top of page

మా నాయనమ్మ - రెండవ భాగం **ఆల్ రౌండర్*


'Maa Nayanamma Part - 2

'All Rounder' written by Lakshmi Madan

రచన : లక్ష్మీ మదన్

అప్పటి ఇళ్లన్నీ చతుశ్శాల భవంతులు కదా! మా ఇల్లు అలాంటి ఇల్లే, నాలుగు మనసాలలు, మధ్యలో గచ్చు. వాన నీరు పడితే పోవడానికి ఒక తూము ఉంది. ఇంటికి ఎవరైనా వస్తే అక్కడ గంగాళం, చెంబు పెట్టి కాళ్ళు కడుక్కుని రమ్మని చెప్పేవారు.

ఇంటికి ఎదురుగా గడపకి ఆనుకొని కూర్చునేది మా ముసల్ది. ఎవ్వరు ఇంటికొచ్చినా తనతో మాట్లాడే లోపలికి పోవాలి. లేకుంటే మూతి మూడొంకర్లు తిప్పేది. మొదట్లో మా అమ్మ అంటే కొంచెం కినుకు ఉండేదట. కోడలు కదా! కానీ నేను చూసేటప్పటికి మాత్రం అలా లేదు.

ఎంతో ప్రేమగా ఉండేది అమ్మతో.

మా అమ్మ లోపల పని చేస్తుంటే మమ్మల్ని తిట్టేది, "ఆ పిల్ల ఒక్కతే పని చేస్తుంది. మీరు పొయ్యి ఏమన్నా చెయ్యండి! "అనేది. మేము కిసకిసా నవ్వే వాళ్ళం, "పిల్లనా! "అని…

"అవును పిల్లనే మరి.. గింతప్పుడు వచ్చింది" అనేది. మా నాయనమ్మకి పురుష సూక్తం, మన్య సూక్తం, మంత్ర పుష్పం మరియు సంధ్యా వందనం నోటికి వచ్చేవి. మగ వాళ్ళకి దీటుగా చదివేది. అప్పుడు నేను అనుకునే దాన్ని “అమ్మో! ముసల్ది గ్రేట్ " అని.

ఎంతో తెలివి కలది. ఎన్నో పూజలూ వ్రతాలూ చేసిందట. వాడలో ఎవరు గర్భవతి అయినా వారికి తినడానికి ఏదైనా పెట్టేది. ఆవకాయ అయితే ఎంతో మందికి పంచేది. మజ్జిగ కుండలో కవ్వంతో చేసి.. ఆ మజ్జిగని అందరికీ పోసేది.

వయసు పెరగడం వల్ల ఇంటికి వచ్చే వారిని కొందరిని గుర్తు పట్టక పోయేది. వాళ్ళు వచ్చి " బాగున్నావా నర్శక్కా" అంటే " బాగున్న..మీరంతా బాగేనా! " అని అడిగేది. కానీ వాళ్ళు ఎవరో తెలిసేది కాదు. అప్పుడు మెల్లిగా" ఎక్కన్నుంచి నాయనా" అని అడిగేది..ఊరి పేరు చెప్తే గుర్తు పట్టొచ్చని.. వాళ్ళు "ఇంటి నించే" అనే వాళ్ళు.. పచ్చి వెలక్కాయ గొంతుల పడేది ముసల్దానికి😆.

మా ఇంట్లో రేడియో కొన్న కొత్తలో పాటలు, నాటకాలు వినే వాళ్ళం. సాయంత్రం గడప దగ్గర కూర్చొని ఎప్పుడు రేడియో పెడతారా అని చూసేది. ఒక వేళ మేము మరచి పోతే " పాటలు పెట్కుంటారేమో పెట్కొండి" అనేది. నేను అనే దాన్ని “నువ్వు వింటా అని చెప్పొచ్చు కదా” అని..వెంటనే ‘ఉా’ అని మూలిగేది.

ముగ్గులు ఎంత బాగా వేసేదో! కానీ రాక్షసి, ఎవరినీ వేయనిచ్చేది కాదు. తనే వెయ్యాలి.. నేను బాగా పెద్దగా అయ్యాక అప్పుడు వేయనిచ్చింది.

అంత వయసులో కూడా మా ఆంజనేయ స్వామి గుడిని రోజూ ఊడ్చి చానిపి చల్లి, ముగ్గులు వేసేది.

దిష్టి మంత్రం, పస్కల మంత్రం, మొగుళ్ళ మంత్రం మరియు తేలు మంత్రాలు వేసేది. ఎంతో మందికి వ్యాధి నయం చేసింది. మందులు కూడా తయారు చేసేది. ఇంకా ఉన్నాయి ముసల్దాని ముచ్చట్లు..

***

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.

109 views0 comments

Comments


bottom of page