top of page

నమ్మకం వమ్మైంది


'Nammakam Vammaindi' New Telugu Story

Written By Kasivarapu Venkatasubbaiah

'నమ్మకం వమ్మైంది' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


రాత్రి ఆలస్యంగా నిద్ర పోవడం వలన ఉదయం ఆలస్యంగానే నిద్ర లేచాడు టీచర్ బాల గంగాధర్. లేచిన వెంటనే గబగబా కాలకృత్యాలు ముగించుకుని స్నానపానాలు కానించి టిఫిన్ చేయకుండానే ఆదరాబాదరా స్కూలుకు బయలుదేరాడు. భార్య సుబ్బలక్ష్మి "కాసేపు ఆగి టిఫిన్ చేసి పోండ"ని చెప్నుతున్నా, వినిపికోకుండా తన స్కూటరును స్టార్టు చేసుకొని వెళ్ళిపోయాడు బాలగంగాధర్. బాలగంగాధర్ కాపురం ఉంటున్నది ప్రొద్దుటూరులోనైనా అతడు ఉద్యోగం చేస్తున్నది పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన ముద్దనూరు హైస్కూలులో. అతని స్నేహితులు, బంధువులు, తెలిసినవాళ్ళు అతని పేరుకు తిలక్ తగిలించి అభిమానంగా పిలుస్తుంటారు. దాంతో అతని పేరు బాలగంగాధర్ తిలక్ అయి నిలిచిపోయింది. ముద్దునూరు చేరుకొనేసరికి ఎనిమిదిన్నర గంటైంది. ఒకేసారి టిఫిన్ చేసి స్కూలుకు పోదామని తాను తరుచుగా పోయే టిఫిన్ సెంటరుకు వెళ్ళాడు తిలక్. టిఫిన్ సెంటరులో అడుగు పెడుతుండగా టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న రావిచెట్టు అరుగుపైన కుర్చున్న ఒక పెద్దాయన తిలక్ తో "బాబు.. టిఫిన్ పెట్టించవా?" అని అడిగాడు. "సరే పెద్దాయనా!" అని టిఫిన్ సెంటర్ ఓనరుతో "పెద్దాయనకు ఒక ప్లేట్ టిఫిన్ పంపించు" అని చెప్పాడు తిలక్. "పంపిస్తాను గానీ ఆ పెద్దాయన ఎవరో తెలుసా సార్? ఆయన బాగా పేరున్న తెలుగు సినిమా డైరెక్టరుకు తండ్రి" అని చెప్పాడు టిఫిన్ సెంటర్ ఓనర్. "ఔనా! ఆశ్చర్యంగా ఉందే " అవాకైపోయాడు తిలక్. టిఫిన్ తిన్నాక తిలక్ అరుగు మీద కుర్చున్న పెద్దాయన దగ్గరకి పోయి ఆయన పక్కన కూర్చుని "పెద్దాయనా! మీరు సినిమా డైరెక్టరుకు తండ్రి అట కదా! ఎందుకు ఇలా రావలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది. మీకు అభ్యంతరం లేకుంటే చెప్పుతారా?" ఆసక్తిగా అడిగాడు తిలక్. "చెప్పుకోవడం వలన ప్రయోజనం ఏముంది బాబు. అయినా ఇంతలా శ్రద్ధగా అడుగుతున్నారు కాబట్టి చెపుతాను. కేవలం కారణం చెప్పడం వలన ఈ కారణనికే ఇలా వచ్చి కష్టాలు పడే కన్నా సర్దుక పోయి ఉండోచ్చు కదా అని అనొచ్చు మీరు. నా కథంతా చెపితే గాని అర్థంకాదు, ఇలా రావడం సబబేనని. " చెప్పాడు పెద్దాయన నిర్లిప్తంగా. తిలక్ టైం చూసుకున్నాడు. ఇంకా అర్థగంట టైం ఉంది స్కూలు గంట కొట్టడానికి. రెండవ పిరియడ్ నుంచి తనకు క్లాస్ ఉంది. పెద్దాయన కథ వినడానికి టైం ఉంది. కాబట్టి చెప్పమన్నాడు తిలక్. పెద్దాయన తన కథ చెప్పసాగాడు. "మాది రెక్కాడితే డొక్కాడని కుటుంబం. యర్రగుంట్ల మండలంలోని ఒక చిన్న పల్లెటూరు మాది. మాకు రెండెకరాల వెలి భూమి ఉంది. ఊర్లో చిన్న ఇల్లు, చిన్న కల్లందొడ్డి ఉన్నాయి. నేనూ నా భార్య కలిసి మా పొలంలో పని చేసుకుంటూ బతుకే వాళ్ళం. మా చేలో పని లేనప్పుడు ఇతరుల పొలాల్లోకి కూలి పనికి పోయేవాళ్ళం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకున్నా భార్యాభర్తలం సుఖంగానే ఉండేవాళ్ళం. కొంత కాలానికి మాకొక మగబిడ్డ పుట్టాడు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లోడిని అల్లారుముద్దుగా పెంచుకున్నాం. బుడి బుడి అడుగులు వేసేటప్పుడు ఎంతో మురిసిపోయాం. వాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే సంతోషంతో పులకించిపోయాం. మా లోకం వాడే. మా ఆశలు ఆకాంక్షలు దానిపైనే. వాడిని చదివించి పైకి తేవడమే మా జీవితాశయం. వాడి యోగక్షేమాలు, వాడి అభివృద్ధే మా సర్వస్వం. అంతెందుకు మా పంచ ప్రాణాలు వాడే. వాడికి ఐదేండ్లు నిండి ఆరో ఏడు పడగానే మా ఊరిలోని ప్రాధమిక పాఠశాలలో వేశాం. పదేండ్ల వయసు రాగానే మా ఊరికి పక్కనే ఉన్న పంచాయతీ కేంద్రంలో హై స్కూల్లో చదివించాం. ఇంటర్మీడియట్ యర్రగుంట్లలో చేరిపించాం. పిల్లోడి చదువుకు ఏ ఆటంకం రాకుండా, తిండికి గుడ్డకు నలగకుండా ఉండేందుకు మేము గొడ్డు చాకిరీ చేశాం. మా కడుపులు మార్చుకుని వాడిని ఎగతోశాం. పదవ తరగతి వరకూ వాడికి మాతోనే లోకం. మమ్మల్ని విడిచి ఉండేవాడు కాదు. ఇంటర్లో చేరాక క్రమేణా మాతో చనువు తగ్గించాడు. వాడికి అవసరం మేరకు మాట్లాడేవాడు. మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. కాలేజిలో స్నేహితులు ఏర్పడ్డారు. స్నేహితులతోనే ముచ్చట్లు పెట్టుకునేవాడు సినిమాలు ఎక్కువగా చూసేవాడు. సినిమాల గురించి స్నేహితులతో ఆసక్తిగా చర్చించేవాడు. ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, రాయచోటి తిరిగేవాడు. ఎక్కడ నాటకాలు ఆడుతున్నా, ఎక్కడ సాహిత్య సభలు జరుగుతున్నా అక్కడికి తప్పక పోయేవాడు. మాతో గడపడం బాగా తగ్గించాడు. డబ్బు అవసరాలకు మాత్రమే మా వద్దకు వచ్చేవాడు. మూడేళ్లు ప్రొద్దుటూరులో డిగ్రీ, మరో రెండేళ్లు కడపలో పీజీ హాస్టల్లో ఉండి చదివాడు. మేము రెక్కలు ముక్కలు చేసుకుని మా కష్టాలు మేం పడి వాడికి డబ్బు పంపించేవాళ్ళం. వాడిపై మాకున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం. వాడిలో పెద్దగా ప్రభావం కలిగించినట్లు కనిపించలేదు. ఉదాసీనంగా వ్యవహరించేవాడు. అవసరాలకు తప్ప ఇంటికి రావడం దాదాపు మానేశాడు. వాడి చదువు కోసం ఊరిలో కల్లండొడ్డి అమ్మేశాం. వాడు ఎదిగి బాగుపడితే చాలు అనుకున్నాం. వాడు పాటలు, పద్యాలు, కథలు రాసేవాడు. అవి పత్రికల్లో ప్రచురింపబడేవి. చిన్న చిన్న నాటికలు రాసి కాలేజి పంక్షన్లల్లో ప్రదర్శించేవాడు. వాడి చుట్టూ ఒక ఇమేజును పెంచుకున్నాడు. మేము వాడి ప్రతిభకు చాలా ఆనందపడే వాళ్ళం. ఉన్నట్టుండి ఓరోజు ఇంటికి వచ్చాడు. మేము చాల సంతోషపడ్డాము. "బాబూ! చాల మంచి చదువు చదివావు, ఇకా ఒక మంచి ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో నాయనా" అన్నాం. "లేదు నాన్నా! నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అమ్మా! నాన్నా! నా మాటలు జాగ్రత్తగా వినండి. నాకు సినిమా రంగమంటే చాల ఇష్టం. ఆసక్తి ఎక్కువ. నాకు సినిమా రంగంలోకి పోయి డైరెక్టరుగా సినిమాలు తీయాలని ఉంది. నేను తప్పక అందులో విజయం సాధిస్తానని నాకు గాఢమైన నమ్మకం ఉంది. మీరు ఇంత ఐవరకు నాకోసం ఎంతో చేశారు. ఎంతో కష్టపడ్డారు. ఈ ఒక్కసారి నన్ను హైదరాబాద్ పంపించండి. నేను అక్కడ యాక్టింగ్ స్కూల్లో చేరి దర్శకత్వం శాఖలో శిక్షణ తీసుకుంటాను. నేను సినిమా రంగంలో తప్పక ఎదుగుతాను. మన బతుకులు బాగుపడతాయి. నన్ను హైదరాబాద్ పంపించండి" చివరిగా తెగేసి చెప్పాడు. మేము చాల చెప్పి చూశాం. సినిమా రంగంలో ఏ వెనుక బలం లేకుండా ఎదగడం కష్టమన్నాం. ఉద్యోగమైతే ఏ చీకూ చింత లేకుండా జీవితం కుదురుగా ఉంటుందని చెప్పాం. దానికి వాడు ఏవేవో కారణాలు చెప్పాడు. అందులో అయితేనే నేను రాణిస్తాను అన్నాడు. వాడి పట్టుదల చూసి సరే అన్నాం. వాడి తెలివితేటల మీద మాకు కూడ నమ్మకం ఉంది. అంతో యింతో కూడబెట్టుకున్న సొమ్మును ఖర్చుల కిచ్చి ఒక మంచి రోజు చూసి వాడిని హైదరాబాద్ బస్ ఎక్కించాం. తర్వాత పొలమో, ఇల్లో అమ్మి డబ్బు పంపుతామని చెప్పినాం. వాడు ఎదుగుతే మమ్మల్ని చూసుకుంటాడనే నమ్మకంతో. వాడు పోయిన కొద్దిరోజులకు ఊరిలో ఇల్లు అమ్మి డబ్బు పంపినాం. మేము మా రెండెకరాల పొలంలో చిన్న పూరి పాక వేసుకొని భార్యాభర్తలం ఉండిపోయాం. ఆరు నెలలకు ఉత్తరం రాశాడు. తాను శిక్షణ పూర్తి చేసినట్లు, కథ రాసుకుని ఒక నిర్మాతకు కూడా చూపినట్లు, ఆ నిర్మాత సినిమా తీయడానికి అంగీకరించాడని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని, ఆరునెలలు తర్వాత రిలీజ్ అవుతుందని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు బాడుగ యింట్లో ఉండాల్సి వస్తుందని, కాబట్టి మీరు రెండెకరాల భూమిని అమ్ముకుని హైదరాబాద్ వచ్చేయండని, సినిమాలలో అవకాశాలు వచ్చినంత వరకు ఆడబ్బును ఇంటి బాడుగకు, మన నిత్యావసరాలకు, షూటింగులకు పోవడానికి కారుకు అవసరమవుతుందని, తక్షణం భూమి అమ్ముకుని రాండని రాశాడు. మేము ఆలోచించాం! ఇక మాకు వాడే దిక్కు దిశ. వాడు ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ఉండడం సమంజసమని ఆనుకుని భూమిని అమ్మి హైదరాబాద్ చేరుకున్నాం. అప్పటికే వాడు ఒక అందమైన భవంతిని బాడుగకు తీసుకుని ఉన్నాడు. మేము భూమిని అమ్మగా వచ్చిన డబ్బును వాడి చేతిలో పెట్టాము. వాడు ఆమరునాడే అందమైన కారును కొని ఇంటి ముందు పెట్టాడు. ఇంట్లో జిగేల్మనే ఫర్నీచర్ పెట్టించాడు. వాడు చెప్పినట్లుగానే ఆరునెలల తర్వాత వాడి డైరెక్షన్లో తయారైన సినిమా రిలీజై యావరేజుగా ఆడింది. ఇంతలోపల శ్రద్ధగా మరో కథ రాసుకున్నాడు. దాన్ని మరో నిర్మాతకు చూపించి సినిమా తీయడానికి ఒప్పించాడు. అదీ షూటింగ్ ముగించుకుని రిలీజై, హిట్టైంది. ఇంకోక నిర్మాత ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చాడు. అతనికి సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఒక పేరున్న నిర్మాత ఇంటికొచ్చి నాకు ఒక సినిమా చేసిపెట్టమని అడిగాడు. చేశాడు. అదికూడా సూపర్ హిట్టై కూర్చుంది. దాని తర్వాత ఒక అగ్రశ్రేణి నిర్మాత అవకాశం ఇచ్చాడు. దాన్ని అత్యంత శ్రద్ధగా తీశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టరై మంచి పేరు ప్రతిష్టలతో పాటు పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దానితో మా వాడు అగ్రదర్శకులలో ఒకడైపోయాడు. ఇంక అక్కడి నుంచి వాడి దగ్గరికి హీరోలు, నిర్మాతలు క్యూ కట్టారు. మావాడు సర్వాంగ సుందరమైన ఒక భవంతిని కొన్నాడు. మేమందరం అందులో చేరిపోయాం. ఇండస్ట్రీలో మావాడి పేరు మారుమ్రోగిపోయింది. విజయానికి మారుపేరులా నిలిచిపోయాడు. ఒక ప్రసిద్ధ నిర్మాత పిల్లనిచ్చి, భారీగా కట్నం మావాడికి ముట్టజెప్పాడు. ఇవ్వన్నీ మా ప్రమేయం లేకుండానే, మా ప్రసక్తి లేకుండానే అన్ని జరిగి పోయాయి. మేము కేవలం ప్రేక్షకులమే అయ్యాం. కార్లు, ఆభరణాలు, ఎనలేని సంపదతో కోడలు ఇంట్లో అడుగు పెట్టింది. కాలం గడిచే కొద్దీ మా వాడు మమ్మల్ని చాల తేలికగా, చులకనగా చూడడం మొదలు పెట్టాడు. మాతో ఉరువు మాట్లాడడం మానేశాడు. ప్రతిదానికి ఛీదరించుకొనేవాడు, అసహ్యించుకునేవాడు. మేము వాడి ప్రవర్తన చూసి ఎదురు పడడానికి భయపడేవాళ్ళం. ఇంట్లో ఓమూల నక్కి బతికే పరిస్థితి దాపురించింది. రోజురోజుకూ ఇంట్లో సందడి పెరిగిపోయింది. కవులు, పాటల రచయితలు, కథా రచయితలు, నటులు, దర్శకులు, నిర్మాతలు నిత్యమూ సమావేశమై కథా చర్చలు సాగించేవారు. ఒకరోజు ఇంటి హాల్లో చాలా మంది కుర్చోని తీయబోయే సినిమా కోసం కథా చర్చలు జోరుగా జరుపుతున్నారు. నేను పంచ ఎగజెక్కి, సైను బనిగెను వేసుకొని గార్డెన్లో మొక్కలకు నీళ్ళు పెడుతున్నాను. దేని కోసమో రెండుమూడు సార్లు ఇంట్లోకి బయటికి తిరిగాను. కథా చర్చల్లో పాల్గొన్న ఒకవ్యక్తి "ఎవరు ఇతను, సారికి అటుఇటు తిరిగి కథా చర్చలకు డిస్టర్బ్ కలిగిస్తున్నాడు. " అంటూ విసుక్కున్నాడు. మరొకడు "ఔను నేనూ చూస్తున్నాను ఇల్లంతా స్వేచ్చగా కలయ తిరుగుతున్నాడు. ఎవరు ఇతనూ" మొదటివాడికి వంత పాడాడు. మిగతా వారు కూడ అతను ఎవరో చెప్పమని మా వాడిపై వత్తిడి తెచ్చారు. నేను మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్నాను. మావాడు కొద్దిసేపు తటపటాయించి "మా పనివాడు"అన్నాడు. దాంతో నా గుండె పగిలి నీరైంది.. "అట్లా అంటాడని నేను ఊహించలేదు. ఎంతమాట అన్నాడు. ఎట్లా నోరాడింది. వాడిని ప్రాణం బెట్టి పెంచాం. వాని ఎదుగుదలకు పునాదులు వెయ్యడానికి ఎంతో కష్టపడినాం. మేము వేసిన పునాదులపై భవనం నిర్మించుకుని, ఇప్పుడు నన్ను పనివాడు అంటాడా? 'ఛ' వీడింట్లో క్షణం కూడ ఉండకూడదు. అడుక్కతినైనా బ్రతుకుతాను. బతుక లేకపోతే చస్తాను. అంతేగానీ వీడింట్లో మాత్రం ఉండకూడదు అనుకొని సరాసరి పెరట్లో ఉతికిన బట్టలు ఆరేస్తున్న పెళ్ళాం దగ్గరకి పోయాను. 'మనకు ఈయింటితో ఋణం తీరిపోయింది. మనం బయటికి పోదాం రా!' అని జరిగిందంతా చెప్పాను. ఆమె 'తోందరపడకు. అంటే అననిలే, అనింది మన కొడుకే కదా! ఈ వయసులో మనం బయటికి పోయి ఎలా బతుకుదాం. ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. జీవితం చివర్లో ఉన్నాం. ఏ పని చేయలేం. తమాయించుకుని సర్దుకుని పోదాం. ' అన్నది. 'లేదు పోవాల్సిందే! నా గుండెలు పగిలి పోయాయి. నా మనసు వికలమై పోయింది. మనం బయటికి పోవాల్సిందే. బయలుదేరు' అని వత్తిడి చేశాను. ఆమె ఇంకా ఏమేమో చెప్పిచూసింది. నేను వినలేదు. చివరికి ఆమె 'నేను రాను. అనింది నిన్ను కదా! కాబట్టి, నీవే పో! నేను మాత్రం రాను' అని కరాఖండిగా చెప్పింది. ఇక ఆమెను వదిలేసి ఒంటరిగా బయటికి వచ్చేశాను. " అంటూ ఆ పెద్దాయన తన నేపథ్యగాధనంతా పూసగుచ్చినట్లు చెప్పి ముగించాడు. మన బాలగంగాధర్ తిలక్ పెద్దాయన జీవితకథను ఆసాంతం విని "పెద్దాయనా! మీ కథను విన్నాక మీరు తొందర పడ్డారేమో! అనిపిస్తుంది నాకు. నిజమే.. మీ కొడుకు మీ విషయంలో పెద్ద తప్పేచేసాడు. దురుసుగా ప్రవర్తించినాడు. దుర్మార్గంగా వ్యవహరించాడు. కాదనను, కానీ మీకు ఈ వయసులో అంత ఆత్మాభిమానం పనికి రాదు. సర్దుకుని పోయే గుణం అలవర్చుకోవాలి. లేకపోతే కష్టాల పాలైతాం. " అనునయంగా చెప్పి చూశాడు. అందుకు ఆయన "ఏమైతేనేం ! బయటి కోచ్చేశాను. ఇంక తిరిగి పోను. నా జీవితాన్ని ఇక్కడే ముగిస్తాను బాబు " దృఢంగా చెప్పాడు. "మీ కొడుకు పేరేమిటి" అడిగాడు తిలక్. "వద్దులే బాబు! వాడి పేరు చెప్పి వాడికెందుకు నా మూలంగా చెడ్డపేరు రావడం. ఇది నా ఖర్మ అనుకుంటాను" అంతా పరిస్థితిలోనూ తండ్రి గుణం చూపించాడు పెద్దాయన. "సరే పెద్దాయన! మీకెట్లా మంచిదీ అనిపిస్తే అట్లా ఉండండి. ప్రొద్దుటూరు వస్తే అనాధాశ్రమంలోనో, వృద్ధాశ్రమంలోనో చేర్పిస్తాను. " అన్నాడు తిలక్, మనసు ఉండబట్టలేక. "లేదు బాబూ! ఏదన్నా పని ఇప్పించండి, చేస్తాను" అతని మాటల్లో ఆత్మాభిమానం మళ్ళీ తొణికిసలాడింది. "అలాగే! సూపర్ మార్కెట్లోనో, మండీ బజార్లోనో, మిల్లులోనో వాచ్ మెన్ గా ఉందురుగాని, ప్రొద్దుటూరు వచ్చేయండి " అని చెప్పి, తన ఫోన్ నెంబరు ఇచ్చి, ఓ ఐదు వందల రూపాయల నోటును చేతిలో బెట్టి, స్కూల్ గంట కొట్టడంతో స్కూల్ వైపు నడిచాడు బాలగంగాధర్ తిలక్. ఎందరోలాగా నాకెందుకు అనుకోలేదు తిలక్. మరి కొందరిలాగా తన దారిన తాను పోలేక పోయాడు తిలక్. ---------------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.


41 views0 comments

Comments


bottom of page