top of page

నగరంలో వంటావిడ


'Nagaramlo Vantavida' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

'నగరంలో వంటావిడ' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“నాన్నా! దేశాంతరాలు వెళ్ళిపోతారు కానీ నా దగ్గరికి రమ్మంటే బద్ధకం మీకు. మాకు కూడా మీతో గడపాలని ఉండదా, అమ్మని అడిగితే ‘నన్ను అడిగి లాభం ఏముంది ఆ మొండి మనిషి ని అడుగు’ అంటుంది.. మీరు మాత్రం హైదరాబాద్ పట్టుకుని వుంటారు. అక్కడైనా, నా దగ్గరైనా మీరు చేసే పని ఏముంటుంది.. గంటల తరబడి యూట్యూబ్ చూడటం, ఫోన్లో మాట్లాడుకోవడం” అన్నాడు తండ్రి శ్రీకాంత్ తో కొడుకు వినయ్.


“నాకు రాకూడదు అనికాదు రా, ప్రయాణాలు చెయ్యలేకపోతున్నాను అంతే. మీ మొగుడు పెళ్ళాలు యిద్దరు జాబ్ కి వెళ్ళిపోతారు, మనవడు స్కూలుకి. అమ్మకి వంటా, నాకు ఫోన్, పెద్ద మార్పు ఏమి వుంటుంది?” అన్నాడు కొడుకు తో శ్రీకాంత్.


“అదేమిటి డాడీ, వంట కి వంటమనిషి వుంది అని చెప్పానుగా, అప్పుడే మర్చిపోయారా” అన్నాడు కొడుకు వినయ్.


“వంటమనిషి వుంటే మంచిదే, అమ్మకూడా యిక్కడ నాకు వంట చేసి బాగా అలిసిపోయింది, అక్కడ కి వస్తే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది లే. నాకు కూడా కాళ్ళు నొప్పి, అక్కడకి వస్తే మనవడు, నువ్వు కొద్దిగా కాళ్ళమీద కూర్చుంటారు, హాయిగా వుంటుంది, వచ్చే వారం కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి, ట్రైన్ లో అంతసేపు కూర్చోలేను” అన్నాడు శ్రీకాంత్.


“అవును.. వంటమనిషి మనవాళ్లేనా, ముంబయిలో మన వాళ్ళు దొరుకుతారా?” అని ఆడిగాడు కొడుకుని.



“ఆ.. మనవాళ్లే! జానకమ్మ పేరు, అయితే మరాఠి తప్పా ఏమి రాదు, యిప్పుడే కొద్దిగా హింది నేర్చుకుంటోంది” అన్నాడు వినయ్.


“వంటకి బాష తో పని ఏముంది, మీ అమ్మ వచ్చి ఆవిడకి అన్ని వంటలు నేర్పుతుందిలే” అన్నాడు.


అమ్మయ్య, మొత్తానికి రావడానికి ఒప్పుకున్నారు నాన్న, వచ్చిన తరువాత తను పంపితే గాని వెళ్లారు మనవడిని వదిలి అనుకున్నాడు వినయ్.


ఉదయం ఫ్లైట్ లో బయలుదేరి ముంబై చేరుకున్నారు అదిదంపతులు. ఎయిర్పోర్ట్ కి కొడుకు వినయ్ వచ్చి తల్లిదండ్రులని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. పేరు కి ముంబై కానీ ఎన్ని పెద్ద బిల్డింగ్స్ వున్నాయో వాటికి మించి గుడిసెలు వున్నాయి. విపరీతంగా ట్రాఫిక్.


ఉదయం టిఫిన్ తినకుండా బయలుదేరటం తో 12 గంటలకే శ్రీకాంత్ కి నీరసంగా అనిపించింది. “అమ్మాయి.. నాకు అన్నం పెట్టేసేయ్, షుగర్ పడేడట్లు వుంది” అన్నాడు కోడలితో.


కంచంలో టొమోటో పప్పు, బెండకాయ వేపుడు వడ్డించింది కోడలు. నోట్లో పెట్టుకుని “బాగానే వండింది వంటావిడ” అన్నాడు శ్రీకాంత్.


అన్నం తిని, సోఫాలో కూర్చుని టాబ్లెట్స్ వేసుకుంటో, “ఏమో అనుకున్నాను కానీ, జానకమ్మ గారు బాగానే వండింది” అన్నాడు చదువుకుంటున్న మనవడితో


“జానకమ్మ ఎవ్వరు తాత, ఎప్పుడు పేర్లు తప్పే చెప్తావు, ఆవిడ పేరు మంగమ్మ, మన పనిమనిషి” అన్నాడు. మనవడి మాటకి శ్రీకాంత్ గుండెల్లో రాయి పడింది.


సాయంత్రం కొడుకు రాగానే ఆడిగాడు, “నిత్యం త్రికాల సంధ్యవంధానం చేసే నాకు పనిమనిషి ని తీసుకుని వచ్చి జానకమ్మ అని చెప్పి ఆ వంట తినిపిస్తావా, యింత ఘాతకం కి ఒడికట్టావ్ ఎందుకు” అన్నాడు.


“డాడీ హైదరాబాద్ లో మీరు తిన్న హోటల్ లో వంటవాడు అవధాని గాని, శాస్త్రి గాని అనుకుంటున్నారా, అక్కడ తినగా లేనిది, యిప్పుడు మంగమ్మ అనగానే యిబ్బంది కలిగింది. చూడండి డాడీ ఈ నగరం లో మనిషి దొరకడమే కష్టం, సద్దుకోవాలి” అన్నాడు నవ్వుతు.


“రేపటి నుంచి ఆవిడ చేసిన వంట నేను తినను, నాకు అమ్మ వండుతుంది సెపరేట్ గా” అనేసి వేరే రూంలోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.


‘నాన్నకి నిజంగానే కోపం వచ్చింది అనుకుంట’ అనుకుంటూ, “అసలు ఆవిడ విషయం నాన్నకి ఎవ్వరు చెప్పారు?” అన్నాడు భార్య తో.


“యింకెవ్వరు.. మన నారదుడు మీ అబ్బాయి వున్నాడు గా..” అంది.


మర్నాడు మంగమ్మ వచ్చి యిల్లు, అంట్లు తోమేసి, రాజమ్మ గా మారిపోయి చేతులు శుభ్రం గా కడుక్కుని వంట మొదలుపెట్టింది.


శ్రీకాంత్ భార్య ని పిలిచి “నేను ఆ వంట తినను, నువ్వు నాకు సెపరేట్ గా అన్నం కూర పప్పు వండు, కొద్దిగా ఆలస్యం అయినా పరవాలేదు” అన్నాడు.


“మీ చాదస్తం తో నా ప్రాణం మీదకి వచ్చింది, వంటావిడ చేసిన వంట వదిలేసి, మళ్ళీ నేను వండుతాను అంటే కోడలు ఏమనుకుంటుంది ఆండి, వడ్డన నేను చేస్తాను, కొద్దిగా యిక్కడ వున్ననాళ్ళు గొడవ పెట్టకండి, వచ్చే నెల వెళ్ళిపోదాం” అంది శ్రీకాంత్ భార్య.


“అయితే నేను శబరి లా పళ్లు తిని బతుకుతాను, అంతే తప్పా ఆ వంట నేను తినను” అన్నాడు. దానితో వంటావిడ వంట అయిన తరువాత, శ్రీకాంత్ కి వండి పెట్టడం చేస్తోంది.


నాలుగు రోజులు గడిచిన తరువాత ఈ విషయం వంటావిడ కి తెలిసిపోయింది. “అమ్మా! నేను వండిన వంట సార్ కి నచ్చడం లేదని, మళ్ళీ సెపరేట్ గా సార్ కి వండుతున్నారు, యింతోటీ దానికి నేను ఎందుకు, రేపటి నుంచి నేను రాను, మీరే వండుకోండి” అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది.


“చెడకోట్టేదాకా మీకు నిద్ర పట్టలేదు కదా డాడీ, యిప్పుడు పర్వాలేదు, అమ్మ చేస్తోంది. రేపు మీరు వెళ్ళిపోతే మా గతి ఏమిటి, ఈ ముంబైలో ఉదయం 7 గంటలకు బయలుదేరితే కాని ఆఫీస్ టైమ్ కి చేరం. ఇహ మీ మకాం యిక్కడే, మనవడిని చూసుకుంటో వుండిపోండి” అన్నాడు వినయ్.


“నేను ఎప్పుడు యిక్కడికి వచ్చి వుండిపోవాలో నాకు తెలుసు, ఉదయమే లేచి పిల్లాడికి నాలుగు మెతుకులు వండుకోండి, నేను యిక్కడ వుండిపోతే అక్కడ రైతు మనపోలం కాస్తా లాగేస్తాడు. ఓపిక తగ్గినప్పుడు అన్నీ అమ్మేసి నీ దగ్గరికి ఎల్లాగో రాకతప్పదు, యిప్పుడు మమ్మల్ని వెళ్ళని, కావాలంటే ఆ మంగమ్మ నీ పిలిచి వండించుకోండి మేము వెళ్లిపోయామని చెప్పి” అన్నాడు శ్రీకాంత్. అనుకున్న ప్లాన్ ప్రకారం మొగుడు పెళ్ళాం హైదరాబాద్ వెళ్లిపోయారు.


పదిరోజులు కొడుకు ఫోన్ కూడా చేయ్యలేదు, తండ్రి తన మాట వినలేదు అని.


శ్రీకాంత్ ఫోన్ చేస్తే మనవడు ఫోన్ తీసి, “నాన్న జిమ్ కి వెళ్ళాడు, నీకో సంగతి చెప్పానా, కొత్త వంటమనిషి వచ్చింది, హింది తప్పా ఏమి రాదు. నువ్వు బాగా హింది నేర్చుకో” అన్నాడు. మనవాళ్లేనా అని అడగబోయి, పిల్లాడిని ఎందుకు అడగటం అని వూరుకున్నాడు.



వారం రోజుల తరువాత వినయ్ తండ్రి కి ఫోన్ చేసి “నాన్న.. మీరు అమ్మా వెంటనే బయలుదేరి ముంబై రావాలి, యిప్పుడు కొత్తగా పెట్టుకున్న వంటమనిషి ఏది వండిన బిర్యానీ వాసన వస్తోంది, అదికాక పప్పులు అవి తెలియకుండా తీసుకుని వెళ్లిపోతోంది” అన్నాడు


“దానికోసం యిప్పుడు నేను రావడం ఎందుకు రా, మానిపించేయండి” అన్నాడు.


“అంత సులువు కాదు డాడీ, ఒక సంవత్సరం అగ్రిమెంట్ రాసాము, మధ్యలో మానిపించితే సంవత్సరం జీతం అంటే లక్ష రూపాయలు యిచ్చుకోవాలి. మీరైతే ఎటువంటి వారినైనా విసుగు తెప్పించి చెడకొట్టి వాళ్లంత వాళ్ళు వెళ్లిపోయేడట్లు చెయ్యగలరు” అన్నాడు.


“అంటే నీ ఉద్దేశ్యం నేను అందుకే పనికి వస్తాను అన, సరే రెండు మూడు రోజులలో అప్పడాలు ఎండిపోతాయి, అవి పట్టుకొని వస్తాము, పర్సు బీరువాలో పెట్టుకో, బయట పెట్టకు” అని హెచ్చిరించాడు శ్రీకాంత్.


నాలుగు రోజుల తరువాత సామాను సద్దుకుని ముంబై చేరుకున్నారు. పెట్టి తనకి యిచ్చిన రూంలో పెట్టుకుని వంటగది గుమ్మం లో నుంచుని, “ఈ రోజు వంట ఏమిటి?” అన్నాడు.


“హింది మే భోలో” అంది ఆ వంటావిడ.


“ఆజ్ ఏమి వండుతున్నారు హై” అన్నాడు.


శ్రీకాంత్ హింది అర్ధం కాక, “మేడం ఇదర్ ఆవో, సాబ్ క్యా పూచ్ రే” ఆంది మా కోడలు తో.


“కద్దు దాల్, నారియాల్ చట్నీ” అంది వంటావిడ.


“మై నై తింటా, వంకాయ మెంతికారం హై, మామిడి పప్పు హై, ఓ అచ్చా రైతా” అన్నాడు తనకి వచ్చిన హిందీలో శ్రీకాంత్.


“ఓ సబ్ నై అత, జాకె బాహర్ బైటో” అంది వంటావిడా మొహమాటం లేకుండా.


“దేఖో నాకు పసంద్ వాలా చెయ్యాలి హై, మేరా మాట సునో అంతే” అన్నాడు.


ఇంతలో శ్రీకాంత్ భార్య వచ్చి, “మీరు ఎందుకు వంటవాళ్ళ తో మాటలు, నాకు చెప్పండి, నేను ఆవిడకి నేర్పుతాను” అంది.


“నీకు హిందీలో అయిదు మార్కులు, నాకు ఏడు మార్కులు, నీ కంటే నేనే హిందీలో ఆవిడకి చెప్పగలను” అంటూ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడు శ్రీకాంత్.


తండ్రి రంగంలోకి దిగినందుకు వినయ్ కి సంతోషం కలిగింది.


రెండో రోజు వంటావిడ రాగానే, “వినండి, ఈ దిన్ పాటోలీ, గోంగూర చుట్నీ బనాన హై” అన్నాడు.


“ఓ సబ్ నై ఆత, పాలక్ టొమోటో దాల్ బనాత” అంది శ్రీకాంత్ ని పట్టించుకోకుండా.


“ఓ అమ్మా! పాలక్ టొమోటో దాల్ కిడ్నీ కరాబ్ చేస్తుంది హై, నాకో” అన్నాడు.


“నాకో కాదు నకో అనాలి, నువ్వు హిందీలో ఎందుకు తాత మాట్లాడుతావు, అమ్మకి చెప్పు, అమ్మ వంటామికి చెప్పుతుంది” అన్నాడు మనవడు.


“ఏమో రా.. నా హింది ఆవిడ వంట ఒకేలా వున్నాయి, రెండు రోజులనుండి నోరు చచ్చిపోయింది” అన్నాడు.

“అదేమిటి నిన్న సాయంత్రం వడా సాంబార్ తిన్నావుగా” అన్నాడు మనవడు.


“అవి టిఫిన్, అన్నం దారి అన్నం దే” అన్నాడు.


అలా నాలుగురోజులు గడిచాయి. ఉదయమే వంటావిడ వచ్చి “సాబ్ వాకింగ్ కు జాతా నై” ఆంది మా కొడలితో.


“సాబ్ అప్ కు కుకింగ్ సీకాతం బోల్ రే” ఆంది నవ్వుతు.


“అరే బాప్ మరగయా, కేటరింగ్ వాలా కు యితన కుకింగ్ నై ఆత, మేరేసే నై హోత కామ్ కర్నా. ఇనూ కబ్ జాతా” అంది వంటావిడ.


“ఇదర్ రైనేకు ఆయా, నై జాత” ఆంది కోడలు.


శ్రీకాంత్ వీళ్ళ మాటలు విని “ఈ రోజు క్యా వండుతారు హై” అన్నాడు.


దానితో ఆవిడకి ఒళ్ళుమండినట్టు వుంది, “హమ్ నౌకరి చోడ్ దీయా, అప్ కు క్యా హోనా అమ్మా సే బనాదేవ్” అంటూ వంటగదిలోనుంచి బయటకి వచ్చి మా అబ్బాయి తో “హమ్ యిదర్ కామ్ నై కరసక్త” అంది.


“అదేమిటి? వన్ ఇయర్ అగ్రిమెంట్ వుందిగా” అన్నాడు వినయ్..


“మాప్ కరో సాబ్! అప్కా పితాజీ మేరా సిర్ కాజారే, క్షమా కర్కే మేరేకు చోడ్ దేవ్” అని వెళ్ళిపోయింది.


“అమ్మయ్య! డాడీ సాధించారు, మొత్తానికి వదిలిపోయింది. మీ హింది మాట్లాడటం మరి యింత దరిద్రం గా వుందేమిటి డాడీ” అన్నాడు వినయ్.


“చుప్ బైట్, హింది మేరా సెకండ్ లాంగ్వేజ్” అన్నాడు శ్రీకాంత్ వంటగది వైపు చూస్తో.


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













71 views2 comments

2 Comments


divakarlapadmavati
Aug 13, 2023

Bagundi, manchi comedigaa undi.

Like

@himabindusworld1383 • 4 hours ago

వర్తమాన జీవిత ప్రతిబింబం

Like
bottom of page