మీ లాగా ఎందరు

'Me Laga Endaru' Written By Alla Nageswara Rao
రచన : ఆళ్ల నాగేశ్వర రావు
అందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని సా ప్ట్ వేర్ ఇంజనీర్లుగా, టీచర్లుగా, లాయర్లుగా తీర్చిదిద్దాలనుకొంటున్న నేటి రోజుల్లో, మా పెద్దమ్మాయిని నర్సుగా తీర్చిదిద్దాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వృత్తి రీత్యా ఆర్టీసీ కండక్టర్ గా ప్రత్యక్షంగా అనునిత్యం వందలా ది మంది జనులకు సేవ చేసే మహద్భాగ్యం నాకు కలిగినట్లు గానే, మా అమ్మాయికి కూడా ఇలాంటి అవకాశం కలిగించాలనే సదుద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఇంటర్మీడియేట్ బై పిసి గ్రూప్ 'ఎ' గ్రేడుతో పాసైన మా పెద్దమ్మాయి, హైదరాబాద్ లోని ఓ మెడికల్ కాలేజీ వారి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో సీటుకై వారు నిర్వహించిన ప్రవేశపరీక్షలో పాసై, సీటును మెరిట్ తో సాధించి, అక్కడే కాలేజీకి అనుబంధంగా ఉంటున్న హాస్టల్లోనే ఉంటూ, చదువును కొనసాగిస్తూ , దిగ్విజయంగా మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరాన్ని కొనసాగిస్తూఉంది .
ఆ రోజు గురువారం. మా ఆరాధ్య దైవం పూజ్య సాయిబాబా వారం. అందరు ఉద్యోగస్తులకు ఆదివారం సెలవు దినమైతే, నాకు మాత్రం గురువారం సెలవు దినం. ఆదివారాల్లో అందరిలా నేను కూడా ఆ రోజు కొంచెం ఆలస్యంగా నిద్ర లేస్తాను. అలాగే ఉదయం 8 గంటలకు నిద్ర లేచి, పూజా కార్యక్రమాలు ముగించుకుని, ఆనాటి దినపత్రికను చదువుతూ కూర్చున్నాను.
సెల్ ఫోన్ రెండు సార్లు మోగి ఆగిపోయింది. అంటే హైదరాబాద్ లో ఉంటున్న
మా పెద్దమ్మాయి రెండు రింగ్ లిచ్చి ఆపింది. తెనాలిలో ఉంటున్న మాతో రోజుకోసారైనా
మాట్లాడుతుంది.
మా ఆవిడ సెల్ ఫోన్ అందుకుని, రింగులొచ్చిన నెంబరుకు ఫోన్ చెసింది. అవతల మా పెద్దమ్మాయి, ఇవతల మా ఆవిడ
కొద్దిసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నాక....
"ఏమండీ! అమ్మాయి మీతో ఏదో మాట్లాడాలంటుంది మాట్లాడండి " అంటూ ఫోనును నా చేతికి ఇచ్చింది. ఎప్పుడూ వాళ్ల అమ్మతోనే క్లుప్తంగా మాట్లాడి ముగించే మా
అమ్మాయి ఈ రోజు నాతో ప్రత్యేకించి మాట్లాడాలని అంటుందంటే ఏదో ప్రత్యేకత
ఉంటుందనుకొంటూ ఫోన్ ను అందుకున్న నేను
" హలో, ఎలాగున్నావమ్మా " అంటూ మాట్లాడటం ఆరంభించాను
"" హాయ్ డాడీ ! ఐ యామ్ ఫైన్, గుడ్మార్నింగ్ డాడీ "" అని విష్ చేసింది.
"" వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా,! నీ చదువు ఎలా కొనసాగుతుంది? రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? " అంటూ ప్రశ్నించాను నేను.
"" డాడీ ... రిజల్ట్స్ నిన్ననే వచ్చాయి . కానీ.... కానీ..
మరి" అంటూ నీళ్లు నములుతున్న ఆమె పరిస్థితిని గమనించి, " ఏంటమ్మా! చెప్పు.
ఏమైంది? భయపడకు" అంటూ దైర్యం చెప్పాను నేను.
" నాన్న ఫస్ట్ ఇయర్లో సైకాలాజి సబ్జెక్టు బాగా కష్టంగా ఉన్నందున. మరియు ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదివి , ఒ క్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినందున, సైకాలాజి, ఇంగ్లీష్ సబ్జక్ట్స్ లో ఫెయిల్ అయినాను. కాలేజీ నుంచి ఇంటికి పంపిస్తారేమోనని భయంగా ఉంది నాన్నా! ఈ విషయం అమ్మకు తెలియదు.
చెప్పకు నాన్నా "అంటూ నన్ను వేడుకుంది.
సాధారణంగా ఆడపిల్లకు తల్లి వద్ద చనువు ఉంటుంది. మా విషయంలో అది రివర్స్ అన్న మాట.
"" పిచ్చిపిల్లా! భయపడాల్సిన. పనేమీ లేదమ్మా. నాలుగు సంవత్సరాల బియసి నర్సింగ్ కోర్సులో మొదటి సంవత్సరం స్టడీ బాగా కష్టమని నాకు తెలుసమ్మా. అందులో తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మారిన మీలాంటి వారికి మరెంత కష్టం ? రెండవ. సంవత్సరాన్ని కొనసాగిస్తూ, మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన సబ్జక్ట్స్ రాసుకునే అవకాశం ఉంటుంది లేమ్మా " అంటూ సముదాయిస్తూ బదులిచ్చాను నేను.
మా సంభాషణ. అంతా వింటున్న మా ఆవిడ ఫోన్ అందుకుని " అమ్మా! భయ పడకు.
దైర్యంగా ఉండు. సబ్జక్ట్స్ పొతే మళ్ళీ రాసుకోవచ్చు. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. అయినా నీలాగా సబ్జక్ట్స్ ఫెయిలయిన వారు ఇంకా నీ స్నేహితులు లేరా?
అని ప్రశ్నించినది.
"" చాలా మంది ఉన్నారమ్మా "" అంటూ బదులిచ్చింది మా అమ్మాయి.
" అన్ని వేల ఫీజులు కడితే ఇంటికేమీ పంపరులేమ్మా. వచ్చే పరీక్షల్లో ఆ ఫెయిల్ అయిన సబ్జక్ట్స్ రాసేందుకు ఇప్పటినుంచే కష్టపడి చదువమ్మా ఫోన్ మీ నాన్నకు ఇస్తున్నా"నంటూ అమ్మాయికి దైర్యం చెప్పి ఫోన్ ని నా చేతికి ఇచ్చింది మా ఆవిడ.
ఫోన్ అందుకున్న నేను " చెప్పమ్మా, ఇంకేమిటి విశేషాలు? అంటూ ప్రశ్నించాను .
"నాన్నా! అందరు పిల్లల తల్లిదండ్రులూ మీలాగా ఆలోచించి, మాలాంటి వారికి దైర్యం చెపితే మరెంతో ఉత్సాహంతో ముందడుగు వేస్తాము కదా. కానీ.... అంటూ ఏదో చెప్పాలని చెప్పలేక ఆగిపోయింది.
" ఏంటమ్మా! ఏమైంది... ఏం జరిగిందో చెప్పమ్మా ..." అంటూ ఆత్రుతగా ప్రశ్నించాను నేను.
" నా స్నేహితురాలు, నా రూమ్మేటు లావణ్యకు కూడా మాలాగే మూడు సబ్జక్ట్స్ పోయాయి నాన్నా! వాళ్ల నాన్నకు ఫోన్ చేసి చెపితే 'వేలకు వేలు ఫీజులు పోసి చదివిస్తుంది బాగా చదవాలని గాని, పరీక్షలు తప్పాలని కాదు. దూరంగా ఉంటున్నాను కదాని, నెల నెలా చేతికి
డబ్బు అందుతుందికదాని పిచ్చి వేషాలు వేస్తే ఫెయిల్ కాక పాస్ ఎలా అవుతావు? ఇక
చదివింది చాల్లే గాని, చదువు అపి ఇంటికి వచ్చేయ్. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను .
ఇంకా మూడు సంవత్సరాలకు పెట్టే ఖర్చును కట్నంగా ఇస్తాను ' అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు నాన్నా. మరి ఆ అమ్మాయికేమో నర్స్ వృత్తి అంటే అత్యంత ఇష్టం. మానవ సేవే మాధవసేవ అన్న మదర్ థెరిసా సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని, నర్సు కోర్సులో అడిగిడిన లావణ్య, వాళ్ల నాన్న అన్న మాటల్ని జీర్ణించుకోలేక పోయింది నాన్నా! "
" ఏం జరిగిందమ్మా. లావణ్య..... లావణ్యకు ఏమైంది? " అంటూ అమ్మాయిని మధ్యలోనే ఆపి అదుర్ధాగా ప్రశ్నించాను నేను.
రాత్రి అందరూ నిద్ర పోయాక తెల్లవారు ఝామున మేము ముందుగానే తెచ్చి పెట్టుకు న్న ఆరు ఆలౌట్స్ లోని. లిక్విడ్ ను పగలకొట్టుకొని త్రాగింది నాన్నా! మధ్యలో బాత్రూంకు వెళ్లేందుకై లేచిన నాకు లావణ్య నోట్లో నుంచి నురగలు రావడం గమనించి
మిగతా రూమ్మెట్స్ ని లేపి, హాస్టల్ వార్డెన్ గారికి తెలియ చేస్తే, వెంటనే ఆయన, లావణ్యను మా హాస్పిటల్ లోనే చేర్పించి చికిత్స చేయించారు ."
"" ఇప్పుడు లావణ్యకు. ఎలా ఉందమ్మా " అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాను నేను.
"ప్రాణాపాయం లేదని చెప్పారు నాన్నా. మీరేమంటారో నన్న భయంతో మీకు ఫోన్ చేశాను " అంటూ బదులిచ్చింది.
" ఏదో తల్లిదండ్రులు ఆవేశంలో అంటే వాటిని పట్టించుకుంటే ఎలాగమ్మా. ఎవరు ఏమి చెప్పినా మీ మంచి కోసమే కదా. మీ ఉజ్వల భవితను కోరే కదమ్మా. అయినా చచ్చి సాధించేది ఏముంటుందమ్మా. ఎలాగోలా వాళ్ల నాన్నకు నచ్చచెప్పి, వచ్చే సంవత్సరం బాగా చదివి, మంచి మార్కులతో పాస్ కావచ్చు కదా. ఇది నా మాటగా లావణ్యకు చెప్పమ్మా".
" అలాగే నాన్నా. మరి ఉంటాను "" అంటూ ఫోన్ పెట్టేసింది మా అమ్మాయి.
ఇదంతా ఆలోచిస్తే తల్లి దండ్రులదే తప్పనిపిస్తుంది. పిల్లల. శక్తియుక్తుల్ని గమనించక, లక్షలకు లక్షలు పోసి, కోర్సుల్లో చేర్పించి, చేతులు దులుపు కుంటున్నారు గాని, వాస్తవ. పరిస్థితుల్ని గ్రహించడంలేదు. వారి ఆశా జ్యోతుల్ని వారి చేతులతో వారే ఆర్పేసుకుంటున్నారు . పిల్లల ప్రవర్తనలను అనుక్షణం గమనిస్తూ వారికి సరైన మార్గాన్ని చూపాల్సిన తల్లిదండ్రులు, ఆవేశంలో అనాలోచితంగా ప్రవర్తిస్తే, లావణ్య లాంటి పిరికివారు ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు. ఆత్మ హత్యలు అన్ని సమస్యలకూ పరిష్కారం
కాదని, దైర్యంగా వాటిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని నేటి యువత. అలవర్చు కోవాలని,
తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ఆలోచించి, ముందడుగు వేస్తారని ఆశిద్దాం.
.............................................................
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి