'Nanna Bhojanam Chesava' written by J. S. Sailaja
రచన : జె.యస్. శైలజ
ఆఫీసునుండి శంకర్రావు చాలా ఆనందంగా బయల్దేరాడు ఎందుకంటే తనకి ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ యొక్క ఆనందాన్ని తన భార్య ఉమ తో పంచుకోవాలని పర్మిషన్ పెట్టి మరీ బయల్దేరాడు. కారెక్కినప్పటి నుంచి అతను ఊహల్లో విహరిస్తున్నాడు. నేను ఇంటికి వెళ్లేటప్పటికి ఉమ ఆశ్చర్యంగా చూస్తుందేమో!. ఏంటీ, తొందరగా వచ్చారు అంటుందేమో తన చేతిలో స్వీట్లు చూసి ఏదైనా ప్రమోషన్ వచ్చిందా అని చెప్పేస్తుందేమో!! అలా అనుకుంటూ చాలా రోజుల తర్వాత తన భార్యతో గడపబోయే సంతోషం సమయం కోసం ఎదురు చూస్తూ కారు నడుపుతూ వెళ్తున్నాడు. సిగ్నల్ పడినప్పుడల్లా తన గమ్యం ఇంకా పెరుగుతూ ఉన్నట్టు అతనికి అనిపిస్తోంది. తీరా తన పార్కింగ్ ప్లేస్లో కారు పార్క్ చేసి, లిఫ్ట్ లో ఆలోచించసాగాడు. చాలా రోజుల తర్వాత తనకి తన భార్యకి దొరికిన ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాపం ఉమ. ఎంత ప్రేమగా ఎంత బాధ్యతగా ఎంత కష్టం ఉన్నా కనిపించనీయకుండా చిరునవ్వుతో , సంసారాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంది. ఉమ తన భార్య అవడం తన అదృష్టం. చక్కగా పెంచారు మామగారు, అత్తగారు. బంధాలనీ, బాధ్యలనీ అర్ధం చేసుకునేటట్టు.
ఇవాళ తనకు ఇష్టమైన గుడికి తీసుకెళ్లి కాసేపు కూర్చుని తన వంక ప్రేమ గా ఆ ప్రసాదం పెడుతూ ఉంటే ఆ కళ్ళల్లోకి చూస్తూ చెప్పనా?? లేకపోతే ఇంట్లోకి వెళ్ళగానే వెనక నుండి పట్టుకొని ఒక్కసారిగా చెప్పనా? ఇలా ఆలోచిస్తూ తన ఆలోచనకి తనే నవ్వుకుంటూ నెమ్మదిగా కాలింగ్ బెల్ కోసం చూశాడు. అతని దృష్టి గడియ మీద పడింది. అది తీసి ఉండడంతో ఆశ్చర్య పోయి లోపలకి నడిచాడు. అన్ని గదులు చూశాడు. ఎక్కడ ఉమ జాడ కనిపించలేదు. ఆశ్చర్యంగా, కాస్త కంగారుగా మరొకసారి చూశాడు ఈ సారి చూస్తే మంచం పక్కన ఏడుస్తూ కనబడింది ఉమ. గుండె ఆగినంత పని అయింది శంకర్రావుకి. ఏమైంది అనుకుంటూ నెమ్మదిగా ఆమె పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేసాడు. ఆ భుజం స్పర్శ తో అతను తన భర్త శంకర్రావు అనుకొని ఒక్కసారిగా అతని పట్టుకొని భోర్న ఏడవసాగింది ఉమ. ఏమైంది, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ చెప్పు అని అతను ఎంతో ప్రేమగా అడుగుతుంటే మరింత హత్తుకుని ఏడవసాగింది. ఇక నిశ్శబ్దం సమాధానం చెబుతుంది అని అతను ఊరకుండిపోయాడు. ఏడ్చి ఏడ్చి చాలా సేపు అయ్యాక నెమ్మదిగా వంటింట్లోకి వెళ్లి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఆమెని సోఫాలో కూర్చోబెట్టాడు. తనే వంటింట్లోకి వెళ్ళి టీ పట్టుకొచ్చాడు. టీ తాగుతూ ఆమెనే గమనించసాగాడు.
"ఇప్పుడు చెప్పు .ఏమైంది.. ఎందుకింత బాధపడుతున్నావు? ఏం జరిగిందీ?పిల్లలు బాగానే ఉన్నారా? నీకు ఏదైనా ఒంట్లో బాలేదా?" అని అనేక ప్రశ్నలు వేశాడు శంకర్రావు.
' కాదండి' అంటూ జాగ్రత్తగా ఒక డైరీ తెచ్చింది "చదవండీ" అంటూ.
డైరీపైన 'ఉమకి' అన్న మామగారి చేతివ్రాతని గుర్తుపట్టి చదవసాగాడు.
'ఉమా!! మా నాన్న, ఏం చేస్తున్నావ్? బహుశా ఈ డైరీ మీ అమ్మ నీకు ఇచ్చినప్పుడు మీకు చాలా ఆశ్చర్య అనిపించవచ్చు కదా, దీనికి ఒక కారణం ఉంది నాకు ఈ మధ్య తరచూ ఒంట్లో బాగోలేదు ఎందుకో తెలియదు. నీతో మాట్లాడాలి అనిపించింది. నువ్వు ఎప్పుడూ నన్ను ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటావు కదా . ఫోన్ లో అడిగినప్పుడల్లా నాన్న భోజనం చేసావా అంటూ ఏంటి నాన్నగారు?? అస్తమానం అదే అడుగుతారేంటి? అని. గుర్తుందా తల్లీ! దానికి కారణం చెప్తాలే అనేవాడిని. కాని చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తాను రా తల్లి విను ఆ మాట ఏంటో. అని మామగారు వ్రాసిన మాటలకి ఆశ్చర్యపోయి ఆమె వంక చూసాడు శంకర్రావు. ఆ తర్వాత చదవండి అన్నట్టుగా సైగ చేసింది ఉమ. సరేనని చదవసాగాడు.
" అమ్మా!నీ చిన్నప్పుడు అన్నం పెట్టేవాడిని మీ అమ్మకి ఒంట్లో బాగాలేనపుడు. అపుడు నాన్నగారు, పేద్ద బొజ్జ వచ్చేసింది అంటూ, నువ్వు చెప్తే, ఆ బొజ్జకి ఓ ముద్దుపెట్టి నిద్ర పుచ్చేవాడిని. 'వద్దు నాన్నారూ!! ' అన్నా నెమ్మదిగా, అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ తినిపించేసేవాడిని. అమ్మో బొజ్జకి నీరసం వస్తుంది అంటూ. చదువుకునేటపుడు కూడా అమ్మ అలసిపోయిందంటూ నేనే వేడి పాలు కాచి ఇచ్చేవాడిని. మీ చదువులు అయ్యాక మీరు పెళ్ళి అయి మీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు నేను మీ అమ్మ ఇద్దరం ఉండిపోయాం. మా ఇద్దరికి దిగులుగానే ఉండేది. కొద్ది రోజులు ఇంకా నేను ఉద్యోగం చేసినపుడు అందులో పడి మర్చిపోయిన , పాపం మీ అమ్మ అస్తమానం మీరు అన్నం తిన్నారా లేదో ఏం తింటుందో ఏమో అనుకుంటూ ఉండేది. పరవాలేదు బానే ఉంటారు మాట్లాడుతున్నాము కదా అని అనేవాడిని. కానీ ప్రతిరోజూ మధ్యాహ్నం మీకు నేను ఫోన్ చేసే వాడిని గుర్తుందా. అమ్మా! ఉమా! ఏం చేసావ్ ఇవాళ, ఏం కూర వండావు అంటే నాన్న, గుత్తివంకాయకూర పప్పు, చారు అనేదానివి. దాని బట్టి బట్టి ఓహో ఇవాళ ఉమా సంతోషంగా ఉంది ఇంట్లో ఏ ఒడిదుడుకులు లేవు ప్రశాంతంగా చక్కగా అన్ని పదార్థాలు చేసింది తన భర్తకి తన వాళ్ళందరికీ సంతోషంగా చేసి పెట్టింది అని అనుకునేవాడిని.
మరో రోజు అమ్మ భోజనం చేసావా అని అడిగితే, ఏం లేదు నాన్న ఇవాళ కూర ఉండిపోయింది, రసం పెట్టేశాను అంటే నీకు ఒంట్లో బాగుండలేదేమోనని ఇంటికి వచ్చాక అల్లుడికి ఫోన్ చేశా. గుర్తుందా. నీకు జ్వరం అని తెలిసింది".
అది చదివి శంకర్రావు నిజమే అని అనుకున్నాడు.
" ఇంకొకసారి చాలా విసురుగా 'నాన్న! వంటలు తప్ప ఇంకేమీ లేవా నీకు? ఏం మాట్లాడాలో తెలీడం లేదు, నా సమస్యలు తెలుసా? నువ్వు అమ్మాయివి కాదుగా ఏం తెలుస్తుందీ నా బాధ' అంటూ పెట్టేసావ్. ఆ రోజున అనుకున్నాను 'ఇంట్లో ఏదో గొడవ పడింది' అని అనుకొని ఆ సాయంత్రం నెమ్మదిగా 'పర్వాలేదులే ఒంట్లో బాలేదేమో నువ్వు కాస్త వెళ్ళు' అని మీ అమ్మని పంపించాను. ఆ తర్వాత ఒక నాలుగు రోజులు అమ్మ ఉండి వచ్చిన తర్వాత మీ అత్త వారు కూడా సర్దుకొని,మీ కాపురం కుదిరి పడింది. అలాగే నీ మాటల్ని బట్టి నువ్వు చేసిన వంటలు బట్టి నేను అన్ని అంచనా వేస్తూ ఉండే వాడిని. ఇక్కడ నీకు అనుమానం రావచ్చు ఎందుకు అన్నాడోనని. చెప్తాను రా నాన్న. ఉమా!
తల్లి పెళ్లయిన తర్వాత ఇలా ఉన్నావా, అలా ఉన్నావా అని అడుగుతూ ఆఖరికి నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా కాస్త అడుగుతుంది. కాస్త కాస్త సహాయ, సలహాలు ఇవ్వడానికి వీలు కలుగుతుంది ఓ తల్లికి. అదే తండ్రి అలా మాట్లాడలేదు కదా అమ్మ. అందుకే ఇలాగ భోజనం చేశావా అన్న రూపంగా మాట్లాడతాను. భోజనం గురించి నీకు ఎలా అర్థమవుతుంది అని అంటావేమో దాని గురించి చెప్తాను నువ్వు సంతోషంగా చక్కటి పదార్థాలు చేసినప్పుడు నువ్వు చేసిన విధానాన్ని బట్టి ఎంతో బాగా వివరించే దానివి. అప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నామని నీ భర్త నువ్వుఅరమరికలు లేకుండా ఉన్నారని నాకు అర్థమయ్యేది. నీకు హాయిగా లేనప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు నువ్వు చేసిన వంటలు కాబట్టి నీకు బాగుండలేదని పెద్ద గొడవలు గా ఉన్నాయ్ అని అర్థమైంది. ఇంతకన్నా ఒక తండ్రి అందులోనూ ఒక ఆడపిల్లని ఎలాగా కనిపెట్టుకుని ఉండగలడూ? తన ప్రేమని ఆ మాటల ద్వారా తెలుసుకొని దానికి తగిన పరిష్కారాలు చూపిస్తాడు. నేను నిన్ను ఎప్పుడూ నాన్న భోజనం చేసావా తిన్నావా ఏం చేసావు అని అడిగేవాడిని. టైమ్ పాస్ కి కాదు. దానికి సమాధానం ఇదేనా అన్న మీ అమ్మ ప్రశ్నకీ నేను సమాధానం చెప్పలేదు. కానీఎపుడూ అంటూ ఉండేది. మీకు చాదస్తం. ఎప్పుడు వంటల గురించి అడుగుతారు. తిన్నావా, తాగావా.అనీను. ఎక్కడికైనా వెళ్లారా, కొత్తగా ఏం కొనుక్కున్నారు? ఏమీ అడగరు ఏంటో అనేది. కానీ తనకు కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది నీకు. నీకు అర్థమవుతుంది, వయసు వస్తుంది మీరు పెళ్ళి చేసి అత్తమావలు అవుతారు. ఈమాట శంకరరావుకి కూడా నామాటగా చెప్పు. నాయనా శంకర్రావు నీకు కూడా ఒక కూతురు ఉంది. రేపు నీ కూతురుతో కూడా నువ్వు ఏమి చేస్తావు? అప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఇలానే ఉంటుంది. మావగార్ల అందరి పరిస్థితి ఒకటే కదా. అప్పుడు నువ్వు కూడా ఇలా అనడం, అడగడం అలవాటు చేసుకో. అత్త వారికి మీరు ఏమేమి ప్రశ్నలు వేసి తమ ఇంటి గుట్టు అడుగుతున్నారు అని అనుమానం రాదు. అలాగే నీ బిడ్డలు సంతోషంగా తమ వారి ఇంట్లో ఉన్నారు అని తెలుసుకోవడం వారికి హాయిగా లేకపోయినా మీరు గమనించగలరు. చెప్పకుండానే మీరు వారిని అనుసరిస్తూ వారికి రావాల్సిన అవసరాలు సమకూరిస్తే వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటార. కాబట్టి నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయవయ్య. సరేనమ్మా ఉమా ఉంటాను. ఎందుకంటే ఇక నాకు రాసే ఓపిక లేదు నిద్రొస్తోంది ఏమో భగవంతుడు ఎప్పుడు తీసుకొని వెళ్ళి పోతాడో కదా. అందుకని ఇప్పుడే రాసి పెట్టాను. అయితే మీ అమ్మకి చెప్పాను. కేవలంఈ డైరీ ఉమకి మాత్రమేనని, నువ్వు కూడా చూడవద్దనిచెప్పా. మీ అమ్మ కూడా అలాగే చేసిందని ఆశిస్తాను ఈ డైరీ నువ్వు చదువుతున్నప్పుడే, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చదువుతున్నావు అని అర్థం కదా. అదే మాట మీ బిడ్డలకి ఆ తర్వాత ఆ తర్వాత తరాల వాళ్ళకి కూడా మీరు అందించి సంతోషంగా పిల్లాపాపలతో హాయిగా ఉండాలని మనసారా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీభవ ఆచంద్రార్కం వంశ అభివృద్ధి రస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. లక్ష్మీ ప్రాప్తిరస్తు సుఖీభవ చిరంజీవి భవ, యశస్వి భవ. శంకర్రావు ఉంటా నాయనా నీకు కూడా నా యొక్క ఆశీస్సులు అఖండంగా ఉంటాయి. ఆ చివరిపేజీ డైరీలో చదివేటప్పటికి ఈసారి కళ్ళవెంట నీళ్ళు శంకర్రావుకి ప్రవహించసాగాయి. ఉమ వచ్చి "ఏంటండీ, చిన్న పిల్లవాడిలాగా, నేనంటే ఏదో ఆడపిల్లని కాబట్టి ఏడ్చేశాను. మీరేంటి ఇలా" అంటే," గొప్ప అర్థం చెప్పారు మీ నాన్నగారు, అదే మా మామగారు. నిజంగా ఆడపిల్లలున్న ప్రతి తండ్రి మీ నాన్నగారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఉంటే ఏ విధంగా ఆడిగి ఆమె యొక్క పరిస్థితి తెలుసుకోవచ్చు. ఎంత చక్కగా వివరించారు నేను తప్పకుండా పాటిస్తాను" అన్నాడు.
" సంతోషం అండి అంది ఉమ."
" అవును ఉమా! నీకు ఈ డైరీ చదవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీ నాన్నగారు పోయిన ఆరు నెలల అయ్యాక?" అన్నాడు శంకర్రావు.
" అవునండి. మన ప్రియ నిన్న ఫోన్ చేసింది కదా. 'నాన్న, భోజనం చేసేవా' అని అడిగా కదా. దానికి ఒంట్లో బాగోలేక, 'ఏం వండావ్' అంటే 'అమ్మ! చారు పెట్టుకున్నాను'అంది. ఆలోచనలో పడిన నేను మీరు వెళ్ళాక గట్టిగా అడిగేసరికి 'ఓపిగ్గా లేదమ్మా' అనే మాట చెప్పింది. వెంటనే నాకు అర్థమైంది. ఇంకేమి పెట్టుకో లేదంటోంది, ఓపిక లేదు అంటోంది అంటే జ్వరం వచ్చిందా అనుకుంటూ ఉంటే నాకు ఒక్కసారిగా మా నాన్న కళ్ల ముందు మెదిలారు. నాన్న కూడా అస్తమానం 'భోజనం చేసావా అమ్మ' అని అనేవారు కదా ఇలాంటివి ఏదైనా ఉంటుందా అని అనుకొని అన్నీ పక్కన పెట్టేసి, డైరీ చదివాను. ఈ మధ్యలో మీరు వచ్చి, ఇదిగో ఇలా... అంది ఉమ.
" ఏంటీ, ప్రియకి జ్వరమా, ఏంటి, ఎలా ఉంది? తగ్గిందా లేదా?" అని శంకర్రావు కంగారు పడ్డాడు. "అబ్బబ్బా! ఒకటే తొందర మీకు. ఉద్యోగం కి వేరే చోటుకి వద్థన్నా వినరుగా తండ్రీ కూతుళ్ళు. ఆ విషయాలన్నీ అయ్యాయి.అందుకే మీకు ఏమీ చెప్పలేదు. ఖంగారు పడతారని. దాని ఫ్రెండ్ గీత ఉందిగా. దాన్ని వెళ్లమని చెప్పాను. గీత రాత్రి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది . ఇప్పుడు అదే నాకు ఫోన్ చేసి చెప్పింది బాగున్నానని. సరేనా మీరు కంగారు పడకండి" అంది ఉమ.
" ఇప్పుడే ఒకసారి ఫోన్ చేస్తాను" అంటున్న శంకర్రావుతో "టైము అవలేదు. ఆఫీస్ తరవాత మాట్లాడదాం. సరేగాని మీరేంటి ఇవన్నీ తెచ్చారు" అంది. ఒక నవ్వు నవ్వాడు. "అయ్యో నేను గమనించనే లేదు సారీ అండి" అంది.
" అలా అనకూడదు, నీకు మంచి వార్త చెప్పనా, నేను డివిజనల్ మేనేజర్ ఇవాళ్టి నుండీ'అన్నాడు.
" అవునా చాలా సంతోషంగా ఉండండి. మీరుఈ మాట చెప్తే మీ మీ సంతోషాన్ని పంచుకోకుండా ఏడిపించాను కదూ" అంది ఉమ.
"అదేం లేదు ఉమా! నిజంగా కన్నీరు వల్లనే కదా ఒక కూతురిపై తండ్రి మమకారం, ఒక తండ్రి మనసు నాకు అర్థమైంది. భవిష్యత్తులో నా కూతురు తో నేను ఎలా మాట్లాడాలో కూడా నాకు ఎంత తేలిగ్గా ఎంత సులువుగా చెప్పేస్తారు మావయ్య గారు. తప్పకుండా ఆయన చెప్పినట్లే చేస్తా, సరేనా బయలుదేరు తయారయ్యి, గుడికి వెళ్ళి, అటునుండీ హాటల్ కి వెళ్ళేసివద్థాం" అన్నాడు. "ఆ. అన్నట్లు ఆ పంతులుగారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి మీరు. ఏదో సంబంధం ఉందన్నారు అమ్మాయికి" అంది ఉమ.
" అలాగేనండి శ్రీమతి గారు ...తప్పకుండా" అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఎంతో సంతోషంగా తమని ఒకటి చేసిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియ చేసుకున్నారు గుడికెళ్లి శంకర్రావు, ఉమ.
గమనిక:: ఇందులో పాత్రలు కల్పితాలైనా, తండ్రి పాత్ర మా నాన్నగారిదే. ఆయన వెళ్ళిపోయాకే నాకూ ఆయన మాట్లాడిన మాటల్లోని అంతరార్ధం అర్ధం అయి, ఇదిగో ఇలా మీతో నా భావాలు పంచుకుంటున్నా. నాన్న భోజనం చేశావా అన్న ఈ కథ కన్నీటితో ప్రేమతో, ఆత్మీయతతో, అనురాగంతో, నా తండ్రికి ( చెరువు వేంకట కృష్ణయ్య ) అంకితం.
రచయిత్రి పరిచయం : జె.యస్. శైలజ
నాకు చిన్నప్పటి నుంచి మా తల్లితండ్రుల వల్ల భాష, చక్కటి పదజాలాలూ అబ్బాయి. నాన్నగారు అనేక రకాలైన పుస్తకాలు చదివించి, ఆ పుస్తకం లో మనకి నచ్చిన పాత్ర గురించి వేసవి సెలవుల్లో మాట్లాడమనేవారు. ఎందుకు, ఏమిటి ఇలా. నాకూ పుస్తకం కనపడితే చాలు. చదువుతాను. ముఖ్యంగా తెలుగువి. వచనకవితలు, కథలు, కథానికలు, సరదాగా నూత్యరూపకాలకి వ్యాఖ్యానం చేయడం, భక్తి సంగీత కచేరీలకి వ్యాఖ్య చేయడం ఇష్టం. చేస్తుంటా అపుడపుడు. మా నాన్న, అమ్మల బాటలో నేనూ నా పిల్లలకి వివరిస్తుంటా. మాట్లాడతూ ఉంటా వారితో. మా వారు నన్ను ప్రోత్సహిస్తారు. మీ ప్రోత్సాహం కి ధన్యవాదాలు. నమస్సులు. శైలజ.
Comments