Mamidipandu Written By Matturthi Chitti Purna Chandra Rao
రచన : పూర్ణ... మత్తుర్తి
"ఒరే చిన్నాడా! మావిడి పండ్లు రావాలిగా ఈపాటికే. లేవా బజార్లో?" అడిగింది 80 ఏళ్ల రామాయమ్మ.... అప్పుడే ఇంటికొచ్చిన గోపాలాన్ని.. 'ఉన్నాయమ్మా నిన్న తెచ్చాగా...' అనబోయి సైలంటైపోయాడు ..... "ఈ సారి బయటకు వెళ్లినప్పుడు తెస్తాలే.." అన్నాడు గోపాలం భార్య భాగ్యం తెచ్చిన మంచినీళ్లందుకుంటూ...
"ఏంటీ తెస్తానంటున్నారు" అడిగింది..
"ఏంలేదు. మామిడి పళ్లు వస్తున్నాయా అంటుంటే. తెస్తాలే అంటున్నా. నిన్న తెచ్చా గా. ఒకటైనా ఇవ్వలేదా మా అమ్మ కు..' అడిగాడు..
"ఆ మరే... ఆ డజన్లు డజన్లు నేనే తింటున్నా..." అంది వెంటనే విసురుగా.
"ఐనా ఈ వయసులో అన్ని రుచులూ కావాలీవిడకు. పెట్టిందేదో తిని ఒక మూలపడుండక.తింటే పడదు. ఈపాటికే షుగరూ బిపీ లూ ఉండే ఉంటాయి... ఇలా అన్నీ తినేసి ఏదైనా రోగం వస్తే మూల పడితే. నేను చేయలేనీవిడకు... నా కొడుకు దగ్గరకు వెళ్లి పోతాను మీరు మీ అమ్మను చూసుకుందురు జాగ్రత్త గా" రుసరుసలాడింది.
"సరెసరె అన్నంపెట్టు"అన్నాడు గోపాలం పీట మీద కూర్చుంటూ.
భోంచేసి మంచమెక్కాడే గానీ నిద్ర రావడంలేదు గోపాలానికి. తమ చిన్నప్పుడు ఎలా తినేవాళ్లో మామిడి పండ్లు. గుర్తుకొస్తున్నాయ్. నాన్నగారు రెండ్రోజుల కొకసారి బుట్టెడు పళ్లు తెచ్చేవారు.. తమ్ముడు చెల్లెళ్లు పోటీలుపడి మరీ తినేసేవారు.
"ఒక్కదాంతోనే సరిపెట్టావు, నువ్వు ఇంకోటి తినరా" అంటూ తనే ఇంకో పండిచ్చేదమ్మ.. గుర్తుకొస్తున్నాయ్...దాంతో పాటే కన్నీళ్లు కూడా వస్తున్నాయి తెలీకుండా.
తెలవారింది. అమ్మ మాకడ్డులేకుండా తన స్నానాదులు పూర్తి చేసేసుకుంటుంది తెల్లవారుజామునే . నాన్నగారు పోయినప్పట్నించి అలా అలవాటు చేసుకుంది.....
"అమ్మా ...లే . కాస్త ఓపిక తెచ్చుకో ,డాక్టర్ గారి దగ్గరికెళదాం. దగ్గొస్తోంది కదా ! చూపిద్దాం' అన్నాడు గోపాలం....
"కరక్కాయను బుగ్గనుంచి రసం మింగుతున్నా అదే పోద్దిలేరా. నువ్వు కంగారుపడకు" అందావిడ.
"అలా కాదులే . ఆటో తెస్తా బయలుదేరు" అంటూ తొందర పెట్టాడు. ఆటో తెచ్చి భార్య తో చెప్పి బయలుదేరాడు తల్లి తో.
'ఏమయిందీ మనిషికి? ఇలా హడావిడిపెట్టి తీసుకెళుతున్నాడూ...' అనుకుందికాఫీ తాగుతూ..
ఆటో బజార్లోంచి పోతుంది.."సోదరా ఆ బండి దగ్గరాపు" అన్నాడు.. ఆటో అక్కడాగింది
బాబూ ఆ రెండు పెద్ద రసాలివ్వు అన్నాడు.తీసుకుని ఆటోని పోనిమ్మన్నాడు...
"ఆ.. ఆ... ఈ గుడి దగ్గర ఆపు" మెల్లగా తల్లిని దింపాడు.
గుడి దగ్గర నీడున్న చోట "ఇక్కడ కూర్చో అమ్మా! అని, ఆటోకి డబ్బులిచ్చి పంపించాడు.
ఒక మామిడిపండు తల్లి కిచ్చి 'అమ్మా తినేవే ఇక్కడే.ఇదిగో మంచినీళ్లు" అని ఇచ్చి. గుళ్లోకెళ్లి స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తెచ్చాడు..
ఎంతో ఆనందంగా మామిడి పండు ని తింటున్న తల్లిని చూస్తూ ఉండిపోయాడు......
"అమ్మా బాగుందా పండు? తియ్యాగానే ఉందా" అడిగాడు...
"చాలా బాగుంది నాన్నా..... కడుపు నిండిపోయిందిరా" అందావిడ తృప్తి గా..
"సరే ఈ రెండో పండుంచుకో. గుళ్లో ఇస్తే మళ్లీ ఇచ్చేసారు స్వామికి చూపించి.... ఇది ప్రసాదం అన్నమాట" అని "ఆటోతెస్తా. ఈ లోగా ఇక్కడ నుంచే దణ్ణం పెట్టుకో.." అన్నాడు.
కాసేపట్లో ఆటోలో ఇంటికి వెళ్లి పోయారు....
"ఏమన్నారేంటీ డాక్టర్ గారూ.." దీర్ఘం తీస్తూ అడిగింది భాగ్యం.
" పరీక్ష చేసి మందులిచ్చాడు.." అని లోపలికెళ్లాడు గోపాలం.
రాత్రి భోజనాల టైంకు ఇంటికి చేరాడు . తల్లి పడుకుందప్పుడే.. సర్లేఅనుకుని కంచం దగ్గర కూర్చున్నాడు....
భాగ్యం కూడా తనకూ వడ్డించుకుని కూర్చుంది. తన కంచంలో ఒక పెద్ద రసం చూసాడు.
'నీకెట్లా వచ్చిందిది' అన్నట్టు గా చూసాడు భార్యవైపు.
"గుళ్లో ప్రసాదంగా ఇచ్చారటగా, నన్ను తినమని నాకిచ్చిందిలే మీ అమ్మగారు" అంటూ పండును
ఆరాటంగా పీల్ఛేస్తున్న భార్యను అలా చూస్తూ ఉండిపోయాడు గోపాలం....
భోంచేసి బయటకొచ్చిన కొడుకును చూసి ఆప్యాయంగా నవ్వింది రామాయమ్మ.........
అమ్మ నవ్వు చూసి మురిసి పోయాడు గోపాలం.....
..... సమాప్తం.....
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత పరిచయం :
నా పేరు. చిట్టి పూర్ణ చంద్రరావు. మత్తుర్తి.
నివాసం. మియాపూర్. హైదరాబాద్.
చదువు.. BSc cbz. Yr 1972 final year. KBN college.. Vijayawada.
Job.. APSRTC. Accounts Officer. Retd
On 8/2009.. From Hyd Head Office.
Fb లో ఓ ఐదేళ్లయింది డ్రాయింగ్స్ కార్టూన్లు పోస్టు చేస్తూ అపుడపుడు చిన్న చిన్న కథలు వ్రాస్తూ కాలక్షేపం చేస్తున్నానండి...
Comentarios