Nanna Manasu Written By Krishna Suresh Kothuri
రచన : కృష్ణ సురేష్ కొత్తూరి
కూతురి పెళ్లి జరుగుతోంది.. ఇప్పుడే కన్యాదానం అయింది.. నేను, నాభార్య పీటలమీదున్న నా కూతురి పక్కనుంచి లేచాం, అక్కడ అల్లుడుగారు వచ్చి కూర్చున్నారు..పంతులుగారు మంత్రాలు చదువుతున్నారు. నేను దూరంగా ఉన్న ఉసిరి చెట్టుని ఆనుకుని కూర్చున్నాను.అక్కడ నుంచి చూస్తే మా పాక , ఆరుబయట జరుగుతున్న పెళ్లి, పీటలమీద బుగ్గచుక్క పెట్టుకుని కూర్చున్న నా కూతురు "మల్లి" కూడా నా కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది, మనసు మాత్రం ఎందుకో కొద్దిగా మసకబారింది. ఒకప్పుడు ఈ పాకని పెంకుటిల్లు చేయాలనుకున్నాను, కానీ నా కూతురు పుట్టాక దానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాను..అందుకే మా పాప ప్రభుత్వపాఠశాలలో పంతులమ్మయింది, ఈ పాక ఇంకా పాతదయింది.. ఒకపక్క తెల్లవారుతోంది.. నా భార్య నాగమ్మ, తన అక్కాచెల్లెళ్లు మాఅమ్మాయి వెనకాలే కూర్చున్నారు. పందిరిలో కొంతమంది టీ , కాఫీలు తాగుతూ పెళ్ళిచూస్తుంటే, కొందరు బంధువులు కుర్చీల్లో కునికిపాట్లు పడుతున్నారు..పంతులుగారి ఆదేశం కోసం బజంత్రీలవారు ఎదురుచూస్తున్నారు..నా మేనల్లుళ్లు పందిరిలో అందరికీ టీ , కాఫీలు అందిస్తున్నారు.. ఇంత కోలాహలంలో , కంటిముందు కూతురు పెళ్లి జరుగుతుంటే ఈ తండ్రి మనసు మాత్రం ఎందుకో గతంలోకి వెళ్తోంది.
***** ***** *****
ఇరవైరెండు సంవత్సరాల క్రితం నేను ఎలా ఉండేవాడినో ఇప్పుడు ఎలా ఉన్నానో, ఎంత మార్పో కదా జీవితం ...నలుగురితో ఉండటం కన్నా ఒంటరిగా పొలంలో పనిచేసుకోడం, ప్రేమగా పొలం గట్లమీద మొక్కలు పెంచడం, ఆవులతో, గేదలతోనే కాలం గడపడం, వాటికి పుట్టిన దూడలంటే ఎంతో మమకారం..నేను నాటిన మొక్కకి పువ్వో, పండో కాస్తే మనసు ఆనందంతో నిండి కళ్ళలోంచి నీళ్లు రావడం.. ఎందుకో మనుషులకన్నా , ఈ పశువులకు , మొక్కలకు దగ్గరయ్యాను.ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ఉండటం ఇష్టం..చందమామ కధల పుస్తకాలంటే చాలా ఇష్టం..ఇంట్లోకి చుట్టాలు వస్తే పొలానికి వెళ్లి చందమామ పుస్తకాలు చదువుకునేవాడిని. అమ్మ నాన్న లేని వీడు ఇలా ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా ఏమైపోతాడో అని మా అమ్మమ్మ బెంగపెట్టుకునేది..పది చదివిన నాకోసం ఎంతో కష్టపడి ఎనిమిది చదివిన సూరయ్య కూతురు నాగమ్మని వెతికింది. మా ఇద్దరికీ పెళ్లి చేసింది..
ఒకరోజు మధ్యాహ్నం నిద్రలేచాక అరుగుమీద కూర్చుని టీ తాగుతున్నాను, నాగమ్మ వచ్చి 'పక్కఊరిలో జాతరకు తీసుకెళ్లమ'ని అడిగింది. 'నావల్ల కాదు కావాలంటే నువ్వు వెళ్ళు' అన్నాను.
ఏడుపు మొదలెట్టింది. ఇంక చేసేదేమి లేక మొదటిసారి మామావగారు ఇచ్చిన సైకిల్ మీద నాగమ్మని తీసుకుని జాతరకు వెళ్ళాను. గాజులు, బొట్లు కొనేసింది, జాతరంతా రెండుసార్లు తిప్పేసింది. ఇంకా ఏదో ఆశతీరలేదు, ఇంకా తిరిగి చూద్దాం అంటే నాకు ఓపిక లేక నేను సైకిల్ దగ్గర ఉంటాను కావలసింది కొనుక్కోమని వచ్చేసాను. గంట తరవాత వచ్చింది, సంచి నిండా సామానుతో...
'గేదెల దగ్గరకి వెళ్ళాలి త్వరగా రా' అని తిట్టాను. ఇద్దరం ఇంటికి వచ్చేశాం . మరుసటి రోజు నా పుట్టిన రోజు. కొత్తబట్టలు కట్టుకుని గుడికి వెళ్ళివచ్చాక, తను నాకో ఆడపిల్ల బొమ్మ ఇచ్చింది పుట్టిన రోజు కానుకగా. నాకోసం జాతరలో కొందట..అందుకే పాపం అన్నిసార్లు తిరిగిందట జాతరంతా. ఆరోజు ఆ బొమ్మ ఎందుకో నాకు బలే నచ్చింది. గుండ్రటి ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, నవ్వుతున్న పెదాలు, రెండు పిలకలు... వాటికి ఎర్రటి రిబ్బెన్లు, పచ్చ గౌను వేసుకుని ఉంది ఆ బొమ్మ.
ఆ మొక్కలకి, పశువులకు , చందమామ కధలకి ఎందుకు దగ్గరయ్యానో ఎలా తెలియదో అలాగే ఈ బొమ్మకి ఎందుకు దగ్గరయ్యానో కూడా తెలియదు.. ఆ బొమ్మతోనే ఆడేవాడిని, భోజనం చేసేటప్పుడు నాపక్కన ఆ బొమ్మ లేకపోతే నాకు ముద్ద దిగేది కాదు.. రాత్రిపూట గుండెలమీద పడుకోపెట్టుకునేవాడిని .అమ్మ, నాన్న గుర్తొచ్చి బెంగగా ఉన్నప్పుడు ఆ బొమ్మని భుజం మీద వేసుకుంటే ఎందుకో తెలియదు నా గుండెలో బరువు ఆ బొమ్మ తీసేసేది. ఆ బొమ్మకి పేరు కూడా పెట్టుకున్నాను "మల్లి" అని. జీవితంలో మొదటి స్నేహం ఆ బొమ్మతోనే. రోజూ పనికి వెళ్లి వచ్చాక ఆ బొమ్మతోనే ఎక్కువ సేపు కాలంగడిపేవాడిని.
కొందరికి చుట్ట, కొందరికి మందు ఎలా వ్యసనమో, అవేమీ లేని నాకు ఈ బొమ్మే వ్యసనం.. కొన్నాళ్ళకి నాకు పాప పుట్టింది, పాపతో కన్నా బొమ్మతోనే ఎక్కువసేపు ఉంటున్నానని నాగమ్మకి కోపం వచ్చేది, ఎన్ని సార్లు చెప్పినా నేను ఆ బొమ్మని పక్కన పెట్టి, పాపతో ఎక్కువసేపు ఉండలేక పోయేవాడిని..అది నా తప్పే కానీ బొమ్మపైనే ఎక్కువ మమకారం పెంచుకున్నాను. ఒకరోజు పొలం వెళ్లి వచ్చాక ఇల్లంతా ఆ బొమ్మకోసం వెతికాను. కానీ ఎక్కడా దొరకలేదు..నాగమ్మని అడిగాను. నాకు తెలియదు అంది. మనసుకు బెంగగా అనిపించి బయట అరుగుమీద కూర్చున్నాను...
ఆకాశంలో మబ్బులు, చల్లటి గాలి మొదలయ్యాయి. కొంతసేపు అయ్యాక పెద్ద వర్షం ప్రారంభమయింది..ఆ వర్షానికి పాకపై నుంచి ఎర్రటి రిబ్బను, పచ్చని గౌను, చింపేసిన బొమ్మ నెమ్మదిగా క్రింద పడి, నా కంటిముందే ప్రవాహంలో వెళ్లిపోయాయి. నాగమ్మకి తన కూతురుని పట్టించుకోడంలేదని ఈ బొమ్మని చింపేసి ఇంటిమీద పడేసిందని అర్ధమయ్యింది. గుండె బరువెక్కి గట్టిగా ఏడ్చేసాను. ఇంతలో నాగమ్మ నా కూతురుని ఆ బొమ్మలాగే తయారుచేసి నా చేతికి ఇచ్చింది. ఎర్రటి రిబ్బన్లు, కళ్ళకి కాటుక, పచ్చని గౌను. ఆ రోజునుంచి పాపని కూడా "మల్లి " అనే పిలిచేవాడిని . స్కూల్ లో మాత్రం రామారావు మాస్టర్ "మల్లి" అంటే బాలేదు అని "కే.మల్లికా" అని రాసారు.
***** ***** *****
పంతులుగారు "రేయ్ రాముడు ఇలా రా! అమ్మాయికి, అల్లుడుకి అక్షింతలు వెయ్యి, బజంత్రీలు వాయించండి..." అని అన్నారు గట్టిగా. గతంలోంచి తుళ్ళిపడి బయటకు వచ్చాను. అక్షతలు వేసి వచ్చాను. ఇంతలో మా మేనల్లుడు వచ్చి "మావయ్యా! పెళ్ళివారి కోసం ఐదు గుర్రపు బళ్ళు మాట్లాడాను. రామాలయం వరకు రిక్షా మీద తీసుకెళ్లాలి. అక్కడ ఆచార్లుగారు గుడిలోనే ఉన్నారు. గుడిలో పూజ అయ్యేటప్పటికి గుర్రపు బళ్ళు సిద్ధంగా ఉంటాయి" అన్నాడు.
"సరే" అన్నాను. ఆకాశం అంతా మబ్బులు, చిన్నగా గాలి, వర్షం ప్రారంభమయ్యాయి, 'మా అమ్మాయి చిన్నప్పుడు రాళ్లతో కప్పల్ని కొట్టిందేమో అందుకే దీని పెళ్ళికి వర్షం వస్తోంది' అనుకున్నాను.. రిక్షా కిట్టయ్య ఇంటిముందే ఉన్నాడు... అమ్మాయిని అల్లుడిని రిక్షా ఎక్కించాం నెమ్మదిగా రిక్షా వెళ్తోంది, మిగతా పెళ్ళివారితో కలిసి మేమూ నడుస్తున్నాం..ఒక్కసారిగా గాలి వర్షం పెరిగింది. కిట్టయ్య రిక్షా తొక్కలేక దిగి లాగుతున్నాడు. నేను వెనకాలే చెయ్యి వేసి తోస్తున్నాను..మా అమ్మాయి రిక్షాలోంచి నన్ను చూస్తోంది .
"ఏం పర్లేదమ్మా! ఒక చెయ్యివేస్తే ఐదు నిమిషాలలో వెళ్లిపోతాం గుడిదగ్గరకి అన్నాను నేను. కిట్టయ్య ఒక పట్టు పడితే మొత్తంమీద రామాలయం పదినిమిషాలలో చేరాం. పాపం మిగతా పెళ్ళివారు కొద్దిగా తడిసిపోయారు. అల్లుడు, అమ్మాయి గుళ్లో దర్శనం చేసుకుని గుర్రబ్బండి ఎక్కారు.నా "మల్లి" వెళ్ళిపోతోంది, నాతోపాటు నా మొక్కలు, పశువులు, పొలంగట్లుకూడా ఒంటరివైపోతాయ్..ఈ నాన్నకి నలుగురితో కలిసి బ్రతకడం రాదు..నలుగురితో ఎలాబ్రతకాలో చేతకాదు..నా సర్వం నా ప్రాణం ఈరోజు అత్తవారింటికి వెళ్లి పోతోంది..పైకి మాత్రం నవ్వుతు అమ్మాయిని సాగనంపాను.బండి పది అడుగులు ముందుకు వెళ్ళింది నేను నాలుగు అడుగులు వెనక్కి వేసాను..
ఒక్కసారి బండి ఆగింది మా అమ్మాయి "నాన్నా.." అని పిలిచింది.
"ఏంటమ్మా..." అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళాను. పంచె గోచి కూడా ఊడిపోయింది పరిగెత్తుకుని వెళ్తుంటే..మా అమ్మాయి తన కొంగు వెనకాలనుంచి ఒక ఆడపిల్ల బొమ్మ తీసి నాచేతికి ఇచ్చింది. ఇది అచ్ఛం ఆ పాతబొమ్మలాగే ఉంది.."జాగ్రత్త నాన్నా, వస్తూఉంటాను" అనిచెప్పి వెళ్లిపోయింది .
మా అమ్మాయి ఇచ్చిన బొమ్మ ఎక్కడ తడిసిపోతుందో అని నా భుజానికి ఉన్న తువాలు బొమ్మపై వేసి ఇంటివైపుగా నడక కొనసాగించాను.. నా పాప అటు, నేను ఇటు మధ్యలో ఉన్న రామాలయంలో రాముడు మాత్రం నవ్వుతూ చూస్తున్నాడు...
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
Roju rojuki marichipotunna patha taram palleturi manushulu, sunnitamaina, swatchamaina manusu to valliche premanu ento andam ga rasavu. Tellavarujamuna pachani polallo kurise manchuto patuga challani gaali thaakithe ponde anubhuthila undi katha.
Chala baundi.. Well written.. Tagore gari Kabuliwala gurthochhindi.. Rachayithaki subhaabhinandanalu..🙏🙏
good one