top of page

నాకో గది కావాలి


'Nako Gadi Kavali' New Telugu Story


Written By Sripathi Lalitha(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“అమ్మా, నువ్వు, నాన్న పొద్దున్న 10 గంటలకి రెడీ గా ఉండండి. మీకు ఓ సర్ప్రైజ్." అని ప్రదీప్ ఉదయం చెప్పినప్పటి నుంచి వైదేహి, జానకిరామ్ లకి ఒకటే ఆత్రం, ఏమిటి ఆ సర్ప్రైజ్ అని.


"అమ్మా! వంట పని పెట్టుకోకు. బయట తినేద్దాము." ప్రదీప్ చెప్పాడని త్వరగా తయారు అయ్యారు.


"అత్తయ్యా, మామయ్యా రెడీయేనా? ఆద్య ఏది? మనం ఇంకో అరగంటలో బయటికి వెళదాము. భోజనం బయటే." హుషారు గా చెప్పింది స్వాతి.


"ఏమిటమ్మా హడావిడి. ఏమిట్రా ఆ సర్ప్రైజ్" ఉండబట్టలేక అడిగాడు జానకిరామ్.

"అదేమరి. ముందే చెప్పేస్తారు." నవ్వేసాడు ప్రదీప్.


జానకిరామ్, వైదేహి ల కొడుకు ప్రదీప్, కూతురు ప్రభ. పెళ్లయి పిల్లలు ఉన్నారు. ప్రభ వాళ్ళకి స్వంత ఫ్లాట్, 3 బెడ్ రూంలది ఉంది. ప్రభ ఆమె భర్త ఇద్దరు ఉద్యోగస్తులు.

అత్తగారు, మామగారు వీళ్లతోనే ఉంటారు.


జానకిరామ్ ప్రభుత్వ ఉద్యోగి గా పనిచేసి రిటైర్ అయ్యాడు.

వైదేహి గృహిణి. డిగ్రీ చేసినా కొన్ని కారణాల వల్ల ఉద్యోగం చెయలేదు. ప్రదీప్, స్వాతి, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు. వాళ్ళ పాప ఆద్యకి 2 ఏళ్ళు.


జానకి రామ్ రిటైర్ అయ్యాక, కొడుకు దగ్గరికి వచ్చేసారు.

జానకి రామ్ కి ఎక్కడా స్వంత ఇల్లు లేదు. ‘ఎక్కడ ఉంటే ఏమిటి.. పెన్షన్ వస్తుంది. ఎలానో ప్రదీప్ కి, స్వాతి కి, ఆద్య కోసం సాయం కావాలి’ అని వీళ్లతోనే ఉంటున్నారు.


ప్రదీప్ 2 బెడ్ రూంల ఫ్లాట్ లో అద్దెకి ఉంటున్నాడు,

ఒక బెడ్ రూమ్ వైదేహి వాళ్ళకి. ఇంకో బెడ్ రూమ్ ప్రదీప్ వాళ్లకి.


ఆద్య ఇంకా చిన్నది అమ్మ నాన్న తోనో, తాతా, బామ్మా తోనో పడుకుంటుంది. చిన్న హాల్, చిన్న వంటిల్లు, హాల్లోనే సోఫాలు, టీవీ, డైనింగ్ టేబుల్, పూజ రూమ్ లేదు.


అంతా అందులోనే ఇరుకుగ ఉన్నా అలానే సర్దుకు పోతున్నారు. ఒకటి రెండు సార్లు జానకిరామ్ అన్నాడు "లోన్ తీసుకోని ఫ్లాట్ తీసుకోవచ్చు కదా ప్రదీప్" అని.

"నాకు ఫ్లాట్ ఇష్టం లేదు నాన్న! చిన్నదైనా ఇల్లు ఆయితే బావుంటుంది." అన్నాడు ప్రదీప్.


ఈమధ్య ఇల్లు బాగా ఇరుకు అవుతోంది. ఎవరు వచ్చినా కూచోడం, పడుకోవడం ఇబ్బంది గా ఉంది.


‘ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటున్నారేమో’ అనుకుంటూ బయలుదేరారు. ఒక గంటా, గంటన్నర ప్రయాణం అయ్యాక ఊరికి కొంచెం దూరంగా ఒక చోట ఆపాడు కార్.


ఒక పెద్ద కాంపౌండ్ వాల్, పెద్ద గేట్, గేట్ తెరిస్తే లోపల అటు ఇటుగా ఒక వంద ఇళ్ల దాకా ఉంటాయి. అన్ని ఇళ్లు ఒకే రకంగా కింద, పైన ఉన్నాయి. ఇంకా పూర్తిగా అవలేదు. దానితో ప్రతి ఇంటి దగ్గర ఇటుకలు, సిమెంట్, సగం కట్టిన గోడలు కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి ప్రహరీ గోడ సగం కట్టి ఉంది.


ఒక దగ్గర కార్ ఆపాడు. "ఇంకా పని అవుతోంది జాగ్రత్తగా రండి" అంటూ లోపలికి తీసుకెళ్లాడు.


ముందు ఒక చిన్న రూమ్, లోపల పెద్ద హాల్, చిన్న పూజ రూమ్, కొద్దిగా పెద్ద వంటిల్లు. అందులోనే ఫ్రిడ్జ్ కి స్థలం, బయట గిన్నెలు కడగడానికి, వాషింగ్ మెషిన్ పెట్టడానికి ఒక చిన్న గది, కింద ఒక బెడ్ రూమ్, పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో 3 బెడ్ రూంలు, హాల్, రెండో అంతస్తులో హోమ్ థియేటర్, జిమ్ కోసం ఒక రూమ్ మిగిలిన స్థలం ఖాళీగా ఉంది.


"అమ్మా! కింద ఉన్న బెడ్ రూమ్ మీకోసం, పైన రూంలో ఒకటి గెస్ట్ రూమ్, ఒకటి మాది. ఒకటి ఆద్య కొంచెం పెద్ద అయితే ఉంటుంది" అంటూ పైదాకా తీసుకెళ్లాడు.


పైన నువ్వు టెర్రస్ గార్డెన్ లాగా చెయ్యచ్చు. కాంపౌండ్ వాల్ కట్టాక లోపల కూడా స్థలం ఉంది. మొక్కలు పెట్టచ్చు. నీకు మొక్కలు ఇష్టం కదా" అన్నాడు ప్రదీప్.


జానకిరామ్, వైదేహి సంతోషం నుంచి తేరుకొని "ఎన్ని గజాలు స్థలం దీపు, నువ్వు తీసుకున్నావా ? చాలాబావుంది. ఎంత అవుతుంది?" అడిగితే


"200 గజాలు నాన్నా. ఇవన్నీ మా బ్యాంకు వాళ్ళవే. అందుకే మాకు తక్కువ లో వస్తుంది. మనం చేసే మార్పులు, పైన చేయించే పనులు అన్ని కలిపితే 75 లక్షల దాకా అవ్వచ్చు. మన చేతిది ఒక పదిహేను లక్షలు పడుతుంది.


వాళ్ళు ముందు అప్లికేషన్ పిలిచినప్పుడు మాకు లోన్ కి అవకాశం రాలేదు. ఇల్లు మా ఫ్రెండ్ కి ఇచ్చారు కానీ తను ఆస్ట్రేలియా కి వెళ్ళిపోతూ ఉద్యోగం మానేసాడు. ఇప్పుడు లోన్ మా పేరు మీద మార్పు చేసాడు. నిన్ననే అతను కట్టిన డబ్బు అతనికి వెళ్ళింది. మా బ్యాంకు వాళ్ళు అంతా అయ్యాక రిజిస్ట్రేషన్ చేస్తారు కనక అందరితో పాటు మనకి అవుతుంది.


బిల్డర్ ఏమైనా మార్పులు ఉంటే చెప్పమన్నాడు, నేను స్వాతి కొన్ని రాసాము. మీకు కూడా ఏదైనా మార్పులు చేయాలి అనిపిస్తే చెప్పండి. ఇది ప్లాన్ కాగితం" అందిస్తూ అన్నాడు ప్రదీప్.


జానకి రామ్ కి మంచి ఉత్సాహం వచ్చింది.

తనదేమిటి, కొడుకుదేమిటి, సొంత ఇల్లు.. పొంగిపోయాడు.


"వెరీ గుడ్ నాన్న" అని కొడుకు భుజం తట్టి" నేను కిందకి వెళ్లి మళ్ళీ అంతా పరీక్షగా చూస్తాను" అని జానకిరామ్ వెళుతూ,"నువ్వూ రావోయి" అని వెళ్ళాడు.


"వస్తున్నా" అని వైదేహి నెమ్మదిగా "దీపు! నీకు ఇబ్బంది లేకపోతే నీ జిమ్ రూమ్ పక్కన ఒక చిన్న రూమ్ కట్టిస్తావా, నా కోసం.. ఎలానో దానికి టాయిలెట్ ఉంటుంది కనుక ఒక రూమ్ చిన్నదైనా చాలు" అడిగింది.


"కింద పెద్ద రూమ్ మీదే కదమ్మా! నీకెందుకు వేరే రూమ్" తేలిగ్గా అనేశాడు ప్రదీప్.


వినగానే మొహం కొద్దిగా మ్లానమైంది వైదేహి కి. "సరే నాన్నా, నీకు ఇబ్బంది లేకపోతేనే అన్నాను అందుకే" అని కిందకి వెళ్ళింది.


స్వాతి గమనించింది వాడిపోయిన అత్తగారి మొహం.

"దీపు! ఎలాగో జిం రూమ్ కి ఇంకా రూఫ్ వెయ్యలేదు, జిం రూమ్ పక్కన స్థలం ఉంది. ఆ చోటు లో తేలికగా 10/15 రూమ్ వస్తుంది. అది అత్తయ్య కోసం పెడదాము. ఎప్పుడైనా మనం పైన పార్టీలా చేసుకున్నా రూమ్ ఉంటే నష్టం లేదు. తరవాత కట్టడం అవదు. పనిలోపని.. ఇప్పుడు అయితే నయం కదా! ఈ రోజు వరకు ఆవిడ నోరు తెరిచి ఏదీ అడగడం నేను చూడలేదు" అంది.


‘నీకు రూమ్ ఎందుకు?‘ అనగానే తల్లి మొహం ఎలా వాడిపోయిందో గుర్తొచ్చిన ప్రదీప్ బిల్డర్ కి ఫోన్ చేసి అడిగాడు.


"చేసేద్దాము సార్, ఏమీ ఇబ్బంది లేదు. మేము ఎలానో మొత్తం రూఫ్ వేస్తాము. ఆ స్థలం మీరు ఎలా వాడుకున్నా ఓకే" అని," జిమ్ కి, రూమ్ కి కామన్ టాయిలెట్ పెట్టేద్దాం" అన్నాడు.


"ఓకే, రేపు నేను మీ ఆఫీస్ కి వస్తాను, అన్ని విషయాలు మాట్లాడదాము" అని" డన్ స్వాతి.. అమ్మకి చెప్దాము పద" అని కిందికి వెళ్లారు.


కింద వైదేహి ఆద్య ని పట్టుకొని మెట్ల మీద కూర్చుంటే, జానకి రామ్ ఎక్కడ ఏమి పెట్టాలి, ఎక్కడ అల్మారాలు కావాలి.. అన్ని తెగ మాట్లాడేస్తున్నారు.


వాళ్ళ మొహాల్లో సంతోషం చూసి ప్రదీప్ కి చాలా ఆనందం వేసింది.


‘పాపం అమ్మ, నాన్నా వాళ్ళ బాధ్యతలతో ఇల్లు ఎక్కడా కొనుక్కో లేక పోయారు. ఇప్పుడు వాళ్ళు ఆ సంతోషం అనుభవిస్తారు’ అనుకుంటూ


"అమ్మా!" అంటూ దగ్గరికి వచ్చి వైదేహి ని పట్టుకొన్నాడు.

"ఇల్లు చాలా బావుందిరా దీపు" మెరుస్తున్న కళ్ళతో జానకిరామ్ అన్నాడు.


"మరి లిఫ్ట్ ఉంటుందా ?" అంటే, "ఉంది నాన్నా! బయటి నుంచి, లోపలి నుంచి కూడా వెళ్లేట్టు ఉంటుంది. ఆద్య కి దగ్గరలో స్కూల్ కూడా ఉంది. బస్సు వస్తుంది. మాకు ఇక్కడ దగ్గరలో ఐదారు బ్రాంచెస్ ఉన్నాయి" అన్నాడు ప్రదీప్.


అన్ని వీలులు ఉన్నాయి. క్లబ్ హౌస్, షాప్, మెడికల్ షాప్ అలా అన్ని సదుపాయాలు ఉంటాయి. ఒకవేళ మాకు ట్రాన్స్ఫర్ అయినా, మీరు ఇక్కడే ఉన్నా ఇబ్బంది ఉండదు. మా కొలీగ్స్ అందరూ ఉంటారు. అందుకే ఇక్కడ తీసుకొన్నాను" అన్నాడు ప్రదీప్.


తరువాత తల్లి వంక చూస్తూ "అమ్మా! ఇప్పుడు నిజంగా నీకు ఓ బహుమతి" అన్నాడు.


"ఇంకా ఏమిటి దీపు" ప్రేమగా అడిగింది.


"నీకు పైన రూమ్ వస్తుంది" అని ప్రదీప్ అనగానే వైదేహి మొహం వెలిగిపోయింది.


"నిజామా! నిజంగా నాకు వేరే రూమ్ వేసి ఇస్తావా ?" సంతోషం గా అంటున్న వైదేహి తో" నీకు వేరే గది ఎందుకు? కింద మనకి ఇంత పెద్ద రూమ్ ఉంది కదా" అన్నాడు జానకిరామ్.


అతని మాట పట్టించుకోకుండా "చెప్పమ్మా ? నీకు పైన ఇంకా ఏమి కావాలి? టీవీ, ఎసి ఎక్కడ పెట్టించాలి?" హడావుడి గా అడుగుతున్న ప్రదీప్ వంక నవ్వుతూ చూసింది.


" వద్దురా, నాకు టీవీ వద్దు, ఏసీ వద్దు. పైన హాయిగా మొక్కలు పెట్టుకుంటాను. పాటలు వింటాను, పుస్తకాలు చదువుతాను. నాకు పుస్తకాలకి అల్మారా కావాలి. అంతగా ఏసీ కావాలంటే కిందకి వచ్చి పడుకుంటాను. పైన బయట కూర్చుని నా ఆద్య తల్లికి బోలెడు కథలు చెప్తాను. చక్కగా సూర్యోదయం చూస్తూ కాఫీ తాగుతా"


గుక్క తిప్పుకోకుండా చెప్తున్న తల్లి ని ఆనందంగా చూస్తూ, స్వాతి చేయి నెమ్మదిగా ‘థాంక్స్’ అన్నట్టు నొక్కాడు.


అన్ని వివరాలు స్వాతి పేపర్ మీద నోట్ చేసుకుంది. మర్నాడు ప్రదీప్, స్వాతి వెళ్లి బిల్డర్ తో అన్ని విషయాలు మాట్లాడతామని చెప్పారు.


కాలనీ అంతా తిరిగి చూసి బయట హోటల్ లో భోజనం చేసి ఇంటికి వెళ్లారు.


తిరిగి, తిరిగి ఇంటికి వెళ్లి జానకిరామ్ కాసేపటిలోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. వైదేహి కి మాత్రం నిద్ర రాలేదు.


చిన్నప్పటి నుంచి తనకు విడిగా గది అనేది తన కల. చిన్నప్పుడు తమ ఇంట్లో అమ్మ, నాన్న తాతగారు, బామ్మా, ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు.


అంతేకాక మేనత్తలు, వాళ్ళ పిల్లలు, వచ్చే జనం పోయే జనంతో ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూచుని చదువు కోవడం, ఎక్కడో అక్కడ చాప వేసుకొని పడుకోవడం. పరీక్షలకి స్థిమితంగా చదవడానికి కూడ కుదిరేది కాదు.


పెళ్లి అయ్యాక తమకు అంటూ ఒక గది ఉంటుంది.. తను, తన భర్త చిన్న చిన్న కబుర్లు చెప్పుకోవచ్చు.. అని ఏవో పిచ్చి కలలు కంటే, అక్కడ ఒక 4 గదుల అద్దె ఇంట్లో అత్తగారు మామ గారు, ఆయన తల్లి, ఇద్దరు ఆడపడచులు, మరిది..


తమకు పేరుకు ఉన్న గదిలో రాత్రి 11 వరకు ఎవరో ఒకరు ఆ రూమ్ లో ఉండేవారు. పగలంతా పని చేసి ఎప్పుడు నిద్ర పోదామా అని పడుకోవడం.


పిల్లలు పుట్టి పెద్ద అవుతున్న దగ్గర నించి వాళ్ళ చదువుల కోసం వైదేహి పడక హాల్ లోకి దివాన్ మీదికి మారింది.

వైదేహికి చిన్నప్పటినుంచి పుస్తకాలు చదవడం అన్నా, పాటలు వినడం అన్నా చాల ఇష్టం.


పెళ్లి అయిన కొత్తల్లో కొంచెం టైం చేసుకొని ఓ పుస్తకం చదవడమో, రేడియో లో ఓ పాట వినడమే చేసేది.


రాను రాను అసలు వాటికి టైం ఉండేది కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లిళ్లు అయ్యాక కొంచెం తీరిక చిక్కి పాటలు విందామని పెడితే జానకిరామ్ "అబ్బా.. ఆ సౌండ్ ఏమిటి ఆపేయి" అని, పుస్తకం చదువుదామని లైట్ వేస్తె ‘నిద్రపట్టదు ఆపేయ’మని అనేవాడు.


అక్కచెల్లెళ్ళ పెళ్లిళ్లు, తల్లి తండ్రి బాధ్యత, కొద్దిగా ఊపిరి పీల్చేలోగా పిల్లల బాధ్యత, సొంతంగా ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేక పోయాడు జానకిరామ్.


అతన్ని ఎప్పుడూ తప్పు పట్టదు వైదేహి. ఉన్నంతలో ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. పిల్లలకి మంచి చదువులు, కూతురు కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం, రిటైర్ అయ్యేక తమకి అంటూ పెన్షన్ కాకుండా సరిపడా డబ్బులు ఏర్పాటు చేసాడు.


ఇల్లు, ఆఫీస్ మాత్రమే లోకంగా బతికిన జానకిరామ్ కి సినిమాలు, పుస్తకాలూ చదవడం, పాటలు వినడం లాంటి అలవాట్లు లేవు. టీవీలో న్యూస్ చూడడం, పేపర్ చదవడం తప్ప వేరే దేని మీద ధ్యాస లేదు. టీవీ లో సినిమాలు కూడా ఎప్పుడో తప్ప చూడడు.


కానీ వైదేహి కి మొక్కలు పెంచడం, సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం ఇష్టం. కానీ ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ లో ఎటు చూసిన గోడలు తప్ప ఏమి కనిపించవు.


వయసు మళ్లుతున్న ఈ సమయం లో తనకి అంటూ ఏకాంతం గా కొంత సమయం తనకోసం మాత్రమే గడపాలనేదే వైదేహి కోరిక.


భార్య కనిపిస్తే ఏదో పని గుర్తొస్తుంది జానకిరామ్ కి. కాఫీ ఇమ్మనో, టీవీ పెట్టమనో, పేపర్ ఇవ్వమనో ఏదో చెప్తూనే ఉంటాడు. సాయంత్రం సరిగ్గా వాకింగ్ కి బయలుదేరగానే" ఆకలి వేస్తోంది. రెండు బజ్జిలు వేయి." అంటాడు. అది అయ్యేసరికి చీకటి పడుతుంది.


పోనీ మీరు రండి వాకింగ్ కి అంటే రాడు. తనని కాసేపు వెళ్లనివ్వడు. చెడ్డవాడా అంటే కాదు, కానీ ఇరవై నాల్గు గంటలు ఎదురుగా "చిత్తం ప్రభూ" అన్నట్టు ఉండాలన్నట్టుగా ఉంటుంది అతని ప్రవర్తన.


ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడదామంటే పక్క నుంచి "ఇంకా ఎంతసేపు" అన్నట్టు సౌంజ్ఞ చేస్తాడు. అది అతని చెల్లెలు తో అయినా తన అక్క తోనైనా.. పాపం ఆ తేడా లేదు.


తాను ఇల్లు కదలడు, పెళ్ళాన్ని కదలనివ్వడు. ఒకోసారి ఊపిరి ఆడనట్టు, ఎవరో బంధించినట్టు గా ఉంటుంది వైదేహికి.


తాను పైన రూమ్ లో ఉంటే అంత ఓపిగ్గా పైకి రాడు.


మధ్యాన్నం కాసేపు ఆయన పడుకున్నప్పుడు అయినా తనకిష్టమైనవి చేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్లతో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు.


ఇన్నాళ్ళకి తన కోరిక కొడుకు, కోడలు తీరుస్తున్నారు. సంతోషంతో కళ్ళు చెమర్చాయి వైదేహికి.


"నా కోసం నా గది, నా మనసు గది, మనసైన గది" అనుకుంటూ కూని రాగాలు తీస్తుంటే.

"ఏంటి నీ గోల పడుకోనియ్యకుండా ?" విసుక్కుంటూ పక్కకి తిరిగాడు జానకిరామ్.


‘గోల…ఎక్కువ రోజులు ఉండదులే ఈ గోల’ నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది వైదేహి.

***

శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకా ఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ...

సెలవు ప్రస్తుతానికి.
147 views1 comment

1 Comment


Deepika asthana • 8 hours ago

Very nice story !!!

Like
bottom of page