Maya Darpanam Written By Simha Prasad
రచన : సింహ ప్రసాద్
దృశ్యం - 1
“తిరుగులేని హీరో” సినిమా రజతోత్సవం సందర్భంగా విశ్వమూర్తిని గజారోహణ చేయించి నగరవీధుల్లో ఊరేగిస్తున్నారు.
విశ్వమూర్తి విశ్వాన్ని జయించిన వాడిలా ఉన్నాడు. ఛాతి విరుచుకుని కూర్చుని విజయ హాసం చేస్తూ చేతులూపుతున్నాడు.
జనం హర్షధ్వానాలు చేస్తున్నారు. అభిమానులు పూలవర్షం కురిపిస్తున్నారు. బాణాసంచా కాలుస్తున్నారు.
“గ్రేట్ స్టార్" అని అరుస్తూ పిచ్చెత్తినట్టు ఊగిపోతూ నర్తిస్తున్నారు.
దృశ్యం - 2
విశ్వమూర్తి విడిది చేసిన హోటల్లోంచి బయటికొచ్చాడో లేదో ఎందరో అమ్మాయిలు అతణ్ణి చుట్టేశారు. అతణ్ణి తాకాలని, కరచాలనం చేయాలని, ముద్దు పెట్టుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఎగబడ్డారు.
“హే హీరో... మై హీరో... డ్రీమ్ హీరో...” అంటూ కోరస్‌గా అరిచారు.
అతడు పరమానంద పడిపోయాడు. ముద్దుల్ని గాల్లోకి విసుర్తూ “లవ్ యూ గాళ్ళ్' అంటూ ముందుకెళ్ళబోయాడు గానీ వారు దారివ్వలేదు. మీది మీది కెగబడుతోంటే పోలీసులొచ్చి అతడి చుట్టూ దడి కట్టాల్పొచ్చింది.
అతడెళ్ళి కారెక్కగా అమ్మాయిలంతా కారుని చుట్టేశారు. కారు మీద లిప్‌స్టిక్ పెదాలతో ముద్రలు వేశారు. పోలీసులు వారందర్నీ అతికష్టం మీద ప్రక్కకి తొలగించాక విశ్వమూర్తి కారు దూసుకుపోయింది. అయినా చాలా మంది కారు వెంట పరుగులు తీశారు.
దృశ్యం - 3
విశ్వమూర్తి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకొంటోంటే తప్పట్లు మ్మార్మోగాయి.
ఆ దృశ్యం చూస్తూ సినీజనం తమ సీట్లలోంచి లేచి స్టేండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
అభిమానులు “మహానటుడు" అంటూ పది నిమిషాల పాటు ఏకధాటిగా అరిచారు.
'ప్రొజెక్టర్‌ని ఆఫ్ చేసింది చంద్రిక.
అంతదాకా ఆ దృశ్యాల్ని చూసి ఆనందిస్తోన్న విశ్వమూర్తి ఉద్విగ్నుడై లేచి నిలబద్దాడు.
“నేను గ్రేట్ హీరోని. గ్రేటెస్ట్ హీరోని. నాలాంటి హీరో నేనొక్కణ్ణే . ఆకాశంలో తారలున్నంత వరకూ భూమ్మీద నేను తారగా వెలుగుతూనే ఉంటాను. యస్. అయామ్ గ్రేట్ స్టార్. సూపర్ స్టార్!”
గబగబా అతడి దగ్గరికొచ్చి పడిపోకుండా పట్టుకుంది చంద్రిక. “మీరు సూపర్‌స్టారేగాని ఎక్కువగా ఎక్సయిట్ అవ్వొద్దు . ప్లీజ్. కూర్చోండి...”
“నో. నేను నిలబడే ఉంటాను. ఆ తప్పట్లు నాకు కావాలి యూనో చంద్రికా. నేను కీర్తిశేషులు నాటకంలో మురారిగా నటించాను. ఎన్నో అవార్జులు అందుకోడానిక్కారణమైన ఆ డైలాగులు గుర్తొస్తున్నాయి... అవిగో వినరా చప్పట్లు. అవే కదురా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాన్నాలు.... తప్పట్లు. వూ కమాన్ చంద్రికా. తప్పట్లు కొట్టు
- ఐ వాంట్ తప్పట్లు...”
టేప్ రికార్డర్ ఆన్ చేసిందామె.
కరతాళధ్వనులు పది నిమిషాల పాటు ఆగకుండా మ్రోగాయి.
విశ్వమూర్తి సంతృప్తి పడ్డాడు. స్థిమితపడ్డాడు. చిరునవ్వులు చిందిస్తూ వీల్ చెయిర్లో కూలబడ్డాడు.
“నేనంటే జనానికి పిచ్చిప్రేమ. నన్ను చూడటానికి పడి చస్తారు. తెరమీద నన్ను చూసి ఉప్పాంగి పోతారు.
అందుకే వరుసగా ఎనిమిది సిల్వర్ జూబిలీ లిచ్చాను. ఎప్పటికీ అదొక రికార్డే . ఆ రికార్డు నెలకొల్పిన గ్రేట్ స్టార్ నేనే. ఇంకెవరికీ ఎప్పటికీ అది సాధ్యం కాదు. అవునా కాదా? చెప్పు చంద్రికా”
“మీ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. మీ రికార్డు బ్రేక్ చేయడం ఎవరి తరమూ కాదు”
“యా యా. నా ఫ్యాన్స్ అలాంటి వారు. ఎన్నటికీ నన్ను వదలిపోరు. అమ్మాయిలైతే నాకోసం పడి చస్తారు. నా కాలర్ నిండా లిప్‌స్టిక్ ముద్రలే ఉండే వి తెలుసా. హౌ లక్కీ అయామ్. నువ్వూ నా డై హార్ట్ ఫ్యాన్‌వేగా చంద్రికా. అందుకే నన్ను అంటి పెట్టుకుని ఉన్నావు. నాకోసం నీ లైఫ్‌నే అంకితం చేసేశావ్. దట్ మీన్స్ నేన్నీకు గాడ్తో సమానం.
స్టార్‌గాడ్‌ని కదూ?”
“అవునవును. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరే నా హీరో. నా గాడ్. నేను మీ లక్షలాది వీరాభి మానుల్లో ఒక్కదాన్ని మాత్రమే”
బ్రహ్మానంద పడిపోయాడు విశ్వమూర్తి. “కరెక్టుగా చెప్పావు. ఇంకా అలా నిలబడే వున్నావేంటి చంద్రికా. నన్నుబాల్కనీలోకి తీసుకెళ్ళు. నా ఫ్యాన్స్ ఎంతెంత దూరం నుంచో వస్తారు. నన్ను చూడాలని, విష్ చేయాలని, పాపం నా ఇంటి ముందు పడిగాపులు పడుతుంటారు. కమాన్. త్వరగా తీసుకెళ్ళు...”
వీల్ చెయిర్ని తోసుకుంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళింది.
విశ్వమూర్తిది రాజభవనం లాంటి పెద్ద ఇల్లు. ఇంటి ముందు పెద్ద గేటు. గేటుకీ ఇంటికీ మధ్యలో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పచ్చిక మైదానం. చుట్టూ పూల మొక్కలు. మధ్యలో నీటి కొలను, ఫౌంటెన్. దానిచుట్టూ బిందెలో నీళ్ళు ఒలకబోస్తున్న సిమెంటు వనితలు.
బాల్కనీ లోంచి బయటికి చూశాడు. అక్కడెంతో మంది అభిమానులు గుమిగూడినట్టే, ఆనందోత్సాహాలతో అరుస్తున్నట్టే అన్పించిందతడికి!
ఉత్సాహంగా చేతులూపాడు. ముద్దులు విసిరాడు.
“హలో ఎవ్విరిబడీ. నేనెప్పటికీ సూపర్ హీరోనే. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్లిస్తాను. మీరిలాగే నన్ను అభిమానిస్తూ నా ఫ్యాన్స్ గ్రేట్ అన్పించుకోండి. బై...”
కళ్ళు తుడుచుకుంటూ అతడ్ని లోపలికి తీసుకెళ్ళింది.
“నిన్నటి కన్నా ఇవాళ ఎక్కువమంది అభిమానులొచ్చారు కదూ. అయామ్ వెరీ హ్యాపీ”
ఇంటి గోడలకు వేలాదదీసిన అతడి నిలువెత్తు ఫొటోలు - వివిధ సినిమాల్లోని గెటప్పులతో వున్నవి - చూసి
వెర్రి సంబర పడ్డాడు విశ్వమూర్తి. అతడి ఇంట్లో అన్ని చోట్లా అలాంటి ఫొటోలే తప్ప ఒక్క అద్దమూ ఉండదు. అద్దం అంటే అతడికి పరమ అసహ్యం!
“చాలా యంగ్‌గా ఉన్నాను కదూ. నిజం చెప్పు. పాతికేళ్ళ కుర్రాడిలా లేనూ?”
“ఉన్నారున్నారు... భోజనం వడ్డిస్తాను...”
“అప్పుడే వద్దు. నాకివాళ చాలా చాలా హ్యాపీగా ఉంది తెలుసా"
“భోంచేసి మందులు వేసుకోవాలి. లేకపోతే డాక్టర్ గారు నా మీద కోప్పడతారు”
“వాడో డెవిల్. ఓకే ఓకే. పట్రా తినేస్తా..”
కొంచెం తిన్నాడు. ఎక్కువ పారబోశాడు.
చిన్నపిల్లాడిలా మందులు వేసుకోనని మారాం చేశాడు. బలవంతాన మింగించింది. ఆమెని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడు. ఆ తర్వాత కూల్ అయ్యాడు.
“నువ్వు నా మంచి ఫ్యాన్‌వి చంద్రికా. నేనేమన్నా పట్టించుకోవద్దు. నేను తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా అదే రైటనుకుని ఊరుకో. అర్గ్యూ చెయ్యొద్దు. నాకిష్టం ఉండదు. నేనెప్పుడూ రైటే. ఏం చేసినా రైటే. నేను అసలైన సూపర్ హీరోని చంద్రికా”
మాట్లాడుతూనే నిద్రలోకి ఒరిగిపోయాడు. నౌకరు సాయంతో అతడిని పడక మీదకి చేర్చింది. ఏసీ ఆన్ చేసి బయటికి నడిచింది.
విశ్వమూర్తి ఒకప్పుడు ప్రఖ్యాత సినీనటుడు. అతి తక్కువ కాలంలో వరుస హిట్లతో 'రొమాంటిక్ హీరో' ఇమేజ్‌తో తారాపథానికి దూసుకు పోయాడు.
అతడి సినిమా రిలీజైతే చాలు, ప్రతీ చోటా పండుగ వాతావరణం నెలకొనేది. జనం - ముఖ్యంగా యువతీ యువకులు విరగబడి పోయేవారు.
పెద్ద పెద్ద కటౌట్టు, పూల దండలు, పాలాభిషేకాలు, బాణాసంచా కాల్పులు, బ్యాండు మేళంతో ఊరేగింపులు, రకరకాల వేషాలు, చిందులు - ఓహ్ ఎంతో సంబరంగా, సంరంభంగా ఉండేది.
అతణ్ణి ప్రేమిస్తున్నామనీ, పెళ్లి చేసుకోమనీ రోజుకో నాలుగొందల మంది అమ్మాయిలు ఫొటోలు పంపేవారు. రక్తంతో ప్రేమ కవిత్వం ఒలకబోసేవారు. ఎక్కడికెళ్ళినా కోలాహలమే. ఫొటోలూ, పాదాభివందనాలే. అవన్నీ చూసి తననో అవతార పురుషుడిగా భావించుకునే వాడతడు .
కాళ్ళు అరిగేలా సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతున్నప్పుడే, సినీ రంగంలో కాసింత చోటు కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడే అతడికి మేనమామ కూతురు పార్వతితో పెళ్ళైంది. కానా వార్త బయటికి పొక్కితే తన “గ్లామర్" దెబ్బ తింటుందని చాన్నాళ్ళు దాచాడు. అతడు రొమాంటిక్ హీరోగా మారేడు. ఆ సరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వారు సినీ జనానికి తెలీకూడదని ఊటీ స్కూల్లో చేర్చేశాడు. భార్యని తనతో బాటు ఏ ఫంక్షన్‌కీ ప్రివ్యూలకీ ఎక్కడికీ తీసుకెళ్ళేవాడు కాదు.
జనంలో తన క్రేజ్ పెరిగే కొద్దీ భార్య మీద ఆకర్షణ తరిగిపోసాగింది. ఆమె తనకి తగదని, తన పక్కన నిలబడగల అర్హత కూడా ఆమెకి లేదని భావించేవాడు. క్రమంగా ఆమెకి దూరంగా జరిగాడు.
తన అందచందాలు శాశ్వతమని విశ్వసించేవాడు. ఆ అందం చూసి వశమయ్యే అమ్మాయిల మత్తులో తేలియాడేవాడు . వాళ్ళంతా తనకన్నా బాగా చిన్నవయస్సు వాళ్ళు గనుక, తను నిత్య యౌవనుడిగా ఉంటాడని నమ్మేవాడు.
పదేళ్ళ పాటు అతడి హవా కొనసాగింది. ఆ తర్వాత అతడి ప్రాభవం కొడి గట్టింది.
అతడి సినిమాలు ప్లాప్ అవడం మొదలైంది. ఒకే మూసలో ఉంటున్నాయన్నారు జనం. అతడి అహం దెబ్బతింది. మరింత భారీ స్థాయిలో నిర్మించమని నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చాడు. అవి 'భారీగా 'ఫెయిలయ్యాయి.
ఈ లోగా మరో యంగ్ హీరో యశ్ తెరమీదకి దూసుకొచ్చాడు. తొలి చిత్రంతోనే స్టార్ అయిపోయాడు. సోషల్ మీడియా నిండా అతడి విశేషాలే!
జనం అతడికి హారతులివ్వడం మొదలు పెట్టారు. ప్రకటన కర్తలు చాలామంది అతడ్ని తమ బ్రాండ్ అంబాసిడర్ చేసుకున్నారు.
మీడియాలో అతగాడి పేరు మారు మ్రోగిపోతోంది. అతడి అభిమానుల కోలాహలమూ పెరిగిపోయింది. అది భరించరానిదయ్యింది విశ్వమూర్తికి. కోట్లు కుమ్మరించి పూర్తిగా విదేశాల్లో చిత్రీకరిస్తూ స్వంతంగా సినిమా తీశాడు.
“మళ్ళీ ఫామ్‌లో కొచ్చేశాను. కాచుకో యశ్ అంటూ సవాల్ విసిరాడు.
కానది ఊహించనంత డిజాస్టర్ అయ్యింది. దానితోబాటే రిలీజైన యశ్ సినిమా ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది.
'విశ్వమూర్తి కెరీర్ ఫినిష్' అంది పరిశ్రమ. ఆ మాట వినలేక, జీర్ణించుకోలేక మద్యానికి బానిసయ్యాడు.
ఎవరికైనా సరే శిఖరారోహణ ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటుంది. శిఖరాగ్రం చేరాక ఇక ఎక్కువ కాలం అక్కడే నిలబడి వుండటం ఎవరికీ సాధ్యం కాదు. అక్కడ్నుంచి ఒకటే దారి - కిందికి - ఉంటుంది. ఈ సంగతి గ్రహించలేక పోయాడు విశ్వమూర్తి. వాస్తవాన్ని జీర్ణించుకోడానికి 'ప్రయత్నించనూ లేదు.
తను ఎవర్ గ్రీన్ - అన్న భ్రమలో ఉండిపోయాడు. రాత్రీ పగలూ మత్తులోనే ఉండసాగాడు.
నిర్మాతల రాక ఆగింది. ఒకరూ ఇద్దరూ వచ్చినా సహాయ పాత్రలూ, ముసలి పాత్రలూ ఆఫర్ చేశారు. ఆగ్రహోద్యగ్రుడై వారి మీద విరుచుకు పడ్డాడు. దాంతో అతడి మనఃస్థితి సరిగా లేదన్న వదంతులు వ్యాపించాయి.
సినీజనం మీది కోపాన్ని భార్య కోమలి మీద చూపించ సాగాడు. కొట్టడం, తిట్టడం చేస్తూండే సరికి మరి భరించలేక పిల్లల్ని తీసుకుని పుట్టింటి కెళ్ళిపోయిందామె.
నిత్యం చుక్కల్లో చంద్రుడిలా వెలిగే అతడు అమాంతం వెలవెల బోయాడు. అనామకుడయ్యాడు. ఏకాకి అయ్యాడు. ఒంటరి తనమంటే అతడికి చచ్చేంత భయం. ఇంటిలోని లైట్లన్నీ వేసి, టీవీ పెట్టుకుని, ముడుచుకుని పడుకునేవాడు.బయటికి రావడం పూర్తిగా మానేశాడు.
రెందేళ్ళ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వివాహానికి హాజరయ్యాడు విశ్వమూర్తి.
జనంలో తన క్రేజ్ పోలేదని, అంతా తనని చుట్టు ముడతారని, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడతారని విశ్వసించాడు. ఎదురు చూశాడు. కాని జనం “హలో" అంటూ విష్ చేసి, సానుభూతిగా చూశారు. పిమ్మట తమలో తాము ఏదేదో చెప్పుకోసాగారు.
చాలా ఇబ్బందిగా, అవమానకరంగా ఉంది. ఎలాగో భరించి నాలుగు అక్షింతలు వేసి వెళ్ళిపోదామని చూశాడు.
కానీలోగా ఓ మంత్రిగారు రావడంతో అతడెళ్ళే వరకూ ఓపిక పట్టక తప్పలేదు.
అప్పుడొకామె అతడి దగ్గరికొచ్చింది. తేరపారి చూసి బుగ్గలు నొక్కుకుంది. “ఇదివరకెంతో అందంగా ఉండేవాడివి. ఇలా అయిపోయావేంటి. ముఖం ముడతలు పడింది. దవడలూ జారాయి. జుట్టు ఊడింది. ముసలి రూపు వచ్చేసింది!”అంటూ అతడి గ్లామర్ అహం మీద చావు దెబ్బ కొట్టింది.
“నోర్ముయ్” బిగ్గరగా అరిచి విసవినా బయటి కొచ్చేశాడు.
తిన్నగా ఇంటి కెళ్ళి అద్దంలో పరిశీలనగా చూసుకున్నాడు విశ్వమూర్తి. నిజమే. ముఖం ముడతలు పడి, పీక్కుపోయి, కళాహీనంగా, అమాంతం వృద్ధాప్యం మీద పడినట్టుగా...!
“నో!” బిగ్గరగా అరిచాడు. మరుక్షణం అద్దం భళ్ళున పగిలి ముక్కలైంది.
“నేనెప్పటికీ ముసలివాణ్ణి కాను. ఎప్పటికీ యంగ్‌గా రొమాంటిక్ హీరోగానే ఉంటాను!” అనుకోవడమే కాదు. ఇంట్లోని అద్దాలన్నీ తొలగించేయించాడు. తన లైఫ్ సైజ్ ఫోటోలతో ఇంటిని నింపేశాడు.
సినీ మేకప్ మ్యాన్‌ని పెట్టుకున్నాడు. అతడు ఉదయమే వచ్చి ముడతలు కన్పించకుండా మేకప్ చేసేవాడు. విగ్ అమర్చి, సూట్ ధరింప జేసేవాడు. సాయంత్రం దాకా అలాగే ఉండటం అలవాటైపోయింది విశ్వమూర్తికి.
అతడు గతంలో, జ్ఞాపకాల్లో నివసిస్తున్నాడని డాక్టర్ మిత్రుడు ప్రకాష్ కి అర్ధమైంది. అతడి మానసిక స్థితి, గతి తప్పుతోందనీ, మతిమరుపు వ్యాధి మెల్లగా ఆక్రమిస్తోందనీ, కీళ్ళు పట్టు వదిలేస్తున్నాయనీ గ్రహించాడు. అదే సమయంలో అతడికి లివర్ క్యాన్సర్ వచ్చిందని తెలిసి విలవిల్లాడిపోయాడు.
ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ ఇవ్వాలని చూశాడు గాని విశ్వమూర్తి అంగీకరించలేదు. ఇల్లు దాటి రానని తెగేసి చెప్పాడు. దాంతో ఇంట్లోనే అవసరమైన ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేసి ట్రీట్ మెంట్ ప్రారంభించాడు. అతడికి తోడుగా సహాయంగా ఉండటానికి నర్సు చంద్రికను నియమించాడు.
ఆమె అతడి అభిమానినని చెప్పడంతో అతడు సంతోషంగా అంగీకరించాడు. డాక్టర్ సూచన ప్రకారం ఒక కార్యక్రమం రూపొందించి దాన్నే ఒక ఏడాదిగా ప్రతిరోజూ అమలు చేస్తూ, విశ్వమూర్తిని సంతోషంగా ఉంచుతోందిచంద్రిక.
అంతా బాగానే అన్పించింది గాని అతడి మేకప్ పిచ్చి మాత్రం ఆమెకి ఏవగింపు కలిగించింది. ఆ మాటే డాక్టర్‌కి చెప్పింది.
“ఏదో మాటింగుకి వెళ్తున్నట్టు మేకప్ వేసుకుని ఇంట్లో కూర్చోవడం ఏవిటి డాక్టర్. ఇదేం పిచ్చి?”
“అతడి గ్లామర్ మీద అతడికెంతో నమ్మకం. గర్వం. గ్లామర్ పోతే గుర్తింపు పోతుందని అతడి భయం -
ఆందోళన, వయసు తెచ్చే మార్పుల్ని అంగీకరించలేని మనస్తత్వం అతడిది. సానుభూతితో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించు...”
“అద్దాన్ని అసహ్యించుకుంటారు. అది చేసిన తప్పేంటి?”
“అది నువ్వెలా ఉన్నావో చూపుతుంది. నువ్వేంటో చెబుతుంది. నువ్వేమవుతావో గ్రహించుకోమంటుంది. కాని విశ్వమూర్తి వాస్తవాన్ని స్వీకరించే స్థితిని ఎప్పుడో దాటేశాడు. అతడి ప్రపంచంలో అతడిని బ్రతకనివ్వడమే అతడికి క్షేమం. అంతకంటే మనం చేయగలిగిందీ ఏమీ లేదు!”
ఆ తర్వాత అలాంటి వూసు తీసుకు రాలేదు చంద్రిక.
“నేను దేవదాసునే. ఒప్పుకుంటాను. కాని నా భార్య పార్వతి, నాటి పార్వతి కాదు. వట్టి అహంకారి. పొగరుబోతు . అందుకే తన్ని తరిమేశాను. నువ్వు మంచిదానివి. చం[ద్రముఖివే. ముగ్గురం భలే కుదిరాం కదూ” అంటూ వుంటాడు మూడో పెగ్ వేసుకున్నాక.
అవునవునంటూ తలాడిస్తుందామె. పొంగిపోతాడు విశ్వమూర్తి.
విశ్వమూర్తి నిద్ర లేచాడు. టీ ఏర్పాట్లు చేసింది చంద్రిక.
బిస్కెట్లు నంచుకుంటూ టీ తాగాడు. మరో విడత మందులు మింగించింది.
అతణ్జి వీల్ చెయిర్లో కూర్చో బెట్టుకుని గార్డెన్లో తిప్పుతోంటే అతడెన్నో కబుర్లు చెప్పాడు. అన్నీ గతకాలానివే. ఎన్నో వందల సార్లు చెప్పినవే.
అయినా కొత్తగా చెబుతున్నట్టు అతదు చెప్పాడు. కొత్తగా విన్నట్టుగానే విందామె. అవన్నీ సరదా ఘటనలే. అతడి గొప్పతనాన్ని చాటేవే.అదయ్యాక 'ఆమెనెంతో బాధ పెడుతున్నా'నని బాధ పడతాడు. కాస్సేపే.
క్రితం జన్మలో నాకు రుణపడి వుంటావు. ఇప్పుడిలా తీర్చుకుంటున్నావంతే” అన్నాడు. ఆమె పేలవంగా నవ్వింది.
డాక్టర్ ప్రకాష్ వచ్చాడు. ప్రశ్నలూ పరీక్షలూ అయ్యాక మందులూ, సూచనలూ ఇచ్చాడు.
“ఇంప్రూవ్‌మెంటు లేదు. మద్యం పూర్తిగా బంద్ చెయ్యక తప్పదు. నీ మేలు కోరి చెబుతున్నా. నా మాట విను...”
“వింటాను. బట్ ఒన్ షరతు. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావా?” ముఖంలో ముఖం పెట్టి అడిగాడు.
“మందు మానెయ్. నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ వెంటనే నీతో సినిమా తీస్తాను. సరేనా?”
“నన్ను అందాల నటుడిగా, ఆరాధ్య నటుడిగా చూపించాలి. హాలీవుడ్ మేకప్‌మెన్‌ని పిలుస్తావా?”
“ఓ. తప్పకుండా. ఇవాళ్టి నుంచే డ్రింక్ మానేస్తానని ప్రామిస్ చెయ్యి”
“ఇవాళ కాదులే. రేపట్నుంచి మానేస్తా. నన్ను యంగ్ ఎనర్జటిక్ బ్యూటిఫుల్ రొమాంటిక్ హీరోగా చూపిస్తూ సినిమా తీస్తానన్నావు. ఈ సంతోషంలో ఒక పెగ్ వేసుకోనీరా. చంద్రికా. కమాన్... బాటిల్ అందుకో...”
నిస్సహాయంగా డాక్టర్ వంక చూసింది చంద్రిక.
“ఇంక మారడు. మారినా బతకలేదు. కానియ్...” చంద్రికకి సైగ చేసి వెళ్ళిపోయాడు ప్రకాష్
మందు సరంజామా తెచ్చింది. పెగ్ మీద పెగ్ వేసుకుంటున్నాడు విశ్వమూర్తి. అతడికి కంపెనీ ఇవ్వాలి. లేకపోతే చచ్చేంత కోపం వస్తుంది.
అందుకని కూల్ డ్రింక్ నే మందులా తాగుతూ కూర్చుందామె.
అతడి కడుపులోకి "ద్రవం'” దిగుతోంటే, అతదు మెల్లగా మృగంలా మారిపోసాగాడు.
సూపర్‌స్టార్ యశ్ ని పచ్చిగా తిట్టాడు. అతడి నడకనీ, డైలాగుల్నీ హేళన చేశాడు. నిర్మాతల్ని బురదలో దొర్లే పందులంటూ ఈసడించాదు. ఫ్యాన్స్‌నీ వదల్లేదు. గాలికి మారిపోయే రకం అని నిందించాడు. స్టార్‌డమ్‌కి ముందే పార్వతిని పెళ్లి చేసుకోవడం తను లైఫ్‌లో చేసిన పెద్ద పారబాటని వాపోయాడు. ఆమె నలభై ఏళ్ళకే ముసలవ్వ అయిపోయిందని అసహ్యించుకున్నాడు. పిల్లల్ని తలచుకుని ఏడ్చాడు. అంతలోనే, “మళ్ళీ ముఖానికి రంగేసుకుంటా. హీరోలా నటిస్తా. మళ్ళీ సూపర్ స్టార్ని అవుతాను చూడు” అంటూ అరిచాడు.
వంత పాడటం లేదని చంద్రిక జుట్టు పట్టుకుని వంగదీసి వీపు మీద పిడిగుద్దులు గుద్దాడు.
అన్నీ పెదవి బిగువున భరించింది. ఎంచేతనో అతడి మీద జాలి తప్ప కోపం రాలేదామెకి. అతికష్టం మీద రెండు రోటీలు తినిపించి, మందులు మింగించింది. 'సారీ సారీ ' అంటూ మత్తులో కూరుకుపోయాడు విశ్వమూర్తి.
మర్నాడు విశ్వమూర్తిని ఇంటర్వ్యూ చేస్తానంటూ ఓ జర్నలిస్టు వచ్చాడు.
చంద్రిక ఒప్పుకోలేదు. అతడి ఆరోగ్యం బావోలేదని చెప్పింది.
“క్యాన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజిలో కెళ్ళిపోయిందా?”
“మీకనవసరం”
“భార్యని వదిలేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా?”
“షటప్”
“అతడి ఆస్తి కాజెయ్యడానికి ఇంట్లో తిష్ట వేశారని చెప్పుకుంటున్నారు”
“యూ షటప్ అండ్ గెటవుట్"
మాటలు విన్పించి, “ఏం జరుగుతోందక్కడ” లోపల్నుంచి అరిచాడు విశ్వమూర్తి.
“సినీజర్నలిస్టుని సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామనొచ్చాను”
పొంగిపోయాడు. “నా ఇంటర్వ్యూకా? కమిన్ కమిన్. చంద్రికా హెల్ప్ మీ... ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్నేళ్ళయ్యిందో...
మీ పత్రికకి సర్యులేషన్ ఎలా ఉంది?”
“నెంబర్ ఒన్ సార్” ఫుల్ మేకప్‌లో ఉన్న అతడి వంక వింతగా చూస్తూ చెప్పాడు.
“నేనూ నెంబర్ ఒన్ హీరోనే. నన్నెవరూ బీటవుట్ చెయ్యలేరు. నా స్థానం ఎప్పటికీ నాదే. ఎప్పటికీ నేను సూపర్ స్టార్టు
“ఇప్పుడు కొత్త సూపర్ స్టార్ యశ్ సార్”
కయ్‌మని అతడి మీద పడ్డాడు. కాలర్ పట్టుకుని కొట్టబోతే చంద్రిక ఆపింది. “వాడు కాదు నేనే, నేనే సూపర్ అలాగని నీ పేపర్లో రాయి. ఇప్పటికీ రోజూ వేలాదిమంది ఫ్యాన్స్ నా ఇంటికి నన్ను చూడటానికి వస్తున్నారని రాయి. నేను కన్పిస్తే చాలు సూపర్ హీరో అని అరుస్తున్నారని రాయి - తెల్సిందా?” ఒగురుస్తూ చెప్పాడు.
“మీరు మేకప్ వేసుకున్నారేంటి సార్. ఏదైనా షూటింగులో పాల్గొంటున్నారా? అది ఏ సినిమా, అందులో మీది తండ్రి వేషమా, తాత వేషమా?”
విశ్వమూర్తి కళ్ళు ఎర్రబడ్డాయి. పళ్ళు నూరుతోంటే మధ్యలోకి వచ్చి అంది “ఏదో యాడ్ ఫిల్మ్ చేస్తున్నార్లే. ఇక వెళ్ళొచ్చు”
"ఒకే ఒక్క ప్రశ్న సార్. మీ ఇద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది?”
“మిస్టర్. నేను సూపర్ హీరోని. ఆమె నా గ్రేట్ ఫ్యాన్. మైండిట్. నేను ఆకాశంలోని తారని. ఆమె భూమ్మీది పిపీలికం. స్టార్‌కీ ఫ్యాన్‌కీ సంబంధం అభిమానం వరకే. అభినందించడం వరకే పరిమితం”
“మీ ఫోటో తీసుకోనా సార్?”
“నో. నేనే ఇస్తాను. చంద్రికా తెచ్చివ్వు”
ఆమె వెళ్ళి కొన్ని ఫొటోలు తెచ్చిచ్చింది.
“ఇవన్నీ హేడేస్‌లోనివి...”
“అవును. నేనక్కడే సూపర్ స్టార్ దశలోనే ఆగిపోయాను. జనం ఎప్పుడూ నన్ను రొమాంటిక్ హీరోగానే, అందాల నటుడుగానే గుర్తుంచుకోవాలి”
“కాని జనానికి మీరిప్పుడెలా ఉన్నారో చూడాలని ఉత్సుకతగా ఉంటుంది”
“కన్సించట్లేదా? ఇదివరకులానే అందంగా ఉన్నానని చెప్పు. ఫో. నేను ఎప్పటికీ ముసలివాణ్ణి కాను. నన్నెవరూ ముసలివాడిగా చూడలేరు. ఇంకా కూర్చున్నావేంరా ఫోరా ఫో...” చేతికందిన ఫ్లవర్ వాజ్ విసిరేశాడు.
అతడు పారిపోయాడు.
మెల్లగా విశ్వమూర్తి ఆరోగ్యం మరింతగా దిగజారింది. అర్థరాత్రుళ్ళు కడుపులో నొప్పి అంటూ మెలికలు తిరిగి పోతున్నాడు. డాక్టర్ ప్రకాష్ వచ్చి నొప్పి తగ్గించే ఇంజెక్షన్ చేసి వెళ్తున్నాడు.
అవాళ చంద్రికకు చాలా టెన్ష్నన్‌గా ఉంది. మాటి మాటికీ గేటు వంక చూస్తోంది. మేకప్ మ్యాన్, కొడుకు పెళ్లి దృష్ట్యా వారం రోజుల వరకూ రానని చంద్రికకు చెప్పాడు. ఇంకెవరినైనా పంపించమని కోరింది. అతడు సరేనన్నాడుగాని ఇంతదాకా ఎవరూ రాలేదు!
“చంద్రికా. నేను రెడీ. మేకప్ మ్యాన్‌ని పంపించు...” లోపల్నుంచే అన్నాడు. మేకప్ వేసుకునే వరకూ ఆమె కూడా అతడి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు.
మరో గంట గడిచింది. ఎవరూ రాలేదు. విశ్వమూర్తికి ఒళ్ళు మండిపోయింది. “అంతా కలిసి
నాటకాలాడుతున్నారా. వాడు రాకపోయినా ఏది ఆగదు. నాకు నేనే మేకప్ చేసుకోగలను...” అంటూ మేకప్ సరంజామా వున్న సారుగు లాగాడు. చేతి అద్దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
అనుకోకుండా అద్దంలో తన ముఖం కనబడింది. దెయ్యాన్ని చూసినట్టు కెవ్వుమని అరచి కుప్పు కూలి పోయాడు.
కేక విని చంద్రిక వచ్చేసరికే అతడిలోని చిలుక ఎగిరి పోయింది!
చంద్రిక కళ్ళని కన్నీటి వరద ముంచెత్తింది. డాక్టర్‌కి ఫోన్ చేసి ఏడుస్తూ కూలబడింది.
దుఃఖాన్ని నిగ్రహించుకుని విశ్వమూర్తి మృతశరీరం వంక చూసింది. అతి భయంకరంగా కన్పించింది. ముఖం తిప్పుకుంది.
డాక్టర్ ప్రకాష్ వచ్చేసరికి విశ్వమూర్తికి విగ్గు పెట్టి, మేకప్ పూర్తి చేసేసింది చంద్రిక!
“సారీ పార్వతీ. నీ నిరీక్షణ ఫలిస్తుందనీ, అతడు మారతాడనీ, నిన్నూ నీ సేవనూ గుర్తిస్తాడనుకున్నాను తప్ప ఇలా ముగుస్తుందనుకోలేదు”
“మధ్యలో మీరు బాధపడటం ఎందుకు డాక్టర్. స్వంత భార్యనే గుర్తించలేనంతగా మనసుకి ముసుగు వేసేశాడు. మేకప్ లోకంలో బతుకుతూ, మాయాదర్పణంలో చూసుకుంటూ బతికేసిన గొప్పనటుడు. అతడి నిజరూపం ప్రశ్నార్ధకమై నా కళ్ళెదుట నిలుస్తోంటే, అతడితో అన్నేళ్ళు కాపురం చేసినందుకు నామీద నాకే జాలేస్తోంది!”
బావురుమంది చంద్రిక - కాదు పార్వతి!
***** ***** *****
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
రచయిత పరిచయం
సింహ ప్రసాద్ పేరుతొ కథలు రాసే నా పూర్తి పేరు చెలంకూరి వరాహ నరసింహ ప్రసాద్ . 1973 నుండి రచనలు చేస్తున్నాను . ఇంతవరకు 408 కథలు,66 నవలలు ప్రచురితమయ్యాయి . 82 కథలకు,18 నవలలకు,2 నాటకాలకు బహుమతులందుకున్నాను. వివాహ వేదం,తిరుమల దివ్యక్షేత్రం ,స్వేచ్చా ప్రస్థానం ,స్త్రీ పర్వం,ధిక్కారం ,అభయం ,63 బహుమతి కథలు బాగా పేరు తెచ్చి పెట్టాయి. నివాసం హైదరాబాద్ లో.
Comments