top of page

మనిషికీ మనిషికీ మధ్య


Manishiki Manishiki Madhya Written By Simha Prasad

రచన : సింహ ప్రసాద్


“డాడీ! నా బర్త్‌డే కి ఎవరూ రాకపోతే?”


ఆరేళ్ళ రాహుల్‌ ప్రశ్నకి నిరుత్తరుడినై పిచ్చిగా చూశాను.


నా అణువణువులో ఏదో సంచలనం! మెదడులో విస్ఫోటనం!


చిన్న గులకరాయి నదిలో వేస్తే అలలు మొలిచి కెరటాలుగా ఎదిగి నన్ను ముంచెత్తినట్టు..... ఉక్కిరి బిక్కిరయ్యాను. విస్మయంగా చూశాను.


వాడు అనాలోచితంగా అన్నాడా లేక, నా లోకం... నాలోని లోకం... అదృశ్య చక్షువులతో చూసి గ్రహించి.....!


“రాహుల్‌ క్వశ్చన్‌కి ఆన్సరియ్యి విశాల్‌...” సుజల అంది నా వంకే చూస్తూ.


ఏం చెప్పాలో తోచలేదు. తలొంచుకుని డిన్నర్‌ చేస్తూ క్రీగంట రాహుల్‌ వంక చూశాను.


తినటం ఆపి నా వంకే చూస్తున్నాడు. వాడి పసి కళ్ళల్లో, మొఖంలో కొండంత నిరాశ, ఆశాభంగం!


“బర్త్ డే కి ఇంకా చాలా టైముందిగానీ ముందు డిన్నర్‌ చెయ్‌”


“వాడికెందుకలా అన్పించిందో ఏమో. అనునయంగా నాలుగు మంచి మాటలు చెప్పొచ్చుగా”


“ఏం చెప్పను? నీ బర్త్‌డే గొప్పగా చేస్తాను. మన కమ్యూనిటీ వాళ్ళంతా వచ్చేస్తారనా? సారీ. అలాంటి హంబక్‌ కబుర్లు నేను చెప్పను”


“కనీసం బర్త్‌డే పార్టీకి చాలామంది వచ్చి విష్‌ చేస్తారని భరోసా ఇవ్వొచ్చుగా?!”


నిటారుగా అయ్యాను. “వస్తారా? డూ యూ బిలీవ్‌ దట్‌?”


“మనం వెళ్తోంటే వాళ్ళొస్తూంటారు. అక్కడ్నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ్నుంచి అక్కడికీ అంతే దూరం కదా!”


“దూరాల లెక్కలు నాకు తెలీవు. ఒక్కటి మాత్రం నిజం. నేనిక్కడి ఎగ్జిబిషనిస్టులతో కలవలేను. డాబూ దర్చం గొప్పగా ప్రదర్శించాలనుకునే వారితో రాసుకు పూసుకు తిరగలేను. అమెరికా వెళ్ళలేకపోయామన్న దుగ్దతో అక్కడి లైఫ్‌ గురించి అవాకులూ చవాకులూ పేలే వాళ్ళతో కలిసి నవ్వలేను. యూనో... వీళ్ళది అంతులేని జెలసీ. కరడు గట్టిన హిపోక్రసీ!” నాకు తెలీకుండానే గొంతు హెచ్చింది.


“అందర్నీ ఒకేగాట కడతావేం విశాల్‌. ప్రేమాభిమానాలు చూపేవాళ్ళూ ఉన్నారుగా!”


“ఉంటే ఉండనీ. ఐడోంట్‌ కేర్‌” విసురుగా లేచాను.


“మొదటి నుంచీ ఇదే వరసా!”


సుజల స్వరంలోని బేలతనం నన్ను కదిలించింది. బహుశా కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కదిలి వుండొచ్చు.


అది చూడటం ఇష్టం లేదు. ఆమె మాటలు వినిపించనట్టు గదిలో కెళ్ళిపోయాను.


బెడ్‌ మీద వాలి చేతుల్లోకి “మనీ లైఫ్‌” మ్యాగజైన్‌ తీసుకున్నాను గాని నా దృష్టి అక్షరాల మీంచి జారిపోతోంది!


ఎంచేతో చిన్నప్పట్నుంచీ నేనింతే. ఎవరితోనూ ఎక్కువగా కలవలేను. బహుశా నాకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని లేనందునేమో. బాల్యమిత్రులూ తక్కువే.

నాన్న ఆడిటర్‌గా పనిచేసే వారు. ఎప్పుడూ క్యాంపుల్లోనే ఉండేవారు. ఇంట్లో అమ్మా నేనూ బిక్కు బిక్కుమంటూ మా లోలోపలే కుంచించుకుపోతూ...!

సెవెంత్‌ క్లాసులో నన్ను గుడివాడ విశ్వభారతి స్సూల్లో చేర్చిస్తానన్నారు నాన్న, అమ్మ ఒప్పుకోలేదు. వాడ్ని నాకు దూరం చేయొద్దుంటూ ఏడ్చి గోల చేసింది. నాన్న వినలేదు. నాకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందనీ, ఐఐటియన్ని అవుతాననీ చెప్పి

తీసుకెళ్ళి చేర్చారు. దానితో బాటే హాస్టల్‌ జీవితం మొదలైంది.

టెన్త్‌లో 548 మార్ములొచ్చాయి. స్కూలు వారు పేపర్లలో నా ఫొటో వేయించారు. అభినందనల వర్షం కురిసింది. అలాంటివే మళ్ళీ మళ్ళీ మరింతగా కావాలన్న తపన నాలో వేరూనింది. చదువే లోకం చేసుకోవాలని డిసైడయ్యాను.

ఇంటర్‌ విజయవాడ చైతన్యలో చేరాను. ఎలాగైనా సరే ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా తపస్సు ప్రారంభించాను.లెక్చరర్లెంతగానో ప్రోత్సహించారు. ఆర్నెల్ల పరీక్షల్లో నా ప్రతిభ చూశాక మేనేజ్‌మెంటు వారూ నా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నన్ను గెలుపు గుర్రాల గ్రూపులోకి మార్చారు. నా మీద ఒత్తిడి పెరిగింది. నా లోపలా టెన్షనే. ఊపిరి బిగబట్టి పరుగు మొదలెట్టాను. ఐఐటీ-జీ పరీక్షలయ్యే వరకూ ఆ పరుగు-ఆ గుక్క ఆపలేదు.కాలేజీ వారు నాకూ, మరి కొందరికీ కొత్త సూట్లు కుట్టించి ఫొటోలు తీసుకున్నారు. ఫలితాలు రాకుండానే “కప్పు” సాధించేసినట్టు ఫీలవుతూ ఇంటి కెళ్ళాను. మధ్య మధ్యలో అమ్మా నాన్నా నన్ను చూడటమే గాని, ఈ రెండేళ్ళలో నేను ఒక్కసారీ ఇంటికెళ్ళలేదు. దగ్గరి బంధువు లిళ్ళలోని శుభకార్యాలకీ హాజరు కాలేదు.

నాన్ననా దీక్షని మెచ్చుకుని నన్ను “హీరో” లా చూశారు. అమ్మ తప్పిపోయిన కొడుకు దొరికినట్లు పొంగిపోయింది. ఇరుగూపొరుగూ అపురూపంగా చూశారు. పిల్లలు ఆరాధనగా చూశారు. మిత్రులు కొత్తగా వున్నావన్నారు. బంధువులు “మీసాలొచ్చాయి, పెద్దవాడయ్యాడు” భుజం తట్టి మరీ అన్నారు.

ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడ్ని కాదు. కలిసి తిరిగే వాడ్నీ కాదు. ఎంచేతో ఇంటి వాతావరణం నాకు నచ్చేది కాదు. అమ్మ పాయసం, గారెలు, సున్ని ఉండలు, జంతికలు - ఎన్నో వండి తినమని పీకల మీద కూర్చునేది. కాదంటే కళ్ళ నీళ్ళుపెట్టుకుని బ్రతిమాలేది.

ఏమైతేనేం ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకొనే వాణ్ణి.

ఐఐటి - జీ ఫలితాలొచ్చాయి. ఆలిండియా 26వ ర్యాంక్‌ వచ్చింది. అన్ని పత్రికలూ నా ఫొటోలు ప్రచురించాయి. కాలేజీ వారు పేపర్లలో, టీవీలో ఇచ్చిన యాడ్స్‌లోనూ నా ఫొటో ప్రముఖంగా చూపించారు.

“నా కొడుకు గొప్పవాడయ్యాడు” అని పొంగిపోయారు నాన్న. ఊరూ వాడా వినిపించేలా అరిచి చెప్పారు. స్వీట్సు పంచారు. హీరోని చెక్కిన రియల్‌ హీరోగా తనని అభివర్ణించుకున్నారు.

“మళ్ళీ దూరంగా వెళ్ళిపోతావేంట్రా కన్నా” అమ్మ అంది దిగులుగా చూస్తూ.

నేనెవర్నీ పట్టించుకునే స్థితిలో లేను. ఐఐటి ముంబయిలో చేరాను. అక్కడా బ్రైట్ స్టూడెంట్‌గా వెలిగాను. ఒక్కసారీ నా స్కోరు పదిలో ఎనిమిదికి తగ్గలేదు. 9.5 వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

థర్డ్‌ ఇయర్లోనే క్యాంపస్‌ సెలక్షన్లో ఓ యమ్మెన్సీ నన్ను సెలక్ట్‌ చేసుకుని గొప్ప ఆఫరిచ్చింది.

నాకది ఎక్సైటింగా అన్పించలేదు. యుఎస్‌లో ఎమ్మెస్‌ చేయాలన్నది నా డ్రీమ్‌. అదే నాన్నకి చెప్పాను. నాన్న వినలేదు.

“ఎమ్మెస్‌ పేరిట రెండేళ్ళు వృథా చేసుకోవద్దు” అన్నారు. ఉద్యోగంలో చేరితే ఆ రెండేళ్ళలో టాప్‌ పొజిషన్‌కి చేరి పోవచ్చన్నారు. అదీ గాక పోస్టింగ్‌ అమెరికాలో ఇస్తానన్నారు గనుక, ఇంకేం ఆలోచించొద్దన్నారు. వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి పెట్టుకోవద్దన్నారు.

ఎప్పట్లానే నాన్నే గెలిచారు.

“నాకు అందనంత దూరం వెళ్ళిపోతావుట్రా కన్నా” అంది అమ్మ బేలగా.

“20 గంటల ప్రయాణం. అంతే” అన్నారు నాన్న

చిన్నగా నవ్వి కాలిఫోర్నియా ఎగిరి పోయాను. అమెరికా సంస్కృతి నాకు బాగా నచ్చింది. ఎవరి గొడవ వారిదే. ఎవరి బతుకు వారిదే. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటాల్లేవు. అనవసర జోక్యాలు లేవు. ఉచిత సలహాలసలే లేవు.

మా ఏరియాలో ఇండియన్స్‌ ఎక్కువే. తెలుగువారూ అధికంగానే ఉన్నారు. ఏవో గ్రూపులుగా, అసోసియేషన్లుగా ఏర్పడే వారు. మన జాతి, మన భాష, మన సంస్కృతి, మనమూ, మన ఐక్యత - అంటూ కబుర్లు చెప్పేవారు. నాకవేమీ బు(రకెక్కేవి కాదు. అన్నిటికీ, అందరికీ దూరంగానే ఉండి పోయాను. ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది. దాన్నినా స్కిల్‌ 'పెంచుకోడానికీ, మరింత నైపుణ్యంతో పనిచేయడానికీ ఉపయోగించుకున్నాను.చకచకా మెట్లెక్కి ప్రాజెక్టు మేనేజర్ని అయిపోయాను.

ఇంట్లో "పెళ్లి పోరు” ఎక్కువయ్యింది. నేనూ ఒక స్థాయిని చేరుకున్నాను. “తోడు” అవసరమనిపించింది. సుజల జీవ జలంలా జల జల పారుతూ నా నిశ్చల జీవనంలోకి ప్రవేశించింది.

“ఇలా వున్నారేంటి?” అంది. “రిజర్వుడా? ఇంట్రావర్టా ?” అనడిగింది. 'మనిషెప్పుడూ ప్రవహిస్తూండాలి. లేకపోతే పాచి పడుతుంది”అని నవ్వింది.

“జీవితం ఓ ఇంద్రధనుస్సు. వృత్తి, డబ్బు అనే రెండు రంగులే కాదు. ఇంకా అయిదు రంగులున్నాయి మహానుభావా! అంటూ ఆట పట్టించాలని చూసింది. 'ప్లీజ్ నాగురించైనా సరదాగా ప్రియసఖుడిలా వుండరూ?” అని అర్ధించింది.

“పెళ్లి, మీ జడత్వాన్ని కరిగించలేకపోవచ్చు. పిల్లలు మిమ్మల్ని మార్చి తీరతారు” అంటూ ఛాలెంజ్ విసిరింది.

వాటన్నిటికీ జవాబుగా నేనిచ్చిన మౌనాన్ని, మందహాసాన్ని, నిర్వికారాన్ని, రకరకాలుగా భావించుకుని, ఊహించుకుని, తృప్తి పడి, సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది.

సుజలకి ఇద్దరన్నదమ్ములూ, ఇద్దరు అక్క చెల్లెళ్లూ. అందుకే నా ప్రపంచం ఆమెకి బోలుగా, శూన్యంగా, రసహీనంగా కన్చిస్తూండి ఉండొచ్చు. ఎంచేతంటే ఆమె ఇల్లు నాకు ఉక్కిరి బిక్కిరిగా వుండేది మరి!

ఉదయం ఏడింటికి ఆఫీసుకి బయలుదేరటం ... రాత్రి ఏడింటికి హెవీ ట్రాఫిక్కులో గంట డ్రైవ్ చేసుకొచ్చి అలసి బెడ్‌ మీదవాలిపోవడం... శనివారం బజారు పనీ, రెస్టారెంట్లో తిండి... ఆదివారం ఎక్కడో అక్కడికెళ్ళి వీకెండ్‌ గడపటం... సోమవారం మళ్ళీ రొటీన్లోకి..... అంతా యాంత్రిక జీవితం! అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి అమెరికాలోని అన్ని ముఖ్య ప్రదేశాలూ చూపించాను. యూనివర్శల్‌ స్టూడియో, శాన్‌డియాగో బీచ్‌లు, వైట్‌ హౌస్‌, లిబర్టీ స్టాట్యూ, ఎంఫైర్‌ స్టేట్‌ బిల్దింగ్‌, టైమ్‌ స్వ్వేర్‌, నయగరా ఫాల్స్‌...... అన్నీ విమానాల్లో తిప్పి మరీ చూపించాను. గొప్ప హోటల్స్‌లో రూమ్ బుక్‌ చేయడమే గాక, ఇటాలియన్‌, థాయ్‌, చైనీస్‌, మెక్సికన్‌..... రకరకాల ఫుడ్స్‌ పెట్టించాను.

నాన్న చాలా గర్వంగా ఫీలయ్యారు. “మన వంశంలో అమెరికాలో అడుగుపెట్టిన ఘనుడివి నువ్వేరా. డాలర్ల పంట పండిస్తున్నదీ నువ్వేరా. నీ వల్ల మేం అమెరికా వైభవం చూసే అదృష్టానికి నోచుకున్నాం” అన్నారు ఉద్వేగంగా.

“అమ్మా! నీకెలా వుంది? ఆ మట్టికీ, కాలుష్యానికీ, జనసమ్మర్డానికీ దూరంగా వచ్చేసి ఇక్కడ 'సెటిలైపోవాలనుంది కదూ?” నవ్వుతూనే అడిగాను. అందులో 'సుపీరియారిటీ కాంప్లెక్స్‌” వుందనీ తెలుసు.

చిన్నగా నిట్టూర్చింది. “ఎప్పుడు మనూరెళ్ళి పోదామా, ఎప్పుడా గాలి పీల్చి ఆ నీరు - కాదు ఆ తీర్థం పుచ్చుకుందామా అన్పిస్తోందిరా అబ్బాయ్‌”

షాకయ్యాను. అపనమ్మకంగా వెర్రిగా చూశాను. “ఇన్ని రకాల తిండ్లు, కాలు క్రింద పెట్టనక్కర్లేని విలాసాలు, నువ్వు చూచిన ప్రపంచ ప్రఖ్యాత అద్భుత ప్రదేశాలు - ఏవీ - ఏవీ నీకు ఆనందాన్నీ తృప్తినీ ఇవ్వలేదా అమ్మా?”

నా స్వరం నాకే వింతగా విన్చించింది. సుజల మా వంక ఆసక్తిగానూ, నాన్న వింతగానూ చూశారు.

“కాశీ వెళ్ళి గంగలో మునిగి, బదరీనాథ్‌ వెళ్ళి ఆ స్వామిని దర్శించి తరించాలని వుందిరా. అవి చూపిస్తావటరా కన్నా " ప్రేమగా - కాదు ఆర్తిగా అడిగింది.


భగవంతుడు ప్రత్యక్షమైతే వరం కోరుకున్నట్లుగా అడిగింది.


“ఎంత పిచ్చిదానివమ్మా. అవేం పెద్ద గొప్పవని? ఏం పొడిచాయని?” తేలికగా అన్నాను. వెటకారం కలిసిందేమో తెలీదు.


"నా రక్తంలో కలిసి వున్న నమ్మకాలవి. చూపిస్తావుట్రా?”


నాన్న ఏదో అనబోతోంటే, “అవే కాదమ్మా ఇండియాలోని అన్ని పుణ్యక్షేత్రాలూ చూపించే ఏర్పాట్లు చేస్తాను. నువ్వు నిశ్చింతగా వుండు" భరోసా ఇచ్చాను.


“మా కడుపున పుట్టిన బంగారానివి. నువ్వు దగ్గరుండి. ఆ రెండూ మాకు చూపించు చాలు. ఈ జన్మకింకేం కోరుకోనురా కన్నా".


అమ్మ వంక పిచ్చిగా చూశాను.


“ఈసారి ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తారత్తయ్యా. మీరా సంగతి మరచిపోండి” సుజల కల్పించుకుని భరోసా ఇచ్చింది.


“అవునా?” అన్నట్టు అమ్మ నా వంక చూసింది. తలాడించి చేతిలో చేయి వేశాను.


అప్పుడు అమ్మ ఎంత సంబరవపడిందో వర్ణించడానికి నాకొచ్చిన ఏ భాషా సరిపోదు.


“ఎలాగైనా సరే అమ్మ కోరిన పుణ్యక్షేత్రాలు చూపించాలి. ఎవరి పిచ్చి వారికానందం కదా!” అనుకున్నాను.


ఆ మరుసటి ఏడాది మా కంపెనీకి వైస్‌ ప్రెసిడెంట్ నయ్యాను. పని ఒత్తిడి పెరిగింది. ఇండియా వెళ్ళలేక పోయాం.


సుజల మాటి మాటికీ గుర్తు చేస్తూ ముందుకు తోస్తూనే ఉంది. ఇదిగో వెళ్దాం అదిగో వెళ్దాం అనుకుంటూండగానే అకస్మాత్తుగా అమ్మ ఆరోగ్యం విషమించింది.


లివర్‌ క్యాన్సర్‌ అన్నారు. ఎడ్వాన్స్‌డ్‌ స్టేజి అని చెప్పినా, కార్బోరేట్‌ హాస్పటల్లో చేర్చించమని డబ్బు పంపాను.


నా బాధ్యత తీరిందని చేతులు దులుపుకోబోయాను. సుజల ఒప్పుకోలేదు. ఇండియా వెళ్దామని పట్టుబట్టింది.


ఏవో వంకలు పెట్టి వాయిదా వేశాను. తన పిచ్చిగాని మేమెళ్ళి ఏం చేయగలం? నేనేం డాక్టర్ని కాదుగా!


సుజల ఒత్తిడి ఎక్కువయ్యింది. అన్నీ సర్దుకుని వెళ్ళేం. ఊళ్ళో అడుగుపెడుతోంటే తెలిసింది అమ్మ పంచప్రాణాలు అనంత దూర తీరాలకు తరలి పోయాయని!


నేను శిలలా ఉండిపోయాను. గుండెల్లో శిలగా మారిన దుఃఖం!


నాన్నా, సుజల పుట్టింటి వాళ్ళూ అన్నీ చక్కబెట్టారు. కర్మకాండలు ముగిశాయి.


“అమ్మ అస్థికల్ని కాశీలో నిమజ్జనం చేసి, బదరీనాథ్‌ బ్రహ్మకపాలం దగ్గర పిండప్రదానం చెయ్యరా, అమ్మ ఆత్మశాంతిస్తుంది” అన్నారు నాన్న.


“సారీ, ఇప్పుడంత దూరం వెళ్ళలేను. ఇప్పటికే ఇక్కడ ఇరవై రోజులు చిక్కడిపోయాను. కీ పొజిషన్లో వున్నాను కదా. ట్రై టు అండర్‌స్టాండ్‌. అక్కడ ఇంపార్టెంట్‌ వర్క్స్ పేరుకుపోయాయి. నేను వెంటనే వెళ్ళకపోతే కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది. నే వెళ్ళి తీరాలి. మీరే ఆ పని పూర్తి చేయండి నాన్నా” అని నచ్చచెప్పి వారణాశికీ, బదరీయాత్రకీ ఫ్లయిట్‌ టిక్కెట్స్‌ బుక్‌ చేసిచ్చాను.


మేం తిరిగి అమెరికా వచ్చిన నెలకే సుజలకి నెల తప్పింది.


నేను తండ్రిని కాబోతున్నాను!


నాలో వినూత్న భావన. అణువణువులో వింత అనుభూతి. ఇదీ అని చెవ్పలేని అపరిమిత ఆనందం!


ఇక సుజల సంగతి చెప్పనక్కర్లేదు. “ఆంటీ పుట్టబోతున్నారు విశాల్ అంటూ మురిసిపోయింది. అక్షరాలా గాలిలో తేలిపోయింది.


“మీకింత అపురూపమైన గిఫ్ట్‌ ఇస్తున్నాను కదా, మరి నాకేం గిఫ్ట్‌ ఇస్తారు?” కొంటెగా అడిగింది.


“ఏం కావాలో కోరుకో, ఇప్పుడే కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను”


“కొనబడేది కాదు...” చిలిపిగా నవ్వుతూ అంది.


“మరి...?”


“ఇండియా వెళ్ళిపోదాం విశాల్‌. అయిన వాళ్ళకి దగ్గరగా వుందాం. అందర్లో కలిసుందాం” .

వెర్రిగా చూశాను. “ఇక్కడి ఫ్రండ్స్ మనకి అయిన వాళ్ళు. వాళ్ళని పరాయి వాళ్ళుగా చూడొద్దు”


“నేను చూట్టం లేదు. మీరే ముభావంగా అంటీ ముట్టనట్లుంటున్నారు.


“అది కాదు.....”


“విశాల్‌! నన్ను చెప్పనీ. నీకు గుర్తుందో, లేదో ఒక్క ఇండియన్‌ ఫ్యామిలీనీ మనింటికి భోజనానికి పిలవలేదు. ఎందరో మనల్ని పిలిచినా ఒక్కరింటికీ మనం వెళ్ళలేదు. కాసిని నీళ్ళు చిలకరిస్తే చాలు, బంధాల అనుబంధాల తీగలు ఇట్టే చిగురు తొడిగి అల్లుకుపోతాయి”


“ప్చ్, అవన్నీ ఫూలిష్‌ సెంటిమెంట్స్‌, అనవసరం... సుజలా"


“ఈ ఆనందం ఈ బ్రహ్మానందం నలుగుర్లో పంచుకోకపోతే నా గుండెలు బద్దలై పోతాయన్స్పిస్తోంది... విశాల్‌!"


“నాకూ అలాగే వుందనుకో. కానీ...”


“ఇంకేం, పంచుకుందాం. పంచుకుంటే ఆనందం డబులవుతుంది...”


“యూ మే బీ కరెక్ట్‌. ఓకే ఓకే. మన బిడ్డ పుట్టగానే అందర్నీ పిలిచి భారీ ఎత్తున బారసాల చేద్దాం. ఓకే నా?”


“డబుల్‌ ఓకే” నన్ను వాటేసుకుని ఆనందోద్వేగంతో ఊగిపోయింది.


చిత్రంగా మా అనుబంధం మరింత చిక్కబడింది. కమ్మదనాన్ని సంతరించుకుంది.


పుట్టబోయే బిడ్డ గురించి తీయని ఊహల పల్లకిలో ఊరేగుతోంటే అశనిపాతం లాంటి వార్త. నాన్న హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు!


మూడో రోజుగ్గాని మేం ఇండియా వెళ్ళలేకపోయాం.


బంధుమిత్రులు నాన్న శవాన్ని ఏసీ బాక్సులో వుంచి జాగ్రత్తగా చూశారు. వారి ఆదరాభిమానాలకు కన్నీరు పొంగి వచ్చింది.

వారికీ మాకూ మధ్య నాన్న మంచితనమో, బంధుత్వమో, సహకార గుణమో మరేదో '“వంతెనగా నిలిచింది. దానికి నమస్మరించి అంత్యక్రియలు జరిపించాను.

తిరిగి యుఎస్‌కి వచ్చేశాం.అమ్మా నాన్నా లేని ఇండియా మీద అభిమానం పోయింది. ఆసక్తిపోయింది. అనుబంధమూ తెగిపోయింది.ఇక ఇక్కడే ఉండబోతున్నాం. మా బిడ్డ పుట్టగానే అమెరికా పౌరుడవుతాడు. కనీసం ఇప్పుడైనా ఇక్కడి జనంతో కలవకపోతే...!

మెల్లగా నాలోని మంచు శిఖరాలు కరగటం మొదలెట్టాయి.

అందరికీ “హాయ్‌” చెబుతున్నాను. చిర్నవ్వులు చిందిస్తున్నాను. కరచాలనం చేస్తున్నాను. తెలుగు వాళ్ళెక్కడెక్కడున్నారని ఆరా తీస్తున్నాను. గెట్‌ టు గెదర్లకీ వెళ్తున్నాం.

ఈ మార్చుకి సుజల సంబరపడని క్షణం లేదు. “నేను చెప్పలేదూ. మన బిడ్డ పుట్టక ముందే నిన్ను మార్చాడు విశాల్‌ ఇక పుట్టేక పెనుమార్చు ఖాయం” అని ఆట పట్టిస్తోంది.

డెలివరీ డేట్‌ దగ్గర పడింది. ఆలనా పాలనా చూస్తూ పెద్ద దిక్కుగా ఉంటానన్న సుజల వాళ్ళమ్మ అనారోగ్య కారణాల వల్ల అమెరికా రాలేక పోయింది. నాకు కాలూ చేయీ ఆడలేదు. మిత్రులే మేమున్నామంటూ ముందుకొచ్చారు. భుజం తట్టారు.

ఇదినా ఊహకందని పరిణామం! ఏ మెడికల్‌ సెంటర్‌ మంచిది, ఏ డాక్టర్‌ బెటర్‌, ఇన్సూరెన్సు కవరేజ్‌ ఎంత వుంటుంది, డెలివరీకి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటి - వగైరాల గురించి వివరంగా చెప్పారు. ఏ టైమ్‌లో అవసరపడినా సరే తమని కాల్‌ చేయమని వెంటనే వచ్చి వాలతామని ప్రామిస్‌ చేశారు.

సుజలకి ధైర్యం ఇచ్చారు.వారి శుభాకాంక్షలు వృథాపోలేదు. ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండా రాహుల్‌ పుట్టాడు. అభినందనలు వెల్లువెత్తాయి. బారసాలకు 200 మంది వచ్చారు. అదో రికార్డు అన్నారంతా.

మొదటి ఏడాది మంత్లీ బర్త్‌డే చేశాం. ప్రతిసారీ మినిమం అయిదు కుటుంబాల్ని ఆహ్వానించాం. ఇయర్లీ బర్త్‌డే కూడా ఘనంగా చేస్తూ వచ్చాం. ఆరవ బర్త్‌డే చేశామో లేదో కంపెనీ నన్ను హైదరాబాద్‌ వెళ్ళమంది.

అక్కడ కొత్తగా ప్రారంభించిన ఆఫీసుకి నన్ను హెడ్‌గా నియమించింది.

సుజల ఎగిరి గంతేసింది. కాని నాకు చాలా ఎంబ్రాస్సింగా వుంది. అక్కడంతా కొత్త. నాకెవరూ తెలీదు. ఫ్రెండ్సు, బంధువులూలేరు. తొలిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్టితి వుందో అచ్చం అలాంటి పరిస్థితే మళ్ళీ ఎదురైంది. ఈ సారి పుట్టి పెరిగిన గడ్డమీద!

సుజల మాట తోసెయ్యలేక బాచుపల్లిలో విల్లా కొన్నాను. హైదరాబాదులో అడుగు పెడుతూనే గృహ ప్రవేశం చేశాం. సుజల కుటుంబ సభ్యులు మాత్రం వచ్చారు. నాన్న బంధువు లెక్కడెక్కడున్నారో తెలీదు. అందుకని పిలవలేకపోయాం.ఇండిపెండెంటు విల్లాలు - విసిరేసినట్టుగా ఒక దానికి దూరంగా మరొకటి. అంతా ఒకే గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్నా ఎవరు ఎందులో ఉంటున్నారో ఎవరికీ తెలీని పరిస్థితి.

రాహుల్‌ని ఇంటర్నేషనల్ స్సూల్లో చేర్చాము. మొదట్లో స్కూలు బాగో లేదనీ, తన యాక్సెంట్‌కి నవ్వుతున్నారనీ, తిరిగి అమెరికా వెళ్ళిపోదామనీ గోల చేశాడు. కాని నెల తిరిగే సరికల్లా అడ్జస్ట్ ఐపోయాడు. హీ ఈజ్‌ వెరీ హ్యాపీ విత్‌ హిజ్‌ స్కూల్‌.

కాని స్కూలు బయట స్నేహితుల్లేరు. నా స్థితీ అలాగే వుంది. మిగతా వారితో కలవడానికి నా హోదా అడ్డొస్తోంది. మళ్ళీ మునుపట్లా తలని డొప్పలోకి ముడుచుకున్న తాబేలునైపోయాను!

“మళ్ళీ నీకేవయ్యింది విశాల్‌. ఎవ్వరూ అక్కర్లేనట్టు ఎవ్వరితోనూ పనిలేనట్టు అందరికీ దూరంగా వుంటున్నావేం?” నా ధోరణి అంతు బట్టక అడిగింది సుజల.

“సుజలా! దిసీజ్‌ ఇండియా. నా హోదాని చూసి గౌరవిస్తారు. నా సంపద చూసి దగ్గరవ్వాలని చూస్తారు. నా వల్ల లాభపడాలని ప్రయత్నిస్తారు. బంధుత్వాల పేరు చెప్పి ఎక్సప్లోయిట్ చెయ్యాలని చూస్తారు. వీళ్ళకెంత దూరంగా వుంటే అంత మంచిది డియర్‌”

“అది మీ అపోహ. అభిమానాలకీ అనుబంధాలకీ ఆర్థిక రంగు పూయొద్దు...”

"నో ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్‌...”

నిస్సహాయంగా వుండిపోయింది. పిలవకుండానే వచ్చే కన్నీళ్ళు ఆమెని పలకరించే ఉంటాయి. అంచేత దృష్టి మరల్చుకున్నాను.రాహుల్‌ సెవెంత్‌ బర్త్‌డే వచ్చే నెలలోనే. అది గుర్తొచ్చి బర్త్‌డేకి ఎవరైనా వస్తారో రారోనని బెంగపడుతున్నాడు!ఏం చేయాలి? ఏం చేస్తే వాడు సంతోషపడతాడు?

“మీ ఆలోచనింకా తెగలేదా?” గదిలోకి వస్తూ అంది సుజల.

“ఎలాగైనా సరే రాహుల్ని హ్యాపీగా ఉంచాలి. దటీజ్‌ మై ఓన్లీ ప్రోగ్రాం”

“ఉంచుదాం”

“ఎలా?”

“సోషల్ యానిమల్‌గా మారి” పడీ పడీ నవ్వింది.

మర్నాడు ఆఫీసు నుంచి వచ్చేసరికి రాత్రి పదయ్యింది. చిత్రం! అవ్పటి దాకా నాకేదో చెప్పాలని వెయిట్‌ చేస్తున్నాడు రాహుల్‌.

నన్ను చూస్తూనే, “డాడీ” అని అరుస్తూ రెండు పేపర్లతో ఎదురొచ్చాడు. వాణ్ణంతగా ఎక్సైట్‌ చేసిన పాయింటేమిటా అని పేపర్లలోకి చూశాను.

రెండిట్లలోనూ రెండు చెట్టు బొమ్మలు. కొమ్మల్నిండా వేర్లు. తేరపారి చూశాను. అవి వంశవృక్షాలు. ఒకటి మాది. రెండోది సుజల వాళ్ళ పుట్టింటిది.

“సీ డాడ్” . ఇదిగో నా పేరు ఇక్కడ ఉంది. వీళ్ళంతా మనవాళ్ళేనట డాడ్‌. మామ్‌ చెప్పింది. వీళ్ళందర్నీ నా బర్త్‌డేకి ఇన్వైట్‌ చెయ్యి డాడ్‌...” ప్రపంచాన్ని జయించబోతున్న వాడిలా చెప్పాడు.

వాడ్ని హత్తుకుని సుజల వంక అబ్బురంగా, అభిమానంగా, ఆప్యాయంగా చూశాను.

“హౌ యూ మేకిట్‌ పాజిబుల్‌? ఎలా సేకరించావ్‌?”

“మనసుంటే మార్గం వుండదా. బంధువుల్ని ఆరా తీశాను. ఫ్రెండ్స్ ని వాకబు చేశాను. ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేశాను. సిటీలో మీ కజిన్సూ, వారి సంతానమూ 86 ఫ్యామిలీస్‌ ఉన్నాయి.

నీ స్సూల్‌, కాలేజ్‌ క్లాస్‌మేట్స్‌ 21 మంది ఉన్నారు. మా ఫాదర్‌ తరపు బంధువులు 48 మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్‌ 64 మంది ఉన్నారు. ఇక మన కమ్యూనిటీలో మొత్తం 55 ఫ్యామిలీస్‌ ఉన్నాయి. చాలా మంది ఫోన్‌ నెంబర్లూ మెయిల్‌ ఐడీలూ సేకరించగలిగాను...”

“థాంక్యూ...” అప్రయత్నంగా అన్నాను. అంతా కలలోలా ఉంది!

“రాహుల్ని చూడండి. ఆనందం మూర్తీభవించినట్లు లేడూ? తనకింత మంది బంధువులున్నారనే మురిసిపోతున్నాడు. ఇక బంధువుల బంధువులూ, మిత్రులూ, నైబర్స్ అంతా వస్తే వీడి సంబరం అంబరాన్నంటదూ!”

“యస్‌. మనకింత మంది ఉన్నారన్న ఆలోచనే ఓ పెద్ద బలం. సంతోషం, ఉత్సాహం, ఉత్తేజం!”

“మనల్నీ ఇతరులు అలా అనుకునేలా మారలేమా?” సూటిగా నా కళ్ళల్లోకి సాలోచనగా చూస్తూ ప్రశ్నించింది.ఏం చెప్పాలో చప్పున తోచలేదు. నీళ్ళు నమిలాను.

“మనం దూరం జరక్కుండా ఉంటే చాలు, అంతా దగ్గరి వాళ్ళే అవుతారు. మన వాళ్ళే అవుతారు. దూరం అనేది ప్రాంతాల మధ్య ఉండాలి గాని మనుషుల మధ్య కాదు”

“గ్రేట్! రాహుల్‌ బర్త్‌డేకి అందర్నీ - అందర్నీ పిలిచేద్దాం” ఎక్సైట్‌ అవుతూ అన్నాను.

“హుర్రే!” ఆనంద కేరింతలు కొట్టారు సుజలా, రాహుల్‌.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


రచయిత పరిచయం


సింహ ప్రసాద్ పేరుతొ కథలు రాసే నా పూర్తి పేరు చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్ . 1973 నుండి రచనలు చేస్తున్నాను . ఇంతవరకు 407 కథలు,66 నవలలు ప్రచురితమయ్యాయి . 82 కథలకు,18 నవలలకు,2 నాటకాలకు బహుమతులందుకున్నాను. వివాహ వేదం,తిరుమల దివ్యక్షేత్రం ,స్వేచ్చా ప్రస్థానం ,స్త్రీ పర్వం,ధిక్కారం ,అభయం ,63 బహుమతి కథలు బాగా పేరు తెచ్చి పెట్టాయి. నివాసం హైదరాబాద్ లో.
98 views1 comment
bottom of page