top of page

మువ్వల రిక్షా 'Muvvala Rikshaw' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 15/03/2024

'మువ్వల రిక్షా' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్శ్రీధర్ అమెరికాలో పేరున్న ఐటీ ఇండస్ట్రీ యజమాని. అమెరికా లో సిటిజెన్షిప్ కూడా వుంది. చిన్న సంసారం. భార్య, కొడుకు.. అంతే.బోలెడు డబ్బు. ఎక్కడో ఇండియాలో వున్న చిన్న గ్రామం లో పుట్టి ఈ రోజు అమెరికాలో స్థిర పడటం.. అంతా తన తల్లిదండ్రుల పుణ్యం.


యిరవై సంవత్సరాల తరువాత, యిప్పుడు తన పుట్టిన గ్రామం బేతవోలు కి వెళ్ళవలిసిన అవసరం పడింది. ఆ గ్రామం సర్పంచి గారి ఫోన్ రావడంతో ఇండియాకి బయలుదేరాడు, ఆ గ్రామం లోని పొలాలు అమ్ముకోవడానికి.


రైల్వేస్టేషన్ దగ్గర పది ఆటోలు, వాళ్ళకి కొద్ది దూరం లో పాత రిక్షా దగ్గర నిలబడి, ‘ఈ రోజైనా గిరాకీ దొరుకుతే బాగుండును, రెండు ముద్దలు తినవచ్చు’ అనుకుంటూ నీరసంగా వచ్చే జనాన్ని చూస్తున్నాడు వెంకన్న. దిగిన నలుగురిలో యిద్దరు నడుచుకుంటూ వెళ్లిపోయారు, యిద్దరు ఆటో ఎక్కి వెళ్లిపోయారు.


మళ్ళీ రైలు సాయంత్రం వరకు లేదు. ఈ పూట కూడా పస్తే అనుకుంటూ రిక్షా ని తన గుడిసె వున్న వీధికి పోనిచ్చాడు.


మువ్వల చప్పుడు విని బయటకు వచ్చి, ‘మొగుడు ఈ రోజేనా పది రూపాయలు తెస్తే అన్నం తినవచ్చు’ అని ఆశగా చూసింది రిక్షా వెంకన్న వైపు, పుల్లమ్మ.


“ఆటోలు కార్లు వచ్చిన ఈరోజుల్లో మన రిక్షా ఎవ్వడు ఎక్కటం లేదు, ఈ రోజు పస్తే” అంటూ గ్లాస్ తీసుకుని నీళ్ల కుండ వైపు నడిచాడు వెంకన్న.


“వుండు, గుడి పూజారి గారి భార్య ని అడిగి ప్రసాదం తెస్తాను. తిని పడుకో” అంటూ వడివడిగా వెళ్ళింది.


హైదరాబాద్ లో విమానం దిగిన శ్రీధర్ కి తన మాతృభూమి స్పర్శ తో కళ్ళలో నీళ్లు తిరిగాయి. యిరవై గంటల ప్రయాణంతో ఒళ్ళు నొప్పులుగా అనిపించి ఈ రోజుకి హైదరాబాద్ లోనే ఉండిపోయి రేపు రాత్రి బయలుదేరి తన గ్రామం వెళ్ళాలి అని వున్నా, తను వచ్చిన పని త్వరగా పూర్తిచేసుకుని మళ్ళీ త్వరగా అమెరికా వెళ్ళిపోవటం మంచిది అనుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కి వెళ్లి తన ఊరు మీదగా వెళ్లే రైలు ఎక్కాడు.


తెల్లవారి ఆరుగంటలకు బేతవోలు స్టేషన్లో ఆగింది ట్రైన్. చిన్న స్టేషన్ అవడంతో ట్రైన్ యిక్కడ ఎక్కువ సేపు ఆగదు. బ్యాగ్ తీసుకుని కిందకు దిగి చుట్టూ చూసాడు. చిన్నప్పుడు స్టేషన్ ఎలావుందో అలాగే వుంది. మెల్లగా బయటకు రాగానే ఆటోవాళ్ళు చుట్టూముట్టి ‘ఎక్కడకి సార్, రండి తీసుకుని వెళ్తాము’ అంటూ చేతిలోని బ్యాగ్ ని లాకుంటున్నారు.


‘వుండండి, నాకు ఒక్క ఆటో చాలు’, అంటూ కొద్ది దూరం లో వున్న రిక్షాని చూడగానే ఒక్కసారిగా తన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి శ్రీధర్ కి. తన స్కూల్ చదువు మొత్తం రిక్షా లోనే వెళ్లి వచ్చేవాడు. ఇన్నాళ్ళు పెద్ద పెద్ద కారులో తిరిగిన తనకి యిప్పుడు యింకోసారి రిక్షా ఎక్కాలి అనిపించి, ఆటో వాళ్ళను తప్పించుకుని రిక్షా వైపుకి నడిచాడు.


తనవైపు కి వస్తున్న అతనికోసం రిక్షాని ముందుకి తీసుకుని వచ్చాడు వెంకన్న ఇతనైనా రిక్షా ఎక్కుతాడేమో అని. రిక్షా మువ్వల చప్పుడు విన్న శ్రీధర్ కి ‘అరే, ఈ రిక్షా నేను చిన్నప్పుడు ఎక్కిన రిక్షాలా వుందే’ అనుకుంటూ, ‘ఊరిలోకి తీసుకుని వెళ్ళాలి, వస్తావా’ అన్నాడు వెంకన్నని.


“అందుకేగా బాబూ ఉదయం నుంచి యిక్కడ వుంది, కూర్చోండి” అంటూ రిక్షాని గట్టిగా పట్టుకున్నాడు.


“ఎవరింటికి బాబూ?” అన్నాడు మెల్లగా రిక్షా తొక్కుతో. 


“సర్పంచ్ గారింటికి, అది సరే గాని యిరవై సంవత్సరాల క్రితం ఈ వూరి పిల్లలని బడికి తీసుకుని వెళ్ళేవాడు ఒక రిక్షా అతను, అతను యిప్పుడు వున్నాడా, అతని పేరు వెంకన్న, నన్ను కూడా తన రిక్షాలో స్కూల్ కి తీసుకుని వెళ్ళేవాడు” అన్నాడు శ్రీధర్ మెల్లగా లేచి రిక్షా సీట్ మీద కూర్చుంటో.


అప్పటివరకు రిక్షాలాగుతున్న వెంకన్న వెనుకకి తిరిగి తన సీట్ మీద కూర్చుని వున్న పట్నంబాబు ని చూసి ఒక్కక్షణం తెల్లబోయి, రిక్షా ఆపి, “నువ్వు.. మీరు కారణం గారి చంటబ్బాయా?” అన్నాడు.


“అవును, నువ్వు హీరో వెంకన్నవా?” అన్నాడు రిక్షా దిగి వెంకన్న చేతులు పట్టుకుని. 

“అవును బాబు! ఆ వెంకన్ననే, యిన్ని సంవత్సరాల తరువాత యిప్పుడు నిన్ను చూడటం నిజంగా నమ్మలేకపోతున్నా చంటిబాబు” అన్నాడు ముడతలుపడ్డ మొహం మీద ఆనందం తో.


“అవును. కాలేజీ చదువులు అవగానే విదేశాల్లో చదవటానికి వెళ్లిపోయాను, తరువాత నాన్నగారు పోవడం తో యిహ ఈ వూరితో పనిలేకుండా పోయింది. సరే.. ముందు చెరువు దగ్గర వున్న నీ యింటి వైపు నుంచి తీసుకుని వెళ్ళు  బాబాయ్! మీ పిల్లలు ఏంచేస్తున్నారు, యింత ముసలితనం లో కూడా నువ్వు రిక్షా తొక్కడం ఎందుకు?” అన్నాడు శ్రీధర్.


ఒక్కసారి ఆగి ఓపిరి గట్టిగా తీసుకుని, “నా పిల్లలందరూ ఇంగ్లీష్ దేశం లో వున్నారు” అన్నాడు నవ్వుతూ.


“అయితే యింకా ఈ రిక్షా తొక్కడం ఏమిటి?” అన్నాడు శ్రీధర్. 


“మీరే నా పిల్లలు బాబు, మిమ్మల్ని స్కూలుకి తీసుకుని వెళ్ళటం, రావడం.. అంతే. నాకు ఆదేముడు మిమ్మల్నే పిల్లలుగా చూసుకుని సంతోషించమన్నాడు, కానీ ఒక రోజు మీరందరూ పెద్ద చదువులకి వెళ్ళిపోతారని, మళ్ళీ నేను- నా రిక్షా మిగిలిపోతామని అనుకోలేదు” అన్నాడు.


రిక్షా లాగుతూవుంటే శ్రీధర్ దిగి తోస్తున్నాడు. 


“కూర్చో బాబు! ఎంతసేపు అలా నడుస్తావు, నేను తొక్కగలను లే” అంటూ శ్రీధర్ ని బలవంతంగా రిక్షాలో కూర్చోపెట్టి తను రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు వెంకన్న.


“అదిగో ఆ గుడిసే మాది” అంటూ దానిముందు నుంచి వెళ్తోవుండగా, మువ్వల చప్పుడు విని గుడిసె లోనుండి వెంకన్న భార్య బయటికి వచ్చి మొగుడి రిక్షా లో మనిషి ని చూసి, ‘అమ్మయ్య.. ఈ రోజు నాలుగు మెతుకులు వండుకోవచ్చు’ అనుకుని భర్తకి సైగ చేసింది త్వరగా రమ్మని.


“ఏమిటి అంటోంది మీ ఆవిడ?” అన్నాడు శ్రీధర్. 


“పిచ్చిది బాబు, నాలుగు రోజులనుంచి గిరాకి లేదు, పస్తులు వుంటున్నాము, ఈ రోజు గిరాకి దొరికింది అని త్వరగా రమ్మంటోంది” అన్నాడు. 


ఆమాటతో వెంకన్న పరిస్థితి అర్థమైంది శ్రీధర్ కి. 


“దిగండి బాబు, సర్పంచ్ గారి యిల్లు యిదే” అన్నాడు.


ఒక మాదిరి పెద్ద బిల్డింగ్. రిక్షా చప్పుడు విని లోపలనుంచి సర్పంచ్ రమణ బయటకు వచ్చి, “శ్రీధర్ గారా, రండి” అంటూ లోపలికి రమ్మన్నాడు. 


శ్రీధర్ పర్స్ నుంచి అయిదు వందల నోట్ తీసి వెంకన్న చేతిలోపెట్టి, “సాయంత్రం ఒకసారి వస్తే ఊరంతా తిరుగుదాం” అన్నాడు. 


“యింత డబ్బు వద్దు బాబు, ఒక యాభై రూపాయలు ఇవ్వండి. బియ్యం కొనుక్కుంటాం” అన్నాడు వెంకన్న. 


“ఈ డబ్బు నేను ఈ ఊరిలో వున్నన్ని రోజులు నన్ను తిప్పడానికి.. వుంచు” అని లోపలకి వెళ్ళిపోయాడు సర్పంచ్ గారితో.


“కోర్ట్ యిన్ని సంవత్సరాలకి పొలం మీదే అని, పొలం ఆక్రమించిన అతను అయిదు లక్షల రూపాయలతో మీ పొలం మీకు ఇమ్మని జడ్జిమెంట్ యిచ్చింది. యిరవై ఎకరాల పొలం మీరు యిక్కడ లేరు కదా అని నాయుడు ఆక్రమించేసాడు, మొత్తానికి మీ పొలం మీకు దక్కింది” అన్నాడు సర్పంచ్ రమణ.


“అంతా మీ సహాయం వల్లనే యిది జరిగింది, మీకు కృతజ్ఞతలు” అన్నాడు శ్రీధర్.


“మీరు ఆ గదిలో సామాను పెట్టుకుని స్నానం చెయ్యండి, ఏసీ కూడా వుంది. పూజారి గారి ఇంటినుంచి మీకు భోజనం వస్తుంది” అన్నాడు రమణ.


సాయంత్రం సర్పంచ్ గారి కారులో వెంకన్నని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పొలం అప్పగించటానికి నాయడుగారు రెడీగా వున్నాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, అది పొలం కాదు పెద్ద తోట. కొబ్బరి, మామిడి, మొదలగు చెట్లు కొంత భాగం, కొంత భాగం పచ్చటి పైరుతో నిండి వుంది.


“పంతులుగారి తాలూకా ఎవ్వరు లేకపోవడం తో నేను ఈ పొలాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. అయితే ఈ పొలం వలన నేను కూడా కొంత ఆస్తి సంపాదించుకున్నాను, అది ఒక్కటే తృప్తి, యిదిగో ఈ కుర్రాడు యిక్కడ కాపలా వుంటున్నాడు. అతను నమ్మకస్తుడు, మీరు ఉండమంటే వుంటాడు” అన్నాడు నాయుడు ఒక బరువైన కవర్ చేతికి యిస్తో.


“ఇదేమిటి?” అన్నాడు శ్రీధర్, 


“కోర్ట్ వారు యిన్నిరోజులు మీ పొలం నేను వుంచుకున్నందులకు అయిదు లక్షలు పెనాల్టీ మీకు ఇవ్వమన్నారు” అన్నాడు నాయుడు.


“బలేవారే, మీరు ఏ ఉద్దేశ్యం తో పొలం తీసుకున్నా చాలా అందంగా తీర్చిదిద్దారు. నేను కూడా యింత బాగా మైంటైన్ చెయ్యలేను. ఈ డబ్బు అక్కర్లేదు” అంటూ కవర్ తిరిగి నాయుడు చేతిలోపెట్టేసాడు శ్రీధర్. 


నాయుడు అక్కడ నుంచి వెళ్ళగానే పొలం అంతా తిరిగి చూసారు. లోపల రెస్ట్ తీసుకోవడానికి రెండు గదుల బిల్డింగ్, అక్కడకి కొద్ది దూరంలో వాచ్మాన్ కి ఒక షెడ్డు కూడా వున్నాయి.


“మీరు వుండేది అమెరికాలో, మరి ఈ పొలాన్ని ఎలా చూసుకోగలరు, అమ్మేసుకుంటారా?” అని ఆడిగాడు సర్పంచ్ గారు శ్రీధర్ ని.


“అదే ఆలోచిస్తున్నాను, ముందు రేపు రిజిస్ట్రార్ ఆఫీసులో పొలం మా నాన్నగారి పేరు మీదనుంచి నా పేరున మారిన తరువాత ఆలోచన చెయ్యాలి” అన్నాడు. ఆ రాత్రి అంతా అదే ఆలోచన, శ్రీధర్ ఒకసారి అమెరికా ఫోన్ చేసి భార్య తో, కొడుకు తో మాట్లాడి పడుకున్నాడు.


సర్పంచ్ గారు ముందే మాట్లాడి వుండటం తో, రిజిస్టర్ ఆఫీస్ లో పని త్వరగానే అయ్యింది.


డాక్యుమెంట్ వచ్చే లోగా శ్రీధర్ కిందకి వెళ్లి డాక్యుమెంట్ రైటర్ తో యింకో డాక్యుమెంట్ రాయించాడు.


వెంకన్న, వెంకన్న భార్య యిద్దరూ పొలంలో ఉండి దాని మీద వచ్చే ఆదాయం వారి జీవితాంతం వరకు అనుభవించే హక్కు, శివాలయం పూజారి గారికి ప్రతీ సంవత్సరాo పది బస్తాలా ధన్యం యిచ్చే విధంగాను, వెంకన్న, అతని భార్య తదానంతరం మొత్తం పొలం శివాలయం కి చెందే విధంగా వీలునామా రాసి రిజిస్టర్ చేయించాడు.


వీలునామా చదివి సర్పంచ్ రమణ, “దీనికోసమా యిన్ని సంవత్సరాలనుండి కోర్టులో తిరిగింది” అన్నాడు.


“చూడండి రమణ గారు, ఈ ఊరు వచ్చే అప్పుడు పొలం అమ్ముకుని వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ చిన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్ళను అని మారం చేసినప్పుడు, నన్ను బలవంతంగా రిక్షాలో తీసుకుని వెళ్లిన వెంకన్న తిండిలేక పస్తులు వుంటున్నాడని తెలుసుకున్నాను. ప్రతీ ఆదివారం శివాలయం లో ఆడుకుని ప్రసాదం తిని ఇంటికి రావడం నాకు బాగా గుర్తు.


యిప్పుడు ఈ పొలం అమ్ముకుని డబ్బుతీసుకుని వెళ్ళలిసినంత అవసరం లేదు. అందుకే ఈ వీలునామా. ఈ వీలునామాలో రాసినవి సక్రమంగా జరిగేటట్లుగా చూసే బాధ్యత మీ మీద పెడుతూ వీలునామా రాసాను” అన్నాడు.


విషయం తెలుసుకున్న వెంకన్న శ్రీధర్ కాళ్ళ మీద పడబోతోవుంటే ఆపి, “తప్పు బాబాయ్, యిహ నీ మకాం తోటకు మార్చు. ఆ తోటకి నువ్వే యజమానివి. నువ్వు తిని, నీ లాంటి బీధవాళ్ళకి సహాయం చేసి జీవితం ధన్యం చేసుకో” అన్నాడు వెంకన్నని కౌగిలించుకుని.


శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
54 views0 comments

Yorumlar


bottom of page