మురిసిన పసిహృదయం
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Murisina Pasi Hrudayam' New Telugu Story
Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
స్కూల్ కి టైమ్ అవుతోందని, స్కూల్ బస్ వచ్చేస్తుందని చక చకా తయారౌతోంది తొమ్మిదేళ్ల సితార.. బస్ మిస్ అయితే స్కూల్ కి వెళ్లడం చాలా కష్టం.. నాన్న కారులో డ్రాప్ చేయాలి.. అసలుకే నాన్న చాలా బిజీ ..
ఈ లోగా మూడేళ్ల 'సిద్దూ' వచ్చి తను స్కూల్ బేగ్ లో సర్దుకున్న పుస్తకాన్నీ బయటకు లాగి పారేసేసరికి సితారకు చాలా కోపం వచ్చి వాడి పిర్రమీద రెండు అంటించేసరికి వాడు గట్టిగా ఆరున్నొక్క రాగం ఎత్తుకున్నాడు..
వాడి ఏడుపుకి కంగారపడుతూ నీరజ పరుగెత్తుకుంటూ వచ్చేసింది..
" ఏయ్ మొద్దూ.. ఎందుకే తమ్ముడిని అంతలా కొట్తావు? చిన్న పిల్లాడు కదా.. నెమ్మదిగా బుజ్జగించి చెప్పలేవా?” అంది నీరజ.
"నెమ్మదిగానా? వాడు నా పుస్తకాలన్నీ లాగేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా అమ్మా" అప్పటికే నీరజ చంకనెక్కేసిన సిద్దూ వైపే కోపంగా చూస్తూ అంది సితార.
“అయినా ఏం కోపమే తల్లీ, పెద్దదానివౌతున్నావు, కాస్త నిదానం నేర్చుకోవే” అంటూ నీరజ కోపంగా సిద్దూని ఎత్తుకుని అక్కడనుండి వెళ్లిపోయింది..
ఈలోగా సితార కంటే రెండేళ్ల చిన్నదైన ' సింధుజ' తయారైపోయి తనవైపు ఓరగా చూసుకుంటూ బేగ్ ఊపుకుంటూ దర్జాగా “అమ్మా! బై..” అని చెపుతూ వెళ్లిపోయింది. సింధూది కూడా సితార చదివే స్కూలే.. ఇద్దరిదీ ఒకటే బస్..
తనకంటే రెండేళ్లమాత్రమే చిన్నదైన సింధూని ‘చిన్నపిల్ల’ అంటూ అమ్మ దానికి దగ్గరుండి అన్నీ సర్దిపెడ్తుంది. నోట్లో పెట్టి మరీ తినిపిస్తుంది. తను మాత్రం అమ్మా నాన్నా దృష్టిలో పెద్దది. సింధూకంటే ఎంత పెద్దదాన్నని అనుకుంటుంది అమ్మ! సితారలో ఎప్పుడూ కలిగే సందేహమే ఇది..
ఆరోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే హోమ్ వర్కు చేసుకుంటున్న సితార నాన్న కేకలకు చివ్వున తలెత్తింది.. నాన్న ఆఫీసునుండి రావడం కూడా గమనించనే లేదు..
వస్తూనే సితార తో " సీతూ! సిద్దూ మోకాలు చూడు ఎంతలా కొట్టుకుపోయిందో, ఆడుకుంటూ పడినట్లు ఉన్నాడు.. వాడిని కాస్త కనిపెట్టుకు చూడమని నీకెన్నిసార్లు చెప్పాను? పెద్దదానివి, వాడిని కాస్త చూసుకోవద్దూ” అంటూ నాన్న కళ్ళెర్ర చేస్తుంటే బెదిరిపోయింది..
వాడు పడినట్లు తనకెలా తెలుస్తుంది? తను హోమ్ వర్కు గొడవలో పడిపోయి వాడు ఏమిచేస్తున్నాడో గమనించనే లేదు.. అమ్మ, సింధూ తో ఉన్నాడేమో అనుకుందేగానీ, వాడు ఏమి చేస్తున్నాడో ప్రతీక్షణం తను ఎలా కనిపెట్టగలదు?
నాన్న తనను అలా కోప్పడేసరికి ఒక్కసారిగా దుఖం పొంగుకొచ్చేసి వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది..
ఈలోగా నీరజ అక్కడకు వస్తూ " ఏదైనా అంటే చాలు నెత్తిమీద ఉంటుంది నీళ్లకుండ.. తొమ్మిదేళ్లు నిండుతున్నా చిన్నపిల్లలా ఆ ఏడుపు ఏమిటో? ఏదీ.. ఆ డెట్టాల్, బేండేజ్ తెచ్చివ్వు” అనగానే అవి తెచ్చి తల్లికి అందించింది..
‘నేనూ చూడలేదు.. సిద్దూ పడిపోవడం’ అని గొణుక్కుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది.. తల్లి వెళ్లిపోయాక కళ్లనుండి నీళ్లు కారిపోతున్నా ఒక చేత్తో తుడుచుకుంటూనే మిగతా హోంవర్కు పూర్తిచేసుకుంది..
డిన్నర్ టైమ్ అయింది.. ఈలోగా నీరజ " సీతూ ఏమిచేస్తున్నావే ? డైనింగ్ టేబిల్ మీద కంచాలు అవీ సర్దంటూ" కేకేసేసరికి ఉలిక్కిపడుతూ గబ గబా టేబిల్ పైన కంచాలు సర్ది, మంచినీళ్ల గ్లాసులలో నీళ్లు పోస్తోంది..
ఈలోగా అక్కడకు వచ్చిన సింధూ ఠపీమని తన కంచం ముందుకు లాక్కునేసరికి పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు కి చేయితగిలి నీళ్లన్నీ డైనింగ్ టేబుల్ పైన ఒలికిపోయాయి.. నీరజ వచ్చేసరికి టేబిల్ పైన అంతా నీళ్లు.. సితార అక్కడే బిత్తరపోయి చూస్తోంది.. అసలు తప్పెవరదన్న ప్రశ్నకు తావివ్వకుండా సితార వీపుని విమాన మ్రోత మోగించేసరికి సితార ఏడుస్తూ బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయి మంచం మీద వాలిపోయింది..
పొద్దుటనుండీ చూస్తోంది.. తనది తప్పుకాకపోయినా తననే నిందిస్తూ కొట్టడం, మాట మాటికీ పెద్దదాన్నివంటూ దెప్పిపొడవడంతో సితార పసిమనసు గాయపడింది.. తను అంటే అమ్మా నాన్నకీ ఎప్పుడూ విసుగే.. సింధూ అన్నా సిద్దూ అన్నా ఎంతో ముద్దు.. వాళ్లు ఏమిచేసినా ఏమీ అనరు.. తనంటేనే ఇష్టంలేదు..
ఔను నిజమే, ఆమధ్య ఎప్పుడో పక్కింటి ఆంటీతో అమ్మ అంటోంది.. మా పెళ్లైన ఏడాది లోపులే పుట్టేసింది మా సీతూ.. నాకే సరదా తీరనేలేదు.. హాయిగా ఏ బాదరబందీలు లేకుండా మా వారితో సరదాగా ఊటీ, కొడైకెనాల్, కురుమనాలీ లాంటి ప్లేస్ లకు వెడ్దామనుకుంటూ సరదా పడ్డాను.. కానీ దేనికైనా ప్రాప్తం ఉండాలికదాండీ, మా చెల్లెలు పెళ్లైన మూడేళ్లకి గానీ కనలేదు.. ఈలోపుల హాయిగా అన్నీ ప్లేసెస్ చుట్టపెట్టేసా”రంటూ..
హు....తనంటే అందుకే అమ్మా నాన్నకీ ఇష్టంలేదు, ఎందుకంటే ఇష్టంలేకుండా పుట్టేను కాబట్టీ.. అని ఏడుస్తూ పడుకుండిపోయింది..
మాగన్నుగా నిద్దరపడుతున్న తనని తట్టి లేపడం తెలుస్తోంది..
' సీతూ లే, అన్నం తిందువుగాని ' ..
నాకేమీ ఒద్దంటూ దుప్పటి ముసుగు పెట్టేసుకుంది.. ఇంకా వెక్కిళ్లు తగ్గనే లేదు..
'' లేవవే తల్లీ, అంతా కోపమేనా?, చిన్న మాటంటేనే అంత రోషమా?"
"ఎందుకు నీరూ దాన్ని అంత బ్రతిమాలతావు? ఒక్కపూట మాడితే ఏమీ కాదులే, ఇదిగో ఇలా బ్రతిమిలాడుతూ బుజ్జగిస్తేనే వాళ్లు మొండితేలుతారు.. ఆకలేస్తే అదే లేచి కూర్చుంటుంది, దానిని బ్రతిమాల”కంటున్నాడు మాధవ్..
నాన్న మాటలకు పూర్తిగా మెలుకువ వచ్చేసింది.. మాధవ్ మాటల్లో సగం హాస్యం, సగం నిజం మిళితమై ఉంది.. కానీ ఆ పసిమనసుకి అర్ధం కాలేదు.." హు, నాన్న కూడా ఎలా మాట్లాడుతున్నాడో, నేను ఇష్టం లేకుండా పుట్టాను కాబట్టే నా మీద ప్రేమలేదు".. సిద్దూ, సింధూ ఇలా చేస్తే వాళ్లను ఎత్తుకుని బ్రతిమాలి మరీ తినిపిస్తారు .. మళ్లీ దుఖంతో ఏడుపు తన్నుకొచ్చేసింది.. ఏడుస్తూనే ఎప్పటికో నిద్రపోయింది..
తెల్లారినా నిద్రలేవని సితార దగ్గరకు వచ్చి " సీతూ లే, స్కూల్ కి టైమ్ అవుతోం”దంటూ లేపడానికి వచ్చిన నీరజ మూలుగు వినిపించడంతో దుప్పటి లాగి చూసింది..
సితారను తాకిచూస్తే జ్వరంతో ఒళ్లుకాలిపోతోంది.. గాభరాతో భర్తను పిలిచింది.. మాధవ్ కూడా చూసాడు.. ఎప్పుడూ ఏ జ్వరం రాని సీతూకి సడన్ గా జ్వరం రావడ మేమిటాననుకుంటూ ఫేమిలీ డాక్టర్ కు ఫోన్ చేస్తే ఆయన చెప్పిన టేబ్లట్సు వాడి రెండు రోజులు చూసినా జ్వరం తగ్గుముఖం పట్టలేదు.. బ్లడ్ టెస్టు చేయిస్తే టైఫాయిడ్ అన్నారు..
నీరజా మాధవ్ కంగారు పడిపోయారు.. నీరజ అయితే సితార పక్కనే అలా అతుక్కుంటూ కూర్చుండిపోయింది..
ఆరాత్రి జ్వరం ఇంకా ఎక్కువై సంధి ప్రేలాపన మొదలైంది.. నీరజ మాటి మాటికి తడిగుడ్డ తడిపి వేస్తూనే ఉంది..
" అమ్మా! నేనంటే నీకిష్టంలేదు, నాన్నకు కూడా అంతే!”
" నేను మీకు ఇష్టంలేకుండా పుట్టానని రమా ఆంటీతో చెప్పడం విన్నానులే!”
"అందుకనే నా తప్పులేకపోయినా ఎప్పుడూ నన్నే తిడతారు , నేనేమయిపోయినా ఫరవాలేదు కదూ" ,
“నేను అన్నం తినకుండా పడుకుంటే నన్ను వదిలేసారు.. చిన్నప్పుడు నాకు నోట్లో పెడ్తూ కధలు చెపుతూ తినిపించేదానివి.. అలాగే చేస్తావనుకున్నాను. నాకు జ్వరం ఎక్కువైపోతే దేవుడి దగ్గరకు వెళ్లిపోతానులే అమ్మా..”
సంధిప్రేలాపనలో ఏమిటేమిటో మాట్లాడేస్తోంది..
ఈమాటలు వినగానే నీరజా మాధవ్ తల్లిడిల్లిపోయారు..
ఆపుకోలేని దుఖంతో ఉద్వేగభరితులు అయిపోతూ,
" సీతూ నా బంగారు తల్లీ, నీవు మా ప్రాణం రా ! నీవంటే కోపం ఏమిటి' ? నీవు సింధూ, సిద్దూ కంటే పెద్దదానివని కదా అని కోప్పడిన మాట వాస్తవం.. కానీ నీవంటే ఇష్టం లేకకాదు తల్లీ’
మాధవ్ కళ్లనుండి కన్నీటిబొట్లు సితార బుగ్గలపై రాలిపడ్డాయి..
' నిజంగానా నాన్నా, నేనంటే నీకిష్టమేనా' ? ప్రామిస్..’ అంటూ గొణుగుతోంది..
' నిజంరా ప్రామిస్ అంటూ ' సితార తల నిమురితో దాని చేతిని ముద్దుపెట్టుకున్నాడు మాధవ్..
నీరజ అయితే సీతూని తన ఒడిలోకి లాక్కుంటు బుగ్గలమీద ముద్దులు పెట్టుకుంటూ, " నా బంగారు తల్లీ నీవు మా ప్రాణం రా కన్నా" అని ముద్దుచేస్తుంటే సితార తల్లి ఒడిలో పసిపాపే అయిపోయింది..
నీరజకి సీతూ చిన్ననాటి సంఘటనలు గుర్తొచ్చాయి..
దానికి నీరజ దాక్కుంటే వెతుక్కోడం చాలా ఇష్టం.. తలుపు పక్కన దాక్కుని భౌమంటే కిలకిలా నవ్వేది..ఆ చిట్టి నవ్వులకే ఆ బుగ్గలు ఎర్రగా కందిపోయేవి..
సాయంత్రం వేళ నీరెండలో పెరట్లో చెట్లమధ్య దోబూచులాడుతూ సీతూ తనని పట్టుకోడానికి చిట్టి చిట్టి అడుగులతో పరుగెట్టేది..
అసలుకే పచ్చగా దబ్బపండు రంగులో మెరిసిపోతూ ఉండేది.. దాని అందానికి తగ్గట్లు ముద్దుగా ' సితార' అని పేరు పెట్టుకున్నారు.. నల్లని ఒత్తైన గుబురు జుట్టు, చక్రాల్లాంటి కళ్లతో దిష్టి తగులుతుందేమో అన్నట్లుగా ఉండేది.. ఎప్పుడైనా ముచ్చటపడి అబ్బాయి డ్రెస్ వేస్తే నిజంగా బాబేమో అనుకునేవారు.. నవ్వుతుంటే ఆ బుగ్గలమీద చిన్న చిన్న డింపుల్స్ , సాయంత్రపు నీరెండకు కూడా సీతూ ఎక్కడ నల్లబడిపోతుందో అనుకుంటూ దాన్ని తన ఒడిలోకి లాక్కుంటూ తన చీరచెంగు తీసి కప్పుతూ ఉండేది..
తరువాత పుట్టిన సింధూకి, సిద్దూకి దాని రంగు, అందం రానేలేదు.. తొమ్మిదేళ్ల సీతూ లో ఎంత పరిపక్వత.. చదువులో చురుకు, పెద్దలపట్ల అణుకువ.. ఎప్పుడూ పేచీ పెట్టని స్వభావం.. తనకు చిన్న చిన్న పనులలో సహాయం చేస్తూ తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది..
నీరజ సీతూ చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ ఏవో ఆలోచనలలో మునిగి ఉండగా తల్లి ఒడిలో ఒక చిన్నపాపలా నిశ్చింతంగా నిద్రపోయింది సీతూ..
నిద్రపోతున్న కూతురి అమాయకమైన ముఖంవైపే చూస్తూ " చూసావా నీరూ మన తెలివితక్కువ తనం , నిర్లక్ష్యత పసివాళ్ల మనస్సులపై ఎంతటి ప్రభావం చూపుతుందో" ? పక్క ఇంటావిడ రమా తో నీవన్నమాటలు దాని పసి మనసుపై ఎంతటి ప్రభావం చూపాయో చూడు ! చిన్న పిల్లలు కదా అనుకుంటూ అనాలోచితంగా మనం అనే మాటలు వాళ్లకి అర్ధం కావనుకుంటాం..
కానీ పిల్లలు చాలా సూక్ష్మగ్రాహులు.. చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తారు.. మనపిల్లలే అయినా మనం వారిమధ్య వ్యత్యాసం చూపకూడదు.. ఒకరిని పొగుడుతూ, మరొకరిని చిన్నపుచ్చుతూ మాట్లాడడం మంచిదికాదు.. వారిపట్ల మన ప్రవర్తనే కాలక్రమేణా వారి మధ్య అనుబంధాన్ని పెంపొందించినా , ద్వేషాన్ని పెంచినా అన్న సంగతి మరచిపోకూడదు.. ఇకనుండి మన ముగ్గురు పిల్లలను సమాన దృష్టితో చూడడం మన బాధ్యత..
ఏమంటావ్ నీరూ "?
భర్త మాటలకు ఎమోషన్ కు లోనౌతూ “నిజమేనండీ, ఇటువంటి పొరపాట్లు ఇంకరానివ్వ”నంటూ సితార తల నిమురుతూ ఉండిపోయింది..
తల్లీతండ్రీ చూపిస్తున్న ప్రేమలో, గారంచేస్తూ, ముద్దుచేస్తూ వేళ వేళకీ పండ్లరసాలు, ఆహారం తినిపిస్తూండడంతో సితారకు జ్వరంతగ్గి ఆరోగ్యం పుంజుకోసాగింది.. అమ్మా, నాన్నా ఎంతో ప్రేమగా ' సీతూ, సీతూ' అంటూ తనని పిలుస్తూ ముద్దుచేస్తుంటే ఆ పసిహృదయం మురిసిపోయింది..
అదివరికటి కంటే మరింత ఉత్సాహంతో చదువుకుంటూ, సింధూని, సిద్దూని ఆడిస్తూ, తల్లి ఒడిలో చిన్నపిల్లలా దూరి గారాలుపోతూ సందడి చేస్తుంటే, నీరజ్ మాధవ్ ల ఆనందం వర్ణనాతీతం..
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి

రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం