top of page

కూతురు పార్ట్ - 3


'Kuturu Part - 3' written by Sudhamohan Devarakonda

రచన : సుధామోహన్ దేవరకొండ

"మా అత్తగారికి, మావగారికి నేను ఏం మాట్లాడినా విసుగు, కోపం. వాళ్ళు నాతో ఏం మాట్లాడినా వ్యంగ్యం. వొంట్లో బాగాలేదంటే కనీసం జాలి లేదు సరికదా ‘ఏం కష్టపడిపోయవని ఇన్నినొప్పులు పడుతున్నావు?’ అంటారు. ఏం బాధ ఉన్నా పైకి చెప్పడమే మానేశాను. వంట చేస్తే అదేదో ప్రతిరోజూ పరీక్షలా ఉంటోంది నాకు. మనింటికి రావాలంటే ఒప్పుకోరు, వాళ్ళమ్మాయి మాత్రం రావచ్చు, వెళ్లచ్చు. అదేమంటే "అది వాళ్ళ అత్త వారి ఇష్టం" అని లౌక్యంగా మాట దాటేస్తారు. నేను ఎన్ని అమర్చి పెట్టినా, తన కూతురితో పోల్చడానికి కూడా సరిపోవని అంటున్నారు.

ఒకరోజు మీతో ఫోన్ మాట్లాడి పెట్టేసాక కళ్ళనీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చూసి ‘ఏం? ఇక్కడ మేము రాచి రంపాన పెడుతున్నామా, మీ నాన్నతో నేరాలు చెప్తున్నావా?’ అని పొడిచినట్టు మాట్లాడారు. కనీసం తండ్రి గుర్తొస్తే బాధపడే స్వతంత్రం కూడా లేదు నాన్నా అక్కడ నాకు! నన్ను నేను వదిలేసుకోవాలి అక్కడ. ఆత్మాభిమానం చంపుకోవాలి. నా వ్యక్తిత్వం, ఆత్మాభిమానం చచ్చిపోతుంటే జీవచ్చవంలా ఎందుకు నాన్నా నేను? ఇంక నా భర్త అంటావా.. ఆయన మంచివారే! ఆయనకి ఇవేవీ పట్టవు, తెలియవు. అలాగని చెడ్డవారేం కాదు, వాళ్ళ కొడుకు.. అంతే!”

పర్నిక మాటలు ఒక్కొక్కటి వేగంగా కొరడా దెబ్బల్లా తగులుతున్నాయి తండ్రికి. ముఖంలో నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయింది ఆయనకు.

పర్ణిక చెప్తూనే ఉంది.. “నేను ఆ ఇంటి కోడలికన్నా ముందర ఈ ఇంటి కూతుర్ని కదా, అంతకన్నా ముందు మనిషిని. నాకూ కోపం, బాధ, ఇష్టం, ఆనందం, ప్రేమ అన్నీ ఉంటాయి కదా. నన్ను మీరు, అమ్మ ఎంత ప్రేమగా పెంచారు? కోడలిగా ఒకింటికి వెళ్ళడమంటే బానిసగా వ్యక్తిత్వం లేని మనిషిగా వెళ్ళటమేనా నాన్నా?? ఇది నాకు ముందే తెలిసుంటే అసలు పెళ్ళే చేసుకునే దాన్ని కాదు”

పర్ణికలో దుఃఖం అంతా బయటికొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది, చెప్తోంది. శ్యామలరావు గారికి మాత్రం అక్కడ పర్ణిక కనిపించట్లేదు, తన కోడలు కనిపిస్తోంది. ఇంకా మానవత్వం ఉంది అని చెప్పటానికి ఇది చాలు. కనీసం ఇప్పటికైనా సుమేధ కనపడింది. అలా ఆలోచించని వాళ్ళు కూడా లేకపోలేదు.

పర్ణిక తమాయించుకుని కళ్ళు తుడుచుకుని మాట్లాడటం కొనసాగించింది.. "తన కడుపున పుట్టిన పిల్ల అంటే సహజంగానే తల్లిదండ్రులకు ప్రేమ, అభిమానం ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి పెరిగి, వేరొక ఇంటికి తనవాళ్ళందర్ని వదిలి, కొత్త జీవితం వస్తుందనే ఆశతో వెళ్ళిన ఆడపిల్ల (కోడలు)పైన చూపించాలి అసలైన ప్రేమ, అభిమానం. ఇంకో ఇంటి ఆడపిల్ల తమ ఇంట్లో తిరుగుతోంది, ఆమె మనసులో ఏముందో.. ఆమెకి ఏం కావాలో.. తెలుసుకోలేరా నాన్నా అత్త మామలు? తనవాళ్లెవరూ వుండరు, తన ఇష్టాయిష్టాలను తెలిసినవారు వుండరు, అన్నదమ్ములు ఉండరు. ఇంక ఎవరితో చెప్తుంది ఆ అమ్మాయి? ఎపుడో ఒకసారి వస్తాను ఇక్కడికి, మీరు ఆ రెండు రోజులు నాకు చూపించే ప్రేమతో నా జీవితం పూర్తయిపోతుందా నాన్నా? శాశ్వతంగా నేను ఉండాల్సింది అక్కడ. ఆ ఇంట్లో కదా నాకు ప్రేమ కావాల్సింది!”

ఈసారి పర్ణిక మాటలు బాధతో పోటీపడలేక ఓడిపోతున్నాయి. గట్టిగా ఏడుస్తోంది పర్ణిక. ఇదంతా సరిగ్గా ఈ ఇంట్లో సుమేధ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇపుడు అదే స్థితి కూతురికి వస్తే తప్ప ఆయనకి తెలియలేదు. శ్యామలరావు గారు కూతుర్ని ఓదార్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. తనని తాను నిందించుకుంటూ ఉన్నారు, ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు, కూతురు రూపంలో తన అంతరంగం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నారు.

“ఇంతకీ ఏం జరిగింది రా తల్లి..”

“ఏముంది? ఎప్పటిలాగే మా ఆడపడుచు స్వాతి వచ్చింది. ఎంతసేపూ వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ కబుర్లు తప్ప నాతో మాట్లాడే వాళ్ళు, నా ఆనందాన్ని పంచుకునే వారు ఎవరున్నారు అక్కడ? నాకు మీరు గుర్తొచ్చారు. మిమ్మల్ని చూడాలనిపించి రావాలి అనుకున్నాను. అందుకు మా అత్తగారు ఒప్పుకోలేదు. వెళ్ళడానికి వీలు లేదని అన్నారు. నాకు ఇంకా బెంగ రెట్టింపు అయింది ఆ మాటతో.. చేసేదేం లేక, నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేక, నా రూం లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను”

“మరి అల్లుడు ఏమన్నాడు?” “ఆయన ఎక్కడ ఉన్నారు?? ఆయన ఆఫీస్ కి వెళ్లారు. ఇంట్లో విషయాలు ఆయనకు ఎలా తెలుస్తాయి ?? నేను చెప్పను, చెప్పినా నమ్మరు. నేను ఏడవడం చూసి మా ఆడపడుచు మా అత్త గారికి చెప్పినట్టు ఉంది. ఆవిడ నా రూంలోకి వచ్చి ఎందుకు అలా ఏడుస్తున్నావ్?? ఏమైంది?? మేము ఏమైనా అన్నామా నిన్ను?? అంటూ అడిగారు.

అంతా అన్నాక ‘ఏమైంది? ఏమన్నాము?’ అని అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను! నేను తట్టుకోలేక పోయాను. అందుకే అడిగేసా మా అత్తగారిని “ఎప్పుడు చూసినా స్వాతి మన ఇంటికి వస్తూనే ఉంటుంది. నేను మాత్రం మా నాన్నని చూడడానికి వెళ్లాలంటే ఎందుకు ఆపుతున్నారు?”

‘నిన్ను పండగలకు పంపిస్తున్నాను, నీ పుట్టినరోజుకి పంపించాను. నువ్వు, మా అబ్బాయి వెళ్లి వస్తూనే ఉన్నారు. సెలవులకి వెళ్లారు. ఇంకా నేను పంపించకపోవడం ఏమిటి?’ అని మా అత్తగారు అడిగారు” చెప్పడం ఆపింది పర్ణిక.

ఇలా ఒక్క నాడు కూడా సుమేధ నన్ను అడగలేదు.. అలా అడగాలి అంటే ప్రతిరోజూ ఏదోక విషయంలో తను నిలదీస్తూనే ఉండాలి నన్ను. నా కూతురు చెప్పింది నిజమే! కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం జరిగింది నా ఇంట్లో ఇన్నాళ్లు.. అదే నా కూతురికి ఎదురైంది. నిజానికి పర్ణిక అత్తగారు అన్నమాటలో నిజం లేకపోలేదు.. ఆమెను పంపుతూనే ఉన్నారు. ఏదో అమ్మాయి కంగారు పడి బాధ కొద్దీ మాట్లాడినట్టు ఉంది కానీ… ఆ మాటలో అర్థం ఉందనిపించింది శ్యామల రావు గారికి. అమ్మాయిని వాళ్లు పంపించకపోవడం. అనే సమస్య ఎప్పుడూ రాలేదు. పర్ణిక చాలా ఆవేశంగా ఆలోచిస్తోందని శ్యామలరావు గారికి అర్థమైంది. నిజంగానే ఆమెని గారాబంగా పెంచడం వల్లే ఇలా ఆలోచిస్తూ ఉందేమోనని ఆయనకి అనిపించింధి. ఈ విషయానికే అమ్మాయి ఇలా ఆలోచించింది అంటే ఇంకా ఇంట్లో జరిగే అన్ని విషయాల్లో ఇలా ఆలోచిస్తూ ఉంటే .అక్కడ ఈ గారం ఎన్ని సమస్యలు తెచ్చి ఉంటుందో తలుచుకుంటేనే శ్యామల రావు గారికి భయమేసింది.

బహుశా తన కూతురి ఆలోచనాధోరణే తప్పు అయ్యి ఉండచ్చు అని అర్థమైంది. పర్ణికకి చెప్తే అర్థం చేసుకోదు.. కానీ ఎలా ఈ సమస్యని పరిష్కరించాలి?

“సరే తల్లీ! నువ్వు ఏమంటావు ఇపుడు?”

“నేను అక్కడికి వెళ్ళను నాన్నా..”

ఆయన గుండె గుభేలు మంది.

“మరి అల్లుడు??”

“ఆయనా, నేను బయటికొచ్చి వేరే కాపురం పెడతాం.”

ఇదే తన కోడలు చేసి ఉంటే?.. ఆ ఆలోచనే తట్టుకోలేకపోయారు ఆయన.

“వాళ్లు నన్ను కూతురుగా చూసుకోనప్పుడు, నేను వాళ్లను తల్లిదండ్రులుగా ఎలా చూసుకోగలుగుతాను?”

ఈసారి దెబ్బ సరాసరి గుండెకి తగిలింది. షాక్ నుంచి తేరుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు శ్యామలరావు గారు.

“మరి మీ అత్తమామలు నీ గురించి మంచిగా మాట్లాడటం విన్నాను.?? అదీ..”

“అదా!(నిస్సహాయపు నవ్వుతో) .. అది అంతా మీ ముందే. ‘అలా చెప్పుకోకపోతే మా పరువేంగాను?’ అంటూ నిష్టూరాలు ఆడతారు. నా గురించి ఏదో అబద్ధాలు చెపుతున్నట్టు. ఒక్కోసారి నా ఎదురుగానే వేరే వాళ్ళతో మాటల్లో అంటూ ఉంటారు.. ‘మా రోజుల్లో అయితేనా! మా అమ్మాయి అయితేనా!..' అంటూ పరోక్షంగా నన్ను దెప్పి పొడుస్తూ ఉంటారు. అవి నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి. (ఇదైతే శ్యామలరావు గారికి సరిగ్గా అర్థం అవుతుంది. ఎందుకంటే అనుభవం కాబట్టి.. తన కోడల్ని అలా మాట్లాడటం). పెళ్లయిన కొత్తలో ప్రేమించి, ఏదో మీరు పెట్టే డబ్బుకి నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉన్నారే తప్ప, ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి ఏదైతే ఉందో అదే నిజం, శాశ్వతం నాన్న!” చాలా సేపు తన బాధంతా చెప్పి, ఏడ్చి ఏడ్చి కుర్చీలో అలాగే వెనక్కి వాలి నిద్రపోయింది పర్ణిక. ఇంక లాభం లేదు. ఏదోకటి ఆలోచించాలి. పర్ణిక మనసు, ఆలోచన సరిదిద్దాలి అని నిశ్చయించుకున్నారు.

“అమ్మా! బంగారీ.. లే” లేపారు కూతుర్ని.

“సరే అమ్మా! ఇంక లోపలికి వెళ్లి పడుకో. నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాం.”

పర్ణిక మనసు తేలిక పడింది. లోపలికి వెళ్లి పడుకుంది

***

“తనకీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అదీ మన లాంటి మనిషే! ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి, వినాలి అని ఎందుకు అనుకోరు నాన్నా?” ఇవే మాటలు తన చుట్టూ వినిపిస్తున్నాయి ఆయనకి. తన కాళ్ళ కింద భూమి రెండుగా విడిపోయినట్టుగా అనిపించింది. పర్ణిక మాట్లాడిన మాటలన్నీ ఒక్కొకటి గుర్తొస్తున్నాయి..

‘మన ఇంటి ఆడపిల్లనీ ప్రేమిద్దాం. కానీ మన కోసం వేరే ఇంటి ఆడపిల్ల తన కన్న వాళ్ళని, ఇంటి పేరుని, తన ఇష్టాలు అన్నీ వదిలి వచ్చినందుకు ఇంకెంత ప్రేమించాలి?’

శ్యామలరావు గారు మాత్రం చాలా సేపు ఆలోచిస్తూనే ఉన్నారు. తన కూతురు మాట్లాడింది కేవలం తనకోసం, తన అత్తమామల కోసం మాత్రమే కాదు, తన గురించి, తన కోడలు సుమేధ గురించి కూడా..

ఎందుకంటే సరిగ్గా తను చెప్పినవన్నీ తన కోడలి మాటలుగానే తోచాయి ఆయనకి. సుమేధ జీవితం సరిగ్గా అలాగే ఉంది ఇంట్లో. కనువిప్పు కలిగింది ఆయనకి. ఇప్పుడు నేను సరిదిద్దాల్సినది పర్ణిక కాపురాన్ని మాత్రమే కాదు, సుమేధ జీవితాన్ని. వేరొకరి ఇంటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చి బాధపడటం అనేది చాలా తప్పు. వేరొకరి ఇంటి ఆడపిల్ల బాధకి నేను కారణం కాకుండా చూసుకోవాలి, ఆ తర్వాతే వేరొకరిని నిందించాలి అన్నా, నిలదీయాలి అన్నా!

శ్యామలరావుగారి మనసు మెత్తబడుతోంది. కూతురి కష్టం చూస్తే గానీ తన కోడలు మనసు అర్థం కాకపోవడానికి ఆయనకి చాలా సిగ్గేసింది. ‘ఇన్ని సంవత్సరాల నా అనుభవం, నా కష్టాలు, నా జ్ఞానం, నా కుటుంబం, నా విలువలు, నాకు నేర్పింది ఇదేనా?’ కోడలిపై సానుకూల దృక్పథం ఏర్పడింది. కొడుకు పెళ్లి మొదలు ఇప్పటివరకు జరిగినదంతా కళ్లముందు మెదులుతోంది. భార్య బ్రతికి ఉన్నన్నాళ్ళూ బాధపడింది ఇదే కదా. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు భార్య బ్రతికి లేదు. ఆమె కూడా ఆడదే కదా! ఆమె పడింది అదే కష్టం కదా!!

కోడలికి అత్తవారింట్లో 20 ఏళ్ల జీవితం అయిపోయింది. ఏదైనా సరే, ఒకసారి చేజారితే తిరిగి రాదు. అది కాలమైనా, మాటైనా! జీవితంలో ప్రతిదీ అపురూపమే. ఆనందమైనా, ప్రేమైనా, త్యాగమైనా ఏదైనా పరిపూర్ణంగా అనుభవించాలి. ఈ ఆలోచనలన్నీ ఆయనలో వ్యక్తిత్వానికి విలువలని గుర్తు చేస్తున్నాయి. కోడలు ఏదైనా చెప్పింది , పోనీ ఒకసారి విందాం పోయేదేముంది? నా కూతురు చిన్నప్పుడు నా ఒళ్లో కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పలేదు! ఇష్టం ఉన్నదేదో అడిగింది, చేయిద్దాం, పోయేదేముంది..

ఆలోచనలన్నీ చాలా సానుకూలంగా సాగుతున్నాయి. చాలా వేగంగా పరిగెడుతున్న మెదడులో జరిగిపోయినవన్నీ కోడలు తన ఎదురుగా కూర్చుని ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతి తల్లి తండ్రి ఎప్పుడూ తల్లిదండ్రులు గానే ఉండాలి. అత్తమామలుగా కాదు. తన కోడల్ని తను కూతురిలా చూసుకుంటే, తన కూతుర్ని కూడా అత్తగారింట్లో అలాగే ప్రేమతో చూసుకుంటారని అర్థమయింది ఆయనకు. అధికారం చూపించినంతసేపూ అత్త అమ్మ కాలేదు,పెత్తనం చూపించినంతసేపూ మావగారు తండ్రి కాలేరు. అవి వారికి వారే తెచ్చుకునే బంధాలు, గౌరవాలు.. ఇలా ఆలోచిస్తూ బయట లాన్ లోనే కూర్చుండిపోయారు. సుమేధ అర్ధరాత్రి వేళ హాల్లోకి వచ్చి చూసింది. తలుపులు తీసి ఉన్నాయి. మామగారు బయట కూర్చుని ఉండటం చూసి ఆయన దగ్గరకు వచ్చింది. “ఏమైంది మావయ్య గారు ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నారు? చలిగా ఉంది కదా! లోపలికి పదండి” అని చెప్పి పిలిచింది. ఇప్పుడు ఆమె మాటలు ఆయనకి చెవిలో తేనె పోస్తునట్టుగా అనిపించింది..

“అమ్మా! ఇలా రా తల్లీ. ఇలా కూర్చో..”

ఇంత ప్రేమగా ఆమెని పిలవడం ఆమెకు ఇదే మొదటిసారి. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

***సశేషం***


1,132 views0 comments
bottom of page