top of page

మనుషులు మారాలి ఎపిసోడ్ - 6


'Manushulu' Marali Episode 6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 25/11/2023

'మనుషులు మారాలి ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక

రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు.


సుప్రజ ఆడపడుచు సరళ, భర్త మీద అలిగి వచ్చేస్తుంది. సుప్రజ భర్త మోహన్ తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. సరళ మొండితనం గురించి చెబుతాడు అతని బావ.. తన అక్క సరళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మోహన్.


నీరజ వంటను ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు. భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ.

సుప్రజ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు.


మాధవి మరిది రమేష్ తలిదండ్రులని తనతో తీసుకొని వెళతాడు.

వెళ్ళినప్పటినుండి డబ్బులు చాలడం లేదని మాధవి భర్త శేఖర్ ని సహాయం అడుగుతూ ఉంటాడు.


ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 6 చదవండి.


ప్రసూనాంబ, ప్రసాదరావులకు రెండో కొడుకు రమేశ్ ఇంటికి వచ్చిన కొన్ని రోజుల వరకు ఆనందంగానే గడిచిపోయింది. ప్రీతి, రమేశ్ వాళ్ళిద్దరినీ నెత్తిమీద పెట్టుకుని మరీ చూసారు. ప్రతీనెల అమ్మా నాన్నగారి మందులకు, ఖర్చులకు పదిహేను వేలు పంపమని రమేశ్ అడిగితే శేఖర్ సరే పంపుతానన్నాడు. ప్రీతి పొద్దుటే లేచి ఆఫీస్ కు వెళ్లిపోతోంది.



పిల్లవాడిని చూసుకోవడం, ఇంట్లో వంటపని, మొత్తం పని అంతా ప్రసూనాంబ మీద పడింది. ఆవిడకు పెద్ద కోడలు తమింటికి వచ్చినప్పటి నుండి పని అంతా మాధవే చేస్తున్న మూలాన బొత్తిగా పని అలవాటు పోయింది. ప్రొద్దుట లేవగానే చేతికి వేడి వేడి కాఫీ అందించేది మాధవి. చక చకా టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబిల్ పెట్టేసేది. తరువాత స్నానం చేసి వంట పూర్తిచేసి పిల్లలను తయారు చేసేది స్కూళ్లకి. తాను టిఫిన్ తిని లంచ్ బాక్స్ సర్దుకుని అత్తగారిని మామగారిని కూడా సమయానికి టిఫిన్, భోజనం చేయమని ఒకటికి రెండుసార్లు చెప్పి ఆఫీస్ కు బయలు దేరేది. ఇక్కడ అలా కాదు, ప్రీతి ఆలస్యంగా లేవడమే కాదు, ఒక రోజు అత్తగారితో చెప్పేసింది కూడా. నేను ప్రొద్దుటే లేవలేను. బాబు రాత్రిళ్లు అస్తమానూ లేస్తాడు కాబట్టి. టిఫిన్, వంట మీరే చూసుకోండంటూ. ఏనాడూ కాఫీ తాగారా అన్న మాటగానీ, వేళకు భోజనం చేస్తున్నావా అని అడిగే దిక్కులేదు.




పిల్లాడికి పాకడం వచ్చిందేమో తనకీ, భర్తకీ వాడిని చూసుకోవడంతోటే సరిపోతోంది. మధ్య మధ్యలో పనిమవిషి డుమ్మాలు కొట్టేయడంతో అంట్లు, గదులూడ్చుకోవడం కూడా తనే చేయాలసి వస్తోంది. కాస్త మీరు స్నానం చేసే ముందు నా బట్టలన్నీ వాషింగ్ మెషిన్ లో వేసేయండంటూ హుకుం జారీ చేసి వెళ్లిపోతుంది ప్రీతి.


ఏమనగలదు ఆవిడ? మాధవితో అధికారయుక్తంగా పని చేయించుకోగలిగే ప్రసూనాంబ ప్రీతి కి ఎందుకో జంకుతోంది. పోనీ పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లిపోదామా అనుకుంటే పట్టుమని ఆరు నెలలు ఉండకుండానే వచ్చాసారే, అందరూ నాలా మీ అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారా అని మాధవి అనుకుంటోందేమోనన్న ఒక లాంటి అహం. గతి లేక వచ్చేసారనుకుంటూ తనని ఎక్కడ చిన్న చూపు చూస్తుందోనన్న ఒకలాంటి సంకోచం. ఎప్పుడైనా తప్పు గా ప్రవర్తించేవారికే ఇటువంటి భయాలు సంశయాలు. మాధవి ఎన్నో సార్లు శేఖర్ తో అంటూనే ఉంటుంది. పాపం అత్తయ్యగారూ మామయ్యగారూ మీ తమ్ముడు, మరదలి దగ్గర ఎలా ఉన్నారో, అప్పుడప్పుడు వెళ్లి వాళ్ల బాగోగులు చూస్తూ ఉండమని.


ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రీతి ఆఫీస్ నుండి వచ్చే సమయానికి ప్రసూనాంబకి ఒంట్లో బాగోలేక పడుకుంది. ఒళ్లునొప్పులు, జ్వరం వచ్చినట్లుగా ఉందని.


ప్రీతిని చూస్తూనే మామగారు ప్రసాదరావు ప్రసూనాంబకి ఆరోగ్యం బాగాలేదమ్మా, కాస్త కాఫీ పెట్టి ఇస్తావా అనేసరికి ఇంతెత్తున ఎగిరింది. నేనే చచ్చి చెడి ఆఫీస్ పని చేసి అలసిపోయి వస్తే మీకు కాఫీ పెట్టి ఇవ్వాలా? ఆ మాత్రం కాఫీ పెట్టుకోవడం కూడా రాకపోతే ఎలాగండీ, బాగుంది భోగం అనుకుంటూ రుస రుస లాడుతూ అక్కడ నుండి వెళ్లిపోయింది. ప్రసాదరావు మ్రాన్పడి ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు. తనకి కాఫీ పెట్టడం చేతగాక కాదు. ప్రీతి కి ప్రసూనాంబ ఆరోగ్యం గురించి చెపితే కంగారు పడుతూ ప్రసూనాంబని పలకరిస్తుందని, నేను కాఫీ పెట్టి ఇస్తానని ఆరాటంగా మాట్లాడుతుందని ఏవేవో ఊహించుకున్నాడే గానీ ప్రీతి ఇలా నిస్సంకోచంగా హేళనగా మాట్లాడు తుందని తను ఊహించలేదు. ఎందుకో ఆయనకు పెద్దకోడలు మాధవి గుర్తొచ్చింది. ఆమె తమ పట్ల చూపించే గౌరవం, అభిమానానికి వెలకట్టలేడు. ప్రసూనాంబ మాధవి పట్ల కరుకుగా ఉంటూ ఆడిపోసుకున్నా ఎంతో సహనంగా అగ్గగ్గ లాడుతూ ఉంటుంది. తనూ ఉద్యోగస్థురాలైనా ప్రొద్దుటే లేచి అన్ని పనులూ చేసుకుని తమిద్దరకి బోల్డన్ని జాగ్రత్తలు చెప్పి మరీ ఆఫీస్ కు వెళ్లేది. ఇద్దరి కోడళ్లకూ ఎంతటి వ్యత్యాసం! చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని ఊరికే అనలేదేమోననుకుంటూ భారంగా నిట్టూర్చాడు.


ఆరోజు రాత్రి ప్రసూనాంబ లేవలేకపోయింది. జ్వరం ఎక్కువైంది. ప్రీతి అసలు అత్తగారిని ఎలా ఉందనిగాని, ఏమి తింటారని గానీ అడగనే లేదు. తనకూ, భర్తకూ పిల్లలకూ స్విగ్గీ నుండి ఫుడ్ ఆర్డర్ చేసింది.


రమేశ్ ఆఫీస్ నుండి రాగానే చెప్పాడు ప్రసాదరావు మీ అమ్మకి జ్వరం రా అని. పారాసిట్ మాల్ వేసుకుని పడుకుంటే సరి అంటూ కనీసం తల్లి దగ్గరకు వెళ్లి పలకరించకుండానే ప్రీతి ఉన్న గదిలోకి వెళ్లిపోయాడు.


ప్రసూనాంబ కి వచ్చిన జ్వరం వారం రోజులకు గానీ వదలలేదు. ప్రసాదరావే ఆవిడను హాస్పటల్ కు తీసుకు వెళ్లి చూపించాడు. అన్నం, కూర, చారు అవీ ఆయనే చేసి తినిపించాడు. అత్తగారి బాగోలేదు పాపం, పసిపిల్లాడిని చూసుకోలేరు శెలవు పెడదామని కూడా ఆలోచించని ప్రీతి మనస్తత్వానికి ప్రసాదరావు హృదయం మండిపోయింది. ఆయనే పిల్లాడిని చూసుకోవలసి వచ్చింది. సంవత్సరం క్రితం అనుకుంటా, ప్రసూనాంబ కి కేటరాక్ట్ ఆపరేషన్ అయినప్పుడు ఎవరూ చెప్పకుండానే మాధవి ఒక పదిరోజులు శెలవు పెట్టేసి అత్తగారికి సేవచేయడం ఆయనకు గుర్తొస్తోంది. కళ్లల్లో డ్రాపులు వేస్తూ తనే సమస్తమూ చేసి పెట్టింది. పొద్దుటే టిఫిన్, వంట చేసేసి హాట్ పేక్స్ లో సర్ది వెళ్లిపోయేది. అత్తగారిని లేవనీయకుండా పూర్తి విశ్రాంతిని ఇచ్చింది.


భార్యకు ఎన్నో సార్లు చెప్పాడు, మాధవి మంచి పిల్ల, ఆ అమ్మాయిని ఏదో ఒకటి అనకుండా ఉండలేవా అని. కానీ ఏనాడూ తన మాటను ఖాతరు చేయదు భార్య. ఇటువంటి వాళ్లకు ప్రీతి లాంటి కోడల మూలానే గుణపాఠం అవ్వాలి. ఆయనకు పెద్ద కొడుకు, కోడలు పట్ల మనసు ఆరాట పడుతోంది. ఆయనకు అంతవరకూ తెలియని విషయమేమిటంటే శేఖర్ నుండి రమేశ్ ప్రతీనెల తమ పోషణకు, మందులకూ మాకులకూ పదిహేను వేల రూపాయలు గుంజుతున్నాడని. తెలిస్తే ఆయన ఎలా స్పందించే వాడో.


ఆ విషయమూ ఈయన వరకూ వచ్చింది ఒకరోజు.


దుబాయ్ నుండి కూతురు శైలజ ఫోన్ చేసింది ప్రసాదరావుకు. నాన్నా నా ఫ్రెండ్ సునీత ఫేమిలీతో ఇండియా వస్తోంది. ఒక నెలరోజులుంటుందిట. నాకు కొన్ని చీరలు అలాగే పిల్లలకు ఏవో డ్రెస్ లు అలాగే ఇంకా కావలసిన వస్తువులు ఇండియాలో కొనమని చెప్పాను. ఒక ఏభై అరవై వేల రూపాయల వరకు అవుతుంది. అది చెప్పిన ఎమౌంట్ చిన్నన్నయ్య ను అడిగి ఇచ్చేయ్ సునీతకు. నేను అన్నయ్యకు తరువాత పంపిస్తానని చెప్పు.


అదే మాట రమేశ్ కు చెప్పాడాయన. నా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుంది నాన్నా? హౌస్ లోన్ కే మా జీతంలో సగం పోతోంది. అన్నయ్యకు చెప్పు ఆ డబ్బు సంగతి ఏమిటో. ఈ ఫస్ట్ కు ఎలానూ పదిహేను వేలు పంపుతాడుకదా, ఆ డబ్బుతో బాటూ మరో ఏభై వేలు పంపుతాడు.


పదిహేను వేలు ఏమిటిరా రమేష్?


తండ్రి అడిగిన ప్రశ్నకు జవాబివ్వడానికి ఒక్క క్షణం తటపటాయించినా, వెంటనే తనను తాను సమర్ధించుకుంటూ మీ ఇద్దరి ఖర్చులు, మందులకూ నేనెక్కడ పెట్టుకోగలను నాన్నా? ప్రీతి కొత్త ఆఫీస్ కి మారడం మూలాన తను మెటర్నిటీ శెలవులో ఉన్నంత కాలం తనకు సాలరీ లేదు. పైగా పురుటి ఖర్చులూ అవీ నేనే పెట్టుకోవలసి వచ్చింది. బాబును చూసుకోడానికి ఆయాను పెట్టుకునే స్తోమతు లేకనే అమ్మనీ, మిమ్మల్ని నా దగ్గరకు పిలిపించుకున్నాను.




మమ్మలని చూసుకునే స్తోమతు లేదురా నీకు? వారం రోజుల క్రితం హాల్ లో కొత్తరకం సోఫాసెట్ తెప్పించుకున్నారు. దాని ఖరీదు లక్షా ఇరవై వేలంటూ మీ ఆవిడ ఎవరో ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పడం విన్నాను. ఇప్పుడు ఉన్న కారు మార్చేసి కొత్త కారు కొనాలని కొంత అడ్వాన్స్ పేమెంట్ కట్టి బుక్ చేసానని రెండు రోజుల క్రితం మీ కొలిగ్ మన ఇంటికి వస్తే మాట్లాడం విన్నాను. ఆ కొత్త కారు మీద ఎన్నో చర్చలు నడిచాయి మీ ఇద్దరి మధ్య.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







83 views0 comments

Comentários


bottom of page