top of page

మూలాలు


'Mulalu' - New Telugu Story Written By Madduri Bindumadhavi

'మూలాలు' తెలుగు కథ

రచన: మద్దూరి బిందుమాధవి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


"సామూహిక పితృ కార్యాలు జరిపిస్తాము.. అన్నీ యధావిధిగామీ ఇంట్లో జరిగినట్టే జరిపిస్తాము".. అని ఆ ఇంటి గేట్ బయట బోర్డ్పెట్టారు.


సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కుంకుమ పూజలు అనేమాట విన్నాం కానీ ఈ సామూహిక పితృ కార్యాలేమిటో తెలుసుకుందామని.. విశ్వనాధం గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు.


విశ్వనాధం తల్లి తన తొంభయ్యో ఏట ఇటీవలే మరణించింది.

@@@@


విశ్వనాధానికి 75 సం లు. భార్య సావిత్రికి 72.

సావిత్రికి మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులతో బాధ పడుతున్నది.


"ఈ సం. అంతా అత్తయ్య గారి మాసికాలు.. ఇతర కార్యక్రమాలు ఇంట్లో జరిపించే శక్తి నాకు లేదండి. ఇల్లుకడిగించటం, సరుకులు తెప్పించటం, వంట మనిషిని పిలవటం.. వంట చేసి వాళ్ళు ఎక్కడివి అక్కడ వదిలేసి పోతేసర్దుకోవటం.. అబ్బో ఇదంతా ఈ రోజుల్లో సాధ్యమా?"


"ఇప్పుడు నాకున్న ఆరోగ్య స్థితిలో అసంభవం అనిపిస్తోంది. మీకు కూడా 75 సం. లు మొన్ననే నిండాయి. కూర్చుంటే లేవలేరు.. లేస్తే కూర్చోలేరు. "

"ఆ రోజుల్లో మన పెద్దలు తిన్న తిళ్ళని బట్టి.. వాళ్ళు తొంభయ్యేళ్ళు బతికితే.. వాళ్ళ పిల్లలకి.. మనకి డెభైలుదాటటం సహజం. మనకి పెద్దలంటే ఎంత గౌరవం ఉన్నా.. మన అశక్తత వల్ల కొన్ని పనులు చెయ్యలేము. " అన్నదిసావిత్రి.

@@@@


"నిన్న బజారెళ్ళి వస్తుంటే ఒక ఇంట్లో గేటుకి ఒక బోర్డ్ చూశాను సావిత్రీ. వాళ్ళు సామూహిక పితృ కార్యాలు చేయిస్తామని బోర్డ్ పెట్టారు. లోపలికెళ్ళి అడిగొచ్చాను. మొన్న నువ్వన్న మాట కూడా నిజమే! మన నమ్మకాలు వదులుకోలేం కనుక... కార్యక్రమాలు అసలు మానెయ్యటం కంటే.. ఇలా సామూహికంగా చేయించే చోటికి వెళితేమనకి సులువు.. శ్రమా తగ్గుతుంది. "


"ఇప్పుడు ఫ్లాట్స్ సంస్కృతి వచ్చాక చిన్న ఇళ్ళు... మడి దడి కుదరదు. పిల్లలా దగ్గర ఉండట్లేదు. పెద్ద వాళ్ళుఇద్దరే ఉంటున్నారు. చేతిలో పని అందుకునే సహాయం ఉండక, పని వాళ్ళు దొరకక... నలుగురు మనుషులు వస్తేసంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించటం కష్టమని ఇలాంటి సదుపాయం చేశారుట. "


“కానీ నాకు ఒకటే సందేహం! అల్లం పచ్చడి.. నువ్వు పొడి లాంటివి నిలవ ఉంటాయి. పైగా అందరికీ అవికామనే! అంచేత వాళ్ళు నిలవ పచ్చళ్ళు పెడతారేమో.. రోజూ చెయ్యరేమో" అంది సావిత్రి సందేహంగా మొహంపెట్టి..

"పైగా... వ్రతాలు అంటే సామూహిక సంకల్పం చెప్పి.. ఎవరి గోత్రాలు వాళ్ళని చదువుకోమంటారు. ఈ పితృకార్యాల్లో మూడు తరాల పెద్దలు ఉంటారు. సామూహికంగా మైకులో చెప్పలేరు. కాబట్టి ఎవరికి వాళ్ళకి విడి విడిగాచేయించాలి... అవునా.. అందరికీ తమ ముందు తరం పెద్దల పేర్లు తెలియక పోవచ్చు. పూర్వం అంటే.. నాయనమ్మ.. తాతల పేర్లు పెట్టే వారు. తేలికగా తెలిసేవి. ఇంటి పురోహితులే ఇలాంటి కార్యక్రమాలు చేయించేవారు.. కాబట్టివాళ్ళకి కూడా వీరి వంశం వివరాలు తెలిసి ఉండేవి. ఇప్పుడు పెద్దల పేర్లు పెట్టుకోవటం మోటు అయింది. ఇప్పుడుపెట్టుకునే పేర్లు.. హుష్.. హష్.. ఈష్. ఇలాంటప్పుడు చనిపోయిన వాళ్ళకి ముందు... మూడు తరాల పెద్దల పేర్లుతెలియాలి. ముందు తరం పేర్లు తెలియకపోవటం అనే సమస్య రాదా... అవన్నీ ముందుగా కనుక్కోవాలి" అన్నది.


"మనకి ఆ సమస్య లేదులే. మా అమ్మా, మా బామ్మ, మా ముత్తవ్వ పేర్లు నాకు తెలుసు కదా" అన్నాడువిశ్వనాధం.


“నువ్వేమో ఇంట్లో చెయ్యాలేనంటావ్! బయట ఇలాంటి సదుపాయం ఉంది అంటే.. సవాలక్ష సందేహాలు అడుగుతావ్! సరే.. నీ సందేహాలు ఆపి చెప్పేది విను. నాలుగు బెడ్ రూంస్, కిచెన్, హాల్ ఉండే రెండు ఫ్లాట్స్అద్దెకి తీసుకున్నారు. ఏక కాలంలో 4-6 వరకు పితృ కార్యాలు చేయిస్తారుట. వాళ్ళకి మంత్రం చెప్పే బ్రహ్మ గారు, భోక్తలు ఒక పెద్ద టీం ఉందిట. కార్యక్రమానికి అవసరమైన మిగిలిన సంబారాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయిట. మనంఇచ్చే డబ్బుతో మనిద్దరికీ.. భోజనం పెడతారు. అదనంగా ఎవరైనా వస్తే తలకి 200/- ఇవ్వాలిట. మనకి పట్టింపుఅయితే.. ముందు రోజు వెళ్ళి బట్టలు ఇచ్చి వస్తే.. మడి బట్టలు ఆరేసి ఉంచుతారుట".


"ముందుగా ఏం కూరలు చెయ్యాలో చెబితే చాలుట. ఎవరి ఆబ్ధీకం పెడుతున్నామో.. వారు కాశీలో వదిలేసినకూరలు చెయ్యకూడదు కదా.. అందుకే ఆ ఏర్పాటు. కూరల సంఖ్య కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగాఉంటుంది.. అది కూడా ఒక కారణంట. " అన్నాడు విశ్వనాధం.


అలా తల్లి మాసికాలు సామూహిక పద్ధతిలో జరిపిస్తున్నారు…విశ్వనాధం దంపతులు.


ఆ రోజు పక్క గదిలో కార్యక్రమం నడుస్తుండగా.. సావిత్రి చెప్పిన సమస్యే వచ్చింది..


ఆ రోజు మంత్రం చెప్పటానికి వచ్చిన బ్రహ్మ గారు.. నిద్ర మత్తులో ఉన్నారో.. ఏమో.. ఏం చెబుతున్నారో గమనించుకోకుండా... సంకల్పం చెబుతూ... 'కలియుగే.... అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన... శోభకృతునామ ససంవత్సరే... మాసే... భౌమ వాసరే'... అనగానే... 'బ్రహ్మగారూ ఈ రోజు బుధ వారం అండీ' అన్నది సావిత్రి. 'అయ్యో తప్పయిందమ్మా' అనిమళ్ళీ ప్రారంభించి.. మరి కొన్ని తప్పులు చదివి ఎలాగో క్రతువు పూర్తి చేయించాడు.


"అదేమిటండీ.. ఆయన అలా తప్పులు చెబుతున్నాడు. ఇన్నాళ్ళల్లో మనకి ఇలాంటి బ్రహ్మ గారు దొరకలేదు! నాకుకాస్తో కూస్తో తెలుసు కనుక సరిపోయింది! ఒకే రోజు మూడు.. నాలుగు కార్యక్రమాలు జరిపించే వ్యక్తి.. ఒకరి వివరాలుఇంకొకరికి చదివేస్తాడేమో! నేను ముందే అన్నట్టు.. ఈ మాత్రం కూడా తెలియని కర్తలు వస్తే.. వీళ్ళు ఇలాగే ఏదోఒకటి చెప్పేస్తారేమో! అసలు మంత్రాలేం చదువుతున్నాడో అని నాకు సందేహం వస్తోంది" అన్నది సావిత్రి డిటెక్టివ్లాగా.


అదే సమయంలో... పక్క రూం లో క్రతువు జరిపిస్తున్న బ్రహ్మ గారు.. 'అయ్యా తమరి గోత్రం' అని అడిగారు. 'హరితస' అని ఆ యజమాని చెప్పగానే.. బ్రహ్మ గారు 'హరిత.. అంబరీష.. ఆంగీరస' త్రయారుషేయ అని చదివికార్యక్రమం కొనసాగించారు. నిజానికి వారి ఋషుల పరంపర అది అవునో కాదో వారికి తెలియదు.


ఎందుకంటే హరిత గోత్రానికి రెండు రకాల ఋషి పరంపర ఉంది. వారి ధోరణి చూస్తే... ఆ విషయం యజమానికి.. భార్యకి కూడా తెలియక పోయే అవకాశం ఉంది. వారి గురించి.. ఇలా ఎందుకనవలసివచ్చిందంటే...


"మీ తల్లి గారి పేరు, నాయనమ్మగారి పేరు, ముత్తవ్వ గారి పేరు చెప్పండి" అని అడిగాడు బ్రహ్మ గారు ఆకర్తని.


"అవన్నీ నాకు తెలియవండీ. మా అమ్మ పేరు అయితే నాకు తెలుస్తుంది కానీ.. నేను ఎప్పుడూ చూడని మానాయనమ్మ.. ముత్తవ్వ పేర్లు నాకెలా తెలుస్తాయండి. అవన్నీ అవసరమా? ఊరికే నస పెట్టక త్వరగా ముగించండి" అని విసుక్కున్నాడు ఆ కర్త.


"పితృ దేవతలని.. వారి పేరుతో తృప్తి పరచాలి. లేకపోతే ఇంటికి అరిష్టమండి. ఇంటి మూలాలు తెలియకపోతే.. కార్యక్రమ ఫలితం ఎవరికి చెందాలి? ఆ మాత్రం దానికి ఇవి చెయ్యటం కూడా ఎందుకు?" అన్నారు బ్రహ్మగారు.


"నాకు ధర్మ పన్నాలు చెప్పకండి.. మీకు డబ్బిస్తున్నాం.. మమ్మల్ని అడక్కుండా మీరు ఏం చెయ్యగలిగితే అవిచెయ్యండి" అని పక్కకి తిరిగాడు... ఫోన్లో మాట్లాడటానికి.


“ఈ తంతులో క్రమానికి ఒక అర్ధం ఉంది. ఆ ఇంటి కోడలు చనిపోతే... వరస క్రమంలో మొదటి వ్యక్తినిదేవతల్లో కలిపేస్తారు. తెలుసుకుని చేస్తే మీకూ.. మాకూ కూడా పుణ్యం" అన్నాడు బ్రహ్మ గారు.


వేసవి సెలవులకి విశ్వనాధం కొడుకు కారుణ్య పిల్లలతో వచ్చాడు. వాళ్ళు కూడా ఆ రోజు కార్యక్రమానికివిశ్వనాధం గారితో కలిసి వెళ్ళారు. కారుణ్య కొడుకు అంబరీష్ బాగా చురుకైన వాడు. కొత్త విషయాలుతెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ.


అలా ఆ రోజు కార్యక్రమం ముగించుకుని విశ్వనాధం కుటుంబం ఇంటికి చేరారు. సాయంత్రం వరకు తనపాటికి తను ఏదో ఆడుకుంటూ ఉన్నా.. అంబరీష్ ఆలోచన మాత్రం ఉదయం జరిగిన విషయం మీదే ఉంది. వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు.


@@@@


అంబరీష్ "నాన్నా.. గోత్రం.. ఋషులు అంటే ఏమిటి' అని అడిగాడు.


"ప్రతి ఇంటి పేరుకి ఒక గోత్రం ఉంటుంది. నీకు ఇప్పుడే చెప్పినా తెలియదు"అన్నాడు కారుణ్య.


"మనకి కూడా గోత్రం ఉందా? ఉంటే దాని పేరేంటి" అన్నాడు అంబరీష్ 'పట్టు వదలని విక్రమార్కుడి'లాగా!


“మనది 'హరిత' స గోత్రం.


ఇప్పటి వరకు అమెరికాలో ఎవరూ గోత్రాల గురించి మాట్లాడుకోగా వినలేదు. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకుఉన్నది తెలుసుకోవాలి అనుకున్నాడు పదేళ్ళ అంబరీష్.


ఇప్పటి పిల్లలకి జిజ్ఞాస ఎక్కువ. అన్నీ తెలుసుకోవాలన్న తపన.. ఆరాటం! 'ఎలాగైనా తాతయ్యని అడిగితెలుసుకోవాలి’ అనుకున్నాడు మనసులో!


“అమ్మా నేను ఇవ్వాళ్ళ తాతయ్య దగ్గర పడుకుంటాను”అన్నాడు.


“తాతయ్య మీద కాళ్ళెయ్యను. ప్రశ్నలతో విసిగించను అంటే వెళ్ళి పడుకో" అంది శైలజ.


"రారా తాతా.. ఏంటి కబుర్లు. చదువు ఎట్లా సాగుతోంది? నీకు టీచర్ చెప్పేది బాగా అర్ధం అవుతోందా? మీచేత స్కూల్లో ఆడిస్తారా" అని తాతయ్యే ప్రశ్నలు మొదలుపెట్టాడు.


ఇక అంబరీష్ కి చాన్స్ దొరికినట్టే! తన ప్రశ్నల పెట్టె తెరిచాడు.


"తాతయ్యా గోత్రం అంటే ఏంటి? మూల పురుషుడు అంటే ఏంటి? నువ్వు పూజ చేస్తుంటే ఆ పెద్దాయనఅడిగారు కదా! పొద్దున్న నాన్నని అడిగితే.. నీకిప్పుడే అర్ధం కావు అన్నారు. స్కూల్లో కష్టమైన పాఠాలు అర్ధంఅవుతున్నాయి కదా.. ఇవెందుకు అర్ధం కావు.. చెప్పు తాతయ్యా" అన్నాడు.

"గోత్రం అంటే మూల పురుషుడి పేరు. ప్రతి వారి గోత్రం.. వారి మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. 'గో' 'త్రం' అనే పదం లో గో అంటే గోవు.. త్రం అంటే గురువు, భూమి, వేదం అని అర్థం. "


"ఆ గోత్రానికి వచ్చే ఋషుల పేర్లు అప్పట్లో వాళ్ళు విద్య నేర్చుకునే గురువు పేరుతో ఉంటుంది. ఒక్కోసారి ఒకరికంటే ఎక్కువ గురువుల దగ్గర నేర్చుకుంటే.. ఆ గోత్రానికి ఋషులు కూడా ఒకరి కంటే ఎక్కువ ఉంటారు. కొందరిగోత్రం వాళ్ళు నివసించిన.. విద్యనభ్యసించిన ప్రదేశం మీద కూడా ఆధారపడి ఉండేది. "


"ఉదాహరణకి.. మనది హరితస గోత్రం.. అందులో అంబరీష అనే ఋషి ఉన్నారు. అందుకే నీ పేరు అంబరీష్ అని పెట్టాము"


"ఒకే గోత్రానికి ఒక్కోసారి వేరే వేరే ఋషులుంటారు. "


"పూర్వం గోత్రం వేరే అయినా.. ఋషులు కలిస్తే.. అంటే రెండు గోత్రాల్లోను కామన్ గా ఋషులు ఉంటే ఆ అమ్మాయి.. అబ్బాయి మధ్య పెళ్ళికి ఒప్పుకునే వాళ్ళు కాదు" అన్నాడు విశ్వనాధం.


వాడికేం అర్ధమయిందో తెలియదు కానీ.. "ఎందుకు? నీకు.. బామ్మకి, అమ్మా.. నాన్న కి కూడా అలాగే చేశారా?" అనడిగాడు అంబరీష్.


"మా వరకు అలా జరిగాయి. ఇప్పుడు ఋషులు కలిశారు అని ఎవరూ పెళ్ళి చెయ్యటం మానెయ్యట్లేదు" అన్నాడు విశ్వనాధం.


"అయినా.. మనం ఎప్పుడూ చూడని, మనకి తెలియని ఋషి పేరు చెప్పి మానేస్తే కొన్ని మంచి మ్యాచెస్ మిస్ అవుతాయి కదా" అన్నాడు అంబరీష్ కుతూహలంగా.

“అవుననుకో.. కానీ అలా ఋషులు కలిస్తే ఆ అమ్మాయి.. అబ్బాయి అన్న చెల్లెళ్ళ వరస అవుతారు అంటారు. అన్నా.. చెల్లెళ్ళ మధ్య పెళ్ళి చెయ్యరు కదా" అన్నాడు విశ్వనాధం.


“సరే.. ఇందాకా మూల పురుషుడు అన్నావు.. అంటే ఏంటి" అన్నాడు అంబరీష్ మళ్ళీ కుతూహలంగా.


"మూలాలు అంటే మొదలు అని అర్ధం. ఉదాహరణకి.. ఒక చెట్టు ఉందనుకో.. దానికి మూలం అంటే.. దానిమొదలు.. భూమిలోకి వెళ్ళి మనకి కనిపించకుండా ఉండే వేర్లు అన్నమాట. వేర్లు లేకుండా చెట్టు ఉండదు కదా!"


"అలాగే మన మూలాలు అంటే మన పూర్వీకులన్నమాట. మా తాతయ్య.. మా ముత్తాత.. ఇలా! వారి గురించితెలుసుకోవటం చాలా ముఖ్యం. చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా.. పువ్వులు, కాయలు, పళ్ళతో అది ఆకాశం వంకచూసినా... దానికి కావలసిన పోషకాలన్నీ భూమిలో ఉండే వేర్ల ద్వారానే రావాలి... అవునా? నీళ్ళు, ఎరువులు చెట్టు మూలానికే వేస్తారు కానీ ఆకులకి, కాండానికి వెయ్యరు కదా. మన మూలాల పెద్దలు కూడా అంతే" అన్నాడు విశ్వనాధం.


"ఓహో.. ఇప్పుడు అర్ధమయింది. మొన్న అమెరికాలో రాబిన్ అంకుల్ కి క్యాన్సర్ అని తెలిసినప్పుడు.. డాక్టర్'మీ ఇంట్లో ఇంతకు ముందు క్యాన్సర్ వచ్చిన వాళ్ళెవరైనా ఉన్నారా' అని అడిగారు. రాబిన్ అంకుల్ 'తనకిపూర్వీకులెవ్వరు తెలియదు' అని చెప్పారు. "


"అవును.. ఆ డాక్టర్ 'ఫ్యామిలీ హిస్టరీ తెలిస్తే క్యాన్సర్ ట్రీట్ మెంట్ విధానం వేరేగా ఉండచ్చు. చికిత్సతో రోగంతగ్గటానికి అవకాశం ఉండచ్చు' అని కూడా చెప్పాడు కదా గుర్తుందా" అన్నాడు కారుణ్య వాళ్ళ సంభాషణలో మాటకలుపుతూ!


“అవును నాన్నా గుర్తొచ్చింది" అన్నాడు అంబరీష్.


"నిన్న పక్క గదిలో…ఆ అంకుల్ కి నిజంగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. రాబిన్ అంకుల్ లాగానే కష్టంఅవచ్చు కదా. ఆయనేమో 'అవన్నీ నాకు తెలియవు. అవసరామా.. ఇప్పుడెందుకు' అని విసుక్కున్నాడు కదా" అన్నాడు అంబరీష్ ఆరిందా లాగా.


"చెట్టు మూలానికి చెద కానీ చీడ కానీ పట్టటం మొదలైతే.. పైన ఉన్న కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలకికూడా త్వరలోనే చీడ సోకుతుంది. అందుకే మన మూలాల గురించి మనకి తెలియాలి. ఏదైనా అనూహ్యమైన సమస్య వచ్చినా.. అనుకోని అనర్ధం జరిగినా.. మూలం గురించి ఆలోచించి.. జాగ్రత్త పడాలి" అన్నాడు విశ్వనాధం.


"మనం ఏ రకమైన విత్తనం వేస్తే.. ఆ రకమైన కాయలే కాస్తాయి. ఇది ఒక చెట్టు విషయమే కాదు.. మనుషులు, జంతువులు, పశు పక్ష్యాదులన్నిటికీ అంతే. "


"ఒక్క రోగాలనే కాదు.. మనిషి రూపు రేఖలు, ఒంటి రంగు, ఎత్తు.. లావు.. సన్నం, తెలివితేటలు, కళల పట్లఆసక్తి.. నైపుణ్యం, పనుల్లో నేర్పరితనం, మాట నేర్పరితనం, భాష- సంప్రదాయాలు.. మన ఆచార వ్యవహారల పట్లఆసక్తి... ఇవన్నీ ఎక్కువ భాగం వంశ పారంపర్యంగా వస్తాయి. అసలు పిల్లలే పుట్టకపోవటం, కవల పిల్లలుపుట్టటం కూడా వంశ పారంపర్యంగానే జరుగుతుంది అంటారు అనుభవం ఉన్న పెద్ద వాళ్ళు. అందుకే ఎవరైనాబాగా మెరిటొరియస్ గా ఉంటే.. వాళ్ళ పూర్వీకులు.. అంటే మూల పురుషులు ఎవరు అని అడిగి తెలుసుకుంటారు. ఇంట్లో అందరూ తెలివైన వారై.. ఎవరో ఒకరు అల్లరి-చిల్లరగా తిరిగితే 'మా వంశాన చెడబుట్టావురా' అంటారు" అని విశ్వనాధం తన పదేళ్ళ మనవడికి పెద్ద పెద్ద విషయాలు చెబుతుంటే...


“ఇంక చాలు పొద్దు పోతోంది పడుకోండి. ఎంత సేపైనా వాడి ప్రశ్నల చిట్టా ఆగదు.. వాడిని చూస్తే మీకుహుషారు ఆగదు. రేపు మనం పిక్నిక్ కి వెళ్ళాలి" అని సావిత్రి కేకేసింది.


“తాతయ్యా.. భలే ఇంటరెస్టింగ్ గా ఉంది. నేను పెద్దయ్యాక మన మూలాల గురించి ఇంకా బాగాతెలుసుకుంటాను" అన్నాడు అంబరీష్.


“నీ లాగానే ఇప్పుడు మీ పాశ్చాత్య దేశల వాళ్ళు ఆసక్తి కలిగి... మన సంప్రదాయాల మీద, వాటి వెనక ఉన్నసైన్స్ నేపధ్యం గురించి చాలా పరిశోధనలు చేస్తున్నారు. గోత్రాల ఆధారంగా మూల కణాల (డీ ఎన్ ఏ) మీద, వాటిలక్షణాల మీద వాళ్ళకి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయిట. "సగోత్రీకులని చేసుకోకూడదు" అనే మననమ్మకానికి శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వారు కూడా నమ్ముతున్నారు. చూడాలి ఇంకా నిరూపణ జరగాలి. "


"సరే ఇక పడుకో. చూశావా.. బామ్మ కేకలేస్తోంది. పడుకుందాం. రేపు బోలెడంత ఆడుకోవాలి కదా.. మళ్ళీ రేపుపడుకునేటప్పుడు మాట్లాడుకుండాం" అని తాత-మనవలు ఒకరినొకరు కావిలించుకు పడుకుని నిద్రలోకిజారుకున్నారు.


కొడుకు.. కోడలు.. మనవడు ఉన్న నెల రోజులు ఇట్టే గడిచిపోయింది.. విశ్వనాధం దంపతులకి. అసలు టైమేతెలియలేదు.


"వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా బోసిపోయినట్టుంది కదా. మా చిన్నప్పుడు మేము సెలవలకి వచ్చి వెళ్ళి పోతే మాబామ్మ తాతయ్య కూడా.. ఇలాగే అనుకునేవారు. పది రోజులవ్వగానే మేము ఉండే ఊరు వచ్చేవారు. నాలుగురోజులుండి మళ్ళీ పొలం పనులున్నాయని వెళ్ళిపోయేవారు" అన్నాడు విశ్వనాధం టీవీ ఆన్ చేస్తూ...

@@@@


"సావిత్రీ... నీకు మా చిన్నప్పటి నేస్తం ప్రసాద్ తెలుసు కదా.. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని హాస్పిటల్లో చేరిస్తేచూడటానికి వెళ్ళాను. అక్కడ హార్ట్ ఎటాక్ వచ్చిన ఇంకొక ఆయనని తీసుకొచ్చారు. ఆయనకి ఆపరేషన్చెయ్యాలంటే బ్లడ్ కావాలిట. అదేమో రేర్ బ్లడ్ గ్రూప్ ట. అదేంటో కనుక్కుందామని వెళ్ళాను. ఆయన్ని ఎక్కడోచూసినట్టనిపించింది. కాసేపు ఆలోచిస్తే గుర్తొచ్చింది.. ఆయన ఆ రోజు సామూహిక పితృ కార్యం ఇంట్లో మనతోపాటు కార్యక్రమం చేశాడు. "


"ఆ రోజు మీ అవ్వ, ముత్తవ్వ పేరు చెప్పమంటే.. 'ఈ రోజుల్లో కూడా అవన్నీ అవసరమా? ఎవరు గుర్తు పెట్టుకుంటారు?' అని విసుక్కున్నాడు. అతి ముఖ్యమైన వాళ్ళే తెలియక పోతే ఇంక వేరే కుటుంబ సభ్యుల సంగతిఆయనకేం తెలుస్తుంది. బ్లడ్ గ్రూప్, వంశ పారంపర్యంగా వచ్చే రోగాలు కొన్ని తరాల వరకు కుటుంబ సభ్యులకివస్తాయి. ఖచ్చితంగా వస్తాయని కాదు కానీ.. వచ్చేటందుకు అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఆయన్ని చూస్తే అదేఅనిపించింది" అన్నాడు విశ్వనాధం.


“అంతేలెండి.. ఆధునికత్వం అంటే మన పెద్దలు చెప్పింది నిరసించటం అనుకుంటారు కొందరు. ఏదీ పట్టించుకోక పోవటం ఫ్యాషన్ అనుకుంటారు కొందరు. ఇదిగో.. ఇలా కొంప మునిగే పరిస్థితి వస్తే... మూలాలగురించి ఎవరో అడిగితే.. అప్పుడు దాని ప్రాధాన్యత తెలుసుకుని ఆలోచించటం మొదలుపెడతారు. "


"మనం ఆకాశంలో నించి ఊడి పడం అనేది తెలిస్తే చాలు. పాపం మీకు తెలిసిన గ్రూపుల్లో ఒక వాట్సాప్మెసేజి పెట్టండి. ఏ ధర్మాత్ములైనా చూసి సహాయం చెయ్యకపోరు" అని సావిత్రి ఇంటిపనిలో పడింది.

మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.










58 views0 comments

留言


bottom of page