
'Miremantaru' written by Muralidhara Sarma Pathi
రచన : పతి మురళీధర శర్మ
సూర్యుడస్తమించి ఎంతో సమయం కాలేదు. శత్రుసైన్యం పొంచిఉండి మూకుమ్మడిగా దాడి చేసినట్టు చీకట్లు కమ్ముకుంటున్నాయి. దమయంతికి రాయబారం మోసుకుపోయే రాజహంసలా రివ్వున దూసుకుపోతున్న రోడ్డు రవాణా సంస్థ ఎక్స్ ప్రెస్ బస్సు డ్రైవర్ వేసిన సడన్ బ్రేక్ కి టీచర్ చెవి మెలి పెట్టిన చిన్న కుర్రాడిలా కీచుమంటూ అరచి ఆగిపోయింది. కిటికీ ప్రక్క సీట్లో కూచుని కళ్ళు మూసుకుని ఊహాలోకాల్లో విహరిస్తున్న కృష్ణమూర్తి ఒక్కసారిగా త్రుళ్ళి పడి కళ్ళు తెరిచి చూసేడు. రావణాసురుడి తలల్లా అందరి తలలూ అప్పుడే కిటికీల్లోనుండి బయట ఏమైందా అని చూస్తున్నాయి. కృష్ణమూర్తి కూడా ఆత్రుతగా కళ్ళు నులుముకుని బయటకు చూసేడు.
రోడ్డు మీద రక్తపు మడుగులో ఓ యువకుడు పడి ఉన్నాడు. కొద్ది దూరంలో ఓ స్కూటరు పడిపోయిఉంది. పగిలిన గాజు ముక్కలు లైటు వెలుతుర్లో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. దాన్నిబట్టి చూస్తే అక్కడ ఒక ఏక్సిడెంట్ అయిందని వేరే ఎవరూ చెప్పనక్కర్లేకుండానే తెలిసిపోతుంది. ఆ యువకుడు " నేను బ్రతికే ఉన్నాను. నన్ను రక్షించండి. " అని తెలపడానికన్నట్లుగా సన్నగా మూలుగుతున్నాడు. శరీరంలో కదలిక కూడా ఉంది. ఇంతకీ ఆ దుస్సంఘటనకు కారకుడైన వ్యక్తిగాని, ఆ యువకుణ్ణి ప్రమాదానికి గురిచేసిన వాహనం గాని అక్కడ ఉన్నట్లు లేదు.
ఆ దృశ్యం చూసేసరికి కృష్ణమూర్తి హృదయం ద్రవించిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణీకులు కొంతమంది బస్సును ప్రక్కకు తీసి ఆపించమని కండక్టరుకు చెప్తున్నారు జరిగిందేమిటో తెలుసుకుందామనే కుతూహలంతో. కాని మరికొంతమంది అందుకు ఒప్పుకోవడంలేదు. " జరిగిపోయిన ప్రమాదమేదో జరిగిపోయింది. మనం వెళ్లి తప్పించాలా? రక్షించాలా? మనం అక్కడకు వెళ్తే పోలీసులు వచ్చి మనల్ని సాక్ష్యం అడుగుతారు. సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. ప్రమాదస్థలం దగ్గర ఉన్నందుకు తెలియదని చెప్తే ఊరుకోరు. మనల్ని పట్టుకుంటారు. ఇక మనం ఇంటికెళ్ళం. ఇంతే సంగతులు. " అన్నారు.
" నిజమేనండీ! నేను గాని ఇప్పుడు బస్సును ప్రక్కకు తీసి నిలబెడితే ఈ ఏక్సిడెంట్ నేనే చేసేనంటారు. అసలు చేసిన వాడేమో ఎలాగూ తప్పించుకుని వెళ్లిపోయేడు. మధ్య పోలీసులకు నేను దోరికిపోతాను. నా మీద కేసు బనాయించేస్తారు. మీకు తెలియదు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే మా బ్రతుకు తెల్లారిపోయినట్లే. మీకు క్రొత్త గాని మేం రోజూ ఇలాంటివెన్నో చూస్తుంటాం. అంచేత నేను బస్సు ఆపేదిలేదు. " అన్నాడు డ్రైవరు.
ఇంతలో ఒకాయన ముందుకొచ్చి " అదేం మాటండీ? అందరూ ఒకరికి చెప్పడానికి ఆదర్శాలు పలుకుతుంటారు. తన దాకా వచ్చేసరికి నీరు కారిపోతుంటారు. మీరు బైబిల్ లో అసలైన పొరుగువాడి కథ వినలేదా?" అని అడిగేడు. అయితే మీరు క్రిస్టియనా? అని అడిగేడో కుర్రాడు.
" చూడు బాబూ! నేను క్రిస్టియనైనా, హిందువునైనా, ముస్లింనయినా తోటి మానవుణ్ణి ఆదుకోమనే చెప్తుంది ఏ మతమైనా" ఆవేశంగా అన్నాడా పెద్దమనిషి.
అతనికున్నపాటి ఆలోచన, వివేకం ఇంగితజ్ఞానం తనకు లేకపోయేయే అనిపించింది కృష్ణమూర్తికి.
" అయితే ఆ ఆపద్భాందవుడు మీరే ఎందుకు కాకూడదు?" అడిగేడు డ్రైవరు.
" తప్పకుండా. అందుకే నేను దిగుతున్నది. " జవాబిచ్చేడాయన.
" ఏమండోయ్! మీ పేరేమిటో తెలియదు. "
" ధర్మారావు"
" ఆ ధర్మారావుగారూ! మీరు దిగేరని మీరు వచ్చేంతవరకూ బస్ ఆపేదిలేదు. ఇష్టం ఉంటే దిగి వెళ్ళవచ్చు. " అన్నాడు డ్రైవరు.
" ఇప్పుడు మనం టౌన్ లిమిట్స్ లోకి వచ్చేసేం. పరవాలేదు. నేను ఏ సిటీ బస్ మీదైనా వచ్చేస్తాను " అంటూ దిగిపోయేడు ధర్మారావు. కృష్ణమూర్తి మనసు కూడా అతనిని లాక్కెళ్ళి ఆ పెద్దమనిషి వెనకాలే బస్ దింపేసింది. ఆవేశమే గాని ఒక మంచి పని చేయడానికి ముందుకు వచ్చే చొరవా, ధైర్యం కృష్ణమూర్తికింకా రాలేదు. కనీసం అలా ముందుకు వచ్చేవాళ్ల వెనకనైనా ఉంటే తనకూ ఆ గుణం అలవడుతుందేమోనన్న ఆశతో కృష్ణమూర్తి ఆయనను అనుసరించేడు. వాళ్ళిద్దరూ దిగగానే బస్ వెళ్ళిపోయింది.
ఆ దారిన వచ్చేపోయే వాళ్ళు ఒకరొకరూ ఆగి చూసి వెళ్ళిపోతున్నారు. కాని ఏ ఒక్కరూ ఆ యువకుడికి సహాయంగా చేయందించడానికి జంకుతున్నారు.
" ఏమండీ ఇప్పుడేం చేద్దాం?" అన్నాడు కృష్ణమూర్తి ధర్మారావుతో .
ధర్మారావు ఏక్సిడెంట్ అయిన యువకుడ్ని పరీక్షగా చూసేడు. పరవాలేదు. ప్రాణం ఉంది అన్న నిర్ధారణకు వచ్చి "ముందితనిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు అర్జెంటుగా తీసుకెళ్ళాలి" అన్నాడు. ఇంతలో అక్కడ మూగిన జనంలో ఒకరు " అలాగ గాని చేసేరు కొంపదీసి. మధ్య మీరు ఇరుక్కుంటారు కేసులో. పోలీసులొచ్చి చూడందే మీరు ఇతనిని కదపగూడదు. " అన్నాడు.
" అల్లుడొచ్చేవరకూ అమావాస్య ఆగుతుందాండీ? పోలీసులొచ్చేవరకూ ఇతని ప్రాణం ఆగుతుందా మీ పిచ్చిగానీ. కేసు కన్నా ప్రాణం ముఖ్యం. ఇతను ముందు బ్రతికి బయట పడితే అప్పుడు కేసునుండి మేం బయట పడొచ్చు. పోనీ మీలో ఎవరైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు రిపోర్ట్ ఇవ్వండి అలాగే 108 కి కూడా ఫోన్ చెయ్యండి. ఈ లోపున నేను ఇతనికి ప్రథమ చికిత్స ఏర్పాట్లు చూస్తాను. " అన్నాడు ధర్మారావు.
"తెలిసి తెలిసీ ఇలాంటి రిపోర్ట్ పోలీస్ స్టేషన్ కు ఎవరిస్తారండీ? వాళ్లకు మనల్ని మనం అప్పచెప్పుకున్నట్టవుతుంది. " అన్నాడో పెద్దమనిషి.
" మరెలాగండీ? ఎవరో ఒకరు చెప్పకపోతే పోలీసులకు ఎలా తెలుస్తుంది?" అన్నాడు ధర్మారావు. "పోనీ నేనే చెప్తానుండండి" అంటూ కృష్ణమూర్తి 100 కూ, 108 కూ ఫోన్ చేసేడు.
* * *
"ఏమండీ ఇంతవరకూ పోలీసులుగాని, అంబులెన్స్ గాని రాలేదు. ఇప్పుడితనిని వెంటనే హాస్పిటల్ కు చేర్చాలి ఎలా?" అన్నాడు ధర్మారావు అక్కడున్నవాళ్ళతో.
" పోలీసులు రాకుండా మనం ఏం చేసినా నేరం అవుతుంది " అన్నారు అంతా ముక్తకంఠంతో.
" మళ్ళీ మొదటికొచ్చేరు. అంతవరకూ ఆగితే మన కళ్ళముందే ఓ మనిషి ప్రాణం పోతుండగా చూస్తూ ఊరుకున్నవాళ్ళమవుతాము. " అంటూ ధర్మారావు తన వాటర్ బాటిల్ లోని నీళ్ళను ఆ యువకుడి ముఖం మీద జల్లేడు. స్పృహ తప్పిన అతనిలో చలనం కలిగింది. కళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దాహం వేస్తున్నట్లుంది. పెదవులూ, నాలుకా కదుపుతున్నాడు. ధర్మారావు కప్పుతో కొద్దిగా నీళ్ళు అతని నోట్లో వేసేడు. కాని అవి ఎక్కువ బయటికే పోయేయి. ఆటను గుటక వేసే స్థితిలో లేదు. ఆ పరిస్థితిలో అతనిని హాస్పిటల్ కు చేర్చడానికి ఆటో గాని లేదా నాలుగు చక్రాల వాహనమేదైనా ఉండాలి గాని ద్విచక్ర వాహనమేదీ పనికిరాదు. అంచేత రోడ్డుమీద వచ్చేపోయే కార్లనూ, జీప్ లనూ, వేన్ లనూ, బస్ లనూ చివరికి లారీలనూ అన్నిటినీ ఆపడానికి అన్ని విధాలా ప్రయత్నించేడు ధర్మారావు. కాని ప్రతి వాహనం ఆగుతుందన్నట్లుగా ఆశ చూపి స్లో చేసి అక్కడి దృశ్యం చూసి మళ్ళీ వేగం పుంజుకుని వెళ్ళిపోయేది చెప్పేది వినబడేలోపునే.
* * *
పోలీసులు ఎంతకీ రాలేదని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ నెంబర్ కనుక్కుని ఫోన్ చేసి రిపోర్ట్ ఇచ్చేడు కృష్ణమూర్తి.
" మీ పేరేంటి?మీరెవరు? ఏం చేస్తుంటారు? ఎక్కడినుండి? అన్నీ అడిగేక మీరు చెప్పిన ప్రమాద స్థలం మా జూరిస్ డిక్షన్ లో లేదు. టౌన్ పోలీస్ స్టేషన్ ది. అంచేత వాళ్లకు చెప్పండి. " అని ఫోన్ పెట్టేసేడు. ధర్మారావు మళ్ళీ 108 కి ఫోన్ చేసేడు. కాని వాళ్ళు " మీరు చెప్పింది ఏక్సిడెంట్ కేసు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వందే మేం టేక్ అప్ చెయ్యం. " అని సమాధానమిచ్చేరు. ఇంక ఏం చేయాలో తోచలేదు ధర్మారావుకు. ఇంతలో పోలీసులొచ్చేరు. అక్కడున్న వాళ్ళందర్నీ ఎంక్వయిరీ చేసి అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకునేసరికి ఆ యువకుడి ప్రాణాలు ఉంటాయో లేదో అన్నంత పరిస్థితిలో ఉంది. సరిగ్గా అప్పుడే లక్కీగా ఓ ఖాళీ టాక్సీ రావడం చూసి అతనిని బ్రతిమాలి ఆ ప్రమాదానికి గురయిన వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ఒప్పించి బేరమాడి ధర్మారావూ మరి కొంతమంది ఆ యువకుడిని టాక్సీలోకి అతి కష్టం మీద చేర్చగలిగేరు. అతడి గాయాలనుండి రక్తం కారి కారి గడ్డకట్టుకు పోయింది. అది చూసి తట్టుకోగలిగే శక్తి కృష్ణమూర్తికి లేకపోయింది. అంచేత కృష్ణమూర్తి ముందు సీట్లో డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాడు. ధర్మారావు వెనక కూర్చున్నాడు. టాక్సీ విల్లు నుండి బయటపడ్డ బాణంలా, తుపాకినుండి వెలువడ్డ గుండులా దూసుకుపోయింది.
* * *
త్రోవలో కనపడ్డ ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళేరు ఆ యువకుణ్ణి. ఆ క్లినిక్ లో ఉన్న డాక్టర్ టాక్సీ లో ఉన్న పేషెంట్ ని చూసీ చూడగానే ఇది ఆక్సిడెంట్ కేసు. నేను ట్రీట్ చేయకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. " అని ముక్తసరిగా చెప్పేసి వెళ్లిపోయేడు చెప్పేది వినిపించుకోకుండానే. ఇక లాభం లేదని గవర్నమెంట్ హాస్పిటల్ కు వేగంగా పోనిమ్మని టాక్సీ డ్రైవర్ కు చెప్పేడు ధర్మారావు.
* * *
గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డుకు అతనిని తీసుకువెళ్ల గలిగేరు తప్పితే అంతకుమించి ఏమీ చేయలేకపోయేరు.
" సారీ అండీ. ఇప్పుడు మేం చేయగలిగినదేమీ లేదు. చెయ్యి దాటిపోయింది పరిస్థితి. ఒక్క అరగంట ముందు తీసుకుని వచ్చి ఉంటే ఏమైనా చేసి ఎలాగో ఒకలాగ బ్రతికించగలిగేవాళ్ళం. ప్చ్! లాభం లేదు. ” అని పెదవి విరిచేసేరు డాక్టరుగారు.
ధర్మారావూ, కృష్ణమూర్తీ ఒక్కసారి నిర్జీవమైన ఆ యువకుడి శరీరంవైపు చూసేరు. ”కష్టే ఫలీ” అన్న సామెత ఈ విషయంలో వాళ్లకు వర్తించనందుకు బాధపడ్డారు. అయితే ఈ ఆలస్యానికి (ఒక్క అరగంట) బాధ్యులెవరు?అని ఆలోచిస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని హాస్పిటల్ కు తీసుకురావడానికి జంకిన వాహనదారులా?మా ఏరియా కాదని పరిస్థితిని అర్థం చేసుకోకుండా కనీసం చూడడానికైనా రాని పోలీస్ వారా?పోలీస్ రిపోర్ట్ ఇస్తేనేగాని అంబులెన్స్ పంపడానికి నిరాకరించిన గవర్నమెంట్ హాస్పిటల్ వారా?ఏక్సిడెంట్ కేస్ గవర్నమెంట్ హాస్పిటల్ వారే గాని నేను ట్రీట్ చేయకూడదు అన్న ప్రైవేట్ డాక్టర్ గారా?కేస్ బుక్ చేసుకునే కార్యక్రమంలో కాలహరణం చేసిన పోలీస్ వారా?
నియమాలూ, నిబంధనలూ, చట్టాలూ మనిషిని రక్షించడానికి ఉద్దేశింపబడ్డాయి కాని ఒక్కొక్కప్పుడు అవే మనిషి ప్రాణాన్ని కాపాడలేకపోతున్నాయి. నిజమే. ఎవరికీ వాళ్ళు పాటించవలసిన నిబంధనలూ, నియమాల్నిఅతిక్రమించడం గాని, వాళ్లకు నిర్దేశించబడిన చట్టాల్ని ఉల్లంఘించడం గాని చెయ్యలేరు. ఎందుకంటే అలా చేస్తే అది నేరం క్రింద పరిగణింపబడుతుంది. అంచేత నియమాలకూ, నిబంధనలకూ, చట్టాలకూ కూడా సంకట పరిస్థితుల్లో కొన్ని మినహాయింపులుండాలి. లేకపోతే వాటికి భయపడి క్లిష్ట పరిస్థితుల్లో చేయందించదలచుకున్నవాళ్ళు కూడా ముందుకు రాకపోవడానికి అవి కారకాలవుతాయి. మరి మీరేమంటారు?
( ఈ నా కథ 1. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం “కార్మికుల కార్యక్రమం”లో తే. 24. 07. 1993దీని మధ్యాహ్నం 12గం. 40ని. లకు ప్రసారితమైంది.
2. “సుప్రభాతం” వారపత్రికలో తే. 08. 07. 2000 దీని ప్రచురితమైంది. )
( సమాప్తం )
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
ఏది ధర్మం పరుగు తెచ్చిన ప్రమాదం ఎవరికెవరు ఏమవుతారో హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్ గురు దక్షిణ నేనూ మనిషినే అత్తారింట్లో దారేదీ ( హాస్య కథ ) యద్భావం తద్భవతి

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం
Comments