top of page

మా ఇల్లే ఒక బృందావనం!


'Maa Ille Oka Brundavanam' New Telugu Story

Written By Varanasi Bhanumurthy Rao

'మా ఇల్లే ఒక బృందావనం' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఉద్యోగాల వేటలో హైదరాబాదు కు వచ్చిన నేను ఒక బాంకులో మంచి వుద్యోగాన్ని సంపాయించడం, ఆ తరువాత నా ఇద్దరు తమ్ముళ్ళను హైదరాబాదుకు పిలిపించి కాలేజీలల్లో చేర్పించడం‌, చక చక మని జరిగి పొయ్యాయి. ‌ కాలేజీ తరువాత మొదటి తమ్ముడు ఏదో ప్రైవేటు కంపెనీలో మెటీరియల్స్ మేనేజర్ గా చేరాడు. ‌మంచి జీతం, హోదా ఉన్నాయి. ‌ ఇక రెండవ తమ్ముడు ఇంకా సీ. ఏ. చదువుతున్నాడు.


ఒక రోజు నేను పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. మా తాత గారికి చాలా సీరియస్ గా ఉందని, వెంటనే బయలుదేర మని.. తాతగారికి మా అమ్మ గారు ఒక్కతే సంతానం.


నేనూ, నా చిన్న తమ్ముడు హడావుడిగా ఆర్ టీ సీ ఎక్స్‌ప్రెస్ బస్సులో బయలు దేరాము. ఇంకొక తమ్ముడు పనుల ఒత్తిడి వలన రాలేక పొయ్యాడు.


డ్రైవర్ ని అభ్యర్థించిన పిమ్మట మా వూరి క్రాస్ రోడ్ లో నిలిపాడు. ఎక్స్ ప్రెస్స్ బస్సు గాబట్టి మా వూర్లో బస్సు నిలబడదు. ‌ హైదరాబాదు నుండి తిరుపతికి వెళ్ళే బస్సులు కడప, రాయచోటి, పీలేరు మీదుగా తిరుపతికి చేరుతాయి. ఆ వూర్లల్లో మాత్రమే బస్సులు నిలుపు తారు. కానీ ఎక్కడంటే అక్కడ నిలబడవు.


ఆఘ మేఘాల మీద బయలు దేరాము మేము. బస్సు దిగుతూనే మా తాతగారిని చూడాలని మనసు తహ తహ లాడింది.


నేను పెద్ద మనమడిని గాబట్టి మా తాత గారికి నేనంటే చాలా ఇష్టం.


మేము ఇంటికి చేరేసరికి హాల్లో తాతగారు నులక మంచం మీద పరచిన ఒక పాత దూది పరుపు మీద పడుకొన్నాడు. ఆ పరుపును మా తాత గారు ఎన్నో ఏళ్ళ నుండి వాడుచున్నాడు. ఆ పరుపు మీదనే నేను చిన్నప్పుడు తాత గారితో పడుకొని బోలెడు కథలు చెప్పించు కొనే వాడ్ని. అలాగే తాత గారు తత్వాలు బాగా పాడే వారు.


మా తాత గారి పరుపు నుండి ఒక రకమైన వాసన వచ్చేది. అది మా తమ్ముళ్ళకు నచ్చేది గాదు. కానీ నాకు తాత గారంటే అమిత మైన ప్రేమ గాబట్టి, ఆ పరుపు వాసన వల్ల నా కేమీ ఇబ్బంది కలిగేది కాదు.


మహా భారతం, రామాయణం కథ లన్నీ ఆ పరుపు మీద పడుకొనే తాతగారు చెబుతుంటే శ్రద్ధగా వినేవాడిని.


ఆయన పెద్దగా చదువు కోక పోయినా మన పురాణాల్లో ఉన్న ధర్మ సూక్ష్మాలను విపులంగా చెప్పేవాడు.


వేసవి కాలంలో మేమందరం వరండాలో పడుకొనే వాళ్ళం. ‌‌ మా చిన్నతనం లో మా వూర్లో అప్పటికి ఇంకా కరెంటు రాలేదు. ఇప్పటి లాగా ఫాన్లు గూడా వుండేవి కావు. కాబట్టి వెదురు విసన కర్రలు వాడే వాళ్ళం. ‌ దోమలు ఎక్కువయితే దోమ తెరలు వాడే వాళ్ళం. మంచి కుండలో నీళ్ళు పోసి రాత్రి పూట దప్పికయినప్పుడు ఆ చల్లటి నీరు త్రాగే వాళ్ళం.


మా వూర్లో త్రాగు నీటికి గూడా కరువే! వూరి కంతటికీ ఒకే ఒక దిగుడు బావి వుండేది. దానిలో ఎక్కడో లోతున మెల్లగా దిగాలి. అక్కడ సన్నటి ధారగా వూట వూరి నీరు వచ్చేది. వంతుల వారీ ఒక్కొక్క బిందె పట్టుకొనే వారు మా వూర్లోని ఆడ వారు. ఒక్క బిందె నీటికి ఎన్ని కష్టాలు పడే వారో ఆ దేవుడికే తెలియాలి. ‌ ఒక తెల్లని గుడ్డ బిందె మూతికి కట్టి నీటిని పట్టే వారు. పురుగులు, మట్టి లాంటివి ఏమైనా వుంటే వడగట్ట దానికి ఆ తెల్లని బట్టను వాడే వారు.. ఆ కాలంలో బ్రతక డానికి ఎన్ని కష్టాలు పడినారో ఆ భగవంతుడికే తెలియాలి. ప్రభుత్వం వారు ఒక బావిని తవ్వించారు. ఆ బావి లోతు ఆరేడు వందల అడుగులు వుండేది. అంత లోతు తవ్వినా అక్కడ ఉప్పు నీళ్ళు పడినాయి. ఆ నీటిని చేదాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. అయినా మా అమ్మ గారికి మేము పిల్లలంతా సాయం చేసే వాళ్ళం. నీటిని చేంతాడుతో చేది, అండాలల్లో, గంగాళాల్లో నింపడం మా పని. అమ్మ ఆ నీరు బిందెల్లో తీసుకొని మా బచ్చట్లో ఉన్న నీటి తొట్టిని ఇ నింపేది. ఆ నీరు మేము స్నానాలకు వాడే వాళ్ళం. ఎండా కాలంలో నీటి కొరత చాలా వుండేది రాయల సీమ పల్లెల్లో.


రాత్రి పూట మరీ ఎక్కువ ఉక్క బోస్తే తాత గారు ఇంటి ముందర పడుకొనే వారు. చల్లని గాలి, ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలను చూస్తూ నేనూ, మా తాతగారు ఆ మంచం మీద పడుకొని కథలు చెప్పుకొంటూ నిద్ర పొయ్యే వాళ్ళం.


కొత్త పరుపు కొనమని ఎన్ని సార్లు చెప్పినా కొనే వాడు గాదు మా తాత. సూది, దారం తీసుకొని ఎక్కడన్నా చినుగులు పడితే కుట్టుకొనే వాడు. అప్పుడప్పుడు మాత్రం దూదేకుల సాయబూలు వస్తే పత్తిని ఏకించి, ఆ పత్తిని పరుపులో దురిగి మళ్ళీ అదే పరుపును వాడుకొనే వారు మా తాతగారు.


కొందరు కొన్ని వస్తువులు అవి నిర్జీవ మైనా, వాటితో జీవితాంతం అనుబంధాన్ని పెన వేసు కొంటారు. అలా ఆ వస్తువుల్ని భద్రంగా దాచుకొంటారు. ‌ మా తాత గారికి ఆ పరుపు అలాంటిది. మా అమ్మమ్మతో ఎన్ని అనుభవాలు పంచుకొన్నాడో మా తాత ఆ పరుపులో. అందుకే ఆయన ఆ పరుపును ఇప్పటికీ వదల లేదు.


మా అమ్మ మా తాతకు ఏదో కషాయం తాపిస్తోంది. అమ్మ నన్ను చూడ గానే బావురుమంది.


" తాతకు ఆరోగ్యం ఏమీ బాగా లేదప్పా! నిన్ను చూడాలని ఒక్కటే కలవరం" అని అమ్మ తన చీర కొంగుతో ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకొనింది.


తాత గారు ఆయాసంతో రొప్పు తున్నాడు. పొరలు పొరలు గా వస్తున్న దగ్గును ఆపుకొంటున్నాడు. తాత గారికి బీడీలు తాగడం అలవాటు. ‌ అతనికి ఆ అలవాటు వయసులో ఉన్నప్పుడే అయిందట.


" తాతా! ఏమీ కాదు. అంతా తగ్గి పోతుంది" అని నేను ఆయన ఎద రొమ్మును స్పృశిస్తూ అన్నాను.


" నా పని అయి పోయిందిరా భాస్కరా! ఇక ఐదారు రోజుల్లోనే అంతా అయిపోతుంది. అందుకే నిన్ను రమ్మన్నాను. కడ సారిగా నిన్ను చూసుకొని చచ్చి పోతాను" అన్నాడు మా తాతగారు.


" అలా మాట్లాడ వద్దు తాతా!" అని నేను అన్నాను వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ.


తాతగారికి పదెకరాల పొలం ఉన్నది. జీవితాంతం వ్యవసాయం మీదనే బ్రతికిన మనిషి. మా అమ్మమ్మ మా అమ్మ గారు పుడుతూనే చని పోయింది. మంత్రసాని పురుడు పోసిందట. ఏమయిందో ఏమో మా అమ్మ గారు పుడుతూనే అమ్మమ్మ చని పోయిందట. ఆ కాలంలో ఒక్కొక్క ప్రసవానికి పునర్జన్మ ఎత్తినట్లే! ఆసుపత్రి సౌకర్యాలు తక్కువ.


అమ్మ వంటింట్లోకి వంట చెయ్యడానిక పోయింది. వంటిల్లంతా పొగ వ్యాపించింది. కట్టెల పొయ్యితో వంట చెయ్యాలి.


నా చిన్న తమ్ముడు వాళ్ళ చిన్న నాటి స్నేహితుల్ని కలవడానికి బయటకు వెళ్ళాడు.


మా నాయన సామాన్య రైతే! తాతగారి పొలాలన్నీ మా నాయనే చూసుకొంటాడు. ఇక అల్లుడైనా, కొడుకైనా ఆయనే కదా చూసుకోవల్సింది.


మా తాత గారికి మందులు కొనడానికి మా నాయన కలికిరికి పొయినాడని మా అమ్మ చెప్పింది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వుంది. ఆ డాక్టరు చాలా మంచి వాడు. పేదల పట్ల జాలి, కరుణ చూపించే వాడు. మాకు గూడా జ్వరాలు వస్తే కలికిరికి పొయ్యే వాళ్ళం. పోతూనే ఏదో ఎర్ర నీళ్ళ మందు ప్రతి ఒక్కరికీ సీసాల్లో పట్టి ఇచ్చే వారు. అలాగే కలికిరిలో సీనయ్య అనే డాక్టర్ వుండే వారు. ఆయన అయుర్వేద డాక్టరు. పెద్ద పెద్ద రోగాల్ని నయం చేస్తాడని చిత్తూరు జిల్లా అంతా తెలుసు.


మా అన్నదమ్ములది గొప్ప అదృష్టం. ఏమిటంటే మంచి అమ్మా నాయనలు పొందడం. వారికి చదువు లేదు గాబట్టి మమ్మల్ని ఎలాగైనా చదివించాలని వారి అభీష్టం. అలాగే ఎన్ని తిప్పలు పడయినా సరే మా తల్లి దండ్రులు మమ్మల్ని బాగా చదివించారు. అందరినీ గ్రాడ్యుయేషన్ చేయించారు. ‌ ఇప్పుడు నేను మంచి వుద్యోగంలో వున్నాను. మాది ఒక రకంగా మధ్య కుటుంబీకుల రైతు కుటుంబం. మా వూర్లో మా తాతగారికి మంచి పేరు, పలుకు బడి ఉండేది.


" భాస్కరా! ఇక్కడ కూర్చో నాయనా!" తాత గారికి దగ్గరగా కూర్చొన్నాను.


" ఈ ఇల్లు నా ఆరో ప్రాణం నాయనా! మీ అమ్మ పెళ్ళి కోసం ఈ పదహారంకణాల రాతి మిద్దె కట్టించాను.. అంతకు ముందు మనకు రెండు కొట్టాలు ఉండేవి. ఈ ఇంటికి ఖర్చు అప్పట్లో ఐదు వందలు అయింది. మూడు వందలు అప్పు తీసుకొని కట్ట లేక ఒక్క ఎకరా భూమి అమ్మేసి నాను అప్పట్లో నాయనా!" అని చెబుతున్నప్పుడు ఆయన కంఠం దుంఖంతో పూడుకు పోయింది.


" నాకు తెలుసు తాతా! ఈ ఇల్లు కట్టడానికి నువ్వు చాలా కష్ట పడ్డావని. అమ్మ నాకు చాలా సార్లు చెప్పింది." అన్నాను నేను.


" భాస్కరా.. ఈ ఇంటి మిద్దె కు బండలన్నీ నేనే మోసినాను. ఈ గుణావర్ధనం తవ్వినప్పుడు పూజలు బాగా చేసినాము. పద హరు రాతి స్థంభాల మీద అరవై నాలుగు బండలు పరచి నాము. దాని మీద చవుడు బంక మట్టి కప్పినాము. ఈ ఇల్లు కట్టి యాభై సంవత్సరాలు అయితా వుండాది. మీరు ముగ్గురూ పిల్లలూ ఇక్కడే పుట్టినారు." తాత ఆయాసంతో మాట్లాడ లేక పొయ్యాడు.


ఎందుకో తాత గారు చాలా బాధపడుతున్నా రనిపిస్తోంది.


" నేనొక్క మాట చెబుతా నాయనా! నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. అమ్మా, నాయనా మిమ్మల్ని చదివించడానికి ఎంత కష్ట పడినారో నాకు తెలుసు. ఒక పూట తినీ తినకుండా మిమ్నల్ని ప్రయోజకుల్ని చేసినారు. మీరు నగర జీవితానికి అలవాటు పడిపోయినారు. ‌ ఇక ఈ పల్లెలో మీరుండ లేరు."


దగ్గు ఆయాసంతో మళ్ళీ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు తాత గారు. తాత గారి గొంతులో కఫం చిక్కుకు పోయింది. పక్క నున్న ఒక సత్తు గిన్నెలో గళ్ళని వుమ్మేసి నాడు తాత గారు.

మంచి నీరు ఒక లోటాలో పోసి తాత గారికి త్రాపించాను. మెల్లగా లేచి కూర్చో బెట్టాను‌. హైదరాబాదు నుండి తెచ్చిన పుల్లారెడ్డి స్వీటు తిని పించాను. ఆపిల్ పళ్ళు కట్ చేసి తినిపించాను. ‌


" భాస్కరా! ఈ ఇల్లు నా ఆరో ప్రాణం నాయనా! ఈ ఇంటి గోడలు నెర్రెలు చీలి పోయినాయి. ‌ ఈ ఇంటికి నువ్వు మరమ్మత్తులు చేయించాలి. మళ్ళీ మనిల్లు కళ కళ లాడి పోవాలి. మనకుండే పదెకరాల పొలం గూడా మీ అన్న దమ్ములు ఎప్పటికీ అమ్మ గూడదు. ఎప్పటి కైనా భూమి తల్లే మనల్ని కాపాడుతుంది. అమ్మా, నాయనను బాగా చూసుకోండి. వారిని ముసలి తనంలో ఇక్కడ వదలొద్దు. మీ దగ్గరే ఉంచుకోండి" అని చెప్పడం ఆపాడు తాత గారు.


" ఈ మూడు విషయాలు నీకు చెప్పాను. నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు." అని నా కళ్ళల్లో కి చిన్న పిల్లాడిలా చూశాడు తాతగారు.


" తాతా.. నువ్వు చెప్పినట్లుగానే అమ్మా నాన్నను బాగా చూసు కొంటాను. ఈ ఇల్లు, పొలం అమ్మేదే లేదు. ఈ ఇల్లు రిపేరు చేయించి కొత్తగా మార్చేస్తాను" అని మా తాతగారి చేతిలో చెయ్యి వేసి చెప్పాను.


మా తాత గారి మొహం ఆనందంతో విప్పారింది. తృప్తిగా పడుకొని నవ్వు కొంటూ కళ్ళు మూసుకొన్నాడు.


అంతలో అమ్మ పిలిచింది.


" స్నానం చేసి భోంచెయ్యండి నాయనా! తాత గారికి గూడా కలిపి తీసుకొస్తాను" అని అంది అమ్మ.


టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళాను. బయట వున్న బచ్చట్లో స్నానం చేసి వచ్చాను.


అంతలో అమ్మ" నాయనా!" అని గట్టిగా ఏడుస్తోంది.


పరుగు పరుగున వరండా లోకి వచ్చాను. నిర్జీవ మైన తాత శవం పడి ఉంది. తాత గారు ఇక లేరనే విషయాన్ని జీర్ణం చేసు కోలేక పోతున్నాను.


. *******************************


ఒక మంచి కథనో, నవలనో చదువుతున్నపుడు ఆత్రుతతో పేజీలు చక చక మని ముందుకు తిప్పుతున్నట్లుగా కాలం గిర్రున తిరిగి పోతోంది.


అలా పది సంవత్సరాలు గడచి పొయ్యాయి.


మా కందరికీ పెళ్ళిళ్ళు అయిపొయ్యాయి. ఇంటికి వచ్చిన కోడళ్ళు గూడా బాగా చదివిన వారే! అందరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే! మా తమ్ముళ్ళు వేరే ఇళ్ళు కొనుక్కొని బాగా సెటిల్ అయి పొయ్యారు. నేను గూడా హైదరాబాదు, మల్కాజ్ గిరి లో స్థలం తీసుకొని ఇల్లు కట్టించాను.


కానీ నాకు ఒకటే వెలితి వుండేది. అమ్మా నాన్నలు హైదరాబాదు కు రమ్మంటే రారు. నేను ఎన్నో సార్లు పిలిచినా వాళ్ళు రాలేదు. వారిది ఒకటే కోరిక. పల్లెలో వున్న పాత ఇంటిని రిపేర్ చేసి కట్టించి ఇవ్వమని చాలా సార్లు అడిగారు. నాలుగైదు లక్షలు అవుతుంది అని మా నాయన అన్నాడు.


తాత గారికి ఇచ్చిన మాట ప్రకారం అయినా మా పల్లెలో ఉన్న ఇంటికి పునర్వైభవం తీసుకు రావలసిన భాధ్యత నా మీద వున్నది. ఆ విషయం తలచు కొన్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది.


కానీ ఎన్ని సార్లు తమ్ముళ్ళని అడిగినా ఒప్పుకోలేదు." ఆ పల్లెలో పోయి ఎవరుంటారన్నా! ఆ ఇంటికి ఖర్చు పెట్టడం దండగే!" అని అంటారు. దానికి తోడు వారి భార్యలు గూడా ససేమిరా ఒప్పు కోవడం లేదు. ‌

అమ్మా నాన్నను ఎలాగైనా ఒప్పించి హైదరాబాదుకు వాళ్ళను తీసుకు రావాలని కారు వేసుకొని నేను, నా శ్రీమతి బయలు దేరాము.


తలవని తలపుగా వచ్చిన మమ్మల్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయి పొయ్యారు అమ్మా నాన్న‌. ఆ పల్లె జీవితమే వారికి ఆనంద మయం.

ఎన్నో సార్లు అడుక్కొన్న పిమ్మట అమ్మా నాన్న హైదరాబాదు కు వస్తామని ఒప్పుకొన్నారు.


అందరూ కార్లో తిరుగు ప్రయాణంలో హైదరాబాదు కు చేరుకొన్నాము.


****************************************


ఒక ఆదివారం తమ్ముళ్ళను అందరినీ లంచ్ కి పిలిచాను. అమ్మా నాన్న సమక్షంలో ఆ ఇంటి గురించి మాట్లాడాలని నా వుద్దేశం.


లంచ్ అయి పోయిన తరువాత ఆ ఇంటి విషయం అడిగినాను.


" ఎందుకన్నా.. దండగ.. ఆ పల్లెలో వుండేదీ లేదు. పొయ్యేదీ లేదు. కరెంట్ వుండదు. నీళ్ళు రావు. ఒక ఆసుపత్రి లేదు‌. మంచి స్కూలు లేదు. ఒక రోజు గూడా ఆ వూర్లో వుండ లేము. అమ్మా నాన్నను ఇక్కడే వుంచు కొంటాము. వారికి ఆ పల్లెలో గూడా ఏం పని లేదు గదా?" అని అన్నాడు మా పెద్ద తమ్ముడు.


" కోట్లు పెట్టి విల్లాలు కొన్నారు మీరు. నాలుగైదు లక్షలు ఆ ఇంటికి మనం ఖర్చు పెట్టలేమా ? నేను రెండు లక్షలు వేసు కొంటాను. మీరు చెరొక్క లక్షా ఇవ్వండి" అని అన్నాను నేను అసహనంగా.


" ఏమో బావా! మా కయితే ఆ పనికి రాని ఇంటి మీద అంత ఖర్చు పెట్టడం మాకు ఇష్టం లేదు" అన్నారు ఇద్దరు మరదళ్ళు ఒకేసారి.


అమ్మా నాన్న ఇద్దరూ ఒకే సారి లేచి తమ గది లోకి వెళ్ళి పొయ్యారు. వారి బాధ నాకు అర్థమయింది.


" సరే.. మీరు ఖర్చు పెట్టలేము అని అంటున్నారు గదా! ఎంతయినా గానీ నేనే ఖర్చు పెట్టుకొంటాను. నేను తాత గారికి మాటిచ్చాను" అన్నాను నేను.


వాళ్ళు నలుగురూ ఏమీ మాట్లాడ కుండా కొంచెం సేపు తరువాత వెళ్ళి పొయ్యారు.


అడ్డాల నాడు పిల్లలు గానీ, గడ్డాలు వచ్చినాక పిల్లలు కాదు గదా!

****************************************

మూడు నెలలు హైదరాబాదు లో ఉండి అమ్మా నాన్న పల్లెకు వెళ్ళి పొయ్యారు.


వారికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్స్ లో ఏసి కోచ్ లో బుక్ చేశాను. పీలేరులో దిగి అక్కడ నుండి బస్సులో మా వూరికి వెళ్ళాలి.


వారికి రైలు ప్రయాణం అలవాటు లేదు. ఆ బోగీలు వెతుక్కోవడం వారికి చాలా కష్టం.


ధైర్యం చెప్పి వారిని 2 ఏ సి కోచ్ లో బెర్త్ లు చూపించి సామాన్లు సర్ది వచ్చాను.


****************************************


ఆరు నెలలు కాల చక్రం ముందుకు ఉరికింది. అమ్మా నాన్నలు బ్రతికి ఉన్నప్పుడే ఈ ఇంటిని కట్టి వారిని సంతోష పరచాలన్నది నా కోరిక. ఆ విషయం మటుకు నన్ను తీవ్ర మైన అలజడికి గురి చేస్తోంది.


రాయల సీమలో ఎడ తెరపి వర్షాలు. టీ వీ లో భయానక దృశ్యాలను చూసి భయపడి పొయ్యాను. సీమలో వర్షాలే పడవే! తిరుపతి సముద్ర మయం. రాజంపేట ముంపునకు గురి అయింది. ‌గ్రామాలన్నీ మునిగి పొయ్యాయి. ఎంత ప్రాణ నష్టం జరిగిందో అర్థం కాలేదు. పల్లెలన్నీ జలమయ మయ్యాయి. ‌ మా వూరి పరిస్థితి అలాగే ఉందట. పదునైదు రోజులుగా వర్షం తగ్గడం లేదు. మా ఇల్లు ఎప్పుడు కూలి పోతుందో తెలియదు. అమ్మా నాన్నలు వద్దంటే గూడా వెళ్ళినారు." వయసు అయి పోయిందమ్మా.. ఇక్కడే మాతోనే వుండి పోండి!" అని నెత్తీ నోరు బాదుకొని చెప్పినా వినలేదు అమ్మా నాయన.


ఆ రాత్రి అలా భయం భయం గానే గడిపాము.


***************************************


తెల్ల వారుతూనే మా కౌలు దారు నారాయణ నుండి ఫోన్ వచ్చింది.


ఆ భయంకర వార్త విని తట్టు కోలేక పొయ్యాను. అమ్మా నాన్నలు అరగంట వ్యవధిలో చని పొయ్యారనే మరణ వార్త. నా కళ్ళు బైర్లు కమ్మాయి. గుండె వేగంగా కొట్టు కొనింది. కాళ్ళూ చేతులూ వణుకు తున్నాయి. తల తిరిగి క్రింద పడి పొయ్యాను. శ్రీమతి పరుగున వచ్చి పట్టుకొని బెడ్ మీదకు చేర్చి గ్లూకోస్ వాటర్ త్రాపించింది.ఈ దుర్వార్తను తమ్ముళ్ళకు చేర వేశాను. వెంటనే మూడు కార్లల్లో డ్రయివర్లను మాట్లాడుకొని మా వూరుకి బయలు దేరాము అందరమూ.***************************************


వరండాలో విగత జీవులుగా పడి ఉన్న అమ్మా నాన్నలను చూసి దుంఖం కట్టలు కట్టలుగా తెగి ప్రవహించింది.


బ్రతికి ఉన్నప్పటి కన్నా మరణించాక వారు మనకు చేసిన సేవలు, మంచి పనులు గుర్తుకు వస్తాయి. బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించు కోరు.


పల్లె లోని జనాలు అందరూ మా ఇంటి ఆవరణలో నిండి పొయ్యారు. అందరి రోదనలతో మా ఇల్లు పిక్కటిల్లి పోయింది. పల్లెలో ఎవరి కయినా కష్టం వస్తే వారికే కష్ట మొచ్చినట్లు విల విల లాడి పోతారు. ఆ మాత్రం అనుబంధాలు, ఆప్యాయతలు నగరాల్లో కనబడవు. ‌


నారాయణ వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చినాడు. ‌ అమ్మా నాన్న గుణ గణాలను వర్ణిస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. నారాయణను సముదాయించడం నా వల్ల కాలేదు.


" ఈ వానల వల్ల హాల్లో ఉన్న బండలు రెండు విరిగి పొయ్యాయి అప్పా! అప్పటి నుండీ అమ్మకూ నాయనకూ ఒక్కటే దిగులు. ఎక్కడ ఇల్లు కూలి పోతుందో నని. ఒక చెట్ట మొద్దు తెచ్చి ఆ బండల క్రింద ఆనించి నాము. ‌" అంది వెంకటమ్మ. ‌


" యాడ.. అమ్మా నాయనా మొత్తు కొన్యారు గదా? ఈ ఇంటికి మరమ్మత్తులు చేయించమని. మీరు వింటే గదా? మీరు ఈ ఇంటి ఇసయమే పట్టించు కోలేదు." అన్నది ఎల్లమ్మ. వరసకు అత్త అవుతుంది ఆమె.


" లేదత్తా.. రిపేరు చేసి కొత్తగా ఇల్లు కట్టాలనే అనుకొన్యాము. ఇంత లోనే ఈ ఘోరం జరిగి పోయింది." అన్నాను నేను.


" రెండు బండలు మొన్న కూలి పొయ్యాయి భాస్కరా! అది చూసి నాయన తట్టుకోలేక పోయాడు. నాయన పానాలు వదిలేసిన రెండు గంటలకే అమ్మకు గూడా పానం పాయె. ఇద్దరూ ఒకరిని ఒకరు పొయ్యేంత వరకూ వదల్లేదు" అన్నాడు మా ఇంటి వెనకాల వుండే కేశవాచారి.


"పిల్లోళ్ళు అందరూ బయట బాగా సంపాయించి దుడ్లు పంపినారు. వూర్లో వాళ్ళు అందరూ మంచి బిల్డింగులు కట్టుకొన్నారు. మీ ఇల్లే ఇట్లా పాడు బడి పోయింది. మీరు ముగ్గురు అన్నదమ్ములున్నా ఈ ఇల్లు గురించి పట్టించు కోలేదు. ఆ బెంగతోనే అమ్మా నాయనా సచ్చి పాయిరి" అన్నాడు చెన్న కేశవులు.


అతను చిన్నప్పుడు నా బాల్య స్నేహితుడు.

ఏదో తప్పు చేసినట్లు అపరాధ భావంతో తలలు వంచుకొన్నాము మేము ముగ్గురు అన్న దమ్ములమూ.


అక్కడే పది రోజులుండి అమ్మా నాయనకు కర్మ కాండలన్నీ జరిపించి తిరుగు ప్రయాణంలో హైదరాబాదు కు బయలు దేరినాము.


హైదరాబాదు కు వచ్చి ఒక నెలయినా నేను మామూలు మనిషి కాలేక పొయ్యాను. ప్రతి క్షణం అమ్మా, నాన్న, తాత కలలో కనబడు తున్నారు. ఇంటి విషయం తేల్చమన్నారు.


*****************************************


ఒక సంవత్సరం తరువాత..


మా పల్లె లోని మా ఇల్లు పడ గొట్టి రెండు అంతస్థులతో అందంగా కట్టించినాము. మా తమ్ముడ్లు ఇద్దరూ గూడా చాలా సహాయం చేశారు. ముగ్గురం కలిసి పది లక్షల వరకూ ఖర్చు పెట్టినాము.

మా ఇంటి పేరు" బృందావనం" అని పేరు పెట్టాం.


మా ఇంటిని ఆ చుట్టు ప్రక్కల ఉన్న అనాధ పిల్లల కొరకు, వృద్ధాశ్రమం కొరకు, అంగన్ వాడీ బాలల కొరకు ఆ ఇంటిని ఒక పేరు మోసిన ట్రస్టుకు అప్పగించినాము.


ఇప్పుడు నా మనసు తేలిక పడింది. ‌ ఎక్కడో వైకుంఠ ధామం లో ఉన్న తాతయ్య, అమ్మా నాన్నల ఆత్మలు తృప్తిగా ఉంటాయని నేను అనుకొంటున్నాను.


******************************


వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు* ------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం* -----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి* ------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.47 views1 comment

1 Σχόλιο


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
16 Μαΐ 2023

Hindu Dharma Margam • 3 hours ago

కథ అద్భుతంగా ఉన్నది.‌ రచయితకు అభినందనలు.

Μου αρέσει
bottom of page