top of page

మేలుకొలుపు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


'Melukolupu' Written By N. Siva Nageswara Rao

రచన : ఎన్.శివ నాగేశ్వర రావు

ఈ రోజుల్లో నా వంటి ఎక్కువ మంది గృహిణుల ప్రధాన సమస్య పని మనిషి. జీవితంలో వేగం పెరిగి పోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి క్షణం తీరిక ఉండదు. అంట్లు... ఇల్లుచిమ్మడం… బట్టలు ఉతకడం… స్కూల్ కి వెళ్ళే పిల్లలను తయారు చేయడం… వాళ్లకు, భర్తకు ఫలహారాలు తయారు చేయడం... క్యారియర్లు సిధ్ధం చేయడం...టెన్షన్...టెన్షన్!!

ఏ మాత్రం తేడా వచ్చినా స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. అప్పుడు సమస్య మరింత జటిలం. పిల్లల్ని ఆటోలో స్కూల్ కి దింపి రావాలి. ఇక గృహిణి కూడా ఉద్యోగస్తురాలు అయితే ఇక అష్టావధానం, శతావధానమే!

మావారు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు తొమ్మిది గంటలకు క్యారియర్ సిధ్ధం చేయాలి. ఇక మాకు ఇద్దరు పిల్లలు . ఒక బాబు. ఒక పాప . బాబు ఐదో తరగతి. పాప మూడో తరగతి. వాళ్లకు ఎనిమిది గంటలకు స్కూల్ బస్ వస్తుంది. ఆ లోపు క్యారియర్లు సిధ్ధం చేయాలి.

ఇటువంటి పరిస్థితుల్లో పని మనిషి అవసరం ఎంతన్నదీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి పనిషి దొరక్క పోతే జీవితం దుర్భరం. ఇంతకు ముందు మా ఇంట్లో పనిచేసిన అమ్మాయి గురించి రెండు మాటలు చెప్తాను.

"అంట్లు జిడ్డు పోవడం లేదు" అంటే" అంతకన్నా నావల్ల కాదు. ఇష్టమైతే చేయించుకోండి. లేకపోతే మానేయండి!" అన్నది. అవసరం దృష్ట్యా నోరు మూసుకున్నాను .

ఇంకోసారి చెప్పకుండా నాలుగు రోజులు మానేసింది. అదేమని అడిగితే " మా ఇంటికి చుట్టాలొచ్చారు. మీ ఇంటికేనా మా ఇంటికి రారా! ఊరనే నేనేం మానేయను"అని గయ్ న లేచింది. నా అవసరం గ్రహించి బ్లాక్ మెయిల్ చేస్తున్నది అని గ్రహించాను.

నా స్నేహితురాలు సరస్వతి దగ్గర నా బాధ చెప్పుకున్నాను. అప్పుడామె" మా ఇంటి పని మనిషి చాలా పద్ధతి గల మనిషి. అడిగి చూస్తాను" అంది.

వారం తరువాత ఒక రోజు సరస్వతి "మా పని మనిషి తో మాట్లాడాను. ఒకటో తారీఖు నుంచి వస్తాను అని చెప్పమంది. చాలా నమ్మకస్తురాలు. ఎప్పుడో గాని నాగా పెట్టదు"అని చెప్పింది. “హమ్మయ్య" అనుకున్నాను.

ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటలకు కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా ఉన్న ఆడ మనిషి "

అమ్మా! సరస్వతమ్మ గారు పంపారు " అని చెప్పింది .

లోనికి రమ్మని చెప్పి " నీ పేరు?" అని అడిగాను . "లక్ష్మి"అని చెప్పింది. వయసు యాభై ఉంటుంది. మనిషి శుభ్రంగా ఉంది. మాట మర్యాదగా ఉంది. ఆమెలో ప్రధాన ఆకర్షణ నుదుటి మీద కాసంత కుంకుమ బొట్టు. ఎందుకో ఆమెను చూడగానే నా మనసుకు నిశ్చింత అనిపించింది. తనకు కిచెన్ చూపించాను. గిన్నెలు కడగడం మొదలు పెట్టింది. జీతం సంగతి అడిగాను. సరస్వతమ్మ గారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. మీరూ అంతే ఇవ్వండి" అంది. నేను అంగీకార సూచకంగా తల ఊపాను.

తను పిల్లల ఫలహారాలు. . . క్యారియర్లు. . . హడావుడి అంతా చూసింది. పని పూర్తి చేసి వెళ్లేటప్పుడు " అమ్మా! నేను ఇప్పుడు వెళ్లి వచ్చిన ఇంటివారు వయసులో పెద్దవారు. వాళ్లకు ఉదయాన్నే అంత హడావుడి ఉండదు. మీరైతే పిల్లలను స్కూల్ కి పంపించాలి. వాళ్లకు ఒక మాట చెప్పి మొదట మీ దగ్గరకు వచ్చి తరువాత వాళ్ళ దగ్గరకు వెళ్తాను. “ అని చెప్పింది

ఆ మాట నాకు తీయని మకరందలా అనిపించింది. తను వచ్చిన కొంచెం సేపటికే మా ఇబ్బంది గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది. "అలానే" అన్నాను. చెప్పినట్లే మరునాడు లక్ష్మీ ఉదయం ఆరింటికే వచ్చింది. పనిలో ఆమె సహాయం నాకు చాలా హాయిగా అనిపించింది.

టిఫిన్ పెడితే " వద్దమ్మా!ఉదయం అంబలి తాగి బయలు దేరుతాను. కాఫీ, టీలు అలవాటు లేదు" అని చెప్పింది. అదే మాన్పించిన పని మనిషి కైతే " మేం చేసుకోని రోజు అయినా తనకు చేయ వలసినదే!

లక్ష్మి పనిలో కి వచ్చినతరువాత నాకు టెన్షన్ తగ్గింది. సరస్వతి చెప్పినట్లు నమ్మకస్తురాలు. పని మానదు. తప్పనిసరి అయి మానినా ముందే చెప్తుంది. పాత పని మనిషి తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి బయట పడ్డాను.

లక్ష్మి మా ఇంట్లో పనికి చేరి ఆరు నెలలు దాటింది. ఒకసారి పండక్కి చీర కొని ఇచ్చాను. తను తీసుకోవడానికి ఇష్ట పడలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. " జీతం ఇస్తున్నారు కదమ్మా! మళ్లీ ఇవన్నీ ఎందుకు? నేను మీకు ఋణ పడి పోతాను " అంది.

ఏ పని మనిషీ అలా కొత్త చీర వద్దనడం నేను వినలేదు. అప్పుడు నేను " లక్ష్మీ! ఇది నేను నీకేం ప్రత్యేకంగా తీసుకోలేదు. మాతో పాటు తీసుకున్నాం. నీవు మా మనిషివి" అన్నాను. లక్ష్మి మరేం మాట్లాడ లేదు. తీసుకొని నాకు దండం పెట్టింది.

" నీవు దీవించాలి గాని దండం పెట్టకూడదు"అన్నాను. మౌనంగా తల పంకించింది. లక్ష్మి మౌనంగా తన పని తాను చేసుకు పోయేది గాని ఎక్కువ మాట్లాడేది కాదు. ఆ ఇంటి కబురు, ఈ ఇంటి కబురు చెప్పే అలవాటు తనకు అసలు లేదు. నోరు ఊరుకోక నేనే మాట కలిపేదాన్ని.

ఒకసారి " లక్ష్మీ! పథకాల డబ్బులు అందుతున్నాయా?" అని అడిగాను. అందుకు లక్ష్మి " అమ్మా! నాకు నా కష్టార్జితమే ఇష్టం. పని చేయకుండా వచ్చే డబ్బు మీద నాకు మమకారం లేదు" అన్నది. నాకు 'ఈ రోజుల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారా?' అనిపించింది.

ఒకరోజు సాయంత్రం నేను, మావారు అనుకోకుండా బయటకు వెళ్లవలసి వచ్చింది. అప్పుడు లక్ష్మితో " లక్ష్మీ! మేం ఒక గంటలో వచ్చేస్తాం. కొంచెం పిల్లల్ని చూసుకో!" అని చెప్పాను . " అలాగేనమ్మా!" అంది లక్ష్మి.

మేం రావడం కొద్దిగా ఆలస్యం అయింది. మేం వచ్చేసరికి పిల్లలకు లక్ష్మి ఏదో చెప్తున్నది. వాళ్ళు క్రింద కూర్చుని బుధ్ధిగా వ్రాస్తున్నారు.

"ఏం చేస్తున్నారు?" అని పిల్లలను అడిగాను. లక్ష్మి మాకు తెలుగు దిక్టేషన్ చెప్తున్నది" అని చెప్పారు పిల్లలు. నాకు అబ్బురంగా అనిపించింది.

"ఎంతవరకు చదివావు లక్ష్మీ!" అని అడిగాను. పదో తరగతి పాసయ్యాను. అమ్మ, నాన్న చదివించలేక మానిపించారు" అంది లక్ష్మి.

పిల్లల నోట్ బుక్స్ చూసాను. లక్ష్మి చేసిన కరెక్షన్స్ కనిపించాయి. తన చేతి వ్రాత గుండ్రంగా, చూడ ముచ్చటగా ఉంది.

అంతలో లక్ష్మి" అమ్మా! ఈ కాలపు పిల్లలు తెలుగు సరిగా వ్రాయడం లేదు. అది మన మాతృ భాష కదా. తల్లిదండ్రులు ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే తెలుగు భాష చచ్చి పోతుంది" అని బాధ పడింది. తన జ్ఞానానికి, తెలుగు భాష పట్ల అభిమానానికి ముగ్ధురాలిని అయ్యాను.

అక్కడే ఉండి లక్ష్మి చెప్పింది విన్న మా శ్రీవారు చిన్నగా చప్పట్లు కొట్టి " లక్ష్మి ఎంతో బాగా చెప్పింది. ఆ మాటలు మనసుకు ఎక్కించుకొని తెలుగు బాగా నేర్చుకోండి" అని పిల్లలకు చెప్పారు. లక్ష్మి మా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పోయింది.

నేను, మావారితో " లక్ష్మి సంథింగ్ స్పెషల్" అన్నాను.

"అవును" అంటూ ఆయన నాతో ఏకీభవించారు.

నేను అప్పుడప్పుడు నాకు తెలీకుండానే లక్ష్మి గురించి ఆలోచించసాగాను. తన నోటినుంచి ఒక అనవసరపు మాట రాదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడదు. ఇతరుల విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపదు. ఊరికినే ఏం తీసుకోదు. తన కష్టాన్నే నమ్ముకుంటుంది. పేదరాలు అయినా అభిమానవంతురాలు అనుకున్నాను.

ఒకసారి " లక్ష్మీ! మీ ఇంటి పరిస్థితులు ఏమిటి?" అని అడిగాను. " మా ఆయన పెళ్ళైన ఐదేళ్లకే జబ్బు చేసి చనిపోయాడు. ఒక కొడుకు. పెళ్లి అయింది. హైదరాబాద్ లో ఆటో తోలుతాడు. నేను, మా అత్త ఉంటున్నాము" అని టూకీగా చెప్పింది.

" ఎప్పుడైనా డబ్బు అవసరమైతే అడిగి తీసుకో" అన్నాను. " ఉన్నంతలోనే సర్దుకు పోతామమ్మా. అప్పు అడిగే అవసరం రాదు" అన్నది లక్ష్మి.

లక్ష్మి నోరు విప్పదు. విప్పితే వచ్చే మాట తప్పక ఒక ఆణిముత్యం అవుతుంది అనిపించింది. లక్ష్మి మనసులో మా స్థానం ఏమిటో తెలీదు గానీ మా మనసుల్లో లక్ష్మి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది .

ఒక రోజు లక్ష్మి నాతో" అమ్మా! నాకు చిన్న సాయం చేయాలి" అని అడిగింది.

లక్ష్మి నా దగ్గర పనిలో చేరి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తున్నది . ఇన్నాళ్ళల్లో తను నోరు తెరిచి సాయం కోరడం ఇదే తొలిసారి. అది ఎలాంటి సహాయం అయినా చేయాలని మనసులో నిర్ణయించుకొని " చెప్పు లక్ష్మీ!"అన్నాను.

లక్ష్మి నా చేతిలో ఒక పేపర్ కటింగ్ పెట్టింది. "అమ్మా!ఎవరో పదేళ్ల బాబుకు గుండె ఆపరేషన్ అట. డబ్బు సాయం కోరారు. ఈ రెండు వందలు వాళ్ళ అకౌంట్ కి మీ ఫోన్ ద్వారా పంపండి. బ్యాంక్ కి వెళ్లి డబ్బు పంపడం నాకు తెలీదు" అని రెండొందలు నా చేతిలో పెట్టింది.

తనకోసం ఏదో సాయం అడుగుతుంది. చేద్దాం అనుకున్న నేను తను అడిగిన సాయం విని సిగ్గు పడ్డాను. అటువంటి ఆలోచన ఎన్నడూ చేయనందుకు సిగ్గు పడ్డాను.

" నేను డబ్బు పంపుతాను. నీవు ఉంచుకో " అని రెండు వందలు ఇవ్వబోయినా లక్ష్మి

తీసుకోలేదు. "మీరుపంపేవి మీరు పంపండి. సాయం చేసినవాళ్ళు అవుతారు" అంది.

ఆ సాయంత్రం మావారితో ఆ విషయం చెప్పాను . "గ్రేట్! మన లక్ష్మిని చూసి మనం

ఎంతో నేర్చుకోవాలి. మన తరఫున ఆ అకౌంట్ కి రెండు వేలు పంపు" అన్నారు.

ఆ రాత్రి లక్ష్మీ నాకు కలలో కనిపించింది. తను గగన విహారం చేస్తుంటే మేమంతా క్రింద నుంచి తలలు పైకెత్తి ఆమెను చూస్తున్నాం.

ఒకరోజు సాయంత్రం మావారు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేశారు. అడిగి తే తలనొప్పి అని చెప్పారు. నేను ఆయన తలకు జండూ బామ్ రాస్తున్నాను. ఇల్లు చిమ్ముతున్న లక్ష్మి అది చూసి

" ఏం బాబూ ! ఒంట్లో నలతగా ఉందా?" అని అడిగింది. సాధారణంగా తను మావారితో మాట్లాడదు. కనిపిస్తే ప్రక్కకు తప్పుకుంటుంది.

"అవును. ఆఫీసులో సమస్యలు. . . పని ఒత్తిడి" అన్నారాయన. అది విన్న లక్ష్మి

"బాబూ!పెద్దదాన్ని. మీరు తప్పుగా భావించక పోతే ఒక మాట చెప్తాను" అంది లక్ష్మి.

" నీవు మా శ్రేయోభిలాషివి. చెప్పు" అన్నారు మావారు కొంచెం కుతూహలంగా.

" రోజూ ఉదయం ధ్యానం చేయండి. అది మీకు శక్తినిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది" అని చెప్పింది. అది విని నేను, మావారు ఉలిక్కి పడ్డాము.

మా ఇంటి పని మనిషి మాకు ధ్యానం గురించి చెప్పడం అద్భుతంగా అనిపించింది. నేను, మావారు లక్ష్మిని సరికొత్త కోణంలోంచి చూశాము.

మావారు " నీవు ధ్యానం చేస్తావా?" అని అడిగారు . " చేస్తాను బాబూ! నా జీవితంలోని

ఆటుపోట్ల నుంచి నన్ను సేద తీర్చింది ధ్యానమే!" అని చెప్పింది లక్ష్మి.

" ఎవరు నేర్పారు?" అని ప్రశ్నించాను.

పదేళ్ల క్రితం ఒక ధ్యాన మందిరంలో చిమ్మే పని చేసేదాన్ని. అక్కడ గురూజీ నేర్పించారు" అని చెప్పింది లక్ష్మి.

" నేను ధ్యానం గురించి వినడమే గాని, ఎప్పుడూ చేసింది లేదు. నీకు తెలిసింది చెప్పు. రేపటినుంచి ప్రయత్నిస్తాను" అన్నారు మా వారు.

లక్ష్మి నెమ్మదిగా ధ్యానం గురించి, ఆరంభంలో ఎదురయ్యే ఏకాగ్రతకు భంగం కలిగించే ఆలోచనల గురించి, వాటిని ఎలా అధిగమించాలో చక్కగా వివరించింది. విన్న మేం ముగ్ధులమయ్యాము. నిజం చెప్పాలంటే లక్ష్మికి చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అనిపించింది.

లక్ష్మి "బాబుతో పాటు, నీవూ చేయమ్మా! చాలా మంచిది" అని చెప్పింది. నెమ్మదిగా వంట గదిలోకి వెళ్ళి అంట్లు కడిగి వెళ్లి పోయింది.

ఆ రాత్రి డిన్నర్ సమయంలో నేను, మావారు లక్ష్మి గురించే మాట్లాడుకున్నాం. ఆవిడను పని మనిషి అని చెప్పుకోవడానికి మనస్కరించలేదు. ఆమె ఒక ఆణి ముత్యం. గుడిసెలో ఉండే ఆమెకు అంతఃపురంలో ఉండే వారు కూడా సరి తూగరు అనిపించింది. రోజూ ఆలస్యంగా లేచే మావారు మరుసటి రోజు ఉదయం ఐదింటికే లేచి పోయారు.

"ఎందుకు? త్వరగా లేచి పోయారు?" అని అడిగాను.

"లక్ష్మి చెప్పింది కదా! మెడిటేషన్ చేసి చూస్తాను" అన్నారు. ఒక పావు గంట కదలకుండా కూర్చున్నారు. పనిలోకి వచ్చిన లక్ష్మి అది చూసి " ఒకేసారి ఎక్కువ సేపు కష్టం. రోజుకు ఐదు నిముషాల చొప్పున పెంచండి" అని చెప్పింది.

నెల గడిచింది. మావారిలో మార్పు కనిపించింది. అరగంట సేపు ధ్యానంలో కూర్చోగలుగుతున్నారు. పనిలో కూడా అంత ఒత్తిడి అనిపించడం లేదని చెప్పారు.

నేను లక్ష్మి విషయాలు ఎప్పటికప్పుడు సరస్వతికి తెలియ బరుస్తోనే ఉన్నాను. అవి వింటూ ఉండే సరస్వతి ఒకరోజు

" మన లక్ష్మి గురించి ఈ మధ్యనే ఒక విషయం తెలిసింది. పోయినేడు వాళ్ల అత్తకు రెండు కిడ్నీలు పాడయ్యాయట. ఇక బ్రతకదు అనుకున్నారట. అప్పుడు లక్ష్మి తన కిడ్నీ ఒకటి ఇచ్చి బ్రతికించిందట. డాక్టర్స్ వయసు పైబడిన ఆవిడకు కిడ్నీ ఇచ్చి నీవు రిస్క్ తీసుకోవడం సరి కాదు. అని చెప్పినా వినలేదట" అని చెప్పింది.

నాకు మాట రాక మౌనం వహించాను. కిడ్నీ ఇవ్వడం ప్రక్కన పెడితే ఎవరితోనూ ఒక్క మాట చెప్పకపోవడం గొప్ప విషయం.

లక్ష్మి మా ఇంట్లో పని చేసేటప్పుడు తను గమనించకుండా తన వంక చూస్తూ ఉండేదాన్ని. తనలో నాకు ఒక గొప్ప వ్యక్తి కనిపించేది. తన విశిష్ట వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కరించే దాన్ని.

ఒకరోజు ఉదయం ఏడు దాటింది. లక్ష్మి పనికి రాలేదు. నాకు ఆశ్చర్యం వేసింది ఎప్పుడూ తను ఆలస్యంగా రాదు. ఆరోగ్యం బాగా లేదా? అన్న సందేహం వచ్చింది. అంతలో సరస్వతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నా మనసు ఎందుకో కీడు శంకించింది. ఫోన్ లిఫ్ట్ చేశాను.

" మల్లికా! నీకో బ్యాడ్ న్యూస్. మన లక్ష్మి తెల్లవారు ఝామున గుండె పోటుతో చనిపోయిందట. ఇప్పుడే మా పాలబ్బాయి చెప్పాడు" సరస్వతి చెప్పింది

మొత్తం వినక ముందే నా మస్తిష్కం మొద్దు బారి పోయింది

నా వాలకం చూసిన మావారు "ఏమైంది?" అని అడిగారు. విషయం చెప్పాను. ఆయన చాలా బాధ పడిపోతూ " చూసి వద్దాం. పద!" అని బయలు దేరిపోయారు.

ఇద్దరం బైక్ మీద వెళ్ళాం. మధ్యలో ఆయన పూల దండ, గులాబీ పూలు తీసుకున్నారు. మేం

వెళ్లేసరికి లక్ష్మి శవం దగ్గర వాళ్ల అత్త కూర్చుని ఏడుస్తున్నది. గంట గడిచేసరికి లక్ష్మి పనిచేసే ఇళ్ళ వాళ్ళందరూ ఆఫీస్ లకు సెలవు పెట్టుకొని వచ్చేశారు. అందరూ ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకున్నారు.

ఆమె కొడుకు మధ్యాహ్నానికి వచ్చాడు. ఆమె పాడె పూల దండలతో నిండిపోయింది. వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఆమె శవానికి వినమ్రంగా మొక్కారు. శవ యాత్ర ఘనంగా జరిగింది. చుట్టు ప్రక్కల గుడిసెల వాల్లుమేమంతా ఆమెనుమహారాణి లా సాగనంపాం అని చెప్పుకోవడం విన్నాను. ఆమె దిన కార్యక్రమం కూడా అందరం దగ్గరుండి బాగా జరిపాం.

మేం లక్ష్మి ఎంతో బాగా చూసుకునే ఆమె అత్తగారికి భుక్తికి లోటు లేకుండా ఏర్పాట్లు చేసాము. ఎందుకంటే లక్ష్మి తనకు చేసిన దానికంటే ఆమెకు చేసినదానికే ఎక్కువ సంతోషిస్తుంది అని మాకు బాగా తెలుసు.

ఆ తరువాత లక్ష్మి జ్ఞాపకార్థం నేను కూడా మా వారితో పాటు ధ్యానంలో కూర్చో సాగాను. రెండు కళ్ళు మూయగానే నా మనోనేత్రం ముందు నుదుటన కాసంత బొట్టు పెట్టుకొని నిర్మల వదనంతో మెరిసిపోయే లక్ష్మి కనిపించేది.

మన జీవితాలు మార్చడానికి మహనీయుల జీవిత గాథలు, ప్రవచనాలు మాత్రమే కాదు, సామాన్యుల జీవితాలూప్రేరణ అవుతాయి. అయితే వారు లక్ష్మిలా చిత్త శుద్ధి కలవారై ఉండాలి. మనలోని మానవతను మేలుకొలపాలి! జ్ఞాన జ్యోతిని వెలిగించి గలగాలి!!

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


169 views0 comments

コメント


bottom of page