top of page

మనసు చూడ తరమా!


Manasu Chuda Tharama written by Korukonda Venkateswara Rao

రచన : కోరుకొండ వెంకటేశ్వర రావు


ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని, ఏ క్షణానయినా వర్షం కురిసేలా ఉంది. సాయంత్రం సుమారు ఆరు గంటలు కావస్తూంది. నాగరాజు మనసంతా అతృతతో నిండి ఉంది. ఎటూ తోచని స్థితిలో ఆ అపార్ట్‌ మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి భోరుమని వర్షం మొదలయ్యింది.


“ఎందుకండీ అలా ఆరాట పడతారు ... అనన్య గురించేగా ... వాతావరణం చూడండి ఎట్లా వుందో ...ఆటో దారిలో ఉండే ఉంటుంది. మీరేమీ గాభరా పడకండి." అంటూ భర్తను సముదాయించి, ఆటో సుధాకర్‌కి చేద్దామని మొబైల్‌ చేతిలో తీసుకునే సరికి ఎదురుగా స్కూల్‌ ఆటో ప్రత్యక్షమైంది.


నాగరాజు పరుగెత్తుకుంటూ వెళ్లి, అనన్య బేతిలోని బాగ్‌ తీసుకొని, “ఏరా సుధాకర్‌ ... అరగంట పైగా ఆలస్యమయింది. మేమెంత టెన్షన్‌ పడుతున్నామో తెలుసా!” అన్నాడు.


"నీ చిన్ననాటి స్నేహితుడ్ని నేనుండగా నీకెందుకురా అంత ఆరాటం ? కూతురు నీకే కాదురా నాకూ ఉంది. మర్చిపోకు” అన్నాడు సుధాకర్‌ నవ్వుతూ. నాన్న చేతిలోని బ్యాగ్‌ లాక్కుని ఇంట్లోకి వెళ్ళిపోయింది అనన్య.


“చూడరా నాగరాజు ... ఆడపిల్ల మీద అంతగా మమకారం పెంచుకోకురా ... ఏనాటికైనా పెళ్లి చేసి వేరే ఇంటికి పంపాల్సిన వాళ్ళమే కదా ... ఈ బంధాన్ని రోజు రోజుకూ ఇలా బిగించుకు పోతే రేపు చాలా కుమిలిపోవలసి వస్తుందిరా ... ఎందుకు చెబుతున్నానో కాస్త అర్ధం చేసుకోరా ... ప్లీజ్!” సలహా ఇచ్చాడు సుధాకర్‌.


“అవునురా ...నువ్వు చెప్పిందీ నిజమే... అమ్మాయితో అనుబంధాన్ని తగ్గించుకోవడం కష్టమే అయినా, మెల్ల మెల్లగా ప్రయత్నిస్తాను.” కాస్త ఉద్వేగంతో అని ఫ్రెండ్ సుధాకర్‌ని గుండెలకు హత్తుకున్నాడు నాగరాజు.


అది విజయవాడ మధురానగర్‌ లోని విష్ణు ప్రియా రెసిడెన్సీ అపార్ట్‌ మెంట్‌ కాంప్లెక్స్‌. దానికి వాచ్‌ మన్‌ నాగరాజు. భార్య రాజ్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు అనన్య పెద్దది, ఆ తర్వాత రాహుల్‌. అమ్మాయి అనన్య చాలా తెలివైనది. ఏకసంథాగ్రాహి. తన తాహతుకి మించినదే అయినా రెక్కలు ముక్కలు చేసుకొని కూతురిని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ లో జాయిన్‌ చేసాడు. వాచ్‌ మన్‌ గా తనకు వచ్చే జీతం ఎనిమిది వేలు ... దానికి తోడు అపార్ట్‌ మెంట్‌ వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేస్తూ బాగానే సంపాదిస్తాడు. వేన్నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టుగా, భార్య లక్ష్మి కూడా నాలుగైదు ఇళ్లలో పాచి పని చేసి ఓ ఏడువేల దాకా సంపాదిస్తుంది. భార్యా భర్తల ఇద్దరి ఆకాంక్ష ఒక్కటే. అనన్య పెద్ద చదువులు చదివి, ఏ కలెక్టర్‌ లాంటి ఉద్యోగమో చెయ్యాలి. అందుకోసం వాళ్లిద్దరూ దేనికైనా సిద్దమే. బాగా చదువుకొని ఎప్పుడూ అన్నింట్లో ఫస్ట్ వచ్చే కూతురంటే ఇద్దరికీ వల్లమాలిన ప్రేమ, అనురాగం.


అనన్య కూడా అమ్మా, నాన్నలను అమితంగానే ప్రేమించేది. కానీ, ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా

ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల నుంచి, కాన్వెంట్‌ చదువులకు మారిన దగ్గర నుంచీ ఆమెలో ఏదో తెలియని మార్చు వచ్చేసింది. ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లో, ముఖ్యంగా సెయింట్‌ ఆన్స్‌ వంటి ప్రతిష్టాకరమైన కాన్వెంట్‌ లో జాయిన్‌ అయ్యాక, ఆమె పరిచయాలు మంచి సంపన్నుల పిల్లలతో పెరిగాయి. తన అమ్మా, నాన్నల గురించి ఎవరికన్నా చెప్పడానికి గిల్టీ గా ఫీలయ్యేది. ఆ టాపిక్‌ ఎప్పుడైనా వస్తే, మాట మార్చేయడం అలవాటు చేసుకుంది. తన క్లాస్‌ మేట్స్‌ చాలమందిని వాళ్ళ పేరెంట్స్‌ కార్లలో దింపుతారు. కొందరు విద్యార్థుల తండ్రులు కనీసం మోటార్‌ సైకిల్‌ మీదైనా డ్రాప్‌ చేస్తారు. తనకి ఆపాటి అదృష్టం కూడా లేదు. పేదరికంలో పుట్టడం నిజానికి ఒక శాపం.


నాన్న వాచ్‌ మన్‌, అమ్మ అందరి ఇళ్లల్లో చిప్పలు తోముతుంది. ఇద్దరు చేసేవి కూలి పనులే...

చెప్పుకుంటే సిగ్గు చేటు. తన ఫ్రెండ్స్ తో పేరెంట్స్‌ గురించి ప్రస్తావించడానికి ఎంత అవమానంగా ఉందీ, తను ఈ విషయంలో లోలోన ఎంత కుమిలి పోతుంటే ఎవరికి తెలుసు? తన ప్రతిభని, తెలివి తేటలను చూసి అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ, వెంటనే, వాళ్ళందరూ అడగబోయే ప్రశ్న గురించే తన ఆవేదన అంతా.

'మీ నాన్న ఏం చేస్తారు? మీ ఇల్లెక్కడ ?' వాళ్ళకి ఏమని చెబుతుంది ... అలా అని మా

నాన్న పెద్ద ఆఫీసర్‌ అని అబద్ధం ఆడలేదు. తను ఏ నాటికైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం


సంపాదించి, ఈ పేదరికపు ఉచ్చు లోంచి బయట పడాలి. ఈ ఛాయలు కూడా తన భవిష్యత్తుని తాకనివ్వకూడదు. అందుకే కాస్త కూల్‌ గా ఓపిక పట్టి, తనూ రిచ్‌ ఆఫీషియల్‌ సర్కిల్‌ లో చేరి పోవాలి. అదే తనజీవిత ధ్యేయం. అలా అనుక్షణం తనలో తను అనుకుంటూ తృప్తి చెందుతూ ఉంటుంది అనన్య.


మంచి ప్రతిభ, దానికి తోడు కృషి, పట్టుదల ఉన్న కారణంగా ఆమెకు ఎస్సెస్సీ లో స్టేట్‌ రాంక్‌ వచ్చింది. అన్ని న్యూస్‌ పేపర్లలో కూతురి ఫోటో చూసిన నాగరాజు, రాజ్యలక్ష్మిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నారాయణ కాలేజీ వాళ్ళు అనన్యకి ఏ ట్యూషన్‌ ఫీజు లేకుండా ఇంటర్‌ ఎంపీసీ లో సీట్‌ ఇవ్వడమే కాకుండా ఫ్రీ హాస్టల్‌ సదుపాయం కూడా కలిగించారు. హాస్టల్‌ లో అయితే ప్రశాంతంగా ఏ ఆటంకమూ లేకుండా చదువుకోవచ్చు. అనతి కాలంలోనే అనన్య హాస్టల్‌ కి మారిపోయింది. ఆమెకు అదొక చక్కని అవకాశం. ఇక్కడ తనకు ఎవరూ పరిచయస్తులు లేరు. పైగా ఎవరికీ అంత ఫ్రీ టైము కూడా ఉండదు. ఆమె మనసుకు ఇప్పుడు హాయిగా, ఉల్లాసంగా ఉంది.


ఇంటర్‌ లో కూడా మంచి ర్యాంక్‌ రావడంతో, బీటెక్‌ కోసం మరో హాస్టల్‌ కి మారింది. మరలా కొత్త

క్యాంపస్‌, కొత్త స్నేహితులు ... లైఫ్ చాలా ఎక్సయిటింగ్‌ గా మారి పోయింది. అయినా ఏక్షణం తన లక్ష్యాన్ని మాత్రం మరచి పోలేదు. అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో చదివి యూనివర్శిటీ థర్డ్‌ ర్యాంక్‌ లో నిలిచింది. ఫ్రెండ్స్, లెక్సరర్స్‌ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. హద్దులు దాటిన ఆనందంతో అనన్య మనసు పరవళ్లు తొక్కింది. యూనివర్సిటీ ర్యాంకర్‌ కావడంతో యూనివర్సిటీ వాళ్ళు తనకు ఫ్రీ లైబ్రరీ మెంబర్‌ షిప్‌ ఇచ్చారు. తను అందరు రెగ్యులర్‌ విద్యార్థుల లాగా ఎప్పుడైనా లైబ్రరీ కి వెళ్లి చదువుకోవడమే కాకుండా, ఏ పుస్తకాలైనా ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చును. తన చిరకాల స్వప్నం ఐఏఎస్‌... దాన్ని కైవసం చేసుకోడానికి ఇదొక మహత్తర

అవకాశం. ఐఏఎస్‌ ప్రిలిమ్స్‌ కి అవసమైన పుస్తకాలను లైబ్రరీ నుంచి తీసుకొని హాస్టల్‌ రూమ్‌ ఖాళీ చేసి ఇంటికి బయలు దేరింది అనన్య


అనన్య ఇంటికి తిరిగి వచ్చాక, తన రొటీన్ లైఫ్‌ పూర్తిగా మార్చేసుకుంది. తనకు వచ్చిన మెరిట్‌

స్కాలర్‌ షిప్‌ డబ్బులతో ఓ మంచి మొబైల్‌, లాప్‌ టాప్‌ కొనుక్కుంది. ఎప్పుడూ ఫ్రెండ్స్ తో ప్రిలిమ్స్ సబ్జక్ట్స్ చర్చించుకోవడం, నోట్స్‌ తయారు చేసుకోవడం ... ఇలా తన లక్ష్యం కోసం ఓ తపస్సులా కష్టపడ సాగింది.

అలా ఆరు నెలల ఆమె కఠోర పరిశ్రమ చివరికి ప్రిలిమ్స్‌ పాసయ్యింది. అదే ఫోకస్‌ తో చదివి,

మెయిన్స్‌ కూడా క్రాక్‌ చేసి, ఇంటర్‌ వ్యూ కి ఎంపికయ్యింది. అచంచలమైన పట్టుదలతో ప్రిపేర్‌ అయి, చివరికి ఫైనల్స్‌ లో ఐఏఎస్‌ కి సెలెక్ట్‌ అయి అందరినీ అబ్బుర పరిచింది.


అన్ని న్యూస్‌ పేపర్లలో అనన్య ఫోటో, టీవీ9, ఏబీఎన్‌ లాంటి టీవీ చానెల్స్‌ లో అనన్య ఇంటర్‌వ్యూలు వచ్చాయి. నాగరాజు, రాజ్య లక్ష్మిల సంతోషం ఆకాశాన్ని తాకిందనే చెప్పాలి. తాము ఇన్నాళ్లూ కన్నకలలన్నీ అతి త్వరలో సాకారం కాబోతున్నాయి. తమ కుమార్తెను కలెక్టర్‌ గా చూడాలన్నదే వారిద్దరి జీవితాశయం. మిత్రుడు సుధాకర్‌ తో పాటు అందరి బంధువుల ఇళ్లకు వెళ్లి మిఠాయిలు పంచారు. తమతో పాటు రమ్మంటే అబ్బా .. ఒద్దమ్మా ... నాకివన్నీ నచ్చవు ... ఊరికే హైప్‌ చెయ్యకండి ప్లీజ్” అంటూ అనన్య చిరాకు పడింది. ఇంత సంతోషకరమైన విషయం అందరితో పంచుకోవడానికి కుమార్తె ఎందుకు ఇష్టపడడం లేదో వాళ్ళకి ఎంతకీ అర్ధం కాలేదు.


అనన్య డెహ్రాడూన్‌ లో ఐఏఎస్‌ ట్రైనింగ్ లో జాయిన్‌ అయ్యాక అంతులేని థ్రిల్‌ ఫీలయ్యింది. అక్కడి క్రమ శిక్షణ, ఊపిరి సలుపుకో లేనంత బిజీ షెడ్యూల్‌, కొత్త కొత్త పరిచయాలు... అదంతా ఓ బంగారు లోకం...

ఎలా అయితేనేం, అవిశ్రాంత పోరాటం సలిపి చివరికి ఆశించిన గమ్యం చేరుకుంది ... ఇక రాబోయే దినాల్లో తన స్టేటస్సూ, చుట్టూ నౌకర్లు, “మేడమ్‌, మేడమ్‌ అంటూ వెంటపడే సబార్డినేట్లు ... అబ్బా... ఆ విజువలైజేషన్ ఎంత కమ్మగా ఉంది! ... ఇక ఆ చాలీ చాలని అర కొర బతుకులకు చెల్లు చీటీ .. ఛీ.. .ఛీ...

ఎంత దుర్భరమైన బ్రతుకు అది! తలచుకుంటుంటేనే కంపరంగా ఉంది ... జరిగిందేదో జరిగిపోయింది ... అదంతా ఓ పీడకల... అంతే!... అయినా ఎదురుగా కనిపిస్తున్న స్వర్ణభవితను కైవసం చేసుకుంటున్న ఈ తరుణంలో తన మనసును ఆ గతం తాలూకు చేదు జ్ఞాపకాలే ఎందుకిలా వేధిస్తున్నాయి? నో ... వాటి నుంచి తను వీలైనంత దూరంగా పారిపోవాలి.. దట్సాల్‌ ! అంటూ ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చేసాక ఆమెకు ప్రశాంతంగా నిద్ర పట్టింది.


ట్రైనింగ్‌ లో ఉండగా అనన్యకు చాలా పరిచయాలైనా, ఆమె మనసుకు బాగా దగ్గరైన వాడు మాత్రం ఆద్య. ఆద్య వాళ్ళది తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు. కానీ, తను పెరిగింది రాజమండ్రి లోని తనపెదనాన్న విద్యాధరరావు గారి దగ్గరేనట. అతనో పెద్ద బిజినెస్‌ మ్యాన్‌. ఆద్య చిన్నప్పటి నుంచీ చదువులో ప్రతిభ కనబరచడంతో, ఇంటర్‌ పూర్తయ్యాక, వాళ్ళ పెదనాన్న తన తమ్ముడు రాజేశ్వరరావుని ఒప్పించి, తనింటికి తీసుకొచ్చేసాడట. రాజమండ్రిలో అయితే విద్యావకాశాలు బాగుంటాయని ఆద్య అమ్మా, నాన్నా కూడా ఒప్పేసుకున్నారట. సుమారు ఆరడుగుల ఎత్తు, ఫైంచ్‌ కట్‌ హెయిర్‌ స్టయిల్‌, ఆకర్షణీయమైన రూపం, అన్నింటికీ మించి అతని మాటల్లోని నిర్మలత్వం... వాటన్నింటికీ ఫ్లాట్‌గా పడిపోయింది అనన్య ఐఏఎస్‌. ట్రైనింగ్‌ పూర్తి అయ్యే సమయానికి అనన్య, ఆద్య ఇద్దరూ ఒకరికి ఒకరు చాలా బాగా దగ్గరయ్యారు. తమ కెరీర్స్ ఒక గాడిలో పడే వరకూ పెళ్లి గురించి ఆలోచన కూడదని ఉమ్మడిగా ఓ నిర్ణయానికి వచ్చేసారు.

డెహ్రాడూన్‌ లో టైనింగ్‌ పూర్తి అయ్యాక, అనన్యని, ఆద్యని ఇద్దరినీ ఆంధ్ర ప్రదేశ్‌ కేడర్‌ కే కేటాయించారు.అనంతరం అనన్యకి విశాఖపట్నం సబ్ కలెక్టర్‌ గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఆద్య పోస్టింగ్‌ విషయం ఏమీ నిర్ణయించకపోవడంతో, తన ఆర్డర్స్‌ తీసుకొని, టాక్సీలో హెడ్‌ క్యార్టర్స్‌ విశాఖపట్నం బయలుదేరింది అనన్య. పోస్టింగ్‌ విజయవాడ రాకుండా చూడు దేముడా ! అని పది వేల దేవుళ్ళకు మొక్కుకుంది. చివరికి తన కోరిక ఫలించినందుకు ఆమెకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎలా అయితేనేమి కలెక్టర్‌ గారికి రిపోర్ట్‌ చేసి నేరుగా తనకు అలాట్‌ చేసిన క్యార్టర్‌ లో చేరిపోయింది. గత వారం రోజులుగా విపరీతమైన వత్తిడితో ఉండడం మూలాన, కేర్‌ టేకర్‌ జగన్నాధం ఏర్పాటు చేసిన డిన్నర్‌ కానిచ్చి, ఎనిమిదిన్నరకే నిద్రాదేవి ఒడిలో వాలిపోయింది అనన్య.


మళ్ళీ రెండు రోజుల తరువాత ఆద్యకి నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ గా పోస్టింగ్‌ ఇచ్చారు. తను, అనన్య ఒకే జిల్లా ... అంటే, కలెక్టరేట్‌ లో జరిగే ప్రతి రివ్యూ మీటింగ్‌ కి తను వైజాగ్‌ వస్తుండవచ్చు. అనన్యను కలుసుకోవచ్చు. ఎంతో ఉల్లాసంగా పోస్టింగ్‌ ఆర్డర్స్ తీసుకొని వైజాగ్‌ బయలు దేరాడు. అక్కడ అనన్యను కలుసుకొని, దగ్గరలోనే ఉన్న కలెక్టర్‌ గారికి రిపోర్ట్‌ చేసి, నర్శీపట్నానికి టాక్సీలో బయలు దేరాడు.


ఆ తరువాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నెలాఖరులో ఓ శనివారం జరిగిన

మీటింగ్‌ ముగిసిన పిమ్మట అనన్య, ఆద్య ఆర్కే బీచ్ కి వెళ్లారు. ఇద్దరికీ చాలా రోజులకు కుదిరిన ఏకాంతం అది. మనసులు విప్పి ఎన్నెన్నో విషయాలు ముచ్చటించు కున్నారు. ఆద్య గొల్లప్రోలులో గడిపిన తన బాల్యం గురించి, స్నేహితుల గురించి ఎన్నో సంగతులు ఆమెతో పంచుకున్నాడు. తన తమ్ముడు అభినయ్‌, చెల్లి అలేఖ్య, అమ్మా,నాన్నలను చాలా మిస్‌ అవుతున్నట్లుగా చెప్పి... “ఆ... అన్నట్లు, ఇంతకీ మీ తల్లిదండ్రుల గురించి నువ్వు

ఇప్పుటి దాకా ఏమీ చెప్పనే లేదు ?” హఠాత్తుగా అతనా ప్రశ్న అడిగేసరికి అనన్య కాసేపు గొంతు సవరించుకొని “నా బాల్యంలోనే నా తల్లిదండ్రులు ఓ కార్‌ ఆక్సిడెంట్‌ లో చనిపోయారు ఆద్యా !” విచారంగా అంది.

"ఓహ్‌! అయామ్‌ వెరీ సారీ అనూ! ... జరిగి పోయిన ఆ విషాదాన్ని మరోసారి గుర్తు చేసి నీ మనసుకు బాధ కలిగించాను. అయామ్‌ రియల్లీ సారీ " అన్నాడు ఆద్య నొచ్చుకుంటూ.


“ చాలా పొద్దు పోయింది. మరి బయలు దేరుదామా ? అనన్య అనడంతో ఇద్దరూ దగ్గరలో ఉన్న

రెస్టారెంట్‌లో డిన్నర్‌ కని లేచారు. తరువాత ఇద్దరూ అనన్య బంగ్లాకి బయలు దేరారు. ఆ రాత్రి బంగ్లా ఎదురుగా ఉన్న పోర్టికో చాలా సేపు ఏవేవో స్వీట్‌ నథింగ్బ్‌ చెప్పుకున్నారు. ఆద్య ఉండుండి 'ఆ .. అన్నట్టు మా అమ్మా, నాన్న గురించి నీకు చెప్పనేలేదు కదూ ... నిజం చెప్పాలంటే, నేనీరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళే. నాన్న గారు మా చదువుల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రైవేట్‌ కంపెనీల్లో చిన్న చిన్న పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ చేసేవారు. అవేవీ స్థిరంగా ఉండక పోవడంతో బ్యాంకు లోను తీసుకొని ఆటో కొని దాన్ని నడిపేవారు. ఇప్పటికీ మా కుటుంబానికి అదే ఆధారం. అమ్మ తమ్ముడిని, చెల్లాయినీ మంచి కాన్వెంట్‌ లో జాయిన్‌ చేసింది. తనూ ఓ లేడీస్‌ టైలర్‌ దగ్గర నెల జీతం మీద బట్టలు కుడుతుంది. వాళ్ళ ఋణం మేము ముగ్గురం ఈ జన్మలో తీర్చుకోలేం. ఉండడం పెద నాన్న దగ్గరే అయినా, నాన్న నా ఫీజుల డబ్బులు అవీ ఎప్పటికప్పుడు ఎంత వద్దని వారిస్తున్నా, అన్నయ్యకి పంపేసేవాడు. 'డబ్బు వల్ల సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందిరా అన్నయ్యా' ... అంటుంటారు నాన్న. అదీ మాకుటుంబం. సరే... నీకు నిద్ర వస్తున్నట్లుగా ఉంది. ఓకే.. గుడ్ నైట్!” అన్నాడు ఆద్య. మరునాడు తెల్లారగానే, తన హెడ్‌ క్యార్టర్‌ నర్సీపట్నం కని బయలుదేరాడు.


“ అమ్మాయి జాబ్‌ లో జాయిన్‌ అయ్యి అయిదు నెలలు కావస్తున్నా, ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. ఎప్పుడైనా ఫోన్‌ చేసినా, ' మీటింగ్‌ లో ఉన్నాను. తర్వాత చేస్తాను ' అంటుంది గానీ చెయ్యనే చెయ్యదు. పాపను చూడాలని ఉందండీ. పోనీ, మనమే ఓ మాటు వైజాగ్‌ వెళ్ళొద్దామండీ ... ప్లీజ్!" రాజ్యలక్ష్మి మాటలకు వెంటనే సరే అన్నాడు నాగరాజు. ఎందుకంటే, తనకీ కూతుర్ని చూడాలనే ఉంది. రాజ్యలక్ష్మి కజిన్‌ జగ్గారావు ని పిల్లలకు తోడుగా ఉంచి, వాచ్‌ మన్‌ పనులు నేర్పించి, భార్యా భర్తలిద్దరూ వైజాగ్‌ కని బయలు దేరారు. సడెన్‌ గా వెళ్లి కుమార్తెకు సర్‌ పైజ్‌ ఇద్దామన్నాడు నాగరాజు. బస్ లో వైజాగ్‌ చేరుకునే సరికి సాయంత్రం కావచ్చింది. సబ్‌ కలెక్టర్‌ బంగ్లా కి చేరుకున్నారు. ఆ సమయానికి అనన్య ఇంట్లోనే ఉంది. కేర్‌ టేకర్‌ జగన్నాధం

గేట్‌ తీసి ”ఎవరు కావాలి ?” అని అడిగాడు. “కలెక్టర్‌ గారిని కలవాలి. విజయవాడ నుంచి వచ్చామని చెప్పు.” అన్నాడు నాగరాజు.


వరండాలో ఏదో అలికిడి కావడంతో, కిటికీ లోంచి తొంగి చూసిన అనన్య, ఒక్కసారిగా షాక్‌ అయింది. ఫక్తు పల్లెటూరి పనివాళ్ళలా ఉన్న వీళ్ళని ఎవరికన్నా ఎలా పరిచయం చెయ్యగలదు తాను ? అయినా చెప్పా పెట్టకుండా ఇలా ఊడి పడ్డారేమిట్రా బాబూ ! అనుకొంటూ ఉండగా, జగన్నాధం లోనికి రానే వచ్చాడు.

“మేడమ్‌ .. బెజవాడ నుంచి మిమ్మల్ని కలవాలని ఎవరో భార్యా భర్తల్లా ఉన్నారు. బయట ఉన్నారు. లోనికి పంపనా ?” అనడంతో. వెంటనే ... “ఓహ్‌ ... వాళ్ళా ... ఆయన నేను చదువుకున్న స్కూల్‌లో బంట్రోతు. ఇదిగో.. చూడు ... వాళ్ళని మన ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ కి తీసుకెళ్ళు. వాళ్ళకి హోటల్‌ నుంచి భోజనం పార్సెల్‌ తీసుకెళ్లి ఇవ్వు. మేడమ్‌ మీటింగ్‌ లో బిజీగా ఉన్నారని చెప్పి, దారి ఖర్చులకని మేడమ్‌ ఇచ్చారని ఈ వెయ్యి రూపాయలు వాళ్లకి ఇచ్చేసెయ్‌. సరేనా ?” అని, గెస్ట్‌ హౌస్‌ కి ఫోన్‌ చెయ్యడంలో మునిగి పోయింది.

కిటికీ లోంచి అనన్య తమని చూడడం, నాగరాజు దృష్టిని దాటి పోలేదు. కొన్నాళ్లుగా తనలో మెదులుతున్న అనుమానం నిజమేనని రుజువయ్యింది.


జీప్‌ లో గెస్ట్‌ హౌస్‌ కని బయలు దేరాక, “దార్లో ... చూడు డైవర్‌ బాబూ ... మాకు రాత్రికి ఉండడానికి

వీలు కాదు. మమ్మల్ని బస్‌ స్టాండ్‌ లో దింపేసేయ్‌. స్కూల్‌ బంట్రోతుని కదా... పొద్దున్నే రిపోర్ట్‌ చెయ్యక పోతే చీవాట్లు పడతాయ్‌.” అనడంతో, “సరేమీ ఇష్టం. ” అని వాళ్ళని ఆర్టీసీ కాంప్లెక్స్ లో దింపేసాడు. వెయ్యి రూపాయలు ఇవ్వబోతే, నాగరాజు నిరాకరించడంతో “మేడమ్‌ కోప్పడతారేమో సార్‌" అంటూనే, తిరిగి తీసుకొని, వాళ్ళు డబ్బులు వద్దన్నారని మేడమ్‌ కి ఫోన్‌ చేసి, వెనుదిరిగాడు. నాగరాజు దంపతులు బాధా తప్త హృదయులై తిరుగు ప్రయాణమయ్యారు.


ఇదిలా ఉండగా, ఆద్య గొల్లప్రోలు వెళ్లి తన కుటుంబంలో అందరినీ కలవడానికి, అట్నుంచి ఓ ఫ్రెండ్‌ పెళ్ళికని రాజమండ్రి వెళ్ళడానికి రెండురోజులు సెలవు తీసుకొని, ప్రయాణమయ్యాడు. అమ్మా నాన్న, తమ్ముడు, చెల్లితో ఓ రోజంతా గడిపి, మరునాడు రాజమండ్రికని బయలు దేరాడు. అక్కడ అనుకోకుండా, తన బాల్య స్నేహితుడు సుశాంత్‌ కలిసాడు. తామిద్దరూ టెన్త్ వరకు రాజమండ్రి లోనే కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ట్రాన్స్‌ ఫర్‌ కావడంతో విజయవాడలో చదువు కొనసాగించాడు. మిత్రుల పిచ్చాపాటి లో వాళ్ళ వాళ్ళ గర్ల్‌ ఫండ్స్‌ గురించిన చర్చ రానే వచ్చింది. సుశాంత్‌ తనకంత సీన్‌ లేదని, మేనకోడలితో త్వరలో పెళ్లి అని

చెప్పడంతో, అంతా ఆద్య మీద పడ్డారు.” ఏంటి వైజాగ్‌ లో నడుస్తున్న స్టోరీ చెప్పరా ప్లీజ్ ... మన సర్కిల్స్‌ లో అంతా నీ గురించే చర్చ కదరా బాబూ ... ఇంతకీ ఏమా కథ... కాస్త మాకూ చెప్పరా ప్లీజ్!" అంటూ అందరూ ఆద్యని ఆట పట్టించడంతో ... " ఓహ్‌ ... దాందేముందిరా ... తన పేరు అనన్య ... ఆమె గురించి వినే ఉంటారుగా ! ఇదిగో ఎవరైనా చూడాలని అనుకుంటే చూడచ్చు” అంటూ వాలెట్‌ లోంచి అనన్య ఫోటో తీసి అందరికీ చూపించాడు.


వెంటనే సుశాంత్‌, “ఓహ్‌ .. ఈమెనా ... ఈమెందుకు తెలీదు... తను విజయవాడ నారాయణలో నా

క్లాస్‌ మేట్‌. చాలా బ్రిలియంట్‌. మా ఇల్లు మధురానగర్‌ అయిదో వీధి అయితే ఈమెది రెండో వీధి. సివిల్స్‌ స్టేట్‌ ర్యాంక్‌ రావడంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది. అప్పట్లో ఏ న్యూస్‌ పేపర్లో చూసినా ఈమె గురించే. సివిల్స్‌ లో ప్రతిభ కనబరచిన వాచ్‌ మన్‌ కుమార్తె అంటూ”.


ఒక వాచ్‌ మన్‌ కూతురు అలాంటి ఘనత సాధించడం నిజంగా గ్రేట్‌!” అంటూ అంతా ఆమెను

మెచ్చుకున్నారు. అంతే కాదు... వాళ్ళ అమ్మ అయితే తనను ప్రయోజకురాలిని చేయడం కోసం ఓ టైలర్‌ దగ్గర రోజంతా బట్టలు కుట్టేది. వాళ్ళ పేరెంట్స్‌ కి నిజంగా హాట్స్‌ ఆఫ్‌ చెప్పాలి అన్నాడు. ఆ మాటలు విన్న ఆద్య తల తిరిగి పోయినంత పనయింది. పెళ్లి తంతు ముగిసాక ఎవరి ఊళ్లకు వారు ప్రయాణ మయ్యారు.

ఆద్య డ్యూటీలో జాయిన్‌ అయిన ఓ పది రోజుల తర్వాత కలెక్టర్‌ రివ్యూ మీటింగ్‌ నిమిత్తం వైజాగ్‌

వచ్చాడు. మీటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఆర్కే బీచ్‌ కి వెళదామని ప్రపోజ్‌ చేసింది అనన్య. ఇద్దరూ ఆటోలో బీచ్‌ చేరుకున్నారు.' ఆద్య ఇంటికి వెళ్ళినప్పుడు తమ పెళ్లి గురించి వాళ్ళ పేరెంట్స్‌ తో మాట్లాడతానన్నాడు. ఇంతకీ వాళ్ళు ఏమన్నారో ఏమిటో !' అని అనన్యకి చాలా కుతూహలంగా ఉంది. బీచ్‌ లో ఏకాంతంగా ఉన్న ఓ చోటు చూసుకొని ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. కారణం తెలియడంలేదు గానీ, ఆద్య ఎందుకో వచ్చిన దగ్గర నుంచీ, చాలా ముభావంగా ఉన్నాడు. ఎప్పుడూ ఉండే జోష్‌ అతనిలో ఏమాత్రం కనిపించడం లేదు. వాళ్ళ పేరెంట్స్‌ గానీ ఒప్పుకోలేదా ? ఏమో! అతను చెబితేనేగా తెలిసేది ! అని తనలో తాను అనుకుంది అనన్య. అటుగా పోతున్న పల్లీల అబ్బాయిని పిలిచి, రెండు పొట్లాలు తీసుకొని, ఆమె కొకటిచ్చాడు. పల్లీలు నములుతూ టాపిక్‌ ఎలా ప్రారంభించాలా అని ఆలోచనలో పడ్డాడు. ఆ అవకాశాన్ని అనన్యే కల్పించింది.. “ఇంతకీ మీ పేరెంట్స్‌ ఎలా ఉన్నారు? అంటూ.


“దేవుడి దయ వలన ఇంకా బ్రతికే ఉన్నారు.” అన్నాడు కాస్త వెటకారంగా. “ఏమిటి నువ్వంటున్నది ...నాకు అర్ధం కావడం లేదు ... ఏదైనా సమస్యా? ఇంతకీ నువ్వు అడగాలని అనుకున్నది ఏమైంది ...కాయా... పండా?” అడిగింది. ఆమె ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పకుండా, ఎగిసి పడుతున్న కెరటాల వైపు తదేకంగా చూడసాగాడు ఆద్య.

“నేనేమయినా తప్పుగా మాట్లాడానా ?” అపాలజెటిక్‌ గా అంది.

"తప్పా... నువ్వా... నీలాంటి ప్రతిభావంతులు, మేధావులు తప్పులు ఎలా చేస్తారు అనన్యా !” అన్నాడు వ్యంగ్యంగా. ఆమె మౌనాన్ని ఆశ్రయించడంతో ... “చూడు అనన్యా ... నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం చేతకాదు. ఇంతకీ ఒక్క విషయం నాకు క్లారిఫికేషన్‌ కావాలి. నీ తల్లిదండ్రులు ఎప్పుడు, ఎలా చనిపోయారో నాకు కాస్త వివరంగా చెప్పవా .. ప్లీజ్!” అన్నాడు. అతని మాటలకు హతాశురాలైన ఆమె, “ అదీ... అదీ... చెప్పానుగా కార్‌ ఆక్సిడెంట్‌... “ అంటూ నసుగుతూ గిల్టీగా తల వంచుకుంది.


“ నువ్వు బ్రతికి ఉన్న తల్లిదండ్రులనే చంపేయగల మేధావివని ఊహించ లేకపోయాను అనన్యా ... చదవేస్తే ఉన్న మతి కాస్తా అటకెక్కినట్లుగా ఉంది నీ వ్యవహారం. ఇన్నాళ్ల పరిచయంలో మనిద్దరం ఒకరిని ఒకరం పూర్తిగా అర్ధం చేసుకున్నామని భ్రమించాను. నీ వ్యక్తిత్వంలోని రెండో పార్శ్వం గురించి నాకు నిన్ననే తెలిసింది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే నా దృష్టిలో మన కంటికి కనిపించే దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే మనం ఈ లోకంలోకే వచ్చే వాళ్ళం కాదు. నవ మాసాలు మోసి, కని, పెంచిన అమ్మ, మనకు అడుగడుగునా మార్గ దర్శనం చేసి, ప్రగతి మార్గంలో నడిపించిన నాన్న ... వీళ్ళని మర్చిపోవడమే నా దృష్టిలో క్షమించరాని

ద్రోహం. అక్కడితో ఆగకుండా, నీ ఫాల్స్ ప్రిస్టేజ్ ముసుగులో నిన్ను నువ్వు ఆత్మ వంచన చేసుకోవడమే కాదు..

నీతో జీవితాన్ని పంచుకోబోయే నన్నే మభ్య పెట్టాలని చూసావు. నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి, తమ సర్వస్వాన్నీ కుదువ పెట్టిన, దైవ స్వరూపులైన అమ్మా నాన్నలనే, బ్రతికి ఉండగా చంపేసావు కదా... ‘ఇంత క్రూరత్వం మనసులో నిండి ఉన్న అమ్మాయినా నేను

ఇంతకాలం ప్రేమించింది !’ అని తలచుకుంటున్న కొద్దీ నామీద నాకే అసహ్యం కలుగుతోంది. నువ్వు చేస్తున్నది కేవలం ఆత్మ ద్రోహం మాత్రమే కాదు ... నమ్మక ద్రోహం కూడా ... అయామ్‌ సారీ అనన్యా ...నేను నిన్నింక నామనసులో నిలుపుకొని ఆరాధించ లేను. నన్ను క్షమించు. నన్ను కలవడానికి గానీ, కాంటాక్ట్‌ చెయ్యడానికి గానీ దయుంచి ప్రయత్నించవద్దు. గుడ్‌ బై!" అంటూ లేచాడు.

“అది కాదు ఆద్యా ... నీకు అంతా వివరంగా చెబుదామనే ... ఆమె మాటలు పూర్తి కాక ముందే ఆద్య అక్కణ్ణుంచి వడి వడిగా నడుస్తూ నిష్క్రమించాడు.


“ఆద్యా! ... ప్లీజ్ ... నామాట విను ... ఆమె అభ్యర్థన వినగలిగే దూరాన్ని దాటి అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు.

తన తప్పును తెలుసుకున్న ఆమె కనులు అపరాధ భావంతో ధారాపాతంగా వర్షించ సాగాయి.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియ నేస్తాన్ని కోల్పోయిన బాధ, గుండెల్ని పిండేస్తుండగా ఆమెలో పెల్లుబికిన ఆవేదనా భరిత ఆర్తనాదాలు, సముద్రపు కెరటాల హోరులో కలిసిపోయాయి.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం :

1. పేరు: కోరుకొండ వెంకటేశ్వర రావు

2. విద్యార్హతలు : B.Com , LL.B ( Academic ), M.B.A., CAIIB

3. వయసు : 64

4. పదవీ విరమణ :31 మార్చి 2016 బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి చీఫ్ మేనేజర్ గా .

5. నివాసం : విశాఖపట్నం

6. సాహితీ ప్రస్థానం :

సుమారు 40 పై చిలుకు కధలు పల్లకి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ , ఆంధ్ర భూమి ఆదివారం , మయూరి, నవ్య వంటి ప్రింటెడ్ పత్రికలలోనూ, ప్రతిలిపి వంటి ఆన్ లైన్ పత్రికలలోనూ వచ్చాయి. కవితలు సుమారు 35 వరకు ప్రతిలిపిలో వచ్చాయి.



134 views8 comments
bottom of page