top of page

మనసంతా హాయిగా

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Manasantha Hayiga' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

'మనసంతా హాయిగా' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“యింత అర్దరాత్రి ఎవ్వరు ఫోన్ చేస్తున్నారు, మీ ఫోన్ మ్రోగోతోంది చూడండి” అంటున్న పార్వతి మాటలకి ఉలిక్కిపడి లేచి టేబుల్ మీద వున్న ఫోన్ అందుకుని చూసాడు. ‘మా అన్నయ్య, ఈ టైములో చేసాడేమిటో’ అనుకుంటూ ‘హలో అన్నయ్యా’ అన్నాడు కామేశం.

“ఒరేయ్ అబ్బాయ్! కొంపములిగింది రా.. అరగంట నుంచి నాకు చెమటలతో పాటు గుండెల్లో నొప్పిగా వుంది. కళ్ళు తిరుగుతున్నాయి. చెన్నై లో వున్న మా వాడికి ఫోన్ చేస్తే అంటాసిడ్ వేసుకుని పడుకో అన్నాడు. నాకేమో ఈ ఆస్తి, బ్యాంకులో వున్న డబ్బు వదిలి చనిపోతానేమో అని భయంగా వుంది రా కాము, నువ్వు నీ కొడుకు ని తీసుకొని వెంటనే వచ్చి హాస్పిటల్ లో చేర్పించి, నాకు ప్రాణదానం చెయ్యరా” అని ఏడుస్తున్నాడు అన్నగారు వెంకటేశం.

“అది గుండెనొప్పి అయితే యింతసేపు మాట్లాడలేవు అన్నయ్యా, కంగారు పడకు, నేను శ్రీధర్ ని తీసుకుని వస్తాను. నాకు 70 సంవత్సరాలు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఈ లోపున దేవుడు ని తలచుకొని వుంటే ఆయనే తగ్గిస్తాడు” అన్నాడు కామేశం.

“ఎక్కడ దేముడు గుర్తుకు వస్తాడు రా, కళ్ళముందు ఈ రెండంతస్థుల భవనం, దాని మీద వచ్చే అద్దెలు, నెలకు వచ్చే లక్ష పెన్షన్ వదిలేసి పోతానని భయంతో వణికిపోతున్నాను. నాకేమైనా అయితే నా సంతానం నేను కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా హోటల్ లో ఖర్చు పెట్టేస్తారు. త్వరగా వచ్చి నన్ను హాస్పిటల్ లో జాయిన్ చెయ్యి” అంటున్న అన్నగారి మాటలకు అసహ్యం కలిగింది.

“బయలుదేరాము అన్నయ్యా! పదినిమిషాలలో మీ యింటి దగ్గర వుంటాము” అన్నాడు.

అర్దరాత్రి అవడం వలన ట్రాఫిక్ లేకపోవడం తో త్వరగానే ఆనంద్ నగర్ లో వున్న అన్నగారి యింటికి చేరుకున్నారు.

“నాన్నా.. యిక్కడ పెద్దనాన్నగారికి ఎలా వున్నా మీరు కంగారు పడకండి. అసలే మీకు హై బీపీ” అన్నాడు కామేశం కొడుకు శ్రీధర్.

‘అలాగేలే, అన్నీ లైట్స్ వెలుగుతున్నాయి అంటే పెద్దనాన్నగారికి నిజంగానే బాగుండలేదు అనుకుంట’ అంటూ లోపలికి నడిచాడు. సోపాలో అన్నగారు చెమటలు కక్కుతూ ఏదో నములుతున్నాడు.

“ఎలా వుంది అన్నయ్యా, వెళ్దాం పద, ఏమిటి నోట్లో?” అన్నాడు కామేశం.

“షుగర్ పడిపోయిందేమో అని బందర్ హల్వా తింటున్నాను” అంటూ లేచి కారులో కూర్చున్నాడు. ముందుగానే కొడుకు, తను అనుకున్నటుగా యిరవై నాలుగు గంటలు పనిచేసే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు.

కారులోనుంచి దిగుతూ, “ఈ హాస్పిటల్ కి ఎందుకు తీసుకుని వచ్చావురా, వీడు దోచేస్తాడు, మా యింటికి దగ్గరలోనే బుటా హాస్పిటల్ వుంది, అక్కడ తక్కువ లో అయిపోతుంది” అన్నాడు వెంకటేశం.

“బుటా లో జాయిన్ అయితే, యిహ నీ పని మూటే పెద్దనాన్నగారు, యిక్కడ మీ ప్రాణం కి డోకా వుండదు” అంటూ స్ట్రెచర్ మీద లోపలికి తీసుకుని వెళ్లారు.

చల్లగా ఏసీ గాలి తగలడం తో వెంకటేశం కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది.

ఇంతలో డాక్టర్స్ వెంకటేశం కి ఆన్ని టేస్ట్స్ చేసి, “పెద్ద ప్రమాదం తప్పింది, కొద్దిగా లేట్ అయితే లేటే” అంటూ ఇంజక్షన్ చేసి, “రేపు పెద్ద డాక్టర్ గారు వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుతారు” అన్నారు.

“మిగిలిన విషయాలు అంటే ఏమైనా కొంప ముంచుతాడేమి రా కామేశం” అన్నాడు వెంకటేశం.

“అబ్బా ఏమీ కాదులే అన్నయ్యా, నాలుగు కోట్లు డబ్బు పెట్టుకుని నువ్వే ట్రీట్మెంట్ కి వణికిపోతున్నావు, మాకేదైనా అయితే ఎవ్వరు దిక్కు” అన్నాడు విసుగ్గా అన్నగారితో.

“నేను వుండగా నీకు భయమేమిటి రా” అన్నాడు వెంకటేశం స్మశాన వైరాగ్యం లో.

“మాకు అదే ధీమా అన్నయ్యా, ఒక్క తల్లి బిడ్డలం, డబ్బు లేకపోయినా మా దగ్గర నువ్వు ఉన్నావని హాయిగా నిద్రపోతున్నాము” అన్నాడు కామేశం. ఇంజక్షన్ వల్ల వెంకటేశం నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయం వెంకటేశం లేచే సరికి ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ, తండ్రికి పెద్ద తండ్రి కి చెరో ప్లేట్ ఇడ్లీ తీసుకుని వచ్చాడు శ్రీధర్.

“అదేమిటి రా, ఇడ్లీ తో పాటు గారె తీసుకొని రావలిసింది. మీ పిల్లలకి తిండి విలువ తెలియదు” అన్నాడు వెంకటేశం.

“ఈ పూటకి పత్యంగా తినండి పెద్దనాన్న” అన్నాడు శ్రీధర్.

ఇంతలో పెద్ద డాక్టర్ గారు వచ్చి రూమ్ ని పరిశీలించి, “అయితే అంతా మాములు పొజిషన్ కి వచ్చేసారు అన్నమాట, మీరు ఇడ్లీ తినండి. మళ్ళీ వస్తాను” అని, “బాబు నువ్వు నాతో రా” అని పిలుచుకుని వెళ్ళాడు.

“ఒరేయ్ కాము, వాడిని ఎందుకు తీసుకుని వెళ్ళాడంటావ్, కొంపదీసి ఏ జబ్బు అయినా వుంది అని అనడు కదా” అన్నాడు వెంకటేశం.

“ఇడ్లీ బాగుందా, ఆకలి బాగానే వుంది కాబట్టి ఏమీ ప్రమాదం వుండదు అన్నయ్యా” అన్నాడు కామేశం.

“ఇడ్లీ తిన్నారా పెద్దనాన్నా, యిప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, బాయ్ వీల్ చైర్ తీసుకుని వస్తాడు, అసలు మీకు ఎందుకు యిలా అయ్యిందో వివరించి చెప్పి, ఏమి చెయ్యాలో కూడా చెప్తా అన్నారు” అంటూ తడి క్లాత్ తీసుకుని వెంకటేశం మొహం తుడిచాడు శ్రీధర్. యిది చూసిన కామేశం కి తన కొడుకు సేవా గుణం కి ఆనందపడ్డాడు.

రొటిలో తల పెట్టిన తరువాత రోకలి పోటు కి భయపడి లాభం లేదు. సరే.. నేను కూడా దైర్యంగానే వున్నాను ఏమైతే అది అయ్యింది అని. ఎలాగో ఎనబై లో కి వచ్చాను. వంద దాకా లాగుదాము అనుకున్నాను. పోనిలే..” ఆంటున్న పెద్దనాన్నతో, “నువ్వు వంద లాగుతావు పెద్దనాన్నా, కంగారు పడకు, ఈ రోజులలో ఆన్ని జబ్బులకి వైద్యం వుంది” అన్నాడు శ్రీధర్.

ముగ్గురూ పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు.

“ఎలా వున్నారు వెంకటేశం గారు?” అన్నాడు.

“అది మీరు చెప్పాలి, అందుకే వచ్చాను” అన్నాడు డాక్టర్ తో వెంకటేశం.

ఏమీ కంగారు పడక్కరలేదు. మీ 2డి ఏకో లో మీ గుండెల్లో వాల్వ్ ఒకటి పని చేయడం లేదన్నట్టుగా చూపించింది. దానికి ఆపరేషన్ చేసి వాల్వ్ మార్చాలి. పది లక్షల వరకు ఖర్చు వస్తుంది” అన్నాడు డాక్టర్.

“డబ్బు గురించి నాకు భయం లేదు, నాకు ఎనభై ఏళ్ళు. ఆపరేషన్ కి తట్టుకోలేక ప్రాణం పోతుందేమో అని భయం. యింకా ఏ వ్యవహారం చక్కపెట్టలేదు” అన్నాడు వెంకటేశం.

“అటు చూడండి, ఆ కుర్రాడికి పది సంవత్సరాలు, మీకులాగే గుండె వాల్వ్ పాడైంది. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్, డబ్బు లేక ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నారు. నగలు అమ్ముకుని టెస్ట్స్ చేయించుకుంటున్నారు ఏదో పేరాశ తో. మీకు డబ్బు వుంది, మాములుగా అయితే మీ వయసు వాళ్ళకి మైంటెనెన్సు తప్పా పెద్ద వైద్యం చేయించరు. ఆపరేషన్ గురించి భయపడకండి, నేను చూసుకుంటాను” అన్నాడు డాక్టర్ గారు.

వీల్ చైర్ లో కూర్చొని జాలిగా చూస్తున్న కుర్రాడు, మాసిన గడ్డంతో అతని తండ్రి ని చూసిన వెంకటేశంకి మనసులో పెద్ద అలజడి మొదలైంది. తను ఎండిపోయిన చెట్టు, ఆ పిల్లాడు నిండా పది ఏళ్ళు లేని వాడు, డబ్బుతో నేను బతకాలి అనుకుంటే, డబ్బులేక మొక్కగానే అతను మాడిపోతున్నాడు అనుకుని తమ్ముడిని తన వీల్ చైర్ ని ఆ కుర్రాడి దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నాడు.

ఆ పిల్లాడి ఎండిన బుగ్గలు మీద చెయ్యి వేసి నిమురుతూ, “నీ పేరు ఏమిటి బాబు” అన్నాడు వెంకటేశం.

“చిరంజీవి తాత గారు” అన్నాడు.

తాతగారు అన్నపిలుపుకి వెంకటేశంకి తన మనవడు గుర్తుకు వచ్చాడు.

“భయపడకు. నీకు తగ్గిపోతుంది లే. నీ పేరు కు తగ్గట్టుగా నువ్వు చిరంజీవి వి” అని దీవించి, తమ్ముడిని తనని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నాడు.

“ఏమిటి నిర్ణయించుకున్నారు?” అన్నాడు డాక్టర్.

“ఆపరేషన్ చేయించుకుంటాను” అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లోనుంచి చెక్కు బుక్ తీసాడు.

“డబ్బు యిప్పుడే అక్కరలేదు, యింకా కొన్ని టెస్ట్స్ వున్నాయి, 3డి ఎకో, ఆ తరువాత 4డి ఎకో చేసి పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఆపరేషన్.. వీటికోసం మీరు కొన్నాళ్ళు హాస్పిటల్ లో ఉండాలి” అన్నాడు డాక్టర్ గారు.

“అలాగే సార్, ఈ లోపుగా మా పిల్లలు కూడా వస్తారు. యిప్పుడు నేను మీకు యిచ్చే చెక్కు నా కోసం కాదు, ఆ పసి పిల్లాడి ప్రాణం డబ్బులేక వాడిపోకూడదు. అతని ఆపరేషన్ ఖర్చు పదిలక్షలు నేను బరిస్తాను. యిన్నాళ్ళు నా డబ్బు తో నేను బతకవచ్చు అనుకున్నానే కానీ, ఇంకొకరిని బ్రతికించవచ్చు అనుకోలేదు. ఆ పిల్లాడి ప్రాణం ఎలాగైనా కాపాడండి, నా ఆపరేషన్ కి తొందర లేదు. ఎనభై ఏళ్ళ తరువాత యింకా మిగిలే జీవితం అతి తక్కువ అని తెలుసు” అన్నాడు చెక్కు డాక్టర్ గారి చేతుల్లో పెడుతూ.

“వెంకటేశం గారూ! డబ్బున్న వాళ్ళందరూ మీలాగా సహాయం చేస్తే ఎన్నో పసి ప్రాణాలని కాపాడవచ్చు. మీరు మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భగవంతుడు మీకు యింత ఆయస్సు యిచ్చాడంటే మీ చేత ఒక కుర్రాడి ప్రాణం నిలబడాలని నిర్ణయం. ఆ కుర్రాడి కి ఆన్ని టెస్ట్స్ అయిపోయాయి. రెండు మూడు రోజులలో ఆపరేషన్ చేస్తాము, మీరు చేసిన ఈ పుణ్యం మీకు ఏదోవిధం గా ఉపయోగ పడుతుంది” అన్నాడు డాక్టర్ గారు.

మిగిలిన టెస్ట్స్ ఆన్ని చేయించుకుని రూమ్ కి చేరుకున్నారు అన్నదమ్ములు. సాయంత్రం కి వెంకటేశం పిల్లలిద్దరూ కుటుంబం తో సహా తండ్రిని చూడాటానికి వచ్చేసారు. కొడుకు, కూతురు తండ్రికి ధైర్యం చెప్పి తండ్రినుండి తాళాలు తీసుకుని యింటికి వెళ్లారు.

‘రాత్రికి వచ్చి పడుకుంటాము, మీరు యింటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి బాబాయ్’ అన్నారు.

అన్నగారి పిల్లలు వచ్చేసారు కాబట్టి తను ఇంటికి వెళ్తాను అని అన్నగారికి చెప్పాడు కామేశం.

“ఒరేయ్ కాము, నా పిల్లలు దగ్గర వుండటం మంచిదే కానీ నాకు నువ్వు నాకు దగ్గర వుండటం సంతోషం గా వుంటుంది. పోనీ రిపోర్ట్స్ వచ్చేవరకు అయినా నాతో వుండు” అన్న అన్నగారి కోరికని కాదనలేక హాస్పిటల్ లోనే వుండిపోయాడు.

“ఎలాగో బాబాయ్ నీతో వుంటున్నాడు, మళ్ళీ యింతమంది హాస్పిటల్ లో వుండటం ఎందుకు?” అని వెంకటేశం పిల్లలు రాలేదు.

రెండో రోజు సాయంత్రం డాక్టర్ గారి పిలుపుతో ఆయన రూంకి వెళ్లారు వెంకటేశం, కామేశం.

డాక్టర్ గారు వీళ్ళని చూసి నవ్వుతూ “ఆ అబ్బాయి కి రేపు ఉదయం ఆపరేషన్. రెండవది - మీ 3డి ఎకో, 4డి ఎకో రిపోర్ట్స్ వచ్చాయి” అని ఆగాడు డాక్టర్ గారు.

“మరి నాకు ఆపరేషన్ ఎప్పుడు వుంటుంది?” అన్న వెంకటేశం తో “మీ గుండె బంగారం లా వుంది, మరి 2డి ఎకో ఎందుకు అలా చూపించిందో అని మళ్ళీ టెస్ట్ చేస్తే ఈ సారి నార్మల్ రిజల్ట్స్ వచ్చింది. ఆపరేషన్ అక్కరలేదు, బ్లడ్ క్లాట్ కాకుండా మందులు యిస్తాను వాడండి, ఈ రోజు వెళ్లిపోవచ్చు” అన్నాడు.

డాక్టర్ గారి మాటలతో హృదయంలో బరువు తగ్గిపోయింది వెంకటేశంకి. “థాంక్స్ డాక్టర్, ఆ పిల్లాడి క్షేమం గురించి కూడా నాకు తెలియచేయండి. నా ఫోన్ నెంబర్ మీ ఆఫీసులో యిచ్చి వెళ్తాను” అన్నాడు.

డీఛార్జి అయ్యి కారులో ఇంటికి వెళ్తూ, “అన్నయ్యా! నువ్వు పెళ్ళిలో గిఫ్ట్ కూడా బట్టలు పెడితే వెయ్యి, భోజనం ఒక్కటే అయితే అయిదు వందల కంటే ఇవ్వవు కదా! ముక్కు మొహం తెలియని కుర్రాడి ఆపరేషన్ కి అంత డబ్బు ఎలా యిచ్చావు?” అన్నాడు కామేశం.

తమ్ముడి వంక ఒకసారి చూసి “యిప్పుడు నువ్వు అన్నట్టుగానే రేపు నేను పోయిన తరువాత అందరు కానీ ఖర్చు పెట్టకుండా పోయాడు అని అంటారు. 80 ఏళ్ళు వున్న నేనే ప్రాణం కోసం యింత కంగారు పడుతోవుంటే, యింకా జీవితం అంతా ముందే వున్న పసివాడి ప్రాణం డబ్బు లేక పోతోవుంటే చూడలేక పోయాను. నా డబ్బు పిల్లలకి అక్కర్లేదు. నా డబ్బుకి అసలైన విలువ ఈ సహాయం తోనే వచ్చింది. ఈ సహాయం కే భగవంతుడు మెచ్చి నాకు ఆపరేషన్ లేకుండా చేసాడు. మంచి చేస్తే మనకి మేలు తప్పకుండా కలుగుతుంది, యిప్పుడు నా మనసంతా హాయిగా వుంది” అంటున్న అన్నగారికి నమస్కారం చేసి “అన్నయ్యా! నువ్వు నూరేళ్లు బ్రతకాలి” అన్నాడు.


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









93 views1 comment
bottom of page