top of page

మా ఇంటి మహాలక్ష్మి

Ma Inti Mahalakshmi Written By Sridhar Gopisetti

రచన : శ్రీధర్ గోపిశెట్టి


శ్రీధరరావు ఇంటిపెరటిలో వున్న ఆవుతోనూ, పువ్వులతోనూ,కాయకూరమొక్కలతోనూ, పాదులతోనూ మాట్లాడుతున్నాడు.


ఏంటీ! ఎప్పుడు రాని మాస్టారు వచ్చారూ, మా లక్ష్మీ మేడం ఏదీ, అంటూ చూస్తున్నారా ఇక పై మీకు ఏమి కావాలన్నా, నాకు మీనుంచి ఏమి కావాలన్నా నేనే వస్తా. ఏంటీ! ఆశ్చర్యంగా వుందా. నా రాకకు కారణం వుంది. అదేంటో చెపుతా వినండి.


రోజువారిలానే ఆరోజుకుడా తెల్లవారింది. మీరు వికసించారు, మీరు పరిమళించారు, మీరు గాండ్రిచారు, అలానే నేను నిద్రలేచాను. కానీ నా లక్ష్మి, అదే నా ఇల్లాలు, మీ యజమానురాలు కళ్ళు తెరవకుండా కదులు మెదులు లేకుండా వుంది. పరుగు పరుగున హాస్పిటల్ కి తీసుకునివెళ్ళాను. డాక్టర్స్ చూసి చాలా క్రిటికల్ అంటూ ఐ.సి.యూ లో వుంచారు. లోపలకి రావొద్దన్నారు. బయట నిలబడిన నాకు మాత్రం ఎప్పుడు కలగని ఆందోళన కలుగుతోంది. నా కాళ్ళు వణుకుతున్నాయి. నారెండు చేతులు ఒక్కటై తడిసిన నాకళ్ళతో కనిపించిన ప్రతి తెల్లకొట్టూను ప్రాధేయపడుతున్నాయి. ఆ క్షణం ఆసుపత్రి ఆవరణలో కూర్చుని నాలో నేను మాట్లాడుకున్నాను.


నాకు ఎప్పుడూ ఇటువంటి ఆందోళన కలగలేదనేకంటే, నా లక్ష్మి నాకు కలగనివ్వలేదు అనటం సబబు. ఇన్నేళ్లు నా అండ, నా ధైర్యం నా లక్ష్మినే. సరిగ్గా అలోచిస్తే నేను ఇంతలా ఆందోళన పడుతున్నానంటే కారణం నా లక్ష్మికోసం కాదు నా కోసమే. ఔను ఇది నిజం. తను లేకపోతే నేను లేను. ఇదంతా నన్ను నేను కాపాడుకునేందుకు పడుతున్న తపన. నా జీవితం ఏర్పడి నేటికి 60 వసంతాలు దాటినా నా జీవిత ప్రయాణం మొదలైంది మాత్రం ఆమె నా జీవితంలోకి ప్రవేశించాకనే అని చెప్పాలి. నా మాటలకి స్పందించే ప్రతిధ్వని నోరు తెరవని స్థితిలో వుంది, నన్ను నన్నుగా చూపే ప్రతిబింబం ప్రతిస్పందించలేని స్థితిలో ఆసుపత్రి మంచంపైవుంది అనుకుంటూ నాలో నేను మాట్లాడుకున్నాను. చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకున్నారేమో తెలియదు. కానీ నిజంగా నాకు నా లక్ష్మి అంటే అంత పిచ్చి.

ఆ పిచ్చి ఏర్పడడానికి కారణం నాపై లక్ష్మి చూపించిన పిచ్చి ప్రేమే. తన పిచ్చి ప్రేమ ఎలాంటిదో తెలియాలంటే మా కథ మీకు చెప్పాలి.


మొట్టమొదటిసారి ఒక పెళ్లిలో నా లక్ష్మిని వాళ్ళ మావయ్యగారి ఇంట్లో చూశాను. వాళ్ళు మాకు దూరపు చుట్టాలు. ఆమెకు 16 సంవత్సరాలు వుంటాయి. గంధసింధూరం రంగు చీరలో, గుమ్మడి గింజ ఆకారపు బొట్టుతో, సిగలో కనకాంబరం పువ్వులతో, నిండైన చందమామలా ఆ రూపం నాలో ముద్రపడింది. ఇంతలో మా అమ్మ నా అభిప్రాయం కోసమో, లేక నాకు తెలియపరచటం కోసమో, తెలియదుగానీ వచ్చి ఆ అమ్మాయిని నీకు అనుకుంటున్నామని చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మకు తెలియదుగా తను చెప్పకముందే భార్యగా నా మనసులో ఆమె ముద్ర వేసుకుందని. ఆ క్షణం నా ఆనందానికి అవధులు లేవు. ఏమిటిది! నిజమా లేక కలా అనే సందేహం. కానీ నిజమేనని తెలిసి తేరుకున్నా. ఇంతలో ఎవరో వీధిలో మానాన్నగారితో మాట్లాడుతుంటే విన్నాను. ఆ అమ్మాయి మీ కోడలు అవ్వటం మీ అదృష్టమండి. మీ అబ్బాయి రాసిపెట్టి పుట్టాడు అని అన్నారు. ఆ మాటలు విన్న నాకు ఒక్కసారిగా తెలియని ఉత్సాహం వచ్చింది. ఆ ఆనందం, ఉత్సాహంలో వుండగానే మాకు పెళ్లయింది. పెళ్లైన మూడు వారాల్లో అనుకుంటా, నా స్నేహితుడు ఒకడు వచ్చి, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగాలు పడ్డాయని తెలపడం, దరఖాస్తు చేయటం, ఉద్యోగం పొందడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతా తను వచ్చిన వేళావిశేషమంటే ఎప్పుడూ ఒప్పుకునేది కాదు.కాఫీ అంటే ఇష్టంలేని తను, నాకు ఇష్టమైన బెల్లం కాఫీ, నాతోపాటు తాను అలవాటు చేసుకుంది. నేనంటే అంత పిచ్చి ప్రేమ. తెల్లవారింది మొదలు నిద్రపోయేవరకు నాకు ఏమికావాలో నాకంటే తనకే బాగా తెలుసు. ఒక్కమాటలో చెప్పాలంటే తనులేనిది ఒక్కఅడుగు కూడా పడలేదు. తనకి చెప్పలేని ఒక్కమాట కూడా పలకలేదు. కానీ నాకు ఉన్న ఒకే ఒక్క చెడు వ్యసనం ధూమపానం. ఆ అలవాటును మాన్పించాలని ఎంతో ప్రయత్నం చేసేది కానీ నేను వినలేదు.


మా అమ్మానాన్నలకి కూతురు లేని లోటు తీర్చిందని చెప్పాలి. మా కుటుంబ విలువను మరింత పెంచింది నా లక్ష్మీ. తను పూజలు చేస్తున్నప్పుడు ఏమని కోరుకున్నావంటే, మీరు బాగుండాలి, వచ్చే జన్మలో కూడా మీరే నా భర్తగా రావాలని కోరుకున్నాను అనేది. ఆ మాటవిని ఆనందపడేవాడిని. నిజానికి తను కోరుకున్న కోరిక కూడా తనకోసం కాదు నాకోసమే. ఔను తను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా నా భార్యే అంటే నా అదృష్టమే కదా.


ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనానికి క్యారేజీలో, నాతో పాటు నాతోటి సహోద్యుగులకి కూడా వండి పంపేది. సాయంత్రం పూట మా అరుగుపై కొంతమంది పిల్లలకి ఉచితంగా పాఠాలు చెప్పేవాడ్ని. దానికి ప్రోత్సాహం కూడా తనే. అక్కడికి వచ్చే ఆడపిల్లల్ని అందంగా తయారుచేసిది. పిల్లలు ఎవరైనా గొడవలు పడుతుంటే సర్దిచెప్పి వాళ్ళ మధ్య స్నేహబంధాన్ని ఏర్పరిచేది. నాతోపాటు ఆ పిల్లలకి ఫలహారాలు చేసి పెట్టేది. ఎందుకు ఇంత శ్రమ అంటే మనకు ఎలాగూ పిల్లలు లేరు. ఆ దేవుడు వీళ్ల రూపంలో పిల్లలను మనకిచ్చాడు. వీళ్లంతా మనపిల్లలేనండి. మీరు నాకు బుజ్జి పిల్లాడనేది. ఔను అది నిజమే. ఆమెకు నేను చిన్న పిల్లోడినే. నాకు ఒక్కసారి టైపాయిడ్ వస్తే తాను ఎంతలా తల్లడిల్లిపోయిందో, నాకు తగ్గాలని తాను మొక్కని దేవుడు లేడు. చేయని పూజలేదు. తనకి ఎటువంటి జ్వరం కానీ నలత కానీ వచ్చినా చెప్పేది కాదు. ఒక్కసారి నా పుట్టినరోజున నాకు ఇష్టమైన వంటకాలు చేసింది. మరుసటి రోజు చూస్తే పూర్తి జ్వరంతోవుంది అదేం చెప్పలేదని అడగ్గా నిన్నటినుంచే ఉందని, చెప్తే బాధపడతారంది. అంత వెర్రిబాగులది.


నాశిష్యులు, సహోద్యుగులు, పూజ్యులు నా రిటైర్మెంట్ రోజున నాతో పాటు తనను కూడా సత్కరించారు. ఆ సత్కారానికి సిగ్గుపడుతూ, వాళ్ళు చూపిన అభిమానానికి కన్నీరుపెట్టుకుంది. ఆ క్షణంలో ఆమెలోని చిన్నపిల్లను చూశాను. నా పూర్వ శిష్యులు మేము ఇంతటి వృద్ధిలోకి రావటానికి కారణం మా తల్లిదండ్రులు, గురువులతో పాటు మీరు కూడా అంటే ఆమె సంతోషానికి అవధులులేవు. నా సహోద్యుగులు ‘మేడం !మేము రేపటినుంచి మీ వంటకాలు మిస్సవుతున్నాము.ఆ పప్పు మామిడికాయ, బంగాళదుంప వేపుడు, గోంగూరపచ్చడి, గుమ్మడికాయపులుసు, గుత్తివంకాయకూర, జీడిపప్పు పాయసం, ఇంగువ వేసిన పులిహోర, మజ్జిగపులుసు, వడియాలు’ ఇలా మెను చెపుతుంటే ఆమె ఉబ్బితబ్బిబైంది. నేను ఆ సభలో మాట్లాడుతూ ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది. ఇల్లును చూసి ఇల్లాలు గురించి చెప్పవచ్చు అంటారు. అవును అది నిజం. నా వెనుకనే కాదు ముందువుండి నడిపింది నా భార్య. నా ఇల్లునే కాదు నా జీవితాన్నీ చక్కద్ధింది నా భార్యనే. అందుకే నేనంటాను, నేను మీ గురువును. కానీ చాలా విషయాలలో నా లక్ష్మీ నే నాకు గురువు అని సగర్వంగా చెప్పగలను. అంటే అందరూ ఆ సభలో చప్పట్లు హోరెత్తించారు. ఆ మాటలకి తను మీరు అలా తక్కువ చేసుకుని మీ ఆయుస్సును తగ్గించుకోవద్దనంటూ చిన్నముఖం చేసుకుంది. అవును తనను పెద్దదానిని చేసి నా ఆయుస్సును కాదు, తన ఆయుస్సు తగ్గించానేమో, అందుకే ఇలా జరిగివుంటుందంటూ దుఃఖన్ని ఆపుకోలేకపోయాడు శ్రీధరరావు. కన్నీరు పెట్టుకుంటూ ఔను మీకు ఆ రోజు ఆసుపత్రిలో ఏమిజరిగిందో చెప్పలేదుగా అంటూ ఆసుపత్రిలోని లక్ష్మి పరిస్థితి గురించి చెప్పటం మొదలు పెట్టాడు.


ఇంతలో డాక్టర్ వచ్చి, “మాస్టారూ! అమ్మ గారికి ఏమికాదు. నేనే ఆ ఆపరేషన్ చేసిన డాక్టరుని. ఇప్పుడేం ఫర్వాలేదు. 12గంటలు తరువాత సృహలోకి వస్తారు. అప్పుడు చూడవచ్చు. అయినా మాలాంటి పిల్లలెందరినో అభివృద్ధి కారకులు చేసిన దంపతులు మీరు. మీకు ఎలాంటి కష్టంరాదు. రానివ్వం మాస్టారూ.” అన్నారు .

నాకు ఏమీ అర్ధం కాలేదు. “నన్ను గుర్తుపట్టారా” అనిఅడిగారు డాక్టర్. నేను గుర్తుపట్టలేదు “ఎవరుబాబు మీరు?” అనిఅడగగా, “మాస్టారు! నేను మీ శిష్యుడుని. కొన్నిరోజులు మీ అరుగు పై ఉచితంగా చదువు నేర్చుకున్నాను. నేను, వేరే అబ్బాయి గొడవ పడుతుంటే అమ్మగారే మాకు మంచి మాటలు చెప్పి, తినటానికి జీడులు కూడా ఇచ్చారు. ఆరోజు ఆమె చెప్పిన మాటలు ఎప్పుడు నా మదిలో గుర్తుకు వస్తాయి. మీ దంపతులను ఎలా మరచిపోతాను మాస్టారు”. అని ఆ డాక్టర్ చెప్పిన మాటలు కొద్దిసేపు నన్ను ఏమీ మాట్లాడనివ్వలేదు. నేను చెప్పిన పుస్తక పాఠాలు కంటే నా భార్య చెప్పిన జీవిత పాఠాలే ఆ అబ్బాయిని ప్రభావితం చేశాయి,బహుశా మా దంపతులు గుర్తుకువుంది కూడా ఆ మాటల వలనే కాబోలు. ఆ క్షణంలో ఆమె పై నాకు అమితమైన గౌరవం పెరిగింది. తనను చూడటానికి ఆసుపత్రికి బంధువులు, నా శిష్యులు, నాసహాద్యోగులు వస్తే నాకు అనిపించింది, ఇంతటి ఆత్మీయసౌధాన్ని నిర్మించింది నా లక్ష్మీ నేకదా.


సుమారు నెల రోజులు గడిచాయి. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశాము. తను కొన్ని రోజులు మంచానికే పరిమితం అవ్వాలని డాక్టర్స్ సూచించారు. తను ఈ స్థితిలో ఉన్నందుకు బాధగావున్నా, తనకు సేవలు చేసే భాగ్యం కలిగినందుకు ఒక్కింత ఆనందంగాను వుంది. ఇన్ని రోజులు నాకు సమయానికి ఏంకావాలో తెలిసిన ఆమెకి, ఇప్పుడు ఏంకావాలో తెలుసుకొనే సమయం వచ్చింది. నేను ఈ పనులన్నీ చేస్తుంటే తను బాధపడుతుంది. కానీ తనకేం తెలుసు ఆమెకి తలదువ్వి నా ప్రేమ పరిమళాన్ని ఆ సిగలో గుచ్ఛాలని, తనకు ఇష్టమైన బీరకాయ పోపుతో అన్నం తినిపించి, నా కమ్మని ఆప్యాయతను తనలో జీర్ణంచేయలని ఎప్పటినుంచో వున్న కోరిక. కానీ తను నా చేత ఎప్పుడు చేయించేదికాదు. ఇప్పుడు ఆ భగవంతుడు తనకి చేయమని ఈ రకంగా ఆదేశించాడేమో. ఇన్నాళ్ల దాంపత్య జీవితంలో ఏనాడూ నాకు అది కావాలి ఇది కావాలని లక్ష్మీ కోరలేదు. తన భార్యకి ఏంకావాలో తెలుసుకుని సమకూర్చేవాడే నిజమైన భర్త. ఆ నిజాన్ని అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు.


నేను కాల్చే ఆ చుట్టను (దూమపానంను) పూర్తిగా మానేశాను. నాకు ఇష్టమైన బెల్లం కాఫీ కూడా మానేశాను. తనకు ఇష్టమైన అల్లం టీ తనతో పాటు తాగుతున్నాను. తన ఇష్టాన్ని నాఇష్టంగా మార్చుకుంటే ఎంత బాగుందో, తనకోసం నా ఇష్టాన్ని వదులుకుంటే మరీ బాగుంది. ఇన్నాళ్లు ఈ ఆనందాన్ని నా లక్ష్మీ అనుభవించింది. ఇకపై నేను అనుభవిస్తాను. తను మంచం పై వున్నంతకాలమే కాదు ఆమె వున్నంతకాలం నేనే పనులన్నీ చేస్తానని నా లక్ష్మీ దగ్గర మాటతీసుకున్నాను. ఇకనుంచి నా లక్ష్మి ని మహాలక్ష్మిలా కాదు మహారాణిలా చూసుకుంటాను అంటూ పెరటిలో వున్న ఆవుకి, పక్షులకి, మొక్కలకి, పాదులకి చెప్పాడు శ్రీధరరావు.


భార్య ఆరోగ్యమే తన ఆనందంగా శ్రీధరరావు, భర్త సుఖమే తన సంతోషంగా లక్ష్మీ ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ, అనోన్యదంపతులుగా, అందరికీ ఆదర్శ దంపతులుగా నిలిచారు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.రచయిత పరిచయం :

రచయిత పేరు: శ్రీధర్ గోపిశెట్టి

తల్లి పేరు: కనకమహాలక్ష్మి

తండ్రి పేరు: వెంకటేశ్వరరావు

చదువు: బిటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్)

వృత్తి: అసోసియేట్ డైరెక్టర్ మరియు అసిస్టెంట్ రైటర్ (తెలుగు సినిమా)


కంపెనీ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ (క్రిష్ జాగర్లమూడి)

&శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)77 views0 comments

Comments


bottom of page