'Maro Vandellu' - New Telugu Story Written By Sujatha Thimmana
'మరో వందేళ్లు' తెలుగు కథ
రచన: సుజాత తిమ్మన
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కనుకొలుకుల్లో అమ్మమ్మ రూపం కదలాడుతూ ఉంటే గుండెను కోసుకుని ఉబికి వెచ్చే కన్నీళ్లు చెంపలపై దారలు కట్టసాగాయి..
"చిన్నారి!"
అమ్మమ్మ ప్రేమతో పిలిచే పిలుపు ఇక మళ్ళీ నాకు వినిపించదు..
ఛ! నేనెంత తప్పు చేసాను.. దాదాపు పదకొండేళ్ళ అవుతుందేమో అమ్మమ్మని చూసి.. ఆవిడ అమ్మ కంటే ఎక్కువ.. పురిటిలోనే నన్ను తనచేతుల్లోకి తీసుకుంది.. నానమ్మ మూడోసంతానం కూడా ఆడపిల్లే.. అని మెటికలు విరుస్తుంటే.. అమ్మ గుక్కపట్టి ఏడుపు అట..
అందుకే నేనే పెంచుకుంటా.. అని తన ఊరుకి తీసుకొనిపోయి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అమ్మమ్మా తాతయ్యా.. పదమూడేళ్ల వయసులో తాతయ్య కాలం చేసారు.. అప్పటి నుంచి అన్ని తానై చూసుకుంది.. అమ్మ నాన్న ఎప్పుడైనా చుట్టం చూపుగా వచ్చేవాళ్ళు.. పల్లెటూరు కావడం మూలంగా పదవతరగతి అవగానే హాస్టల్ లో ఉంచి చదివించింది..
మొత్తానికి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతూ ఉన్నా.. అప్పుడే అమ్మమ్మకి బాగా సుస్తీ చేసింది.. టవునుకి తీసుకోని వచ్చి పెద్దాసుపత్రిలో జాయిన్ చేసి పదిరోజులు అమ్మమ్మ దగ్గరే ఉన్నా.. అప్పుడు ఆమెకు నేను తన అమ్మలా కనిపించానట.. డిశ్చార్జ్ అయి వచ్చేస్తుంటే.. అమ్మమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టరు (కుర్ర డాక్టర్ ) రోజు ఎదో వంకతో నాతో మాట్లాడాలని చూసేవాడు..
గమనించినా.. నేను బయటపడలేదు.. అమ్మమ్మతో మాట్లాడుతూ వివరాలు అన్ని కనుక్కున్నాడు.. ఇంటికి వచ్చేసాక ఇక నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను గాక వెళ్ళను.. అని తెగేసి చెప్పేశా.. అలా చదువు ఆగిపోయింది.. అమ్మమ్మకి చెట్లన్నా.. పంటలన్నా.. చాలా ఇష్టం.. ప్రతి మొక్కని ఎంతో ప్రేమతో పెంచుకునేది.. తాతయ్య తరువాత తనే పొలంలోకి వెళ్లి ప్రతి పంట.. ప్రతి చెట్టు.. గురించి వాకబు చేస్తూ కూలీలతోటే గడిపేది పగలంతా.. ఆవిడతోటి నేనుకూడా.. ఆ పొలాల మధ్యలోనే పెరిగాను..
ఆ రోజుల్లో ఎరువులు కూడా సేంద్రియమే.. విత్తనాలు శుద్దిచేసుకోవటం అన్ని స్వయంగా చేసుకునేవాళ్ళు.. ప్రతి పనిలోనూ అమ్మమ్మ దగ్గర ఉండి చేయించేది.. అందుకే నాకు కూడా ఆ పొలం గురించి పంటల గురించి బాగా అవగాహనా ఏర్పడింది..
రెండునెలలు గడవక ముందే పేరయ్యగారు సంబంధం ఉంది అంటూ ఈ డాక్టరుగారి ఫొటో వివరాలు చూపించారు.. అమ్మమ్మకి కూడా బాగా నచ్చాడు.. నన్ను అడిగితె.. నేనేమంటాను.. సిగ్గుల మొగ్గయ్యాను..
అమ్మానాన్నలకు కబురుపెట్టి అటువైపు ఇటువైపు మాట్లాడుకుని.. మొత్తానికి నా పెళ్లి ఆ డాక్టరుగారితో జరగడము.. అయనకి ఢిల్లీలోని ఎయిమ్స్ లో సీటు రావడము.. అలా ఆయనతో పాటునేను అమ్మమ్మని వదిలి రాజధానికి వెళ్లిపోవడము జరిగిపోయింది..
రెండేళ్ల వ్యవధిలో ఒక కూతురు.. ఒక కొడుకు.. మధ్య మధ్యలో ఊరికి వెళ్లినా చాలా తక్కువగా ఉండడానికి సమయం చిక్కేది.. పిల్లల చదువులు.. ఉద్యోగాలు.. కూతురు అమెరికాలో సెటిల్ అవ్వడంతో అమ్మమ్మ వందేళ్ల పుట్టినరోజుకు కూడా రావడానికి కుదరలేదు.. వందేళ్లు నిండినవి అంటే అందరు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు.. ఆవిడ అప్పటికి కూడా ఎంతో చురుకుగా తన పని తనే చేసుకునేదట.. తన నలుగురు కూతుళ్లు.. ఇద్దరు కొడుకులు కూడా వెళ్లిపోయారు.. మనవళ్లు.. మనవరాళ్లు.. ముని పిల్లలను కూడా చూసింది..
నిజంగా తన గురించి ఒక గ్రంధమే వ్రాయవచ్చు.. ఆవిడ దగ్గర నేను పెరగడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో..! ఎంత పుణ్యం చేసుకున్నా.. ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయానే అని బాధ.. నాకోసం చాలా కలవరించిందట..
కారు ఊరి పొలిమేర దగ్గరికి వచ్చేసింది.. ఎదో తెలియని తన్మయత్వం.. ఆ గాలిలోనే ఉంది.. అవును అమ్మమ్మ ఆత్మ మెత్తగా నన్ను తడుముతూ ఉంది..
***********
లాయరు గారు నా చేతిలో ఒక కవరు పెట్టారు.. "తులసమ్మగారు మీకు ఇవ్వమన్నారమ్మా.. మీ కోసం చాలా కళ్ళల్లో వత్తులు వేసుకుని చూసారు.. "యశోద వచ్చిందా.. "అని ఊరికే అడిగే వాళ్ళమ్మా.. " అయన కళ్ళు కూడా చెమరించాయి.. నిజమే మరి.. తులసమ్మ అంటే ఆ ఊరి మొత్తానికి ఆదుకున్న అపర అన్నపూర్ణమ్మ.. ఆవిడని తలచుకోనివాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో.. !
ఆ కవరులో వీలునామాతో పాటు ఒక ఉత్తరం నన్ను ఉద్దేశించి వ్రాయించింది..
“చిన్నారి ! ఏ బంధమో తెలియదు కానీ ఏడుగురు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన తరువాత నీవు నాకు బాద్యతవి అయ్యావు.. మానవరాలిగా కాక నాలో భాగంగా పెంచుకున్నారా.. అందుకే నీమీదే నా ప్రాణం.. నీదగ్గర వచ్చి ఉండమన్నావు ఎన్నో సార్లు.. కానీ ఈ మట్టిని.. ఈ ఇంటిని వదిలి కూడా రాలేను.. అందుకే ఇక్కడే ఉండిపోయాను.. ఆస్తులన్నీ అందరికి పంచి ఇచ్చాను తాతగారి హయాములోనివి.. నీకు ఇస్తున్న ఈ పదెకరాల స్థలం మాత్రం నీవు ఊరికే బీడు పోనివ్వకుండా.. పచ్చని పొలాలుగా పంటలు పంచాలి.. ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ.. ఆ పాతరోజులు మళ్ళీ రావాలి.. ఆ వచ్చిన ఆదాయం శరణార్ధులకు ఖర్చుపెట్టు.. ఇది నా ఆఖరి కోరిక..
ఈ పొలం అంతా నేను అప్పుడు కొంత అప్పుడు కొంత కూడబెట్టి కొన్నది.. కాబట్టి దీనిలో ఎవరికీ హక్కు లేదు.. పూర్తిగా నీపేరు మీద దాఖలు చేయించాను.. అమ్మలు.. ఆ పచ్చదనంలో నన్ను చూసుకోరా..
ఇట్లు అమ్మమ్మ.. తులసమ్మ..”
*********
చదివినంతసేపు నేను ఏమి పోగొట్టుకున్నానో అర్ధం అవుతుంటే.. ఇక ముందుకు నేను చేయవలసిన పనుల గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి.. అమ్మమ్మ లేని ఇల్లు ఎంతో వెలితిగా అనిపిస్తుంది.. ప్రతి వస్తువు ఆమె అనుభూతులను పంచుతూ ఉన్నాయి.. ముందుగా భర్త శ్రీకాంత్ కి విషయం అంతా వివరంగా చెప్పి వీలు చేసుకుని ఒకరోజు కోసమయినా రమ్మని చెప్పాను.. వైద్యంలో ఎన్నో మెళకువలు తెలుసుకుంటూ తనే ఒక మెడికల్ ఇంస్టిట్యూట్ ని స్థాపించి అవసరం అయినవాళ్లకు ఉచితంగా కూడా వైద్యం చేస్తున్నారు శ్రీకాంత్.. అయన రాలేదు కానీ కొడుకు అజయ్ వచ్చాడు..
మార్కెటింగ్లో యం. బి. ఏ. చేసిన అజయ్ సొంత బిజినెస్ చేస్తూ ప్రస్తుతం " క్వాలిటీ " సూపర్ మార్కెట్ అధినేత అయ్యాడు.. దాదాపు అన్ని మహానగరాలలో ఈ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అయినా నా విషయంలో శ్రద్ధతీసుకుని వచ్చాడు అంటే.. నిజంగా చాలా సంతోషం వేసింది.. పొద్దున్నే భూములు చూడటానికి పాలేరును వెంటతీసుకుని బయలుదేరాము.. అంతా డొంకదారి..
అయినా అజయ్ చిన్నపిల్లాడిలా ఆనందపడుతున్నాడు.
. "మమ్మీ! అమ్మమ్మగారి ఇల్లు పాతకాలం నాటిది అయినా ఎంత విశాలంగా.. ఓ కళాకండంలా ఉంది.. ఆకాలంలోని వస్తువులు కూడా ఇంకా ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారు.. చెక్కు చెదరలేదు మమ్మీ.. అయ్యో! అదేమిటి లేక్.. ఇన్నిక్రేన్స్ ఒకే దగ్గర.. బాప్రే.. !" ఆశ్చర్యంతో కేరింతలు కొడుతుంటే.. పక్కనే ఉన్న పాలేరు కోటేశం 'బలేవారే సినబాబుగారు.. " నవ్వుతూ అంటున్నాడు..
“అవునాన్నా.. ! మా అమ్మమ్మ చాలా పద్దతిగా ఉండేవారు.. పనివాళ్ళతో పాటు తాను తిరుగుతూ ప్రతి వస్తువును శ్రద్దగా శుభ్రం చేయించేవారు.. " అమ్మమ్మ గురించి చెప్పమంటే.. ఇలా చెప్పుకుంటూ పోతాను..
****
పొలంలోకి అడుగు పెట్టగానే నేను పదిహేనేళ్ల పిల్లనయిపోయాను.. నలభైఏళ్లు వెనక్కి వెళ్లి..
కోటేశం చెప్పుకుంటూ పోతున్నాడు నడుస్తూ.. "దాదాపు ఏడేళ్లవుతుందమ్మా.. ఈ భూమిలో పంటలేసి.. భావులెండిపోయినవి.. నీటి ఎద్దడి.. తులిశమ్మగారు కాలు చెయ్యి ఆడినంతకాలం పొలం మంచిగా పండించారు.. ఆ తరువాతే పట్టించుకునేవాళ్ళు లేక ఇలా బీడయిపోయింది.. కానీ శ్రద్దగా చూసుకుంటే మంచి దిగుబడి వచ్చే పంటలు పండుతాయి.. సారవంతమయిన నేలమ్మా.. అయినా మీకు తెలియంది కాదు గా.. "
ఏప్రిల్ నెల కావడం మూలాన ఎండబాగా కాస్తుంది.. అలవాటు లేని అజయ్ చెమటలు తుడుచుకుంటూ.. ఉష్.. ఉష్ అనుకుంటూ అటు ఇటూ చూస్తూ నడుస్తున్నాడు..
********
ఇంటికి తిరిగి వచ్చినతరువాత అజయ్ తో అన్ని విషయాలు చర్చించుకున్నాము.. సిటీకి వెళ్లి అక్కడ నేను చేసేది ఏమి లేదు.. కోడలు అన్ని సమర్ధవంతంగా చూసుకుంటుంది.. కాబట్టి అమ్మమ్మ కోరిక ప్రకారము నేను ఇక్కడే ఉండి వ్యవసాయం చేయించాలని నిర్ణయించుకున్నాను.. దానికి అజయ్ కూడా ఒప్పుకున్నాడు..
శ్రీకాంత్ అయితే.. 'ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా యషు!' అని అడ్డు చెప్పబోయాడు కానీ 'మీలాగే నేను కూడా ఇష్టమయిన పని చేయాలనుకుంటున్నా.. ఈ సరికి అడ్డుచెప్పకండి' అని బతిమాలుకున్నా..
నా స్నేహితురాలు పక్కఊరిలోనే వుంది అని తెలిసి వెళ్లి కలిసాను.. గట్టిగా వాటేసుకుని కళ్లనీళ్లు పెట్టేసుకుంది నిర్మల.. ఒకటా రెండా.. నలభయ్యేళ్ళు అయింది నన్ను చూసి.. తన భర్త కాలంచేసారని.. ఒక్క కొడుకు సిటీలో ఉద్యోగంతో అక్కడే సెటిల్ అయ్యాడని.. ఎకరం పొలం చిన్న ఇల్లు తన ఆస్తి.. అలాగే గడుపుతున్నానని చెప్పి బాధపడింది.. నేను తీసుకున్న నిర్ణయం చెప్పి.. తనని కూడా నాతో పాటు ఉండమని ఒత్తిడి చేశాను.. ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో నేను ఉండలేనని చెప్పడంతో ఒప్పుకుంది..
ముందుగా పొలంలో బోర్ లు నాలుగు వేయించాను.. వ్యవసాయం లోని మెళకువలు గురించి రైతు సంఘాలకి వెళ్లి కనుక్కున్నాను.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కారిక్రమాలలో విత్తన శుద్ధి ఒకటని తెలుసుకుని వాటిల్లో పాల్గొని విత్తనాలు ఎలా శుద్ధి చేయాలో తెలుసుకున్నాను.. ఆవు మూత్రం, . ఆవు పేడ, బెల్లం, పప్పుల పొడి, పుట్టమన్ను కలిపి ఘన, ద్రవ, జీవామృతం తయారుచేయటం.. వరి పైరుకు చల్లతెగులు తగిలితే ఎలా మజ్జిగతో మందును తయారుచేసి పిచికారీ చేస్తారో.. అన్ని సేంద్రీయ పద్ధతులన్నీ కూలంకుషంగా నేర్చుకుని.. గ్రామం లోని యువతని ఒక్కచోట చేర్చి అన్ని విషయాలు తెలియజేసి.. పంటలు బాగా పండితే.. ఎవరు దున్నుకుంటే ఆ భూమిలో పండిన పంట వాళ్ళకే అని చెప్పాను.. అందుకే యువత అంతా ముందుకు వచ్చారు..
ఋతుపవనాలతో నల్లని మేఘాలుగా వచ్చి వర్షం కురిపించగానే.. పొలం పనులలోకి దిగాను.. అన్నిటిలోను నాకు తోడుగా నిర్మల వెంటనే వుంది.. పదెకరాల భూమి ఆరునెలలు తిరిగేసరికల్లా.. పచ్చని పంటనించే బంగారు భూమిగా మారిపోయింది.. ఏపుగా ఎదిగిన పైరు కళ్ళకి ఇంపుగా.. మనసుకు నిండుగా.. ఇదే విదంగా రెండేళ్లు మంచి దిగుబడి వచ్చింది.. చిన్నప్పుడు నేర్చుకున్న విత్తన శుద్ధిలోని మెళకువలు ఉపయోగించి ఇంటిదగ్గరే మంచి నాణ్యమయిన విత్తనాలను తయారు చెయ్యటం మొదలుపెట్టాము.. మా విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి ఇతర రైతులకు సబ్సిడీ ధరలకు విక్రయించేది.. ఇవన్నీ చెయ్యటంలో ఎంతో సంతృప్తిని పొందుతూ.. అమ్మమ్మని తలుచుకుంటూ ఉన్నా..
అందరికి అన్నిపంచి ఇచ్చినా.. ఇంకా మిగిలిన డబ్బుతో ఆ ఇంటిని అనసూయ ఆశ్రమంగా మార్చి.. శరణార్ధులకు ఆశ్రయం కల్పించాను.. ఆ చుట్టూ ప్రక్కల గ్రామాలకంతటికి మేలయిన సలహాలని ఇస్తూ.. కావలసినవాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ.. అనసూయమ్మకి వారసురాలిని అనిపించుకున్నా.. ఆ రోజు అమ్మమ్మ మా అందరిని వదిలి వెళ్లిపోయిన రోజు.. అమ్మమ్మ చిత్రపటానికి తోటలో పోసిన సన్నజాజి పూల మాల వేస్తూ.. 'వందేళ్లు నీవు బ్రతికావు.. మరో వందేళ్లు మమ్మల్ని బ్రతికిస్తూ.. నీవు బ్రతికే ఉంటుంన్నావు అమ్మమ్మా.. 'అనుకుంటూ అంజలి ఘటించాను.
********సమాప్తం********
సుజాత తిమ్మన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: పేరు సుజాత తిమ్మన.
డిగ్రీ చదువుతుండగానే వివాహం... ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు.
చిన్నప్పటి నుంచీ మనసులో కలిగిన భావాలను నోటు పుస్తకంలో వ్రాసుకోవడం అలవాటు.
అలా కవితలు లెక్కకు మించి వ్రాసాను, వ్రాస్తూనే ఉంటాను.
ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రికలో తరచుగా ప్రచురితం అయ్యేవి.
బహుమతులు, ప్రశంసా పత్రాలు రావడం సర్వ సాధారణం.
ముఖ పుస్తకంలో అనేక సమూహాలలో నేను కనిపిస్తూనే ఉంటాను.
30 కథల వరకు వ్రాసాను. ఇక ఈ కథ "అర్థాంగి" నమస్తే తెలంగాణ వీక్లీ లో అచ్చయిన కథ.
మన తెలుగు కథలు లో నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలతో...
సుజాత తిమ్మన.
@ramanarao576 • 12 hours ago
కథ చాలాబాగుంది ఆంటీ
@krishnapriyachakravarthi5570 • 1 day ago
Kadha chala baaga vrasaru amma