మలిప్రేమ

'Maliprema' New Telugu Story
Written By Lakshmi Sarma B
రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“చూడండి సుభద్రగారు… మీరు చెప్పేది నాకొక్క ముక్క కూడా అర్ధం కావడంలేదు, కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి,” అన్నాడు జడ్జి ప్రసాదరావు.
“అదేంటయ్యా … ఇంతవిడమరిచి చెప్పినా నీకు అర్ధంకావడంలేదా? సరే విను మళ్ళి చెబుతాను, మా ఆయన ఉన్నాడుకదా ! ఆయనకు నాకు విడాకులు కావాలి, ఆయనను భరించడం నావల్ల కావడంలేదు. రోజూ కీచులాటలే, మాకు ఎంత తొందరగా విడాకులిప్పిస్తే అంత ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాం” ఎదురుగా ఉన్న భర్తవైపు కోపంగా చూస్తూ చెప్పింది.
ఒక్కసారిగా కోర్టు హాలంతా నవ్వులతో ధ్వనించింది. జడ్జి కూడా కడుపుపట్టుకుని మరీ నవ్వుతున్నాడు. సుభద్రమ్మకు , ఆనందరావుకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్ధంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
“సైలెన్స్” అంటూ జడ్జిగారు టేబుల్ పైన టకటకమని శబ్ధంచేసారు.
“సుభద్రగారు … మీ ఇద్దరిని చూస్తుంటే ఆరుపదులు దాటినవాళ్ళలా ఉన్నారు. తెల్లగా పండిపోయిన తల, ముడతలుపడిన శరీరం.. బాధ్యతలన్నీ తీరిపోయి ఒకరిమీద ఒకరు ఆధారపడే వయసులో, ఈ విడాకుల గోలేంటో మాకు
తోచడంలేదు, మీ ఆరోగ్యం బాగానే ఉందికదా? లేకా ఏమైనా చిత్త చాంచల్యం లాంటిదేమైనా వచ్చిందా?,” అడిగాడు జడ్జి ప్రసాదరావు.
“జడ్జిసారు … మేము మంచిగానే ఉన్నాము, మా ఇద్దరికి పెన్షన్లు వస్తాయి. ఒకరిమీద ఒకరం ఆధారపడవలసిన అవసరంలేదు. మాకు మేముగా విడివిడిగా ఉండాలని అనుకున్నాము. అంతేకదా సుభద్రా” భార్యవైపు చూస్తూ అన్నాడు ఆనందరావు.
“ఆ … అవునవును అంతే,” అంది ఆవిడ తలూపుతూ.
“విడాకులంటే ఏదో తమలపాకులు.. మామిడాకులు అనుకుంటున్నారా ఏంటి మీరు?” అడిగాడొక లాయరు నవ్వుతూ.
“నీకెందుకయ్యా మా విషయం… మాకా మాత్రం తెలియదనుకున్నావా? మామిడాకులకు తమలపాకులకు తేడా తెలియదనుకున్నావా? మేము తెలుగుపండితులమే, అవసరంలేని విషయంలో జోక్యం చేసుకోవడం పద్ధతి కాదని తెలుసుకుంటే మంచిది,” చెడామడా అనేసింది.
వస్తున్న నవ్వాపుకుంటూ, “ సరే సరే , మరీ ఇంతకు అసలు విషయం చెప్పలేదు , మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు.. మీకు వచ్చిన కష్టాలు ఏంటి? అనేది చెబితే, విడాకులు మంజూరు చెయ్యడానికి ఉంటుంది,” చెప్పాడు జడ్జి.
“ ఆ ఏముంది … పెళ్ళి చేసుకున్న ఇన్ని సంవత్సరాలకు నేను నచ్చకుండా పోయానట. వాళ్ళబావను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. నాకు కోపంరాదా చెప్పండి? ఇంట్లో నేనున్నాను.. నన్ను ఒక్కమాటైన అడగాలా చెప్పండి,” గొంతు చించుకుని గట్టిగా చెబుతుంటే పొలమారింది.
సుభద్రమ్మ చటుక్కున బోను దిగి వచ్చి . “అయ్యో జాగ్రత్తండి… ముందు మంచినీళ్లు తాగండి” అంటూ తన బ్యాగులో ఉన్న నీళ్ళ బాటిల్ తీసి ఇచ్చింది. అందరూ ఆశ్చర్యంతో వాళ్ళనే చూస్తున్నారు.
“విన్నారా జడ్జిసారు … మా వారు నాపైన ఎలా నిందలు వేస్తున్నాడో.. పాపం! మా బావంటే మా అక్క మొగుడు. మా అక్కపోయినప్పటినుండి ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన కడుపున పుట్టిన పిల్లలు ఆయనను పట్టించుకోవడం మానేసారు. ఎంతైనా రక్తసంబంధం కదండి! చూస్తూ ఊరుకోలేకపోయాను. లంకంతింట్లో మేమిద్దరమే ఉంటాము. మాకు ఎలాగు పిల్లాపీచులేరు. ఏదో మాకు ఒక మనిషి తోడుగా ఉంటాడని మా బావను ఒకగదిలో ఉంచాను అది తప్పా చెప్పండి?” మూతి మూడు వంకరలు తిప్పుతూ అడిగింది సుభద్రమ్మ.
భర్తకు నీళ్ళిచ్చి మళ్ళీ బోనులో నిలబడి చెప్పసాగింది.
“అవును.. ఇది పెద్దతప్పేమి కదుకదా! అయినవాడని సహాయం చేసావు. ఏమయ్యా.. ఈ మాత్రం దానికి తప్పుపడితే ఎలాగయ్యా,” మందలింపుగా అడిగాడు జడ్జి, ఆనందరావును.
“అది …అలా అడగండి తెలుస్తుంది,” అంది సుభద్రమ్మ చేతులు తిప్పుతూ.
“ఆహా … ఎంతబాగా చెపుతుంది.. ఆవిడ చెప్పడం మీరు నమ్మడం సరిపోయింది. ఊరికే ఇంట్లో తెచ్చిపెట్టకుంటే ఎవ్వరూ ఏమీ అనరు. నేనంటూ ఒకమనిషిని ఉన్నానన్న ధ్యాసే ఉండదు వీళ్ళకు. ఒకటే ఇకఇకలు పకపకలు..
పొద్దస్తమానం ముచ్చట్లేసుకుంటూ నన్ను పట్టించుకోవడమే మానేసింది. నేనేదైనా అడిగితేనే నన్ను పట్టించుకుంటుంది. లేకపోతే నేను ఒంటరిగానే నా పని నేను చేసుకోవాలి. ఇదేం పద్ధతి.. అడగండి సార్,” అన్నాడు ఆనందరావు.
“ఆదేంకాదు. అసలు విషయం చెప్పడంలేదు మీకు. నేను మా బావను తీసుకవచ్చానని తను వాళ్ళ అత్తకూతురిని తీసుకవచ్చి తన రూంలోనే పెట్టేసుకున్నాడు. చిన్నప్పుడు ఆవిడా ఈయనగారు ప్రేమించుకున్నారట. అందుకని ఆమె ఒంటరిగా ఉంటుందని, పైగా నేను మా బావను తెచ్చానని తను ఆమెను తెచ్చుకున్నాడట. ఇక ఇద్దరు కలిసి షాపులకు వెళ్ళడాలు, హోటలుకు వెళ్ళడాలు మొదలుపెట్టారు. అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్ననన్న సంగతే మరిచిపోయారు,” అంటూ ఏడుపు లంకించుకుంది సుభద్రమ్మ.
“అయ్యో … మీరలా ఏడవకండి సుభద్రమ్మగారు, మేమున్నాముకదా మీ విషయం తేల్చడానికి! మీరిలా బాధపడితే ఎలా? మీ వారు చేసినదానికి ఖచ్చితంగా విడాకులిప్పించి, అతన్నీ ఆమెను జైల్లో పెట్టిస్తాము.మీరేమి దిగులుపడకండి,” తాపీగా చెప్పాడు జడ్జి .
“వామ్మో ఇదేంటి … ఆయన్ను జైల్లోపెడతారా? ఆయన్ను చూడకుండా నేనెలా ఉంటాననుకున్నారు? గొడవపడినా కొట్టుకున్నా మేము ఒకర్ని చూడకుండా ఒకరం ఉండలేము. అలాంటిది ఆయన జైల్లోకి వెళితే నేను ప్రాణాలతో ఉంటాననుకున్నారా? ఏమండి విన్నారా! మనమేదో కొన్నాళ్ళు విడిపోదాము అనుకుంటే వీళ్ళు మనను శాశ్వతంగానే విడగొట్టేలా ఉన్నారు,” అంది బాధపడుతూ.
“అదేంటమ్మా … నువ్వే కదా మీ ఆయనతో ఉండలేను అన్నావు, ఇప్పుడేమో ఇలా గగ్గోలుపెడుతున్నావు. ఇంతకూ మీ ఆయన మంచోడా కాదా.. శిక్ష పడాలా వద్దా?,” అడిగాడు జడ్జి నెత్తికి చేతులుపట్టుకుని.
“సార్ … మేము విడాకులు తీసుకున్నా అదే ఇంట్లో సగం పోర్షన్ లో ఆమె, సగం పోర్షన్ లో నేను ఉందామనుకున్నాము. మేము ఒకర్ని విడిచి ఒకరం ఉండలేము సార్, ఏదో చిన్నపాటి కలహాలు అంతే,” చెప్పాడు ఆనందరావు.
“అవును అంతే … మా ఆయన ఎంతమంచోడనుకున్నారు.. నేను అడిగిందే తడవు ‘బంగారం కావాలి’ అన్నాననుకోండి, ఎందుకు ఏమిటి అనకుండా కొనిస్తారు. పట్టుచీర కావాలంటే చాలు క్షాణాల్లో డబ్బులు చేతిలో పెడతారు. అంతే అనుకున్నారా! నేను ఆయన రోజు పోట్లాడుకుంటామా, నేను అలిగి కూర్చున్నానంటే పాపం నన్ను బుజ్జగిస్తాడు. అంతమంచివాడు,” అంది అపురూపంగా భర్తవైపు చూస్తూ.
“సుభద్రా… నువ్వు మాత్రం తక్కువేంటి, నాకు చిన్న తలనొప్పి వచ్చినా గిజగిజలాడుతావు. నాకొకసారి జ్వరం బాగా వచ్చిందని తగ్గిపోతే విజయవాడ కనకదుర్గమ్మకు పొర్లుదండాలు తియ్యలేదూ! సుభద్రా… వీళ్ళను నమ్ముకుంటే మనిద్దరిని నిజంగానే విడదీసేలా ఉన్నారు కేసు వాపసు తీసుకుందామా,”
అడిగాడు బేలగా భార్యను.
“అదేం కుదరదండి ఆనందరావుగారు! మా టైం వేస్ట్ చేసి ఇప్పుడు కేసు వాపసు తీసుకుంటానంటే ఎలాగండి,” అడిగాడు లాయరు.
“అవును లాయగారు… ఇంతదూరం వచ్చి వెనక్కి తగ్గితే ఎలాగండి, ఆయనకు నేను కావాలో ఆమెకావాలో తెల్చుకోమనండి,” ఎగశ్వాస పీలుస్తూ లాయర్ తో చెప్పింది సుభద్ర.
“ఆ …ఆ ముందు ఆవిడనే తెల్చుకోమనండి, వాళ్ళ బావ ఉండాలో నేను ఉండాలో చెప్పమనండి,” కోపంతో గట్టిగా అన్నాడు.
“ఆగండాగండి … ఇంతసేపు బాగానే ఉన్నారు, మళ్ళి ఇంతలోనే అంతకోపాలా.. బాగుంది మీ వరసా, ఇదంతా కాదు గానీ! నేను ఒకటి ఆలోచించాను, మీకు సమ్మతమనిపిస్తే తీర్పు చెబుతాను వినండి,” చెప్పడం ఆపాడు జడ్జి ప్రసాదరావు.
“ఏమిటో చెప్పండి” అన్నారు ఇద్దరు ఒకేసారి.
“ నేను చెప్పింది విన్న తరువాత మీరు జీవితంలో ఎప్పుడూ విడిపోమని మాటివ్వండి. ఎందుకంటే దాంపత్య బంధానికి ఉన్న విలువను కాపాడుకోవాలి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు, ఒకర్ని ఒకరు బెదిరించడం కోసం ఇలా విడిపోవాలన్న నాటకం ఆడారు.
ముఖ్యంగా పిల్లలు దూరంగా ఉండి పెద్దవాళ్లను పట్టించుకోకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్న బావగారిని, మంచిమనసుతో తీసుకవచ్చి అతనిలోని ఒంటరితనాన్ని దూరంచేసిందే తప్ప ఆమె మీకు దూరమవ్వాలనే దురుద్దేశంతో కాదు.
మీరు ఆమెమీద కోపంతో మీకు మరదలు వరసవుతున్న ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. సుభద్రమ్మగారికి మీరు ఎక్కడ దూరమవుతారోనని ఎప్పుడు మిమ్మల్ని ఓ కంటకనిపెడుతూనే ఉన్నారు. కావాలని ఆమె ఉడుక్కునేలా మీరు మీ మరదలితో సరసంగా ఉన్నట్టు నటించారు. అలా ఇద్దికిద్దరు అపార్థాలు చేసుకుని ఇంతవరకు వచ్చారు. అవునా కాదా,” అడిగాడు జడ్జి ఇద్దరిని.
అవునన్నట్టుగా తలలూపారు చిన్నబోయిన మోములతో.
“ సరే … అందుకని … మీరిద్దరు చెయ్యవలసిన పనేంటంటే సుభద్రమ్మ బావగారికి, ఆనందరావు మరదలిని జతకలిపితే మీ మనసులు కుదుటపడతాయి. వాళ్ళు ఒంటరి జీవితాలు గడుపుతున్నారు కాబట్టి, వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇదే నా తీర్పు,” నవ్వుతూ చెబుతూ తన కుర్చిలోనుండి లేచి వెళ్ళిపోయాడు జడ్జిగారు.
సరి అయిన తీర్పు ఇవ్వడంతో మిగతా లాయర్లందరు నవ్వుకుంటూ భలే దంపతులు దొరికారు అనుకున్నారు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందంగా ఒకరొకరు దగ్గరయ్యారు. సుభద్రమ్మ బావను, ఆనందరావు మరదలిని ఒకటిచేసి అందరు కలిసిమెలిసి ఉన్నారు.
॥॥ శుభం॥॥
B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ)
https://www.manatelugukathalu.com/profile/lakshmisarma/profile
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్