'Mudu Tharalu' written by Dasu Radhika
రచన : దాసు రాధిక "దీనికి మీరందరు ఒప్పుకున్నట్లే నా?" "బాగా ఆలోచించి మాటివ్వండి, " అని ముగ్గురు మహిళల మధ్యలో నిలబడి చేతిలో చెయ్యి వేయమని అడుగుతున్నాడు వేణు...తప్పుతుందా అన్నట్లు చేతి లో చెయ్యి వేశారు మిస్ అంజలి, శ్రీమతి అన్నపూర్ణ మరియు గంగా భాగీరధి సమానురాలైన అలివేణి...
"ఇక ఈ విషయం లో గొడవ పడితే మీరు పెట్టిచ్చిన టాటా స్కై, నెట్ఫ్లిక్స్ అన్నీ పీకి పడేస్తాను... డబ్బు కట్టేది నేనేగా... ఆ పట్టిక లో ఏ రోజు ఎవరు టీవీ చూడాలో రాసి పెట్టాను... అన్నపూర్ణా, ఆకలిగా ఉందే, ఏదైనా పెట్టవా, ఇవాళ టీవీ లో క్రికెట్ మ్యాచ్ మొదలు, ఇంకాసేపట్లో... చూసే వాళ్ళు నాతో పాటు చూడొచ్చు... అని సోఫా లో టీవీ ఎదురుకుండా హాయిగా సెటిల్ అయిపోయాడు వేణు... టీవీ సౌండు పెద్దగా ఉందంటే మన భారత క్రికెట్ జట్టు గెలుస్తోందని అర్ధము... మరమరాలు, పుట్నాలు, సన్న కారప్పూసా, ఉల్లిపాయలు, టమాటాలు అన్ని వేసి భేల్పురి చాట్ లాగా చేసిచ్చింది అన్నపూర్ణ అందరికి...బుజ్జిగాడు కూడా తండ్రి పక్కన చేరాడు... అందరిలోకి దెబ్బ పడింది అమ్మమ్మ ఆలివేణి కే... ఎదో రోజు లో ఒక అర డజను సీరియల్స్ తో కాలక్షేపం చేస్తూ రోజులు గడుపుతుంటే... 'నీ మీదే నా కసి' సీరియల్ లో భారతి అల్లుడు భారతి ని ఎదిరించి ఒకానొక ఎపిసోడ్ లో షాకు ఇఛ్చినట్లు 'తన అల్లుడుకేమైంది...ఇలా చేసాడు...' అమ్మమ్మ అలివేణి దీర్గాలోచన లో పడింది... తన కూతురు అన్నపూర్ణ కేమో ఇంటి పని రెండింతలు పెరిగింది పని మనిషి రాక పోవటం తో... వేణు, పిల్లలు ఇంట్లోనే ఉండడం తో కూడా వంటింట్లో ఎదోరకంగా సరిపోతోంది... ఆకలి ఎక్కువైంది అందరికి...వండి వార్చటం తో తీరుబడి లేదు దానికి... అందుకే దానికి టీవీ ఒక అర గంట దొరికితే రోజులో సర్దుకుపోతుంది పాపo... మనవరాలు అంజలి కి సెల్ ఫోన్ తో పని లేనప్పుడు టీవీ కావాలి... ఏదో ఒక స్క్రీన్ చూడకపోతే అది క్షణం కూడా ఉండలేదు... మనవడు బుజ్జి కి తల్లి అన్నపూర్ణ సెల్ ఫోన్ లో కావల్సిన గేమ్స్ ఆడుకుంటే కడుపు నిండిపోతుంది... గంటకొకసారి కాస్త మేత పడుతుంటే పొట్టలోకి సరిపోతుంది... అయితే వాడి పేచీ స్పోర్ట్స్ (క్రీడా రంగం) చానల్స్ కోసం వస్తుంది... ప్రస్తుతం అల్లుడు వేణు కు వర్క్ ఫ్రమ్ హోమ్-- ఇంటి నుండి ఆఫీసు పని, వారము లో అయిదు రోజులు... తన లాప్టాప్ తో ఒక గది లో పొద్దున్నించి సాయంత్రం దాకా వృత్తిపరంగా కష్టపడుతున్నాడు... అంజలి కు ఇదివరకు కాలేజీ కి వెళ్లి రావటం లో రోజు గడిచిపోయేది... ఇంకో రెండు నెలల్లో ఉద్యోగము లో చేరాల్సింది, ఇంతలో ఈ లాక్డౌన్ వచ్చి పడింది... ఇప్పుడు వేళ్లూడి వస్తాయేమో అన్నట్లు సెల్ ఫోన్ లో టైపు చేస్తూ దాని స్నేహితులతో బాతాఖాని లో -- అంటే చాటింగ్ -- మంచం మీద రోజంతా పడున్నా, ఒక రెండు మూడు గంటలు టీవీ కోసము హాలు లోకి వస్తోంది... దానికి నెట్ఫ్లిక్స్ కావాలి... ఇరుగు పొరుగు కూడా ఇళ్లలో నించి బయటికి రాకపోయేసరికి అమ్మమ్మ కు సీరియల్స్ పైత్యం ఎక్కువైపోయింది... అల్లుడు ప్రవేశ పెట్టిన కొత్త పట్టిక ప్రకారం ఇక 'బంగారు పంజరం', 'నీ మీదే నా కసి', 'ఆకు వక్కా', 'పాపం పండింది' ఈ సీరియల్స్ వారానికి రెండు రోజులు మాత్రమే చూడగలిగేది... ఎలాగా?? అదే తన ఇల్లయితే ఇలా ఉండేదా?? ఏదో కూతుర్ని చూసి ఆరు నెలలయ్యేసరికి చూసి పోదామని వచ్చి ఇరుక్కుపోయింది...పనిలో సహాయ పడేందుకు మునుపటి ఓపిక లేదు అమ్మమ్మ ఆలివేణికి... కనీసము పని చేస్తున్నా ఇట్టే తెలియకుండా రోజులు గడిచిపోతాయి... కాలు గాలిన పిల్లిలాగా ఉంది అమ్మమ్మ ఆలివేణి పని... ఏం చేస్తుంది... "ఆ ఫోన్ వదిలి అమ్మకు సాయం చెయ్యచ్చుగా అంజలీ... రేపు నీ పెళ్ళైతే ఎలా చేస్తావు?" అని అమ్మమ్మ వేసిన ప్రశ్నకు అంజలి, "నేనసలు పెళ్ళి చేసుకోనుగా"... అని జవాబు ఇచ్చింది తప్ప లేచి తల్లి కేమైనా సాయం కావాలా అని అడగలేదు... దాని వయసు లో అన్నపూర్ణ కు పెళ్లైపోయింది...సంసార బాధ్యత నెత్తిన పడింది... మంచి కోడలు, ఇల్లాలు అనిపించుకుంది...ఎంటో ఇప్పటి ఆడపిల్లలు... బుజ్జిగాడే నయము...ఆన్లైన్ సరుకులు తెప్పిచటం, కూరలు, పాలు తెప్పిచటం ఇటువంటి పనులు చేసిపెడుతున్నాడు అన్నపూర్ణ కు... అమ్మమ్మ ఆలివేణి కు మందులు, ఇతర అవసరాలు కూడా ఆన్లైన్ లో చేసి పెడుతున్నాడు బుజ్జిగాడు... వాడికి 10వ తరగతి కి అంతరాయము కలిగింది ఈ కరోనా లాక్డౌన్ వల్ల... అమ్మమ్మ అలివేణి ఊళ్ళో ఉన్న తన బాబాయి కూతురి కి ఫోన్ చెసి ఆ రోజు 'ఆకు వక్కా' సీరియల్ కధ చెప్పిచ్చుకున్నది... మిగిలిన వి కూడా ఇలాగే ప్రతి రోజు చెప్పాలని మాట తీసుకుంది భవాని దగ్గర... ఒక నాలుగు రోజుల తర్వాత పట్టిక ప్రకారం టీవీ అన్నపూర్ణ చూడాల్సిన రోజు... తొందరగా పని చేసుకొని, మధ్యాహ్నం మంచి సినిమా చూడాలనుకుంది... "ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అన్నపూర్ణ" అన్నాడు వేణు. "లేకపోతే ఈ అమ్మమ్మ, పిల్లల గోల భరించలేక పోయాను టీవీ విషయంలో... అందుకే మీ అమ్మ కు బుధ, గురువారాలు ఇచ్చాను... ఆ రోజుల్లో నాకు మీటింగ్స్ ఉండవు. మిగిలిన వారం మనందరికీ పంచాను... నేను క్రికెట్ ఉన్నప్పుడే చూస్తానుగా, మిగతా అప్పుడు బుజ్జిగాడు చూస్తాడు నా బదులు..." అని పని నుండి బ్రేక్ తీసుకున్నప్పుడు వంటింటి దగ్గరకొచ్చి ఒక మాట కలిపాడు భార్యతో... "ఏమండీ ఇవాళ నేను యు ట్యూబు లో " అబద్ధపు జీవితం" అన్న సినిమా చూద్దామనుకున్నాను... నా కిష్టమైన హీరోయిన్" అని మెరుస్తున్న కళ్ల తో వేణు తో చెప్పింది... "ఎంజాయ్" అన్నాడు మొగుడు..."మీరూ చూస్తారా?" అని అడిగింది అన్నపూర్ణ... "లేదు పూర్ణా.. ఈ లాక్డౌన్ లో పని ఎక్కువైంది... తెలుసుగా నీకు... కొంత మంది ని తీసేసారు...ఇంకో సారి ఎప్పుడో చూస్తాలే నీతో పాటు..." అన్నాడు వేణు... "పని చాలా ఉందండి... కానీ కాస్త మార్పు కావాలనిపించి, ఎప్పుడూ ఉండే పనేగా అని మనసు మూలిగింది" అన్నది అన్నపూర్ణ భర్తతో... "చూడు చూడు, నీకు మూడోచ్చినప్పుడే... ఈ రోజు నీదే పూర్ణా" అంటూ మళ్ళీ ఆఫీసు రూమ్ లోకి వెళ్ళిపోయాడు వేణు. ఆ రోజు మూడు తరాలు కూర్చున్నాయి టీవీ ముందు... అమ్మమ్మ, కూతురు, మనవరాలు...అంజలి ఏంటి, తెలుగు సినిమా చూడడమేంటి... అందులోనూ ఇరవై ఏళ్ళ పాత సినిమా... కరోనా కాలం వచ్చాక జరుగుతున్న అనేక వింతల్లో ఇదొకటి... ఎంతైనా కుటుంబ సభ్యులు ఒకళ్ళ తో ఒకళ్ళు గడపక తప్పటం లేదు... మామూలు రోజుల్లో ఎవరి పరుగులు వారివి... సినిమా మొదలైంది ... సుందరి , ఆ సినిమా లోని కదానాయిక పాత్ర. ఆసువు గా అబధ్ధాలు చెప్తూ ఉంటుంది...బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి, రెండింతలు గొప్పవాడైన కథానాయకుడు రాంబాబు ను ప్రేమిస్తుంది. పెళ్ళి కి ఇరువైపులా పెద్దలు ఒప్పుకోరు... సుందరీ, రాంబాబులిద్దరు బ్రాహ్మణ కుటుంబాల కు చెందిన వాళ్ళు. కానీ సుందరి తల్లిదండ్రులు మారుతున్న కాలము తో పాటు అడుగులు వేస్తుంటారు, రాంబాబు ఇంట్లో మటుకు ఇంకా గాడి పొయ్యి, నిప్పులు కడిగే మడి, వాళ్ళ ఇంటి ఆడవాళ్ళ కు అనేక కట్టుబాట్లు... ప్రేమ గుడ్డిది... సుందరీ రాంబాబుల ప్రేమ వాళ్ళిరువురు పదో తరగతి లో ఉండగానే చిగురిస్తుంది... కానీ వాళ్ళ కుటుంబాల జీవన శైలి లో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించదు ఆ జంట... దానికి తోడు వ్యాపారం లో సుందరీ తండ్రి మరియు రాంబాబు తండ్రికి ఏమంత సామరస్యము లేదు... సుందరి తల్లి, తండ్రికి నిత్యం క్లబ్బులో పేకాట ఆడే అలవాటు. అలాగే వివిధ పీఠాధిపతులకు వాళ్ల ఇంట్లో బస ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించే అలవాటు, ఆసక్తి... అదొక వింత కుటుంబం...హీరో రాంబాబు ఇంట్లో ఆడవాళ్లు ఏమైనా సరే బయటికి వెళ్ళరు... అన్ని ఇంటికే వస్తాయి... రాజుల నాటి కోట లాంటి మేడ... అందులో ఎవరి 'ఆస్థానం' వారిది... పెళ్ళి కి ఎన్ని విధాల ఒప్పించినా, తమ ప్రయత్నాలు విఫలమవ్వటం వల్ల సుందరి ఒక అబద్ధము చెబుతుంది...తాను తల్లి నవుతున్నానని... అందుకు డాక్టరు చేత కూడా రుజువు చూపిస్తుంది... రెండు కుటుంబాల వాళ్ళు పరువు కోసం చేసేదేమీ లేక సుందరి రాంబాబుల పెళ్లి చేస్తారు... ఒక నెల రకరకాల వేడుకలతో పుట్టిల్లు, అత్తగారింటి మధ్య తిరుగుడు తో గడిచిపోతుంది... అస్సలు కథ ఆ తర్వాత మొదలవుతుంది... తండ్రి వ్యాపారం లో రాంబాబు కూడా భాగం పంచుకుంటూ తన ఇద్దరన్నల లాగా ఆఫీసు వెళ్ళటం మొదలుపెడతాడు... సుందరి కి అత్తగారింట్లో ఎం చేయాలో తెలీదు... వంట కు ఇద్దరు వంటవాళ్ళు ఉన్నారు... ఒక అర డజను పని వాళ్ళు ఉన్నారు... మామగారు ఇంట్లో కూడా ఒక చిన్న ఆఫీసు విభాగం పెట్టుకున్నారు ఒక అర డజను మంది తో... పెద్ద తోడు కోడలు ఇంట్లో ఎం కావాలో, వచ్చే పోయే వాళ్ళ అవసరాలు, పండగలు పబ్బాలు ఏర్పాట్లు సమస్తం చూసుకుటుంది, రెండో ఆవిడ పని వాళ్ళ జీతాలు, వాళ్ళ మంచి చెడలు, పిల్లలు, వాళ్ల చదువులు ఇతర పనులు పెద్దావిడ పురమాయించేవన్నీ చేస్తుంది. అందరికీ రెండు పూటల భోజనాలు వగైరా తానే చూస్తుంది. అత్తగారి మాట జావదాటటం వాళ్ళు ఎరుగరు... పెళ్ళి కి ముందు సుందరి కి ఒక్క రోజు కూడా పుట్టింట్లో ఇంట్లో కూర్చునే అలవాటు లేదు... షాపింగ్, క్లబ్బు, సినిమాలు, షికార్లు, టెన్నిస్ ఇలా చెప్పుకుంటూ పోతే 66 కళలు ఉన్నాయి... పెళ్లయ్యాక రెండో నెలలో పుట్టింటికెళ్లొస్తా అని మొదటి వారం, ఆ తర్వాత తనకు అత్యంత సన్నిహితమైన మిత్రుల పెళ్ళిళ్ళని ఒక వారం, స్వామీజీ వచ్చారు తల్లి పిలిచిందని మూడో వారం, నాలుగో వారం డాక్టర్ పరీక్ష ల కు రమ్మన్నదని ఈ రకంగా చెప్పి సుందరి అత్తగారింటి నుoడి బయట పడి తన సరదాలన్ని తీర్చుకుంటోంది... కడుపు తో ఉన్న ఆఖరి కోడల్ని ఎన్నడూ చేయని గారాబము చేసి, నమ్మి, వాళ్ళ ఇంటి కట్టుబాటలను కూడా సడలించి సుందరీ కోరికలను మన్నించారు రాంబాబు కుటుంబ సభ్యులు... రాంబాబు కూడా సెలవు రోజున సుందరి ని సినిమా కు తీసుకెళ్లాడు ఇంట్లో చెప్పకుండా... ఒక రోజు సుందరి మామ గారికి ఒక పెళ్లి శుభలేఖ వచ్చింది. ఆయన ఆప్త మిత్రుడి కొడుకు పెళ్లి. పెళ్లికూతురు సుందరి స్నేహితురాలైన కుమారి... నిర్ఘాంతపోయారు అందరూ... కుమారి పెళ్లికి ఆ మధ్యే సుందరి వెళ్ళింది కదా అని... నిజం బయట పడింది... పచ్చి అబద్ధం... మోసం చేసి తడవకో రకంగా సుందరి ఇంటి నించి బయటికి వెళ్తోందని... రాంబాబు క్కూడా ఇంత తిరిగిందని తెలీదు... ఆఖరికి కడుపు కూడా అబద్ధం అని ఇంట్లోవాళ్ళకి తెలిసింది... ఫలితంగా రాంబాబు, సుందరి పెళ్ళి పెటాకులయింది ... మూడు నెలలు కూడా కాలేదు పెళ్లయి...సుందరి పుట్టింటికొచ్చేసింది... ఒక రోజు ఉన్నట్టుండి తల్లి గుండె పోటు తో మరణించింది... ఇద్దరు అక్కలు అమెరికా లో స్థిర పడి పోయారు... తల్లి పోయిన రెండు నెలలకే తండ్రి క్లబ్బులో ఎప్పటినుండో పరిచయం ఉన్న వనజ ను రెండో వివాహం చేసుకున్నాడు... ఇల్లు నరకమై పోయింది... ఈ రకంగా ఒక ఏడాది గడిచిoది... సుందరి, రాంబాబులు విడాకులు తీసుకున్నారు... రాంబాబు కు మళ్ళీ పెళ్లి అయింది ... అతని కధ సుఖాంతమైంది... సుందరి కష్టాల పర్వం మొదలైంది... "వాట్ నాన్సెన్స్ అమ్మ, ఎలా చూస్తావు ఇలాంటి సినిమాలు?" అని కూతురు అంజలి మండి పడింది... "నా కిష్టము, నేను జయసుధ ఫాన్" అని తల్లి జవాబిచ్చింది... అంజలి కి ఇంకా ఆగలేదు... "ఆఫ్ట్రాల్ అ బద్ధం చెప్తే డివోర్స్ అవుతుందా?? ఇట్ ఐస్ రిడిక్యులస్ (అర్ధం లేదు)" అని ఫుల్ ఎమోషన్ తో ఉడికిపోయింది అంజలి... "ఇంకేమి చేస్తారు, సుందరి చెప్పేవి మామూలు అబద్ధాలా?? ఇంట్లో ఉండి బుద్ధిగా కాపురం చేసుకోలేక పోయింది" అని అమ్మమ్మ ఆలివేణి లేచింది మనవరాలి మీద... 'పాపం పండింది' సీరియల్ లో ఒక ముప్పై వారాలు ఈ రకంగా నడిచింది కధ, తర్వాత సుందరీ ని మించిన పాత్రను పరిచయం చేసారందులో, ఆ పాత్ర చుట్టూనే ఇంకో పాతిక వారాలు ముందుకు జరిగింది ఆ సీరియల్... ఇంకా అస్సలు కథ మొదలైతేగా"... అస్సలు సంగతి మరచి, ఈ సీరియల్ గురించి మాట్లాడుతున్నానేంటి అని అమ్మమ్మ ఆలివేణి తిరిగి అంజలి తో సంభాషణ కొనసాగించింది... "అస్సలు మా కాలము పెళ్లిళ్లు నీకేం తెలుసు? మీ తాతయ్యను మా పెళ్లికి ముందు నేను చూశానా?" నా అనుమతి తీసుకున్నారా?" నోరు మూసుకొని కాపురం చేసాము మేము" ... "ఎనీ డే లివ్ ఇన్ బెటర్ (పెళ్లి కాకుండా కలిసుండడమే హాయి)"అని తేల్చేసింది అంజలి... "ఇంకేం చూస్తావు అన్నపూర్ణ, నీ కూతురు ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది, నువ్వే సమాధానం చెప్పాలి, ఆ టీవీ కట్టెయ్యి, ఇంకో రోజు చూద్దువు గానిలే అని అమ్మమ్మ పిలుపుకు అన్నపూర్ణ ఇష్టం లేకపోయినా --- సినిమా ఇంకొక గంట వుంది పూర్తవటానికి --- టీవీ ఆపేసి అంజలి తో, "ఏంటే నీ గొడవ?" అని అడిగింది... "అమ్మా, నా ఫ్రెండ్స్ చాలా మంది లివ్ ఇన్ లో ఉన్నారు... నేనె వెనకపడి ఉన్నాను..." అన్నది కసి గా అంజలి... "షట్ అప్ అంజలి... ఏంటి నీ వాగుడు? ఉద్యోగం లో ఇంకా జాయిన్ కాకుండా నే ఇన్ని మాటలా? పాడే పోయింది మీ ఈ తరం..." అని కోపం చూపిచిoదన్నపూర్ణ... " ఫ్రీడమ్ (స్వతంత్రం) లేని జీవితం ఎందుకు? నేనె చూసుకుంటా నా పెళ్లి విషయం, మీరు కష్టపడద్దు నాకోసం" అన్నది అంజలి ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నట్లు... " నీ ఫ్రీడమ్ కేం తక్కువయింది, చదువుకున్నావు, జాబ్ వచ్చింది, దేనికి మెం కాదనలేదు... మెల్లగా పెళ్లి చేస్తాము, ఈ కరోనా తగ్గాక..." అన్నపూర్ణ బుజ్జగింపు గా అన్నది ... " "సినిమా కేవలం టైం పాసు, దాని మీద వాదన అనవసరo కదా??" అన్నపూర్ణ కూతురు వైపు చూస్తూ అన్నది... "నువ్వే చెప్పావు అమ్మమ్మ తో, నేను వినలేదనుకుంటున్నావా? మీ ఫ్రెండ్ ఎవరిదో అదే కధ రియల్ లైఫ్ లో అని" అంజలి సూటిగా చూసింది తల్లి కళ్ల లోకి... "చూడు అంజలి, మూవీ లో లాగా నా ఫ్రెండ్ ప్రియ కూడా స్వతంత్రం పేరిట అదే తప్పు చేసి ఇప్పుడు ఒంటరిగా ఉంది..." "మీ అమ్మమ్మ కాలం కంటే మా అప్పుడు ఇంకొంచెం ముందుకు జరిగింది ... నాకు చూసిన సంబంధాలన్నీ పెళ్లిచూపులు జరిగి, ఒకళ్ళ తో ఒకళ్ళు మాట్లాడుకొని, తల్లి తండ్రి సలహా సంప్రదింపుల తో పెళ్లిళ్లయ్యాయి. ఇప్పుడు ఇంకా ముందుకు జరిగి పిల్లలను ఒకళ్ళ నొకళ్లకు పరిచయం చేసే వరకే కన్న వాళ్ల పాత్ర. తుది నిర్ణయం పిల్లలు తీసుకుంటున్నారని వింటున్నాము. అందుకు సమ్మతించి పెద్దలు చేస్తున్నారు పెళ్లిళ్లు. సగం మంది వాళ్లే చేసేసుకుంటున్నారు కూడా... ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ, మొగపిల్లల్లాగా , ఇంకా ఎక్కువ సంపాయిస్తూ, దేశ విదేశాలకు ఉద్యోగ రీత్యా తిరుగుతూ ఎంతో మార్పు ను తీసుకోచ్చారు. ఇంతవరకు బావుంది. చాలా మందికి ఆ స్వేచ్చ్ నెత్తికెక్కి తాగుడు, తిరుగుళ్లు, లివ్ యిన్లు-- ఈ పాశ్చాత్య పోకళ్ళు వంట పడుతున్నాయి-- మన సాంప్రదాయాన్ని మంట కలిపి అదే జీవితం అనుకుని భ్రమ పడుతున్నారు. వాళ్లకు లభించిన స్వతంత్రాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు... ఇది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించు" అని అన్నపూర్ణ సాయంత్రం పని పేరుకొని ఉన్నా, సందర్భం వచ్చింది కాబట్టి కూతురు తో నాలుగు ముక్కలు చెబుదామనిపించి చెప్పింది...
"నేను వర్క్ చేసిన రోజు, ఇట్స్ మై లైఫ్ అనే సూత్రం నాది. నీ లాగా కిచన్ లొనే ఉండను మా, " నా పియర్ గ్రూపు ( తోటి వాళ్ళు) ఇప్పటికే నన్ను ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళ తో ఏ రకంగా నాకు పోలిక లేదు... మినీస్ వేసుకోను(అతి పొట్టి డ్రెస్సులు) జుట్టు కు రక రకాల రంగులు వేసే రోజులివి, ఒక్క సారి కూడా నేను చెయ్యలేదు, టాటూలు (పచ్ఛ్ బొట్లు) కూడా వేసుకోలేదు నేను - చేతి మీదో, నడుము మీదో, మెడ మీదో- అస్సలు బాయ్ ఫ్రెండ్ లేని దాన్ని నేనె.. తెలుసా? డేటింగ్ చెయ్యని వాళ్ళెవ్వరూ లేరు ఈ రోజుల్లో " అంజలి కళ్ళలో నీళ్ళు... బుజ్జిగాడు కూడా అక్క కు వత్తాసు పలికాడు... "అమ్మమ్మ, అక్క చాలా గుడ్ గర్ల్... మా బడి లో 11 వ తరగతి చదువుతున్న చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు పొగ తాగుతారు, పార్టీలు చేసుకుంటారు పబ్బు ల్లో" అన్నాడు... "పండగ, పబ్బం అంటే తెలుసురా, పబ్బు అంటే ఏంటో"... తన కూతురి వైపు చూసింది అమ్మమ్మ అలివేణి... "పబ్ అంటే బార్ లాంటిది అమ్మ" అన్నది అన్నపూర్ణ. "అమ్మాయి, టీవీ లో రోజూ పొద్దున పూట "జ్యోతిష జోగినాధం లైవ్" అని ఫొనులో మన సమస్యలకు పరిష్కారం చెబుతుంటాడు... మన ఊళ్ళో తెలిసినవాళ్ళు చాలా మంది తరచు సలహాలు తీసుకుంటారని విన్నాను... దీని ముక్కుకు తాడేసేవాడు ఎప్పుడొస్తాడో ఆ కార్యక్రమానికి ఫోను చేసి కనుక్కో అన్నపూర్ణా" అని అమ్మమ్మ అలివేణి అంటుండగా అంజలి లేచి లోపలికెళ్లింది... "ఏంటమ్మా, నువ్వూ నీ టీవీ గోల, ఊరుకో" అన్నది అన్నపూర్ణ... ఫ్రిడ్జ్ నుండి ఒక కోక్ తెచ్చుకొని, అంజలి కంది పోయిన మోహము తో తల్లిని చూస్తూ తన మనసు లోని మాట నిర్మొహమాటంగా చెప్తూ పోయింది- "రేపు పెళ్ళి చేసుకుని మొగుడు, పిల్లలకు వంట చేసుకుంటూ ఉండలేను. నా కెరీర్ సక్సెస్ ( వృత్తి లో విజయబాట) ని చవి చూడాలి. అందుకు మ్యారేజ్ ఒక అడ్డుగోడ.. ప్లీస్ అమ్మా, అర్ధం చేసుకో" అని అంజలి మాట్లాడే మాటలకు అమ్మమ్మ అలివేణి కి చమటలు పోసి గుండె బరువు ఎక్కింది... ఇదెక్కడి పిల్ల, ఇవేమీ మాటలు... ఆయనే ఉంటే ఈపాటికి అందరి గొంతు పిసికి చంపేసి ఆయన కూడా చచ్చే వాళ్ళు అని " కాలం గాని కాలం" సీరియల్ లో సులోచన లాగా ఏడ్చింది... అన్నపూర్ణ కు భయం వేసింది వేణు కి ఈ గోల వినిపిస్తే చివాట్లు తప్పవని... వేణు గది లోనించి రానేవచ్చాడు... అత్తగారి బాధ ను చూసి అన్నపూర్ణ ను సంగతేంటని అడిగాడు...
" అంజలి పెళ్లి గురించి వాదించుకుంటున్నాము" అని ముక్తసరిగా చెప్పింది...
" అందుకు ఏడవటమెందుకు? అస్సలు సినిమా ఏమైంది పూర్ణా?" అన్నాడు.
"సినిమా వల్లే ఈ సీరియల్ మొదలైంది" అన్నది అన్నపూర్ణ...
" అంజలి, వాట్ ఐస్ ఇట్ , ఎవరైనా అర్ధమయ్యేటట్లు నాకు చెప్తారా? " అని తండ్రి అడిగిన ప్రశ్నకు అంజలి "నాన్న, నా పెళ్లి నా ఇష్టం" అన్నది... అన్నపూర్ణ భర్త ఏమంటాడో అని చూస్తోంది... ఒక్కసారి అమ్మమ్మ అలివేణి కూడా అల్లుడు వైపు చూసింది ఏడుపు సీను కి కాసేపు బ్రేకిచ్చి...
" నాకింకో అర గంట లో మీటింగ్ ఉంది అంజలి. నీ పెళ్లి టాపిక్ మనము ఇంకో రోజు మాట్లాడుదాము... ఎవరైనా ఉన్నారా నీ మనసులో? లాక్డౌన్ తర్వాత ఇంటికి పిలు, కలుద్దాం" అని చక చకా ఆఫీసు రూము లోకి వెళ్ళిపోయాడు ఫోన్ మోగితే...
"గెట్ మీ ఎ కప్ ఆఫ్ టీ అంజలీ ప్లీస్" అని వేణు అడిగాడు... వెంటనే లేచి రెండు నిమిషాల లో తండ్రికి టీ తానే పెట్టి తీసుకెళ్లింది...ఇది కలా నిజమా, ఇటు పుల్ల తీసి అటు పెట్టదు కూతురు...అలాంటిది... తండ్రి మాటలకి లేచి టీ పెట్టిందని, ఇందులో తనకు తెలియని కుట్ర ఏమైనా ఉందా వీళ్ళ మధ్యా? అన్నపూర్ణ మనసు మంచి స్పీడు అందుకుంది... సోఫా లో చూస్తూ కుర్చుండి పోయింది... రేపు ఈ పిల్ల ఎం చేస్తుందో ఏమో అని....
ఆ రాత్రి పడుకునే ముందు అదే విషయం వేణు దగ్గర ప్రస్తావించింది... " డోంట్ వర్రీ ( దిగులు పడకు) పూర్ణా... అన్ని సవ్యముగా జరుగుతాయి... కాలం మన ఊహ కందనంత మారిపోయింది... ఎన్నో వింటున్నాము మనము... ప్రతి ఇంట్లో ఒక ఇంటర్ కాస్ట్ (కులాంతర వివాహము), లేదా మతాంతర పెళ్లి, లేదా విదేశీ అల్లుడో కోడలో, అది ఇది కాకపోతే ఇంకా మనము నమ్మలేని వెన్నో.... రేపు మన అంజలి మొగపిల్లవాడిని చేసుకుంటే చాలు అనుకునే రోజులివి పూర్ణా, అర్ధమవుతోందా నీకు? మా ఆఫీసు లో సీనియర్ మ్యానేజర్ రామశాస్త్రి గారు తెలుసుగా నీకు? వాళ్ల కోడలు పెళ్లి అయ్యాక నెలలోపే వీళ్ళ అబ్బాయి రమేష్ ను విడిచి వెళ్ళిపోయింది ... చెప్పుకుంటే సిగ్గు చేటు... ఆ అమ్మాయి కు మొగవాళ్ళు అంటే అసహ్యం ట... ఈయనకు అది పెద్ద షాకు. తల్లి తండ్రి తెలిసి మోసము పెళ్లి చేశారు కూతురుకు... రమేష్ జీవితం నాశనం అయిందని ఎంతో బాధ పడ్డాడు శాస్త్రిగారు... పేపర్లలో, వార్తల్లో వినటం కాదు, తెలిసిన వాళ్ళ దగ్గర వింటున్నాము. మనదాక రాకపోతే మనము చేసుకున్న అదృష్టం... కాల వైపరీత్యం ఇదే... లేకపోతే ఈ కరోనా ఏంటి, ఈ లాక్డౌన్ ఏంటి?? అస్సలు ఈ పెళ్లిళ్లేంటి, ఈ ప్రపంచమేంటి? "
క్షణాలలో గురక పెట్టి ఏరు దాటాడు వేణు...
అన్నపూర్ణ కు అమ్మ అలివేణి చెప్పిన 'పాపం పండింది' సీరియల్ లో ఒక ఘట్టం గుర్తుకొచ్చింది ఈ సందర్భంలో... ఆలోచిస్తూ పడుకుంది... తన కాలమే బావుంది... మెడ వంచి చేసిన పెళ్ళి కాదు... రెండు వైపుల పెద్దవాళ్ళు సరే అనుకోని, అబ్బాయి సరే అంటే ఆడపిల్ల పెళ్లి అయిపోయేది, తనకూ అంతే...20 ఏళ్ల కు పెళ్లయింది... ఇప్పుడు వచ్చి వచ్చి 30 ఏళ్ల కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళ కు ఒప్పుకోవట్లేదు... ఇదివరకు
లవ్ మ్యారేజెస్ తక్కువే... ఉద్యోగాలు చేసే మహిళలు ఇలా ఉండేవాళ్ళు కారు... మరీ ఇప్పుడు వేలం వెర్రి లాగా ఉంది... ఇదంతా సెల్ఫోను వల్లనే... ఎం చేస్తాం... కాల చక్రం ముందుకు దూసుకుపోతుంది తప్ప వెనుకంజు వేయదుగా... నలుగురి తోపాటు నారాయణ... అలా నిద్దరలోకి వెళ్ళిపోయింది...
అటు అమ్మమ్మ అలివేణి కూడా ఆలోచిస్తూ పడుకుంది... తన కాలమే బావుందను కుంది... తన పిల్లలు తన మాట విని పెరిగారు, ఎదురు చెప్పలేదు ఏ రోజు, ఈ కాలం లో లాగా కాదు... తనకు13 ఏళ్ళ కు పెళ్ళైoది, 20 ఏళ్ళ కు ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది...ఈ చివరి దశలో జీవితం ఎటువంటి చేదు అనుభవం మిగల్చకుండా తనకు, తను తొందరగా దాటిపోతే బావుంటుందనుకుంటూ, అస్సలే 'కాలo గాని కాలం' సీరియల్ లో కలి ప్రభావం కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు... తనకు ఆ సీరియల్ లో సులోచన అవస్థను తల్చుకుంటే కడుపు తరుక్కు పోతుంది... ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ పడుకుంది...
అంజలి మటుకు దుప్పటి లో దూరాక తన ఫోను లో అర్ధరాత్రి దాకా నెట్ఫ్లిక్స్ యాప్ లో లేటెస్ట్ ఇంగ్లీష్ షో చూసింది --- కనీసము ఇందులో నైనా తన మిత్రబృందముతో వెనుక పడకూడదని--- తను మటుకు ఆఫీసు మొదలైయ్యాక జీవితాన్ని ఆస్వాదిస్తూ, వృత్తి పరంగా అత్యున్నత స్థాయికి ఎదిగి, తనకు నచ్చిన అబ్బాయి దొరికాక-- అప్పటికి తన వయసు 30- 35 లేదా ఇంకా ఎక్కువైతే నే-- కొన్నాళ్ళు అతన్ని తెలుసుకుని ఆ తర్వాత తను పెట్టె "టర్మ్స్ అండ్ కండిషన్స్" (తన ఇష్టప్రకారము అన్నీ షరతుల) కు ఒప్పుకుంటేనే పెళ్లి, కాపురం అని మరొక్కసారి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది - మహా అయితే పెళ్ళి కాదు, అందరికీ ఉన్నట్లు తనకూ అప్పటికి ఒక బాయ్ఫ్రెండ్ ఉండకపోడులే ...అంతే.... అంజలికి నిద్దర ముంచుకొచ్చింది, తన కలల ప్రపంచములోకి జారుకుంది...
మాధుర్య ...లాంటి యువతరం అమ్మాయిలు ఒంటి రంగు బాగాలేదని క్రుంగి పోతున్నారు. అలాంటి వారికి రంగు ముఖ్యం కాదని జీవితాన్ని ప్రసాదించేలా రాసిన కథకులు అభినందనీయులు