top of page

మానవత్వం


'Manavathvam' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

''ఏమిటమ్మా ఇది? మాదగ్గిరకి రమ్మని అంటే రావు. సరే నీ ఇష్టం! అనుకున్నాం. ఇప్పుడేమో ఎవరో అనాధ పిల్ల బిజిలీని పెంచుకుని బరువును తలకెత్తుకున్నావు, చదివించావు. అదీ మంచిదే, నీకు పని సాయం, తోడు అనుకున్నాం. ఇప్పుడు పెళ్లి కూడా చేస్తున్నావు. అనవసరమైన పాట్లు కొని తెచ్చుకోడం ఎందుకమ్మా?” అంటూ తులసికి విదేశాల్లో ఉన్న ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులూ ఫోన్లు చేసారు.

''మిమ్మల్ని ఒక్క రూపాయి అడగలేదు. మీనాన్నగారి పెన్షన్ తోనే చేస్తున్నాను. మీకెందుకు బాధ? ఉన్నంతలో ఎవరికైనా సాయం చేయాలని మీ నాన్నగారు, నేను అనుకునేవాళ్లం. మీకు లోటు లేదు. మేము ఇచ్చే ఆస్తీ లేదు. నేను జీవించినంత కాలమూ చేస్తాను. నన్ను ఇలా వదిలేయండి''

అంది తులసి.

దాంతో వాళ్ళు ఊరుకున్నారు. కానీ అమ్మ ఇలా బంధాలు పెంచుకోవడం వాళ్ళకి నచ్చలేదు. నిజమే! అమ్మ ఒక్క రూపాయి అడగదు. కానీ అవకాశం తీసుకుని బిజిలీ భర్తా పిల్లలు ‘అమెరికా వస్తాం, హెల్పు చేయాలని అడిగితే?’ అని భయపడ్డారు. తులసి పట్టుదల చిన్నప్పటి నుంచీ తెలుసు కనుక ఏమీ చేయలేక ఊరుకున్నారు. బిజిలీతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. కనీసం ఎలా వున్నావు అని కూడా అడగరు. ముందు జాగ్రత్తగా. అది గ్రహించిన బిజిలీ అర్థం చేసుకుంది వారి మనస్తత్వం. తులసి అదృష్టం బాగుండి ఆమెకు అనారోగ్యం లేదు. పక్కనే ఉన్న 200 గ. స్థలంలో బిజిలీకి రెండు గదుల ఇల్లు కట్టించి ఇచ్చింది. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు.

జీవితాన్నిచ్చిన తులసిని కంటికి రెప్పలా చూసుకుంటోంది బిజిలీ.. భర్త కూడా సౌమ్యుడు ఒద్దికగా ఉంటాడు. బిజిలీ భర్తకు అనుకోకుండా దుబాయిలో వుద్యోగం వచ్చింది. అతను వెళ్ళిపోయాడు. బిజిలీ చిన్న వుద్యోగం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది. అప్పుడు వచ్చింది ఈ కోవిడ్ మహమ్మారి . ప్రపంచమంతా అతలాకుతలమై అనురాగాలు ఆత్మీయతలు నశించిపోయాయి. ఎవరి ప్రాణం వాళ్లకు దక్కితే అదే చాలు అనే స్థితి. వ్యాక్సిన్ వచ్చి కాస్త సద్దుమణిగాక ‘అమ్మ ఎలా వుందో! ఇక్కడికి తీసుకు వద్దాం’ అని తులసి నలుగురు పిల్లలూ ఒకరినొకరు సంప్రదింపులు జరిపారు. తులసికి ఫోన్ చేసి అడిగారు.

''అమ్మా! నువ్వు మా దగ్గిరకి వచ్చేయి. టికెట్ కొని పంపుతాము'' అన్నారు.

''నాకేమీ పర్వాలేదు.. బిజిలీ నన్ను బాగా చూసుకుంటుంది, మీరు బెంగ పడొద్దు'' అంది తులసి.

నిజానికి బిజిలీ ఉద్యోగం పోయింది. భర్త దగ్గిరకి పిల్లలను తీసుకుని వెళ్ళింది. ఇక్కడ లేదు. అయినా ధైర్యంగా వుంది తులసి. పిల్లలతో అబద్దం చెప్పింది. పిల్లల దగ్గరకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా దేశంలో ప్రజలకి చేయగల సాయం చేయాలని ఆమె సంకల్పం. తులసికి చేతిలో డబ్బు, స్వతంత్రం వచ్చింది. తనకి ఇష్టం వచ్చిన పని చేసే అవకాశం ఇక్కడే వుంది. అదే పిల్లల దగ్గర ఉంటే వేరొకలా ఉంటుంది. ఎవరి జీవితాలు వాళ్ళవి అనుకుని హైదరాబాదులోనే వుండిపోయింది.

ఇంతదాకా బాగానే గడిచింది. కోవిడ్ వలన బిజిలీ ఏమి అవస్థలు పడుతోందో అని బాధ పడేది.

వాక్సిన్లు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా వున్నా రానే వచ్చింది కోవిద్ . అశక్తురాలై బిజిలీకి ఫోన్ చేసింది. అదే అదనుగా అందరూ వచ్చేసారు. ఆ మరునాడే పూర్తిగా లాక్ డవున్ పెట్టేరు. అప్పుడు బిజిలీకి తులసి పిల్లలు ఫోన్ చేయడం, అమ్మను జాగ్రత్తగా చూడమని కన్నీటితో వేడుకోవడం చేసారు.

''నా ప్రాణం ఉన్నంతవరకూ అమ్మను కాపాడుతాన”ని మాట ఇచ్చింది వాళ్లకి. నెలరోజులకు బిజిలీ భర్త పిల్లలు కోవిడ్ తో యుద్ధం చేసి, ఎలా ఐతేనేం బయటపడ్డారు. తులసి, డబ్బును సందేహించకుండా ఖర్చు చేసింది. ఇంటి మీద లోన్ తెచ్చింది. అప్పుడే వీలునామా కూడా రాసింది. తాను వున్న ఇల్లు, బిజిలీ వుంటున్నఇల్లు, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ (భర్త ఉండగా కూడబెట్టిన డబ్బు) బిజిలీ పేరుతొ రిజిస్టర్ చేసింది.

''నేను చేసింది మీరు మెచ్చుతారు కదూ.. అంటూ భర్త ఫోటోకి చెప్పింది. నేను ఏ క్షణంలో పోయినా బాధ లేదు అనుకుంది నిశ్చింతగా.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. నాది కాకినాడ. మా నాన్నగారు శ్రీ బులుసు వెంక టేశ్వర్లుగారు, పిఠాపురం రాజా వారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసారు. ఆయన రచయిత, కవి, పండితులు. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం సబ్జెక్ట్స్ లో పీజీ చేసారు. ఇంటినిండా గ్రంధాలూ, ఇంటి ఎదుట నేను చదువుకునే స్కూల్ గ్రంధాలయం వున్న కారణమో, నాన్నగారి ప్రభావమో అన్ని పుస్తకాలూ చదివాను. ఆరుద్రగారు డాక్టరేటు చేసే రోజుల్లో నాన్నగారి దగ్గిరున్నగ్రంధాలు తీసుకెళ్లారు. విశ్వనాధ, దివాకర్ల వంటి దిగ్గజాలు మాఇంటికి వచ్చి కాకినాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలా వారిని చూసినట్టు లీలగా గుర్తు. నాన్నగారు రాసిన 150 పుస్తకాల్లో ఒకటి అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ పీవీగారు, విశ్వనాధ, దివాకర్ల ఆవిష్కరించారు.

తరువాత మహాఋషుల చరిత్రను (పది భాగాలూ) టీ టీ డీ వారు హక్కులు తీసుకుని ప్రచురించే

అవకాశం కల్పించిన శ్రీ పీ వీ ఆర్ కె ప్రసాదుగారు.. ఇలా చాల గుర్తులు మెదులుతూనే వున్నాయి.

నాగురించి చెప్పాలంటే రచనలు చేయడం ఆలస్యంగా జరిగింది.చదువు పెళ్లి పిల్లలు బాధ్యతలు తీరి రచన పత్రికలో 'వసుంధర' గారి ప్రోత్సహంతో నామొదటి కథ ''సెలయేరులో అల'' ప్రచురించబడింది. ఆ తరువాత అన్నిపత్రికల్లో వచ్చాయి. ఎక్కువగా రచన, ఈనాడువారి చతుర, విపుల లో ప్రచురించారు. ఇటు ఈ కథలు, చతుర నవలలు రాస్తూనే లోక్ సత్తా సంస్థ స్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో చేరాను. పార్టీలోనూ పనిచేసాను. సంస్థ పత్రికలో వ్యాసాలు రాసే అవకాశం జె పీ ఇచ్చారు. ఇరవై సం.లు వారితోపాటు పనిచేసే మహత్తరమైన అవకాశం లభించడం నాకు గర్వకారణం. ఇప్పుడూ లోక్ సత్తా లో వ్యాసాలు రాస్తూనే వున్నాను. కవితలు కూడా రాస్తూ వుంటాను. మావారు మేథ్స్ ప్రొఫసర్. మాకు ముగ్గురు పిల్లలు.అమెరికాలో వున్నారు. మేము కూడా ఎనిమిది సం.గ ఇక్కడే అమెరికాలో వుంటూ వున్నాము.

ధన్యవాదాలు.

అన్నపూర్ణ.

61 views0 comments

Comments


bottom of page