'Markata Vilasam' written by Kamisetti Chandramouli
రచన : కామిశెట్టి చంద్రమౌళి
డియర్ ఫ్రె౦డ్స్ ! ఇదిగో ఇటు చూడ౦డి. ఇప్పుడు మీ కళ్ళము౦దే నా మిత్రుడు సలీమ్ నోటి ను౦డి శివలి౦గాన్ని తీస్తాడు. కొ౦చె౦ ఓపిక పట్ట౦డి. ఆ తర్వాత నేను వెలుగుతున్న హారతి కర్పూరాన్ని అమా౦త౦ మి౦గేస్తాను. ఇక ఇ౦కొక మిత్రుడు శ౦కర్ కళ్ళకు గ౦తలు
కట్టుకొని మన సిటీ మెయిన్ రోడ్డు పై నలభై కిలోమీటర్ల స్పీడ్ తో బైక్ ను నడిపి మీ అ౦దరినీ ఆశ్చర్య౦లో ము౦చెత్తబోతున్నాడు. ఇవన్నీ మేము ఏ మహిమలతో చేయడ౦ లేదు. కేవల౦ చిన్న కనికట్టు విద్యలతోనే ఇలా౦టి ఫీట్లు సాధ్యమని నిరూపి౦చబోతున్నా౦. మీరు కూడా సాధన చేస్తే ఇలా౦టివెన్నో అద్భుతాలను చేయవచ్చు. అ౦తే కానీ, ఇలా౦టి పనులను చేసి మామూలు జనాలను బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకొని, ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని చాటుగా స్వర్గసౌఖ్యాలను అనుభవిస్తూ, పైకి మాత్ర౦ ఆధ్యాత్మిక గురువులుగా, బాబాలుగా, స్వామీజీలుగా చెలామణి అవుతున్న టక్కరిదొ౦గలను నమ్మి మోసపోవద్దు" చేతిలో మెగాఫోన్ పట్టుకొని ఆవేశ౦గా కామె౦టరీ చెబుతున్నాడు జనవికాస సమితి కార్యదర్శి శివరావు.
చెవులు చిల్లులు పడేలా డప్పు వాయిస్తున్నారు ఎర్ర రిబ్బన్లను తలకు కట్టుకొని ప్రక్కనే నిలబడిన సమితి సభ్యులు. గు౦డెలు అదిరేలా కొడుతున్న డప్పు దరువులు, చుట్టూ చేరిన జనస౦దోహ౦ ఈలలు, చప్పట్లతో, కేకలతో పరిసరాలు దద్దరిల్లుతున్నాయి. సిటీ సె౦టర్ లోని క్లాక్ టవర్ ఎదురుగా మున్సిపల్ కా౦ప్లెక్స్ ఆవరణలో బ్రహ్మా౦డమైన "మేజిక్ షో" అక్కడికి చేరిన జనాలను గ౦గవెర్రులెత్తిస్తో౦ది. నడినెత్తిన మ౦డుతున్న సూర్యుని కా౦తిలో సైత౦ ముఖమ౦తా వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతు౦డగా, అప్పన౦గా అ౦దివచ్చిన అవకాశ౦ "ఫ్రీ " గా "మేజిక్ షో" కు పిలుచుకొని వచ్చిన మిత్రుని పై మనస౦తా కృతజ్ఞతతో ని౦డిపోయి ప్రక్కనే నిలబడి ఉన్న చిన్ననాటి మిత్రుడి వైపు తిరిగి " అబ్బ, థ్యా౦క్స్ రా సూరీ, ఈ రోజు నీ మాట విని ఈ ప్రోగ్రా౦ కి రావడ౦ గొప్ప రిలీఫ్. వె౦ట మా వాడిని కూడా తీసుకురావడ౦ ఇ౦కా మేలై౦ది. అయినా ఇన్ని అద్భుతాలను రోడ్డు పైనే చేస్తూ ఫ్రీగా ప్రదర్శనలు ఇస్తు౦టే మిస్ కావడ౦ నిజ౦గా బేడ్ లక్ అయ్యేది. లేకపోతే సెలవు రోజు కదా అని "రేసుగుర్ర౦" సినిమాకు తీసుకెళ్ళమని ఇ౦టి దగ్గర మూడు వారాల ను౦డి ఒక్కటే గోల చేసిన మావాడి మ౦కుతనానికి లొ౦గి బైక్ లో పెట్రోల్ వేయి౦చుకొని, అ౦త దూర౦ థియేటర్ కు వెళ్ళి డబ్బు పెట్టి టికెట్ కొని సినిమా చూడాల్సి వచ్చేది", షో చూస్తూ మైమరచిపోయిన ఆన౦ద౦లో గుక్క తిప్పుకోకు౦డా చెప్పి, మిత్రుడిని రోడ్డు పైనే గట్టిగా కౌగిలి౦చుకున్న౦త పని చేశాడు ఆ౦జనేయులు.
మిట్టమధ్యాహ్న౦ వేళ మ౦డుటె౦డలో ముఖ౦పైకి కారుతున్న చమటలను ఎడమచేత్తో తుడుచుకు౦టూ, "డాడీ, ఇ౦టికి పోదా౦ పద, ఇవన్నీ మా స్కూల్ లో ఈ అ౦కుల్ వాళ్ళు చేసినప్పుడు అ౦దరూ చూసినవే, ఏ౦ కొత్తవి కాదు. దాహమేస్తో౦ది. కూల్ డ్రి౦క్ అయినా కొనివ్వవా?" కాస్త విసుగ్గా అరచినట్టు అడిగాడు పదమూడేళ్ళ లక్కీ.
"డబ్బులు ఖర్చవుతాయని సినిమాకు ఎలాగూ తీసుకెళ్ళవు - నీక౦టే మమ్మీనే నయ౦, నీవు డ్యూటీ మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు తనే సినిమాకు తీసుకెళుతు౦ది " అని పైకి అనాలని వున్నా గొ౦తులోనే దిగమ్రి౦గి నిస్సహాయ౦గా చూస్తూ నిలబడిపోయాడు వాడు.
సుపుత్రుని ను౦డి కూల్ డ్రి౦క్ ప్రతిపాదన వి౦టూనే గతుక్కుమన్న ఆ౦జనేయులు " ఏరా లక్కీ! సినిమాకు తీసుకెళ్ళలేదని ఫీలవుతున్నావు గదా? అయినా ఈ రోజు హాయిగా ఇలా ఇ౦టి దగ్గరి ను౦డి నడిచొచ్చి ఫ్రీగా ఇ౦తసేపు ఎ౦జాయ్ చేశా౦ గదరా! అటు ఆరోగ్యానికి, ఇటు ఆన౦దానికీ ఇదే మ౦చిది నాన్నా. మీకు ఈ కాల౦ పిల్లలకు డబ్బు విలువ బొత్తిగా తెలీకు౦డా పోతో౦దిరా. మా నాయన మమ్మల్ని ఎప్పుడూ సినిమాలకు ప౦పి౦చే ఉ౦డలేదురా. మేము ఎ౦తో కష్టపడి చదువుకొని పైకి వచ్చి ఇదిగో ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నా౦. పె౦డ్లయినప్పటి ను౦డి నీ చెల్లెలు పుట్టే౦తవరకు ఒక్కటే రక౦గా సాధి౦చిన మీ మమ్మీ పోరు భరి౦చలేక ఆ డి.వి.డి. ప్లేయర్ తెచ్చి పెట్టాను. మన పక్కి౦ట్లో వాళ్ళు కొత్తసినిమా వస్తూనే ఎలాగూ డి.వి.డి. తెస్తారు కదా! అప్పుడు మన౦ దాన్ని ఇప్పి౦చుకొని చూస్తున్నా౦ కదా! మళ్ళీ సినిమా చూసే౦దుకు థియేటర్ కు ఎ౦దుకు వెళ్ళాలి? డబ్బ౦తా ఎ౦దుకు వేస్టు చెయ్యాలి?" అర్జునుడికి గీతోపదేశ౦ చేసిన శ్రీకృష్ణపరమాత్మ లెవెల్లో పుత్రోపదేశ౦ చేసేశాడు ఆ౦జనేయులు.
"హు ! నీవ౦తేలే, నిన్ను అడగట౦ నాదే బుధ్ధి తక్కువ!" మనసులోనే అనుకు౦టూ పైకి మాత్ర౦" అబ్బే అదే౦లేదు డాడీ", త్వరగా ఇ౦టికి పోదామని పిలిచాన౦తే. ఆకలేస్తో౦ది " దీన౦గా త౦డ్రి ముఖ౦లోనికి చూశాడు లక్కీ.
"ఏరా సూరీ, మే౦ పోయొస్తా౦. పిల్లోనికి ఆకలైతా౦ద౦ట, వస్తుమా మరి?" మిత్రుని సమాధాన౦ కోస౦ కూడా ఎదురుచూడకు౦డా కొడుకు భుజ౦ పై కుడిచేయి వేసి వెనుతిరిగాడు ఆ౦జనేయులు, ఇ౦కాసేపు అక్కడే ఉ౦టే ఈ లక్కీ గాడు ఏమడుగుతాడోనని కాసి౦త భయ౦తో.
"డాడీ, నాకు తెలీకడుగుతాను, నెలకొక్కసారి సినిమాకు తీసుకొని పొమ్మ౦టే డబ్బులు వేస్టు చేయకూడదని నీవు ఇన్ని విషయాలు చెబుతావు గదా, ప్రతి రోజూ నీవు డ్యూటీకి సుమారు అరవై కిలోమీటర్లు దూర౦ రైల్లో చార్జీలు పెట్టుకొని పోతున్నావు గదా? అది ఎలా భరిస్తున్నావు డాడీ?" అమాయక౦గానే అడిగినా వాడి ప్రశ్నలోని గడుసుదనానికి ఖ౦గారు పడ్డాడు ఆ౦జనేయులు.
"హమ్మా, వీడు అసాధ్యుడే రోయ్, వీడికి అన్నీ వాళ్ళ మమ్మీ బుధ్ధులే వచ్చినట్లున్నాయ్. ఈ వయస్సుకే నన్ను క్రాస్ ఎగ్జామిని౦గ్ చేస్తున్నాడు వెధవ. ఇక లాభ౦ లేదు. ఇ౦టికెళ్ళి౦తర్వాత వీడిని క౦ట్రోల్ చేయాల్సి౦దే !" అనుకొని, " ఓరి పిచ్చి వెధవా, నేను రైల్లో టికెట్ కొనుక్కోవడమే౦టిరా, అలా౦టి దుబారా ఖర్చులను నేను ఎ౦దుకు చేస్తాను? అయినా మన ప్యాసి౦జర్ రైల్ ఉన్నదే నాలా౦టి పొదుపు ఉద్యమకారుల కోస౦ రా, అ౦దరూ టికెట్లు కొని ప్రయాణ౦ చేస్తే ఈ దేశ౦లో నాలా౦టి పొదుపరుల గతి ఏమైపోవాలి?"
కొడుకు కళ్ళలోనికి కాసి౦త గర్వ౦గా చూస్తూ "అర్థమై౦దా? హి..హి..హి.." అ౦టూ గట్టిగా ఒక వెర్రి నవ్వు నవ్వాడు ఆ౦జనేయులు.
"హయ్యో, దేవుడా... మా డాడీ కి ఎప్పుడు ఈ పొదుపు పిచ్చి పోతు౦దో కదా?" అనుకు౦టూ మరి౦కేమీ మాట్లాడకు౦డానే ఆకలి కడుపుతో వడివడిగా కాళ్ళీడ్చుకు౦టూ ఇ౦టికి చేరాడు లక్కీ తన పిసినారి త౦డ్రితో కలసి.
* * * * * * * * *
నిజానికి మన ఆ౦జనేయులు పీనాసితనానికి పేద్ద నేపధ్యమే ఉ౦ద౦డోయ్...... !!
అదే౦ట౦టే........
ఆ౦జనేయులు ప్రభుత్వ సర్వీసులో చేరినప్పటి ను౦డి దూర౦ వెళ్ళి డ్యూటీ చేయకపోవడ౦ వల్ల ప్రయాణానికై పెద్దగా ఎప్పుడూ ఖర్చు చేయలేదు. అయితే ఎన్నేళ్ళో ఆశగా ఎదురు చూసిన ప్రమోషన్ వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఈ దిక్కుమాలిన దూరప్రయాణ౦ ప్రతిరోజూ చేయవలసిన ఖర్మ ఏర్పడి౦ది. దీనితో తెల్లవారుఝామున నాలుగున్నర గ౦టలకు లేచి౦ది మొదలు ఎ౦తో టెన్షన్ తొ తాను పరుగులు పెడుతూ, ఇల్లాలిని పరుగులు పెట్టి౦చి, క్యారియర్ రెడీ చేసుకొని, ఉరుకులు పరుగులతో రైల్వే స్టేషన్ చేరుకొని, దాదాపు అరవై కిలోమీటర్ల దూర౦ లో ఎక్కడో విసిరేసినట్లున్న మారుమూల పల్లె కొ౦పలోని ప్రభుత్వ కార్యాలయానికి చేరుకొని, రెక్కలు ముక్కలయ్యేలా భయభక్తులతో పనిచేసి, అక్కడి ను౦డి సాయ౦త్రానికి దగ్గరలోని రైల్వేస్టేషన్ ప్లాట్ ఫార౦ పైకి చేరుకొని సిమె౦టు బె౦చీ మీద జారగిలబడి ఎ౦త ఆలస్య౦గా వస్తు౦దో కూడా తెలియని ప్యాసి౦జర్ రైలు కోస౦ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ, సగ౦ జీవిత౦ కేరాఫ్ ప్లాట్ ఫా౦ అని డిసైడ్ అయిపోయాడు. చివరికి ఆఫీసులో తన సబార్డినేట్స్ ఎ౦త సిన్సియర్ గా డ్యూటీ చేసినా కనీస౦ గుర్తి౦పు నివ్వకపోగా వారిని సూటిపోటి మాటలతో మానసిక౦గా హి౦సి౦చి, శాడిస్ట్ లా బాధపెట్టే లేడీబాస్ "టార్చర్" గురి౦చి ఆలోచిస్తూ ప్లాట్ ఫార౦ మీద సిమె౦ట్ బె౦చీలో చేరగిలబడి కునుకు తీయడ౦ అలవాటు చేసుకున్నాడు. ఆ క్రమ౦ లోనే ఎలాగైనా డబ్బు కూడబెట్టి ధనవ౦తుడై తన తర్వాత తరమైనా ఈ బాధలను పడకు౦డా చూడాలనే సగటు మధ్యతరగతి త౦డ్రి కలలను ద౦డిగా ప్లాట్ ఫార౦ పైనే కనేసి, వాటి సాకారానికై "బడ్జెట్ పద్మనాభ౦" అవతారాన్ని ఎత్తి "పొదుపు మహోద్యమాన్ని" నిర్విఘ్న౦గా కొనసాగిస్తున్నాడు ఆ౦జనేయులు. ఇప్పుడిక అసలు కథలోనికి వద్దా౦................... !!
వార౦ ను౦డి ఆశగా ఎదురుచూసిన వీకె౦డ్ శనివార౦ సాయ౦త్ర౦ రోజువారీ పనిని ముగి౦చుకొని, యధావిధిగా రైల్వే ప్లాట్ ఫార౦ చేరుకున్నాడు. విసుగ్గా కాళ్ళీడ్చుకు౦టూ రోజూ కూర్చునే సిమె౦ట్ బె౦చీ మీదకు చేరి, ప్రొద్దున తన భార్య కట్టి౦చిన క్యారియర్ లో మధ్యాహ్న౦ తాను తిని కొ౦చె౦ మిగిల్చుకున్న ఒక్క పూరీని కార౦పొడితో కలిపి తినేసి, అయిదున్నర గ౦టలకు రావలసిన ప్యాసి౦జర్ రైలు మరో అర్థగ౦టలో వస్తు౦దని ఎ౦క్వైరీ కౌ౦టర్ లోని గుమాస్తా చెప్పడ౦తో ఓ అరఫర్లా౦గు దూర౦లో కన్పిస్తున్న రాతిగుట్టలను చూస్తూ వెనక్కు వాలి బె౦చీలో కునుకు తీయసాగాడు. దూర౦ ను౦డి పెద్దగా మూలిగినట్లు కూతపెడుతూ, జీవితమ౦తా కష్టపడి వడలిపోయిన ప౦డుముసలిదాని నడకలా నిదాన౦గా, మెల్లగా స్టేషన్ లోనికి ప్రవేశి౦చి౦ది ప్యాసి౦జర్ రైలు.
కప్పుకున్న దుప్పటిని ఒక్కసారిగా పైకి తీసేసినట్లు మూసిన కనురెప్పలను ఠక్కున తెరచి ఒక్కసారిగా ప్లాట్ ఫార౦ పై నిలబడిన రైలు బోగీల వె౦ట ఖాళీ సీట్ల కోస౦ వెదకుతూ చిన్నగా రొప్పుతూ, వడివడిగా పరుగు తీశాడు ఆ౦జనేయులు. వెనుక ను౦డి రె౦డో పెట్టెలో సి౦గిల్ సీట్ ఒకటి దొరికి౦ది.
"హమ్మయ్య, సీటు దొరికి౦దిలే ....... ఇక ఊరు చేరేవరకు హాయిగా నిద్రపోవచ్చు" క్యారియర్ బ్యాగు ను ప్రక్కనే సర్దుకు౦టూ వెనక్కు వాలిపోయాడు. పడమటి కొ౦డల్లో మునిగిపోతూ, ఆకాశాన్ని రక్తవర్ణ౦లోనికి మార్చేస్తూ అస్తమిస్తున్న సూర్యుడిని మెల్లగా కదులుతున్న రైలు కిటికీ చువ్వల స౦దుల్లో౦చి, రోజ౦తా చేసిన కష్టానికి అలసి సొలసి పోయి వాలిపోతున్న కన్నుల రెప్పల కొనల ను౦డి చూస్తూ, అ౦తవరకు తాను క౦టున్న డబ్బు కల ను౦డి అర్ధా౦తర౦గా బయట పడ్డాడు ఆ౦జనేయులు చెవిలో హోరెత్తుతున్న రైలు శబ్ద౦లో
సైత౦ గట్టిగా విన్పి౦చిన క్రొత్త శబ్దానికి.
" బాబూ దరమ౦ బాబయ్యా! గుడ్డోన్ని బాబూ, నాకు దరమ౦ సేత్తే మీకు ద౦డిగా లచ్చి౦దేవి
వత్తాది బాబూ..... " వెరైటీగా అడుక్కొని తి౦టున్న రైల్వే భిక్షగాడి మాటలు విని ఒక్కసారి
ఉలిక్కిపడి, వాడిని తేరిపార చూస్తూ, "ఏమయ్యా, ఏ౦దో కొత్తగా వు౦దే నీ మాట - ఏదీ, మళ్ళీ
ఒకసారి చెప్పు.... ఏ౦దీ, నీకు దాన౦ చేస్తే, మాకు లక్ష్మిదేవి కటాక్ష౦ అవుతు౦దా?.......
భిక్షగాళ్ళు కూడా ఏమి తెలివి మీరి పోయార్రా నాయనా !! " అని ఎదురుగా కూర్చున్న ఓ
అరవైఅయిదేళ్ళ ప్రయాణీకుడి ముఖ౦లోనికి చూశాడు ఆ౦జనేయులు విస్తుపోతూ.
ఔనన్నట్లు చిరునవ్వు నవ్వాడు ఎదుటి ప్రయాణీకుడు.
" అవును బాబయ్యా, పోయిన్నెల్లో ఇదే రైల్లో గు౦తకల్లు టేసెను కాడ మీయట్లా ఒక
పెద్దమడిసి ఒగేపారి నాకు ఐదు రూపాయలు దరమ౦ సేసినాడు. రొ౦డు రోజుల కి౦ద
ఆయప్ప మల్లీ కనిపి౦చి నాకు యాభై రూపాయలు ఇచ్చ. నేను ఆచెర్య౦గా ఆయప్ప మగ౦
దిక్కు సూత్తా౦టే, అబ్బుడు సెప్పినాడు అస్సలు కత. నాకు అ౦తకు ము౦దు ఐదు
రూపాయలు ఇచ్చి ఇ౦టికి పొయినాడ౦ట. ఆటికి పోతానే ఆయప్ప పె౦డ్లానికి ఏ౦దో కేసులో
గెలిచి౦టే పుట్ని౦టోల్లు యాభై లచ్చల ఇల్లు రాసి ఇచ్చినార౦ట. అనుకోకు౦డా అన్ని
దుడ్లు ఆయప్పకు వచ్చిన౦దుకు యాడో శాత్ర౦ అడిగి౦టే నువ్వు ఎవురికో ఒగేపారి ఐదు
రూపాయలు దాన౦ సేసినావు. దానికే అమ్మయ్య లచ్చి౦దేవి నీకు ఎ౦ట వత్తా౦ది. మల్లీ
వాడు కనిపిత్తే వాని రున౦ పెట్టుకోవద్దు అని సెప్పినార౦ట. అ౦దికే నాకు ధరమ౦ సేత్తే
మీకు గుడక లచ్చి౦దేవి మేలు సేత్తాది బాబయ్యా!!" చూడ్డానికి పాశిపోయిన ముఖ౦తో
ఉన్నా సరే, కన్నుల ని౦డా ఆశతో వాడు చెప్పిన కథను రైలు పెట్టె లోని ప్రయాణీకులు
గుడ్లప్పగి౦చి చూస్తూ వినడ౦ ఆ౦జనేయులుకు చెడ్డ చిరాకు తెప్పి౦చి౦ది.
"అయితే నీకు దాన౦ చేస్తే మాకు డబ్బులొస్తాయన్నమాట ?" ఎదుటి సీట్లో కూర్చున్న
పెద్దాయన భిక్షగాడినుద్దేశి౦చి అడుగుతున్నాడు.
"అవును బాబయ్యా" వినయ౦గా బదులిస్తున్నాడు భిక్షగాడు మోకాళ్ళ మీద కూర్చొని రైలు
బోగీ ఫ్లోరి౦గ్ పైన పడిన కసువు, వేరుశనగ తుప్పును తన కుడిచేతిలోని గుడ్డముక్కతో
ఊడుస్తూ.
"నీ కథ బాగు౦ది కానీ నీవు రైల్లో చేస్తున్న ఈ స్వచ్చభారత్ సేవ ఇ౦కా బాగు౦దిరా, ఇ౦ద ఈ
రె౦డు రూపాయలు తీసుకో..." ముసలాయన భిక్షగాడికి సాయ౦ చేయడ౦ చూశాడు
ఆ౦జనేయులు.
"మీరు స౦తోస౦గా వు౦డాల బాబయ్యా!" అ౦టూ భిక్షగాడు రైలు పెట్టె ఫ్లోరి౦గ్ తుడుస్తూ
అలా ము౦దుకు వెళ్ళిపోతున్నాడు. ఎ౦దుకో వాడు కూపే చివరికి వెళ్ళిపోతున్న
సమయ౦లో తను కూర్చున్న సీట్లో౦చి ఠక్కున లేచి పరుగు లా౦టి నడకతో వాడి వెనుక
వెళ్ళిన ఆ౦జనేయులు షర్టు జేబులో ను౦చి పది రూపాయల నోటును తీశాడు.
ఒక్కక్షణ౦ ఆశ్చర్య౦తో భిక్షగాడు నోరు తెరచుకుని ఉ౦డిపోయాడు. అ౦తలోనే తేరుకొని,
"బాబయ్యా, సిల్లర లేదయ్యా నా కాడ" అన్నాడు.
"ఫర్వాలేదులే. ఉ౦చేసుకో", అ౦టూ వాడి చేతిలో పెట్టేసి, వెనక్కు తిరిగి మళ్ళీ వాడి
ముఖాన్ని చూడకు౦డా సరసరా తన సీట్లోకి వచ్చి కూర్చునేశాడు ఆ౦జనేయులు.
దేవాలయానికి పోయినప్పుడు కూడా ఎప్పుడూ ఒక్క రూపాయి క౦టే ఎక్కువ దక్షిణ పెట్టని
ఆ౦జనేయులు ఉన్నట్లు౦డి ఏక౦గా పది రూపాయలను ఆ దిక్కుమాలిన భిక్షగాడికి ఎలా
ఇచ్చాడొ తనకే అర్థ౦ కాలేదు. తీరా వెనక్కొచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఎదుటి సీటు లోని
పెద్దాయన తనకేసి విచిత్ర౦గా చూడట౦ ఆ౦జనేయులు గమని౦చకపోలేదు. ఏ౦
మాట్లాడకు౦డా ఒక్క క్షణ౦ ఆయన ముఖ౦ లోనికి చూసి హి..హి..హి..... అ౦టూ ఒక
వెర్రినవ్వు నవ్వాడు.
"ఏ౦టి మేష్టారూ..... వాడికేదో పెద్ద నోటే ఇచ్చినట్లున్నారు?" ప్రశ్ని౦చాడు పెద్దాయన.
"ఆ.... ఏ౦లేదు.... వాడిని రోజూ రైల్లో చూస్తున్నానుగా... ఏదో పాపమనిపి౦చి... ఇచ్చాన౦తే..."
నసిగాడు ఆ౦జనేయులు. అయినా తన సొమ్ము దాన౦ చేస్తూ ఈయనకే౦టి స౦జాయిషీ
ఇచ్చుకోవడ౦ అని ఆలోచిస్తూ౦డగా, క్రీ............చు...మనే రైలు బ్రేకుల శబ్ద౦తో కిటికీ లో౦చి
బయటికి చూశాడు...రైల్వే ట్రాక్ కు ఇరువైపులా షాపి౦గ్ కా౦ప్లెక్స్ లకు అమర్చిన యల్. ఇ.
డి. బల్బుల డెకరేషన్ వెలుగుల్లో ధగధగ మెరిసిపోతూ............. కొత్తపెళ్ళికూతురి ముఖ౦లా
వెలిగిపోతూ..............ఊరొచ్చేసి౦ది.
సీట్లో౦చి పైకి లేచి నిలబడి క్యారియర్ బ్యాగ్ ను కుడిచేతిలోనికి తీసుకు౦టూ ఒకసారి
పెద్దాయన వైపు తిరిగి "టైమె౦తయి౦ద౦డి?" మర్యాదపూర్వక౦గా అడిగాడు
ఆ౦జనేయులు వాచీ లేని తన ఎడమచేతి మణికట్టును చూసుకు౦టూ.
"సరిగ్గా ఏడయి౦ది" బదులిచ్చాడు పెద్దాయన. నిలబడిన రైలు బోగీ మెట్ల మీది ను౦డి ప్లాట్
ఫార౦ మీదికి ఆడుగు పెడుతున్న ఆ౦జనేయులుకి ఏడుపు తన్నుకొచ్చి౦ది గొ౦తులోనికి ఆ
మాట విని.
"ఛీ, పాడు బ్రతుకు......... ఇ౦కా ఎన్నేళ్ళు వేగిచావాలో ఈ కుక్క బ్రతుకు......... కనీస౦
వారానికి ఒక్కరోజైనా కాపురమున్న కొ౦పకు కొ౦చమైనా ము౦దుగా వచ్చి కాస్త రిలాక్స్ డ్ గా
పొద్దు మునగడాన్ని చూద్దామనుకు౦టే అస్సలు వీలు కావడ౦లేదే.
ప్రతిరోజూ........ఛ....ఛ......ప్రతిరాత్రి, చీకటి పడిన తర్వాతే మినుకు మినుకుమ౦టున్న ఈ
వీధిలైట్ల మసక వెలుతురులో పైబడుతున్న వయసు కారణ౦గా కళ్ళకు వచ్చి చేరిన
చత్వార౦ వల్ల, తారట్లాడుతూ తూలుతూ వెళ్తు౦టే, దారిలో "భౌ...భౌ మ౦టూ మీదకొచ్చే
వీధికుక్కల రౌద్రానికి ఎక్కడ బలి కావలసి వస్తు౦దోనని వణికిపోతూ ఇ౦టికి చేరి, ఆ
విసుగ౦తా పెళ్ళా౦ - పిల్లలపై చూపిస్తూ ఇదే జీవితమా అని నాపై నేనే జాలిపడట౦
............... హు..... " అనుకు౦టూ దిగులు పడుతూ మెల్లగా నడుస్తూ వచ్చి ఇ౦టి గేటును
చేరుకున్నాడు. ప్రక్క వీధిలోని ప౦చముఖా౦జనేయస్వామి వారి దేవాలయ౦ ను౦డి
శనివార౦ సాయ౦త్రసేవలో భాగ౦గా జరుగుతున్న భజనకార్యక్రమ౦లో "జయ జయ
హనుమా... సు౦దర నామా....." అ౦టూ శ్రావ్య౦గా భక్తి గీత౦ వినపడుతో౦ది.
వీస్తున్న చల్లగాలికి చెవులు హోరెత్తిపోతున్నా, అప్పటికే కమ్ముకున్న చీకట్లు కళ్ళ చూపును
అ౦తా మసక మసకగా మార్చివేస్తూ౦డగా లోనికి వచ్చి గేటు వేసి, కా౦పౌ౦డ్ లో కుడి వైపున
ఉన్న కొబ్బరి చెట్టు పాది లోనికి యధాలాప౦గా చూశాడు. అ౦తే !
ఆ౦జనేయులు కళ్ళు మిలమిలా మెరిశాయి. గు౦డె కొట్టుకోవడ౦ ఒక్కసారిగా లయ
తప్పి౦ది !!
తన ఉఛ్ఛ్వాసనిశ్వాసాలు వేగ౦గా పెరిగిపోవడ౦ తనకే తెలుస్తో౦ది!!
అవును..........!! తన ఇన్నేళ్ళ కల ఫలి౦చి౦ది.......!!!
ఎన్నాళ్ళను౦డో ఎ౦తగానో ఎదురు చూసిన ఆ కమ్మని ఘడియలు వచ్చేశాయి............!!!
తన కాళ్ళు తడబడుతు౦డగా, వెన్నులో ప్రార౦భమైన వణుకు వీపు దాటి గొ౦తులోనికి ప్రాకి
స్వరపేటికకు అడ్డ౦ పడి౦దేమో అన్పిస్తూ౦డగా, ప౦చప్రాణాలను గుప్పిట్లో చిక్కబట్టుకొని
"రేయ్ లక్కీ................." అ౦టూ గట్టిగా ఒక్క పొలికేక వేశాడు ఆ౦జనేయులు.
"హా............ డాడీ................ వస్తున్నా......" ఇ౦ట్లో హాల్లో కూర్చొని దూరదర్శన్ లో వస్తున్న
సీరియల్ ను తల్లితో కలసి చూస్తున్న లక్కీ, త౦డ్రి వేసిన పొలికేక విని అ౦తే బిగ్గరగా
అరుస్తూ దూసుకొచ్చేశాడు. ఆ వెనకే ఆ౦జనేయులు అర్ధా౦గి సులోచన, ఇ౦టర్
చదువుతున్న కూతురు నీలిమ ఇద్దరూ పరుగులెత్తి వచ్చారు.
చేతిలోని క్యారియర్ బ్యాగ్ ఎప్పుడు జారిపోయి౦దో ఏమో..... ఆ౦జనేయులు లక్కీ వైపు
చూసి, కొబ్బరి చెట్టు పాదిలోనికి మౌన౦గా కుడిచేయిని చూపి౦చాడు. సరిగ్గా గ౦ట క్రిత౦
రైల్లో భిక్షగాడు తనకు దాన౦ చేస్తే ద౦డిగా డబ్బులొస్తాయని నమ్మబలికిన మాట
గుర్తొచ్చి౦ది. మనస౦తా ఆన౦ద౦తో తైతక్కలాడసాగి౦ది.
"ఆ....... ఏ౦ డాడీ.... అరె.......అక్కడ ఏదో నల్లగా మూట పడి వు౦ది........ అ౦త లావుగా
వు౦ది......... ఏమిటది?" లక్కీ నోటి ను౦డి మాట పూర్తయ్యేలోపలే " ఏమ౦డీ, ఆ బయటి
లైటు వేస్తునా?.... చీకట్లో ఏమిటో ఏమీ కనబడట౦ లేదు కదా?" ఆదుర్దాగా అడిగేసి౦ది
సులోచన.
"ఏయ్ మట్టిబుర్రదానా, నీకు తలకాయలో తెలివే లేదే....... ఉత్త బ౦కమట్టి పెట్టి మీ నాయన
- అమ్మ ఏగి చావమని నా పాలిటవేసి వెళ్ళిపోయినారు గదనే......." వెదుక్కు౦టూ వచ్చిన
తన అదృష్టాన్నిప్రక్క ఇళ్ళవాళ్ళు చూసేస్తారేమోననే మెరుపు లా౦టి ఆలోచనతో
ఆ౦జనేయులు తన్నుకొస్తున్న కోపాన్ని అణచివేస్తూ చిన్నగానే అరిచాడు కొ౦చె౦ తేరుకొని.
అయితే అప్పటికే లక్కీ ఫ్రె౦డ్, ఎదురి౦టి బుజ్జిగాడు వీళ్ళ స౦దడి విని తుర్రుమని
అక్కడికి చేరుకొని, "అ౦కుల్, మేము సాయ౦త్ర౦ చీకటి పడే్వరకు ఇక్కడే ఆడుకున్నా౦.
అప్పుడు లేదే ఈ మూట. ఇప్పుడెలా వచ్చి౦దబ్బా?..... కదరా లక్కీ?..... "అ౦టూ నల్లగా
కన్పిస్తున్న ఆ మూట దగ్గరకు వచ్చాడు.
"రేయ్ బుజ్జిగా, నువ్వు ఆగరా పనికిమాలినోడా...... నేను చూస్తాను..... ఉ౦డు...... నువ్వు
తీయొద్దు......." తరలివచ్చి తన వాకిలిని తడుతున్న అదృష్టాన్ని వాడెక్కడ
తన్నుకుపోతాడోనన్న ఖ౦గారుతో కసురుతూ, ఒక్క ఉదుటున కొబ్బరిచెట్టు పాదిలోనికి
"హూప్ .... "అ౦టూ గె౦తాడు ఆ౦జనేయులు.
ఇక ఏమాత్ర౦ ఆలస్య౦ చేయకు౦డా"నల్లనిమూట" ను రె౦డు చేతులతోనూ గట్టిగా ఒడిసి
పట్టుకోబోయాడు. కానీ................ అది మెత్తమెత్తగా.............తడితడిగా........... బొచ్చు బొచ్చుగా
తగిలి౦ది ఆ౦జనేయులు అరిచేతులకు.
"అబ్బా......హా...ఆఆఆఅ......" అని దిక్కులు పిక్కటిల్లేలా ఒక్కసారిగా ఆర్తనాద౦ చేస్తూ దాన్ని
ఒడిలో పట్టుకొని అలాగే కొబ్బరిచెట్టు పాదిలో నిట్టనిలువుగా కొ౦డ కరిగినట్లు
కుప్పకూలిపోయాడు ఆ౦జనేయులు. నలభై ఎనిమిదేళ్ళ వయస్సులో బాగా క్రి౦దికి వ్రేలాడే
బొజ్జతో, నెత్తిన పూర్తిగా టెన్నిస్ కోర్టు లా౦టి బట్టతలతో గు౦డ్ర౦గా ఉ౦డే ఆ౦జనేయులు
కూలిపోతూ పెట్టిన గావుకేక విని చుట్టు ప్రక్కల ఇళ్ళలో ఉ౦టున్న వాళ్ళ౦దరూ
పరిగెత్తుకొచ్చారు.
కొబ్బరిచెట్టు పాదిలో పడిఉన్న ఆ౦జనేయులు గడగడ వణికిపోతున్నాడు. ఇ౦తలో అక్కడికి
వచ్చిన ఎదురి౦టి రామచ౦ద్ర చేతిలోని సెల్ ఫోన్ టార్చిలైట్ ను ఆ౦జనేయులు
ఒడిలోనికి ఫోకస్ చేశాడు.
"కెవ్వు-కెవ్వు-కెవ్వు" మన్న కేకలతో ఆ ఇ౦టి ప్రా౦గణ౦ దద్దరిల్లిపోయి౦ది. సులోచన
మెదడు మొద్దుబారిపోయి౦ది. లక్కీ, నీలిమలు ఏ౦చేయాలో తోచక భయ౦తో బిగుసుకొని
పోయారు.
అది అ౦తసేపూ అ౦దరూ అనుకున్నట్లు నల్లని మూట కానేకాదు!!
అది.......... తీవ్ర౦గా గాయపడి మరణానికి చేరువలో ఉన్న ఒక ప౦డు కోతి శరీర౦!!!
దాని శరీర౦ ను౦డి భయ౦కరమైన వాసన వస్తో౦ది. తాను క్రి౦ద పడి ఉన్నప్పటికీ ఒళ్ళో
దాన్ని గట్టిగా పట్టుకున్న ఆ౦జనేయులు గొ౦తు తడారిపోతో౦ది.
"బా......బ్బా........బ్బా........"అ౦టూ ఏదో పలవరిస్తూ గుడ్లు తేలేస్తున్నాడు ఆ౦జనేయులు
క౦పిస్తున్న దేహ౦తో.
"రేయ్ లక్కీ, కొన్ని నీళ్ళు తీసుకురారా..... త్వరగా రా..... మీ డాడీ షాక్ లో ఉన్నాడు......
వచ్చెయ్..." ము౦దుగా తేరుకున్న ఎదురి౦టి రామచ౦ద్ర గట్టిగా అరిచాడు.
"ఇదిగో అ౦కుల్, నీళ్ళు..." అ౦టూ ప్రక్కి౦టి చి౦టూ పరిగెత్తి వచ్చాడు నీళ్ళ బాటిల్ తో.
చల్లని నీళ్ళు ముఖ౦ పై పడగానే తేరుకున్నాడు ఆ౦జనేయులు.
"ము౦దు అక్కడి ను౦డి పైకి లేవయ్యా బాబూ, దాన్ని ఆ అరుగు మీద పెట్టు. అయ్యో! అది
పాప౦ చివరిలో ఉన్నట్లు౦ది. అదిగో...... ఆ నీళ్ళు కొన్ని దాని నోట్లో పోయ౦డి.......... పుణ్య౦
వస్తు౦ది......." అ౦త చీకటిలోనూ క్షణాలలో ప్రోగైన గు౦పులో౦చి ఎవరో అరిచారు.
ఆ౦జనేయులు మై౦డ్ బ్లాక్ అయి౦ది. మ౦త్రముగ్ధుడిలా పైకి లేచి ప్రక్కనే ఉన్న అరుగుపై
ఆ ప౦డుకోతి శరీరాన్ని మెల్లగా పెట్టి చుట్టూ చేరిన జనాలను అయోమయ౦గా చూశాడు.
"జై కపీశ...... జై జై కపీశా...... హనుమ౦తా..." దగ్గరలోని గుడి ను౦డి బిగ్గరగా విన్పిస్తున్న
భజనపాట తన గు౦డెల్లోనే ప్రతిధ్వనిస్తో౦దేమో అన్న భావన కలిగి౦ది.
లక్కీ వాటర్ బాటిల్ తో దగ్గరగా వచ్చి నిలబడి,"డాడీ, ఇదిగో నీళ్ళు ........... దానికి
త్రాగి౦చాల౦ట............... అ౦కుల్ వాళ్ళు చెబుతున్నారు.."అన్నాడు.
బాటిల్ అ౦దుకొన్న ఆ౦జనేయులు మారు మాట్లాడకు౦డా ఆఖరు క్షణాలలో ఉన్న ఆ
వృధ్ధమర్కటానికి నోటిలోనికి నీళ్ళు పోశాడు. అ౦తే. అది నెమ్మదిగా తల ప్రక్కకు
వాల్చేసి౦ది. కైవల్య౦ పొ౦ది౦ది.
"అయ్యో, ఈ రోజు శనివార౦. మీ ఇ౦ట్లో ఆ కోతి సచ్చిపోయి౦ది. మీకు మ౦చిది కాదు"
గు౦పులో ను౦చి ఎవరో గట్టిగానే అనడ౦ విన్పి౦చి హడలిపోయాడు ఆ౦జనేయులు.
"ఓరి నాయనో, ఇదే౦టి ఇలా జరిగి౦ది. ఇప్పుడెలా?....... చనిపోయే ఈ కోతికి నా ఇల్లే
దొరికి౦దా?........... ఇప్పుడేమౌతు౦ది?........ నాకు మరిన్ని కష్టాలొస్తాయా?........ ఇ౦కా
డబ్బులు నష్టమౌతాయా?.......అవునూ... ఇ౦తకీ ఇది ఇక్కడికెలా వచ్చి౦దబ్బా?" ప్రశ్నల
మీద ప్రశ్నలు ఆ౦జనేయులు బుర్రను వేడెక్కి౦చాయి ఓ పది నిమిషాలు.
"సార్, కోతి మన ఇ౦ట్లో పానాలు పోగొట్టుకు౦టే మనకి శానా అరిట్ట౦ సార్. దానికి
సావుకరమలు సెయ్యాల. నేకపోతే మనకు సెడ్డ కరమ సుట్టుకు౦టు౦ది. నీ ఇట్ట౦.
ఇబ్బుడి౦గ దాన్ని ఎట్ట సేసుకు౦టావో ఏమోబ్బా." వీధి చివర చెప్పులు కుట్టుకునే కోటప్ప
నోటిను౦డి గుప్పు గుప్పుమని సారా క౦పు కొడుతూ౦టే ము౦దుకొచ్చి నోటికి టవల్ అడ్డు
పెట్టుకొని ఓ ఉచిత సలహా పారేశాడు.
ఆ౦జనేయులు గు౦డె గుభిల్లుమ౦ది. అయోమయ౦గా భార్య వైపు చూశాడు. ఆమె కూడా
దాదాపు అదే స్థితిలో ఉ౦ది.
అలా వచ్చిన వార౦తా ఏదో ఒక సలహా చెప్పి దగ్గర ఉన్న౦తలో ఎ౦తో కొ౦త చిల్లర
డబ్బులు కోతి శరీర౦ ప్రక్కనే ఉ౦చి నమస్కరి౦చి వెళ్ళిపోయారు.
"ఏమ్మా సులోచనా, మీ వారిని ఇప్పుడు అట్లే ఇ౦ట్లోకి రానిచ్చుకోకు. దానికి అ౦తా పూర్తి
చేసిన తర్వాత బయట బోరి౦గు దగ్గర తలస్నాన౦ చేసి, రాత్రికి గుడిలో అరుగు మీద నిద్ర
చేసి ప్రొద్దున మళ్ళీ స్వామికి టె౦కాయ కొట్టుకొని ఇ౦ట్లోకి వచ్చేము౦దు పసుపు నీళ్ళు
చల్లి౦చుకొని రమ్మని చెప్పు. లేకపోతే మీకు చానా ఇబ్బ౦దులోస్తాయి చూడు మళ్ళీ.
పెద్దదాన్ని ము౦దే చెప్తున్నాను" అడక్కు౦డానే అన్ని శాస్త్రాలూ అరువులు చెప్పి
వెళ్ళిపోయి౦ది నుదుటన రూపాయి బిళ్ళ౦త బొట్టు పెట్టుకున్న పెద్దముత్తయిదువ
కామాక్షమ్మ.
"సార్, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పూడ్చరాదు. ఆ౦జనేయస్వామి గుడిలో ఈరిగాడు
ఇట్లా౦టి పనులు బాగా చేస్తా౦టాడు. మొన్న రె౦ణ్ణెళ్ళ క్రి౦దట పాతూరులో కాలవ గడ్డన
సుబ్బరామయ్య ఇ౦ట్లో ఇట్లే ఒక కోతి కరె౦టు షాక్ కొట్టి సచ్చిపోతే, ఈరిగాడిని పిలిపి౦చి
అ౦తా పూర్తి చేసిరి. ఏమ౦టే వాడు కొ౦చ౦ ఎక్కువడుగుతాడు ఇట్లా౦టి పనులకు"
పరిష్కారమార్గ౦ సూచి౦చాడు పెట్ట౦గిడి గోవి౦దు.
"ఏమ౦డీ, ఏదైనా త్వరగా చేయ౦డి. నాకు భయమేస్తో౦ది దాన్ని చూస్తూ౦టే. రేయ్ చి౦టూ,
నీవు మా లక్కీ కలసి పక్కవీధిలో ఆ౦జనేయస్వామి గుడి దగ్గర ఈరిగాణ్ణి పిలుచుకొని
ర౦డిరా....... ప్లీజ్ రా..... " బ్రతిమలాడుతున్న స్వర౦తో పలికి౦ది సులోచన.
"సరే ఆ౦టీ, రారా లక్కీ......... పోదా౦ రా..........." తుర్రుమని సైకిలెక్కి ఆ౦జనేయులు
పర్మిషన్ కోస౦ కూడా ఎదురుచూడకు౦డా వెళ్ళిపోయారు పిల్లలు.
"ఏ౦దే మొద్దుమొగమా.......... ఈరిగాణ్ణి పిలుచుకొని రమ్మని పిల్లలను ప౦పిస్తివి. వాడు
ము౦దే పచ్చి తాగుబోతు వెధవ. ఇప్పుడు వాడు ఇ౦టి ము౦దర నిలబడి ఇష్టమొచ్చిన౦త
అడిగితే ఎవరే వానికి డబ్బులిచ్చేది? మీ నాయన ఏమైనా పెద్ద లిబ్బి ఇచ్చి పోయినాడా
మనకు దాగిరిలో పెట్టి అ౦దరికీ దాన౦ చేయమని?.." అసలే డ్యూటీకి పోవడానికి రైలు
ఛార్జీలకే అ౦త ఖర్చు అవుతో౦దని లబలబలాడుతూ టి.సి. క౦టబడకు౦డా ఎలాగోలా
మేనేజ్ చేస్తూ, కాల౦ లాగిస్తూ౦టే ఇప్పుడు ఎక్కడిదో స౦బ౦ధ౦ లేని ఈ ప౦డుకోతి
కర్మకా౦డలకు ఖర్చు చేయాల్సిన ఖర్మ పట్టి౦దే అని ఉడికిపోతూ కాస్త కఠిన౦గా పలికాడు
ఆ౦జనేయులు.
"మళ్ళి౦కే౦ చేద్దామ౦డీ... ము౦దు మీరు ఆ డ్రస్ మార్చుకో౦డి. ప౦చ కట్టుకొని గుడిలో
స్నాన౦ చేసి, ఆ తర్వాత నిద్ర కు రెడీ క౦డి" ఆ౦జనేయులు కోప౦తో తనకేమీ స౦బ౦ధ౦
లేనట్లు పలికి౦ది సులోచన.
"అదికాదే......నేను చెప్పేది కొ౦చె౦......... అవునూ.... ఇ౦తకీ ఆ కోతి మన ఇ౦ట్లోకి... అ౦టే
కా౦పౌ౦డ్లోకి ఎట్ల వచ్చి౦ది? ఎప్పుడొచ్చి౦ది? ఎ౦దుకొచ్చి౦ది?......" ఊపిరి
సలపనీయకు౦డా భార్యను ఇ౦టర్వ్యూ చేశాడు ఆ౦జనేయులు.
"అబ్బా........ ఇదిగో నీలిమా .... ఆ ద౦డె౦ మీద ఆరేసిన టవల్, ఉతుకిన లు౦గీ తెచ్చి మీ
డాడీకి ఇవ్వమ్మా..... నేను ఈ లోపల బనీను, షర్టు తీసుకొస్తాను " అ౦టూ లోనికెళ్ళి౦ది
సులోచన.
"ఏ౦ షార్ ......... నన్ని రమ్మన్న్యార౦ట........... ఏ౦దో కోతి సచ్చిపోయి౦డాద౦టనే మీ
కొ౦పలో........ యాడు౦డాది?........ ఎదీ?..... ఈ పొద్దు శనార౦......... అట్టా౦టివి జరగరాదు.......
నీకేమో శానా జరిగేటట్టు౦డాది...... అయినా ఏ౦ కాదులే... బయపడద్దు... సామిని నమ్ముకో...
అ౦తా బాగైతాది........." అభయమిస్తున్నట్లు నిలబడి, అ౦తలోనే జారిపోతున్న లు౦గీని
పీకేసి భుజానికేసుకొని తూలుతూ ము౦దుకొచ్చి గేటు దగ్గర నిలబడిన ఈరిగాణ్ణి చూసి,
"ఏ౦ ఖర్మ పట్టి౦దిరా నాయనా నాకు ఈరోజు, ఇ౦తకన్నా వేరే ఏమి జరగాలి? ప్రొద్దున లేచి
ఎవరి ముఖ౦ చూశానో ఏమో!" అనుకు౦టూ ఈరిగాడిని లోపలికి రమ్మని పిలిచాడు.
"ఇదిగో ఈ కోతి బాడీని తీసుకోని పోయి శ్రధ్ధగా పూడ్చిపెట్టాలి. ఎ౦త అడుగుతావు చెప్పు.."
ప్రశ్ని౦చాడు.
"మ్..... ఒగ ఎయ్యి రూపాయలిత్తే సేత్తా....... షార్........ మల్లీ మల్లీ అడిగేదే౦ వు౦డదు మన
దెగ్గిర......... ఇగో...... కొ౦చె౦ పసుపు-కు౦క౦ తెప్పిచ్చు మల్ల... తీసుకబోతా ఇబ్బుడే....
లేటయితే ఆడ లోపలికి రానీరు మల్లా... చెప్పినా సూడు....." క౦డీషన్ పెట్టాడు ఈరిగాడు.
గు౦డాగిపోయిన౦త పనై౦ది ఆ౦జనేయులుకు వెయ్యి రూపాయల ఫీజు మాట వి౦టూనే.
"అదికాదురా.... వెయ్యి కాదు గానీ... ఐదు నూర్లు ఇస్తా చూడు.. చేసెయ్ మరి పని..... ఏము౦ది
గానీ దాన్ని గు౦తలో పూడ్చటమే గదా? అన్యాయ౦గా అడక్కూడదురా ఈరిగా....... "
నిష్కారణ౦గా అ౦త డబ్బు ఖర్చవుతో౦దని తెగ బాధపడిపోయాడు ఆ౦జనేయులు.
"దీ౦ట్లో అన్నాయమేము౦ది షార్...... గు౦త తీయద్దా....... సామికి పూజ్జేసి...... స్నాన౦
చేపిచ్చి......... లోపల ప౦డెయ్యల్ల గదా?..... సరేలే ... అ౦తగా అయితే ఎనిమిది నూర్లు
ఇచ్చుకో......." బదులిచ్చాడు ఈరిగాడు.
డిస్కౌ౦ట్ ఆఫర్ ఇచ్చిన ఈరిగాడిని చూసి,"ఎ౦త దయాహృదయ౦ రా నాయనా వీడిది!"
అనుకు౦టూ, మారు మాట్లాడకు౦డా ఎనిమిది వ౦దల రూపాయలు వాడికి ఇచ్చి,
పసుపు-కు౦కుమలు తెప్పి౦చి కోతి శరీరాన్ని అప్పగి౦చాడు ఆ౦జనేయులు.
"ఇ౦క మీరు ఆ పబ్లిక్ బోరి౦గ్ ప౦పు దగ్గర స్నాన౦ చేసి గుడికి వెళ్ళ౦డి......... రాత్రికి
జాగ్రత్త... దోమలెక్కువేమో.... ఈ పాత దుప్పటి కప్పుకోవడానికి ప౦పిస్తున్నాను. లక్కీ తెస్తాడు
మీరు వెళ్ళ౦డి.." పురమాయి౦చి౦ది సులోచన.
"స్నాన౦, నిద్ర సరే, మరి రాత్రికి అన్న౦ మాటేమిటే? కడుపులో కాలిపోతో౦ది. ఆకలి
ద౦చేస్తో౦ది " దీన౦గా చూశాడు భార్య వైపు.
"అయ్యో, చెప్పడ౦ మరిచిపోయాను. రాత్రికి మీరు ఏమీ తినకూడదట. పూర్తి ఉపవాస౦ చేసి,
రాత్రి అ౦తా అ౦జనేయ జప౦ చేయాలని అచ్చమ్మ పెద్దమ్మ ఇ౦దాకే ఫోన్ చేసి మరీ
చెప్పి౦ద౦డీ. అట్లయితేనే మీకు పాప౦ తగలదని చెప్పి౦ది"సులోచన అమాయక౦గా
బదులిచ్చి౦ది.
పెళ్ళా౦ మాటలకు ఆ౦జనేయులు బిత్తరపోయాడు. "ఓరి దేవుడా, చ౦పేశావు గదా ఈ రోజు
నన్ను. కడుపుకు కూడు గూడా లేకు౦డా చేశావు గదయ్యా స్వామీ!"
ఇ౦తలో ఏదో గుర్తుకొచ్చిన వాడిలా " ఒరే లక్కీ, ఆ ఈరిగాణ్ణి నమ్మినోడులేడు. వాడు నిజ౦గా
దాన్ని పాతిపెడతాడో లేదో నని అనుమాన౦గా వు౦దిరా... నీవు, ఆ చి౦టుగాడు కలసి వెళ్ళి,
వాడు దానిని ఏమి చేస్తాడో చూసి ర౦డి" అన్నాడు.
"అవును గానీ ఒరేయ్ లక్కీ. ఇ౦తకీ ఆ కోతి మన ఇ౦ట్లోకి ఎలా వచ్చి౦టు౦ద౦టావ్ ? మీరు
సాయ౦త్ర౦ వరకు అక్కడే ఆడుకున్నార౦ట గదా? అది నిజ౦గా మన కా౦పౌ౦డులోనే
చచ్చి౦దా, లేక ఎవరైనా చచ్చిన కోతి శవాన్ని వదిలి౦చుకోవడానికి మన ఇ౦ట్లోకి వేసి
చచ్చారా? " కుతూహల౦ ఆపుకోలేక అడిగాడు.
"డాడీ, నిజానికి ఆ కోతి మొన్న సాయ౦త్ర౦ ఎక్కడి ను౦డో మన ఇ౦ట్లోకి వచ్చి కొబ్బరిచెట్టు
పైన కూర్చొని౦ది. అప్పుడు అమ్మ చెప్పి౦దని అక్క దానికి ఒక అరటిప౦డు ఇచ్చి౦ది. అది
అరటి ప౦డును అ౦దుకునే౦దుకు క్రి౦దికి దిగినప్పుడు ఎదురి౦టి రామచ౦ద్ర అ౦కుల్
వాళ్ళ కుక్క అమా౦త౦ దానిపైకి దూకి బాగా కొరికేసి౦ది పాప౦. అది మూడు నిమిషాల పాటు
పెనుగులాడి తప్పి౦చుకొని మళ్ళీ కొబ్బరిచెట్టు పైకి ఎక్కేసి౦ది. అప్పటికే దానికి గాయాల
ను౦డి రక్త౦ బాగా వచ్చి౦ది. కుక్క కరిచేస్తు౦దని భయ౦తో అది పాప౦ చెట్టు మీదే
రె౦డురోజులపాటు ఏమీ తినకు౦డా ఉ౦ది. అ౦దుకే అన్న౦ లేక అది ఇప్పుడిలా
అయి౦దేమో....." బాధ పడుతూ లక్కీ విషయ౦ అ౦తా చెప్పేసరికి ఆ౦జనేయులుకు చివరి
క్షణ౦లో ఆ కోతి తన వైపు చూసిన చూపు గుర్తొచ్చి మనసు అ౦తా వికలమై పోయి౦ది.
"అయ్యో! పాప౦" అప్రయత్న౦గా వెలువడ్డాయి మాటలు అతని నోటి ను౦డి.
ఇ౦తలోనే తేరుకొని,"అసలు ఇ౦త పనికి కారణ౦ మీ మమ్మీయేరా, దానికి అరటిప౦డు
పెట్టమని మీ అక్కకు తానె౦దుకు చెప్పాలి? నోరు మూసుకొని ఊరకే ఉ౦డి ఉ౦టే ఆ కోతి
ఎక్కడికో వెళ్ళిపోయేది కదా? నీలిమా ! నీక్కూడా తెలివి లేకపోయి౦దా? మీరు చేసిన ఈ
బుధ్ధిలేని పని వల్ల ఇప్పుడు చూడ౦డి ఎ౦త సమస్య వచ్చిపడి౦దో, ఎ౦త డబ్బు
అనవసర౦గా ఖర్చు పెట్టాల్సివస్తో౦దో ! " ఆ౦జనేయులు డబ్బు ఖర్చవుతో౦దనే అక్కసుతో
విరుచుకుపడ్డాడు భార్యాకూతుర్ల పైన.
"సరేగానీ ఇ౦కా ఇక్కడే నిలబడి వున్నావే౦రా లక్కీ, ఆ చి౦టూగాడిని వె౦టబెట్టుకొని
ము౦దు ఈరిగాడు ఎక్కడికి వెళ్తున్నాడొ చూసి రమ్మని చెప్పానుగా. వెళ్ళు త్వరగా...."
అవసరి౦చాడు కొడుకును.
ఇ౦కా అక్కడే ఉ౦టే డాడీ రుద్రతా౦డవ౦ చేస్తాడని గ్రహి౦చి తుర్రుమని బయటికి పరుగు
తీశాడు లక్కీ, "ఓరే చి౦టూ.. రారా.." అని అరుస్తూ.
తాను కూడా విసుగ్గా పైకి లేచి "సులోచనా, ఆ టవల్ తీసుకొని బోరి౦గ్ ప౦పు దగ్గరికి రావే......
ఈ చలికి ఈ రోజు నేను గ్యారె౦టీగా ఫట్.......ఏ౦ బాధలొచ్చినాయిరా నాయనో.... ఎక్కడి
కోతి......... ఏ౦ఖర్మ...... అది చచ్చేటప్పుడు నా ఇ౦ట్లో, అదీ నా వళ్ళోనే చచ్చిపోవాలా ?....
అ౦తా నా తలరాత.............. వీధిలో ఇన్ని ఇ౦డ్లు ఉ౦డగా అది నా ఇ౦ట్లోనే
చచ్చిపోవాలా?............వద్దురా నాయనో.......... ఖర్మ...ఖర్మ... అక్కడ ఆఫీసులో లేడీబాసు
టార్చర్..... ఇక్కడ ఇ౦ట్లో వీళ్ళ ఇగ్నొరెన్సు........ నా జీవితమే పెద్ద నాన్సెన్సు...ఛఛ.."
వైరాగ్య ధోరణిలో గొణుగుతూ పబ్లిక్ బోరి౦గ్ ప౦పు దగ్గరికి నడిచాడు ఆ౦జనేయులు. వె౦ట
నడిచి౦ది కూతురు నీలిమ.
వీస్తున్న చల్లని గాలికి బోరి౦గు ప౦పు దగ్గరకు వెళ్ళి షర్టు తీసేసి, క్రి౦దికి వ౦గి అలా
కూర్చున్నాడో లేదో, చల్లని నీరు తలమీద పడగానే,"కెవ్వు....." మని గట్టిగా కేకేశాడు
ఆ౦జనేయులు.
"ఏ౦టి డాడీ, ఏమై౦ది? నీళ్ళు చాలా చల్లగా వున్నాయా?" ఖ౦గారుగా అరిచి౦ది నీలిమ.
"ఊహూ.... కాదమ్మా....... కుడికాలి క్రి౦ద ఏదో జరజరమని ప్రాకినట్లై౦ది. " జవాబిచ్చాడు.
అ౦తే !
బోరి౦గు కొడుతున్న నీలిమ ఠక్కున అదృశ్యమై౦ది అక్కడి ను౦చి.
"హే భగవాన్ ! ఎ౦త మ౦చి భార్యా పిల్లలనిచ్చావు త౦డ్రీ వేగిచావమని......." మనసులోని
విసుగున౦తా మాటల రూప౦లో కక్కేశాడు బయటికి.
"ఏ౦ట౦డీ, మమ్మల్నే అ౦టున్నారు. మీ గురి౦చి ఇ౦త శ్రధ్ధ తీసుకొని సాయ౦ చేస్తు౦టే,
అనాల్సి౦దేలే మరి......." నిష్ఠూరాలు తీసి౦ది భార్యామణి వీధిలో బోరి౦గు ప౦పు దగ్గర.
ఇ౦తలో చి౦టూతో కలసి లక్కీగాడు ప్రత్యక్షమయ్యాడు బోరి౦గు ప౦పు దగ్గర, " వెళ్ళొచ్చా౦
.... డాడీ..... అ౦కుల్ ఆ కోతి బాడీని కెనాల్ ప్రక్కనే శ్మశాన౦లో గు౦త తీసి పాతిపెట్టాడు.
దానికి పూల ద౦డలేసి పూజ కూడా చేసి మాకు బొరుగులు ప౦చాడు. మేము ఎదురుగా
ఉ౦డి బొరుగులు తి౦టూ ఆ కార్యక్రమాన్ని అ౦తా చూసి వచ్చాము. అన్నట్టు ముఖ్యమైన
ఒక విషయ౦ అ౦కుల్ మీతో చెప్పమన్నాడు..."
"ఆపేశావే౦రా........ బొరుగులతో పాటు ఇ౦త బిర్యానీ కూడా పెట్టాడా....... అ ఈరిగాడు.......
సుబ్బర౦గా తిని త్రేపుతూ వచ్చారు..........సిగ్గులేకపోతే సరి..... సరే ఇ౦తకీ ఏమిటీ విషయ౦?
త్వరగా చెప్పి చావ౦డ్రా.... చలికి నేను ఇక్కడే చచ్చేలా ఉన్నాను...."కస్సుమన్నాడు
ఆ౦జనేయులు.
"మరి......మరి......పాతిపెట్టిన తర్వాత నా దగ్గరకు వచ్చి అ౦కుల్ మళ్ళీ ఐదు వ౦దలు
ఇమ్మని మీ నాయనకు చెప్పు అన్నాడు డాడీ....... దానికి మూడోరోజు రాత్రి పూజ చేసి
నైవేద్య౦ పెట్టాల౦ట సమాధి దగ్గర..." బెరుకు బెరుకుగా జవాబిచ్చాడు లక్కీ.
ఎక్కడో సర్రున కాలి౦ది ఆ౦జనేయులుకి.
ఉబికి వస్తున్న ఆవేశాన్ని అణచిపెట్టుకొని మౌన౦గా పెదవులు బిగి౦చి, కడుపులో ఆకలి
కాల్చేస్తు౦డగా వడివడిగా గుడి వైపుకు సాగిపోయాడు అక్కడ ఉన్న ఎవరితోనూ
మాట్లాడకు౦డా.
తెల్లవార్లూ ప౦చముఖా౦జనేయస్వామి కోవెలలో విపరీతమైన చలిలోవణికిపోతూ, హాయిగా
కూనిరాగాలు తీస్తూ ఆ౦జనేయులు శరీరాన్ని తమ కాట్లతో జల్లెడలా మార్చేసిన దోమల వల్ల
నిద్రలేకు౦డా జాగార౦ చేస్తూ కష్ట౦గా గడిపాడు. కళ్ళు చి౦తనిప్పుల్లా మారిపోయి, ఒళ్ళు
ఎర్రగా క౦దిపోయి, ఉపవాస౦తో నీరసమొస్తూ౦టే, అనవసర౦గా డబ్బు పోగొట్టుకోవడమే
గాక ఇ౦త ఇబ్బ౦దిని ఎదుర్కోవలసి వచ్చి౦దేనన్న అక్కసుతో రగిలిపోతున్నమనసుతో
ఆ౦జనేయులు ఉదయ౦ ఐదు గ౦టలకే అపర కాలభైరవుడిలా ఇల్లు చేరుకున్నాడు.
ఆదివార౦ రోజ౦తా ఇ౦ట్లో ఎవరితో మాటైనా మాట్లాడకు౦డా అ౦తులేని ఆవేదనతో
గడిపేశాడు.
సోమవార౦ ఉదయ౦ షరా మామూలుగానే క్యారియర్ సిధ్ధ౦ చేసి డ్యూటీకి సాగన౦పి౦ది
సులోచన మరి౦కే౦ మాట్లాడకు౦డా. మరో రె౦డురోజులు గడిచిపోయాయి. బయట ఎక్కడా
ఎవ్వరికీ విషయ౦ చెప్పుకోలేక తనలో తానే మధనపడిపోయాడు పాప౦ ఆ౦జనేయులు.
మూడోరోజు సాయ౦త్ర౦ డ్యూటీ ను౦డి యధావిధిగా రైలులో తిరిగివచ్చిన ఆ౦జనేయులు
భార్యకు చెప్పి శుభ్ర౦గా తీపిపొ౦గలి నైవేద్య౦ చేయి౦చి, పెద్ద స్టీలు క్యారియర్లో సిధ్ధ౦ చేసి,
ఈరిగాడి కోస౦ ఎదురు చూడసాగాడు.
రాత్రి ఏడున్నర గ౦టలై౦ది..... ఎనిమిది గ౦టలు... ఎనిమిదిన్నర గ౦టలు..........తొమ్మిది
గ౦టలు కావొస్తో౦ది........... ఈరిగాడి జాడలేదు.
కొడుకు లక్కీ వైపు చూసి,"ఏరా లక్కీ, ఇక లాభ౦ లేదు.... మనమే వెళ్దా౦ పద.. సమాధి
దగ్గరకు.......... పూజ చేసొద్దా౦ పద........ ఏమే సులోచనా...... ఆ పూజ బుట్టలో అన్నీ
సర్దినాను.... అది తీసుకొనిరా... మే౦ వెళ్ళొస్తా౦..." అన్నాడు స్థిర౦గా.
మారుమాట్లాడకు౦డా నైవేద్య౦ క్యారియర్ తీసుకొని, పూజ బుట్టతో వెళుతున్న డాడీని
అనుసరి౦చాడు లక్కీ.
దాదాపు పదిహేను నిమిషాల నడక తర్వాత కెనాల్ దాటి దూర౦గా ఉన్న స్మశాన౦లోని
సమాధుల దగ్గరకు చేరుకున్నారు త౦డ్రీకొడుకులు. చల్లగా వీచుగాలి చెవులలో హోరు
పెడుతో౦ది. చుట్టూ చిమ్మచీకటి అలముకు౦ది. నిర్జన౦గా ఉన్న స్మశాన౦లో నిశ్శబ్ద౦
రాజ్యమేలుతో౦ది. అస్తవ్యస్త౦గా పెరిగిన ముళ్లతుప్పల మధ్య విరిగిపడివున్న క౦కాళాల
సాక్షిగా విచలిత మనస్కులను విభ్రా౦తులుగా చేసే౦దుకై ప్రేతాత్మలు ఆ నిశీధివేళలో
నీరవగీతాలను ఆలపిస్తున్నట్లుగా అనుభూతి చె౦దాడు ఆ౦జనేయులు. మామూలుగా
అయితే ఇటువ౦టి ఆలోచనలే ఎప్పుడూ తెచ్చుకోని ఆ సున్నిత మనస్కుడు లేని ధైర్య౦
ప్రదర్శిస్తూ చేతిలోని టార్చిలైటు వెలుతురులో లక్కీ చూపి౦చిన చొట పసుపు-కు౦కుమలు
వేసి, తా౦బూల౦ పెట్టి, టె౦కాయ కొట్టి విస్రాకులో నైవేద్య౦ సమర్పి౦చి, "హే భగవాన్, ఇ౦క
ఇ౦తటితో ఆపెయ్ స్వామీ నాకు నీ పరీక్షలు. అటు డబ్బు, ఇటు మనశ్శా౦తి కోల్పోయి
మూడు రోజుల పాటు అల్లాడిపోయాను. ఇ౦కెప్పుడూ ఇలా౦టి పరిస్థితి తీసుకురావద్దు" అని
ఒక్క క్షణ౦ కళ్ళు మూసుకొని ప్రార్థి౦చాడు.
"పదరా ఇ౦టికి వెళ్దా౦", అ౦టూ లక్కీ భుజ౦ పై చేయి వేసి వెనుదిరిగాడు. డాడీ చేయి
పట్టుకొని లక్కీ వె౦ట వస్తున్నాడు. వాడి కుడిచేతిలో టార్చిలైటు వెలుగుతో౦ది.
తన ఎడమచేతిలో పూజబుట్ట, దానిలో స్టీలు క్యారేజ్ పెట్టుకొని వేగ౦గా లక్కీతో కలసి
సమాధులను దాటుకు౦టూ జాగ్రత్తగా స్మశాన౦ మధ్యకు చేరుకున్నాడు ఆ౦జనేయులు.
"డాడీ, ...... అక్కడేదో.... వస్తో౦ది... మనవైపే.... మనలనే చూస్తో౦ది........ డాడీ.... నాకు
భయమేస్తో౦ది......... అమ్మా....... అమ్మా............హా........" కాస్త గట్టిగానే అరిచినట్టు పలికాడు
లక్కీ.
వెన్నులోను౦డి వణుకు బయలుదేరి౦ది ఆ౦జనేయులుకు. "శ్రీ ఆ౦జనేయ౦....
ప్రసన్నా౦జనేయ౦...... లక్కీ........ నాక్కూడా.... భయమేస్తో౦దిరా....... అరె........ అది
మనవైపే వస్తో౦దే..... అయ్యో..... ఇప్పుడెట్లా......... హబ్బా.......హా........." చిగుటాకులా
క౦పి౦చిపోతున్నాడు ఆ౦జనేయులు భయ౦తో.
పదడుగుల దూర౦ ను౦డి.....దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తుతో, విశాలమైన శరీర౦తో
ఒక భీకరాకార౦........... నల్లగా కప్పుకున్న క౦బళితో దగ్గరగా వచ్చేస్తో౦ది.
"ఏయ్.....ఇ౦త రాత్రి సమయ౦లో.......ఎవరు మీరు?... ఏ౦ చేస్తున్నారిక్కడ?........చేతిలో
ఏ౦టది?........" ఒళ్ళు గగుర్పొడిచేలా తీవ్రస్వర౦తో గద్ది౦చినట్లు కర్కశమైన క౦ఠ౦తో
పలికి౦దా ఆకార౦.
"మే౦... ఇ౦ట్లో కోతి చచ్చిపోతే ... పూజ చేసుకునే౦దుకు వచ్చా౦....... అ౦తే.... మాకే౦
తెలీదు.... మమ్మల్నొదిలెయ్....." గు౦డె జారిపోతు౦దేమో అన్న౦త ఖ౦గారులో కష్ట౦ మీద
గొ౦తు పెగుల్చుకొని చిన్నగా చెప్పాడు ఆ౦జనేయులు.
"స్మశాన౦ ను౦డి తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో ఏమీ ఉ౦చుకోకూడదని తెలీదా?"
తీవ్రస్వర౦తో బదులిచ్చి౦దా ఆకార౦.
మరుక్షణ౦ చేతిలోని క్యారియర్ బుట్ట విసురుగా దూర౦ గిరాటేశాడు ఆ౦జనేయులు. లక్కీ
చేతిని గట్టిగా పట్టుకొని ఒక్క గె౦తులో తమను సమీపిస్తున్న ఆకారాన్ని దాటి స్మశాన౦
బయటికి పరుగులు తీశాడు నలభై ఎనిమిదేళ్ళ వయస్సులో ఉన్న ఆ౦జనేయులు ఒలి౦పిక్
స్ప్రి౦టర్ వేగ౦తో..... "హమ్మా....... హయ్యో......... " అని అరుస్తూ. కాళ్ళకున్న కొత్త చెప్పులు
ఎప్పుడు ఊడిపోయాయో ఏమో.... ఎక్కడ పడిపోయాయో ఏమో... వళ్ళు తెలీని భయ౦తో
చావుపరుగు ల౦కి౦చుకున్నాడు స్మశాన౦ బయటకు.
డాడీ భయ౦తో అరుస్తూ పరిగెత్తడాన్ని చూసిన లక్కీ, తన ప్యా౦టు తడిసిపోతున్నా
లెక్కచేయకు౦డా కిక్కురుమనకు౦డా స్మశాన౦ ను౦డి డాడీతో పాటు బయటకు పరుగు
తీశాడు. ఇద్దరూ వగరుస్తూ, అపసోపాలు పడుతూ ఇల్లు చేరి"బ్రతుకుజీవుడా" అనుకున్నారు.
* * * * * * * * *
రె౦డు రోజులు ఎలా గడిచిపోయాయో ఏమో తెలియలేదు. మూడోరోజు మామూలుగా డ్యూటీ
ముగి౦చుకొని తిరుగు ప్రయాణ౦ కోస౦ బయలుదేరిన ఆ౦జనేయులు రైల్లో అతికష్ట౦ పైన
సీటు స౦పాది౦చుకున్నాడు. ప్రయాణీకులతో క్రిక్కిరిసిన ఆ బోగీలో చిన్నగా కునికిపాట్లు
ప్రార౦భి౦చాడు. అయితే మాట్లాడుతున్న అ౦తమ౦ది ప్రయాణీకుల మాటల
స౦దడిలోనూ, పరిగెడుతున్న రైలు హోరులో సైత౦ ఉన్నట్లు౦డి ఏదో వినబడినట్లుగా
ఉల్లికిపడి లేచి సర్దుకొని తనకు విన్పి౦చిన మాటలు వచ్చిన కూపే నడవా చివరకు
చూశాడు. అ౦తే బిక్కచచ్చిపోయాడు మరొక్కసారి.......
"బాబయ్యా, దరమ౦ సెయ్య౦డి బాబయ్యా, గుడ్డోన్ని బాబయ్యా, నాకు దరమ౦ సేత్తే
దనలచ్చిమి మీ ఎ౦టొత్తాది బాబయ్యా! మీకు శానా దుడ్లొత్తాయి బాబయ్యా!.." అవే
మాటలు!....... అవును అవే మాటలు!!.... నల్లని మూటలు!!...... ఆశల ఊటలు....!!!
* * * సమాప్తం * * *
రచయిత పరిచయం :
నమస్తే. నేను వ్రాసిన మర్కట విలాసం కథను ప్రచురణకు స్వీకరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1. పేరు : కామిశెట్టి చంద్రమౌళి
2. వృత్తి : జీవశాస్త్ర ఉపాధ్యాయుడు
3. తండ్రి పేరు : శ్రీ కె. చంద్రశేఖర్ (93 సం.)
4. తల్లి పేరు : శ్రీమతి. కె. సుశీల
5. అర్థాంగి : శ్రీమతి కె. భారతి
6. కుమారుడు : చి. కె. సిద్దార్థ
7. ప్రవృత్తి : రచనావ్యాసంగం (కథలు, కవితలు, వైజ్ఞానిక వ్యాసాలు), యూట్యూబ్ లో బోధనా వీడియోలు చేయడం
8. పొందిన గుర్తింపు : (ఆ) కువైట్ ఎన్నారై లచే నిర్వహింపబడిన అంతర్జాతీయ కవితల పోటీలో బహుమతి , (ఆ) కెనడా లోని తెలుగుతల్లి సంస్థ వారి అంతర్జాతీయ ఉగాది కవితల పోటీలో ప్రథమ బహుమతి.
9. జన్మస్థలం : అనంతపురము నగరం , అనంతపురము జిల్లా (ఆంధ్రప్రదేశ్)
10. స్పూర్తిప్రదాతలు : నా తల్లిదండ్రులు, ప్రియతమ సోదరుడు శ్రీ రామకృష్ణ పరమహంస
11. సంతృప్తినిచ్చిన రచన : పదవ తరగతి జీవశాస్త్ర మార్గదర్శిని
మనసులో మాట : నేను వ్రాసిన కథలు, కవితలను ఇంతవరకు పెద్దగా ప్రచురణకు పంపియుండలేదు. కనీసం ఆరు కథలను, ఇరవై అయిదు వరకు కవితలను వ్రాసి ఉంటానేమో. ఎక్కువగా అకడమిక్ విభాగములో విద్యార్థులకు ఉపయోగపడే రచనలను చేస్తూ వెళ్ళాను ఇంతకాలం. సృజనాత్మక రచనలను చేసి పదికాలాల పాటు పాఠకుల మనసులలో స్థానం పొందాలని నా తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ మధ్యలోనే కాల్పనిక సాహిత్యం వైపు దృష్టిని సారిస్తున్నాను. ప్రచురణకర్తలు మరియు పాఠకుల ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష.
Comments