top of page

లైన్ క్లియర్

'Line Clear' New Telugu Story


Written By Ch. C. S. Sarma
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

‘నలుపు... నారాయుణ్ణి పోలు’, అన్నారు పెద్దలు. శరీర రంగుల్లో వున్న నలుపు తెలుపు తేడా మనస్సుకు లేదు. అందరి మనస్సులు తెల్లనివే. వారి వారి మనో భావాల మూలంగా మనస్సులుకు నలుపు తెలుపు వర్తిస్తుంది.

“మాధవయ్యా!”... నీవు హెడ్మాస్టర్ గా రెటైర్ అయిన స్కూల్లోనే నీ పెద్ద కూతురు శాంతి వుద్యోగాన్ని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుందయ్యా! ... నీవేమీ అనుకోనంటే ... నేను నీతో ఓమాట చెబుతాను” ..నవ్వుతూ చెప్పాడు వామనశాస్త్రి.


“వామనా!... మనం స్నేహితులం. నీవు నా శ్రేయో భిలాషివి. నీవు చెప్పదలచుకొన్న విషయాన్ని నిర్భయంగా చెప్పు. నేను ఏమి అనుకోను.” చిరునవ్వుతో మాధవయ్య గారు సమాధానం యిచ్చారు.


తన చేతిలోనుండి ఒక ఫోటోను బయటికి తీశాడు వామన శాస్త్రి . మాధవయ్య చేతికి అందించాడు. కొన్ని క్షణాలు ఆ ఫోటోను పరీక్షగా చూసి మాధవయ్య...


“వామనా! అబ్బాయి లక్షణంగా వున్నాడు. ఎవరు ఈ అబ్బాయి?...” అడిగాడు.

“వాడు మా బావమరిది కొడుకు. పేరు పరంజ్యోతి రైల్వేలో నెల్లూరులో గూడ్స్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. మంచి గుణవంతుడు. ఏ దురలవాట్లు లేవు. నీవు సమ్మతిస్తే ... నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మన శాంతిని గురించి మాట్లాడుతాను.”


ఆశ్చర్యం, ఆనందాలతో వామనశాస్త్రి ముఖంలోకి... చూచాడు మాధవయ్య.

“ఏమిటి మాధవయ్యా అలా చూస్తున్నావు! పిల్లవాడు నీకు నచ్చలేదా!... ఎందుకు అడుగు తున్నా నంటే ... నీవు నీ పిల్లలను ఏరీతిగా పెంచి పెద్దచేసి విద్యా బుద్ధులు నేర్పించావో నాకు తెలుసుగా!.. నీకు నచ్చితే ... మా చెల్లెలికి పిల్లలకు నచ్చినట్లేగా... నేను ఈ వృత్తిలో వున్నందుకు ఎందరో ఆడపిల్లలను చూచాను. వారికీ ...నీ పిల్లలకు భూమికి ఆకాశానికి వున్నంత వ్యత్యాసం వుంది. నీ నిర్ణయం ఏమిటో చెప్పు. నీవు ‘వూ’ అంటే నేను ప్రొసీడ్ అయిపోతా ..” అన్నాడు వామనశాస్త్రి.


మాధవయ్య గారి అర్ధాంగి సీతమ్మ వారిని సమీపించింది.

“అన్నయ్యగారూ! ... బాగున్నారా!...” ప్రీతిగా అడిగింది. మాధవయ్య తన చేతిలోని ఫోటోను సీతమ్మ చేతికి యిచ్చాడు.


సీతమ్మ... ఫోటోను పరీక్షగా చూచింది కొన్ని క్షణాలు. “ఎవరండీ ఈ అబ్బాయీ!....”ఆశ్చర్యంతో అడిగింది.

వామనశాస్త్రి తనకు చెప్పిన వివరాలను మాధవయ్య అర్ధాంగికి తెలియజేశాడు.

“అబ్బాయీ నీకు నచ్చాడా!...”

“నచ్చకపోవడమేమిటండీ!... మన్మధుడిలా వున్నాడు.” ఆనందంగా చెప్పింది సీతమ్మ.


“వామనా! విన్నావుగా... మీ చెల్లెలి అభిప్రాయం . యిక నీవు నీ ప్రయత్నాన్ని చేయి....”నవ్వుతూ చెప్పాడు మాధవయ్య.

“సరే! చాలా సంతోషం... ఫోటోను అమ్మాయికి కూడా చూపించండీ. నేను మా బావమరిదితో మాట్లాడి ... వారిని పిల్లను చూచుకొనేదానికి రమ్మని చెబుతాను. వారం పదిరోజుల్లో తంతు ముగిస్తాను. ఇక నేను వెళ్ళి వస్తా!” లేచి ఆనందంగా వీధిలోకి ప్రవేశించాడు వామన శాస్త్రి.


“యీ పిల్లవానికి మన పిల్ల నచ్చితే ... అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదండీ !...” అడిగింది సీతమ్మ.

“తప్పకుండా!... ఫోటోను అమ్మాయి స్కూలు నుండి రాగానే చూపించు. ఆమె అభిప్రాయాన్ని కనుక్కో!. సీతా! నా ముగ్గురు ఆడపిల్లల వివాహ విషయంలో మనం... వారికి ఇష్టం లేని నిర్ణయాలను తీసుకో కూడదు.... “ చిరునవ్వుతో చెప్పాడు మాధవయ్య.

సీతమ్మ నవ్వుతూ లోనికి ఫోటోతో వెళ్లిపోయింది.

&&&&& &&&&&

మాధవయ్యా సీతమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. మొగపిల్లలు లేరు.

పెద్ద అమ్మాయి శాంతి. ఆ వూరి హైస్కూల్ టీచర్. రెండవ అమ్మాయి సుధా... బ్యాంకులో ఆ వూర్లోనే పని చేస్తూవుంది. మూడవ అమ్మాయి గౌరి... బి.యిడి ., ట్రైనింగ్ లో వుంది.


ముగ్గురు అక్కచెల్లెళ్లకు ఒకరిమీద ఒకరికి ఎంతో ప్రేమాభిమానాలు. పెద్ద అక్క శాంతి... మాట ఆ ఇరువురికీ వేద మంత్రం.


మాధవయ్యకు సీతమ్మకు కొడుకు లేరనే దిగులు లేదు. వారి ముచ్చటను తీర్చుకొనేటందుకు ఆ పిల్లల చిన్నతనంలో వారికి షర్టులు నిక్కర్లు వేసేవారు. రామాయణ భారత భాగవత కధలను చెప్పేవారు. ధైర్య సాహసాలను గురించి... నీతి నిజాయితీలను గురించి ... సత్య ధర్మాలను గురించి ... ఆయా మార్గాలలో నడిచేవారి వున్నతి గౌరవ ప్రతిష్టలను గురించి వివరించేవారు. ఆ కారణంగా ... ఆ ముగ్గురు పిల్లలు పాతకాలం పిల్లలే. ప్రస్తుత ... జీన్లు, టీషర్టులూ వారికి నచ్చవు. ముగ్గురు మితభాషులు. తల్లితండ్రులను ఎంతగానో గౌరవించే వారు.


ఆటకాయి అబ్బాయిల ఆటలు వారిముందు సాగవు. మాధవయ్య మధ్యతరగతి సెకండ్ క్లాస్. మూడు ఎకరాల మాగాణి ... సొంత ఇల్లు... రిటైర్ అయిన తర్వాత వస్తున్న పెన్షన్ ... వుద్యోగం చేస్తూ దాచిన ఇరవై లక్షల ద్రవ్యం వారికి సొంతం.


ఆ భార్యాభర్తలు మొదటినుంచి చాలా పొదుపుగా డాంబికాలకు పోకుండా సంసారాన్ని సాగించారు. అదే తత్వం ... ముగ్గురు కుమార్తెలకు అబ్బిన వరం.


ఆ రోజు ఆదివారం. శాంతి వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గు వేస్తూ వుంది. గేటు ముందు నిలబడివున్న వ్యక్తిని చూచింది.


“ఎక్స్యూజ్ మీ ... మేడమ్...”.. ఆ మాటను విన్న శాంతి తల యెత్తి గేటు వైపుకు చూచింది.


పాతికేళ్ళ యువకుడు ... గేటుకు అవతల నిలబడి వున్నాడు. శాంతి గేటును సమీపించింది.


“ఎవరండీ మీరు!...ఏం కావాలి?...” అడిగింది.

“నా పేరు ప్రభాకర్... రెండురోజుల క్రితం యీ వూరికి వచ్కాను.అగ్రికల్చరల్ ఫారంలో పనిచేస్తున్నాను. ‘టులెట్’ బోర్డ్ చూసి ... మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. సారీ! ఎంతో అణుకువగా అతను చెప్పిన మాటలు శాంతికి నచ్చాయి.


గేటు తెరిచింది . “లోనికి రండి”... అంది.

అతను గృహప్రాంగణంలో ప్రవేశించాడు.

“సుధా!... ప్రక్క పోర్షన్ తాళాలు తీసుకురా! కాస్త హెచ్చు స్థాయిలో... పిలిచింది.

రెండు నిముషాల్లో సుధా వారిముందు ప్రత్యక్ష మయింది.


“వీరికి ఆ పోర్షన్ చూపించు...” అంది శాంతి.

“అలాగే అక్కా!...” ప్రభాకర్ వైపు చూచి... “రండి సార్!...” అంది సుధా.

శాంతి తన ముగ్గును పూర్తి చేయడానికి పూను కొంది .

సుధ ఆ పోర్షన్ తాళం తీసింది.


“వెళ్ళి చూడండి సార్!...” అంది.

ప్రభాకర్ లోనికి వెళ్ళాడు. హాలు, బెడ్ రూమ్ , కిచెన్ టాయిలెట్.... క్రమంగా వాస్తురీతిలో వున్నాయి. ప్రభాకర్ కు చాలా ఆనందం... బయటికి వచ్చాడు.

“ఆర్ యు మారీడ్!....” అడిగింది సుధ.

“నో మేడమ్!.... బ్యాచులర్...”


“అలాగా!” ఆశ్చర్యంతో అంది సుధ.

“అవును...”

“అయితే మీరు మా నాన్నగారితో మాట్లాడాలి ... రండి..”

ఇరువురు వారి వాటా వైపుకు నడిచారు. వరండాలో ప్రవేశించారు.


“కూర్చోండి... నాన్నగారిని తీసుకొస్తాను.” చెప్పి సుధ లోనికి వెళ్లిపోయింది. ప్రభాకర్ కూర్చున్నాడు.

ఐదు నిముషాల తర్వాత మాధవయ్య వరండాలోకి వచ్చారు. వారి వెనకాల సుధా వుంది.

ప్రభాకర్ లేచి... వారికి నమస్కరించి, తన వివరాలు చెప్పాడు.


అతని వినయం, మాటలు మాధవయ్యకు బాగా నచ్చాయి.

స్వజాతి వాడు కాకపోయినా, కులమతాల పట్టింపు లేని... మాధవయ్య అతనికి యిల్లు అద్దెకు యిచ్చేదానికి అంగీకరించాడు.

ముగ్గు వేస్తూనే ... తండ్రి, ప్రభాకర్ ల సంభాషణ లను అంతా... శాంతి విన్నది. పని ముగించి వరండాలోకి ప్రవేశించింది.


“మిస్టర్ ప్రభాకర్!... మా పెద్ద అమ్మాయి... శాంతి.” నవ్వుతూ చెప్పాడు మాధవయ్య.

“గేటు తెరచి వారే నన్ను లోనికి రానిచ్చారు సార్!...” చిరునవ్వుతో శాంతిని చూస్తూ చెప్పాడు ప్రభాకర్.

శాంతి... లోనికి వెళ్లిపోయింది. పది సెకండ్ల తర్వాత తలుపు దగ్గరకు వచ్చి...

“నాన్నా! అన్నీ విషయాలు చెప్పారా?...” సీరియస్ గా అడిగింది.


“చెప్పానమ్మా... అన్నింటికీ ఒప్పుకొన్నాడు...” నవ్వుతూ చెప్పాడు మాధవయ్య.

శాంతి ప్రభాకర్ ముఖంలోకి క్షణంసేపు చూచి లోనికి వెళ్లిపోయింది.

“రేపు మంచిరోజు... ప్రభాకర్ !... షిఫ్ట్ అయి పోతావా... లాడ్జ్ లో రెంట్ జాస్తి కదూ!...”

“అవును సార్!... రేపు వుదయాన్నే వచ్చేస్తాను.”

“మంచిది..”


ప్రభాకర్ ప్యాంటీజేబులో చేయి పెట్టాడు.

“అడ్వాన్సు నీవు రేపు వచ్చాకే యివ్వు!..”

“అలాగే సార్!... వస్తాను...” నమస్కరించి ప్రభాకర్ వెళ్లిపోయాడు.

‘మంచి కుర్రాడు... వినయం, విధేయతా ఆన్ని వున్నాయి...’అనుకొన్నాడు మాధవయ్య.

ముగ్గురు అక్కాచెల్లెళ్ళు వెళుతున్న ప్రభాకర్ ను కిటికీగుండా పరీక్షగా చూచారు.

ప్రభాకర్ మాధవయ్యగారి ఇంట్లో చేరాడు . ఇంటి వెనుక నున్న బావి దగ్గర తను నీళ్ళకు వెళ్ళినప్డు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్లలో ఎవరో ఒకరు ప్రభాకర్ కు తటస్థ పడేవారు.


ప్రభాకర్... మౌనం గా తన పనిని ముగించుకొని లోనికి వచ్చేవాడు.

ఒక్కోసారి సీతమ్మ.. ప్రభాకర్ కు బావి దగ్గిర క ను పించేది. పిల్లవాడు సలక్షణంగా వున్నందున... వచ్చి... వూరుపేరు...కుటుంబ వివరాలను అడిగి తెలుసుకొన్నది. జాతి వ్యత్యాసం అయినందున ప్రయోజనము లేదని అతనితో మాటలు తగ్గించింది.


ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లలో... సుధా మంచి మాటకారి. నవ్వుతూ ప్రభాకరాన్ని పలకరించేది. న్యూస్ విషయాలను, సినిమాల విషయాలను, రాజ్యాంగ విషయాలను అతనితో సరదాగా మాట్లాడేది... ఒకటి రెండు రోజులు ప్రభాకర్ భయపడ్డా.. ఆ తర్వాత ... సుధాతో అన్నీ విషయాలూ ఫ్రీగా మాట్లాడేవాడు.


ఆ రోజు... శాంతి బావి దగ్గర నీళ్ళు తోడుతూ వుంది. ప్లాస్టిక్ బకెట్ చేత పట్టుకొని ప్రభాకర్ బావిని సమీపించాడు. బావి వైపుకు వస్తున్న అతన్నే చూస్తూ ...శాంతి తాడును జారవిడిచింది. తాడు, బకెట్ బావిలో పడిపోయాయి.


ఆ దృశ్యాన్ని చూచిన ప్రభాకర్... ఆశ్చర్యంతో కదలకుండా నిలబడిపోయాడు. ఆందోళనతో శాంతి అతని ముఖంలోకి చూచింది. ఆమె చూపుల్లో అతనికి... ‘యిపుడు ఏం చేయాలి!...’ అనే ప్రశ్న గోచరించింది. మెల్లగా ఆమెను సమీపించాడు.


“ఇంట్లో గేలమ్ వుందా అండీ!...”

“లేదు..” విచారంగా బావి వైపు చూస్తూ చెప్పింది శాంతి.

“నేను బావిలో దిగి బకెట్ ను తియ్యనా!...”

“ఆ..” ఆశ్చర్యాని ప్రదర్శించింది శాంతి.

“నాకు ఈత బాగా వచ్చు. బావిలో దిగి బకెట్ ను తీయగలను... మీరు సమ్మతీస్తే!...”

“నిజంగానా!...”

“నేను మీతో అబద్ధం ఎలాచెప్పగలనండీ!” ఆమె కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా చెప్పాడు. క్షణం తర్వాత “ఇంట్లో వేరే చాంతాడు వుందా!...” అడిగాడు.

“వుంది...”

“తెస్తారా?...”


తల ఆడించి లోనికి పరుగెత్తింది శాంతి. రెండు నిముషాల్లో ... చాంతాడును చేత పట్టుకొని వచ్చింది. ప్రభాకర్ ఆమెచేతిలోని తాడును అందుకొని... గిలకకు ఒక ప్రక్కన వున్న దిమ్మెకు తాడు ఒక చివరను కట్టి... మరో చివరకు నడుముకు కట్టుకొని బావిలో దిగాడు. నీట మునిగాడు.


శాంతి హృదయంలో రైళ్లు పరుగెత్తాయి. ప్రభాకర్ కు ఏమౌతుందో అన్న భయం. బావిలోకి తొంగిచూస్తూ వుండిపోయింది. మనస్సు నిండా ఆందోళన.


తల్లీతండ్రీ శివాలయానికి వెళ్లారు. సుధా బ్యాంకుకు ... గౌరి కాలేజీకి వెళ్లారు. ఇంట్లో వున్నది తను ఒక్కతే. .. గుడ్లు పెద్దవి చేసి బావిలోని నీళ్ళను చూస్తూ వుండి పోయింది. మూడు నిముషాలు తర్వాత ... ప్రభాకర్ తల నీటి పైకి వచ్చింది. “బకెట్ దొరికిందండీ !...” పెద్దగా అరిచాడు.

“హమ్మయ్యా!...” నిట్టూర్చింది శాంతి.

“తాడును పైకి లాగండి..”


ప్రభాకర్ చెప్పినట్లు శాంతి చేసింది. మరో మూడు నిముషాల్లో ప్రభాకర్ బయటికి వచ్చాడు. బకెట్ ను పైకి లాగి ... తాడును గిలకకు తగిలించాడు.

చలికి వణకటం ప్రారంభించాడు. ప్రక్కన వున్న దండెం పైని టవల్ ను ప్రభాకరానికి అందించి... “ ముందు మీరు తల తుడుచుకోండి..నేను వేడి కాఫీ తెస్తాను....” మరోమారు లోనికి పరుగెత్తింది శాంతి.


ఈలోగా ప్రభాకర్ తన పోర్షన్ లోకి వెళ్ళి లుంగీ బనీన్ మార్చుకున్నాడు.

శాంతి కాఫీ గ్లాసుతో బావి దగ్గరకు వచ్చింది. అతడు అక్కడ లేనందున ఇంటి పెరటి గుమ్మాన్ని సమీపించింది ... “ఏమండీ!...” పిలిచింది శాంతి.

ప్రభాకర్ తలుపు దగ్గరకు వచ్చాడు. శాంతి అతనికి కాఫీ గ్లాసును అందించింది. “యు ఆర్ రియల్లీ... గ్రేట్ ఆండీ!...” నవ్వుతూ చెప్పింది శాంతి.


“ఎందుకూ!... బావినుండి బకెట్ తీసినందుకా!...” కొంటెగా నవ్వుతూ శాంతి కళ్ళల్లోకి చూచాడు ప్రభాకర్.

నాలుగు కళ్ళు ఒకటైనాయి... రెండు మనస్సులూ ఒకే రాగాలాపన చేశాయి.

&&&&& &&&&&

ఆరోజు...వామనశర్మ బావమరదీ, భార్యా, కొడుకూ కూతురూ... వచ్చి శాంతిని చూచారు. వచ్చిన వారిని మాధవయ్య సీతమ్మలు... ఎంతో గౌరవంగా చూచారు. వారు పి‌ల్లను చూచిన తర్వాత... వూరికి వెళ్ళి ఆలోచించుకొని... తెలియజేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కారణం... శాంతి శరీర ఛాయ నలుపు.

వారంరోజుల తర్వాత... పిల్లవానికి మీ అమ్మాయి నచ్చలేదని వుత్తరం వ్రాశారు. ఆ దంపతులు బాధ పడ్డారు.

&&&&& &&&&&


అది మొదలు నెలకు రెండు సంబంధాలు చొప్పున వామనశాస్త్రి ... ఆరు మాసాల్లో పన్నెండు సంబంధాల ను పిలుచుకొని వచ్చాడు. అతని పంతం ...తన మూలంగా శాంతి వివాహం జరగాలని...


కొందరు...వెళ్ళి తెలియజేస్తామని... కొందరు మీ రెండవ అమ్మాయి మా అబ్బాయికి నచ్చిందని... వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు.

శాంతి పెండ్లిచూపులు విషయంలో ఆ దంపతులు రోసిపోయారు. శాంతి చాటుగా ఎంతో బాధపడేది.


ప్రక్క పోర్షన్లో వున్న ప్రభాకర్ ... ఆరు నెలలుగా మాసానికి రెండుసార్లు జరిగిన... శాంతి పెండ్లిచూపుల తంతును ... శాంతిని చూచి వెళ్ళి... వారు యిచ్చిన సమాధానాన్ని.. తెలుసుకొన్నాడు.

శాంతితో... ఒకరోజున... ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. నీవు సరే అంటే ... పెండ్లి చేసుకొంటాను..’ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.


శాంతి తొలుత ఆశ్చర్యపోయినా ... తనను వచ్చి చూచిపోయిన వారి సమాధానం కారణంగా... ప్రభాకర్ నిర్ణయానికి... తన సమ్మతిని తెలియజేసింది. ప్రభాకర్ కు ఒంగోలుకు ట్రాన్సఫర్ అయింది. ఆ రాత్రి ప్రభాకర్ ప్రయాణం .... అతనితో కలసి వెళ్లాలని ... నిశ్చయించు కొంది.

&&&&& &&&&&

‘అమ్మా నాన్నలకు నమస్కారాలు. నేను సుధా.. గౌరీల లాగా తెల్లని పిల్లను కాను. నా వివాహ విషయం లో మీరు చేసిన పయత్నాలు... మీకు నాకూ బాగా తెలుసు. నేను ప్రభాకర్ ను ప్రేమించాను. వారూనన్ను ప్రేమించారు. నా కారణంగా ... సుధా గౌరీల వివాహం ఆలస్యం కావడం నాకు ఇష్టం లేదు. మా వివాహాల లైన్లో అడ్డంగా వున్న నేను...లైన్ క్లియర్... చేస్తున్నాను. నేను ప్రభాకర్ తో కలసి వెళ్లిపోతున్నాను . మా పెళ్లి శుభలేఖను మీకు పంపుతాము. వచ్చి ఆశీర్వదిస్తే ... ఎంతగానో సంతోషించగలము.

ఇట్లు,

మీ శాంతి.

దిండు క్రింద వున్న ఆ వుత్తరాన్ని చదివి... సీతమ్మ... “ఏమండీ!...” బిగ్గరగా అరిచింది. మాధవయ్య శాంతి గదివైపుకు పరుగెత్తాడు.

&&&&&& &&&&&&

// సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.32 views0 comments

Comments


bottom of page