మలుపు తిరిగిన స్నేహబంధం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 18
- 5 min read
#MalupuTiriginaSnehabandham, #మలుపుతిరిగినస్నేహబంధం, #సైనికకథ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Malupu Tirigina Snehabandham - New Telugu Story Wtten By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 18/05/2025
మలుపు తిరిగిన స్నేహబంధం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
రేవు పోలవరం మత్స్యకారుల గ్రామం. ఆ పల్లెల్లో ఉండే వారందరూ సముద్రం మీద చేపల వేటకు బోట్లలో రెండు మూడు రోజులు ప్రయాణం చేసి చేపలతో గ్రామానికి తిరిగి వస్తారు. సముద్రం మీద వేట కెళ్లినప్పుడు వెంట వంట సామగ్రి మంచినీళ్లు తీసుకుపోతారు. తీరానికి తెచ్చిన చేపల్ని కంట్రాక్టరు కొంటాడు. అదే వారి జీవనోపాధి.
ఒక్కొక్కప్పుడు సముద్రం మీద చేపల వేటకెళ్లినప్పుడు అనుకోకుండా తుఫానులు, సముద్ర గాలులు తీవ్రమైనప్పుడు ఇతర సముద్ర తీరాలకు బోట్లు కొట్టుకుపోతే అతికష్టం మీద తిరిగి గ్రామానికి చేరుకుంటారు.
దినదిన గండంలా వారి జీవితాలు సాగుతాయి. ఇలా తరాల నుంచి వారి జీవితాలు సాగుతున్నాయి. వారిలో అక్షరాస్యత తక్కువ.
ఆ బెస్త గ్రామంలో ఆర్మీ జవాను వెంకటేశానిది ఒక కుటుంబం. అమ్మా నాన్న అన్న చెల్లి ఉంటారు. నాన్న, అన్న సముద్రం మీద చేపల వేట కెళ్లి సంపాదన చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చదువు మీద శ్రద్దతో వెంకటేశం దగ్గరలోని టౌనుకి సైకిలు మీద వెళ్లి హైస్కూలు తర్వాత ఇంటర్ చదువు పూర్తి చేసాడు. అమ్మా నాన్నా వద్దంటున్నా చెల్లిని తన వెంట తీసుకెళ్లి ఎనిమిదవ తరగతి పూర్తి చేయించాడు.
ఎలాగైనా ఉద్యోగం సంపాదించి చెల్లికి ఉద్యోగస్తుడితో పెళ్లి చేసి ఈ బెస్త గ్రామ వాతావరణం నుంచి పైకి తీసుకు రావాలనుకున్నాడు. అనుకోకుండా టౌన్లో ఆర్మీ రిక్రూట్ మెంట్ జరగడం సిపాయిగా వెంకటేశం సెలక్ట్ జరగడం అయింది. ఆర్మీలో ఉద్యోగం దొరికినందుకు వెంకటేశం ఆనందానికి అంతులేకపోయింది.
వెంకటేశానికి మొదటి పోస్టింగు దేశ సరిహద్దు ప్రాంతంలో వచ్చింది. ఇంటికి దూరంగా పోతున్నాడని అమ్మా నాయనా బాధ పడినా వారికి నచ్చచెప్పి తనకి గవర్నమెంటు ఉద్యోగం వచ్చిందని, నెల నెలా డబ్బు పంపుతానని, డబ్బు కూడబెట్టి చెల్లికి ఎలాగైనా ఉద్యోగస్తుడితోనే పెళ్ళి జరిపిస్తానని మాట ఇచ్చాడు.
ఆర్మీ కేంపులో వెంకటేశానికి సూర్యారావు అని తెలుగు మిత్రుడు జత కలిసాడు. మిగతా సహచరులందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. సూర్యారావు ఊరు వెంకటేశం జిల్లాకు పక్కనే ఉంది. అందువల్ల ఎవరు రెండు నెలల శలవులో ఇంటికి వెళ్లినా మరొకరు బట్టలు, స్వీట్లు, పళ్ళు, వెంట పంపుకునేవారు. అలాగే శలవు పూర్తయి వాపసు ఆర్మీ యూనిట్ కి వచ్చేటప్పుడు ఇంటి వాళ్లు చేసి ఇచ్చే వంటకాలు తీసుకువస్తుంటారు.
సూర్యారావు కాపు కులస్తుడు. వారిది వ్యవసాయ కుటుంబం. వెంకటేశం బెస్త కులస్తుడు. ఐనా వారి మద్య ఎటువంటి భేదభావం లేదు. అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరు చెప్పుకుంటారు.
రోజులు గడుస్తున్నాయి. దేశ సరిహద్దు ప్రాంతంలో ఆర్మీ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తు ఇంటికి డబ్బులు పంపుతున్నాడు వెంకటేశం. వయసు మీరిన తండ్రిని సముద్రం మీదకు చేపల వేటకు వెళ్లనీయడం లేదు. చెల్లి పెళ్లికి డబ్బు జమ చేస్తున్నాడు.
తెలిసిన వారి ద్వారా పట్నంలో ఒక ఉద్యోగస్తుడి సంబంధం ఖాయం చేయ గలిగాడు. వారు కట్నం కానుకలు ఎక్కువ అడిగినా చెల్లి సుఖంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అన్నిటికీ ఒప్పుకున్నాడు వెంకటేశం.
జమ చేసిన డబ్బులోంచి కొంత కట్నం ఎడ్వాన్సుగా మగ పెళ్లివారికి మద్యవర్తి ద్వారా ఇప్పించాడు. పెళ్ళి పట్నంలో కల్యాణ మండపంలో చెయ్యడానికి ఏర్పాట్లు జరిగాయి.
వెంకటేశం చెల్లికి పెళ్లి నిశ్చయమైందని తెల్సి సూర్యారావు ఆనంద పడ్డాడు. ఎందువల్ల నంటే శలవులో వెంకటేశం పల్లె గ్రామానికి వస్తువులు కానుకలు తీసికెళ్లినప్పుడు వాడి అమ్మా నాయనలతో పాటు చెల్లి చంద్రికను కూడా చూసేవాడు. బెస్త గ్రామంలో ఉన్నా చక్కగా అలంకరించుకుని పద్దతిగా కనబడేది.
చెల్లికి పెళ్లి నిశ్చయమైందని పై అధికారులకు అర్జీ పెట్టుకుని రెండు నెలల శలవు మంజూరు చేయించుకున్నాడు వెంకటేశం. జీతం డబ్బులు తీసుకుని చెల్లికి అమ్మ నాయన అన్నయ్య లకు బట్టలు ఖరీదైన వస్తువులు కొని పేక్ చేయించాడు. మిత్రుడు సూర్యారావును కూడా పెళ్లికి ఎలాగైనా రావాలని కోరగా ముందు నువ్వెళ్లి పెళ్ళి ఏర్పాట్లు చూసుకో, తర్వాత నేనుపెళ్లి సమయానికి శలవు తీసుకు వస్తానని మాట ఇచ్చాడు.
వెంకటేశం రెండు నెలల శలవులో రేవు పోలవరం గ్రామానికి చేరుకుని చెల్లి పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయాడు. మగ పెళ్లి వారితో సంప్రదింపులు జరుపుతూ ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటున్నాడు.
వెంకటేశం శలవులో వచ్చి నెల రోజులు గడిచిపోయాయి. పెళ్లి ముహుర్తం రోజు దగ్గర పడింది. ఇంతలో ఆప్త మిత్రుడు సూర్యారావు కూడా శలవు తీసుకుని మిత్రుడికి సాయం చేద్దామని బెస్త గ్రామం చేరుకున్నాడు. వెంకటేశం ఎంతో సంతోషించాడు. మిత్రులిద్దరూ కలిసి పెళ్లి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు.
అనుకున్నట్టు పట్నంలో ఫంక్షన్ హాల్ పెళ్లికి సుందరంగా అలంకరించారు. రెండు వైపుల నుంచి పెళ్లి పెద్దలు బంధువులతో మండపం సందడిగా ఉంది. వెంకటేశం పెళ్లి వారిని ఎదుర్కొనే సందడిలో ఉంటే సూర్యారావు భోజనం ఏర్పాట్లు చూస్తున్నాడు. చలాకీగా తిరుగుతున్న సూర్యారావును చూసిన వారు ఎవరీ అబ్బాయి అని గుసగుసలు మాట్లాడుకుంటున్నారు.
పెళ్లి ముహుర్తం దగ్గర పడింది. పెళ్లి కొడుకు తరపున అనుకున్న దానికంటె చాలామంది పెళ్లికి వచ్చారు. వారిని చూసి వెంకటేశం ఆందోళన పడ్డాడు. ఐనా కార్యం శుభంగా జరిగిపోవాలని కోరుకున్నాడు.
ఇంతలో మగ పెళ్లి వారి వైపు నుంచి గుసగుసలు ప్రారంభమయాయి. అబ్బాయికి బండి (టు వీలర్) కావాలని, అది తెస్తేనే పెళ్లి జరుగుతుందని లేదంటె పెళ్ళి జరగదని పట్టు పట్టేరు. ముందు ఒప్పందంలో కట్న కానుకలు తప్ప బండి ప్రస్తావన లేదని ఎంత నచ్చ చెప్పినా మద్యవర్తి చెప్పినా మగపెళ్లి వారు వినడం లేదు. చివరకు పెళ్లి మండపం అల్లర్లు కేకలతో రసాభాసగా మారింది.
పెళ్లి తర్వాత బండి పెడతామన్నా వినడం లేదు. ఆఖరి ఘడియల్లో పెళ్లి కుమారుడు మండపం నుంచి లేచి వెళిపోతుంటే వెంకటేశం పెళ్లి కొడుకు కాళ్లు పట్టుకుని బతిమాలినా ఫలితం లేకపోయింది. పెళ్లి కుమారుడు వెంట బంధువులు కల్యాణ మండపం వదిలి వెళిపోయారు.
ఈ హఠాత్ పరిణామానికీ వెంకటేశం హతాసుడయాడు. చెల్లి పెళ్లి ఉద్యోగస్తుడితో అట్టహాసంగా చెయ్యాలనుకుంటే ఎందుకిలా అయిందని వాపోతున్నాడు. ఇప్పుడు చెల్లి పెళ్లి ఆగిపోతే గ్రామంలో బంధువుల ఎదుట ఎలా తలెత్తుకు తిరగడం, పీటల మీద పెళ్లి ఆగిపోతే చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారని రోదిస్తున్నాడు.
ఈ తతంగమంతా ప్రత్యక్షంగా చూస్తున్న సూర్యారావు వెంకటేశం భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ, "ఒరే వెంకటేసా, నీకు అబ్యంతరం లేకపోతే ఇదే పెళ్లి మండపం మీద నీ చెల్లి మెడలో నేను మంగళసూత్రం కడతానని" ముందుకు వచ్చాడు. సూర్యారావు మాట విని వెంకటేశం విస్తుపోయాడు. ఆపద్భాంధవుడిలా మిత్రుడి మాటలు ఊరట నిచ్చాయి.
వెంకటేశం కుటుంబ సభ్యులు బంధువులు కూడా అంగీకారం తెలపడంతో అదే పెళ్లి మంటడపం మీద సూర్యారావు- చంద్రికలు వధూ వరులుగా వివాహం జరిగిపోయింది. ఇదే విధి విలాసమంటే. మిత్రుడి చెల్లి పెళ్లికి అతిధిగా వచ్చి వరుడిగా మారడం విచిత్రం కదూ. సూర్యారావు ఔన్నత్యానికి వెంటేశం కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
చెల్లిని సాదరంగా సూర్యారావు వెంట అత్తారింటికి సాగనంపాడు వెంకటేశం. స్నేహితుడి చెల్లి పెళ్లికి వెళ్లిన కొడుకు కోడలితో తిరిగి రావడం పెద్దవాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. పెళ్లిలో జరిగిన రభస విషయం సూర్యారావు వివరంగా తెలియ చేయగా అమ్మ నాన్నలు పెద్ద మనసుతో వారి కులం కాకపోయినా చంద్రికను కోడలిగా అంగీకరించారు. పద్దతి ప్రకారం మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసారు.
ఆర్మీ కేంపులో వెంకటేశం చెల్లి పెళ్ళిలో జరిగిన సంఘటన, తర్వాత శలవులో వెళ్లిన సూర్యారావు పెద్ద మనసుతో మిత్రుడి చెల్లిని వివాహం చేసుకున్న సంగతి తెల్సి యూనిట్ అందరూ అభినందించారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Feel good story