top of page

మంచి మనసులు


Manchi Manasulu written by K. B. Krishna

రచన : -- కె .బి.కృష్ణ

ఇంటిముందు వేప చెట్టు మీద కాకులూ, గోరింకలూ, కిరీటం పక్షులూ, గోల గోల చేస్తున్నాయి. కోయిల అప్పుడప్పుడు కూ కూ అంటోంది. వేపచెట్టు మీద నుండి చల్లని గాలి వీస్తోంది. మరోప్రక్కన వేప కొమ్మలలోంచి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి, వీధి వరండాలో పనిముట్లను కిరోసిన్ గుడ్డ తో శుభ్రం చేసుకుంటూ -- భార్య వీరమ్మ తెచ్చిన కాఫీ తాగుతూ, ప్రక్కనే ఉన్న వీరమ్మను, కూతురు లోవతల్లి ని చూస్తున్నాడు తాతారావు సూర్యకాంతిలో.

ఇంతలో బయటకు వెళ్లిన కొడుకు దుర్గయ్య చేతిలో పేపర్ తో వచ్చాడు పరుగులతో.

“ నాన్నా -- నేను డిగ్రీ పరీక్ష తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యాను. -- అంటూ వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించాడు. అక్కడక్కడ గుండ్రంగా చిరుగులు ఉన్న లేత నీలం రంగు జీన్సు ప్యాంటు, చౌక రకం నల్లని టి షర్ట్ వేసుకున్నాడు, సుమారు ఆరు అడుగుల ఎత్తులో ఎత్తుకు తగిన పుష్టికరమైన శరీరం.

వెంటనే కొడుకు తల మీద చేయి వేసి “ నా తండ్రీ! ఈ వడ్రంగి పని వార్షీకం మాకొద్దనుకున్నాను. నా మాట నిలబెట్టేవు మరి తరువాత ఏమి చేస్తావురా?“ అన్నాడు తాతారావు డిగ్రీ పాస్ అయిన కొడుకుని కంటతడి మాటున చూస్తూ,

భుజం మీద కండువా తో కళ్ళు అద్దుకుంటూ-- “ నాన్నా నాకు ఢిల్లీ కేంద్రం వారు నిర్వహించే రైల్వే డిపార్ట్ మెంట్ లో సర్వీస్ కమిషన్ పరీక్ష రాయాలని ఉంది. కనీసం ఆరు నెలలు హైద్రాబాదులో కోచింగ్ తీసుకోవాలి. నేను అక్కడే నలుగురు వుండే రూమ్ లో వుండి తక్కువ ఖర్చుతో కోచింగ్ తీసుకుంటాను. ఆ కోచింగ్ తీసుకుంటే పరీక్ష తప్పక పాస్ అవుతాను. అయితే కోచింగ్ తీసుకోక పోయినా తప్పక పాస్ అవుతాను. కానీ మంచి రాంక్ రాకపోతే వెంటనే ఉద్యోగం రాదు అందుకని -- “ అంటూ తల వంచుకుని రెండు గుప్పెటలు నలుపుకుంటున్న కొడుకు ని చూసి -- “ అరేయ్ పిచ్చొడా -- నువ్వు చదువు విషయం లో ఏమీ ఆలోచించమాకు, నేనూ, మీ అమ్మా, అవసరమైతే నీ చెల్లీ కూడా పని చేసి, నువ్వు చదవబోయే చదువు కు ఇనుప గోడ లా నిలబడిపోతాం రా --” అన్నాడు తాతారావు. అతని ధ్యేయం తన ఇంట్లో తన తరువాత ఎవరూ వడ్రంగి సామాన్లు సైకిల్ కి తగిలించుకుని రోడ్ల మీద తిరగకూడదు.

వెంటనే తండ్రి ని కావలించుకున్నంత పని చేసి -- “ నాన్నా నువ్వు దేవుడివి, అమ్మ దేవత, నా బంగారు చెల్లి మీరు అండ గా ఉంటే ప్రపంచాన్నే జయిస్తాను --”

తాతారావు వెనకాలే నిలబడి వున్న తల్లీ, చెల్లి లోవతల్లి ముఖాలనిండా అలుముకున్న సంతోషంతో సంబరంతో చూస్తున్నారు దుర్గయ్య ని -- గభాల్న లోపకు వెళ్లి బెల్లం ముక్క పట్టుకొచ్చి తండ్రీ కొడుకుల నోళ్లల్లో పెట్టింది తల్లి వీరమ్మ. మర్నాడే దుర్గయ్య హైద్రాబాదు వెళ్ళిపోయాడు.

-------

తాతారావు సైకిల్ కి వడ్రంగి సామాన్లు కట్టుకుని నెమ్మదిగా సైకిల్ నడుపుకుంటూ వెళ్తోంటే “ ఏమండోయ్ తాతరావ్ గారు బావున్నారా, ఈ మధ్యన నల్లపూస అయిపోయారు, కనపట్లేదు అంతా కులాసాయేనా. పనులు బాగా సాగుతున్నాయా ? “ అంటున్నాడు భద్రం.

అతను మద్దాల వుడ్ ఫ్యాక్టరీలో పెద్ద మేస్ట్రీ. కొంచెం దర్జాగా ఉంటాడు, ఎవరితోనూ

మాట్లాడడు. భద్రం పలకరింపుతో తల ఎత్తి చూశాడు తాతారావు.

“ నమస్కారం భద్రం గారు-- తమరి దయ వలన బగమంతుని దయ వలన మేం కులాసాయేనే -- అంటూ తాను వేసుకున్న ఖాకీ నిక్కరు, పొట్టి చేతుల బనీను లాంటి చొక్కా చూసుకుని, అతను వేసుకున్న తెల్లని పైజమా,పైన గంధంరంగు చొక్కా మెడలో సన్నని బంగారు గొలుసు, సరి చూసుకున్నాడు, అతని చేతి లో సిగరెట్ కాలుతోంది. మరి అతనికి నెల జీతం !

“ అదేంటి తాతారావు గారు తమరి అబ్బాయి డిగ్రీ పాస్ అయినాడంట కదా రైల్వే లో పరీక్షలకు హైదరాబాద్ వెళ్లాడని తెలిసింది తాతారావు గారు ఏమీ దిగులు పడకండి. మనోడు పరీక్ష లో పాస్ అయ్యేక పోస్ట్ కోసం అవసరమైతే ఎంతైనా డబ్బు ఖర్చు పెడదాం. మనోడు స్టేషన్ మాస్టర్ అయిపోవాల మనం తలెత్తుకుని తిరగాల. అంతే ! “ అంటున్న భద్రంని నిశితం గా చూశాడు. “ అలాగేనండీ -- తమరి ప్రేమ కు కృతజ్ఞతలు బాబూ --” అంటూ తాతారావు సైకిల్ ఎక్కేడు.

---------

“ ఒసేయ్ -- అబ్బాయి హైదరాబాద్ లో దిగి హాస్టల్ కి వెళ్లి ఉంటాడంటావా, జాగ్రత్తగా వెళ్ళేడంటావా ? “ అనుకుంటూ నిద్ర లేచాడు తాతారావు. వెంటనే కూతురు వచ్చి “ నాన్నా దుర్గయ్య క్షేమం గా చేరేడు పది గంటలకు కాలేజీ కి వెళ్తానని మెసేజి ఇచ్చాడు “ చెప్పింది. తాతారావు గుండెల నిండా బరువు గా ఉంది, స్థిరం గా నిలబడ లేక,, కూర్చోలేక పోతున్నాడు ఇంతలో భార్య వచ్చింది “ ఏందయ్యా నీరసం గా ఉండావు ? “ అంటున్న ఆమె చేతిలో కాఫీ అందుకుని “ వీరమ్మా మన బుడ్డోడికి ప్రతీ నెలా డబ్బు పంపిస్తామని చెప్పాం కానీ, ఎలా పంపుతామే ? చాలా భయం గా ఉండాదే ? అంటుంటే “ ఏమీ దిగులు పడమాకయ్యా. నేనూ అమ్మాయీ చెరో పది ఇళ్లల్లో పనులు చేస్తాం, నువ్వు పనిచేసే చోట ఎవరన్నా గొప్పోళ్ళని అప్పు అడుగుదువు లే --” అని ధైర్యం చెప్పింది వీరమ్మ.

ఇంతలో --” మామయ్యా --” అంటూ తాతారావు దగ్గర పని నేర్చుకుని మేస్త్రీ అయిన శ్రీను వచ్చాడు. జీన్సు ప్యాంటు వేసుకుని దానిమీద కొంచెం ఖరీదైన టి.షర్ట్ వేసుకుని జేబులో సెల్ ఫోన్ తో స్టైల్ గా ఉన్నాడు వాడు.

“ ఏందిరోయ్ -- ఇయ్యాల మేం గుర్తుకొచ్చామా ? “ అన్నాడు తాతారావు దిగులు నిండిన ముఖం తో

“ మామయ్యా నువ్వు ముందుగా నవ్వు ముఖం తో మాట్లాడు. నీకు అన్నీ శుభ వార్తలే చెబుతాను. ఇంతలో వీరమ్మ కాఫీ పట్టుకొచ్చింది. “ అత్తా -- నేను బజార్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంట్రాక్టు తీసుకున్నాను. అక్కడ తాతారావు మామయ్యా నువ్వూ, అమ్మాయీ కూడా పనిచేయ వచ్చును. మీకు ప్రతీనెలా దుర్గయ్య కు డబ్బు పంపడానికి ఇబ్బంది ఉండదు. మామయ్యా నాకు అన్నీ తెలుసును.--- “ అంటున్న శ్రీను చేతులు పట్టుకుని ఊపేస్తూ అతన్ని కావలించుకుని తాతారావు పరమానందం తో” దేవుని లా వచ్చావు శ్రీనూ -” అంటోంటే వీరమ్మా లోవతల్లి అక్కడే నిలబడ్తారు. “ రేపు పూజ చేసి పనులు మొదలు పెడతా వున్నాం నేను వచ్చి తీసుకెళ్తాను -- “ అని వెళ్ళాడు శ్రీను.

---------

ఊళ్ళో పెద్ద అపార్టుమెంట్ పనులు దుర్గమ్మ తల్లి పూజ తో మొదలయ్యాయి. వీరమ్మ లోవతల్లి కూలీపనికి వెళ్తున్నారు. మరో పది రోజులకు కలప వచ్చింది, తాతారావు కూడా పనికి వెళుతున్నాడు. శ్రీను ఓనర్ గారికి చెప్పి తాతారావు కుటుంబానికి ప్రతి శనివారం డబ్బులు ఇప్పిస్తున్నాడు. ప్రతీ నెల దుర్గయ్య కు డబ్బు పంపుతున్నారు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే-- అని పాటలు పాడుకుంటూ సంవత్సరం లో ఎనభై శాతం పని పూర్తి చేశారు. కాలచక్రం ఆశావహ దృక్పధం కల మంచి మనుషుల ఆలోచనా తరంగాల్లాగే శరవేగం తో గడిచి పోతోంది -- ఇంకో ఆరు నెలల్లో పనులు పూర్తి అయిపోతాయి. శ్రీను మరునాడు పనులకు శెలవు అని చెప్పాడు.

“ వీరమ్మా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే మరో రూపం లో వచ్చి సాయం చేస్తాడని పురాణం లో చాలా సార్లు విన్నాను ప్రతీ నెలా దుర్గయ్య కు హైద్రాబాదు డబ్బు ఎలా పంపించాలా అని దిగులు పడిపోతావుంటే శ్రీనుబాబు దేవుడి లా వచ్చాడే ఆడి ఋణం ఈ జన్మ లో తీర్చుకోలేమే వీరమ్మా అంటున్నాడు తాతారావు ఆమె ను ప్రేమ గా చూస్తూ -- “

"అవునయ్యా నువ్వే దేవుడివి నీకు దేవుడు సాయం చెయ్యకుండా ఉంటాడా ?" అని అంటోంటే ఇంటి ముందు ఆటో ఆగింది. దాని లోంచి ముందు శ్రీను, ఆ వెనుక గులాబీ రంగు నేత చీర లో ఒక స్త్రీ దిగారు.

శ్రీను వస్తూనే “ తాతారావు మామయ్యా ఇవ్వాళ పనులకు సెలవు ఇచ్చేశా ఇందుకనే -- అంటూ లోపలకు వస్తూనే “ ఇదిగో మా అమ్మ నాకు అమ్మే దేవత అన్నీను --అమ్మా నేను చెప్పలా తాతారావు మామయ్యా వీరమ్మ అత్తా వీళ్ళే --” అంటూ పరిచయం చేసేడు.

ఆమె వెంటనే “ అమ్మా నా పేరు లక్ష్మమ్మ శ్రీను తండ్రి గారు మట్టిలో కలిసి పదేళ్ళయింది. అప్పటి నుండీ నేను వాడు పనిలోకి వెళ్ళేము. వాడు కొంచెం పెద్దోడయ్యేక నన్ను మానిపించేసేడు. రాత్రీ పగలు పని చేసి డబ్బు సంపాయించి డాబా కట్టుకున్నాడు. వదినా లోవతల్లి ఏదీ ? అందామె. పసుపు రంగు లంగా మీద కనకాంబరం రంగు వోణీ వేసుకుని ఐదడుగుల ఎత్తు లో పుష్టి గా వున్న లోవతల్లి వచ్చి లక్ష్మమ్మ పాదాలకు నమస్కరించింది. వెంటనే లక్ష్మమ్మ లోవతల్లి మెడలో తన చీర చెంగు లోంచి తీసి బంగారు గొలుసు లోవతల్లి మెడ లో వేసి “ తాతారావు అన్నయ్య గారు లోవతల్లి మా ఇంటి కోడలు ఇవ్వాళ నుంచి అనేసింది. బిడ్డ ను నా కడుపు లో పెట్టుకుంటాను-- “ అంది. శ్రీను ని ఎంత పని చేసావురా అన్నట్లు గా చూడసాగేడు తాతారావు. ఒక నెల రోజుల్లో శ్రీను, లోవతల్లి వివాహం నిరాడంబరం గా దుర్గమ్మ గుడి లో జరిగిపోయింది. హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్న, పరీక్షలు రాస్తున్న దుర్గయ్య కు ఫోన్ లో చెప్పేసి పెళ్లి చేసేశారు. వెంటనే కాపురానికి లోవతల్లి ని పంపించేశారు. అపార్ట్ మెంట్ నిర్మాణం పూర్తి అయిపొయింది. తాతారావు విశ్రాంతి గా ఉన్నాడు.

---------

ఆకాశం లో తూర్పు దిక్కున కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు పచ్చని, ఎరుపు రంగు కలగలిపి వెదజల్లుతూ సూర్యుడు నయనానందకరంగా కాంతి తో రోజంతా ప్రపంచమంతా వెలుగు నింపడానికి ఉదయిస్తున్నాడు తాతారావు ఇంట్లోకి ఆ కాంతిపుంజాలు ప్రసరిస్తున్నాయి. తాతారావు కి తొందరగా మెలకువ వచ్చేసింది. తన కొడుకు పరీక్ష లో పాస్ అయి ఉద్యోగం చేతిలో పట్టుకుని వచేస్తాడని అతని మనసు చెబుతోంది. ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని వీధి లో గోవిందనామాలు చదువుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో ఇంటి ముందుగా ఆటో ఆగిన చెప్పడు అయింది. సన్ ఫ్లవర్ పువ్వు లా విచ్చుకున్న ముఖం తో తన బంగారు కొండ దుర్గయ్య వేగం గా తన వేపు వస్తున్నాడు. వస్తూనే తండ్రి పాదాల వద్ద బోర్లా పడి పోయి నమస్కారం చేస్తున్నాడు. కొడుకుని లేవదీసి తన శరీరానికి దగ్గరగా హత్తుకున్నాడు తాతారావు. భార్యని, కూతురు నీ పిలిచాడు వాళ్ళు పరుగులతో వచ్చారు. “

అమ్మా నేను స్టేషన్ మాస్టర్ ని అయ్యాను మన కష్టాలకు ముగింపు అయిపోయింది కొన్ని నెలలు ట్రైనింగ్ అయిపోయాక మన ఊళ్ళో నే చేరిపోతాను. “ అని అంటుండగానే లోవతల్లి ఆమె భర్తా వచ్చేశారు తాతారావు ఫోన్ అందుకుని.వచ్చేసిన శ్రీను “ మా బావ మా ఊళ్ళో స్టేషన్ మాస్టర్ నాకు ఇక తిరుగు లేదు “ అంటూ బావ ను గుండెలకు హత్తుకున్నాడు శ్రీను.

అందరికి పుల్లారెడ్డి మిఠాయిలు నోట్లో పెట్టి నోళ్లు తీపి చేశాడు దుర్గయ్య. దైవాన్ని సంపూర్ణం గా నమ్ముకుని ఆయనకు తమకు తాము అంకితం చేసేసుకున్న వారికి ఎప్పుడు అన్నీ విజయాలే వారికి అపజయాలు ఉండనే ఉండవు. ఇంతలో ఇంటిముందు మరో ఆటో వచ్చి ఆగింది. అందులోంచి భద్రయ్య దిగేడు. అతని చేతుల్లో రెండు పెద్ద చామంతి పూల దండలు, బొకేలు ఉన్నాయి. భార్య శ్యామలాంబ చేతిలో పెద్ద సంచులు రెండు ఉన్నాయి వాటిల్లో మిఠాయిలు రకరకాల పళ్ళు ఉన్నాయి. భద్రయ్య ఇంట్లోకి వస్తూనే తండ్రి కొడుకులను పక్క పక్కనే నిలబెట్టి ఇద్దరికీ దండలు వేసి, చేతుల్లో బొకేలు పెట్టి పరమానందం తో “ బాబూ దుర్గయ్య, నీలాంటి బుద్ధిమంతుడూ తెలివిగలవాడూ మన ఊరి లో లేడు రా --” అంటూ అతన్ని అక్కున చేర్చుకున్నాడు.

శ్యామూ ఇలా రా అని భార్య ను పిలిచి ఇద్దరి చేతులూ తాతారావు చేతిలో పెట్టి “ బావగారూ -- ఈ రోజు నుండి దుర్గయ్య మా అల్లుడు. మా అమ్మాయి దుర్గ పదో తరగతి తప్పింది కానీ తెలివైంది. పెద్దలంటే గౌరవం. నాకూ ఒక్కతే కూతురు నేను సంపాయించిందంతా దానికే మీకు ఎంత కట్నం కావాలంటే అంతా ఇస్తాను. వీరమ్మ చెల్లాయ్ మా అమ్మాయిని నీ కడుపులో పెట్టుకో --” అంటూ భద్రయ్య

దంపతులు తాతారావు దంపతుల కాళ్లకు నమస్కరించారు. అందరు సంతోషం గా రెండు ఆటోల్లో సుబ్బయ్య హోటల్ కి వెళ్లారు భోజనాల కోసం సంతోషం గా కొంతకాలానికి ట్రైనింగ్ లో ఉండగానే దుర్గయ్య కి అక్కడే రైల్వే కళ్యాణ మండపం లో ఘనంగా గా పెళ్లి చేసేశారు. తాతారావు ఇంటికి కోడలు వచ్చేసింది. తాతారావు మాత్రం సైకిలూ-- పనిముట్లు -- వదలకుండా పనికి వెళ్తూనే ఉన్నాడు.

---------

కాలం జెట్ వేగం తో కదిలిపోయింది. ఇంటిముందు వరండా లో పడక కుర్చీ లో కూర్చుని ఉన్నాడు తాతారావు. కొడుకూ కూతురూ వివాహాలు అయి పోయి వాళ్ళ సంసారాలు సుఖం గా చేసుకుంటుంటే వాళ్ళ కబుర్ల ను ఉదయం టిఫిన్ లోను, మధ్యాహ్నం రాత్రి భోజనాల్లోనూ తీయని తినుబండారాల్లా లొట్టలేసుకుంటూ తింటున్నారు తాతారావు దంపతులు. “ వీరమ్మా -- చూశావా -- మనం బగమంతుణ్ణి నమ్ముకుంటే ఏ లోటూ ఉండదు, అంతే కాకుండా తెలిసి మనం ఎవురికీ అపకారం చెయ్యనేకూడదు. ఎవురినీ అనవసరం గా నిందించకూడదు. ముఖ్యం గా ఎవురి పొట్ట మీద కొట్టకూడదు. నేను భగమంతుని తప్ప ఎవురినీ నమ్మను ఆయనే అన్నీ. నేను ఎలా అనుకుంటానంటే దేవుడు నేను ఏ పని చేస్తున్న నా కూడా ఉన్నాడనే అనుకుంటాను. -- అని ప్రక్కనే కూర్చున్న భార్య భుజం పై ఆప్యాయం గా చేయి వేసి చెబుతున్నాడు తాతారావు.

“ అవునయ్యా మనకు దేవుడే దిక్కు. మనకు పెళ్లయి నప్పుడు మనింట్లో ఏ ఒక్క సామాను లేదు. కానీ ఇప్పుడు మన అవసరాలకు కావలసిన ప్రతీ వస్తువు ఉంది. పిల్లలిద్దరూ తెలివైన వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డారు. అంతకన్నా మనకు ఏమి కావాలి చెప్పు ? ఇదంతా నీ మంచితనం కాదూ --” అంటోంది మెరిసే కళ్ళతో భర్త ను చూస్తూ-

ఇంతలో -- నాన్నగారూ -- “ అంటూ భర్త భద్రం తో వచ్చింది కూతురు లోవతల్లి. దుర్గ ఐదున్నర అడుగుల ఎత్తు లో నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని సిల్కు చీర కట్టుకుని, చక్కగా తలదువ్వుకుని జెడలో పూలు తురుముకుని మెడలో గొలుసులు, నెక్లేసు, చేతులకు బంగారు గాజులు వేసుకుని దర్జా గా ఉంది. ఇద్దరు వస్తూనే అత్తమామలకు పాదాభివందనం చేశారు. వెంటనే మంచినీళ్లు తాగుతూ శ్రీను “ మామయ్యా మేము ఇవ్వాళ వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి అవసరమైన కొన్ని బట్టలు సర్దుకుని మా వెంట వచ్చేయండి. ఇంకేమీ మాట్లాడ వద్దు -- “ అంటున్న అల్లుడిని ప్రశంసా పూర్వకం గా చూస్తూ తాతారావు “ నా తండ్రీ మా ఆయుష్షు కూడా కలుపుకుని నూరేళ్లు జీవించండి మీరిద్దరూ-- మేము తప్పకుండా మీ ఇంటికి వచ్చేస్తాం ఎప్పుడంటే మేము మా పనులు చేసుకోలేనప్పుడు అప్పటివరకు మమ్మల్ని ఒంటరి గా సంతోషం గా ఉండనివ్వండి. --” అన్నాడు..

కొన్ని క్షణాలు అలోచించి శ్రీను “ అలాగే మామయ్యా మీ ఇష్టం --” అని కొంచెం సేపు ఉండి వెళ్లిపోయారు -- వాళ్ళు వెళ్ళిపోయాక రెండు మూడు నిముషాలు మౌనంగా, కళ్ళనిండా తడి అయిపోతుంటే తాతారావు, పడక కుర్చీ లో కళ్ళు మూసుకుని ఉండి పోయాడు, చుక్కలు చుక్కలు గా ఆనంద భాష్పాలు జాలు వారుతోంటే. ప్రక్కనే కూర్చున్న వీరమ్మ చీర చెంగు లో అమ్మాయి ఇచ్చిన నోట్లు చూస్తూ మూగ గా రోదిస్తోంది. “ నాన్నకు చెప్పకు. అవసరాలకు ఉంటాయి, వంట చెయ్యలేక పోతే హోటల్ కి వెళ్లి తినండి అని చెప్పి డబ్బు ఇచ్చింది కూతురు.

“ ఒసేవ్ చూసినావా మనకు ఇంతకన్నా రాజభోగం ఏమి కావాలి. -- “ అంటూ మౌనంగా ఉన్న వీరమ్మ తలను తన వోడి లో పెట్టుకున్నాడు తాతారావు. మనిషి జీవితం లో భర్త భార్య పై చూపించే మక్కువా ప్రేమా. అనురాగం, ఆత్మీయత వృద్ధాప్యం లో కష్టాలు, భరించలేని ఆవేదనలు, సుఖాలు కట్టలుతేగే సంతోషాలు కలగలిపి వాటిని ఇద్దరూ కలిసి జీర్ణించుకున్నాక భార్య భర్తలు పరిపూర్ణమైన వ్యక్తిత్వాలతో రూపు దాల్చుతారు. అప్పుడు అసలైన మేలిమి బంగారం లాంటి మనుషులవుతారు. ఇక వాళ్లకి ఒకరి మీద మరొకరికి నేరారోపణలూ వగైరాలు ఉండవు. ప్రశాంతం గా భర్త ఒడిలో తలపెట్టుకుని మౌనంగా సంతోషం గా తన కేమి లోటు అన్నట్లుగా ఆనంద భాష్పాలు జాలువారుతున్నాయి వీరమ్మ కళ్ళల్లోంచి ---

ఇంతలో ఇంటిముందు బైక్ ఆగింది. కొడుకూ కోడలు వచ్చారు. తాతారావు దంపతులు తమ కొడుకునీ కోడలిని తమ నాలుగు కళ్ళనీ వేలాది కళ్ళు గా చేసుకుని చూడసాగేరు.

“ అమ్మ ఎలా ఉన్నవే “ అంటూ తల్లిని ప్రేమతో అల్లుకున్నాడు దుర్గయ్య. అతని భార్య అతన్ని చూసి ఏదో సైగ చేసింది.

“ నాన్నగారూ -- నేను పంతులు గారితో మాట్లాడి మంచి రోజు చూపిస్తాను. మీరూ అమ్మా మాతోపాటు వచ్చేసి మాతోనే ఉండాలి. అమ్మ గాని, మీరు గాని ఏ పనీ చెయ్యకూడదు. --” అంటున్న కొడుకు ని వారించి తాతారావు చిరునవ్వుతో --” ఒరేయ్ పిచ్చొడా -- మీకూ కొత్తగా పెళ్లయింది. కొన్నాళ్ళు ఏకాంతం గా సుఖం గా సంతోషం గా సంబరాలు చేసుకోండి -- మీ కొత్త దాంపత్యానికి మేము ఎందుకు అడ్డు గా ఉండాలి -- నాకు ఎప్పుడు ఓపిక లేకపోతే అప్పుడు నీకు చెప్పకుండా వచ్చేస్తాం సరేనా -- “ అన్నాడు తాతారావు.

వెంటనే దుర్గయ్య “ అదేమిటీ నాన్నగారూ -- అంటోంటే -- అరేయ్ -- మనిషి జీవితం లో ఏడుస్తూ, నవ్వుతూ ఒంటరి గా జన్మిస్తాడు. తరువాత ప్రయోజకుడయ్యాక ఒక యువతి ప్రవేశించి నా పెళ్ళాం అని పరితపిస్తాడు. ప్రేమిస్తాడు. సర్వమూ తన కుటుంబం లో అందరినీ వదిలేస్తాడు. ఆ పిచ్చిలో. తరువాత పిల్లలు వాళ్ళకోసం ప్రయోజకుల్ని చేసే క్రమం లో ఎన్నో బాధలు. అవి కూడా తీరిపోతాయి. పెళ్లిళ్లు చేశాక మళ్ళీ భార్యా భర్తా మిగిలిపోతారు. పోనీ అప్పుడైనా విశ్రాంతిగా జీవితాన్ని అనుభవించవచ్చును గా అబ్బే ! అలా కాదు. కోడలు ఇలాగా, అల్లుడు ఇలాగా, చూశావా కొడుకు మన కోసం ఏమీ ఇవ్వ లేదు, అంత ప్రయోజకున్ని చేశాం కదా, చూశావా కూతురు కోసం మనం ఎంత శ్రమ పడ్డాం, వాళ్ళు హూనం చేసుకుని పెళ్లి చేశాం. మనకు ఏమి చేసింది? అనుకుంటుంటారు.

ఒరేయ్ దుర్గయ్యా -- ఇదంతా చాలా చిరాకు గా ఉంటుంది నాకు. నా స్నేహితులు తమ కుటుంబాల లో ఇలాంటి విషయాలు చెబుతుంటే నేను వారిని చివాట్లు పెడు తుంటాను. కృష్ణభగవానుడు భగవద్గీత లో చెప్పాడని పంతులు గారు చెబుతుంటే ఇన్నాను --

మనిషి తాను చేయాల్సిన పనులన్నీ విజయవంతం గా నిస్వార్ధం గా అంటే ఎటువంటి ఫలితం ఆశించకుండా చేయాలి. ఫలితాన్ని ఆశించి చేసింది కర్తవ్యం కాదు అన్నారు కృష్ణపరమాత్మ. కాబట్టి నేను పుట్టినందుకు నాకు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలని ప్రసాదించాడు దేవుడు. మీరు కూడా మమ్మల్ని కష్టపెట్టకుండా వృద్ధి లోకి వచ్చారు. తోటమాలి తాను నాటిన టెంక - చెట్టు గా ఎదిగి పళ్ళు కాస్తుంటే వేయి కళ్ళతో ఆ చెట్టుని చూసి మహదానందం పొందాలి అంతే కానీ ఆ చెట్టుని అమ్మేద్దామని అనుకోవడం తప్పు. నిన్నూ లోవతల్లి నీ మీ జీవన విధానం సిరిసంపదలు చూసి తృప్తి గా ఆనందం తో బ్రతుకుతాం. మీరు సంతోషం గా ఉండండి. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని సంతోషపెట్టండి. బాగా వృద్ధి లోకి రండి. అంతకన్నా మించిన తృప్తి మాకు ఇంకేమీ ఉంటుంది. ?--” తడికళ్ళతో మాట్లాడుతున్న తాతారావు ని చూస్తూ కోడలు దుర్గ కూడా మామగారిని ఒక ఋషి పుంగవుని లా చూస్తోంది కన్నార్పకుండా -- అవును ! మనిషి కి “ తృప్తి “ కి మించినది ఏముంది ?

****** ***

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత పరిచయం : కె .బి.కృష్ణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో డి. ఏ. ఓ (వర్క్సు ) గ్రేడ్ -1 గా 2002 పదవి విరమణ తరువాత శ్రీమతి సరస్వతి తో కాకినాడ లో స్వగృహం లో నివాసం. అమ్మాయి అబ్బాయి వారి పిల్లలతో స్థిరపడ్డారు.

1979 లో రచన వ్యాసంగం లో ప్రవేశించి ఇప్పటి వరకు 880 కథలూ, 16 నవలలూ రచించారు. 2 నవలలు, మినీకథల సంపుటాలు-3, 54 కార్డు కథల పుస్తకం-1, 4 కథల సంపుటాలు, 2 హాస్యకథల సంపుటాలు వెలువడ్డాయి. వెలువడ్డాయి.

స్వాతి వారపత్రిక లో నవల కు 25 వేలు, ఆస్ట్రేలియా తెలుగు పలుకు పత్రిక లో పెద్ద కథ కు ప్రధమ బహుమతి, కెనడా డే పత్రిక లో బహుమతి గెలుచుకున్న బహుమతులలో చెప్పుకోదగ్గవి. దాదాపు 12 పురస్కారాలు, కర్నూలు లో “ మినీకథా చక్రవర్తి “ మచిలీపట్టణం లో “ కథా నిధి” తెనాలి లో “కథా బ్రహ్మ” అనంతపురం లో “ కథా విశారద “ బిరుదులతో సత్కారం పొందారు

వీరి కథల పై శ్రీ గంజి శ్రీనివాస రావు,గుంటూరు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు నుండి, శ్రీ కె దుర్గా ప్రాసాద్ తెలుగు పండిట్ మదురై కామరాజ్ యూనివర్సిటీ చెన్నై నుండి పరిశోధన పత్రాలు సమర్పించి *ఎమ్.ఫిల్* పట్టాలు సాధించారు. ఒకరు వీరి మొత్తం రచనల పై పి.హెచ్ డి పట్టా కోసం పరిశోధన చేస్తున్నారు. తుది దశ లో ఉంది.

సందేశాత్మకమైన, మానవ సంబంధాలు పెంపొందించే కథలూ, హాస్య కథలూ ఇలా నవరసాల్లో రాయాలని 76 సంవత్సరాల వయస్సు లో కాంక్షిస్తున్నారు.

*** *** ***


156 views5 comments

5 comentarios


Srinivas K B
Srinivas K B
15 ene 2021

Nice story.

Me gusta

కధ బాగుంది

Me gusta

Excellent message is conveyed regarding the human values and relations. Very nice story and best wishes to the author.

Me gusta

కన్నపిల్లల పట్ల నిస్వార్ధమయిన ప్రేమతో, చేసే వృత్తి పట్ల నిబద్ధతను, భగవంతుని పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగిఉన్న తల్లితండ్రులు - జీవితపు చరమాంకం లో ఎలా ప్రశాంతంగా బ్రతకవచ్చో, ప్రస్తుత పరిస్థితులలో సందేశాత్మకంగా ఉంది.

Me gusta

తల్లితండ్రులుకు మంచి సందేశం. ఇప్పటి తరం లో ఈ భావన కొరవడింది.

Me gusta
bottom of page