top of page

మార్పు


Marpu Written By Kamaladevi Puranapanda


రచన : కమలాదేవి పురాణపండ


చలపతి కోటీశ్వరుడు.ఎంత తిన్నా తరగని ఆస్తి.

పుట్టుకతోనే ధనవంతుడు కాదు. పదిమంది పిల్లలు ఉన్న తిరుపతయ్య సంతానంలో ఒకడు.

తిరుపతయ్య మధ్యతరగతి కుటుంబీకుడు. పిల్లలు లేని కోటీశ్వరుడైన జగన్నాథం చలపతిని దత్తత తీసుకున్నాడు.

ఈ విషయం చాలా రోజుల వరకు చలపతికి తెలియదు ఇతనికే కాదు బంధువులలో చాలామందికి తెలియదు.

చలపతి ఇల్లు ఎప్పుడూ బంధువులతో

కళకళలాడుతూ ఉంటుంది. ఎందుకంటే...చలపతికి తన గొప్పతనం చాటుకోవాలనే తాపత్రయం ఎక్కువ.

రెండుమూడు నెలలకోసారి ఏదో ఒక ఫంక్షన్ పేరుతో బంధువులను ఆహ్వానిస్తాడు. ఇప్పుడు కూడా అలాగే పిలిస్తే వచ్చారు బంధువులు.

వాళ్లతో సరదాగా ఒక గేమ్ ఆడాలని పించి...

"నాకెవరైనా మంచి కథ చెబితే వాళ్ళకి లక్షరూపాయలు ఇప్పటికిప్పుడు ఇస్తాను" అని ప్రకటించాడు కోటీశ్వరుడు చలపతి తనబంధువుల వైపు చూస్తూ...

లక్ష రూపాయలు అంటే ఎవరికి ఆశ పుట్టదు...!?

మొదలెట్టారు చెప్పడానికి. కథలకు కొదవేముంది...!

ఎవరికి తోచినది వారు చెప్తున్నారు.

చలపతిని మెప్పించడానికి అతనిని పొగుడుతూ కథగా ఒకడు చెప్తే ఏదో విధంగా కథ మధ్యలో చలపతి కనిపించేటట్లు... మరో ఇద్దరు చెప్పారు.

చెప్తూన్న కథలు వింటున్నాడు అతను. అందరూ చెప్పేశారు ఒక్కడు తప్ప...

"లక్ష్మణ్ రావు నువ్వు చెప్పలేదేం!"అని అడిగాడు చలపతి

అప్పుడు లక్ష్మణరావు "ఏం చెప్పను...చాలీచాలని జీతంతో అద్దె ఇంట్లో జీవించే మధ్యతరగతి కుటుంబీకుడుగా నా జీవితమే... ఒక పెద్ద కథగా ఉంది.

పెద్దమ్మాయి లక్ష్మిని ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేదని అల్లుడు మేనల్లుడే...అయినా సరే దానిని తీసుకువచ్చి ఇంట్లో దిగబెట్టి కట్నం ఇచ్చి పంపు మావయ్యా...అన్నాడు. ఆరు నెలలుగా ఇక్కడే ఉంది.దాని కథ చెప్పాలా...

కూతుళ్లు ఇద్దరి కంటే పది సంవత్సరాలు ముందుగా పుట్టిన కొడుకు పెళ్లి చేసుకుని వాడి దారి వాడు చూసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా సహాయం చేస్తాడేమో అని వెళ్ళిఅడిగి చూసా...

మా ఆవిడ్ని అడగాలి అని వాడన్నప్పుడు నేను నిరాశ చెంది వ్యధతో వెనుతిరిగిన సంగతి కథగా చెప్పాలా!

ఏదో ఒక అనారోగ్యంతో నిత్యం బాధపడే నా భార్య శకుంతల కథ వివరించి చెప్పాలా...

రెండో అమ్మాయి పెళ్లికి ఎదిగింది... చేసేదారి కనిపించట్లా... ఏం చేయాలో తోచని పరిస్థితి గురించి చెప్పాలా...!"

"ఏమిటి లక్ష్మణరావ్ కథ చెప్పమంటే నీఇంటి విషయాలు చెప్తున్నావు?" వచ్చిన బంధువుల్లో ఒకతను అన్నాడు.

చలపతి ఏమి మాట్లాడలేదు. సినిమాల్లోను, కథల్లోను చూడ్డం, వినడం తప్ప కష్టాలు కన్నీళ్లు ఇవేవీ తెలియని అతను వింటున్నాడు శ్రద్ధగా.

చివరికి "మీరు చెప్పిన కథలేవీ నాకు నచ్చలేదు" అంటూ లేచాడు.

నిరాశచెంది మనసులో తిట్టుకుంటూ మూటముల్లె సర్దుకుని వెళుతున్నామని చలపతితో చెప్పి బయలుదేరారు వచ్చినబంధువులందరూ...

వెళ్తున్న లక్ష్మణరావుని మాత్రం ఉండమన్నాడు అతను.

మర్నాడు ఉదయం లక్ష్మణరావు చేతికి లక్ష రూపాయల చెక్కు అందిస్తూ

"అవుట్ హౌస్ ఖాళీగా ఉందని వచ్చి అందులో ఉండమని" చెప్పాడు చలపతి. తీసుకున్న లక్ష్మణ్ రావు నీళ్ళు నిండిన కళ్ళతో చేతులు జోడించాడు.

ఆరోజే నిర్ణయించుకున్నాడుచలపతి ఇకనుంచి బంధువులతో విందులు వినోదాలు మాని పేదవారికి చేతనయినంత సహాయం చేయాలని...

*********


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

27 views0 comments

Comments


bottom of page