top of page
Writer's pictureSathya S Kolachina

నాన్నంటే... పార్ట్ 2


'Nannante - Part 2/2' - New Telugu Story Written By Sathya S. Kolachina

Published In manatelugukathalu.com On 11/12/2023

'నాన్నంటే - పార్ట్2/2' పెద్ద కథ

రచన: సత్య ఎస్. కొలచిన

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ..

గౌతమ్ పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్ లో చేరబోతున్నాడు  .

అతని తల్లి పేరు శ్యామల.

తండ్రి రాఘవరావు తమతో ఉండక పోవడం అతనికి బాధ కలిగిస్తుంది.

తనను కాలేజీలో చేర్చేందుకు తండ్రి రావడంతో ఆనంద పడతాడు.

అతనితో పాటు వచ్చిన అమ్మాయి లలిత, తనకు తోబుట్టువు లాంటిదని తెలుసుకుంటాడు.

గౌతమ్, లలితలకు గతం వివరించడం ప్రారంభిస్తుంది శ్యామల. 



ఇక నాన్నంటే.. పెద్దకథ రెండవ భాగం చదవండి..


ఆరోజు బాగా వర్షం పడుతోంది. రాఘవరావు ఇంటికొచ్చేసరికి సాయంత్రం ఎనిమిదైంది. ఆరోజు అతని జీవితంలో అత్యంత విషాదమైన రోజు.


రాఘవరావు, రాజారావు మంచి మిత్రులు. రాజారావు కలిగిన కుటుంబంనుంచి వచ్చాడు. వాళ్ళ స్వగ్రామంలో అతని తండ్రి బాగా ఆస్తిపాస్తులున్న వాడు. కనీసం పాతిక ఎకరాలు సాగు భూములున్నాయి వాళ్ళకి. అతని తండ్రికైతే కొడుకు డిగ్రీ కానీ, ఉన్నత చదువులు కానీ చదవడం ఇష్టం లేదు. ఉన్న ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం. కానీ, రాజారావు తండ్రిని ఒప్పించి మరీ కాలేజీలో చేరాడు. ఉత్తి డిగ్రీతో సరిపెట్టలేదు. డిగ్రీ అయ్యాక లా కోర్సులో జాయిన్ అయ్యాడు. లా కాలేజీలో రాఘవరావు అతనికి పరిచయం అయ్యాడు.


రాఘవరావుకి చిన్నతనంలోనే తల్లీ, తండ్రీ పోయారు. మేనమామ జాలిపడి అతన్ని పెంచి పెద్దచేసి డిగ్రీ పూర్తి చేయించాడు. ఆయన దగ్గర కూడా పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. డిగ్రీ అవగానే తన ఒక్కగానొక్క కూతురు లక్ష్మిని పెళ్ళి చేసుకుని తన కళ్ళ ఎదుటే ఉండిపొమ్మని కోరాడు.

లక్ష్మిని పెళ్ళి చేసుకోవడం రాఘవరావుకి ఇష్టమే. అందుకు కారణం కేవలం, లక్ష్మి అంటే ఇష్టం ఒక్కటే కాదు, అమ్మా, నాన్న పోయిన తరవాత తనని గాలికి వదిలెయ్యకుండా చేరదీసిన మామయ్యని బాధ పెట్టడం ఇష్టం లేదు. అయితే, అతనికి న్యాయశాస్త్రం చదవాలని కోరిక. అంతే కాదు, బాగా చదువుకుంటే ముందుముందు మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అని మామయ్యని ఒప్పించడానికి ప్రయత్నించాడు.


‘ముందు లక్ష్మిని పెళ్ళి చేసేసుకో. తరవాత నువ్వు లా చదువుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ, నువ్వు సిటీలో ఉండి చదువుకోడానికి ఇంక నేను పెట్టుబడి పెట్టలేను. నీ తిప్పలు నువ్వే పడాలి’ అన్నాడు అతని మేనమామ. ఆయన కోరిక మీద లక్ష్మిని పెళ్ళి చేసేసుకున్నాడు. అయితే, చదువుకుంటున్న సమయంలో లక్ష్మిని కాపురానికి తీసుకొచ్చేస్తే చదువు సరిగా సాగదని అతను భార్యని పుట్టింట్లోనే వదిలి మళ్ళీ సిటీకి వచ్చాడు, ఈ సారి లా కాలేజీలో చదువుకోడానికి. శలవులకి వెళ్ళి భార్యని, మామయ్యని చూసి వస్తూండేవాడు.


చదువుకోడానికి, విడిగా ఇల్లు అద్దెకి తీసుకోడానికి, వండుకు తినడానికీ కలిపి చాలానే ఖర్చు అనిపించింది అతనికి. అతనికి ఆస్తులేమీ లేకపోవడం వలన బ్యాంకు కూడా లోను ఇవ్వడానికి నిరాకరించింది. అదే సమయంలో అతనికి రాజారావు పరిచయం అయ్యాడు. రాజరావుకి డబ్బు సమస్య లేదు. మంచి రూమ్ మేట్ కోసం చూస్తున్నాడు. బాధ్యతాయుతమైన మనిషైన రాఘవరావు అతనికి బాగా నచ్చాడు. లా చదువుకున్నంతకాలం, రాజారావు, రాఘవరావుని తను అద్దెకి తీసుకున్న ఇంట్లోనే ఉంచుకున్నాడు. అతని ఖర్చులన్నీ కూడా తానే పెట్టుకునే వాడు. అతి కొద్ది కాలంలోనే రాఘవరావు, రాజారావు మంచి మిత్రులైపోయారు. రాఘవరావు రాజారావుకి ఎంతో ఋణపడ్డాడు. రాజారావుకి ఏ అవసరం వచ్చినా తప్పకుండా అతని ఋణం తీర్చుకోవాలని రాఘవరావు నిశ్చయించుకున్నాడు.


రాజారావులో ఉన్న ఒక మంచి గుణం ఏమిటంటే, అతను సొసైటీలో ఉన్న సమస్యల మీద పోరాడేవాడు. అతనిలో మంచి నాయకత్వ లక్షణాలున్నాయి. అతనికి డబ్బు సమస్య కాకపోవడం వలన, వీటన్నింటికీ సమయం, డబ్బు కూడా వెచ్చించేవాడు. ఈ నేపథ్యంలోనే అతను ఒక రాజకీయ నాయకుడికి విరోధి అయ్యాడు. ఆ రాజకీయ నాయకుడి కొడుకు ఒక అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి అనాథ ఆశ్రమంలో పెరిగింది. డిగ్రీ పూర్తి చేసుకుని చిన్న ఉద్యోగంలో చేరింది, తనని తాను పోషించుకోడానికి.


ఈ రాజకీయ నాయకుడి కొడుకు ఆ అమ్మాయిని వేధించడం రాజారావు కళ్ళలో పడింది, అతన్ని ఎదిరించాడు. అప్పటికి రాజకీయ కారణాల వలన ఆవిషయాన్ని పక్కన పెట్టేశాడు రాజకీయ నాయకుడు. క్రమంగా ఆ అమ్మాయి రాజారావు మనసుకి దగ్గరయింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు, తరవాత ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారు. ఆ అమ్మాయిని కోడలుగా తన తండ్రి అంగీకరించడని రాజారావుకి తెలుసు. అయినా అతను ఆ అమ్మాయిని మోసం చెయ్యలేదు. ముందుగా పెళ్ళి చేసేసుకుంటే తరవాత ఆయనేమీ చెయ్యలేడని అతని ఉద్దేశ్యం. తన స్నేహితుడు రాఘవరావు సమక్షంలో, ఆ అమ్మాయిని గుడిలో పెళ్ళి చేసుకున్నాడు. తరువాత ఇద్దరూ కొన్ని రోజులు హనీమూన్ కి కూడా తిరిగి వచ్చారు.


రాజారావుకి పెళ్ళి అవడం వలన, ఇంక లా కాలేజీ చదువు చివరి దశలో ఉండడం వలన, రాఘవరావు కొద్దిరోజుల కోసం విడిగా రూము తీసుకుని ఉండడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో రాజకీయ నాయకుడు రాజారావు మీద కక్ష తీసుకోడం కోసం యుధ్ధం ప్రకటించాడు. ఆ అమ్మాయికి పెళ్ళైపోవడం వలన ఇప్పుడు అతని కోపం రాజారావుమీద కేంద్రీకృతమైంది. అదను చూసుకుని రాజకీయ నాయకుడు రాజారావుని ఒంటరిని చేసి చావుదెబ్బతీశాడు. గుర్తు తెలియని వాహనంతో గుద్దించేశాడు. రాజారావు కొన ఊపిరిలో ఉండగా విషయం తెలిసి రాఘవరావు పరిగెత్తుకొచ్చాడు స్నేహితుడి కోసం. వెంటనే అంబులెన్సులో హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.


రాజారావు చనిపోయేముందు రాఘవరావు స్నేహితుడికి మాట ఇచ్చాడు అతని భార్యకి అండగా ఉంటానని. ఎవరో రాజారావు తల్లిదండ్రులకి కబురు పెట్టారు. వాళ్ళు వచ్చి కొడుకు శవాన్ని తమ గ్రామం తీసుకెళ్ళిపోయారు. జరిగింది హత్యే అయినా వాళ్ళకి రాజకీయ నాయకులతో విరోధం పెట్టుకునే ఇష్టం లేదు, శక్తి సామర్థ్యాలు లేవు. పోలీసులు జరిగింది ఆక్సిడెంటుగా రాసేసుకున్నారు. ఎవరికీ రాజారావు భార్య విషయం తెలీదు. ఆమె అంతకు ముందు రెండు రోజుల ముందే తాను పెరిగిన అనాథ ఆశ్రమానికి వెళ్ళింది, అక్కడ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలకి హాజరు కావడానికి. రాజారావు చదువు, పని వత్తిడి కారణంగా ఆమెతో వెళ్ళలేకపోయాడు. ఆమె అతని పక్కన లేనప్పుడు ఈ ఘోరం జరిగిపోయింది. ఆమెకి తెలీదు, తను మళ్ళీ అనాథగా మిగిలిపోయిందని.


రాజారావు తల్లిదండ్రులకి కొడుకు పెళ్ళి చేసుకున్నాడని తెలీదు. రాఘవరావు వాళ్ళకి రాజారావు పెళ్ళి విషయం చెప్పాడు. ఏగుళ్ళో జరిగిందీ చెప్పాడు. వాళ్ళు అతని మీద అంతెత్తున లేచారు. చనిపోయిన తమ కొడుకు మీద అభాండం వేస్తున్నాడని అతన్ని దుయ్యబట్టారు.


ఆరోజు హాస్పిటల్ లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని తన రూముకి తిరిగి వచ్చాడు రాఘవరావు. ఆరోజు ఉదయం నుండీ జరిగినవన్నీ అతని మస్తిష్కంలో మెదులుతున్నాయి. రాజారావు భార్య ఇంకా రాలేదు. వచ్చాక ఆమెతో ఏం చెప్పాలి. అతనికి వండుకోడానికీ, ఏమీ తినడానికీ మనస్కరించలేదు. నిన్నటిదాకా బ్రతికున్న స్నేహితుడు ఈరోజు లేడంటే నమ్మబుధ్ది కావడం లేదు. స్తబ్దుగా కూర్చున్నాడు.


అప్పుడు తలుపు చప్పుడయింది. ఓపిక లేకపోయినా లేచి వెళ్ళి తలుపు తీశాడు.

ఎదురుగా శ్యామల, రాజారావు భార్య. ఆమెకి విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. రాఘవరావు ఉంటున్న గదికి ఎలా రాగలిగిందో కూడా ఆమెకి తెలీదు. కళ్ళు ధారగా కారుతున్నాయి. ఆమెకి భర్త ఆఖరి చూపు కూడా దక్కలేదు. హోరున కురుస్తున్న వర్షంలో రావడం వలన ఆమె బట్టలు తడిసిపోయి, శరీరం వణికిపోతోంది. రాఘవరావుకి శ్యామలని ఎలా ఓదార్చాలో తెలీలేదు.


‘ఊరుకో శ్యామలా... ఊరుకో’ అతనికి ఆమెని ఎలా సంబోధించాలో, ఏమని ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. ఆమె పరిస్థితి చూసి, ముందు లోపలనించి తువ్వాలు, పొడి దుప్పుటి తెచ్చి ఇచ్చాడు. అతని భార్య పుట్టింట్లో ఉండడం వలన ఆడవాళ్ళు వేసుకునే బట్టలు అతని దగ్గర ఏమీ లేవు. ఆమె తల తుడుచుకుని అతను తెచ్చిన దుప్పటీని కప్పుకుంది.


‘నేను ఆయన్ని చూడాలి. కనీసం ఆఖరి చూపైనా నాకు కావాలి.’ ఆమె స్థిమితపడిన తరవాత అతనిని అభ్యర్థనగా అడిగింది. ఆమె అడుగుతుందని తెలుసు. కానీ, ఏం చెయ్యాలో అతనికి తెలీదు.


కొద్దిసేపు మౌనం తరవాత అన్నాడతను. ‘రేపు మనం రాజారావు స్వగ్రామం వెళదాం. వాళ్ళు నిన్ను ఎలాగ చూస్తారో, ఎలాగ రిసీవ్ చేసుకుంటారో నేను చెప్పలేను. ఆ విషయంలో నాకు నమ్మకం లేదు. కానీ, రాజారావుకిచ్చిన మాట ప్రకారం, నిన్ను అక్కడికి తీసుకెళ్ళి, నీకు న్యాయం జరిపించడానికి ప్రయత్నిస్తాను. తమ కొడుకు చేసుకున్న పెళ్ళిని ఆమోదించవలసిన ధర్మం వాళ్ళకి ఉంది’ అన్నాడతను.


ఆమె కృతజ్ఞతగా చూసి అతనికి నమస్కారం పెట్టింది. ఆమె ముఖంలో జీవం లేదు. కానీ, అతనిమీద గౌరవం ఉంది.


తరవాత నెమ్మదిగా అంది. ‘రాజారావు అంశ నాలో పెరుగుతోంది’. ఆవిషయం అతనికి ఒక షాక్ అనిపించింది. ఇప్పుడున్న సమస్యకి ఇదొకటి తోడులా ఉంది. ‘ఈవిషయం రాజారావుకి తెలుసా?’ అని అడిగాడు.


తరవాత తన ప్రశ్న తనకే అసంబధ్ధమనిపించింది. రాజారావుకి తెలిసినా, తెలియకపోయినా, ఇప్పుడు జరగబోయే పరిణామాల మీద ఆ విషయం ప్రభావం ఏమీ ఉండదు.

ఆమె తల అడ్డంగా ఊపింది. ‘నాకూ నిన్ననే తెలిసింది’ అంది.


ఆమెకి ఆకలిగా ఉంటుందేమోనని, తనదగ్గర ఉన్న పండ్లు ఇచ్చాడు. ఆరోజు అతను వంట చేసుకోలేదు. ఆమె అయిష్టంగానే కొంచెం తీసుకుంది.


తన బెడ్ రూములో ఆమెని పడుకోమని చెప్పి, తను బయట హాల్లో చాప వేసుకుని పడుకున్నాడు.

మరునాడు ఉదయమే మార్కట్ తెరవగానే మొదటగా వెళ్ళి ఆమె కోసం కొత్త బట్టలు కొని తీసుకువచ్చాడు. తరువాత టాక్సీ మాట్లాడుకుని రాజారావు గ్రామం తీసుకువెళ్ళాడు. అక్కడ ఇంకా రాజారావు శవం ఉంది. ఆరోజు దహనం చెయ్యాలనుకున్నారు. రాజారావు తండ్రికి అతను పెద్దకొడుకు. రెండో కొడుకు అక్కడే తండ్రి దగ్గరే ఉండి వ్యవసాయంలో సహాయం చేస్తున్నాడు. ఏతండ్రికైనా తాను బతికుండగానే కొడుకు అంత్యక్రియలు చెయ్యవలసి రావడం ఎంత పెద్ద దురదృష్టమో ఆయనని చూస్తే తెలుస్తుంది. వాళ్ళు రాఘవరావుని, శ్యామలని మొదట శవం దగ్గరికి రానివ్వలేదు. కానీ, ఎవరో చెపితే, శవం దగ్గరికి రానిచ్చినంత మాత్రం చేత ఏమైపోతుందిలే అని ఊరుకున్నారు.


శ్యామలని ఊరుకోబెట్టడం రాఘవరావుచేత కాలేదు. అక్కడ కొద్ది గంటలు గడిపిన తరువాత, శవాన్ని తీసుకెళ్ళిపోయాక రాఘవరావుని, శ్యామలని ఇంక అక్కడ ఉండనివ్వలేదు, బలవంతంగా వెళ్ళగొట్టారు. శ్యామలని వాళ్ళ ఇంటి పెద్ద కోడలుగా అక్కడ ఉంచలేకపోయాడు. కొడుకు చనిపోయాక వాళ్ళు ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించలేదు. అంతే కాకుండా, ఏ గుడిలో అయితే రాజారావు శ్యామలని వివాహం చేసుకున్నాడో, ఆ గుడి ధర్మ కర్తచేత తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు రాఘవరావే శ్యామలని వివాహం చేసుకున్నాడని, రాజారావు కేవలం వాళ్ళ వివాహానికి సాక్షిగా వెళ్ళాడనీ. డబ్బు, పరపతి కలిగిన రాజారావు తండ్రికి ఇది పెద్ద కష్టం కాని విషయం.


రాఘవరావు నిశ్చేష్టుడై శ్యామలని వెంటబెట్టుకుని తిరిగి వచ్చాడు. అతను శ్యామలకి అండగా ఉంటానని రాజారావుకి మాట ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, శ్యామల తన కాళ్ళమీద తను నిలదొక్కుకునే వరకు సహాయకారిగా ఉందామని. అయితే ఇప్పుడు అతనికి మొదటికే మోసం వచ్చింది. రాజారావు, శ్యామల పెళ్ళి చేసుకున్న గుడిలో వాళ్ళే ఇప్పుడు ప్లేటు ఫిరాయించి రాఘవరావే శ్యామలని పెళ్ళి చేసుకున్నాడని అనడంతో ఏం చేయాలో రాఘవరావుకి పాలుపోలేదు. దానికి తోడు శ్యామల ఇప్పుడు గర్భవతి. శ్యామల ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. తనకి అన్యాయం జరగడమే కాకుండా, తనకి అండగా నిలబడిన పాపానికి రాఘవరావు సంసారానికే ఎసరు తగిలింది. ఆమె రాఘవరావు ముఖంలోకి చూడలేక పోతోంది. తనని తాను దోషిగా భావించుకుని కుమిలి పోతోంది.


రాఘవరావు ఒక నిశ్చయానికి వచ్చాడు. ఇక్కడ జరిగిన విషయాలేవీ అతని గ్రామంలో అతని భార్య లక్ష్మికి గానీ, మామయ్యకి గానీ తెలియవు. అతను శ్యామలతో అన్నాడు. ‘శ్యామలా, నేనొక నిశ్చయానికి వచ్చాను. నీ భర్త రాజారావుకి మాట ఇచ్చినట్లుగా నేను నీకు అండగా ఉంటాను. నీకు పురుడు పోయిస్తాను. నీ కొడుకు పెద్దవాడయ్యేవరకు మీ ఇద్దరి ఆలనా పాలనా నేను చూస్తాను. నా కుటుంబానికి దూరంగా మీకు నివాసం ఏర్పాటు చేస్తాను. రెగ్యులర్ గా వచ్చి మీ ఇద్దరి బాగోగులు చూసుకుంటూ ఉంటాను. నీ కొడుకు ప్రయోజకుడైన తర్వాత నీ బాధ్యతల నుండి విరామం తీసుకుంటాను...ఇంతకంటే ఏమి చెయ్యాలో నాకు కూడా తోచడం లేదు.’ ఆమె అతని సహృదయతకి, అతని ఔదార్యానికి తట్టుకోలేకపోయింది. చేతులెత్తి నమస్కరించడం మినహా మరేమీ చెయ్యలేకపోయింది.


కొంచెం సేపటికి తేరుకుని ఆమె అడిగింది ‘లోకానికి మన మధ్య ఉన్న బంధాన్ని ఏమని చెప్తారు?’

అతను కొంచెం తటపటాయించి అన్నాడు. ‘మీదగ్గర ఉన్నప్పుడు నీ భర్తగానే పరిచయం చేసుకుంటాను. అప్పుడు లోకం ఏమీ అనుకోదు.’


ఆ విధంగా రాఘవరావు శ్యామలకి భర్తగా, ఆమె కొడుక్కి తండ్రిగా వాళ్ళు ఉంటున్న ఊళ్ళో పరిచయం అయ్యాడు. కొన్నాళ్ళకి రాఘవరావు మామయ్య కూడా కాలం చేశాడు.


శ్యామల గతం చెప్పటం ముగించింది. పూర్తయ్యేసరికి గౌతమ్, లలిత ఇద్దరూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళెవరూ ఇంకా గమనించలేదు. కానీ, రాఘవరావు అప్పుటికే స్పృహలో కొచ్చాడు.


ముందుగా గౌతమ్ తేరుకున్నాడు. రాఘవరావు దగ్గరికి వచ్చాడు. అతన్ని కౌగలించుకున్నాడు. ‘నాన్నగారూ, నేను ప్రయోజకుడినైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానన్నారుగా, నాకు చదువు వద్దు. మీరే కావాలి. మీరు ఎప్పటికీ మా దగ్గరే ఉండిపోవాలి.’ అన్నాడు ఏడుస్తూ.


లలితకి అసలు ఏమౌతోందో అర్థం కాలేదు. ఏడవడం మానలేదు. శ్యామల లలితని దగ్గరికి తీసుకుంది. ఆమె వెచ్చటి కౌగిలిలో లలిత ఊరట పొందింది, వాళ్ళమ్మ దగ్గర ఉన్నట్లే అనిపించింది. ఆ పిల్లకి అమ్మ అవసరం ఎంత ఉందో, శ్యామలకి, రాఘవరావుకి అర్థం అయిందన్నట్లు ఒకరినొకరు చూసుకున్నారు. రాఘవరావు లేచి కూర్చున్నాడు. గౌతమ్ ని గాఢంగా కౌగలించుకున్నాడు.


లలితకేసి చూశాడు. ‘అమ్మా లలితా, నీకు అన్నయ్య నచ్చాడా?’ లలిత ఏడుపు మాని ఔనన్నట్లు తల ఊపింది. గౌతమ్ కేసి చూశాడు. ‘నీకు చెల్లాయి నచ్చిందా?’ గౌతమ్ కూడా అవునన్నట్లు తల ఊపాడు.


‘మరి మనందరం కలిసి ఉండచ్చా?’ అని గౌతమ్ అడిగాడు. ‘లలితకి కూడా ఇష్టమైతే, తప్పకుండా.’ అన్నాడు రాఘవరావు. లలిత ఆనందంగా తల ఊపింది. ఆమెకి శ్యామల చాలా బాగా నచ్చేసింది. తండ్రిని అడిగింది ‘నేను ఆవిడని ఏమని పిలవాలి, ఆంటీ అని పిలవాలా?’ రాఘవరావు, శ్యామల ఒకరినొకరు చూసుకున్నారు. ‘నీకు ఎలా పిలవాలని ఉంటే అలాగ పిలవచ్చు’ అన్నాడు రాఘవరావు.

‘నాకు అమ్మలాగే ఉంది, ఎంతో ప్రేమగా. అమ్మ అనే పిలవాలనుంది.’ లలిత మాటలకి ఒక్కసారి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.


రాఘవరావు ‘ఆ చిన్నపిల్ల మనసు ఇంత త్వరగా గెలుచుకోగలవని అనుకోలేదు శ్యామలా, నీ మాతృ హృదయం లలితకి బాగా చేరువయింది’ అన్నాడు ఆమెని ప్రశంసిస్తూ. ‘మీకంటేనా? గౌతమ్ కి ‘మీరు తండ్రి ప్రేమ చూపించిన దానికంటేనా?’ అంది ఆమె అతనికేసి అనురాగంగా చూస్తూ. రాఘవరావు అన్నాడు ‘ఇకనుండీ మనందరం కలిసే ఉంటాం, ఒకే కుటుంబంగా.. గౌతమ్, చెల్లాయిని నీగదిలోకి తీసుకెళ్ళి నీ ఆట వస్తువులు, పుస్తకాలు చూపించు’ అన్నాడు. పిల్లలిద్దరూ అలా వెళ్ళగానే, శ్యామల అతని గుండెల మీద వాలిపోయింది. అతను ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ‘శ్యామలా, నువ్వు నాకోసం ఇంతకాలం వేచి ఉంటావని నేనెప్పుడూ భావించలేదు.’ అన్నాడు.


‘లక్ష్మి అక్క బతికుంటే నేను ఎప్పటికీ మీకు దూరంగానైనా ఆరాధిస్తూ ఉండిపోయేదాన్ని. కానీ ఆమె స్థానాన్ని ఆశించలేదు. నా జీవితానికో అర్థం కలిగించారు. నేను తనకి ఎప్పుడూ ద్రోహం చేసేదాన్ని కాదు.’ అన్నదామె. ఆమె మనసు తనకి తెలుసన్నట్లు తల ఊపాడతను. ‘పైనున్న లక్ష్మి కూడా సంతోషిస్తుంది శ్యామలా, తన బిడ్డకి తనలాంటి అమ్మ దొరికిందని.’ అన్నాడు.


‘మంచి ముహూర్తం చూసి మనం పెళ్ళిచేసుకుందాం.’ అన్నాడు రాఘవరావు. వాళ్ళిద్దరూ అలా దగ్గరగా ఉన్నప్పుడు, పిల్లలు లోపలి గదిలోంచి చూస్తున్నారు. గౌతమ్ కి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అతను అమ్మ ముఖం అంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు. లలితకి కూడా తండ్రి ఆనందంగా ఉండడం సంతోషాన్ని కలిగించింది.


రాఘవరావు గౌతమ్ ని పిలిచాడు.

‘గౌతమ్, మీ తాతగారి ఆస్తిలో నీకు వాటా వస్తుంది. డి.ఎన్.ఎ పరీక్ష చేయించి, కోర్టు ద్వారా మనం ప్రోసీడ్ అవచ్చు. ఏమంటావు?’ అన్నాడు.


‘నాన్నగారూ, మా అమ్మని గెంటేసిన ఇంట్లోకి నేను వెళ్ళను. నాకు మీరే కావాలి’ అన్నాడు కంగారుగా రాఘవరావు చుట్టూ చేతులు వేస్తూ.


రాఘవరావు కళ్ళు చెమర్చాయి. ‘రక్త సంబంధం కంటే, పెంచిన అనుబంధం ఎంతగా పెనవేసుకుంటుందో’ అనుకున్నాడు. శ్యామల కూడా గౌతమ్ నే సపోర్టు చేసింది. ‘పిల్లవాడి మనసు డబ్బువైపు మరలించకండి. వాడికి మనం ఇవ్వగలిగిందే ఇస్తాము.’ అన్నది.


గౌతమ్ కి ఇప్పుడు నాన్నమీదున్న సందేహాలన్నీ తొలగిపోయాయి. లలితకి, ఒక టీనేజీ అమ్మాయి తన మనసులో భావాలు షేర్ చేసుకోడానికి కొత్తగా అమ్మ దొరికింది. పిల్లలిద్దరికీ అమ్మా, నాన్న ఇద్దరూ ఉన్నారు. శ్యామలకి ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. తనకి అండ ఉన్న వాడు శాశ్వతంగా తనవాడయ్యాడు.


ఆరోజు ఆ ఇంట్లో చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది.

========================================================================

సమాప్తం

========================================================================

సత్య ఎస్. కొలచిన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/sathya

సత్య ఎస్. కొలచిన, ఎమ్.టెక్.

వృత్తి – క్లౌడ్ సెక్యూరిటీ ఇంజినీర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్.

(Cloud Security Engineer, Amazon Web Services, Amazon)

నివాసం – షికాగో నగరం, ఉత్తర అమెరికా

అభిరుచులు – కర్నాటక శాస్త్రీయ సంగీతం (సాధన మరియు బోధన), చిత్రలేఖనం, రచనలు చేయడం, జ్యోతిష్యం, హస్తసాముద్రికం.

సంగీతం గురువు – పద్మభూషణ్, డాక్టర్, శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు.

జ్యోతిషం గురుతుల్యులు – శ్రీ కె.ఎన్. రావు గారు.

చిత్రలేఖనం గురువు – శ్రీ వలివేటి శివరామ శాస్త్రి గారు

రచనలు గురువు – మా తండ్రి గారు శ్రీ కొలచిన వెంకట లక్ష్మణమూర్తి గారు


58 views0 comments

Comentarios


bottom of page