top of page

లైఫ్ సర్టిఫికెట్

Anasuya G

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Life Certificate' Written By G. Anasuya

రచన: G . అనసూయ


ఆమె ఒక రిటైర్డ్ టీచర్.

కుటుంబ సభ్యుల నిరాదరణ ఎలాగో భరిస్తోంది.

కానీ పెన్షన్ ఆగిపోవడం తో బెంగ పడిపోయింది.

ఎలాగో కష్టపడి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

ఆ ప్రయత్నంలో ఆమె ఏమి సాధించిందో అనసూయ గారి లైఫ్ సర్టిఫికెట్

కథలో తెలుసుకోండి. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


‘రోడ్డు ప్రమాదం లో వృద్ధురాలి దుర్మరణం’


రోజు ఎదో ఒక మూల చూసే వార్తే..


అయితే పక్కన వున్న ఫొటోలోని మహిళ.. అవును... ఆమె కాంతమ్మ టీచర్. నిన్న కాక మొన్న తనతో ఫోన్ లో మాట్లాడారు.


కింద వివరాలు చూసాను. డెబ్భై రెండేండ్ల శ్రీమతి కాంతమ్మ అనేవృద్దురాలు, విశ్రాంత అధ్యాపకులు రోడ్డు దాటిపోతూ బస్సు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆమెచేతి లో ఉన్న బ్యాగులో పెన్షన్లకు చెందిన లైఫ్ సర్టిఫికెటును బట్టి, ఆవిడ ట్రెజరీ ఆఫీస్ కు వెళ్ళడానికితన ఇంటినుండి బయల్దేరి చౌరస్తా వద్ద బస్సు మారడానికి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బస్సు కింద పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు...


ఆ ఫోటో ఆలా చూస్తూ ఉండిపోయింది సుజాత. ట్రెజరీ ఆఫీసులోకి వెళ్లిన కాంతమ్మ.. తనకు తెలిసిన అమ్మాయి కొరకు చూసింది. అటెండర్ను అడిగితే ఇవాళ సెలవు పెట్టిందని చెప్పాడు. అకౌంటెంట్ దగ్గరకు వెళ్ళింది. అతను ఎదురుగ కూర్చున్న ఇద్దరు వ్యక్తులతో బిజీగా మాట్లాడుతున్నాడు. చాలాసేపు నిలబడింది టేబుల్ దగ్గర. బాగా నీరసంగా వుంది.


చాలా దూరం నుంచి వచ్చిన ప్రయాణ బడలిక, బస్స్టాండ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన అలసట, పొద్దున్నే టిఫిన్ చెయ్యబుద్ది కాలేదు. కోడలి దురుసు మాటలు, కొడుకు నిష్ఠు రాలు మనసును గాయపరచగా ఇవ్వాళ ఎలాగోలా ఈ పని పూర్తిచేసుకొని రావాలని పట్టుదలగా బయల్దేరింది. తనకు తెలుసు ఇది ఆవేశపడే వయసు కాదని... కానీ మనసుకు తెలియదు కదా.. గాయపడే వయసు కాదు అని. నిజానికి కొడుకు, కోడలు ఇద్దరూ మంచివారే. ఇద్దరూ ఉద్యోగస్తులు. తన డబ్బుతోనే గడవాలని లేదు. కాని తన డబ్బు ఎక్కడ, ఎవరికి ఇస్తుందోననే అనుమానం. ఎక్కడ దానధర్మాలు చేస్తుందోననేసందేహం..ఏం కాకపోతే ఊరికే మానవ సహజమైన జెలసీ...


‘డెబ్భై రెండేండ్ల వయసు ఇంకా డబ్బెదుకు ఈవిడకు ఊరికే ఓ మూలకు పడి ఉండక’ అనే పొసెసివ్నెస్.

‘ఆవిడకు ఏం ఖర్చులుంటాయి పెన్షన్ డబ్బులన్నీ ఇంట్లోకి ఇవ్వక’


కోడలు ఎన్నో సార్లు కొడుకుతో అంటుండగా తాను విన్నది. అవును నిజమే. తనకు ఖర్చులేమి లేవు. తనకంటూ దాచుకున్నది లేదు. తన ఒంటిమీద గ్రాము బంగారం కూడా ఏనాడూ లేదు. పద్దెనిమిదేళ్లవయసులో ఎస్ జి టిగా ఉద్యోగంలో చేరిన తాను... ఇంటికి పెద్ద కూతురిగా తమ్ముళ్లను చెల్లెళ్లను చదివించడం, తల్లిదండ్రుల పోషణ.. పెళ్లైన చెల్లెళ్ళ ఆలనా పాలనా.. ఇదే జీవితంగా గడిచింది. భర్త తన మేనమామే అవడం వలన అభ్యంతరాలు కూడా ఎదురు కాలేదు. అదృష్టమో దురదృష్టమో పెళ్లయిన పదిహేనేండ్ల వరకు తనకంటూ పిల్లలు పుట్టలేదు.


‘ఎలాగూ పిల్లజిల్లా లేదు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమైంది తోడబుట్టిన వాళ్లకు కాక ఎవరికిపెడ్తారు’ అంటూ అన్ని బాధ్యతలను తన మీదనేవేశారు అత్తా మామ.. అదే అమ్మమ్మ, తాతయ్య. తండ్రి బాధ్యత లేని తనంతో మొత్తం కుటుంబ బాధ్యత తమ పైనేపడింది. నలుగురు చెల్లెల్లు.. చదువులు.. ఉద్యోగాలు.. పెళ్లిళ్లు.. కాన్పులు.. ఖర్చులు. ఇద్దరిజీతాలు సరిపోయేవి కాదు. ఎన్ని లోన్లు.. చేబదుళ్ళు.. సరిపోయేవి కాదు. పెద్దతమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చిన్న వాడికి చదువు అబ్బలేదు. పైనుండి వ్యసనాలకు బానిసయ్యాడు. తనకు సొతంగా పిల్లలుంటే.. అన్న ఆలోచనే రాని తనకు ముప్ఫయ్ ఆరేళ్ల వయసులో తల్లి కాబోతున్నానని తెలిసి అయోమయానికి గురయింది. ఇంట్లో ఈ విషయం చెప్పడానికే సిగ్గు పడింది. చెల్లెళ్ళ పిల్లలు అప్పుడే కాలేజీ చదువులు చదువుతున్నారు.


ఎవరు ఆహ్వానించినా లేకపోయినా పండంటి బాబుకు జన్మనిచ్చింది కాంతమ్మ. అప్పటికే కీర్తిశేషుడైన తాత పేరు కలిపి ఫణికుమార్ అనేపేరు పెట్టారు. ఇంకో చెల్లెలు పెళ్ళికి ఉండటం, తన ఆరోగ్యం పూర్తిగా పాడవడం తో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది కాంతమ్మ. వచ్చిన డబ్బు తో ఆఖరు చెల్లి పెళ్లి చేసింది. తమ్ముడిని ఎలాగైనా దారిలో పెట్టాలని మిగిలిన డబ్బుతో వ్యాపారం పెట్టించారు కాని... అది దివాలా తీయించి మరింత అప్పు మీద వేసాడు. బాబుకు పదేండ్లు వచ్చేసరికి అత్తా మామలు చనిపోయారు. భర్త రిటైరయ్యాడు. పెన్షన్లలో సగం పాత అప్పులు తీర్చడానికే సరిపోతుండేది. అందరికిచదువులు చెప్పించిన, చెప్పిన తాను, తన కొడుకు చదువుకే చేయి చాచాల్సి వచ్చినందుకు భాధ పడేది.


కాలం వెయ్యి కాళ్ళ జెర్రిలాంటిది.. అన్నిటిని నిర్ధాక్షిణ్యంగా తొక్కుకుంటూ వెళ్లడమేదాని పని. కొడుకు ఇంజనీరింగు పూర్తిచేసేనాటికి కాంతమ్మ భర్త గుండెపోటు తో చనిపోయాడు. జులాయిగా తిరుగుతున్న తమ్ముడు అడపా దడపా ఇంటికి వచ్చి వారం పదిరోజులు వుండి పోతుంటే ఏమనలేక పోయేది. చెయ్యిచాపితే కాదనలేక పోయేది. కొడుకు ఫణి ఉద్యోగంలో చేరడం.. తెలిసిన వాళ్ళమ్మాయితో పెళ్లవడం... ఇద్దరు పిల్లలు పుట్టడం చక చక జరిగిపోయాయి. ఫణి భార్య సబిత మొదట్లో బాగానే ఉండేది. కానీ తనతో, తనింట్లో పాటు తిష్టవేసిన వాళ్ళ అమ్మే... ఏదో ఒకటి గొణుగుతూ ఉండేది. చిన్నతనంలో భర్తనుండి విడిపోయి కూతురిమీద ఆధారపడ్డది. చదువు లేని ఆవిడ మాటలు తానెన్నడూ పట్టించుకోలేదు. తీర్థయాతల్రని నెలలో ఇరవైరోజులు ఎక్కడెక్కడో తిరిగివచ్చేది ఆవిడ. తల్లిని ఏమనలేక చిన్నప్పటినుండి తండ్రి ప్రేమ తెలియని సబిత అత్తగారిమీద తన అక్కసునంతా చూపడం మొదలు పెట్టింది.


ఇరువై నాలుగు గంటలు ఇంట్లో వుంటూ పిల్లల ఆలనా పాలనా, చదువు సంధ్య చూస్తున్న అత్తగారిని ఆడిపోసుకోవడం, ఏమీ సంపాదించి పెట్టలేదని, తెలివి తక్కువతనం తో అందరికి దోచిపెట్టిందని ముఖం మీదే తిట్టడం మొదలుపెట్టింది.


నిన్నటికి నిన్న... “అసలు నీ పెన్షన్ ఎం చేస్తున్నావ్... ఆరు నెలల నుంచి పెన్షన్ రాలేదంటే నమ్ముతామనుకుంటున్నావా..” అంటూ కొడుకు చేత అడిగించింది.


“ఏం చెప్పను... లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వలేదని పెన్షన్ ఆగిందని... పెన్షన్, దగ్గరున్న ఎస్ టివో కు ట్రాన్స్ఫర్ చేయించుకుందామని ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకున్నది. ఒకొక్క సారి ఒక్కొక్క కారణం చెబుతూ ట్రాన్స్ఫర్ చెయ్యలేదు. పెన్షనూ ఇవ్వడం లేదు. ఈలోగా పిఆర్ సి వచ్చింది... ఎరియర్లు రాలేదు. లైఫ్ సర్టిఫికెట్… అదే.. నేను ఇంకా బ్రతికి ఉన్నాననే ధ్రువ పత్రం ఆన్ లైన్ లో పంపించామన్నారు... అలాగే పంపించాను కానీ.. అది అందలేదు మళ్ళీ తెమ్మన్నారు. ఇవాళ తీసుకు వచ్చాను సుజాతా.. మీ ఆఫీసుకు.


నీవు లీవ్లో ఉన్నావని చెప్పారు. మీ అకౌంటెంట్ ను అడిగితే ఇన్ వార్డ్ లో ఇవ్వమన్నాడు. ఇచ్చి వచ్చాను. ఈ నెలన్నా పెన్షన్ వచ్చేట్టు చూడమ్మా…” ఆవిడ మాట… పోను లో కాంతమ్మ టీచరు మాటలు ఇంకా వినబడుతున్నట్లే ఉంది.

అయ్యో ! పెన్షన్ ఐతే వస్తుంది కానీ.. టీచరు గారు.. నిన్న లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆవిడ ఈ రోజు లేకపోవడం.. వికలమైన మనసుతో మనసులోనే టీచర్ కు నివాళులు చెప్పింది సుజాత.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 
 
 

Comments


bottom of page