top of page

మృత్యుఘోష


'Mruthyughosha' New Telugu Story

Written By Lakshmi Nageswara Rao Velpuri

'మృత్యుఘోష' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
"కృష్ణాజిల్లాలోని, నాగాయలంక, కోడూరు ఊళ్ళ మధ్య అనేక చిన్న చిన్న గ్రామాలు పచ్చని తోటలతో వరి, చెరుకు, మొక్క జొన్న పంటలతో కళ కళలాడుతూ, దేశంలోనే అత్యధిక పంటరాబడి సాధిస్తూ, ఎంతో ప్రసిద్ధి చెందింది కృష్ణాజిల్లా.


అత్యాధునిక వసతులు లేక పోయినా అనేక రకాల పండ్ల తోటలు, మంచి రుచికరమైన అరటి, మామిడి, కొబ్బరి, బొప్పాయి వంటి నాణ్యమైన ఫలాలు పండిస్తూ, ఎక్కువగా దేశ విదేశాలు ఎగుమతి అయ్యేవి.


అంతటి మహత్తరమైన కృష్ణా జిల్లా వాసులు కూడా, ఎంతో కాయకష్టం చేస్తూ ప్రతిఫలం పొందుతూ, ఎంతో ఆరోగ్యంగా భారతదేశంలోని 'ఆదర్శమైన ఆరోగ్యమైన జిల్లాగా పేరుగాంచింది కృష్ణాజిల్లా. '


అసలే తీర ప్రాంతం, ఎంతో హాయిగా సముద్రపు అలలతో, మనోహరంగా ఉంటుంది. దివిసీమ ప్రాంతం, ఆ చుట్టు పక్కల జాలర్లు తమ తమ 'చేపల సేద్యం 'లో కూడా, క్రొత్త పుంతలు తొక్కుతూ, అత్యధిక రాబడి సాధిస్తూ తమ తమ జీవన విధానాలను మెరుగు పరుచుకుంటూ ఉన్నారు.


అది 1977 వ సంవత్సరం అక్టోబర్ నెల' అన్ని పండగలు దగ్గరికి వస్తూ ఉండటంతో, ఆ గ్రామాల ప్రజలు శాయశక్తులా కష్టపడుతూ, కొత్త కొత్త వస్తువులు కొనుక్కొంటూ, దసరా దీపావళి, సంక్రాంతి పండుగ లకు తమతమ కుటుంబాలను ఆనందడోలికల్లో ఉంచుతున్నారు.

అలా నవంబర్ నెల వచ్చింది, గ్రామ ప్రజలు లు అత్యధిక దిగుబడి వచ్చేతమ తమ పొలాలను, రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆ రోజు నవంబర్ 18.


"ఒరే రంగ!! ఈ ఏడు మనకి భూమాత సల్లగా సూసింది రా!, మంచి పంట చేతికొస్తుంది రా! మునసబుగారు, కరణం గారు కూడా మన పంటలకు మంచి ధర చూస్తామన్నారు, పట్టణాల్లో చదువుతున్న పిల్లలకు హాస్టాల్ ఖర్చులు, ఫీజులు కట్టాలి గా, మరి బ్యాంకు అప్పులు కొంచమైనా తీర్చాలి గా, వడ్డీలు సరిగా కట్టకపోతే మల్ల రుణాలు ఇవ్వరురా"

వీరయ్య! అనేసరికి, అదే పొలంలో ఒక చెట్టు కింద కూర్చుని పొడుగాటి చుట్ట కాలుస్తూ "అవున్రా వీరన్న! మా అమ్మాయి పెళ్ళి కూడా ఉంది రా! అంతా దేవుడి దయ, పదపద చీకటి పడి పోతున్నాది, మొన్ననే నా ఇదే పొలం గట్ల మీద మన కులపోడు 'వెంకన్నని పొడుగాటి 'నల్ల తాచు పాము' కాటేసి చంపింది. పాపం ఆడి ఎంతో మంచోడు రా!, ఆడి కుటుంబాన్ని కూడా సాయం చేయాలి రా !" అంటూ బాధపడుతూ రంగన్న అనేసరికి, "అవున్రా, మొన్న పంచాయితీలో మునసబుగారు, కరణం గారు గ్రామ పెద్దలు చర్చించి, ఆడి కుటుంబానికి తిండికి, గుడ్డకు లోటు లేకుండా మనం అందరం కలిసి సాయం చేయాలి రా" ఆ మాటలు అంటూ తన కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నారు, వీరన్న రంగయ్య. 'కాలం కాటేయడం అంటే ఇదేనేమో?' మనస్సులోనే అనుకుంటూ తమ తమ ఇళ్ల వైపు సాగారు.


ఆరోజు గ్రామస్తులందరూ అలసి సొలసి పోయిన శరీరాలను శుభ్రం చేసుకుని, మంచిగా భోంచేసి, చక్కని రేడియో పాటలు ఎక్కడైనా కరెంటు ఉన్న ఇళ్లలో నుంచి వినిపిస్తూ ఉండగా, ఆనందంగా విన్టూ గదుల్లో ఉన్న లాంతర్ వెలుగులో కటిక నేల మీద బొంతలు పరుచుకుని, భార్యాబిడ్డలతో హాయిగా నిద్రకు ఉపకరించసాగారు. కానీ ఉన్నట్టుండి కారు మబ్బులు, గాలివాన మొదలై పెద్దపెద్ద శబ్దాలతో ఉరుములు మెరుస్తూ ఉండగా, ఒక్కసారి ఉలిక్కిపడి లేచి "ఏందిరా ? పొద్దున్న అంతా మేఘాలు ఉన్నాయి కానీ ఒక్క చుక్క వర్షం పడలేదు. రేడియోలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుంది, చిన్నచిన్న చినుకులు పడవచ్చు.. అది కూడా ఎక్కడో 'తుఫాను 'ఉందట.. అందుకోసమే. మనకు ఏమీ కాదులే కంగారు పడకండి!" అంటూ ఎవరి కుటుంబానికి వారు ధైర్యం చెబుతూ, ఉండగానే వర్షం మొదలైంది. ఆ తాటాకు పాకాలలో, వర్షం తాలూకు నీళ్లు ఎక్కడెక్కడ కారుతున్నా యో చూసి, అక్కడ బకెట్లు, గిన్నెలు పెడుతూ, తమ తమ ఇళ్లను తడి కాకుండా కాపాడుకుంటున్నారు, అందులోనూ వర్షంతో పాటు, విపరీతమైన వేగంతో చల్లని గాలులు వీస్తుండడంతో, ఆ చలికి వణికిపోతూ ఉన్నారు ఆ దివి సీమ గ్రామ ప్రజలు.


ఆ రోజు సరిగ్గా శనివారం రాత్రి పది గంటలకి రంగన్న, ఆ చుట్టు పక్కల ఇళ్ళల్లో ఉన్న రైతులు బయటకు వచ్చి చూసేసరికి గాఢాంధకారం అలుముకొని ఉంది, పెద్ద పెద్ద తాటి చెట్లు, కొబ్బరి చెట్లు నేల వరకు ఒంగి, పైకి లేవడం, గాలి తీవ్రత మనుషుల్ని ఎగరేసి పోయే అంత గా ఉండడం చూసి దివిసీమ గ్రామ ప్రజలు అమితమైన భయాందోళనలకు గురి అయ్యారు.


'నాగాయలంక, కోడూరు 'సరిహద్దులలో వందలాది గ్రామాల ప్రజలు, ఈ పరిస్థితిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రావటం లేదు. రేడియో కూడా మూగబోయింది. ఆ కాళరాత్రి తమ తమ కుటుంబాలను తీసుకొని ఎత్తైన గుడి గోపురాలు, చర్చిలు, మసీదులు లోకి వెళ్లి తల దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు.


తమ ఎదుటే సముద్రపు నీళ్లు, వేలాది పశువులను, వందలాది ప్రజలను ముంచేస్తు ఉండడం, తమ తమ ప్రాణాల కోసం పోరాడుతూ, ఆ సముద్రం లోనే కలిసిపోసాగారు.

రెండు తాటిచెట్లు పొడవున్న సముద్రపు కెరటాలు, కాలనాగుల్లా పడిలేస్తూ బుసలు కొడుతు, కనబడ్డ ప్రతి ప్రాణిని తనలో కలిపేసుకుంటు, ఆ తుఫాన్ 'మారణహోమం' సృష్టిస్తుంది. బ్రతికి ఉన్న వాడు కూడా తనకు ఇదే గతి పట్టబోతుంది! అన్న భయంతో ఒణికి పోసాగారు. తమ కళ్ల ఎదుటే సొంత కుటుంబ సభ్యులు ఆ తుఫాను తాకిడికి సముద్రంలో కొట్టుకు పోతుండడం చూస్తూ రోదిస్తూ, భయంగా అరుస్తూ 'రక్షించండి, రక్షించండి' అన్న మాటలు వినే నాధుడే లేక ఒంటరితనంతో, భయాందోళనలకు గురి అయ్యి దిక్కు తోచక, అరుస్తున్న క్షణాలు, ఆ "మృత్యుఘోష" కృష్ణాజిల్లా అంతా వినిపిస్తూనే ఉంది ఆ కాళరాత్రి.


ప్రతి రైతు కుటుంబం యొక్క ఆశలు అడియాశలయ్యాయి, విధి వ్రాతకు బలి కానటువంటి ఒక్క ప్రాణి కూడా లేదు. అలా రాత్రి అంతా కొన్ని వేల మంది మనుషులు, లక్షల లెక్కల్లో జంతువుల కళ్లేబరాలు, ఏదో ఒడ్డు కి తగిలి చచ్చి పడి ఉండటం, మన దేశ చరిత్రలోనే "నవంబర్ 19 "దివిసీమ దగ్గర తుఫాను తీరం దాటుతున్న, సమయంలో ఆ రాత్రి కాళరాత్రి అవ్వటం, ఏ ఒక్కరు ఊహించని హఠాత్పరిణామం.


తెల్ల వారే సరికల్లా, ఆ భయంకర తుఫాన్ నాగాయలంక, కోడూరు ఊళ్ళ మధ్య తీరాన్ని దాటింది. తుఫాను తీవ్రత కొంచెం తగ్గే సరికి దివిసీమ కు బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి, అప్పటి సమాచార వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది, రెండు రోజుల తర్వాత భయంకర తుఫాను బీభత్సం ప్రపంచానికి తెలిసి హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి.


అప్పటి మన దేశ ప్రధాని 'శ్రీమతి ఇందిరాగాంధీ గారు' కూడా ఎంతో కలత చెంది, తమ నాయకులతో కలిసి హుటాహుటిన కృష్ణాజిల్లా దివిసీమ కు వచ్చి స్వయంగా సహాయ సహకారాలు అందజేశారు. విదేశీ ప్రతినిధులు కూడా ఇంత తీవ్ర తుఫాను 'ఆంధ్ర ప్రదేశ్' ను అతలాకుతలం చేయడం చూసి, తమతమ దేశాలనుంచి తక్షణ సహాయక చర్యలు ప్రారంభించారు. వేలాది శవాలు, లక్షలాది జంతు కళేబరాలు చూసి, "కలియుగపు ఘోరకలి"!: అంటూ తమ చేతనైనంత సహాయం చేస్తూ ఉన్నారు.


అప్పటి మన తెలుగు సినీ ప్రపంచం కూడా, కదిలివచ్చి, 'నందమూరి తారక రామారావు గారి' ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి తుఫాను బాధితుల సహాయార్థం తమ తమ సేవలు అందించారు.


ఆ రోజు' నవంబర్ 23' ఎంతోమంది రక్షక దళాలు, రాత్రి పగలు పని చేసి కనబడ్డ వేలాది శవాలకు దహన సంస్కారాలు చేసి, తమా మానవత్వాన్ని నిలుపుకున్నారు. అత్యవసర సహాయ సేవకులు, గ్రామాలను పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నరు, కొట్టుకుపోయిన పూరిపాకలు, రహదారులు, కరెంటు స్తంభాలను తిరిగి బాగు చేస్తూ, కూలిపోయిన పెంకుటిళ్లు ను వాటి కింద పడిన మనుషులు ఎవరైనా బ్రతికి ఉన్నారేమో!! అని 'ప్రాక్లైనర్ 'లతో శిధిలాలను త్రవ్వి వెతకడం, కొస ప్రాణాలతో ఉన్న మనుషులను ఆస్పత్రులకు తరలించడం వంటివి చేస్తూ అహోరాత్రులు కష్టపడుతున్నారు.

వీరన్న తన తోటి వాళ్ళందరి శవాలు గుట్టలుగా పడి ఉండటం చూస్తూ, అయ్యో దేవుడా!! మా దివిసీమ ఏం పాపం చేసింది రా? తండ్రి నీ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపారు కదా! ఆ పాటి విశ్వాసం కూడా లేకుండా మేము నమ్ముకున్న పొలాలను, కుటుంబ సభ్యులను, జంతువులను, తుఫాన్ అవతారంలో వచ్చి బలిగొన్నావా? నీకు ఇది న్యాయమా ?అంటూ గుండెలవిసేలా ఏడుస్తూ ఉన్న వీరన్న ని, సముదాయించడం ఎవరి వల్ల కావట్లేదు.


ఈ లోపల, వీరన్న కట్టించుకున్న పెంకుటిల్లు కూడా కూలిపోవడం వల్ల 'ప్రొక్లినర్ '

వీరన్న పెంకుటిల్లు శిధిలాలను కూడా తవ్వుతుండగా, అప్పటికి బయటపడ్డ సొంత కొడుకు, కోడలు, మనవడి శవాలు బయటపడ్డాయి. అంతా మట్టితో కప్పి ఉండటం వల్ల పోల్చుకోలేని స్థితిలో ఉండగా, పరుగున వచ్చిన వీరన్న, "అయ్యో ఎంత ఘోరం ! ఆఖరికి ఆ విధి నా కుటుంబాన్ని చిదిమేసింది. నాకు దిక్కెవరు?" ఆంటు పిచ్చివాడిలా గెంతులేస్తున్న సమయంలో,

'డిజాస్టర్ రెస్క్యూ టీమ్ ' ఆ ముగ్గురు శవాలను బయటకు తీసి, వీరన్న కి చూపిస్తూ 'బాబు నీకు తీరని అన్యాయం జరిగింది. ఇదిగో మీ కుటుంబ సభ్యులు" అంటు చూపిస్తూ ఉండగానే, "అయ్యా! ఇక నాకు ఏ కుటుంబము లేదు. ఆ మాయదారి తుఫాను నన్ను అనాథను చేసింది. వీరిని కూడా అందరితో పాటే దహనసంస్కారాలు చేయండి. నా మట్టుకు నేను ఎక్కడకు పోయి చస్తాను" అని అనగానే, అక్కడ ఉంచిన ట్రక్కులో కి శవాలను ఎక్కిస్తూ, వీరన్న కోడలి మెడ, చేతులకు అనేక బంగారు నగలు ఉండడంతో, "బాబు వీరన్న, ఇదిగో నీ కోడలు బంగారు నగలు" అంటూ వాటిని తీసి ఇవ్వ బోతుండగా, 'అయ్యో! నాకు దేవుడు తగిన శాస్తి చేశాడు సార్, ! ఎందుకంటే ఇక్కడ అనేక సార్లు చిన్న చిన్న తుఫాన్లు వచ్చి, ఎంతోమంది చనిపోయారు. ఆ సమయంలో నేను వారికి సాయం చేయకుండా, ఆడవాళ్ళ శవాల మీద పడి ఉన్న బంగారు నగలు దొంగిలించి, ఈ ఇల్లు కట్టాను. మా కోడలికి నగలు ఇచ్చాను. అందుకేనయ్యా, ఆ భగవంతుడు నాకు ఇంత ఘోర శాపం ఇచ్చి, నా ఇల్లు తో పాటు కుటుంబ సభ్యులకు కూడా అంతం చేశాడు. నా పాపానికి నిష్కృతి లేదు, ! ఆ బంగారు నగలు నేను కొన్నవి కావు, , అనాధ శవాల మీద దొంగలించినవి. కనుక మీరు దయచేసి ఆ బంగారు నగలను అనాధాశ్రమాలకు ఇచ్చి, నా పాపాన్ని కొంత అయినా తగ్గించండి" అంటూ వలవలా ఏడుస్తూ అక్కడినుంచి ఎక్కడికో పారిపోయాడు వీరన్న.


అక్కడ ఉన్న గ్రామ ప్రజలు, పోలీసులు అందరూ వీరన్న మాటలు విని ఆశ్చర్యపోయారు. ఆపదలో ఉన్న వారిని ఏ స్వార్థచింతన లేకుండా ప్రాణాలు కాపాడిన, ఎలాంటి సహాయం చేసిన, ఆ దేవుడు మనకు అన్ని విధాలా సాయపడతాడు !!!


లేదా, వీరన్న లాగా చచ్చిన శవాల మీద నగలు దొంగలించిన, వారి ఆస్తులు కబళించి బాగుపడి పోదామన్న ఆశతో ఉన్న వాళ్లు సర్వం కోల్పోయి, అధోగతి పాలు అవుతారు! అన్న నిజాన్ని వీరన్న ద్వారా తెలియజేశాడు భగవంతుడు.

1977వ సంవత్సరంలో వచ్చిన దివిసీమ తుఫాన్ బీభత్సం యొక్క 'మృత్యుఘోష '

ఈనాటికీ మరుపురానిది, శాస్త్రీయపరంగా నేడు ఎన్నో పరిశోధనలు చేసి, అకాల తుఫాన్ బీభత్సాలను, ఎలా ఎదుర్కోవాలో ముందస్తు సమాచారాల కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు.

***

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.54 views0 comments

留言


bottom of page