్న కూతురు " తల్లికి కర్మ చేయడం కొడుకు బాధ్యత" అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.
" కనీసం అంటే యాభై వేలు అయినా కావాలి. నన్ను ఈడ్చి తన్నినా నా దగ్గర అంత డబ్బు లేదు. సరే ఇల్లు అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ తీసుకుని కార్యం జరిపిద్దాము.ఇల్లు అమ్మిన డబ్బులో వాటా సగం కావాలీ అంటే ఈ ఖర్చులో కూడా రాధ సగం పెట్టుకోవాలి." అంటూ ఖచ్చితంగా మేనమామతో అన్నాడు రఘుబాబు.
ఈ మాటలు విని,ఇంటి పనులలో సహాయం చేస్తూ, అక్కడక్కడే తిరుగుతున్న సాయన్న ముఖం చిన్నబోయింది.
" అమ్మ పైలోకాలకు వెళ్ళిపోకముందే ఇల్లు అమ్మితే ఆ అమ్మ ఆత్మకు శాంతి వుండదు చిన్నబాబు. స్వంత ఇంటినుండి తన కట్టె వెళ్ళిపోవాలని ఆ అమ్మ ఎప్పుడూ అనేది. అమ్మను తృప్తిగా సాగనంపినాక అమ్మకం పనులు చూడండి " అన్నాడు.
" ఇంట్లో పాలు పోసేవాడివి మాకు బుద్ధులు చెప్పేంతవాడివా? ఎక్కడుండాలో అక్కడ వుండు" అన్నాడు రఘుబాబు కోపంగా.
కళ్ళ నీళ్ళు పెట్టుకుని తలవంచుకుని వెళ్ళిపోయాడు సాయన్న.
మరునాడు పొద్దున్న పెద్ద కర్మ కోసం వచ్చిన పెద్దలు పదిమంది కూర్చున్న చోటికి వచ్చాడు సాయన్న.
" అయ్యా! అమ్మగారు నాకు అప్పుగా యాభై వేలు ఇచ్చారు. ఆ అమ్మ అవసరానికి నేను తీర్చక పోతే నాకు పుట్ట గతులు వుండవు. ఇదిగొ అయ్యా. ఇది తీసుకుని అమ్మకు దినాలు జరిపించండి. " అంటూ యాభైవేలు రఘుబాబు మేనమామ చేతికి అందించాడు.
కనకమ్మ దాచమని ఇచ్చింది ముప్ఫై వేలే. ఇంకో బర్రె కొనాలని తాను ఏడాదిగా కూడబెట్టిన ఇరవై వేలు కూడా కలిపి అప్పటి ఖర్చుకు కావలసిన యాభై వేలు అందించాడు సాయన్న.
ఆ అమ్మ ముప్ఫై వేలు తన చేతికిచ్చి దాచ మన్నదని చెప్తే అమ్మను ఎన్ని మాటలు అంటాడో రఘుబాబు అని తను అప్పు తీసుకున్నట్టు అబద్ధం చెప్పాడు.
" ఏరా నిజంగా యాభైవేలే ఇచ్చిందా అమ్మ? లేక ఎవరూ సాక్ష్యం లేరని సగం ఎగరగొట్టావా? " అనుమానంగా అడిగాడు రఘుబాబు.
"నాకు అవసరం అయినప్పుడు తెచ్చి ఇవ్వు" అని ఆ అమ్మ ఇచ్చింది ఇంతే రఘుబాబు"
‘ఆ అమ్మ దాచమని ఇచ్చిన సొమ్ముకు, నేను కడుపు కట్టుకుని ఏడాదిగా కూడబెట్టిన ఇరవై వేలు జతచేసి ఇచ్చి, అమ్మ చేసిన సాయానికి కొంతైనా రుణం తీర్చు కుంటున్నానయ్యా’ అని చెప్పలేక కళ్ళు తుడుచు కున్నాడు సాయన్న.
కనకమ్మ సాయన్న దగ్గర దాచింది ముప్ఫై వేలే అని వెంకటరావుకు తెలుసు. బిడ్డల దగ్గర దాచినా తమ్ముడి దగ్గర ఏదీ దాచదు కనకమ్మ. సాయన్న కుటుంబానికి చెల్లెలు సాయం చేస్తున్న విషయం ఆయనకు తెలియనిది కాదు.
కనకమ్మ ఆత్మశాంతి కోసమైనా ఆ ఇల్లు అప్పుడే అమ్మకూడదు అన్న ఉద్దేశం తో తన కష్టార్జితం ఇరవై వేలు కలిపి ఇంట్లో జరగ వలసిన తంతు కోసం ఇచ్చాడని వెంకటరావు కు అర్థమైంది.తన చెల్లెలి మీద వాడికి ఉన్న ఆప్యాయతకు ఆయన గుండె చెమరించింది. ఆ ఇరవై వేలు ఎట్లాగో మళ్ళీ సాయన్నకు ఇచ్చేయాలని మనసులో గట్టిగా అనుకున్నాడు ఆయన.
తనవంతు సహాయం చేయడానికి సిద్ధపడి వచ్చిన వెంకటరావు,మేనల్లుడు, మేనకోడలు అసలు నైజం తెలుసుకోవాలనే చెల్లెలి దినాల ఖర్చులు తను పెడతానని ముందుకు పడలేదు.
ఇల్లు అమ్మితే అన్నా చెల్లెళ్ళకి తక్కువలో తక్కువ చెరీ ముప్ఫై లక్షలు వస్తాయి. కనకమ్మ గత మూడేళ్ళుగా పెన్షన్లో నుండి కొంచం కొంచంగా పోస్ట్ ఆఫీసులో కూడబెట్టిన రెండు లక్షలు సాయన్న కొడుకు పోతన్న పేరిట ఫిక్సెడ్ డిపాజిట్ చేసి, ఆ బాండ్ తన చేతికి ఇచ్చిందన్న విషయం వాళ్ళ డబ్బు వాళ్ళ చేతిలో పడ్డాక చెప్తే సరి అనుకుని " సరే. జరగవలసిన పనులు చూదాము". అంటూ లేచాడు కనకమ్మ తమ్ముడు, రఘుబాబు మేనమామ అయిన వెంకటరావు.
కావలసిన డబ్బు చేతికి అందడంతో యధావిధిగా జరగవలసిన కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
పదవ రోజు ధర్మోదకాలు వదలడానికి మేనల్లుడితో బాటు బయలుదేరిన వెంకటరావు" సాయన్నా! నువ్వూ వచ్చి మీ అమ్మయ్యకు ధర్మోదకాలు వదులు." అన్నాడు.
"వాడెందుకు? మనకు బంధువా? దగ్గరివాడా? కనీసం మన కులం కూడా కాదు.” చులకనగా అన్నాడు రఘుబాబు. సాయన్నను ఇంటి మనిషిలా చూసినందుకు మామయ్య మీద రుస రుస లాడాడు రఘుబాబు.
" కూరిమి కలవారంతా కొడుకులేనురా. మీ అమ్మ మీద వాడికి ఆ గౌరవం, ప్రేమ వున్నాయి కనుకనే రమ్మన్నాను." అన్నాడాయన గంభీరంగా.
కడుపు చించుకు పుట్టిన ఆ ఇద్దరు స్వార్థ పరులైన బిడ్డలకన్నా కూరిమి కలిగినవాడు సాయన్న తన చెల్లెలికి నిజమైన కొడుకు అనిపించింది ఆయనకు.
కనకమ్మను తలచుకుని కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ వెంట నడిచాడు సాయన్న.
———- ————. ———— ———-
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
రచయిత్రి పరిచయం
పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం )
చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు.
వుద్యోగం: ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ
రచనలు: కథలు:- 1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పత్రికలలో
నవలలు (4) 1.మనిషి- మమత,2.చెదరినస్వప్నం ,3. సం హిత ,4.సిద్ధ సంకల్ప( ఆంధ్రప్రభ, స్వాతి మాస పత్రికలలో)
కథాసంకలనాలు:- 1.ఆశలమెట్లు 2.కలవరమాయె మదిలో,3.వెన్నెలదీపాలు,4.మంగమ్మగారి అమెరికా కథలు,5.మనసు పరిమళం,6.ఏదేశమేగినా,7.జగమంతకుటుంబం.
ఇంకా:- కవితలు, ఆంగ్లకథలు, ఆంగ్ల సాహిత్య వ్యాసాలు ప్రచురితం. ఆకాశవాణిలో పలు ప్రసంగాలు.
ప్రశంశలు:జ్యోతి, ఆంధ్రభూమి, రచన పత్రికలలో నా కథలు బహుమతి పొందాయి
1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి "ఉత్తమ అధ్యాపకురాలి " పురస్కారం
ఈ సంవత్సరం అమెరికా తెలుగు కథానికలో నా కథ ప్రచురితం. తెలుగు కథ శతజయంతి కథా సంకలనం “ నూరు కథలు- నూరుగురు కథకులు” లో నా కథ చోటుచేసుకుంది .ఇంకా పలు కథానికా సంకలనాలలో నా కథలు ప్రచురితం.
కామేశ్వర రావు గార్కి ముందుగా మంచి కథ అందించినందుకు అభినందనలు. మీరు కథలో చెప్పినట్టుగా లేని పోని ఆర్భాటాలకు పోయి ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళు ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయారు. వారి వంశస్తులు చెట్టుకో పుట్టకు పోయి దయనీయమైన బ్రతుకులు వెళ్లదీస్తునట్లు కథలు మనం అప్పుడప్పుడు వింటూవుంటాము. కథలో హాస్యం బాగా పండింది. గడ్డ పెరుగు తో కాలికి దెబ్బ తగిలి నొప్పి పుట్టడం చాలా నవ్వొచ్చింది. కథ చివరికి వచ్చేసరికి ఆ ముసలాయన కోతల వెనక వెతలు బాధ కలిగించాయి.
మీకు నా అభినందనలు.