top of page

మంచికి కాలం కాదురా'Manchiki kalam Kadura' written by Naga Gayathri SVM

రచన : S V M నాగ గాయత్రి

"మంచికి కాలం కాదురా శింబుగా..."

"కావుడూ...నీ కోసం మూడు వందల మైళ్ళు ప్రయాణం చేసొస్తే.. 'బాగున్నావారా' అని చేతులు జాపక ఈ మిట్ట వేదాంతం ఏందిరా?"

"ఖర్మరా...ఖర్మ. ' ఫ్రెండొచ్చాడూ ..పర్మిషన్ ఇమ్మన్నాననుకో.. నా బాసుగాడికి బి.పి. ఎక్కువై అక్కడే ఢాం అంటాడు. అందుకే..' హెల్త్ బాగాలేదూ.. హాస్పిటల్కి వెళ్ళాలి' అని చెప్పొచ్చా. అరే! అబద్ధం చెప్పే లాగా చేస్తాడ్రా వాడు. మొన్నటికి మొన్న పర్మిషన్ కావాల్సోచ్చి 'పక్కింటోడు చచ్చాడు సార్' అని చెప్తే...' యెట్టా కనిపెట్టాడో రోయ్..గా..కు..' కామేశా.. నీ అవసరాలకి ఎవడి కన్నా తద్దినం పెట్టేస్తావు'....అన్నాడు. అందుకని రెండు సార్లు ముక్కి, మూల్గీ ' జొరం సార్ ' అని చెప్పొచ్చా."

" అయ్యయ్యో! ఇబ్బంది పెట్టాన్రా నిన్ను. ఆఫీసర్ అయితివి.. మరి బాధ్యతలు పెరిగుంటాయి కదా! చీటికిమాటికి పర్మిషన్లంటే ఎలా వస్తాయి మరి! ఇంతకు ఉద్యోగం ఎలా ఉందిరా కావుడూ?"

"అడిగావూ.. ఉద్యోగమా ఇది!? వివరంగా చెప్తా ఉండు. నువ్వు వస్తున్నట్లు ఫోన్ చేశావా.. ఆఫీసులో అట్టా కనబడి ఇట్టా వచ్చేద్దా మనుకున్నా ...హబ్బే..హబ్బబ్బే.. అసలే లేట్ అయిందని హడావుడిగా వెళ్తే.. అప్పటికే ఒకడు సీటు ముందర బైఠాయించి ఉన్నాడు. సీట్లో ఇంకా కూర్చోక ముందే చేతిలోని పేపర్ ముందుకు జాస్తాడురా ఎంథ ఇర్రిటేషనూ..."

" పొన్లేరా కావుడూ.. ఎన్ని పనులు మానుకొని ఈ పని కోసం వచ్చుంటాడో. పైగా లేటుగా వెెళ్ళానంటివి. అతగాడు ఎక్కువ సేపు వెయిట్ చేయబట్టి అలా చేసి ఉంటాడు. రేయ్ కావుడూ గుర్తుందా... ఒకసారి రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్న బుకింగ్ క్లర్క్ ఐదు నిమిషాలు లేట్ చేశాడని ఏడా పెడా వాయగొట్టేసావ్. హా.. హ్హ.. హ్హా.. ఈ కస్టమర్ ఎవరో మంచోడు. అయితే అతని పని చేసి రావడంలో లేటయ్యి ఉంటుంది....అంతేనా?"

"వాడు చెప్పంగానే చేస్తానేమిట్రా? అలా చేస్తే అలుసైపోనూ? ' ఏం? సీట్లో కూర్చోవాల్నా? పన్లేదా?' అని దబా యించి పడేస్తా."

"నిజమేలే... సీట్లో స్థిమితంగా కూర్చుంటే కదా పని చేసేది! సీట్లో కూచున్నాక పేపరు ఇస్తే బాగుండేది. పని చేసుండేవాడివి".

"అలా ఎందుకు చేస్తాను? వాడేమన్నా నా బాసా! నా బాసు చెప్తేనే పరుగుల మీద పని చేయను. సీట్లో కూర్చున్నాక పేపర్ ఇస్తే...మంచినీళ్లు. తాగాక్కర్లేదా?అంటా... కంప్యూటర్ ఆన్ చెయ్యక్క ర్లేదా అంటా.. కారణాలు ఎన్ని చెప్పలేo? అరే సింబుగా.. అసలు పోంగానే ఎన్ని పనులుంటాయో తెలుసారా నీకు? అందర్నీ హలో హలో అనాలా.. అక్కడ ఇక్కడ ఐదు పది నిమిషాలన్నా మాట్లాడాలా.... ఒక్కోసారి డీప్ డిస్కషన్ లోకి వెళ్లి పోతాo. ఇంక స్పృ హేం ఉంటుంది! అప్పుడు గంటయినా పట్టొచ్చు. పైగా నలుగురు కలిస్తే మందే వాయిస్. నీకు తెలేదుగాని శింబుగా... నేను మాట్లాడుతుంటే చుట్టూ జనాలు నోళ్లు తెరుచుకుని వింటుంటారు. ఇవన్నీ ముగించుకుని కదరా సీట్లోకి రాగలం! ఆపైన మంచినీళ్లు తాగాలి..కంప్యూటర్ ఆన్ చేయాలి ....ఫోన్ లో వాట్సాప్ మెసేజ్ లు చెక్ చేసుకోవాలి.."

" ఈ లోపు నీ సీట్ ముందరి కస్టమర్ కి బీపీ వచ్చేస్తుంది. అయినా ఇంట్లో మెసేజెస్ చూసే బయలుదేరి ఉంటావు కదరా."

" దార్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటాయి కదా...వాటికి రిప్లై మెసేజ్ పెట్టకపోతే ఫీల్ అవరూ?"

"ఎదురుగా కస్టమర్ను కూర్చోబెట్టుకొని ఫోన్ చెక్ చేస్తా ఉంటే అతను ఫీల్ అవ్వడూ!"

" ఆ అయితే అయ్యాడు...వాడెవడో మనమెవరమో...పైగా కొన్ని మెసేజెస్ చాలా యూస్ ఫుల్ గా వుంటాయిరా. నీకో విషయం తెలుసురా శింబుగా... ఎక్కువసేపు కూచోనే ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. అప్పుడప్పుడు లేచి తిరగాలంట. అందుకే పావుగంట కొకసారి ఆ సీటు దగ్గర కాసేపు.. ఈ సీటు దగ్గర కాసేపు నించుని మాట్లాడి వస్తా".

"పావుగంట సీట్లో కూర్చుంటే పావుగంట తిరుగుతావా! ఆ లెక్కన ఆరుగంటల్లో మూడు గంటలు మాత్రమే పని చేసేట్లున్నావే!"

"మూడు గంటలా!? అంతసేపా!? అంత సేపు చెయ్యనేమోరా.. అంటే.. ఇల్లు దూరం కదా...ఒకటిన్నరకు లంచ్అవర్. ఒక పన్నెండున్నర...పావుతక్కువ ఒకటికల్లా ఇంటికి బయలుదేరి పోతాను. తిని, ఒక్క అర్థగంట నిద్రపోయి, మూడులోపల ఆఫీసుకు వచ్చేస్తాను".

"ఒకటిన్నరకు లంచ్ అవర్ అంటే లంచ్ కి వెళ్ళమని రా.. లంచ్ ముగించటం కాదేమో! సర్లే మరి మూడు నుంచి ఐదు దాకా పని పూర్తి చేస్తావనుకుంటా."

"ఐద్దాకా ఎవడు పనిచేస్తాడ్రా! నాలుగు అయ్యేసరికి సర్దడం మొదలు పెట్టేస్తా. అయినా శింబుగా... ఒక్కోళ్ళు నక్షత్రాలు కనబడే దాకా పని చేస్తారు. ఎట్లా చేస్తారో నాకైతే అర్థం కాదు. ఆఫీసంతా ఆళ్ళ భుజాల మీదున్నట్టు వంగిపోయి ఉంటారు. అయినా ముడున్నరకొచ్చి నాలుగుంబావుకు వెళ్లిపోయే వాళ్లతో పోలిస్తే నేనెంత!" "బావుంది రా కావుడూ.... నీ కొడుక్కు కూడా' కింది నుంచి ఫస్ట్ రావాలి నాన్న' అని చెప్పు. అవునుగానీరా... మీ బాస్ ఇదంతా చూస్తూ ఊరుకుంటాడా?" "వూరు కోడురా..మిర్రి మిర్రి చూస్తుంటాడు. అర్రే! పిల్లాడికి బాగాలేదు.. హాస్పిటల్ కి వెళ్ళాలి ..పర్మిషన్ ఇమ్మంటే, వాడి సొమ్ము కాజేసినట్టు మొగం పెడ్తాడ్రా!"

"మీ బాస్ మంచివాడు కాడట్రా!అయ్యో పాపం.. పోనీ నీ కిందివాడైనా నీకు అనుకూలంగా ఉంటాడా?"

"ఎందుకుంటాడ్రా... గంట పని చేసి కష్టపడి పోయినట్టు బిల్డప్పు ఇస్తాడు. వాడొక్కడే సిన్సియరూ మేమంతా వేస్ట్ అన్న ఫీలింగ్ వాడికి. నెలకోసారన్నా పర్మిషన్ పెడతాడు.అమ్మను హాస్పిటల్లో చూపించాలంటూ...ఏం... సాయంత్రాలు వెళ్ళొచ్చుగా? సరుకులు, కూరగాయలు, షాపింగ్, హాస్పిటల్, అన్నీ ఆఫీస్ టైంలోనే అయిపోవాలి..ఈ దొ o...క్కు".

"నువ్వు కూడా పర్మిషన్ పెడితివి కదరా కావుడూ!"

"హత్! వాడికీ నాకూ పోలికేంట్రా ... మహా అయితే నేను గంటా గంటన్నర లోపు వచ్చేస్తా..వాడు రెండు గంటలకు తక్కువరాడు".

"నిజమేలేరా....గంటన్నరకు రెండు గంటలకు చాలా తేడా ఉంది."

"అద్దేరా నా బాధ.ఓ... సింపుల్ గా 'ఉద్యోగం ఎలా ఉంది' అంటివి. చాకిరీ చూడు! ప్రతోడిదో బాధ. పై వాడు, కింది వాడు, కస్టమరూ.. ఎల్లా వేగుతున్నా ననుకున్నావ్! ఒక్క సత్యం మాత్రం బోధపడిందిరా. ఏం చేసినా జీవితంలో ఎవడ్నీ సాటిస్ఫై చేయలేం.ప్రతోడికీ భయంకరమైన ఎక్స్పెక్టేషన్సూ..అర్రే.. ఒక పూటలో పనిచేసిపెడితే..పక్క బ్రాంచీలో ఒక్క గంటలోపనైపోయింది, నీకెందుకు కాదు? అంటాడ్రా కస్టమరు! మొదట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నారు ... తర్వాత డిలైటుమెంటూ.. ...ఇప్పుడు అదేదో సింపతీనో ఎంపథీనో..అని ఊదరగొడ్తున్నార్రా! ఆడి చెప్పుల్లో దూరాలంట"

"చోద్యం కాకపోతే అతగాడి చెప్పుల్లో నువ్వెట్లా దూర్తావ్?"

"నేను సీరియస్ గా చెప్తుంటే నీకు కిండలైపోయిందట్రా?.. నిజంరా పైవాడెప్పుడూ సాటిస్ఫై అవడు. బాసులకెప్పుడూ కిందోల్లంతా ఎదవలూ.. పనెగ్గొట్టే రకం అనీనూ" "మరి నీ కిందివాడు రా?"

"వాడు నిజంగానే వేస్ట్ రా... గంటలో చేయగల పని మూడు గంటల్లో చేసి ఏదో పని చేస్తున్నట్టు హడావుడి పడిపోతాడు.' అంత లేదమ్మా' అన్నా ననుకో..' నువ్వు చేసి చూపించు' అని రివర్స్ అవుతాడు. క్లాస్ త్రీ వోడు కదా యూనియన్ అండ చూసుకొని పొగరు. ఆయినా ఈ ఉద్యోగం చేయడం కంటే గొడ్లు కాచుకోవడం ఉత్తమం"

"నిజమే రా కావుడు... ఇప్పుడు అర్థం అయింది... మంచికి కాలం కాదని నువ్వెందుకన్నావో.మరి అలాంటప్పుడు గొడ్లే కాచుకోకపోతివా? ఇంత చాకిరీ తప్పేదీనూ!"

"మరి నేను ఏo మాట్లాడినా అంత అర్థముంటుంది. ఆలోచించే బుర్రకే అది అర్థమౌతుంది. అయినా ఇంతేనా చాకిరీ అంటే... పిల్లల్ని స్కూల్లో దింపాలి. మళ్లీ తీసుకురావాలి"

"తీసుకురావాలంటే ఆఫీస్ టైంలోనే కదారా కావుడూ?"

"అబ్బా సింపుల్ గా అంతేలేరా. ఇతరుల కోసమే నా బ్రతుకైపోయింది... జీవితమే ఒక పెద్ద ఉద్యోగం".

"ఇతర్లంటే..నీ భార్య - పిల్లలు అంతేనారా? అంటే పిల్లల్ని స్కూల్ నుండి తేవడం, సరుకులు తేవడం అంతేగా?"

"కూరగాయలు, సరుకులు మనమెందుకు తెస్తాంరా! ఇంక ఆడాళ్ళ కేంపని! పైగా కూరగాయలు తెచ్చే పని ఏ బుద్దున్నొడూ చేయడు.పుచ్చు సచ్చు తెచ్చామని భయంకరమైన నస". "పెళ్ళై ఇన్ని సంవత్సరాలయ్యింది! కూరలు తేవడం తెలియట్లేదురా నీకు? కావుడూ ఓ మాట చెప్పు.. మీ పనిమనిషికి జీతం ఎంత?".

"ర్రేoడు వేలు!..దొo....సరిగానే పనిచేయదు. చీపురు అటా ఇటా ఆడించి పోతుంది. మళ్ళీ ఫ్రెంచి లీవు లొహటి. డబ్బు తీసుకున్నామే.. తీసుకున్న దానికి నిజాయితీగా పని చేయాలని లేదు. నేను చేసిందే పని అన్నట్టుగా ఉంటుంది."

" నీ జీతం ఓ లక్ష ఉంటుందేమిట్రా?" "ఎందుకడుగుతున్నావు?"

" ఏం లేదు లేరా.. నీ బాసు నిన్నెంతలా తిట్టుకుంటున్నాడో అనిపించి... ఇంతకు మీ పని మనిషి టైం కు వస్తుందా?" "ఎందుకు రాదు! పది నిమిషాలు లేట్ అయితే మా ఆవిడ పెట్టే నస తట్టుకోవ ద్దూ!"

"సాయంత్రాలు ఏం చేస్తుంటావ్ రా కావుడూ?"

" ఏముందిరా.. సింపుల్గా ఆఫీస్ అయ్యాక కాసేపు బాతాఖానీ కొట్టి ఇంటికి వెళ్లడమే. ఏదో ఇంత తిని, తాగి టీవీ ముందు కూర్చోవటం."

"ఏం చూస్తావేమిటి టీవీలో?"

"న్యూస్ రా..న్యూస్. మనకు సామాజిక, రాజకీయ స్పృహ ఎక్కువ. ఒక్కో భాగోతం చుస్తా వుంటే కడుపు రగిలి పోతా ఉంటది"

"న్యూస్ చూస్తావా! వెరీ గుడ్. అయితే ఏదైనా ఒక విషయం గురించి సమగ్రంగా చెప్పగలవన్నమాట"

"అంటే శింబు.. వింటాం అనుకో! పెద్ద గుర్తుండదు.ఎన్నని గుర్తుపెట్టుకుంటాo! రోజుకో స్కాము. ఆఫీసులో.. ఆఫీస్ అయ్యాక చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాం. అసలు మోడీ నిర్ణయాలు ఇలా ఎందుకున్నాయో... ఆంధ్ర ప్రదేశ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరో నేను చెప్తా ఉంటే.. అందరూ నోళ్ళు ఎళ్ల బెట్టుకుని వింటారు. ఎలా ఇంత అనలైజ్ చేస్తావు...అని అడ్మిరింగ్గా చూస్తారు. అక్కడ మాట్లాడాలంటే మరి న్యూస్ ఫాలో అవ్వాలి కదా! అయితే అన్నీ బుర్రలో దూరవు కదా! దూరిందే మాట్లాడేస్తాను."

"చానల్లో అబద్ధాలు కూడా చెప్తారని ఎప్పుడూ అనిపించలేదురా కావుడూ?" "తప్పా..ఒప్పా ఎవడి క్కావాల్రా? గుంపులో మాట్లాడేందుకు నాకు వాయిస్ ఉంది. ఆ వాయిస్ కి కొంత మెటీరియల్ కావాలి. గుంపులో మాట్లాడేప్పుడు 'అరే ఏం మాట్లాడాడు రా' అనిపించాలి. సరే గాని శింబుగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు" "థాంక్స్ రా ఇప్పటికైనా అడిగినందుకు. అబ్బిగాడు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. నీ ఎరికలో ఏదైనా ఉద్యోగం ఉంటే వేయిస్తావని"

"సర్రీ పోయింది. రాత్రంతా రామాయణo విని, సీతకు రాముడు ఏమవుతాడు? అని అడిగాడట నీలాంటోడు. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ఉద్యోగం అంటావేమి ట్రా? చక్కగా నీ వారసత్వం లో పెట్టు. లేదంటే టౌన్ లో టీ కొట్టు అయినా సుఖమే. రూపాయికి రెండు రూపాయలు లాభం! బుద్ధి పుట్టినప్పుడు రావచ్చు లేదా మూయొచ్చు. మనకు మనమే రాజులం, మంత్రులo.. ఏమంటావు?". "నువ్వు చెప్పావంటే నిజమేనేమో అనిపిస్తుంది కావుడూ.. ఉద్యోగం గురించి నాకేం తెలుసు! నాకు తెలిసింది అంతా అప్పు తీసుకుని వ్యవసాయంలో దిగటం. ఎర్రటి ఎండలో పనిచేయటం. వాన కోసం ఆకాశం వంక చూడ్డం. చివర్న గిట్టుబాటు ధర లేక కాయలు రోడ్లమీద పారబోసి, వడ్డీ మీద వడ్డీ జమ పడటం. ఉద్యోగమంటే ఖచ్చితమైన పనిగంటలు. కుర్చీ, టేబుల్, ఫ్యాన్. ఒకటో తారీఖు జీతం, సెలవులు, సహోద్యోగులు, సరదా కబుర్లు. సాయంత్రానికి పని పూర్తయిందన్న తృప్తి. సొంతింటికి లోను, పెన్షన్, హాస్పిటల్ ఖర్చులు. ఉద్యోగం లో గౌరవం... ఉద్యోగం పైన గౌరవం.. ఇది అనుకున్నారా.నిన్ను చూశాక తెలిసింది. అయినా ఉద్యోగం నీకు కష్టం అనిపిస్తే మానైరా. ఆ పెట్టే టీ కొట్టేదో కలిసే పెడదాం. ఒకరికి ఒకరం తోడు యేమంటావ్?."

"ఉద్యోగం.. అది ఏంది.. ఈ ఉద్యోగం అలవాటైపోయింది. పైగా ఈ వయసులో ఎందుకురా రిస్కూ? ఆ పై అన్ని గంటలు శ్రమపడ్డం అంటే.. కుర్రాడు కాబట్టి సరే. మంతో అవదులేరా. సరే కానీ భోజనం టైం అవుతోంది. బస్టాండ్ పక్కన అన్నపూర్ణ హోటల్ వుంది. అక్కడ పప్పు చాలా బాగుంటుంది. ఈ పూటకి చక్కగా అక్కడ భోజనం కానిచ్చెయ్యీ.

మా ఆవిడ ఊర్లో లేదు రా.. లేకుంటే ఇంటికి తీసుకెళ్ళి ఉండనూ? ఇలా కాకా హోటల్లో కూర్చోబెట్టి మాట్లాడతానా? పైగా మా ఫ్రెండ్ వచ్చాడూ... పర్మిషన్ యిమ్మంటే మా బాసుగాడు చంపనైన చంపుతాడు లేదా చావనైనా చస్తాడు. రెండూ దోషమే. నువ్వే మనుకోవనుకో. వచ్చే నెల్లో నాకు మీ ఊర్లో పనుంది. అప్పుడు రెండు రోజులు మీ ఇంట్లోనే ఉంటా. అప్పుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం .... సరేనా."

" పెద్ద ఆఫీసర్ వి ..ఇంతసేపు నాతో ఉన్నావు, అదే చాలు. నేను ఇంక బయలుదేరుతాను"

" హోటల్లో భోజనం చేసే వెళ్ళాలి రా నువ్వు. లేకుంటే నా మనసు బాధ పడుతుంది. నాకేమో నీ వెంట వచ్చే టైం లేకపాయే"..

" కావుడూ నీ గురించి నాకు తెలియద ట్రా. తెలిసీ తల్లో వెర్రి... కొన్ని పనులు చేయిస్తుంది. సరేరా... వెళ్తున్నా"

" ఆ.. బైరా..బై"

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు SVM నాగ గాయత్రి. నేను LIC లో పనిచేస్తాను. నివాసం నెల్లూరు. సాక్షి, ఆదివారం ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, నవ్య, ప్రజాశక్తి, సాహితీ ప్రస్థానం, విశాలాక్షి వంటి పత్రికలలో కథలు, కవితలు ప్రచురితం అయ్యాయి. విశాలాక్షి మాస పత్రికలో సినిమా పాటలపై సమీక్ష, దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రచురితం అవుతున్నది.75 views0 comments

Comments


bottom of page