Mrugam written by Otra Prakash Rao
రచన : ఓట్ర ప్రకాష్ రావు
“మిషన్ ఆసుపత్రి ....మిషన్ ఆసుపత్రి దిగండి" అంటూ గట్టిగా అన్నాడు కండక్టర్ .
శంకరయ్య శారదలు లేచి నిలబడి బస్సు నిలబడగానే దిగారు.
"శారదా, ఆసుపత్రి స్టాండ్ లోస్కూటర్ తీసుకొని వస్తాను "అని చెప్పి వెళ్ళాడు.
"అన్నా, మీరు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. ఇంతకు ముందే ఒకరికి ఈ ఆసుపత్రిలో కరోనా వైద్యం నుంచి బాగయ్యాక డిశ్చార్జ్ చేస్తూ పదిహేను రోజులు క్వారంటైన్ లో వుండమన్నారట. అతను మీరు నడుపుతున్న ఉచిత క్వారంటైన్ విడిదికి వెళ్ళాడు. " స్కూటర్ స్టాండ్ చూసుకొంటున్న పీటర్ అన్నాడు
" ఆసుపత్రివారు అంబులెన్స్ లో పంపారా పీటర్ "
"ఆంబులెన్స్ ఇస్తే వద్దన్నాడట, నా ఆరోగ్యం బాగుంది ఇక్కడినుండి నడచుకొంటూ రామాపురం వెళ్ళడానికి పావుగంట పడుతుందని అంటూ నడచుకొంటూ వెళ్ళాడు "అన్నాడు పీటర్
స్కూటర్ తీసుకొని రోడ్డుమీదకు వచ్చి శారదను ఎక్కించుకొని బయలుదేరాడు. ఎదురుగా బైక్ పై వస్తున్న కొడుకును చూడగానే స్కూటర్ నిలిపాడు.శంకరయ్య కొడుకు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.తల్లి తండ్రుల ప్రక్కనే వచ్చి బైక్ నిలిపాడు.
"లాక్ డౌన్ సమయాన ఎక్కడకు రా "అడిగాడు శంకరయ్య
“ నా క్లాస్ మేట్ దగ్గర నోట్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నాను”
“ముఖానికి మాస్క్ తీయకుండా మాట్లాడి రా, పరిస్థితులు బాగోలేదు "అంది శారద
*** *** ***
రామాపురం గ్రామంలో శంకరయ్య ముత్తాత పొలంలో పెద్ద భవనం కట్టాడు. ఉమ్మడి కుటుంబ సభ్యులతో ఆ ఇల్లు అనురాగం, ఆత్మీయతలతో, కళ కళ లాడేది. కాల క్రమేణా మార్పులు ఏర్పడింది. ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఆ భవనంలో ఇప్పుడు శంకరయ్య దంపతులు వారి కొడుకు మాత్రం జీవించసాగారు మిగిలిన వారందరూ రామాపురంలోనున్న తమ భూములను అమ్ముకొని పట్టణంలో స్థిరపడ్డారు. శంకరయ్య దంపతులు గ్రామంలో చిన్న ఇల్లుకట్టుకొని పొలం మధ్యలోనున్న భవనం ఖాళీ చేసుకొని వచ్చారు.సేవా దృక్పథంకల ఆ దంపతులు ఆభవనాన్ని ఏదో ఒక మంచి పనికి ఉపయోగించాలని ఆలోచిస్తున్న సమయాన కరోనా రావడం ,మిషన్ ఆసుపత్రిలో కరోనా రోగుల సంఖ్య పెరగడం జరిగింది. వ్యాధి గుణమయ్యాక పదిహేను రోజులు క్వారంటైన్ నందు ఉండటం పెద్ద సమస్యగా మారింది .ఆ సమయాన తమ భవనాన్ని ఉచిత క్వరెంటైన్ నిలయంగా మార్చారు . మిషన్ ఆస్పత్రినుండి నేరుగా ఈ నిలయం లో పదిహేను రోజులు ఉండేవారు . యోగా మాస్టర్ ప్రతిరోజూ వచ్చి వారికి యోగా, ప్రాణాయమం నేర్పించే ఏర్పాటు చేశారు. ఉచిత క్వారంటైన్ విడిదిలో వున్న పదిహేను రోజులు ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న అనుభూతి పొందేవారు.
*** *** ***
ఒక రోజు గ్రామ పొలిమేరలోఉన్న గుడిసె దగ్గరకు వస్తున్న చిరుతను గమనించి అక్కడున్న వారు పెద్ద శబ్దం చేసే టపాకాయలు కాలుస్తూ రోడ్డు మీద మంటలు పెట్టగానే వెనక్కి తిరిగి పారిపోయింది .
సంగతి తెలుసుకొన్న గ్రామ పెద్ద, శంకరయ్యతో కలసి అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు .వారు మూడు రోజులు గ్రామం చుట్టుప్రక్కలంతా తిరిగి కనపడలేదంటూ వెళ్లిపోయారు.
చిరుత వస్తే ఎలాగైనా చంపాలని మల్లేశం నిర్ణయించుకున్నాడు. తండ్రి బతికున్నప్పుడు ఉపయోగించిన నాటు తుపాకీ తీసి శుభ్రం చేసుకొన్నాడు. ఆ రోజు రాత్రి వేళ చిరుత వచ్చిన సంగతి తెలుసుకొని ఇంటిలోనుండి కిటికీ ద్వారా ఎదురు చూడసాగాడు. ఇంటిముందు రోడ్డు మీద నిలబడ్డ చిరుతవైపు గురిచూసి కాల్చగానే చిరుత మరణించింది. గ్రామ ప్రజలందరూ ఒక్కటిగా గుమికూడారు.
"మల్లేశం చిరుతను చంపడం మెచ్చుకొనవలసిన విషయమే కానీ, ఒక పెద్ద సమస్య ఏర్పడింది.
వన్య మృగాలను మనం చంపకూడదు .అలా చంపితే జైలు శిక్ష విధించే అవకాశం వుండి.అంతే కాకుండా మల్లేశం ఉపయోగించిన నాటు తుపాకీకి లైసెన్సు లేదు "అన్నాడు శంకరయ్య
"చట్టం దృష్టిలో అది తప్పయినా మల్లేశం మన గ్రామ ప్రజల క్షేమం కోసం చిరుతను చంపాడు . మల్లేశంకు మనం ఎంతో రుణపడి ఉన్నాము. మనం మల్లేశంను కాపాడుదాం " అన్నాడు గ్రామ పెద్ద
"ఎలాగ " ఆశ్చర్యంగా అడిగాడు శంకరయ్య
"ఇప్పుడే ఈ చిరుతను కాల్చి బూడిద చేస్తాం. మన గ్రామంలో చిరుత రాలేదు. ఈ చనిపోయిన చిరుత గురించి బయటివారికి ఎవరూ చెప్పారు. ఇకపై ఈ విషయం ఎవరూ మాట్లాడకూడదు వెంటనే చిఱుతను కాల్చే ఏర్పాట్లు చెయ్యండి"అన్నాడు గ్రామ పెద్ద .
*** *** ***
గ్రామ పెద్ద మరో ఇద్దరు మనుషులతో కలసి ఇంటిలోనికి ప్రవేశించి "శంకరయ్యా మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి ...అలా గదిలోనికి వెల్దామా "అన్నాడు గ్రామ పెద్ద
ఆ దంపతులు వారి ముగ్గురినీ తమ గదిలోనికి తీసుకెళ్లారు "క్షమించండి ఇలాంటి వార్త నా నోటినుండి ..."అంటూ గ్రామ పెద్ద తలవంచుకున్నాడు .
"ఏమిటండీ ఏం జరిగింది "అడిగాడు శంకరయ్య
" మీ అబ్బాయి గురించి ...."అన్నాడు ప్రక్కనున్న వ్యక్తి
"మా అబ్బాయికి ఏమైంది "వణుకుతున్న గొంతుతో ఆ మాటలు పూర్తి చేసేటప్పటికి శారద కంటిలో కన్నీరు జల జలమని ప్రవహింప సాగింది.
“ శారదమ్మా .. మీ అబ్బాయికి ఏమీ కాలేదు కానీ జరిగింది ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు " ఇంకొక వ్యక్తి అన్నాడు.
గ్రామ పెద్ద ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదలిన తరువాత జరిగింది చెబుతూ చివరగా “వీరిద్దరూ జరిగింది నా దగ్గర చెబితే మీ దగ్గరకు తీసుకొనివచ్చాను. ఈ సంగతి ఎవరికీ తెలీదు. వాడికి ఆకలిగా వుందట, మిమ్మల్ని భోజనం తీసుకొని రమ్మన్నాడు " అన్నాడు
*** *** ***
శారద శంకరయ్యలు తోటలోనికి ప్రవేశించారు. చెట్టుక్రిందున్న కొడుకును చూడగానే తల్లి తండ్రులు వేగంగా వెళ్లారు.
"నా కాళ్ళు చేతులూ గట్టిగా కట్టివేసారు "తడబడుతున్న మాటలతో చెప్పడం గుర్తించగానే" డ్రగ్స్ వాడావా " అడిగాడు శంకరయ్య
" ఔనునాన్నా"
" ఎప్పటినుండి ఈ డ్రగ్స్ అలవాటు... ఎలా దొరుకుతుంది "అడిగింది శారద.
" ఇంటర్ లో చేరినప్పటినుండి...ఒక్క ఇమెయిల్ పెడితే కాలేజీకి తెచ్చి ఇస్తాడు. ఈ లాక్ డౌన్ లో మేము చెప్పిన చోటికి తెస్తాడు.... ముందు కట్లు విప్పి అన్నం పెట్టమ్మా..".
" ఆ కట్లు కట్టిన వారిచేతనే విప్పిస్తాను "అన్నాడు శంకరయ్య.
"థాంక్స్ నాన్నా, వాళ్ళ చేతులతోనే నా కట్లు విప్పాలి , మీమీద గౌరవంతో నన్ను ఒక్కమాట అనుకున్నా, ఇలా కట్టిపడేసి తప్పు చేశారు." అన్నాడు
"కానీ నీవు చాలా పెద్ద తప్పు చేసావు. ఆరవ తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిని తీసుకునివచ్చి, మత్తుమందిచ్చి ఈ తోటలో బలవంతంగా ...ఎవరు చేసిన పుణ్యమో... ఏమీ జరగక ముందే ఆ ఇద్దరూ వచ్చి నిన్ను కట్టి పడేసి ఆ అమ్మాయిని కాపాడారు. నీవు ఆ అమ్మాయిపై అత్యాచారం చేసిఉంటే చట్టం నీకు కఠిన శిక్ష వేస్తుందని తెలుసా." అంది శారద.
"అమ్మా దేశంలో ప్రతి రోజూ... ప్రతి గంటా... ప్రతి నిముషం అత్యాచారం జరుగుతూనే వుంది. అందులో ఫిర్యాదు చేసేది చాలా చాలా తక్కువ, పోయిన నెల నేను ఒకమ్మాయిని ... వీడియోతీసి బ్లాక్ మెయిల్ చేసాను. ఫిర్యాదు చేయకున్నా..పిరికిపిల్ల ఆత్మహత్య చేసుకొంది . " మత్తులో దైర్యంగా నిజాన్ని చెప్పసాగాడు
"రేయ్ నీవు సెల్ ఫోన్ ను ఇలాంటి అసభ్యకరమైన విషయాలకు ఉపయోగిస్తున్నావని కలలో కూడా ఊహించలేదు." బాధగా అంది శారద
"నీలాగే దేశంలో అరవై శాతం మంది తల్లితండ్రులకు తమ పిల్లలు సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారన్న సంగతి తెలీదు." చిరునవ్వుతూ అన్నాడు.
" ఇంటర్నెట్ వున్న సెల్ ఫోన్ వాడటంవల్ల నీవిలా మృగంలా మారుతావని కలలో కూడా ఊహించలేదు.” కోపంగా అన్నాడు.
" ఓరే పోలీసులకు దొరికితే నిన్నుజైలులో ...." అంటున్నశారద మాటలకు అడ్డుపడుతూ "అమ్మా నేను మైనర్ని. ఆ పిల్లను ఈ రోజు రేప్ చేసినా నన్ను అరెస్టుచేయలేరు . నా కాళ్ళు చేతులు కట్టివేసిన ఆ ఇద్దరిపైనా నాకు చెప్పలేనంత కోపం ....వాళ్లకు ఆడపిల్లలున్నారు ...నేనెవరో తెలిసేలా నా పగ తీర్చుకొంటాను "అన్నాడు
"శారదా అంతా మన ఖర్మ, ముందు వాడికి అన్నం పెట్టు " అంటూ తల పట్టుకొని కూర్చొన్నాడు శంకరయ్య .
శారదా వాడికి అన్నం కలిపి నోట్లో పెట్టింది. అన్నం తిన్న తరువాత ఇద్దరూ లేచి నిలబడ్డారు.
"నిన్ను కట్టిన వారిని రప్పించి కట్లు విప్పమని చెబుతాను" అంటూ తోట బయటకు వెళ్లారు
తోట బయట ఉన్న ఆ ముగ్గురివైపు చూస్తూ “ వాడిలో మృగాన్ని గుర్తించాము.అందుకే వాడికి విషం కలిపినభోజనం పెట్టాము. మరికొన్ని నిముషాల్లో చనిపోతాడు. క్వారంటైన్ విడిది మీరు చూసుకోండి. మా ఇద్దరినీ పోలీసులకు అప్పగించండి " అంటూ శంకరయ్య భోరుమని విలపించసాగాడు.
" అన్నా, మాఅబ్బాయి పదవతరగతివరకు బంగారు బిడ్డ .కాలేజీకివెళ్ళాక ఇంటర్నెట్ సెల్ ఫోన్ కొనివ్వడం మేము చేసిన పెద్ద పొరపాటు.సెల్ ఫోన్ఉపయోగించి మృగంలా మారాడు. వాడు మృగంలామారి వుంటే చంపాలని ఇంటివద్దే నిర్ణయించుకొని వచ్చాము "ఏడుస్తూ అంది .
" మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఈ విషయం మా ముగ్గురికీ తప్ప వేరెవరికీ తెలీదు. దిశా నిందితుల మృగాలను ఎన్ కౌంటర్ చేసినందుకు ప్రజలు, పోలీసులను మెచ్చుకొన్నట్లు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఉచిత క్వారంటైన్ విడిది సేవలు ఇలాగే కొనసాగాలంటే, మీ అబ్బాయి పాముకాటు వల్ల చనిపోయాడని చెప్పడానికి అనుమతించండి " అంటూ గ్రామ పెద్ద చేతులు జోడించాడు
(అయిపోయింది)
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
Comentários