top of page

నన్ను క్షమించవూ..


'Nannu Kshaminchavuu' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

ఐదేళ్ల రమ్య "నాన్నా" ! అంటూ పరిగెత్తుకు వచ్చి తండ్రికి ముద్దివ్వగా, ప్రేమతో దానిని ఎత్తుకుని "రా బేబీ! టిఫిన్ చేద్దాం" అంటూ డైనింగ్ టేబిల్ వద్దకు తీసుకెళ్ళాడు రామారావు. సుజాత వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టి తనూ తిన్నది. ఆ తర్వాత "బై! అమ్మా!" అంటూ అమ్మకు ముద్దిచ్చి తండ్రితో స్కూటరు ఎక్కి వెళ్ళింది రమ్య. ఆ తర్వాత రెండు సం...లకు సుజాత మరో పాపను కన్నది. ఆ పాపకు 'సుమ' అని పేరు పెట్టుకున్నారు. సుమ పుట్టిన మొదలు రామారావు ఏనాడూ ఆ పాపను ఎత్తుకుని ముద్దుచేయలేదు. భర్త ప్రవర్తనకు చాలా బాధపడి కారణం అడిగితే ' నల్లగా అందవికారంగా ఉన్నది, అందుకే తను నాకిష్టం లేదు' అన్న అతని కుసంస్కారానికి అసహ్యం వేసింది. అయినా ఎన్నోసార్లు అతనికి నచ్చచెప్పి అతని మనసు మార్చ ప్రయత్నించి విఫలురాలైంది సుజాత.

రమ్యను మాత్రమే ముద్దు చేసి ఆడిస్తూ ఉంటూ, దగ్గరకు వచ్చిన సుమను కనీసం కన్నెత్తి కూడా చూడకుండా విదిలించేవాడు. అమాయకంగా బిత్తర చూపులతో తల్లిని కరుచుకుని ఏడ్చేది సుమ. రమ్యను కూడా సుమతో కలవనిచ్చేవాడు కాదు. ఎదుగుతున్నకొద్దీ సుమ మనసు మీద ఈ ప్రభావం పడి ఆ పసిమనసు బాధపడుతుందని సుజాత కలవరపడుతూ ఉండేది. పిల్లలిద్దరినీ ఎంతో ప్రేమగా చూస్తూ రమ్య , సుమల ఆటపాటలను చూస్తూ సంతోషించేది.

విధిరాత అన్నట్లుగా సుమకు పదేళ్ళ వయసులో పోలియో సోకింది. డాక్టర్లకు చూపించి వైద్యం చేయించినా ఫలించక సుమ అవిటిదయింది. సుజాత కన్నీరుమున్నీరుగా విలపించి 'దేవుడే తనకు న్యాయం చేస్తాడు' అని తన మనసుకు ధైర్యం చెప్పుకుని సుమను ఇంకా స్త ప్రేమగా చూస్తోంది. ఇంత జరిగినా రామారావు ప్రవర్తనలో మార్పు రాక పోగా సుమ పట్ల ఈసడింపులు ఎక్కువైనాయి.

"అమ్మా! నాన్న ఎందుకు నన్ను పిలవరు? అక్కలాగా నన్ను ఎందుకు ముద్దుచేయరు?" అన్న సుమ ప్రశ్నలకు మనసులో వ్యధ చెంది “అదేంలేదమ్మా! నీవంటే నాన్నకు ఇష్టం. నీవు బాగా చదువుకుని మంచి ఆఫీసరైతే చాలా సంతోషిస్తారు” అని ప్రేమగా దగ్గరకు తీసుకుని సముదాయించేది సుజాత. రమ్య, సుమలు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. డిగ్రీ చదువుతున్న రమ్య తన క్లాస్ మేట్ విజయ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుని అతనితో వేరే ఊరు వెళ్ళింది. అల్లారుముద్దుగా పెంచుకున్న రమ్య చేసిన పనికి రామారావుకు గుండెపోటు వచ్చి వైద్యచికిత్సతో కాస్త కోలుకుంటున్నాడు. రమ్య దూరమైందని సుజాత కూడా చాలా బాధ పడింది.

సుమ డిగ్రీ చదవగానే ఐ.ఎ.ఎస్ పోటీ పరీక్షలకు సిధ్ధమయి బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందింది. ఆమెను శిక్షణకు కూడా పిలిచారు. ఆ శుభవార్తను సంతోషంగా తల్లి తండ్రులకు చెప్పగా నిర్లిప్తంగా ఊరుకున్నాడు రామారావు. సుజాత సుమను దగ్గరకు తీసుకుని ముద్దాడి " నీవు కలెక్టర్ అయి ఎన్నో మంచిపనులను చేసి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకురావాలి " అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. తండ్రి ప్రవర్తనకు సుమ బాధపడింది. తల్లి తండ్రులకు తగు జాగ్రత్తలను చెప్పి సుమ శిక్షణకై వేరే ఊరు వెళ్లింది.

తర్వాత తమ ఊరికే కలెక్టర్ గా పోస్టింగ్ ఉత్తర్వులను తీసుకుని ఇంటికి వచ్చి తల్లి తండ్రులకు నమస్కరించింది సుమ. సుజాత ఆనందానికి అవధులు లేవు. సుమను దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకుంది. రామారావు మిన్నకున్నాడు. సుమ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నది. ఇలా కాలం గడుస్తూండగా ఒక రోజున రామారావుకు మరలా గుండెపోటు వస్తే సుమే దగ్గరుండి మంచి వైద్యం చేయించి అహర్నిశలూ ఆయనకు సేవచేసి తండ్రిని బ్రతికించుకుని క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చింది.


ఇన్నేళ్ళూ తన ప్రవర్తనకు సిగ్గు పడి సుమను దగ్గరకు పిలిచి గుండెలకు ప్రేమగా హత్తుకొని "ఈ కసాయి తండ్రిని క్షమిస్తావు కదా తల్లీ! " అన్న తండ్రి మాటలకు "మనలో మనకు క్షమాపణ లేంటి నాన్నా!” అని మరింతగా ఒదిగిపోయింది సుమ. ఆ ఇద్దరినీ చూసి సంతోషంతో పొంగిపోయి మనసులోనే భగవంతుడికి అంజలి ఘటించింది సుజాత.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏43 views0 comments

Comments


bottom of page