top of page

మనసు - మార్పు


'Manasu Marpu' New Telugu Story


Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఆ రోజు ఆదివారం. సూరజ్, సౌజన్య, కమలమ్మ అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నపుడు ‘ఏమ్మా, నీకు ఇక్కడ ఎలా ఉంది, బోర్ కొట్టడం లేదుకదా’? అప్పుడే నీవు వచ్చి నెలరోజులు దాటిపోయింది కదూ’ అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కొడుకు వైపే చూస్తూ 'ఏమిటో మీ ఉద్యోగాలూ మీరూనూ. శుక్రవారం రాత్రి వచ్చి సోమవారం తెల్లవారుఝామునే బయలదేరి వెళ్లిపోతావు. నీ భార్య ఆఫీస్ కు పొద్దున వెళ్లితే సాయంత్రం ఆరుగంటలకు గానీ రాదు. బోర్ గా ఉండక ఎలా ఉంటుంది? గుంటూర్ లో మీ తమ్ముడింట్లో ఎంత సందడో. సాయంత్రం అయిదు గంటలకల్లా వాడు బేంక్ నుండి వచ్చోస్తాడు. మీ మరదలు ఎప్పుడూ గిలకలా తిరుగుతూ ఏదో పనిచేస్తుంటే సందడిగా ఉంటుంది. పైగా వాళ్ల మూడేళ్ల పిల్లాడు రోహిత్ ముద్దు మాటలతో సమయం భలే గడచిపోతుంది”

“సరేలే అమ్మా, నీ చిన్న కొడుకు వేణు అదృష్టవంతుడు. మాకు ఉన్న టెన్షన్స్ వాడికి లేవు. ఏం చేస్తాం చెప్పు, కష్టపడుతున్నాం, తప్పదుకదా?”


“ఏరా సూరజ్, పెద్దదాన్ని, నీవు విల్లా కొంటున్నానవి నిన్న సాయంత్రం సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న పద్మావతిగారు చెప్పారు. ఆవిడ అల్లుడు, నీవూ ఒకే ఆఫీస్ లో పనిచేసారుట కదా. ఆ శుభవార్తేదో నా చెవిని కూడా వేస్తే సంతోషించనా?” నిష్టూరం నిండిన గొంతుకతో ఠక్కున అనేసిన కమలమ్మ మాటలకు సూరజ్ నవ్వేస్తూ, “ఓసి పిచ్చి అమ్మా, నీకు చెప్పకుండా ఎలా దాచిపెడ్తాననుకున్నావు?

అవును, విల్లా కొనాలనుకుంటున్నాం. రెండు నెలల క్రితం బిల్డర్ కు ఒక ఇరవై లక్షలు అడ్వాన్స్ కట్టాం. మరో ఇరవై లక్షలు అడ్వాన్స్ పే చేసాక మా పేరు మీద బుక్ అవుతుంది. అప్పుడు నేనూ, సౌజన్యా కలసి మా జీతాల మీద బేంక్ లోన్ కి అప్లై చేయాలి. అడ్వాన్స్ పే మెంట్ పే చేయడం కోసం సౌజన్య నగలనను బేంక్ లో పెట్టి లోన్ తీసుకోవా లనుకుంటున్నాను. అడ్వాన్స్ పూర్తిగా కట్టేసాక, విల్లా మా పేరు మీద బుక్ అయ్యాక మీ అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు దాస్తానమ్మా, డబ్బులకోసం కొంతం టెన్షన్ పడుతున్నాం, అందుకనే చెప్పలేదు నీకు.

మాకా సేవింగ్స్ లేవు. అడ్వాన్స్ పేమెంట్ కే అప్పులు చేయాల్సి వస్తోంది”.


“అదేమిటిరా, మరీ చోద్యం కాకపోతే? ఇద్దరూ లక్షలు లక్షలు సంపాదించుకుంటూ కూడా అప్పులేమిటిరా? ఈ మాటలు నాదగ్గరైతే అన్నావుగానీ మరెవరిదగ్గరైనా అంటే నవ్విపోతారు’”.

“అమ్మా, నీ దగ్గర అబధ్దాలెందుకమ్మా'? అమ్మవి కాబట్టి అర్ధం చేసుకుంటావనే నిజం చెపుతున్నాను'”.


“ఏమిటిరా అర్ధం చేసుకునేది. మీ అక్కా, చెల్లెలు ఎవరి సంసారం వాళ్లు చేసుకుంటున్నారు. వాళ్లకేమైనా పెట్టాలా, పోయాలా నీవు’? ‘వేణు కూడా సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఎవరినీ దేహీ అని యాచించకండా వాడి మానాన వాడు బ్రతుకుతున్నాడు. నా బాధ్యత కూడా నీ మీద పెట్టకుండా నన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటున్నారు నీ తమ్ముడూ మరదలూనూ. ఇంకేమున్నాయిరా మీకు బాధ్యతలు? ఇక్కడ మీ ఇద్దరికీ ఖర్చులేముంటాయి కనుక?

మీ సంపాదన అంతా ఏమిచేస్తున్నారు? మూటలు గట్టి మీ అత్తగారింటింకి గానీ చేరేయడంలేదుకదా” ఠక్కున మాట జార్చేసిందావిడ.


తల్లి మాటలకు సూరజ్, సౌజన్యల ముఖాలు వెలతెలబోయాయ్.

“అమ్మా ఆపుతావా?” కొంచెం తీవ్రంగానే తల్లిని మందలించాడు.

“నీవు అలా ఊహించుకుంటున్నావు కాబోలు. నీకు చెప్పే సందర్భం రాకూడదనుకున్నాను, కంగారు పడ్తావని. కానీ చెప్పకపోతే నీవు నీ ఇష్టంవచ్చినట్లు ఇలాగే ఊహిస్తావు.

బావగారు ఆఫీసులో ఏదో స్కామ్ లో ఇరుక్కుని సస్పెండ్ అయ్యారు. అరెస్టు అయ్యే వరకు వచ్చింది ఆయన పరిస్తితి. సంవత్సరం పాటు ఆయనకు జీతంలేదు. కోర్టులో కేసు నడుస్తోందప్పుడు. ఇంటి ఇఎమ్ఐ పే చేయలేని పరిస్తితి వచ్చింది. బేంక్ వాళ్లు విషయం తెలుసుకుని ఇంటిని వేలం వేస్తామని వత్తిడి తెచ్చారు. ఇంట్లో అవసరాలు, అనేక ఖర్చులు ఒకదాని మీద మరొకటి వచ్చి పడ్తున్నాయి.


పిల్లల ఫీజులు కట్టాలి. అక్క నాకు చెపుతూ ఏడ్చేసింది. అక్కకు కష్టం వస్తే ఆదుకోవడం నా ధర్మం అనుకున్నాను. ఈ విషయంలో సౌజన్య నాకు ఎంతగానో సహకరించింది. ఓవర్ టైమ్ పనిచేసేది డబ్బుకోసం. లక్షరూపాయలు చొప్పున ప్రతీనెల పంపిస్తూ వచ్చాను ఒక సంవత్సరం పాటు. ఆ తరువాత బావగారు కేసునుండి బయటపడడం, తిరిగి ఉద్యోగంలో చేరడం జరిగింది. నీ వరకు ఈ విషయాలు చేరకుండా జాగ్రత్త పడ్డాం. కంగారు పడి బి. పి, సుగరూ పెంచుకుంటావేమోనని.


చెల్లాయి కిందటి రాఖీ పండుగ నాడు ఫోన్ చేసి, ‘అన్నయ్యా మీ బావగారికి కారు కొనుక్కోవాలని ఉందం’టే వాళ్లకు ఎనిమిది లక్షలు పెట్టి కారు కొనిచ్చాను.


నీ చిన్న కొడుకూ, కోడలూ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని గొప్పగా చెపుతున్నావే, ఆ ప్రేమ వెనుక ప్రతీనెలా నీ ఖర్చులకంటూ పాతిక వేలు పంపుతున్నానానని నీకు తెలుసా? తెలియదు. వాడు నాకు ఫోన్ చేసినప్పుడల్లా, నీ బరువు బాధ్యతలన్నీ తనే మోస్తున్నట్లు నిష్టూరంగా అంటాడు. డబ్బు పంపడం మొదలు పెట్టాకా నిష్టూరాలడడం తగ్గించాడు.


ఎంత మా అత్తగారు మా పిల్లలను చూసుకున్నా, పిల్లల ఖర్చులు, లక్షల్లో వాళ్ల స్కూల్ ఫీజులు, వాళ్ల ఇతర అవసరాలెన్నో మేమే చూసుకోవాలి కదా. అక్కడో సంసారం, మైసూర్ లో నేను, ఇక్కడ సౌజన్య.


ఒక్క మాటమ్మా, పిల్లలను మా అత్తగారింట్లో వదిలేసి మేమిక్కడ కష్టపడుతున్నాం. సౌజన్యను గమనించే ఉంటావు. రాత్రి పగలు ఆఫీస్ పని చేస్తూ కష్టపడుతుంది. మైసూర్ వెళ్లనంటే జీతం ఎక్కువ వస్తుంది, మనకు బాధ్యతలు ఉన్నాయి కదా అంటూ పంపింది. ఒక్కోసారి రాత్రిళ్లు ఏడుస్తూ కూర్చుంటుంది. పిల్లలు గుర్తొస్తున్నారంటూ.


ఇవన్నీ ఎవరికి చెప్పుకోగలమమ్మా. నీకే అర్ధంకానప్పుడు బయట వాళ్లకు అర్ధం అవుతాయా’? వాళ్లకేం, బాధ్యతలేవీ లేవనుకుంటారు. తమ్ముడు మనస్తత్వం తెలిసే నా దగ్గరకు వచ్చేయమ్మా అంటే నా పిల్లలను ఎక్కడ చూసుకోవలసి వస్తుందోనని భయపడ్డావు. పైగా నాకీ ప్రదేశం కొత్త, తోచదంటూ తప్పించుకున్నావు.


నీ ఇష్టం అమ్మా, నీవు ఎక్కడ ఉన్నా నీ ఆనందమే కావాలి నాకు. ప్రతీ నెల నీ ఖర్చుల నిమిత్తమై వేణుకు డబ్బు పంపుతున్నాను. నీకు కావలసినవన్నీ మొహమాటపడకుండా వాడినడిగి కొనిపించుకో. ఇంకా డబ్బుకావాలంటే నాకు ఫోన్ చేయి, పంపిస్తాను. ఇంటికి పెద్దకొడుకుగా నిన్ను నా దగ్గర పెట్టుకుని నీకు కష్టం కలగకుండా చూసుకోవాలనుకున్నాను గానీ, నీచేత చాకిరీ చేయించుకోవాలని కాదు. నీకు ఏ ఆంక్షలూ, షరతులూ లేవు. ఎప్పుడు రావాలన్నా నా దగ్గరకు వచ్చి ఉండ”చ్చంటూ అక్కడనుండి వెళ్లిపోయాడు.


కమలమ్మ ముఖం సిగ్గుతో కుంచించుకు పోయింది.

ఆ రాత్రి ఆవిడకు నిద్ర కరువైంది. సూరజ్, సౌజన్యలను ఎంత తప్పుగా అర్ధం చేసుకుంది. తను తన చిన్నకొడుకు, కోడలు దగ్గర గుంటూరులో ఉంటుంది.

ఒక నెలరోజులు క్రితం తన పెద్దకొడుకు దగ్గర ఉండాలని బెంగుళూర్ వచ్చింది. సూరజ్ మైసూర్ లో ఒక సాఫ్ట్ వేర్ సంస్తలో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితమే బెంగుళూర్ లో పని చేస్తున్న అతనికి కంపెనీ ప్రమోషన్ తో బాటూ సేలరీ హైక్ చేస్తూ మైసూర్ యూనిట్ కి ట్రాన్స్ ఫర్ చేసింది.


రెండేళ్లు అతను మైసూర్ లోనే ఉండాలి. అతనికి మైసూర్ ఆఫీస్ కు వెళ్లాలని లేదు, ఎందుకంటే అతని భార్య సౌజన్య బెంగుళూర్ లో లో ఒక ప్రసిధ్ది చెందిన కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. అతన్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పి పంపించింది సౌజన్యే. అవకాశాలన్నవి ఒకసారే తలుపుతడతాయని, వదులుకోవద్దని నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి మరీ పంపించింది. ప్రతీ వీకెండ్ వచ్చి వెడ్తుండాడు అతను. సూరజ్, సౌజన్యలకు ఆరు సంవత్సరాలు పాప, నాలుగేళ్ల కొడుకు సౌజన్య తల్లి గారింట్లో హైదరాబాద్ లో పెరుగుతున్నారు. ఇద్దరివీ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మూలాన ఇళ్లకు లేట్ గా రావడం అవీ ఉంటాయని పిల్లలని డే కేర్ లోనూ, ఆయాల సంరక్షణ లో పెట్టడం ఇష్టం లేక సౌజన్య అమ్మగారింట్లో పిల్లలను వదిలేసారు. సూరజ్ కు తిరిగి బెంగుళూర్ కి పోస్టింగ్ ఇచ్చిన తరువాత పిల్లలను తెచ్చుకుందామని వాళ్ల ఆలోచన.

సూరజ్ కు తండ్రి లేడు. తల్లి కమలమ్మ చిన్న కొడుకు, కోడలి దగ్గర గుంటూర్ లో ఉంటుంది. చిన్న కొడుకు వేణు స్టేట్ బేంక్ లో ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. చిన్న కోడలు శైలజ జాబ్ చేయదు. సూరజ్ అక్క మాధవి, చెల్లెలు రాధికకు పెళ్లై అయిపోయి హైద్రాబాద్ లో ఉంటున్నారు. సూరజ్ తండ్రి ఆయన బ్రతికుండగానే పెద్దకూతురు మాధవి పెళ్లి చేసేసాడు. చెల్లెలి పెళ్లి, తమ్ముడి చదువు బాధ్యత సూరజ్ మీద పడింది. పెద్దకొడుకుగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన తరువాతే సూరజ్ పెళ్లిచేసుకుని బెంగుళూర్ లో స్తిరపడ్డాడు.


సూరజ్, సౌజన్య ఇద్దరూ ఒకరనొకరు ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. బెంగుళూర్ లో ఇద్దరి ఆఫీసులు ఒకే కేంపస్ లో ఉండడంతో సూరజ్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన సౌజన్య అంటే అతనికి ఇష్టం కలిగింది. కమలమ్మకి సౌజన్యను కోడలిగా చేసుకోడానికి ఇష్టపడలేదు. ఆవిడకు కులగోత్రాల పట్టింపులు, ఛాదస్తాలు ఎక్కువ. సౌజన్యది మన కులం కాదని మన పధ్దతులు వారివీ కలవవంటూ చెప్పి చూసింది. కానీ సూరజ్ పట్టుబట్టి మరీ సౌజన్యను పెళ్లిచేసుకున్నాడు.


సూరజ్ ఎన్నో సార్లు తల్లిని అడిగి చూసాడు. ‘అమ్మా, నీవు మా దగ్గర ఉంటే పిల్లలను మా అత్తగారి దగ్గరనుండి తెచ్చేస్తాను. నీకు శ్రమ కలగకుండా ఒక ఆయాను కూడా పెడతాను. నీవు దగ్గరుండి పిల్లలను చూసుకుంటే చా’లని.


కానీ ఎన్ని సార్లు అడిగినా ‘బెంగుళూర్ లో నాకు తోచదురా సూరజ్, అక్క డ మాట్లాడే కన్నడం అదీ నాకు అర్ధం కాదు. పైగా సౌజన్య ఆఫీసుకు వెళ్లిపోతుంది, నేనుండలేనురా’ అని చెప్పేసింది.


కానీ అసలు విషయం వేరు. ఆవిడకు స్వేఛ్చా స్వాతంత్రాలు కావాలి. బాదర బందీలు పిల్లల పెంపకం పట్ల విముఖతగా ఉంటుంది. గుంటూరులో వేణు దగ్గర అయితే ఆవిడకు ఈ బాదర బందీలు ఉండవు. అక్కడ ఆవిడకు అందరూ తెలుసున్నవారే, ఇరుగు పొరుగుతో ఊసులాటలు చెప్పుకోవచ్చు. ఈ సారి ఇన్ని రోజులు ఆవిడ బెంగుళూరు రావడానికి కారణం చిన్న కోడలు రెండో పురుడు గుంటూరులోనే పోసుకుంటాననడంతో కోడలు తల్లి పురుడుపోయడానికి గుంటూరు వచ్చింది. ఈ హడావుడిలో తను అక్కడ ఉంటే తన మీద ఏ చాకిరీ పడుతుందోనన్న భయంతో బెంగుళూర్ వచ్చింది.


సౌజన్య తన పనేమిటో తను చేసుకుంటూ, అత్తగారికి కావాలసినవన్నీ శ్రధ్దగా అమర్చి పెట్టడం చేస్తుంది. ‘నా వంట నేను చేసుకుంటానులే సౌజన్యా, నీకెందుకు శ్రమ అంటుందే గానీ’, అది కోడలిపట్ల ప్రేమ అనుకుంటే పొరపాటే. కోడలి చేతివంట తినడం ఆవిడకు ఇష్టం ఉండదు. అత్తగారి మాటల్లోని ఆంతర్యాన్ని అర్ధం చేసుకోలేని అమాయకురాలు కాదు సౌజన్య. కోడలు ఆఫీస్ కు వెళ్లిపోగానే తను తనకు కావలసినట్లుగా వంట చేసుకునేది.


‘అత్తయ్యా భోజనం చేసేసి విశ్రాంతి తీసుకోండి. తోచకపోతే బోలెడు తెలుగు నవలలు బీరువానిండా ఉన్నాయి, తీసుకుని చదువుకోండి. నాకు తెలుగు సాహిత్యం చాలా ఇష్టం, అందుకనే ఎక్కడ కనపడినా తెలుగు నవలలు కొనిపెడ్తాను. టి. వి పెట్టుకోండి, ఇంకా బోర్ అనిపిస్తే ధర్డ్ ఫ్లోర్ లో మీ గుంటూరు వాళ్లే ఉన్నారు. వెడ్తూ ఉండం’డంటూ ఎంతో అభిమానంగా ఎన్నో జాగ్రత్తలు చెపుతూ ఆఫీస్ కు వెడ్తుంది.


ఆవిడకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. పుస్తకాలు లోకజ్నానం ఇవ్వడమే కాదు, మనం మన కుటుంబ సభ్యులతోనూ, బయటివారితోనూ ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించాలో కూడా నేర్పుతాయి. గుంటూరులో ఆవిడకు చుట్టుపక్కల వారింటికి చేరి కబుర్లు చెప్పుకోవడం అలవాటున్నప్పుడు ఇంక పుస్తకాలు చదువుకోవడమెందుకు? పుస్తకాలలో కంటే ఎన్నో ఆసక్తికర విషయాలు ఆ అమ్మలక్కల కబుర్లలో ప్రవాహంలా దొర్లిపోతుంటుంటే. ముగింపులేని ఆ కబుర్లు అలా సీరియల్ లా సాగుతూనే ఉంటాయి.


సౌజన్య అత్తగారికి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించింనా ఆవిడ దూర దూరంగానే ఉంటూ ఎప్పుడూ చిన్న కోడలి వంటలను, ఆమె స్వభావాన్ని మెచ్చుకుంటూనే ఉండేది. శైలజ అయితే ఈ కూర ఇలా చేస్తుందని, మైసూర్ పాక్ ఎంత బాగా చేస్తుందనో, ఆ అమ్మాయికి రాని వంట, రాని పూజ అంటూ లేవని భట్రాజులా పొగుడ్తూనే ఉంటుంది. శైలజ హోమ్ మేకర్, బాగా చేయచ్చు, తను కూడా ఉన్నంతలో బాగానే చేస్తుంది,.


కానీ అదే పనిగా వంటలు చేయడానికి తనకు టైమ్ ఎక్కడ? ఆఫీస్ లో పని పూర్తి అవకపోతే వీకెండ్ కూడా తను ఆఫీస్ పనిని ఇంట్లో చేసుకోక తప్పడంలేదు.

సాయంత్రం ఆఫీస్ నుండి సౌజన్య ఇంటికి రావడమే తడవు, ఈవిడ కిందకు వెళ్లిపోతుంది. కాంప్లెక్స్ లో ఒక పక్కన పార్క్, అక్కడ సిమెంట్ బెంచ్ లు ఉంటాయి. ఆడవాళ్లందరూ అక్కడచేరి కబుర్లు చెప్పుకుంటారు. అక్కడ తెలుగు కుటుంబాల వాళ్లు కూడా ఉన్నారు.


ఆ రోజ పద్మావతి అనే ఆవిడ కమలమ్మతో మాటలు కలుపుతూ, ‘మీ అబ్బాయి సూరజ్, మా అల్లుడు ఇక్కడ బెంగుళూర్ ఆఫీసులో కలసి కొంతకాలం పనిచేసారుట’. అన్నట్లు మీ అబ్బాయి జె. పి. నగర్ లో విల్లా కొనబోతున్నట్లు అడ్వాన్స్ పే చేసినట్లు మా అల్లుడు ఆ మధ్య చెప్పాడు. ఎంతవరకు వచ్చిందేమిటి? అయిదారు కోట్లవరకు ఉంటుందట ధర. మీ కొత్త విల్లా ఎప్పుడు రెడీ అవుతుం’దంటూ ఆరాగా అడిగింది.


అటువంటప్పుడు కమలమ్మకు విషయమేమీ తెలియనపుడు ఏదో విధంగా హుందాగా ఆ టాపిక్ ను కవర్ చేయడం పోయి ‘అటువంటి విషయాలు మనకు చెపుతారా పద్మావతిగారూ, కొడుకు మనవాడైనా కోడలి దృష్టిలో మనం పరాయి వాళ్లమేగా అంటూ, ఇదిగో ఇప్పుడు మీరు చెపితేనే నాకు తెలిసిందంటూ’ కొంచెం నిష్టూరంగా, ముఖం మాడ్చుకుంటూ జవాబిస్తూ అక్కడ నుండి వచ్చేసింది.


దాని పర్యవసానమే సూరజ్ ను నిలదీసి అడగడం.

ఇంతవరకు సూరజ్ తన అక్కచెల్లెలికి చేసిన సాయం గురించి తనకు చెప్పలేదు. తన ఖర్చుల నిమిత్తమై వేణుకి ప్రతీ నెలా పాతిక వేలు పంపిస్తున్న విషయమూ తనకి తెలియదు. వేణు తనతో ఈ విషయం గురించి మాటమాత్రం కూడా అననేలేదు. ఎంత స్వార్ధపరుడు వేణు. సూరజ్, సౌజన్య ఎంత సంస్కారవంతులు ! తన అక్కచెల్లెళ్లకూ, తమ్ముడికీ ఇంతచేసినా తన పెద్ద కొడుకు పెదవి దాటలేదు. సౌజన్య లో ఎంత సహనం ? మరొకరైతే వారు చేసిన పనులను ఎంతో ఆర్భాటంగా బయట అందరికీ గొప్పగా చెప్పేసుకునేవారు. అక్క చెల్లెళ్లకూ తమ్ముడికీ ఈ రోజుల్లో సాయం ఎవరు చేస్తున్నారు. సూరజ్ సౌజన్య రాత్రీ పగలూ పనిచేస్తూ ఇలా కుటుంబానికి కూడా సాయం చేస్తున్నారు.


కిందటి సంక్రాంతి పండక్కి తనకు కుప్పడం చీర కొన్నానని చిన్న కోడలు శైలజ ఊరు ఊరంతా డప్పువేసి మరీ చెప్పింది. మా అత్తగారి బాధ్యత మాదే కదండీ, ఆవిడను మేము బాగా చూసుకోపోతే లోకం మమ్మలనే అంటుంది కదా, మేమే కదా ఆవిడ కేర్ టేకర్స్ మి అంటూ అందరితోనూ అంటుంది. తను కూడా ఇన్నాళ్లూ ఆ అభిప్రాయంతోనే ఉంది. తనకి ఒక పది రూపాయలు ఖర్చుపెట్టినా ఆ అమ్మాయి చేసే ఆర్భాటం అంతా ఇంతా కాదు. కానీ వాళ్లు తనమీద ఖర్చుపెట్టేదంతా సూరజ్ డబ్బే కదా. ఎంత విచిత్ర మనస్తత్వాలనుకుంటూ విస్తుబోయింది.


మర్నాడు సోమవారం పొద్దునే మైసూర్ కి బయలదేరుతున్న కొడుకుతో ‘“ఒరేయ్ సూరజ్ నేను ఇంక మీ ఇంటినుండి ఎక్కడకూ వెళ్లను, నా స్తానమిక్కడేనని నిర్ణయించుకున్నాను. నా చివర శ్వాస వరకూ మీతోనే ఉండిపోతాను రా సూరజ్. నేను పొరబాటుగా అన్న మాటలను మీ మనస్సులలో పెట్టుకోకండి. అమ్మా సౌజన్యా, ఇన్నాళ్లూ నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను. నా కళ్లు తెరుచుకున్నాయి. చిన్నవాళ్లు అయినా మీ ఇద్దరిలో ఎంత చక్కటి సంస్కారం. వెంటనే వెళ్లి మీ పిల్లలను తీసుకు వచ్చేయండి ఇక్కడకు. నేను చూసుకుంటాను నా మనవరాలిని, మనవడిని” అంటున్న తల్లివైపు సంభ్రమాశ్చర్యాలతో చూసాడు సూరజ్.


“నిజమేనా అమ్మా, మా పిల్లలు మా దగ్గర లేరేననుకుంటూ ఎంతో బెంగపడుతూ ఉంటాం. వచ్చే శుక్రవారం నేను వెళ్లి పిల్లలను తెచ్చేసుకుంటాను. ఏమంటావ్ సౌజన్యా” అనగానే సౌజన్య ముఖంలో ఆనందం తొణికిస లాడింది.


సౌజన్య ముఖంలో అత్తగారిపట్ల ఎనలేని గౌరవం తొణికిసలాడింది.


--సమాప్తం--

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.83 views0 comments

Comments


bottom of page