మనిషి లోపలి నీడ

Manishi Lopali Needa Written By Datla Devadanam Raju రచన : దాట్ల దేవదానం రాజు
రక్షణ కవచంగా నిలబడిన ఒకనాటి కోట గోడలు... శిథిల ప్రాకారాలు... బురుజులు....ఎండిన తటాకాలు....ఎగుడుదిగుడు దారులు... అగాథాలు కందకాలు...ఒక పురాతన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది. అందులోంచి నీడలా విస్తరించిన రూపం మనిషి ఆకారం ధరించింది. సవ్యసాచి అనే ఆసామీ శరీరంలోకి ఎనిమిది వందల ఏళ్ల నాటి ఓ రాజు ప్రవేశిస్తాడు. ఆ రాజెవరో అందరికీ తెలుసు.
***** ***** *****
ఏక కాలంలో రెండు విజయాలు. విర్రవీగిన పాలెగాళ్ళను చెరబట్టి చంపిన దృశ్యం ఇంకా కళ్ళ ముందుంది. ఎలా నిద్ర పడుతుంది? విజయ గర్వం. తను గొప్ప విజేత. నిత్యం దండయాత్రలే. మీసం మీదకు చేయి వెళ్లింది. తర్వాత బుగ్గ మీద అందమైన కత్తి గాటును తడిమింది. సవ్యసాచి పెదాలు విచ్చుకున్నాయి. గర్వాతిశయంతో ఛాతి పొంగింది.
మిణుకు మిణుకుమంటున్న కాగడా చిరు వెలుగులు. సన్నని చీకటి. మంచం చుట్టూ పరిసరాలు కనిపిస్తున్నాయి. పక్కనే ఏరి కోరి తెచ్చుకున్న నగ్న దేహపు పడుచు స్పర్శ. లౌకికానందపు చివరి అంచు.
దిగ్గున లేచాడు. కాళ్ళు కింద పెట్టాడు. చేతితో మంచి నీళ్ళు అందుకున్నాడు. తాగాడు. విజయోత్సాహపు అంచున మరల పడుచును ఆక్రమించుకున్నాడు. నలిపాడు. ఉండచేసాడు. మూలిగిందామె. మైనపు ముద్దను పిసికినట్టు ఎటుబడితే అటు వంచాడు. మోహపు పరవశత్వం కాదు. దురాక్రమం . దురాక్రమం రక్తం లోనే ఉంది. రాపిడి తాలూకు ఉద్వేగం
చల్లారింది. కళ్ళు మూసుకున్నాడు.
వాడెవదో తెలీదు. మీద మీదకు వస్తున్నాడు. నీడలా ఉన్నాడు. దగ్గరకు రానీయ్... చెబుతా.... 'ఎవరక్కడ?' గొంతు పెగలడం లేదు. ఆకారం మరీ దగ్గరకు వస్తోంది. చిత్రంగా తను నమ్మిన దైవాన్ని ప్రార్థించాడు. సవ్యసాచి మత విశ్వాసి.
ఒక్కసారిగా నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి. స్వర్గం నుండి గులాబీలు వర్షిస్తున్నాయి. అంతవరకు వేచి చూడని శక్తి ఏదో శరీరంలో దూరి ఐక్యం అయిపోయింది. వేయి ఏనుగుల బలం చేకూరినట్టయ్యింది.
“ నేనేమిటి? బేలగా భగవంతుడ్ని శరణు వేడటం ఏమిటి? కనిపించని శత్రువు మీద దాడికెళుతున్నట్టుగా ఈ తలపోతలేమిటి? సంవత్సరాల తరబడి యుద్ధ క్రీడలో ఆరితేరిన నాకు ఈ వింత భావనలేమిటి? సవ్యసాచిగా కీర్తించబడుతున్న నాకు ఇదెంత నగుబాటు? గెడ్డం నిమురుకున్నాడు. మక్కువగా పెంచుకుంటున్న అలంకారం. పాగరుకు సంకేతం. సూదంటి
రాయిలా ముందుకు పొడుచుకొచ్చినట్లుంటుంది.
“ అసలు తన పేరులో ఇరవై నాలుగు అక్షరాలుండటానికి అర్హుడిని. పద్దెనిమిది అక్షరాలుతో పేరు పెట్టిన నా తండ్రిని అనాలి? ఏం అపుడు జ్యోతిష్కులు లేరా? మొన్న ఆ హిందూ సాముద్రికుడికి ఎంత ధైర్యం? ఇపుదైనా పర్వాలేదు మరో ఆరు అక్షరాలు తగిలించమంటాడా? వాడి ఉద్దేశం మూర్ఖశిఖామణి అని చేర్చమనా? ఇప్పటికే కర్ణాకర్ణికగా వినబడుతున్న పేరుకు
ముందు పిచ్చి అనే రెండు అక్షరాల సంగతి తెలియదని అనుకుంటారు చాలామంది. ఇంతకాలం నేను సాధించిన విజయాల మాటేమిటి? కప్పం కట్టని వాడిని ఎలా లొంగదీసుకుని భయపెట్టి వసూలు చేయాలో తెలుసు. బయానా ఇచ్చి ఆయుధాలు సమకూర్చుకోడం తెలుసు. సవ్యసాచికి నవ్వు వచ్చింది. తెరలు తెరలుగా నవ్వాడు.
“ సవ్యసాచి మహరాజా... సవ్యసాచి మహరాజా...” ఏవో అస్పష్ట స్వరాలు ఎలుగెత్తి పిలుస్తున్నట్టు వినిపించింది.
మేల్మొని పక్కకు చూసాడు. కండపుష్ఠిగా గుండ్రని కుందనాల బొమ్మ. తీర్చి దిద్దినట్లున్న అవయవాల పొందిక.
"మళ్ళీ ఈమె ఎప్పుదైనా నాతో పడక పంచుకుంటుందా? సాధ్యం కాకపోవచ్చు. రుచులు మారాల్సిందే. కొత్త అనుభవాలు కావాల్సిందే ” కొంటెతనపు భావం పొటమరించింది. కోరిందాన్ని ఒక్క సైగతో తెచ్చుకోడం.... అనుభవించడం...
యవ్వనపుష్ఠిగల పడతి నిద్ర లోకి జారుకుంది. ఒక్కక్షణం ఆమెను తేరిపారి చూసాడు. ముఖంపై పంటి గాట్లు..కందిన బుగ్గలు... విడివడిన కేశాలు...
“ చలొ" అని ఆమెని మచ్చికైన గుర్రాన్ని తట్టి లేపినట్లు లేపాడు. అయోమయంగా చూసింది. తక్షణం వెళ్ళిపొమ్మని ద్వారం వైపు దారి చూపించాడు చూపుడువేలితో. ఆమె భయంతో జుట్టు సవరించుకుని దుస్తులు పట్టుకుని ముందుకు దూకింది. పరుగున వెళ్ళిపోయింది.
నిన్నటి మొన్నటి విజయం మామూలుది కాదు. అపార ఆత్మ విశ్వాసాన్ని రగిలించే గెలుపులు. ఉద్వేగ చలనమైంది గనుకే నిద్ర కరువైంది. తన నైజం ఈపాటికి అందరికీ అర్థమై వుంటుంది. శౌర్యం ఒక్కటే సరిపోదు. అన్నిసార్లు బుద్ధి బలం అక్కరకు రాదు. అవసరమైతే కానుకలు ఇచ్చైనా లొంగదీసుకునే నేర్పు ఉంది. రక్త తర్చణంతో పొందే గెలుపే నిజమైనది.
ఆత్మాభిమానం లేని జాతులు ఈ దేశం నిండా. కొండంత బలహీనతలతో కునారిల్లుతారు. వాళ్ళ అనైక్యతే తనకు బలం.
ఎంతటి వారైనా కానుకలకి కాసులకి దాసోహమంటారు. ఈ భారతీయులున్నారే- వీళ్ళకు కాలమంతా ఇంట్లో అంతర్గత శత్రువులతోనూ పొరుగున ఉన్న సరిహద్దు శత్రువులతోనూ పోరాడటానికే సరిపోతుంది. బయట శత్రువు గురించి పట్టించుకునేదెప్పుడు? అదే మన బలం వారి బలహీనత.
“ మేరా రాజ్ మేరీ మర్జి... మేరీ బాత్ హీ పత్తర్‌కి లఖీర్" (నా రాజ్యం నా ఇష్టం. నా మాటే శిలాశాసనం). తను అనుకున్నట్టు చేసేయడమే. సలహాదారులు నామమాత్రంగా ఉంటారు. వాళ్ళు తన అభీష్టానికి అనుగుణంగా తన ఇంగితం తెలుసుకుని మసలుకుంటూ సలహాలు చెబుతారు. ఉండటం మటుక్కు నోటిలో పళ్లున్నట్టున్నారు. ఎంత గొప్పగా చెప్పినా సరే
వినడం జరగదు. ఇదంతా ఒక తంతు. ఒకరకంగా పునరావాసం.
బుర్రలోకి వచ్చిన ఆలోచన అమలవ్వాల్సిందే. న్యాయన్థానాలూ, తీర్పులు ఉండని పాలన. ఎవరైనా అడ్డుకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. మేలు చేయాలన్నాకీడు
చేయాలన్నా తనే. ప్రతిరోజూ ఒక్కడైనా కళ్ళ ముందు చావాల్సిందే. గుర్రపు డెక్కల కింద పడాల్సిందే. అదొక వినోద క్రీడ.
సకల శాస్త్రాల్ని ఔపోసన పట్టినవాడు. పర్షియా, అరబిక్, సంస్కృతం భాషలు నేర్చినవాడు. నీతుల్ని ధారాళంగా వెలువరించే వాడు. భౌతిక, తర్మ ఖగోళ గణిత శాస్త్రాల్లో పండితుడు. గ్రీకు తత్వ శాస్త్రాలను అధిభౌతిక శాస్త్రాల్ని ఆమూలాగ్రం పఠించినవాడు. మేధావిగా ఘనత కెక్కినవాడు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల ఇక్కడి - ముఖ్యంగా ఖగోళ, గణిత శాస్త్రాలు
వృద్ధి చెందాయట. నిజమా?
తనకెందుకు స్వల్ప వ్యతిరేకతను సైతం భరించలేని మనస్తత్వం వచ్చింది? ఏమో తెలీదు. మొగలుల గుంపు పంజాబుపై దాడి చేసింది. ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఢిల్లీ దాకా వచ్చేసారు. మొగలుల రాక వల్ల వ్యవసాయం స్థిరరూపం దాలుస్తుందట. అపుడు తను చేసిందేమిటి? అపార ధనాన్ని రాసులు పోసి వారి బెడద తొలిగించుకోడం తెలిపైన
పనే కదా. మనసు లోని భావ పరంపర కొనసాగుతోంది.
సవ్యసాచీ.. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నావో తెలుస్తూనే ఉంది...నీ గుండె నిబ్బరం... కరుడుకట్టిన నియంతృత్వం... నీదైన శక్తి సామర్ధ్వాలూ కట్టుదిట్టంగా పాలన చేయడానికే కదా...సజీవంగా తోలు ఒలిచి ఆ చర్మంలో గడ్డి కూరి రాజ్యంలో అన్ని ప్రాంతాలకు ఊరేగించింది ఎందుకు? హెచ్చరిక కోసమే కదా. ఎవరు ఎదిరించినా మీకూ అదే గతి
అని చెప్పడానికే కదా.
తలుచుకుంటే నీవేమైనా చేయగలవు... ఏదైనా సాధించగలవు... సందేహం లేదు....చరిత్రలో నీ స్థానం మరువలేనిది... మానవ చరిత్ర ఉన్నంత వరకు నీవుంటావు. ఓడిన రాజును వధించి వారి చర్మాన్ని నీతో తెచ్చుకుంటావు.
రాజుల చర్మాల ప్రభువు గా పేరు గాంచిన నీ కీర్తి అజరామరం.... అనితర సాధ్యం... అహహా...
ఢిల్లీ నీకిష్టమైన ప్రాంతం. అయినా పదిహేను వందల మైళ్ళ దూరంలో ఉన్న దౌలతాబాదుకు (దేవగిరి) రాజధానిని మార్చడం వెనుక నీదైన తర్కం ఉంది. మంగోలుల దాడుల నుంచి దూరంగా జరగడం. సారవంతమైన నేలను కాపాడుకోవడం.
ఉత్తరోత్తరా దక్షిణాపథం ఆక్రమించుకుని సామ్రాజ్య విస్తరణ చేయడం. కఠినంగా ప్రజల్ని తరలించడం లోనూ నీదైన ఆలోచన ఉంది. ఒక గుడ్డివాడు రాకపోతేనేం...ఒక మంచం పట్టిన వాడిని వదిలేస్తేనేం... అనుకున్నావా? లేదు...లేదు...ఎవర్నీఉపేక్షించే పని లేదు... కఠినాతికఠినంగా ఉండటం... ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకపోడం....
సైనికులకు ఆదేశాలున్నాయి. ఆదేశాల్ని ఉల్లంఘించిన సైనికులు బతికి బట్ట కడతారా? అందుకే ఎక్కడికక్కడ వాళ్ళు విశ్వరూపం చూపించారు. మంచం పట్టినవాడిని రాళ్ళు గుండ చేసే యంత్రంలోకి విసిరేసారు. మరి గుడ్డివాణ్ణి... కాళ్ళుగుర్రం తోకకు కట్టి ఈడ్చుకెళ్ళమన్నావు. వాళ్ళు అలాగే చేసారు. ఏమైంది? ఏమౌతుంది?
ఆ అమాయక అంధుడు నరకయాతన అనుభవించాడు చేయని నేరానికి. అవయవాలు మధ్యలో ఊడిపోయాయి ఒకొటొకటిగా. కడకు ఈడ్చుకెళుతున్న కాలు మిగిలింది. మిగిలిన కాలును నగరంలో విసిరేసారు. ఈ పని పూర్తవ్వడానికి పట్టిన కాలం పదిరోజులు. తన మాట అంటే తెలియాలంటే ఇదంతా జరిగి తీరాలి. కరుణ చూపిస్తే అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. నీకు దక్కేది అనిర్వచనీయమైన ఆనందం... పైశాచికమైన ఆత్మతృప్తి...
బంగారు నాణాలకు బదులు రాగి నాణాలు ప్రవేశపెట్టావు. ఇక అంతే...డబ్బులున్నాయి... వస్తువులు ఉండవు. కొద్ది సరకులను మరీ ఎక్కువ డబ్బు వెంటాడుతుంది. దాంతో...ధరలు పెరిగి పోయాయి. గోనెసంచుల్లో డబ్బులు పట్టుకెళ్ళి చిన్న సంచిలతో వస్తువులు కొనుక్కోవాల్సి వచ్చింది. కొంప ముంచావు కదరా...రుణ పరపతి పోయింది. రైతులు పొలాలు
విడిచిపెట్టి దొంగతనాలు, దోపిడీలు వృత్తిగా స్వీకరించారు. కడకు ఏమైంది? రాగి నాణాలుకు వెండి నాణాలు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఖజానా ఖాళీ.
సవ్యసాచీ... అప్పుడేం చేసావు... దానికి సాయం భరించలేని పన్నులు వేసావు. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి ...
ఊహూ... ఏమిటీ రోజు ఇలా.... అనుకుంటుండగానే మెలకువ పిట్ట కూసింది. సవ్యసాచి లేచాడు. స్నానాల గదికి చేరి స్నానం చేసాడు. రోజూ లాగే గదిలో ఉన్న నిలువుటద్దం చెంతకు చేరిపోయాడు. ఆ కంచు ఆద్దం ప్రత్యేకమైంది. ఒంటి మీద చిన్నమరకను కూడా చూపెడుతుంది. మొత్తం దేహం అగుపడుతుంది.
శరీరం మీద నూలు పోగు లేకుండా దిగంబరంగా కంచు అద్దం ముందు నిలబడ్డాడు. తన రూపాన్ని చూసుకుని మురిసిపోయాడు. కండలు తిరిగిన బాహువులు... దట్టమైన కనుబొమలు... విడివడిన పొడవాటి జుట్టు...చెవులకు దళసరి రింగులు... బొద్దుగా మీసం... బలిసిన తొడలు... బుగ్గ మీద అరంగుళం నల్లని గాటు.... విశాలమైన వక్షస్థలం... దేహం నిండా గుబురు వెంట్రుకలు... ఒక్కసారి అటు ఇటు తిరిగి చూసుకున్నాడు. వీపు మీద మటుక్కి గత ఏడాది నుండీ పెరుగుచున్నటువంటి- వైద్యులకు కూడా ఇంకా చూపించని ఎర్రని దద్దుర్లు... కోపంగా తల పంకించాడు. రోజూ దర్శించి క్షణం విరామంలో చూపులు తిప్పుకుంటాడు.
కొన్ని క్షణాల పాటు అలాగే నిలబడ్డాడు. ఊపిరి గట్టిగా లోపలికి పీల్చి వదిలాడు. గాఢమైన నిశ్శబ్దం. అలికిడి లేదు. వెలుగు రేఖలు విచ్చుకుంటున్న వేళ ఉన్నట్టుండి ఒక్కసారిగా బయట ఉధృతంగా గాలి వీస్తోంది. చెట్టు కొమ్మలు ఊగుతూ చిత్రమైన ధ్వని తరంగాల్ని మోసుకొస్తోంది. ఏవో ఆకులు కొమ్మలు కదులుతున్న చప్పుడు. దూరంగా గుర్రాల సకిలింపులు. శిక్షకుల అదలింపులు.
మూసి ఉన్న కిటికీ చెంతకు చేరాడు. దుస్తులు ధరించడానికి సిద్ధపడుతున్నాడు. సవ్యసాచికి ఒక ప్రతిజ్ఞ ఉంది. ఈ సమయం పూర్తిగా తనకే సొంతం. ఎవరు ఆటంకపరచినా సహించడు. దుస్తులు మార్చుకుంటున్నపుడు ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే వాణ్ణి చంపి తీరతాడు. వాడు ఎలాంటి హోదాలో ఉన్నవాడైనా సరే. వీపు మీద మచ్చలు ఎవరైనా చూస్తారనా? చెప్పలేం. ఇదొక గుట్టు. స్వయం నిర్ణయంతో దాచి పెట్టుకుంటున్న సంగతి.
ఉన్నట్టుండి ఒక సూర్య కిరణం పురుష గురుతుపై పడి మెరిసింది. ఉలిక్కి పడ్డాడు. చుట్టూ చూసాడు. ఎవరూ కనిపించలేదు.
కళ్ళు ఎరుపెక్కాయి. జుట్టు ముడివేసుకుని గబగబా దుస్తులు ధరించాడు. ఆభరణాలు వేసుకోకుండానే హాలులోకి వచ్చాడు. వెంటనే ఆస్థాన పెద్దల్ని రప్పించాడు. సైన్యాధికారిని పిలిచాడు. సవ్యసాచి ముఖం చూసిన వారికి జరగరాని ఉపద్రవమేదో జరిగిందని ఊహించుకుంటున్నారు. అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ... తనలో తాను గొణుక్కుంటూ...
సైనికాధికారి అహ్మద్ ఖాన్ వచ్చాడు. జీ...అంటూ తల వంచి సలాం చేసాడు.
సవ్యసాచి ఎవరి ముఖం చూడకుండా " ఏకాంత సమయంలో సూర్యకిరణమొకటి ఒంటిని తాకింది. మీకందరకూ తెలుసు ఎవరూ రాకూడని క్షణాల్లో ఎవరొచ్చినా సహించనని. ఆ కిరణం నన్ను దహించి వేస్తోంది. ధికార్నాన్ని సైతునా... శిక్ష అనుభవించాల్సిందే. ఒకే మాటను తిరుగులేని ఆదేశంగా తీవ్ర స్వరంతో పలికాడు- “లక్షమంది సైన్యాన్ని
సిద్ధం చేయండి”
పెద్దలు గొంతు సవరించుకున్నారు. నెమ్మదిగా బోధపరచడానికి ప్రయత్నించారు.
"సవ్యసాచీ ...ఇపుడు లోపలికి ప్రవేశించింది మిమ్మల్ని అగౌరవపరచింది మామూలు కిరణ నేత్రం కాదు. లోకబాంధవుడైన సూర్యుని అంశ. సూర్యుడు లేకుండా బతుకలేం. అది ఆకాశంలో ఒక దివ్య వస్తువు. పెద్ద నక్షతం. మానవ మాత్రులం దాడి చేయలేం. కిరణాలను తునుమాడటానికి అది భౌతికరూపం కలది కాదు. లక్షల యోజనాల దూరం నుండి వచ్చిన వెలుగురేఖ. తుంచలేం. ఖండించలేం. సావధాన చిత్తంతో ఆలోచించండి, ప్రభూ....
గాలిలో కత్తి తిప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఒంటి లోకి సూక్ష్మకణం చేరి రోగకారకమైనట్టుగా కనిపించని శత్రువును ఎదిరించలేం. శూన్యంతో పోరాటం శ్రేయస్కరం కాదు.... సవ్యసాచీ ....మమ్మేలు దొరా...మా మాట విను... మనమేం చేయలేం...కుచ్ బీ న కరో...అనవసర ఆలోచనలు వద్దు..."
సవ్యసాచి వినలేదు. అన్ని మాటల్ని పెడచెవిన పెట్టి సైన్యం సిద్ధం కావాలన్నాడు. శత్రువును అన్వేషించి తుద ముట్టించి గానీ నిద్రపోనన్నాడు. చేసిన ప్రతిన ఏమై పోవాలి? గెలిచినవాళ్ళకు దోపిడీ వస్తువుల మీద బందీలుగా పట్టుకున్నవాళ్ళమీద హక్కుంటుంది. ఆ లెక్కన కిరణాన్ని పట్టుకుంటే సూర్యుడు సొంత మవుతాడు.
పెద్దలు మౌనం వహించారు. పేరుకు ముందు రెండు అక్షరం ముక్కలు మనసులో అనుకుని ఊరుకున్నారు. ఒకళ్ళకొకరు చెవులు కొరుక్కున్నారు. ప్రభువు ఆజ్ఞ మరి. సిద్ధమవ్వక తప్పదు. ముహూర్తం ఖరారైంది.
అశేష సైనిక వాహిని. ఆయుధాలూ గుర్రాలూ కత్తులూ కటారులూ....
ముందు వరసలో సవ్యసాచి, ఇంకా ప్రధాన సైనికాధికారులు. యుద్ధం ఎవరి మీదో సగం సైన్యానికి తెలియనే తెలియదు. రంగం మీదకు దూకమంటే దూకడమే. ఇది కొత్త విషయం కాదు. చాలాసార్లు జరిగిందే. ఇది మరీ విచిత్రమైంది. కనిపించని శత్రువుపై సమరం. శత్రువు అనేవాడు ఏ మూల నుంచి వస్తాడో తెలీదు. వాడి రూప లావణ్యాలు తెలియవు. వాడి ఆయుధాలు తెలియవు . వాడి వ్యూహం తెలీదు. ఎదురు కవ్వింపులు ఎదురు కాల్పులు లేని యుద్ధం. ఒంటి చేతి చప్పట్లు. ఏకపక్ష సంరంభం.
సూర్యుడు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఎండ అంతకంతకూ తీవ్రమౌతోంది. సూర్యుడు అక్కడే నిశ్చలంగా ఉన్నాడు. గాలి లోంచి ఎగిరొచ్చి మీద పడతాడంటే ఆ దిక్కు కాచుకోవచ్చు. పిడుగుల్లా అగ్ని కురిపిస్తాడనుకుంటే కవచాలతో కాచుకోవచ్చు. సూక్ష్మ కణాలు ప్రబలినపుడు చేసుకునే స్వయం నియంత్రణకు అవకాశమే లేదు.
సవ్యసాచి అలుపెరగకుండా ముందుకు సాగుతున్నాడు. మహాసైన్యం అనుసరిస్తోంది, కదం తొక్కుతూ. నేల కంపిస్తాంది. సవ్య అపసవ్య శబ్దాలు మిన్నంటుతున్నాయి. చెట్ల మీది పక్షులు ఆకాశం లోకి ఎగిరిపోతున్నాయి. జంతువులు పొదల్లోకి దాక్కొంటున్నాయి. మహాప్రళయం ముంచుకొచ్చినట్లుగా... వాతావరణం గందరగోళంగా ఉంది.
పెను ధూళి చెలరేగుతోంది. పదఘట్టనలకు దుమ్ము ఆకాశం ఎత్తున ఎగురుతోంది. మసగ కమ్మేసింది. చిత్రంగా సూర్యుడు అదృశ్యమయ్యాడు. తెరలు తెరలుగా పొగలా కమ్ముకుని పక్కవాడినే పోల్పుకోలేని స్థితి.
“ శత్రువు కోసం ఎదురు చూడక్కర్లేదు. శత్రువు పారిపోయాడు ” సైన్యం గగ్గోలుగా అరుస్తోంది. సైనికాధికారులు సవ్యసాచితో మాట్లాడారు.
సవ్యసాచి వెనుదిరగక తప్పలేదు. తిరుగు ముఖం పట్టాడు, చరిత్రకు అంటిన ధూళిని విదిల్చుకునే శక్తిలేనట్టు.... మొండితనం ఒక్కటే పనికి రానట్టు... పాలకుడికి పట్టువిడుపులు ఉండాలన్నట్టు.... మడమ తిప్పడం తప్పదన్నట్టు....
***సమాప్తం ***
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

రచయిత పరిచయం :
రచనలు : ఏడు కవితా సంపుటులు ( వానరాని కాలం ,గుండె తెరచాప ,మట్టికాళ్ళు ,లోపలి దీపం,,నడిచుట్టూ నేను ,పాటం పూర్తయ్యాక ,దోసిలిలో నది ), రెండు దీర్ఘకవితలు (ముద్రబల్ల, నాలుగోపాదం) ఒక చరిత్ర గ్రంధం ( యానాం చరిత్ర ), సరదాగా కాసేపు( రాజకీయ వ్యంగ్య కథనం), నాలుగు కథా సంపుటులు ( దాట్ల దేవదానం రాజు కథలు , యానాం కథలు , కల్యాణపురం -యానాం కథలు-2, కథల గోదారి ), చైనా యానం( యాత్రాకథనం), మధుహాసం (చమత్కారాలు ) నాలుగో పాదం - ఇంగ్లీష్ , కన్నడం , తమిళం , మలయాళం భాషల్లోకి అనువాదం అయ్యాయి . చాలా కథలు, కవితలు తమిళ, హిందీ ,ఇంగ్లీష్ లోకి అనువాదం జరిగింది
ప్రధాన పురస్కారాలు : కలైమామణి , తెలుగు రత్న (ఈ రెండు అవార్డులు పుదుచ్చేరి ప్రభుత్వం బహూకరించింది ), రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇంకా కధ సంపుటులు, కవిత సంపుతులకు రాష్ట్రస్థాయి అవార్డులు పొందడం జరిగింది
కోడి పందాల నేపథ్యం లో "బారి " నవల రాసాను .
స్థానికతను దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం ఇష్టం . చరిత్ర ను ఆధారం చేసుకుని యానాం కథలు రాశాను. ---- అభివందనాలతో - దాట్ల దేవదానం రాజు