top of page

మంచి దెయ్యం




'Manchi Dayyam' - New Telugu Story Written By Mallavarapu Seethalakshmi

'మంచి దెయ్యం' తెలుగు కథ

రచన : మల్లవరపు సీతాలక్ష్మి


సాయంత్రం అయిదు గంటలైంది.


అప్పుడే ఎలిమెంటరీ స్కూల్ వదలడంతో పిల్లలందరూ గుంపులు గుంపులుగా ఇళ్లకు బయలుదేరారు.


సిరి, కిరణ్, చరణ్ కూడా స్కూల్ బ్యాగులు భుజాలకు తగిలించుకొని, మాట్లాడుకుంటూ ఇంటిదారి పట్టారు . ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతోంది సిరి. కిరణ్ , చరణ్ లిద్దరూ తన తమ్ముళ్లు, కవల పిల్లలు. థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నారు.


స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిలో పెద్ద మామిడి తోట ఉంది. పిల్లలు తోట లోకి దూరి మామిడిపండ్లు కోసుకోకుండా ఒక తోటమాలి ఉన్నాడు. మామిడి పండ్ల సీజన్ అయిపోవడంతో పిల్లలు ఆడుకోవడానికి తోటలోకి వచ్చినా అతను పెద్దగా పట్టించుకునేవాడు కాదు.


"మనం కాసేపు ఆ తోట లోకి వెళ్లి ఆడుకుందామా?" అని తమ్ముళ్లను అడిగింది సిరి.

కిరణ్, చరణ్’ సరే’ అన్నారు.


సిరి తోటమాలి దగ్గరికెళ్ళి "మేము కాసేపు తోటలో ఆడుకుంటాం. ప్లీజ్…” అని అడిగింది.


తోటమాలి ఒకసారి ఆకాశం వంక చూసి, "ఈ రోజు బాగా మబ్బులు పట్టి ఉన్నాయి . వర్షం వచ్చేటట్లు ఉంది. అప్పుడే చీకటి పడుతోంది. రేపు ఆడుకోవచ్చు. ఇంటికి వెళ్ళండి" అన్నాడు.


"ప్లీజ్ అంకుల్! తొందరగా ఆడుకుని వచ్చేస్తాం ప్లీజ్..." అంటూ పిల్లలు బ్రతిమాలడంతో " సరే ! ఒక అరగంట మాత్రం ఆడుకోండి. ఆలస్యం చేయవద్దు" అన్నాడు తోటమాలి.


ఆనందంతో గెంతుకుంటూ తోటలోకి వెళ్లారు పిల్లలు ముగ్గురూ.


కాస్త దూరం లోపలికి వెళ్లారో లేదో హోరువాన మొదలైంది. పక్కనే ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు కిందికి పరిగెత్తింది సిరి.


కిరణ్,చరణ్ ఇద్దరూ అక్కను అనుసరించారు. వాన మరింత పెద్దది కావడంతో పాటు బాగా చీకటి పడింది. పిల్లల్లో భయం మొదలైంది.


" అక్కా! ఈ తోటలో దెయ్యాలు ఉంటాయట. మా ఫ్రెండ్ చెప్పాడు "అన్నాడు కిరణ్.


"అవును. నాకూ భయంగా ఉంది" అన్నాడు చరణ్.


సిరికి దెయ్యాలంటే వాళ్ళిద్దరికంటే ఎక్కువ భయం.

"ఒరేయ్! నన్ను భయ పెట్టకండి. ముగ్గురం ఆంజనేయ దండకం చదువుకుందాం" అంది సిరి.


"శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం---" అని మొదలు పెట్టారు కానీ, తర్వాత ఏం చెప్పాలో ముగ్గురిలో ఎవరికీ తెలియదు.


"ఇంట్లో రోజూ తాతయ్య ఆంజనేయ దండకం చదువుతూ ఉంటాడు. కానీ ఏ రోజూ వినలేదు మనం" అంది సిరి.


ఇంతలో చెట్టుమీద పెద్ద శబ్దం వినబడింది. ముగ్గురూ తలలు పైకెత్తి చూసారు.

పైన మామిడి చెట్టు మీద ఒక పెద్ద దెయ్యం కూర్చుని ఉంది.


పిల్లల్ని చూడగానే ఒక్కసారిగా చెట్టు మీద నుంచి కిందకు దూకింది దెయ్యం.


తమ ముందుకు దూకిన దెయ్యాన్ని చూసి , ముగ్గురు పిల్లలూ భయపడిపోయారు.

ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వణికిపోతున్నారు.


అది గమనించిన దెయ్యం "భయపడకండి పిల్లలూ! నేను మంచి దెయ్యాన్ని. మంచి పిల్లలను ఏమీ చేయను” అని చెప్పింది.


అయినా పిల్లల్లో భయం పోలేదు. అప్పుడు దెయ్యం ముగ్గురు పిల్లలకూ తలా ఒక చాక్లెట్ ఇచ్చింది. భయపడుతూనే చాక్లెట్ తీసుకున్నారు ముగ్గు రూ. చాక్లెట్ తిన్నాక వాళ్లకు కాస్త ధైర్యం వచ్చింది.


ముందుగా సిరి "మేము ముగ్గురమూ మంచి పిల్లలము. మమ్మల్ని వదిలెయ్యి" అంది.


కిరణ్, చరణ్ లు కూడా "అవును మమ్మల్ని వదిలెయ్యి" అన్నారు.


"మీరు మంచి పిల్లలయితే ఎప్పుడైనా, ఎవరికైనా సహాయం చేశారా?" అడిగింది దెయ్యం.

చాలాసేపు ఆలోచించారు ముగ్గురూ. ముందుగా కిరణ్, చరణ్ లు తేరుకుని "మేము ఒకసారి ఒక తాత రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే చెయ్యి పట్టుకొని దాటించాం"అని చెప్పారు.


"నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక సారి వరద బాధితుల కోసం డొనేషన్ కలెక్ట్ చేశాను " చెప్పింది సిరి.


" మరి ఇంట్లో అమ్మానాన్నలకు సాయం చేస్తున్నారా? నిన్న ఏం సహాయం చేశారు?" అడిగింది దెయ్యం.


ఎంత ఆలోచించినా ఏమీ గుర్తుకు రాలేదు పిల్లలకు. కాసేపటికి సిరి ధైర్యం తెచ్చుకొని "నిన్న అమ్మకు గిన్నెలు కడగటంలో సహాయం చేశాను" అంది.


"మంచి పని చేశావు "అని మెచ్చుకుంది దెయ్యం.


అక్క చెప్పిన అబద్ధం దెయ్యం నమ్మడంతో కిరణ్, చరణ్ లకూ ధైర్యం వచ్చింది.


"మేము నిన్న నాన్న బైక్ ను శుభ్రంగా తుడిచాము" అన్నారు ముక్తకంఠంతో.


“మీరూ మంచి పని చేశారు. అయినా ఒకసారి మీరు చెప్పింది నిజమో కాదో కనుక్కుంటాను.” అంది దెయ్యం.


తరువాత ఆ దెయ్యం కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చెప్పడంతో దాని చేతిలో ఒకసెల్ ఫోన్ ప్రత్యక్షమైంది.


"మీ నాన్న నంబరు చెప్పండి" అడిగింది దెయ్యం. నంబరు చెప్పింది సిరి. ఆ నంబరు కు కాల్ చేసింది దెయ్యం. అక్కడ పిల్లలు ఇంకా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ నాన్న మోహన్, అమ్మ భారతి ఆందోళన పడుతున్నారు. ఇంతలో మోహన్ చేతిలోని ఫోన్ మోగింది. ఫోన్ మోగుతోంది కానీ ఏ నంబరూ కనబడడం లేదు. ఆశ్చర్యంతో ఫోన్ తీసి "ఎవరూ?" అని అడిగాడు మోహన్.


"నేను దెయ్యాన్ని మాట్లాడుతున్నాను. మీ పిల్లల గురించి కొన్ని విషయాలు అడగాలి" అంది దెయ్యం.


ఆశ్చర్యపోయారు మోహన్ భారతీ లు. కాసేపటికి తేరుకుని “అడగండి చెబుతాను” అన్నాడు మోహన్.


"పిల్లలు మీకు ఇంట్లో హెల్ప్ చేస్తుంటారా? నిన్న మీ బైక్ క్లీన్ చేశారా?" అని అడిగింది దెయ్యం.


"అవును నిన్న నా బైక్ క్లీన్ చేశారు" తడుముకోకుండా చెప్పాడు మోహన్.


"వంటింట్లో మీ అమ్మాయి హెల్ప్ చేసిందా?" భారతిని అడిగింది దెయ్యం.


"హెల్ప్ చేసింది. అమ్మాయే కాదు, అబ్బాయిలు కూడా ప్లేట్లు కడగడం లో సాయం చేశారు" చెప్పింది భారతి.


ఆశ్చర్యపోయారు ముగ్గురు పిల్లలూ. నిజానికి తాము ఏ సహాయం చేయకపోయినా చేసినట్లు చెప్పారు అమ్మానాన్నలు.


‘ఇకమీదట రోజూ వాళ్ళకు హెల్ప్ చేయాలి!' అని మనసులోనే నిశ్చయించుకున్నారు ముగ్గురూ.


మొత్తానికి దెయ్యం తమ మాటలను నమ్మిందనీ, ఇక తమను వదిలేస్తుందనీ అనుకున్నారు పిల్లలు.


"నీ స్లేట్ ఇలా ఇవ్వు" కిరణ్ తో అంది దెయ్యం. తన స్లేట్ ఇచ్చాడు కిరణ్. ఆ స్లేట్ మీద తన చేత్తో రెండుసార్లు తట్టింది దెయ్యం. ఆశ్చర్యంగా ఆ స్లేట్ మీద నిన్న జరిగిన సంఘటనలు కనిపించసాగాయి.


తన బైక్ క్లీన్ చేసుకుంటూ "ఒరేయ్ కిరణ్! అమ్మనడిగి ఒక పొడి గుడ్డ తీసుకురారా!" అన్నాడు మోహన్.


టీవీ ముందు కూర్చుని ఉన్న కిరణ్ విసుగ్గా మొహం పెట్టి, "ఎప్పుడూ నాకే చెబుతావు. చరణ్ ఇస్తాడులే" అన్నాడు.


"నాన్న చెప్పింది నీకు. నువ్వే ఇవ్వు" అన్నాడు చరణ్.


ఇలా ఇద్దరూ వాదులాడుకుంటుంటే వంటింట్లో నుంచి భారతి వచ్చి బైక్ తుడవటానికి ఒక పొడి గుడ్డను అందించింది మోహన్ కు.


ఇక వంటింట్లో గిన్నెలు తోముకుంటూన్న భారతి, సిరిని పిలిచి "కాస్త ఈ తోమిన గిన్నెలను అలమరలో పెట్టమ్మా" అని అడిగింది.


“నేను హోంవర్క్ చేసుకుంటున్నానమ్మా"అంది సిరి టీవీ చూస్తూ.


తన చేతిలో ఉన్న స్లేట్ మీద రెండు సార్లు కొట్టింది దెయ్యం. అది మామూలు స్లేట్ లాగా అయ్యాక దాన్ని కిరణ్ కి తిరిగి ఇచ్చేసింది. తాము అబద్ధాలు చెప్పిన విషయం దెయ్యానికి తెలిసిపోవడంతో ముగ్గురు పిల్లలూ మరింతగా భయపడిపోయారు. ఇక దెయ్యం తమను తినే స్తుందని నిశ్చయించుకున్నారు.


సిరి కాస్త ధైర్యం తెచ్చుకుని "నేను వరద బాధితుల కోసం డొనేషన్ కలెక్ట్ చేసింది నిజం. కావాలంటే నా స్లేట్ మీద రెండు సార్లు కొట్టి చూడు" అంది.


"మేము ఒక తాతను రోడ్డు దాటించింది కూడా నిజం. ఈసారి నా స్లేట్ మీద కొట్టి చూడు" అన్నాడు చరణ్.


పెద్దగా నవ్వింది దెయ్యం. "సిరి డొనేషన్ కలెక్ట్ చేసింది 6 నెలల క్రితం. కిరణ్ చరణ్ లు ఒక తాతను రోడ్డు దాటించింది సంవత్సరం క్రితం జరిగింది. ఒక మంచి పని చేయడానికి, ఆర్నెల్లు, సంవత్సరము కావాలా? ప్రతిరోజూ మంచి పనులు చేయాలి. ఇంట్లో అమ్మానాన్నలకు చేసిన ఒక హెల్ప్ చెప్పమంటే చెప్పలేకపోయారు. అయినా మీ అమ్మనాన్నలు, మీ గురించి మంచిగా చెప్పారు. అంతేగాని మీ పైన కోపం చూపించలేదు" అంది దెయ్యం.


"నిజమే! మేము తప్పు చేశాం. ఇకమీదట అమ్మానాన్నలకు ప్రతిరోజూ పనిలో సహాయం చేస్తాం. బయట వాళ్లకు కూడా తప్పకుండా సహాయం చేస్తాం" చెప్పారు ముగ్గురూ.


"నాకు తెలుసు, మీరు మంచి పిల్లలు. నేను మిమ్మల్ని ఏమీ చేయను. మంచి పిల్లలను నేనే కాదు ఏ దెయ్యమూ ఏమీ చేయదు. మీకోసం మీ అమ్మానాన్న తోటమాలిని తీసుకుని వస్తున్నారు. ఇక నేను వెళ్తాను" అని చెప్పి దెయ్యం చెట్టు పైకెక్కి మాయమైపోయింది.


తోటమాలితోపాటు పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చిన మోహన్, భారతిలకు పిల్లలు కనపడ్డంతో ఆనందంతో వాళ్ళను ఎత్తుకున్నారు.


"అమ్మా! నాన్నా! మేము ఎప్పుడూ మీ మాట వింటాం . మీరు చెప్పిన పనులు చేస్తాం. ప్రామిస్" అన్నారు ముగ్గురు పిల్లలూ.


రచయిత్రి పరిచయం : నమస్తే. నా పేరు మల్లవరపు సీతాలక్ష్మి. శ్రీవారి పేరు మల్లవరపు సీతారాం కుమార్. ఇద్దరికీ తెలుగు కథలంటే చాలా ఇష్టం. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. మా కథలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్, కౌముది లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సహాయం చేస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

178 views0 comments
bottom of page