top of page

లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక


'Loguttu Perumallaku Eruka' Written By Kowshik Ramadugu

రచన: కౌశిక్ రామడుగు


కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రామాపురం అనే ఊరు, ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అందమైన పల్లెటూరు. అక్కడ కొండ మీద వేంకటేశ్వర స్వామి గుడి, ఆ కొండ క్రింద చుట్టూ పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి. కృష్ణా నది పక్కనే ప్రవహిస్తూ ఉన్న ఆ నీళ్లు మాత్రం ఆ ఊరి పొలాల్లో పారదు. ప్రతి శనివారం గుడికి వెళ్లే అలవాటు ఉన్న శ్రీను, అలవాటులో భాగంగా ఈరోజు కూడా గుడికి వెళ్ళాడు. ఆ రోజు గుడిలో కాస్త భక్తుల రద్దీ కనిపించింది.


ఎప్పుడు లేనిది మన ఊరి గుడిలో ఈ జనాలు ఏంటి అని అనుకోని ఆ ఆతృతతో “అయ్యగారు! మన గుడిలో ఇంత మంది ఉన్నారు ఏంటి అండీ” అని అయ్యగారిని అడిగాడు శ్రీను.


“ఇవ్వాళ కార్తీక శనివారం కదరా! అందుకే ఈ జనం, ఐనా ఈ మాత్రం జనం కూడా రద్దీ అంటారా” అని అయ్యగారు జవాబు ఇచ్చారు.


దర్శనం చేసుకొని మెట్లు దిగుతున్నాడు శ్రీను, దేవుడిని చూడటానికి వస్తున్నా చాలా మంది భక్తులు ఎదురు పడ్డారు.

శ్రీను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది నిరుద్యోగుల్లో ఒకడు, వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వర్లు, వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం శ్రీను కూడా వాళ్ళ నాన్నకి సాయం చేస్తూ ఊర్లోనే ఉంటున్నాడు.


ఒకరోజు శ్రీను పొలంలో ఏదో పనిలో ఉండగా, అదే ఊరికి చెందిన స్నేహితుడు బాలాజీ వచ్చాడు,


“ఏరా ! ఇలా వచ్చావ్” అని శ్రీను అడగగా, “గుడికి వెళ్లి వస్తున్నారా !” అని చెప్పాడు బాలాజీ.

“ఏంట్రా బాబు! మన గుడిలో కూడా అంత మంది జనాలు, దేవుడ్ని చూడటానికి గంట పట్టింది” అని అన్నాడు బాలాజీ.


అది విన్న శ్రీను “నిన్న నేను గుడికి వెళ్లిన్నపుడు కూడా చాలా మంది ఉన్నారు రా ! మనం చిన్నప్పటి నుండి చుస్తున్నాం కదా! ఎప్పుడు ఇంత మంది భక్తులు రావడం చూడలేదు, స్వామి వారి ఉత్సవాలు అప్పుడు తప్ప, ఎప్పుడు మన ఊరి గుడిలో జనాలు పెద్దగా ఉండరు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంత మంది వస్తున్నారు” అని అడిగాడు శ్రీను.


“ ఇదే విషయం అయ్యగార్ని అడిగితే నాకేం తెలుసు నాయన అన్నాడు రా” అని సమాధానం ఇచ్చాడు బాలాజీ.


శ్రీను ఒక విషయం గురించి ఆలోచిండం మొదలు పెడితే అది తేలే వరకు వదలడు... ఇప్పుడు ఈ గుడికి భక్తుల రాక అనూహ్యంగా పెరగడానికి గల కారణం ఏంటి అని ఆలోచన మొదలుపెట్టాడు. నాలుగు రోజులు గడిచే సరికి ఆ ఊరి గుడికి జనం పోటెత్తారు,

ఆ ఊరి చరిత్రలో ..

ఇంకా చెప్పాలి అంటే..

ఆ గుడి చరిత్రలో….

ఇంతటి వైభవాన్ని ఏనాడు చూసి ఉండరు. పక్కన ఊర్ల నుండి, జిల్లాల నుండి, రాష్ట్ర నలుమూలల నుండి జనం రామాపురం అనే చిన్న ఊరిలో ఉన్న గుడికి పరుగులు తీసారు.

కొండ కింద దుకాణాలు…కొండ పైన కల్యాణ కట్టలు, ప్రసాదాల కౌంటర్లు వెలిసాయి....

తమ ఊరికి పట్టిన మహర్దశని చూసి ఆ ఊరి జనం మురిసిపోయారు ఒక్క శ్రీను తప్ప, శ్రీనుకి ఇది అంతా నమ్మాలి అని లేదు.


అది ఇలా ఉండగా శ్రీను వాళ్ళ నాన్న శ్రీను దగ్గరికి వచ్చి - చిన్నా, చెల్లికి పెళ్లీడు వచ్చింది కదరా, ఒక రెండు ఎకరాల పొలం అమ్ముదాం అనుకుంటున్నా ఏమంటావ్ అని అడిగాడు, శ్రీను మౌనంగా ఉండి పోయాడు. ఎకరం ఐదు లక్షలకి పోతది, రెండు ఎకరాలు అమ్మితే ఆ డబ్బుతో చెల్లి పెళ్లి చేయొచ్చు అని వివరించాడు. నాకు పొలం అమ్మడం ఇష్టం లేదు నాన్న అని శ్రీను అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


మరుసటి రోజు శ్రీను, బాలాజీని తీసుకోని గుడికి వెళ్ళాడు. గుడికి భక్తుల తాకిడి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అక్కడికి వచ్చిన భక్తుల దగ్గరికి వెళ్లి శ్రీను-అమ్మ మీరు ఏ ఊరు నుండి వచ్చారు, ఈ గుడి గురించి మీకు అస్సలు ఎలా తెల్సింది అని అడిగాడు. దానికి ఆవిడా మేము రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చాము, ఈ దేవుడ్ని దర్శనం చేసుకుందాం అని, ఈ ఊరి గుడి గురించి టీవీలో ఒక జ్యోతిష్యుడు చెప్పాడు అండి అని చెప్పింది. ఎవరు ఆ జ్యోతిష్యుడు, ఏం చెప్పాడు అని అడిగాడు శ్రీను. రోజు టీవీలో వస్తాడు కదండీ జో అచ్యుతానంద జోజో ముకుందా స్వామి అండి , ఈ ఊరిలోని దేవాలయం చాల పురాతన దేవాలయం అని ఇక్కడ దేవుడికి మొక్కు కుంటే, అనుకున్నవి అన్నీ తీరుతాయి అని చెప్పాడు అని ఆమె చెప్పింది.


శ్రీను, బాలాజీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని సందిగ్ధంలో పడ్డారు. ఆ స్వామిజి గురించి చాల మంచిగా విన్నారా, ఆయన అర్ధం లేనిది ఏమి చెప్పడు అని బాలాజీ అనగా, శ్రీను ఎదో ఆలోచిస్తూ తల ఊపాడు. ఇంకొంత మందిని అడుగుదాం పద, అని కదిలాడు. అక్కడకి వచ్చిన చాలా మంది భక్తులని అడిగాడు, అందరు ఇదే సమాధానం చెప్పారు, ఈ గుడికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అంట కదండీ అందుకే వచ్చాము అని సమాధానం ఎక్కువ వచ్చింది. ఏమి అర్ధం కాని అయోమయ స్థితిలో ఇంటికి చేరారు శ్రీను, బాలాజీ.


వారం రోజులు గడిచాయి శ్రీను అన్వేషణకి ఫలితం మాత్రం దొరకట్లేదు. ఇంట్లో శ్రీను వాళ్ళ నాన్న వచ్చి మన పోలంకి చాల మంచి బేరం వచ్చిందిరా, ఎకరం పది లక్షలకి అడుగుతున్నారు, మన చుట్టూ ఉన్న చాల మంది అమ్మడానికి సిద్ధం అయ్యారు అని చెప్పడు. లేదు నాన్న మన పొలం అమ్మడానికి మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పాడు శ్రీను. ఎందుకు రా ! అని వాళ్ళ నాన్న అడగగా ఈ పొలమే కదా నాన్న ఇన్ని రోజులు మనల్ని ఆదుకుంది, ఈ పొలం నుండి వచ్చిన డబ్బులతోనే కదా నన్ను చెల్లిని చదివించింది.


మనిషి విలువ, భూమి విలువ అంకెలో ఉండదు నాన్న అని చెప్పాడు శ్రీను .

అది కాదురా సీనయ్య, ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు అంట మన భూమిని తీసుకోని ప్లాట్లు చేసుకుంటారు అంట, మనకు మళ్ళి ఇంత పెద్ద మొత్తంలో రేట్ రాదు రా ! అందుకే నా తొందర అంతా అని శ్రీను వాళ్ళ నాన్న చెప్పాడు.


"తింటే తరిగేది ఆస్తి, ఎంత తిన్న మళ్ళి తిండినిచ్చేది భూమి"

అలాంటి భూమిని అమ్మడానికి నేను ఒప్పుకోను. నీ దిగులు నాకు అర్థమైంది నాన్న, చెల్లి పెళ్లి గురించే కదా. అమ్ముదాం అనుకున్న రెండు ఎకరాలు చెల్లి పేరు మీద రాయి, ఈ ఏడు ఎలాగో పంట బాగా పండింది కదా, ఆ డబ్బులు, మన దగ్గర ఇదివరకు ఉన్న డబ్బులతో చెల్లి పెళ్లి చేద్దాం అని శ్రీను చెప్పగా, కొడుకు ఆలోచనకు ఆనందించి వెళ్లి పడుకున్నాడు శ్రీను వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు.


శ్రీను ఆరు బయట నులక మంచంలో పడుకొని ఆలోచిస్తున్నాడు, గుడిలో జనాలు పోటెత్తుతున్నారు , మరో పక్క భూమికి ఎప్పుడు లేని విలువ వచ్చి పడింది, ఈ రెండిటికి ఎమన్నా సంబంధం ఉందా ! దీని వెనకాల ఉన్న గుట్టు ఏంటి.. ఆ లోగుట్టు పెరుమాళ్లకు యెరుక అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.


రియల్ ఎస్టేట్ శాపంతో శ్రీను వాళ్ళ పొలం చుట్టూ కొత్త హంగులు వచ్చి చేరాయి…

శ్రీను వాళ్ళ పొలం కోతకి వచ్చింది, కోత కోసి కుప్ప పోసారు. దానికి కాపులాగా ఆ రోజు శ్రీను, బాలాజీ అక్కడే నిద్ర పోతున్నారు. అర్దరాత్రి బండ్ల చప్పుడికి లేచారు, మూడు కార్లలో జనాలు ఒక చోట చేరి మాట్లాడుతున్నారు, ఇంతలో రియల్ ఎస్టేట్ వాడు దూరం నుండి ఒక సూట్‌కేస్ తీసుకోని వస్తున్నాడు, ఎవరికీ కనిపించకుండా ఒక్క చెట్టు చాటున చేరి గమనిస్తున్నారు శ్రీను, బాలాజీ. కారులో నుండి ఆ స్వామిజి దిగాడు, సూట్‌కేస్ తెచ్చిన అతను అది ఓపెన్ చేసి అతనికి ఇచ్చాడు, సూట్‌కేస్ నిండా డబ్బులే. గుడికి జనాలు వచ్చే లాగా చేసి, గుడికి పేరు వస్తే ఆ ఊర్లో పొలాలు కొని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అని వాళ్ళ ప్లాన్. ఈ ప్లాన్ కి సూత్రధారి స్వామిజి ఐతే పాత్రధారులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.


మరుసటి రోజు పోలీసులని తీసుకోని గుడి దగ్గరికి చేరుకున్నాడు శ్రీను, పోలీసులు రావడంతో ఊరంతా ఏం జరుగుతుంది అని చూడటానికి వచ్చారు, అప్పటికే పోలీస్ వాళ్ళు స్వామీజీని అరెస్ట్ చేసి తీసుకోని వచ్చారు, రాత్రి డబ్బు తీసుకోని తిరిగి వెళ్తున్నస్వామిజి గురించి శ్రీను ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు పట్టుకున్నారు.


ఊరు జనాలు ఏమైంది రా శ్రీను ! స్వామీజీని ఎందుకు అరెస్ట్ చేసారు అని అడిగారు – ఈయన స్వామిజి కాదు అస్సలు, ఈ స్వామిజి ఆ ఏజెంట్లతో కల్సి ఈ గుడికి భక్తులు వచ్చే లాగా చేసారు, అది అడ్డం పెట్టుకొని భూమి రేట్ ని పెంచి మన దగ్గర భూమి కొంటున్నారు. ఆ భూమిలో వెంచర్ వేసి ఒక్కో గజం పదివేలకు అమ్ముతారు. ఆ మాటలు విన్న జనం కంగుతిన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఊరికి, ఈ ఊరి జనాలకి లాభమే జరిగింది. ఎవరికీ తెలియని ఊరు ఇప్పుడు చాల మందికి తెల్సింది, మన భూమికి మంచి ధర వచ్చింది, ఏ రోజు నిండని దేవుడి హుండీ నిండింది. మనందరం బాగున్నాం కాని ..

కష్టాల కడలితో సాగె జీవితాలు ప్రజలవి, ఆ కష్టాలు దేవుడితో పంచుకోడానికి గుడికి వస్తారు, అలంటి దేవుడి దగ్గర కూడా మీరు మీ బుద్దిని ప్రదర్శించారు అంటే ఏం అనాలి స్వామి మిమల్ని అని స్వామీజీని నిలదీసాడు శ్రీను. జనాల బలహీనతని, భయాన్ని డబ్బుగా మార్చే మీలాంటి వాళ్ళని ఏం చేయాలి.


జనాలు వైపు చూస్తూ శ్రీను - మీరు అందరు ఇక్కడికి ఏవేవో కోరికలు ఆ కొండ మీద ఉన్న దేవుడ్ని కోరడానికి వచ్చారు. మీకు మీరు ఈ గుడికి వచ్చి ఉంటె బాగుండేది కాని ఎవరో చెప్పిన స్వార్ధపు మాటలు విని రావాల్సొచ్చింది అదే బాధ.

ఆ దేవుడితో పరాచకాలు ఆడితే ఎవరికైనా చెరసాల తప్పదు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


“యద్భావం తద్భవతి”


72 views0 comments

Comments


bottom of page