మంచికి రోజులా....

Manchiki Rojula New Telugu Story
Written By D.V.Ramachandra Rao
రచన : దోసపాటి వెంకట రామచంద్ర రావు
మానవ సంబంధాలన్నీ ధన సంబంధమైనవే కాకుండా కులం,గోత్రం,మతం పరంగానూ మనుగడ సాగిస్తూ వున్నాయి. మంచి తనానికి, మానవత్వానికి విలువలు ఏనాడూ ఇవ్వబడలేదు.
స్వార్ధం, తనకెందుకులే అనే ధోరణి మానవ సంబంధాలను నడిపిస్తున్నాయి.ఎక్కడో, ఎవరో ఒకరున్నా వారిని ఈ సమాజం గౌరవించలేదు.వారిని మరింతగా వేదనలకు గురిచేయడమే జరిగింది. ఏది ఏమైనా అక్కడక్కడా ఎవరో తారసపడుతుంటారు కదా !
వారి గురించే ఈ కధాగమనం. ********** జయరాం ఈరోజు జైలునుండి విడుదలై బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 'ఏముందీ ఈ బయటప్రపంచంలో! స్వార్ధం, కుళ్లు, కుతంత్రాలు తప్ప..... 'తనలో తనే అనుకుంటూ"జైలు జీవితమే నయం ! " అనుకోసాగాడు. ఆరోజు తనేం తప్పుచేశాడని?
ఒక అడపిల్లను ఆదుకోవడం తనుచేసిన తప్పా!
తననెంత ఎగతాళి చేశారు?
'దిగొచ్చాడురా ఆదర్శపురుషుడు'....
'వీరేశలింగం,గురజాడ మునిమనుమడు.....' 'వెళ్లవోయ్ ! నీదారిన నువ్వు పో! బ్రతకాలని లేదా....' అయినా తను ఎదిరించాడు వాళ్ళని. ఆ అమ్మాయిని అందరు బలవంతంగా తీసుకొని వెళుతుంటే, ఒక్కడూ శక్తినంతటినీ కూడదీసుకొని వాళ్ళనుండి రక్షించాడు. తనకు తగిలిన దెబ్బలను కూడా లెక్కచేయలేదు.
**********
ఆమె పేరు అర్చన.
ఒక సాప్టువేరు కంపెనీలో పనిచేసేది.
అదే సాప్టువేరు కంపెనీలో అనిల్ కూడా పని చేస్తున్నాడు.ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకోవడానికి సిద్దపడ్డారు. ఇరువురి పెద్దలూ అడ్డుకున్నారు.ఆస్తి ,అంతస్తు , కులం అడ్డొచ్చాయి.
అయినా తెగించిపెళ్ళిచేసుకున్నారు.
అనిల్ తండ్రి పెద్ద మోతుబరి . కుల పిచ్చి ఎక్కువ. కొడుకని కూడా ఆలొచించకుండా మనుషులను పెట్టి చంపించాడు.
అర్చన తల్లి తండ్రులు కూడా కూతురిని ఆదరించలేదు.
అనిల్ తండ్రి అర్చనను కూడా చంపేయమని మనుషులను పంపించాడు.ఆరోజు నైటుడ్యూటికి బయలుదేరుతుండగా దారికాసి అర్చనను చంపబోతుంటే జయరాం అడ్డుకున్నాడు,.
వారి బారినుంచి ఆమెను కాపాడి ముందుగా ఆమెను హాస్పిటల్ లో చేర్చి, తను గాయాలకు కట్టు కట్టించుకున్నాడు. అర్చనకు తెలివి వచ్చేవరకు అక్కడేవుండిపోయాడు.
అర్చనకు తెలివిరావడంతో ఆమెను తన రూముకు తీసుకొని వెళ్లాడు.
అర్చనకు మరో దారిలేక జయరాంతో వెళ్లింది. తన గదికే వెళితే అనిల్ తండ్రి వదిలిపెట్టడు.
నిజమే .అనిల్ తండ్రి మనుషులను పురమాయించి జయరాం అర్చనలను పట్టుకోమన్నాడు. కొన్నాళ్ళు ఎలాంటి సంఘటనలు జరగలేదు. జయరాం ఒక జర్నలిస్టు కావడంతో అర్చన విషయాన్ని పదిమందికి తెలియజేయాలని, జరిగిన సంఘటనలను వివరంగా పత్రికాముఖంగా అర్చనతో చర్చించి బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు.అంతేకాదు ,అర్చనకు కొత్తజీవితం ఇవ్వాలని ఆమెను వివాహం చేసుకున్నాడు.
అర్చన కూడా తనకూ ఒకతోడుకావాలనిఒప్పుకుంది.ఇక్కడితో కధ సమాప్తం కాలేదు. ********* జయరాం అర్చనలు అనిల్ హత్యకు సంబందించిన ఆధారాల సేకరణలో పడ్డారు.ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు.
మరొవైపు అనిల్ తండ్రి కూడా పగతొ రగిలిపోతున్నాడు.అర్చన జయరాం ని పెళ్లి చేసుకోవడం సహించలేక పోతున్నాడు.తన పలుకుబడి ఉపయోగించి అతనిపై కేసులు బనాయించిజైల్లో పెట్టించాడు. జయరాం జైలుపాలవడంతో అర్చన ఆ ఊరిని వదిలి వెళ్ళిపోయింది.అప్పటికే ఆమె గర్భవతి. అర్చన జాడ తెలియక, మరేమీ చేయలేక, అనిల్ తండ్రి మౌనంగా వుండిపోయాడు.తన మనుషులకు మాత్రం జయరాం, అర్చనలపై ఒక కన్నువేసి ఉంచమని పురమాయించాడు. ********** జయరాం ఆలోచిస్తూ నడుస్తున్నాడు.ముందు అర్చన ఎలావుందో ఏమిటోనని త్వరగా నడుస్తున్నాడు.ఎవరో తనను వెంబడిస్తున్నట్టు అనిపించి వెనుకకు తిరిగాడు.
ఏదో నీడలా కనిపించింది.జయరాం వెనకకు తిరిగడంతో అతనిని వెంబడిస్తున్న మనిషి అక్కడ ఒక చెట్టుచాటున దాక్కున్నాడు.వెనకకు చూసుకుంటూనే తనుంటున్న ఇంటికి చేరుకున్నాడు.ఇంటికితాళం వేసి వుంది.
పక్కింటి వాళ్ళను అర్చన గురించి అడిగాడు.వాళ్లు ఏమీ మాట్లాడుకుండా ఇంటితాళంతో పాటు ఒక కవరు జయరాంచేతిలో పెట్టారు. ఇంటిలోపలికి వెళ్ళి తలుపులు వేసేశాడు.ఆతృతగా కవరు తెరచి చూశాడు.అందులో ఒక చెక్కు ,వేరే కాగితం చూశాడు.
కాగితం తెరచి చూశాడు.అర్చన తన పరిస్తితిని వివరంగా రాసి ఊరు విడిచివెళ్తునట్లు రాసింది.
చెక్కు మీద ఐదులక్షలు అంకెల్లో రాసుంది. అర్చన 'ఎందుకిలా చేసింది? ఎక్కడికి వెళ్ళిపొయింద'నుకుంటూ భారంగా అడుగులు వేస్తూ తను పనిచేసే పత్రికా ఆఫీసుకు వెళ్ళాడు.
ఆ పత్రికా ఆఫీసు మేనేజరుకూడా ఏమీ మాట్లాడకుండా అతని చేతిలో ఓ రెండు లక్షల చెక్కు చేతిలో పెట్టి పంపించేశాడు, జయరాం మరోమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.
జయరాం కూడా మౌనంగా అక్కడనుండి బయలుదేరాడు. మళ్లీ తననెవరో వెంబడిస్తున్నారనుకొని వెనుకకు తిరిగాడు. ఎవరూ కనపడలేదు.కాస్సేపు అక్కడే ఆగి చూశాడు.ఎవరూ కనపడలేదు.
జయరాం మరేమీ చేసేది లేక ఆ ఊరునుండి బయలుదేరి వైజాగు వచ్చేశాడు. ********** వైజాగులో తన స్నేహితుడు రఘురాంని కలిసి తన పరిస్థితిని వివరంగా తెలిపాడు.రఘురాం ఒక ప్రవేటు కంపెనిలో అకౌంటెంటుగా పనిచేస్తున్నాడు.తనుంటున్న ఇంటిదగ్గరే జయరాంకు ఒక గదిని చూశాడు.
ఒకటి రెండ్రోజులాగితే ఏదోఒక పని చూస్తానని మాటిచ్చాడు. మాటిచ్చిన ప్రకారమే తను పనిచేస్తున్న కంపెనిలోనే ఒక ఆఫిసు అసిస్టెంటు ఉద్యోగం చూశాడు.జయరాం మరో ఆలోచన లేక అందులో చేరిపోయాడు.జయరాం తనకిష్టమైన జర్నలిజాన్ని వదులుకోలేక వైజాగులో వున్న చిన్నా పెద్ద పత్రికాఫీసులు చుట్టూ తిరిగాడు.
కానీ ఏవరూ చేర్చుకోలేదు.సామాజిక సమస్యలపై స్పందిస్తూ రిపొర్టులు,వ్యాసాలు,కవితలు రాస్తూ పత్రికలకు పంపసాగాడు.అలా తనకిష్టమైన జర్నలిజాన్ని కొనసాగిస్తు ,జీవనానికి కంపెనిలో పనిచేయసాగాడు.అప్పుడప్పుడు అర్చన ఆలోచనలు కలవరపెట్టసాగాయి.అలా ఆ జీవనానికి అలవాటు పడిపోయాడు. **********
జయరాం తనకీ రోజు సెలవు కావడంతో రఘురాంతో గడుపుదామని అతనింటికి వెళ్ళాడు.ఇంటికి తాళం వేసివుంది. పక్కింటివాళ్లనడిగాడు. ఎదో ఫోనురావడంతో హడావిడిగా బయలుదేరి వెళ్ళి పోయారని వివరాలేమి తనకు చెప్పలేదని పక్కింటాయన చెప్పడంతో జయరాం అక్కడనుండి కైలాసగిరికి వెళ్లి ఆరోజు గడపుదామని బయలుదేరాడు. కరోనా ప్రభావంతో ఇప్పడిప్పడే ప్రజలు బయట తిరగడం ప్రారంభిస్తున్నారు. అక్కడక్కడా దూర దూరంగా కూర్చొని చూట్టూవున్న ప్రదేశాలను చూస్తున్నారు వచ్చినవాళ్ళు.
జయరాం కూడా అక్కడున్న బెంచి మీద కూర్చోని చూట్టూవున్న ప్రాంతాన్ని చూడడంలో మునిగిపోయాడు.ఇంతలో ఒక బాబు ప్రాకుకుంటూ వచ్చి తన కాళ్ల దగ్గర కూర్చొండి పోయాడు.
బాబుని ఎత్తుకొని 'ఎవరి బాబా' అని చుట్టూ చూడసాగాడు.
ఈలోగా ఒక స్త్రీ "బాబూ"అని అరుస్తూ జయరాంను గుద్దుకుంది.
ముందుగా జయరాం తేరుకొని "మీ బాబా!అలా ఎలా వదిలేసారం"టూ ఆమెకు బాబును అందించబోతూ ఆమె ముఖంలోకి చూశాడు.
"అర్చనా!నువ్వు..నువ్వేనా.."అంటూ ఆశ్చర్యచకితుడై అలా అర్చనవైపు చూస్తూ వుండిపోయాడు.
అర్చన పరిస్తితికూడా అంతే.
కాసేపటికి ఇద్దరూ తేరుకొని అనందాశ్చార్యాలతో బాబుని తీసుకొని జయరాం వుంటున్నఇంటివైపు బయలు దేరారు.
.............సమాప్తం...........