top of page

మా చరిత్ర


'Maa charithra' written by Sampath Kumar S

రచన : S. సంపత్ కుమార్

నా చరిత్ర ఏమిటో, నా పూర్వీకులు ఎవరో, ఏమి చేసేవారో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది నాకు. ఆసక్తితో పాటు ఆచరణలో పెట్టాలనుకున్నాను పుస్తకరూపంలో.

మనకు రాజుల, రాజకీయనాయకుల, ప్రముఖుల చరిత్రలు తెలుస్తుంటాయి కానీ మన చరిత్ర మాత్రం మన తాత, మహా అయితే ముత్తాత వరకు తెలిసి వుంటుంది. మరి ఇంటి పేరు, గోత్రాల వలన కొంత వరకు తెలుస్తుంది. తమ పూర్తి చరిత్ర చాలా మందికి తెలియదని నా భావన.

నేను హైదరాబాద్ లో స్థిరపడి చాలా యేండ్లు అయింది. ఏదో చుట్టాల ఫంక్షన్ వుంటే తరచుగా మా పల్లె వెళ్ళేవాడిని. అదీ అమ్మతో ఏదయినా ఆ పల్లెలో పనులు, ఫంక్షన్స్ ఉంటే. అమ్మ కాలం చేసి పది సంవత్సరాలు అయింది. మళ్లీ మా పల్లెకు పోయే అవసరం రాలేదు. మా చరిత్ర ఏమిటో తెలుసుకుని అది పుస్తక రూపంలో తేవాలని అమ్మ చెప్పిన కొన్ని విషయాలు గుర్తు పెట్టుకొని, ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని పల్లెలో ఉన్న మా దూరపు చుట్టం, వరసకు పెద్దమ్మ దగ్గరకు బయలుదేరాను.

పల్లెలో అడుగు పెట్టిన నాకు కొంత కొత్తగా కనిపించింది కాని పల్లెలో నేను ఊహించినంత మార్పు లేదు. అందుకే మా పెద్దమ్మ ఇల్లు ఈజీగా గుర్తు పట్టి అక్కడికి వెళ్ళాను. అక్కడ చుట్టూ వుండేవాళ్ళు నన్ను చూసి కొందరు గుర్తు తెచ్చుకున్నారు. మరి కొందరు నేను ఎవ్వరో తెలుసుకున్నారు.

మధ్యాహ్నం బోజనాలు అయ్యాక ఆరుబయట వేపచెట్టు క్రింద మంచం మీద పెద్దమ్మ ,చెక్క కుర్చీలో నేను కూర్చున్నాను . మా పెద్దమ్మకు 90 యేండ్లు. ఐనా ఇప్పటికీ చాలా హుషారుగా ఉంది. మా పెద్దమ్మ మాట్లాడుతూ

" మన చరిత్ర ఏమిటో తెలుసుకుందాం అని వచ్చావు కానీ నన్ను, ఈ పల్లెను చూద్దామని రాలేదు. పోనీ ఏమైనా ఆస్తులు ఉంటే వచ్చే వాడివి ఏమో" అంది.

పెద్దమ్మ ఆ మాట అనేసరికి బాధ వేసినా ‘అదీ నిజమే కదా!’ అనిపించింది. పెద్దమ్మ మా చరిత్ర చెప్పడం మొదలు పెట్టింది.

మా పూర్వీకులు కులీ కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ కు వజ్రాల వర్తకులుగా తమిళనాడు నుంచి వచ్చారట. అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడిపోయారట. తర్వాత కొన్నాళ్లకు వజ్రాల వ్యాపారం దెబ్బ తినటంతో వేరే పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారట . ఇలా కొన్ని ఏండ్లకు నిజామ్ పాలన రావటం, అప్పుడు మా ముత్తాత నవాబు దగ్గర తన పలుకుబడి తో అప్పటి చదువులో ప్రతిభ ఉన్న మా తాతకు అటవీ శాఖలొ ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉదోగ్యం ఇప్పించాడు . మా తాతకు నల్లమల అడవులలో డ్యూటీ వేయడంతో అక్కడే ఉన్న చిన్న గ్రామంలో ఉండిపోవడం, అప్పుడప్పుడూ హైదరాబాద్ కు రావడం, ఇక మా తాత అన్నలు, వాళ్ళ పిల్లలు హైదరాబాద్ లో ఉండటం వలన రాకపోకలు ఉండేవి. మా తాతకు నలుగురు కూతుళ్ళు, ఒక కొడుకు. ఆ కొడుకే మా నాన్న. మా తాత నిజాయితీగా ఉండటం , మా అత్త పెండ్లికి గద్వాల్ మహారాణి రావడం, ఇంకా రక రకాల కారణాల వలన, నిజామ్ నవాబుకు కోపం వచ్చి, మా తాత ఉదోగ్యం తొలగించడంతో మా తాత గద్వాలుకు మకాం మార్చడం, తరవాత మళ్లీ హైదరాబాద్ కు రావటం జరిగింది . నిజాం పాలన అంతం అయ్యాక, స్వతంత్రం వచ్చాక హైదరాబాద్ లో జాంబాగ్ లో స్కూల్ పెట్టడం, అది ఇబ్బందుల్లో పడటం అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో మా తాత తన కున్న పలుకుబడి తో మా నాన్నకు గద్వాల్ దగ్గర ఉన్న ఉప్పేరులో గవర్నమెంట్ టీచర్ గా ఉదోగ్యము ఇప్పించటం తో మేము ఉప్పేర్ గ్రామంలో స్థిరపడిపోయం . అప్పటికే మా నాన్నకు పెండ్లి అయింది మా చుట్టాల అమ్మాయి తో. మా తాత చనిపోవడం జరిగింది. అతను బ్రతికి ఉన్నప్పుడే కూతుళ్ళ పెళ్లిళ్లు చేశాడు. ఇప్పుడు వాళ్లు కొందరు కర్నూల్, కొందరు హైదరాబాద్, కొందరు విదేశాల్లో ఉన్నారు. నాకు పది యేండ్లు వచ్చాక మేము గద్వాలలో దగ్గర ఉన్న ఉప్పేర్ గ్రామంలో ఉన్నాక అప్పటినుంచి మా చరిత్ర కొంత తెలుసు. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్మళ్ళు. మా అక్కలు పెద్దత్త కొడుకులను, నేను మా చిన్న అత్త కూతురును పెండ్లి చేసుకున్నాము. నేను పై చదువులకు హైదరాబాద్ కు రావడం, తర్వాత ఉద్యోగం రావడం, నాన్నరిటైర్ అయ్యాక అమ్మ నాన్న, తమ్ముళ్లు కూడా హైదరాబాద్ కు వచ్చారు . మా పెద్దమ్మ వలన మా పూర్వీకుల గురించి కూడా తెలిసింది

ఇప్పటి వరకూ మా చరిత్ర లో ఉన్న ముత్తాత నుండి ఇప్పటి దాకా అందరి పేర్లు, ఎవరికి ఎవరు ఏమి అవుతారో, ఎక్కడ ఉన్నారో అన్ని వివరాలు పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నం చేస్తుండగా డ్రాయింగ్ టీచర్ అయిన మా ఆవిడ ఒక అడుగు ముందుకు వేసి ‘బొమ్మ రూపంలో కూడా ఉంటే బాగుంటుంది’ అని వంశవృక్షం వేసింది. వ్రేళ్ళ నుండి కొమ్మలు , ఆకులు మీద ఎవరికి ఎవరు ఏమి అవుతారో ఇంటి పేరుతో పాటు వాళ్లు పేర్లతో నింపింది. ఇంకా కొత్త తరం వచ్చే కొద్దీ వాళ్ళ పేర్లు నింపడానికి కొత్త కొమ్మలు, ఆకులు పుట్టుకొస్తాయి . ఇప్పటి వరకూ నేను, తర్వాత నా పిల్లలు ఈ వంశవృక్షం పెంచడం వలన మా చరిత్ర ఏమిటో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఈ వంశ వృక్షం ఏ కాలమైనా ఎండిపోదు సజీవంగా ఉంటుంది.

ఇక మీరు కూడా మీ వంశ చరిత్ర రాయడం మొదలు పెట్టండి. ఎందుకంటే రాబోయే తరానికి మన చరిత్ర తెలియాలి . ఒక ఆధార్ కార్డు లాగా.

***సమాప్తం***

రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6 లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.


130 views0 comments

Comentarios


bottom of page