'Maranam Kalipindi' written by Sarada Kanala
రచన : శారద కానాల
వారం, పదిరోజులుగా శశి ఢిల్లీ ప్రయాణం గూర్చి తర్జన, భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. శశి ,లలిత ఇద్దరు చిన్నప్పట్నుంచీ డిగ్రీ వరకు కలిసే చదువుకున్నారు. పైగా ప్రక్క, ప్రక్క ఇండ్లలో ఉండడం వలన మామూలు స్నేహం ప్రాణ స్నేహంగా పరిమళించింది. ప్రస్తుతం లలిత కూతురి పెళ్లి. పెళ్లి దరిదాపుల్లో అయితే సమస్య లేకపోవును. అబ్బాయి తలిదండ్రులతో పాటు ఢిల్లీ లో ఉంటున్నాడు. ఢిల్లీలో ఒకే కంపెనీలో పని చేస్తున్నారు అబ్బాయి, అమ్మాయి. కనుక, అక్కడే పెళ్లి జరుగుతున్నది.
శశి భర్త రాజారావు. ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇంకా అయిదారు సంవత్సరాల సర్వీసు ఉంది. పెళ్ళికి ఇద్దరు కలిసే పోవాలనుకున్నారు. కానీ, కాలేజీ పిల్లలకు పరిక్షల కారణంగా రాజారావుకు పోవడానికి కుదరలేదు. శశి ని ఒంటరిగా పంపించడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా తనను వదిలి శశి వెళ్ళిపోవడం తలుచుకుంటేనే అతని మనసు బాగాలేదు. పెళ్లైంది మొదలు ఎప్పుడూ వాళ్ళు ఒకరిని వదిలి ఇంకొకరు ఉండాల్సిన అవసరం రాలేదు. కారణం ఇద్దరిదీ ఒకే ఊరు. పుట్టినింటికి, మెట్టినింటికి తిరగడానికి నలభై రూపాయల ఆటో చాలు. అంత దగ్గర. సంతానం లేకపోవడం వాళ్ళ అదృష్టమో, దురదృష్టమో చెప్పలేము.
కాలేజీకి సెలవులు ఇచ్చిన తరువాత ఇద్దరూ కలిసి పోవాలనే రాజారావు ప్రతిపాదన శశికి నచ్చలేదు. ఇక మొండి తారాస్థాయికి చేరేటప్పటికి రాజారావుకు రాజీ పడక తప్పలేదు. ఎలాగైతేనేం అన్ని జాగ్రత్తలు చెప్పి రైలెక్కించడానికి వచ్చిన రాజారావు రైలు కదులుతుండగా కళ్ళనిండా నీళ్ళతో అతి దీనంగా కనిపించాడు. ఒక్కసారి శశి మనసు చివుక్కుమంది. “ అయ్యో ! పాపం, ఎంత పని చేశాను?” అనుకుంటుండగానే రైలు కదిలింది.
అటు భర్త కనుమరుగు కాగానే కలత చెందిన మనస్సును ఓదార్చడానికి కళ్ళు మూసుకుంది. మర్చిపోదామన్నా మరచిపోలేని సంభాషణలు గుర్తుకు రాసాగాయి. పది రోజుల నుండి జరిగిన ఒకొక్క సీను కళ్ళముందు కదలసాగింది.
“శశీ ! సెలవులు రానీయ్. ఇద్దరం కలిసే వెళ్దాం ప్లీజ్ .“
“మీకొచ్చే సెలవులదాకా పెళ్లి ఆగదు తెలుసా ?” శశి మొండి వాదన.
“పెళ్ళికి వెళ్తేనే ప్రాణ స్నేహమా? తరువాత తీరికగా పది, పదిహేను రోజులు నీ స్నేహితురాలితో గడిపితే బాగుంటుందేమో ఆలోచించు.”
“అలానే చేద్దాంలెండి. ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్లి వస్తాను. తరువాత మీరు చెప్పినట్లుగానే తీరికగా వెళ్తే బాగుంటుందేమో మీరూ ఆలోచించండి.” శశి ఏ మాత్రం తగ్గడం లేదు.
“ప్లీజ్ శశీ ! నువ్వు లేకపోతే నాకేం తోచదు. ఆ విషయం నీకూ తెలుసు.”
భార్యను నిలిపే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు పాపం రాజా రావు.
“అందుకే నేను లేని రోజుల్లో మొత్తం అన్ని పనులు రంగమ్మకు అప్పజెప్పే వెళ్తున్నాను.మీకు దేనికీ లోటు ఉండదు.”
“అంటే నేను కేవలం నా తిండి, నీళ్ళు గురించే నీతో అవసరం అనుకుంటున్నానా చెప్పు.”
“రామ! రామ! ఏమిటండీ ఇంత రాద్ధాంతం! ఎవరైనా వింటే నవ్విపోగలరు. ఒక్క పదిహేను రోజులు పెళ్ళాన్ని ఒదిలి ఉండలేరా అని.”
“ఎవరైనా నవ్వుకోనీ . నాకు సంబంధం లేదు. నువ్వు లేకుండా నాకు క్షణం గడవదు.”
ఈ సంభాషణల్లో పడి టీవీ వాగుతుంటే ఇద్దరూ పట్టించుకోలేదు. టీవీ కట్టేయడానికి లేచిన రాజారావుకు నిజంగానే శశిని నిలిపివేయాల్సిన పరిస్థితిని కల్పించింది కరోనా రాక.
“శశీ ! విను .విను. టి వి లో అన్ని చానల్స్ లోను కరోనా, కరోనా అంటూ ఒకే దిమ్మ తిరిగే వార్తలు. వింటుంటే భయమేస్తున్నది. కొంచెం ఆలోచించుకో. నీ మొండితనం మానుకో. “
“అయ్యో రామా!ఇట్లాంటి ఎన్ని వైరస్ లు మన జీవితకాలం లో చూడలేదు. చికెన్ పాక్సు, చికున్ గున్యా, ఎబోలా , డెంగ్యు, స్పానిష్ ఫ్లూ ఎన్ని రాలేదు, ఎన్ని పోలేదు. ఈ మీడియా ని నమ్ముకుంటే ఇంక పనులు జరిగినట్లే. నన్ను నిలిపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారండీ.”
“అది కాదు శశీ! నన్ను నమ్ము తరువాత విచారించి ప్రయోజనం లేదు.”
“సరేలేండి .ఇక జీవితంలో గడప దాటి ఎక్కడికీ పోను. జీవితాంతం మీకు సేవలు చేసుకుంటూ బ్రతికేస్తాను. నాకు సపోర్ట్ రావడానికి పిల్లలైనా లేకుండా చేశాడు భగవంతుడు!” ఏడ్చినంత పని చేసింది శశి.
నాలుగైదు రోజులు ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం. సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన భర్తకు రోబోట్ లా మంచి నీళ్ళు, స్నాక్స్, కాఫీ లు అందివ్వడము, టిఫిన్ రెడీ, భోజనం రెడీ అంటూ చీటీలు పిలుస్తున్నాయి. ఈ చేష్టలతో రాజారావుకు కోపమెక్కువైపోతోంది . కానీ కోపం చేస్కోవాల్సిన సందర్భాలు ఇదివరకు ఎప్పుడూ రాకపోవడం తో తనకు తనే నచ్చజెప్పుకున్నాడు. భరించరాని ఈ మౌనంకంటే కొన్ని రోజుల వియోగమే మేలనిపించింది.
శశి దగ్గరగా కూర్చుంటూ “ శశీ!” అని పిలిచాడు.
“ఊ, ఇంకా ఏమిటి చెప్పండి. ఇప్పుడు సంతోషంగా ఉందా మీకు?”
“అది కాదులే . ఇలా నా వైపు చూడకుండా, నాతో మాట్లాడకుండా విధిస్తున్న ఈ శిక్ష ఎంత ఘోరంగా ఉందో తెలుసా?”
“నా పరిస్థితీ ఎంత ఘోరంగా ఉందో మీకూ తెలియాలి మరి! లలిత అత్తామామలు, అమ్మానాన్నలు, బాగా పెద్దవారు. పెళ్లి పనులన్నీ తను ఒక్కతే చేసుకోలేననికదా నన్ను ముందుగా రమ్మని పిలిచింది. సమయానికి నేను పోతానని అది ఎంత ఆశగా ఎదురుచూస్తుంటుందో పాపం!”
“శశీ! నువ్వనుకున్నట్లుగానే పెళ్ళికిముందుగా వెళ్ళు. కానీ, ఆ తరువాత ఆ ఫంక్షన్ అనీ, ఈ ఫంక్షన్ అనీ అనుకోకుండా వచ్చేయ్. పది రోజుల తరువాత టికెట్ బుక్ చేసేస్తాను. ఓకేనా?”
“ అబ్బా! ఇప్పటికైనా కరుణించారు. ఇంకా నయం. వీడియో కాల్ చేసి పెళ్లి చూడమంటారేమోనని భయపడ్డాను. రిటర్న్ టికెట్ అక్కడికి వెళ్ళిన తరువాత రామారావు గారి చేత చేయించుకుంటాలెండి . ప్రస్తుతానికి తత్కాల్ బుక్ చేసేయండి. మీరు చెప్పినట్లుగానే పెళ్లికాగానే బయలుదేరి వచ్చేస్తాను. నన్ను నమ్మండి.” ఇంత శాంతంగా, నిదానంగా మాట్లాడి చాలా రోజులైంది శశి .
“శశీ! ఒక్కసారి నా దగ్గరగా కూర్చోవా?”
“అబ్బా! ఏమిటండీ! చిల్లపిల్లవాడిలా ఈ ముచ్చట్లు?”
“ప్లీజ్! ఒక ముద్దు.”
“ఛీ పొండి” అంటూ మురిపెంగా నవ్వుతూ బట్టలు సర్దుకోవడం మొదలు పెట్టింది.
ఆ రోజు రాత్రికి రాజారావుకు విపరీతమైన తలనొప్పి, జ్వరం. నిద్రమేలుకునే ఉన్నాడు. భర్తకు నలతగా ఉన్నందుకు బాధకంటే తన ప్రయాణం గురించి దిగులే ఎక్కువగా ఉంటుంది శశికి. మామూలుగా చాల శ్రద్ధగా భర్తను గమనించుకునే శశి ఇంకా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంటే విషయం అర్థమైంది రాజారావుకు.
నిజం చెప్పాలంటే ఎన్ని జన్మలెత్తినా శశికి భర్త రుణం తీర్చుకోలేనిది. నాలుగైదు సంవత్సరాలుగా తను కాన్సర్ తో బాధపడుతుంటే కంటికి రెప్పలా చూసుకున్నాడు. తన సేవలోనే శక్తినంతా ధారపోశాడు. భార్య ఏమైపోతుందో అనే దిగులుతో సగమైపోయాడు. ఆ టెన్షన్ తో బి.పి , షుగర్ బారిన పడ్డాడు. ఇంకా కృశించి పోయాడు. తాను మామూలు మనిషైన తరువాతనే ఈ మధ్యనే కోలుకుంటున్నాడు.
పక్క సీట్ లో పిల్లవాడి ఏడుపుతో ఈ లోకం లోకి వచ్చింది శశి.
“పాపం తను”. అనుకుంటూ పేలవంగా నవ్వుకుంది.
రైలు దిగుతూనే లలిత భర్త రామారావు లగేజీ అందుకుంటూ “ ఏమ్మా ! బాగున్నారా? ఇరవై నాలుగ్గంటలు మా ఆవిడకు మీ నామస్మరణే. క్షణక్షణం టెన్షను పడుతూ, బి.పి. పెంచుకుంటూ ఉంది. నాకా ఇంకా సెలవు దొరకలేదు. ఇప్పటికి తనకూ, నాకూ కుడా బాగా రిలీఫ్.” అని మనసారా అభినందిస్తూ కారు బయలుదేరతీశాడు.
అనుకున్నట్లుగానే పెళ్లి పనుల్లో లలితకు అన్ని విధాలా కుడిభుజమై మెలిగింది శశి. పైగా స్వతహాగా ఆర్టిస్టు కావడం మూలాన అన్ని సందర్భాల్లో వేదికపై డెకరేషన్ గానీ, భోజనాల దగ్గర రంగురంగుల ముగ్గులు వేయడంగానీ, పెళ్లి వారిని పలకరించడం గానీ అన్నీ తనే చూసుకొన్నది.
ఏమైతేనేం పెళ్ళైన తరువాత పుట్టినింటిలో మూడు రోజులుండి, పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు, హనీమూన్ కు బయలుదేరారు. అత్తవారిల్లు అదే కాబట్టి హనీమూన్ తరువాత వెళ్ళేటట్లు నిశ్చయమైంది. అప్పటికి ఇల్లు కాస్త సర్దుకున్నట్లు అవుతుందనుకున్నారు.
మధ్యాహ్నం భోజనం తర్వాత అంతా టి.వి. చూస్తూ కూర్చున్నారు చాలా రోజుల తరువాత. ఏ న్యూస్ ఛానల్ తిప్పినా ఒకే న్యూస్ కరోన, కరోన.....రకరకాలుగా జాగ్రత్తలు పాటించమని హెచ్చరికలు.
“ ఎక్కడా బయట తిరగకండి, శుభ్రత పాటించండి. అల్లము, పసుపులాంటివి ఆహారములో వాడండి.” అంటూ తెగ ఘోషిస్తున్నాయి.
వార్తలు వింటున్న శశి మనస్సులో కలత, ఏదో దిగులు, తన పై తనకే ఒక ఏహ్య భావము. కరోన వ్యాధి లక్షణాలు వింటుంటే పిల్లలు, వృద్ధులు , కాన్సర్, గుండెజబ్బుతో బాధపడుతున్నవాళ్ళు , ఆ జబ్బులనుండి బయటపడిన వాళ్ళు ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, చెప్తూంటే గుండెదడ వేస్తూంది. తానూ రెండు సంవత్సరాల క్రితం కాన్సర్ పేషెంట్. తనను గూర్చి విపరీతం జాగ్రత్త తీసుకున్న భర్త కూడా ఇటీవల బాగా బలహీనమయ్యారు. తను ట్రీట్మెంట్ లో ఉన్నన్నాళ్ళు , తాను తేరుకునేదాకా కూడా తనను ఒంటరిగా వదలి ఎక్కడికీ పోలేదు పాపం! రకరకాల పండ్లరసాలు, డ్రై ఫ్రూట్స్ మూడుపూటలా మందులు, ప్రతివారం టాక్సీ లో ట్రీట్ మెంట్ కని బెంగుళూరు కి తీసుకుపోవడము ఒకటేమిటి? తను చాలా పొరబాటు చేసింది. రైలు బయలుదేరుతున్నప్పుడు కంటతడి పెట్టిన భర్త దీనవదనం మాటిమాటికీ గుర్తుకురాసాగింది. ఈ కరోన టైం లో హోటలు తిండి తిని, తన ఆరోగ్యం పాడైతే! అనుకునే కొలది శశికి దుఃఖం పొంగుకొస్తోంది. తన భర్తకు బహుశా సిక్స్త్ సెన్స్ పని చేసి ఉండాలి. ప్రయాణం ఒద్దు, ఒద్దు అంటుంటే తను ఎంత మొండి చేసింది?-
ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ముభావంగా ఉండిపోయింది శశి. ఢిల్లీ వచ్చినప్పటి హుషారు ఇప్పుడులేదు. ఏదో ఒక విధంగా భర్తను చేరుకోవాలి తొందరగా అనుకుంటూ రామారావును ట్రైన్ టికెట్ బుక్ చేయమన్నది. పెళ్ళిళ్ళ సీజను ముగుస్తూ ఉండడంతో, వెళ్ళాల్సిన ప్యాసెంజర్లు ముందుగానే బుక్ చేసుకోవడంతో మరల పదిరోజులవరకు టికెట్ దొరకలేదు. రోజుకు నాలుగైదు సార్లు మాట్లాడుతూనే ఉంది రాజారావుతో. ఇలా జరుగుతుందని అనుకొలేదనీ, క్షమించమని ఒకే వేడుకోలు.
లలితకు కూడా చాల బాధగా ఉంది. అయితే తను భయపడుతున్నట్లు, బాధపడుతున్నట్లు బయట పడలేదు.
ఆ రోజు రాత్రి ఇలానే మాట్లాడుతూ ఆలస్యంగా పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక రాజారావు అక్క లక్ష్మి నుండి ఫోన్. రాజారావు అకస్మాత్తుగా గుండెపోటుతో బాధపడుతూంటే ఆస్పత్రిలో చేర్చామనీ, డాక్టర్లు భయపడాల్సిన అవసరం లేదంటున్నారనీ చెప్పింది. వార్త వింటూనే శశి సొమ్మసిల్లి పడిపోయింది. ఆ తర్వాత కుమిలి, కుమిలి ఏడ్చింది.
“రామారావు గారూ! నన్నేలాగైనా గుంటూరు చేర్చండి. పాపాత్మురాలిని. ఎంత శిక్ష విధించావు భగవంతుడా!” బోరుమని ఏడ్చింది. ఒకవైపు అలవి కాని బాధ మరొక వైపు అపరాధ భావన.
లలిత, రామారావు, శశి అష్ట, కష్టాలు పడి రైల్లో సీట్లు సంపాదించి బయలుదేరారు.
ఎప్పటికప్పుడు రాజారావు బాగానే ఉన్నాడని వార్తతో మనసు కొంత తేలికైంది. గుంటూరు చేరడానికి ఇక రెండు గంటలే ఉంది. త్వరలోనే భర్తను చూస్తానని శశి ధీమాగా కళ్ళు మూసుకుంది. ఒక అర్ధగంట గడిచింది. “తమ్ముడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు
శశీ!” అంటూ భోరుమనింది లక్ష్మి. పడుకున్నదల్లా లేచి నిలబడి పిచ్చి దానిలా అటూ ఇటూ పరుగెత్తడం మొదలు పెట్టింది. శశిని ఓదార్చలేక పోతున్నారు లలిత, రామారావు.
ఇంతలో స్పృహ తప్పిపడిపోయింది. మళ్ళీ తేరుకొని గట్టిగా అరవడం మొదలు పెట్టింది. కనీసం కడపటి క్షణాల్లోనైనా దగ్గర లేకపోవడం, కంటి చూపుకు, చివరిమాటకు కూడా తను నోచుకోలేదు. “లలితా! నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?” అంటూ తల బాదుకుంటున్నది.
ఏడ్చి, ఏడ్చి అలసిపోయిన శశి , సుమారు నెల రోజులుగా పెళ్లి హడావుడి, పైగా అనుకోని ఈ దుర్ఘటనతో షాక్ తిన్న లలిత దంపతులు కళ్ళుమూయగానే మగతగా నిద్రపట్టింది. శరీరం అసంకల్పితంగానే విశ్రాంతి కోరుకుంది.
అలా ఎంతసేపైందో! డోర్ దగ్గర పెద్ద కలకలం. ఎవరో ఒకామె తనలో తానే మాట్లాడుకుంటూ, ఏడుస్తూ, ఉన్నట్లుండి రైల్లోనుంది దూకేసిందంటూ అరుపులు వినిపించాయి. బలవంతంగా కళ్ళు తెరిచిన లలితకు ప్రక్కన శశి కనపడలేదు.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
Katha chala bagundi.. Sarada gari rachanaatmak saili bagundi... Manchi katha... Kadanam...
కథ సాగిన తీరు చాలా బాగుంది, ముగింపు చాలా హృద్యంగా ఉంది, మున్ముందు ఇంకా మంచి కథలు రావాలని ఆశిస్తూ, మంచి కథ అందించినందుకు శారద గారికి ధన్యవాదాలు.
కథ చాలా బాగుంది,నడిపించిన విధానం మనసుకు హత్తుకుంది.చివరికి ముగింపు కన్నీళ్ళు తెప్పించింది. శారద గారి కలం నుంచి ముందు ముందు మంచి కథలు రావాలని కోరుకుంటున్నా..
త్రిపుర..
కథ ముగింపు బాగుంది కన్నీళ్లు తెప్పించాయి
మనసును కదిలించే కథ. చివరి చూపుకు, చివరి మాటకు నొచుకోని ఒక భార్య ఇంతకంటే ఏమి ఆలోచించ గలదు అని చదివిన వారి మనసును తడుముతుంది. మంచి కథ ను అందించిన కానాల శారద గారికి అభినందనలు.